మమ్మల్ని డమ్మీ ఎమ్మెల్యేలను చేశారంటూ తెగ ఫీలైపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!!

2014 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోల్చితే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ తో విజయనగరం జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తొమ్మిదికి తొమ్మిది స్థానాలను వైసీపీ గెలుచుకుంది, ఇంకేముంది పార్టీ కూడా అధికారంలోకి రావడంతో చక్రం తిప్పాలని అనుకున్నారు ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే టిడిపి నేతల హవా నడిచిందో అదే విధంగా చేద్దామని వీళ్లు కూడా భావించారు కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయట.  2014 ఎన్నికల్లో జిల్లాలో టిడిపి ఆరు, వైసిపి మూడు చోట్ల గెలిచింది. సుజయ కృష్ణ రంగారావు టిడిపిలో చేరి మంత్రి అయ్యారు, అప్పట్లో టిడిపి ఎమ్మెల్యేలు ఏది చెబితే అది జరిగేది అని అంటారు. పింఛన్ లు, ఇళ్ల కేటాయింపులు, వెనుకబడిన తరగతులకు లోన్లు, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో టిడిపి శాసన సభ్యుల హవా నడిచేదట. వైసిపి ఎమ్మెల్యేలున్న చోట కూడా టిడిపి నేతలు చెప్పినదానికే అధికారులు ఊ కొట్టేవారట. ఇదంతా చూసిన వైసీపీ నేతలు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాగే చేయాలని కలలు కన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర పరిమితం చేయడంతో వైసీపీ ఎమ్మెల్యేల గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని టాక్. అవినీతికి ఆస్కారం లేకుండా వాలంటీర్ల సాయంతో నిజమైన లబ్దిదారుల ఎంపిక జరుగుతుండటంతో తమకు పని లేకుండా పోయిందని అనుచరుల దగ్గర చెప్పుకుని ఎమ్మెల్యేలు వాపోతున్నారట. అంతా అధికారుల కనుసన్నల్లోనే సంక్షేమ పథకాల కేటాయింపులు జరగడం, డిజిటల్ పద్ధతిలోనే లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తుండటంతో తామంతా డమ్మీలం అయినట్లు శాసనసభ్యులు మధనపడుతున్నారట.  సామాన్య ప్రజలు, పార్టీ కార్యకర్తలు వచ్చి తమకు పింఛన్ లు ఇప్పించాలని ఇంకో పథకంలో లబ్ధి చేకూర్చాలని కోరినా చేయలేకపోతున్నారట. పనేదైనా ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా గ్రామ సచివాలయం, జిల్లా కలెక్టర్ స్థాయిలోనే పరిష్కారమవుతుండడంతో జనాలు కార్యాలయాల చుట్టూనే తిరుగుతున్నారట. గతంలో అధికారుల బదిలీలు. పోస్టింగ్ ల విషయంలో ఎమ్మెల్యే సిపార్సు లేఖలకు డిమాండ్ ఉండేది. ఎమ్మెల్యేలు కూడా తమకు నచ్చిన అధికారిని నియోజకవర్గానికి తెచ్చుకునేవారు. ప్రస్తుతం అమరావతి పరిధిలోనే ట్రాన్సఫర్స్ జరుగుతున్నాయని, మరికొన్ని మంత్రుల కనుసన్నల్లో జరిగిపోతున్నాయని అంటున్నారు. దీంతో సొంత పనులు సైతం ఎవరినో ఒకరిని అడుక్కునే పరిస్థితి నెలకొందని కుమిలిపోతున్నారట అధికార పార్టీ ఎమ్మెల్యేలు. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగగలమని తమలో తామే ప్రశ్నించుకుంటున్నారట శాసన సభ్యులు.

ప్రేమించా...పెళ్లి వరకు వెళ్లా...కానీ... రతన్ టాటా ప్రేమకథ...

టాటా సన్స్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ప్రేమ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా రతన్ టాటా చెప్పిన తన రియల్ లవ్ స్టోరీ కావడంతో నెటిజన్లు విపరీతంగా ఆసక్తి చూపుతున్నారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబే అనే ఫేస్ బుక్ పేజీలో తన ప్రేమ కథను పంచుకున్న రతన్ టాటా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికా లాస్ ఏంజెల్స్ లోని కార్నెల్ వర్సిటీలో చదువుతున్న రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమాయణం సాగించినట్లు తెలిపారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వ‌ర‌కు త‌మ రిలేష‌న్ వెళ్లింద‌న్నారు. అయితే, ఆ స‌మ‌యంలో త‌న‌ బామ్మ ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో ఇండియాకు తిరిగి వ‌చ్చాన‌ని, అదే స‌మ‌యంలో ఇండో చైనా యుద్ధం జ‌ర‌గ‌డం వ‌ల్ల ప‌రిస్థితులు తారుమారైన‌ట్లు చెప్పారు. త‌న‌తోపాటు ఇండియాకు తన ప్రేయసి వస్తుందని భావించానని, కానీ యుద్ధం నేప‌థ్యంలో ఆ అమ్మాయి పేరెంట్స్ ఆమెను ఇండియాకు పంపేందుకు నిరాక‌రించిన‌ట్లు ర‌త‌న్ చెప్పారు. ఆ కార‌ణంగానే రిలేష‌న్ తెగిపోయింద‌న్నారు.   రతన్ టాటా తన లవ్ స్టోరీతోపాటు తన బాల్యం, అలాగే తన కుటుంబ పరిస్థితుల గురించి నెటిజన్లతో పంచుకున్నారు. దాంతో, క్షణాల్లో అవి వైరల్ గా మారాయి. పలువురు నెటిజన్లు అయితే, దేశం మీకు గురించి మరింత తెలుసుకోవాలనుకుంటోంది... అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గోదావరి జిల్లాల్లో డేంజర్ వైరస్... భయంతో వణికిపోతున్న జనం...

ప్రపంచాన్ని కరోనా వణికిస్తే... ఉభయగోదావరి జిల్లాలను మాత్రం వీవీఎన్డీ వైరస్ భయపెడతోంది. కరోనా దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతుంటే... వీవీఎన్డీ వైరస్ దెబ్బకు వందలకొద్ది బాయిలర్ కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే, బాయిలర్ కోళ్లకు సోకుతున్న వీవీఎన్డీ వైరస్ కారణంగా చికెట్ అమ్మకాలను నిలిపివేశారు. వీవీఎన్డీ వైరస్ సోకిన కోళ్లను తింటే జనం రోగాల బారినపడే ప్రమాదం ఉండటంతో పశ్చిమగోదావరి జిల్లాలో చికెన్ హాలీడే ప్రకటించారు. ముఖ్యంగా తణుకులో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో వారంరోజులపాటు చికెన్ అమ్మకాలను నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో బాయిలర్ కోళ్లు, ఫౌల్ట్రీ కోళ్లు వీవీఎన్డీ వైరస్ బారినపడి పిట్టల్లా రాలిపోతుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా చనిపోయిన కోళ్లను ఊళ్లకు దూరంగా తీసుకెళ్లి మట్టిలో పూడ్చిపెడుతున్నారు. అయితే, ఒక్క తణుకులోనే కాకుండా పశ్చిమగోదావరి జిల్లాలో పలుచోట్లకు ఈ వైరస్ వ్యాపించిందని అంటున్నారు. దాంతో, వీవీఎన్డీ వైరస్ సోకకుండా కోళ్లకు ముందే టీకాలు వేయిస్తున్నారు రైతులు. అయితే, వీవీఎన్డీ వైరస్ వార్తలతో ఉభయగోదావరి జిల్లాల్లో చికెన్ అమ్మకాలు పడిపోయాయి. చికెన్ తినడానికి జనం భయపడిపోతున్నారు. అయితే, కోడి మాంసాన్ని  100 డిగ్రీల వేడిలో వండి తినేవారికి ఎలాంటి అనారోగ్యం కలగదని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే ఒకపక్క కరోనా వైరస్ కల్లోలం కలవరం పుట్టిస్తుండటంతో... చికెన్ తినడానికి జనం భయపడుతున్నారు.

2వేల కోట్ల అక్రమాలు... ఐటీశాఖ సంచలన ప్రకటన...

తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాలపై ఐటీశాఖ ప్రకటన చేసింది. ఏపీ, తెలంగాణతోపాటు ఢిల్లీ, పుణె సహా 40 చోట్ల సోదాలు నిర్వహించినట్లు తెలిపిన ఆదాయపు పన్నుశాఖ... వేల కోట్ల అక్రమాలను గుర్తించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖలో దాడులు జరిపినట్లు తెలియజేసిన ఐటీ అధికారులు.... తెలుగు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణలో సుమారు 2వేల కోట్ల రూపాయల అవకతవకలను గుర్తించినట్లు ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో నకిలీ బిల్లులను గుర్తించామని, అలాగే, లెక్కచూపని 85లక్షల నగదును, 71లక్షల విలువైన ఆభరణాలను తమ సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఓ ప్రముఖుడి మాజీ వ్యక్తిగత కార్యదర్శి నివాసంలోనూ తనిఖీలు జరిపినట్లు తెలిపింది. ఇక, బోగస్ సబ్ కాంట్రాక్టర్లు నకిలీ బిల్లుల ద్వారా పెద్దఎత్తున నగదు చలామణి చేసినట్లు గుర్తించినట్లు ఐటీశాఖ ప్రకటించింది. అదేవిధంగా 25 బ్యాంక్ లాకర్లు సీజ్ చేసినట్లు తెలిపింది.  ఫిబ్రవరి ఆరు నుంచి దాదాపు వారం రోజులపాటు సాగిన ఐటీ సోదాల్లో విస్మయకర వాస్తవాలు బయటపడ్డాయి. బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, తప్పుడు బిల్లులతో అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 2వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు అంచనా వేసింది. దాడుల్లో భాగంగా పలు కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, ఈ-మెయిల్స్‌, వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా జరిపిన లావాదేవీలతోపాటు విదేశీ లావాదేవీల వివరాలను సైతం గుర్తించినట్లు పేర్కొంది ఏపీ‌, తెలంగాణలో మూడు ఇన్‌ఫ్రా కంపెనీల కార్యాలయాలపై దాడులు జరిగాయి. అయితే, ఒక ప్రముఖ వ్యక్తి మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఇంటిపై జరిపిన దాడులతో ఈ భారీ రాకెట్ బయటపడినట్లు పేర్కొంది. ఉనికిలో లేని కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు పత్రాలు సృష్టించినట్లు వెల్లడించింది. పన్ను లెక్కలకు దొరకకుండా డొల్ల కంపెనీల ద్వారా 2కోట్ల లోపు చిన్న మొత్తాల రూపంలో నిధులను దారి మళ్లించినట్లు గుర్తించింది. ప్రధాన కార్పొరేట్ సంస్థ ఐపీ అడ్రస్ నుంచి సబ్ కాంట్రాక్టర్లు, ప్రధాన కాంట్రాక్టర్లు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు గుర్తించామని... గ్రూపు కంపెనీలకు కోట్ల రూపాయల అనుమానిత విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు వెల్లడైందని పేర్కొంది.

బ్రిటన్ ఆర్ధికమంత్రిగా భారతీయుడు...

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ఆర్ధికమంత్రిగా రిషి సునక్‌‌ నియమితులయ్యారు. ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ సజిద్ జావిద్ రాజీనామా చేయడంతో రిషిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. భారత సంతతికి చెందిన రిషి సునక్‌... బ్రిటన్‌లోని హాంప్‌షైర్‌లో జన్మించారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన రిషి... 2015 ఎన్నికల్లో యార్క్‌షైర్ రిచ్‌మాండ్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు, అనూహ్యంగా బ్రిటన్ ఆర్ధికమంత్రిగా పగ్గాలు చేపట్టి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 39ఏళ్ల రిషి సునక్... ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్శిటీ నుంచి ఫిలాసఫీ, రాజకీయాలు, ఎకనామిక్స్‌ పట్టాలు అందుకున్నారు. ఆ తర్వాత స్టాన్ ఫర్డ్‌ వర్శిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో చదువుకుంటున్నప్పుడే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కుమార్తె అక్షత పరిచయం కావడంతో... ఆ తర్వాత స్నేహం ప్రేమగా మారడంతో 2009లో వివాహం చేసుకున్నారు. రిషి, అక్షతకు ఇద్దరు ఆడపిల్లలు. అయితే, రిషి సునక్ రాజకీయాల్లోకి రాకముందు పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకుల్లో పనిచేశారు. గోల్డ్‌మ్యాన్ సచ్ కంపెనీలో విశ్లేషకుడిగా సేవలు అందించారు. ఇక, ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కాటమారన్‌లోనూ రిషి సునక్ డైరెక్టర్ గా ఉన్నారు.

కేపిటల్‌ గేమ్‌కు ఎండ్ కార్డు... జగన్ సర్కార్ ఆర్డినెన్స్ అస్త్రం..! ఢిల్లీ వేదికగా టీడీపీ కౌంటర్

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఆట క్లైమాక్స్‌‌కి చేరింది. అధికార, ప్రతిపక్షాల మధ్య రెండు నెలలుగా సాగుతున్న కేపిటల్‌ గేమ్‌కు ఎండ్ కార్డు పడబోతోంది. మూడు రాజధానులపై పంతం నెగ్గించుకునేందుకు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న జగన్ ప్రభుత్వానికి.... అసెంబ్లీ ప్రోరోగ్ వరంగా మారింది. దాంతో, మూడు రాజధానులపై పంతం నెగ్గించుకునేందుకు జగన్ సర్కారు వేగంగా అడుగులు వేస్తోంది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకున్నారన్న కోపంతో ఇప్పటికే మండలి రద్దుకు తీర్మానం చేసిన ప్రభుత్వం... సెలెక్ట్ కమిటీ ఫైల్‌ ముందుకు కదలకుండా పావులు కదిపింది. ఇక, వీలైనంత త్వరగా మండలి రద్దు జరిగిపోయేలా సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ టూర్‌లో మూడు రాజధానుల ఆవశ్యకతను ప్రధాని మోడీకి వివరించిన జగన్మోహన్‌రెడ్డి... మండలి రద్దు ప్రక్రియను పూర్తి చేయాల్సిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చించనున్నారు. అయితే, సర్కారు వ్యూహాన్ని పసిగట్టిన తెలుగుదేశం... కౌంటర్ గేమ్ మొదలుపెట్టింది. జగన్ సర్కారు స్టెప్స్‌‌కు దీటుగా టీడీపీ అడుగులు వేస్తోంది. రాజకీయ కక్షతోనే మండలి రద్దుకు జగన్ ప్రభుత్వం తీర్మానం చేసిందంటూ కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది. ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్సీలు.... రాష్ట్రపతితోపాటు కేంద్ర పెద్దలను కలిసేందుకు అపాయింట్ మెంట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. దాంతో, కేపిటల్‌పై అధికార, ప్రతిపక్షాల ఎండ్ గేమ్‌ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇదిలా ఉంటే, ఏపీ శాసనసభ, శాసనమండలిని గవర్నర్ ప్రోరోగ్ చేయడంతో మూడు రాజధానులపై ముందుకెళ్లేందుకు జగన్ ప్రభుత్వానికి వెసులుబాటు దొరికింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఆర్డినెన్స్‌‌కు అవకాశం లభించింది. అయితే, రాజధాని ఇష్యూ కోర్టుల్లో ఉండగా ఆర్డినెన్స్‌ ఇవ్వడం సాధ్యంకాదని టీడీపీ వాదిస్తోంది. కానీ, జగన్ ప్రభుత్వం ...ప్లాన్ Aతోపాటు ప్లాన్ Bని కూడా రెడీ చేసుకుందని చెబుతున్నారు. ప్లాన్ A ప్రకారం... రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించుకోవడం... అది, కుదరకపోతే ప్లాన్ Bని తెరపైకి తీసుకొచ్చి ఆర్డినెన్స్ తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, తాము చెప్పేవరకు కార్యాలయాలను తరలించొద్దంటూ హైకోర్టు ఖరాకండిగా తేల్చిచెప్పడంతో ఆర్డినెన్స్ ద్వారా రాజధాని తరలింపు సాధ్యమేనా? అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. మరోవైపు, సెలెక్ట్ కమిటీలపై జాప్యంచేస్తే చర్యలు తప్పవంటూ మండలి ఛైర్మన్ హెచ్చరికలు పంపడాన్ని సీరియస్‌‌గా తీసుకున్న ప్రభుత్వం... న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. మొత్తానికి, రాజధాని షిఫ్టింగ్‌కు అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్న జగన్ ప్రభుత్వం... అసెంబ్లీని ప్రోరోగ్‌ చేయడంతో తర్వాతి స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతున్నాయి.

ఆట మొదలైంది.. ఏపీ అసెంబ్లీ, శాసనమండలి ప్రోరోగ్‌!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్‌ అయ్యాయి. ఉభయ సభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రోరోగ్‌ చేసిన నేపథ్యంలో పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఆర్డినెన్స్‌ తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రోరోగ్ ఉత్తర్వులతో వైసీపీ ప్రభుత్వానికి వెసులుబాటు కల్పించినట్టయింది. బిల్లులు శాసనమండలి ముందున్న సమయంలో సభలను ప్రోరోగ్ చేయడం వల్ల.. ఆర్డినెన్స్ జారీకి ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు ఉండవని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. బిల్లులు సభ ముందు ఉండగానే ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భాలు రాజ్యసభలోనూ, వివిధ అసెంబ్లీల్లోనూ ఉందంటూ ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ట్రిపుల్ తలాఖ్ వంటి బిల్లులు రాజ్యసభ ముందున్నా, కేంద్రం  ఆర్డినెన్స్ తెచ్చిందని సచివాలయ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. పార్లమెంట్ ఆమోదించిన 2013 భూసేకరణ చట్టం విషయంలోనూ సవరణల కోసం రెండు సార్లు కేంద్రం ఆర్డినెన్సులు జారీ చేసిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి, ఉభయ సభలు ప్రోరోగ్ కావడంతో మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు అంశాలను అమల్లో పెట్టేందుకు ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేయనుంది.

గాంధీ గుట్టు ఒక్కొక్కటిగా వెలుగులోకి..

తెలంగాణలోని గాంధీ ఆసుపత్రి లోగుట్టు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా డాక్టర్ వసంత్ గాంధీలో జరిగే అక్రమాలను బయటపెట్టాడు. ఆ తర్వాత ఆయన సస్పెన్షన్ తో అనేక అవినీతి, అక్రమాల బయటకు పొక్కుతున్నాయి. ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటూ కొట్టిపారేస్తున్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రవణ్. గాంధీ ఆసుపత్రిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమేనని శ్రవణ్ అంటున్నారు.  కరోనాపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో సస్పెండైన గాంధీ ఆస్పత్రి వైద్యుడు వసంత కుమార్ వ్యవహారం ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతోంది. డాక్టర్ వసంత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. రెండేళ్లుగా గాంధీలో బయో మెట్రిక్ సిస్టం పని చేయడం లేదని మరో సంచలనాంశం వెలుగులోకి వచ్చింది. విధుల్లోకి వస్తున్న వైద్యులు ఎవరో కూడా తెలియని పరిస్థితి గాంధీలో నెలకొన్నదని వసంత్ చెప్తున్నదాన్ని బట్టి చాలా మంది వైద్యులు అసలు విధులకు రావడం లేదని కూడా సమాచారం అందుతుంది. అలాగే.. డ్యూటీలకు రాకపోయినా సరే.. శాలరీలు మాత్రం మొత్తంగా దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వసంత్ చుట్టూ అవినీతి ఆరోపణలు కమ్ము కుంటున్నాయని మెడికల్ సిబ్బందిని దుర్భాషలాడిన ఫోన్ రికార్డింగ్ లు కూడా వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా గాంధీ ఘటన నేపథ్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వసంత్ చేసిన ఆరోపణలపైనా కమిటీ విచారణ జరుపుతోంది. అయితే గాంధీ సూపరింటెండ్ శ్రవణ్ మాత్రం వసంత్ ని ఓ అక్రమాల కోరుగా తెలిపపడమే కాకుండా మెడికల్ షాపులో కూర్చొని తప్పుడు బర్త్ సర్టిఫికెట్ల జారీ చేస్తున్న దృశ్యాలను విడుదల చేశారు. కాగా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన డాక్టర్ వసంత్ గాంధీ హాస్పిటల్ పై, అందులో ఉన్న నిష్ణాతులైన వైద్యులపై అనేక ఆరోపణలు చేశారు. అలాగే.. వారు ఒక్కరోజు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోడమే కాక వారి వేతనాలు తగ్గించి తీవ్రంగా దండించే వారని కూడా డాక్టర్ వసంత్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో హౌస్ సర్జన్ సర్టిఫికెట్ల జారీలో భారీ కుంభకోణం జరిగిందని, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ పాత్ర ఇందులో ఉందని ఆయన ఆరోపించారు.

నల్లమలలో గుప్త నిధుల కోసం తవ్వకాలు.. టీఆర్ఎస్ నేత అరెస్ట్!

నల్లమల అడవుల్లో మరోసారి గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం దౌలాపూర్ లో బౌరాంబా దేవి ఆలయంలో దుండగులు విధ్వంసం సృష్టించారు. గుప్త నిధుల కోసం చెంచుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబ విగ్రహాన్ని తొలగించారు. అయితే స్థానిక చెంచులు ఈ నిందితుల ముఠాను పట్టుకొని అటవీ శాఖాధికారులకు అప్పగించారు. ఈ ముఠాలో తిరుమలేశ్‌ నాయుడు అనే వ్యక్తి ఉన్నాడు. అతడు హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ ముఖ్యనేత అనుచరుడుగా తెలుస్తోంది. అసలు వాస్తవానికి అధికారుల కళ్లు గప్పి ఎవరూ ఇక్కడి అడవిలోకి అడుగు పెట్టే పరిస్థితి లేదు. కానీ రాత్రికి రాత్రే ఆలయాల్లో తవ్వకాలు జరిగి పోతున్నాయి. దీంతో ఈ తవ్వకాల వెనుక ఇంటి దొంగల పాత్ర కూడా ఉందనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.  గతంలో ఓసారి ఫారెస్టు అధికారులు కొందరు భ్రమరాంబిక దేవాలయంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపారని చెంచు వాచర్స్ ఆరోపిస్తున్నారు. బయటపెడితే తమను ఉద్యోగాల నుంచి తీసేస్తామని కూడా బెదిరించారని వారంతా ఆవేదన  వ్యక్తంచేస్తున్నారు. అంతేకాకుండా అడవిని కాపాడేవారే అక్రమాలకు పాల్పడితే ఎలా అంటూ చెంచు వాచర్స్ ప్రశ్నిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం రాంపూర్ పెంట వద్ద అటవీ శాఖాధికారులు గుప్త నిధుల తవ్వకాలు జరుపుతూ ఉండగా స్థానికులు వారిని బంధించారు. కానీ పైఅధికారుల ఒత్తిడితో వారిని వదిలేశారు. అప్పటి ఆటో కూడా ఇప్పటికీ చెక్ పోస్టు లోనే ఉంది. తాజాగా పట్టుబడిన ముఠా వెనుక కూడా అధికారుల పాత్ర ఉందని అంటున్నారు స్థానికులు. అయితే నిందితులను ప్రశ్నించి వారి వెనుక ఎవరున్నారో తెలుసుకొని పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారానికి కేవలం ఐదే పనిదినాలు

మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో రెండు రోజుల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. మహారాష్ట్రలో పని చేస్తున్న ప్రభుత్వం సెమీ గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ ఇక మీదట వారంలో కేవలం ఐదు పనిదినాలే ఉండబోతున్నాయి. తాజాగా సీఎం ఉద్దవ్ థాక్రే అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్ ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని.. ఇక నుంచి వీరందరికీ వారంలో రెండు రోజుల పాటు సెలవులూ అమలు కానున్నాయని అన్నారు. అదే విధంగా ఓబీసీ, ఎస్సీబీసీ, వీజేఎన్టీ అన్నిటికీ ప్రత్యేక డిపార్ట్ మెంట్ ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. అలాగే.. వెనకబడిన వర్గాల అన్నింటికీ కలిపి బహుజన్ కల్యాణ్ అనే పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర లోని అన్ని కాలేజీల్లో జాతీయ గీతం ఆలాపనను తప్పని సరి చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలు శివాజీ జయంతి రోజైన ఈ నెల 19 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ప్రతి రోజూ ఉదయం అన్ని కాలేజీలలో తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతం ఆలపించేలా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అన్ని కాలేజీలకూ పంపనుంది ప్రభుత్వం. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే అన్ని కాలేజీలూ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం అందుతుంది. ఇప్పుడు ఈ ఆదేశాల ద్వారా మహారాష్ట్ర కాలేజీల్లో చదువుకుంటున్న 15 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు తప్పకుండా జాతీయ గీతాలాపన ప్రతి రోజూ చేస్తారు. దీంతో జాతీయ గీతాలాపన తప్పని సరి చేస్తూ దేశంలోనే ఏకైక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవనుంది. విద్యార్ధుల్లో దేశ భక్తి జాతీయ భావాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వైఎస్ జగన్ మళ్లీ ఢిల్లీ టూర్.. ఆసక్తిరేపుతోన్న ఏపీ రాజకీయాలు!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. నిన్ననే ప్రధానిని కలిసిన సీఎం జగన్ రేపు మరోసారి ఢిల్లీ వెళ్ళి ప్రముఖ నేతలను కలవనున్నట్లు తెలుస్తోంది. పీఎం మోడీని కలిసిన రోజునే వైఎస్ జగన్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి మూడు రాజధానుల అంశం, మండలి రద్దు వంటి అంశాలపై చర్చిస్తారని అంతా భావించారు. కానీ.. నిన్న ప్రధాని మోదీని కలవడం.. ఆ తర్వాత కేంద్ర హోమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారు కాకపోవడంతో ఏపీకి వెనుతిరిగారు వైఎస్ జగన్.  పీఎం మోదీని కలిసిన వైఎస్ జగన్ మూడు రాజధానుల అంశంపై ప్రధానంగా చర్చించారు. అలాగే.. పూర్తి వివరాలతో వినతి పత్రాన్ని కూడా అందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అవే అంశాలను ఇప్పుడు అమిత్ షాతో కూడా చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వైఎస్ జగన్ ఇంకా ఎవరిని కలవబోతున్నారు.. ఎటువంటి అంశాలను చర్చించబోతున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ప్రధాని మోదీకి ఇచ్చిన నివేదిక కాకుండా ఇంకా ఏయే విషయాలపై అమిత్ షాతో చర్చించనున్నారు అనేదానిపై సర్వత్రా ఆశక్తి నెలకుంది.  రేపు సాయంత్రం ఆరు గంటలకు ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకొని ఏడు గంటలకు అమిత్ షాతో అపాయింట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల అంశంతో పాటు ఇప్పటికే వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన నేపథ్యంలో మూడు రాజధానులకు సంబంధించి బిజెపిలో అసమ్మతి నెలకొన్న విషయం తెలిసిందే. అలాగే.. ఇప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేపడుతుంది ఏపీ ప్రభుత్వం. ఉగాది నాటికి ఇరవై ఐదు లక్షల ఇళ్ళ స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చేపట్టింది. దీంతో ఈ కార్యక్రమానికి ఇప్పటికే మోడీని ఆహ్వానించిన నేపధ్యంలోనే అమిత్ షాను కూడా ఆహ్వానించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా రాజకీయపరంగా ఈ భేటీలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ కొన్ని విమర్శలను చేస్తుంది. ఇప్పటికే యనమల రామకృష్ణుడు పలు రకాల విమర్శలు గుప్పించారు. దీంతో ఇప్పుడు అమిత్ షాతో భేటీ ఏ విధంగా చూస్తారనేది చూడాలి.

ఏపీలో రెచ్చిపోతున్న చేపల మాఫియా.. పేద మత్స్యకారుల కడుపు కొడుతున్నారు!

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సోమశిల జలాశయంలో చేపల మాఫియా రెచ్చిపోతోంది. అధికారుల అండదండలతో డ్యాములోని లోతట్టు ప్రాంతంలో నివాసాలను ఏర్పాటు చేసుకొని మరీ మత్స్య సంపదను ఆ మాఫియా కొల్లగొడుతుంది. నిషేధిత అలివి వలలతో రాత్రి పగలు చేపలను వేటాడుతూ స్థానిక మత్స్యకారుల కడుపు కొడుతున్నారు. అడ్డొచ్చిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. జలాశయ సంపదను కాపాడాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడి వాళ్ళకి సహకరిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా ప్రజలకు వరప్రదాయిని సోమశిల జలాశయం. జిల్లా ప్రజలకు సాగు, తాగు నీటి అవసరాలను తీర్చడమే కాకుండా పక్కనే ఉన్న చెన్నై నగర ప్రజలకు కూడా దాహార్తిని తీరుస్తోంది. స్థానిక మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం ఏటా లక్షలు వెచ్చించి చేప పిల్లలను సోమశిల డ్యామ్ లో వదులుతూ వుంటుంది. జలాశయం వద్ద మొత్తం 400 ల నుంచి 600 ల వరకు ప్రభుత్వం నుంచి లైసెన్సు పొందిన మత్స్యకారులు ఉన్నారు. వీరంతా నిరుపేదలు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్యాముల్లో చేపలు వేటాడి.. వాటితో వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలా ప్రశాంతంగా సాగిపోతున్న మత్స్యకార కుటుంబాల్లోకి చేపల మాఫియా రాకతో ఉపాధి కరువైంది. సోమశిల జలాశయంపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు చెన్నై, కాకినాడ, రాజమండ్రి నుంచి ఇక్కడికి చేరుకుని స్థానిక బడా వ్యాపారులతో కలిసి జలాశయంలో పాగా వేశారు. డ్యామ్ లోతట్టు ప్రాంతంలో తాత్కాలిక నివాస స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పగలు అక్కడే ఉంటూ అలవి వలతో చేపలను పడతారు. వారి వేట కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని స్థానిక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.  అలవి వేటతో జలాశయంలో మత్స్య సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం వేటను పూర్తిగా నిషేధించింది. అయితే చేపల మాఫియా జలాశయంలో సుమారు 80 అలివి వలలు వినియోగిస్తున్నట్లు తలుస్తోంది. అన్ని వలలతో కలిపి రోజుకు సుమారు 50 టన్నుల చేపలు పడుతోందని జాలర్లు వెల్లడిస్తున్నారు. కిలో సగటున 40 రూపాయల చొప్పున విక్రయించిన రోజుకు 20 లక్షల రూపాయల విలువైన మత్స్య సంపద అక్రమంగా తరలిపోతోంది. కాగా గతంలోనే డ్యామ్ లో అలివి వలలు వాడుతున్న విషయాన్ని తెలుసుకున్న అప్పటి జిల్లా కలెక్టర్ జానకి గట్టి చర్యలు తీసుకున్నారు. కడప, నెల్లూరు జిల్లాల నుంచే జాలర్లు ప్రవేశిస్తున్నట్లు తెలుసుకున్న కలెక్టర్ రెండు జిల్లాల పోలీస్ మత్స్య శాఖ అధికారులతో చర్చించి ఉమ్మడిగా దాడులు చేయించారు. దాంతో అలివి వలలను తొలగించారు. కొంత కాలం పాటు అడ్డుకట్ట పడినా ఆ తర్వాత అక్రమర్కులు మళ్లీ అలివి వలలతో వేట ప్రారంభించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సోమశిల డ్యామ్ లోపల అలవి వలల వేటను పూర్తిగా అరికట్టి తమను ఆదుకోవాలని స్థానిక మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈసీ తీవ్ర కసరత్తు.. దేశంలో ఎక్కడ నుంచైనా ఓటేయొచ్చు

దేశంలోని ఓటింగ్ విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది ఎన్నికల కమిషన్. దేశంలో ఎక్కడి నుంచైనా ఓటు వేసేందుకు ఓటర్ కు వెసులుబాటు కల్పించేలా ఈసీ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బ్లాక్ చెయిన్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు మద్రాస్ ఐఐటీతో కలసి ఈసీ పని చేస్తున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈ విధానం అమల్లోకి వస్తే దేశంలో ఓటర్లు ఎక్కడి నుంచైనా ఓటు వేసేందుకు వీలుంటుందని తెలిపారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని ఓటర్లు మాత్రమే కొత్త విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందుకు చట్టంలోనూ మార్పులు అవసరమని అన్నారు సునీల్ అరోరా. లోక్ సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలే నిర్ణయం తీసుకోవాలని ఆయన తెలిపారు. పార్టీలు నిర్ణయిస్తే అమలుచెయ్యటానికి ఈసీ ఏర్పాట్లు చేస్తుందని వివరించారు. అలాగే.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేరని ఆయన మరోసారి స్పష్టం చేశారు. బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించే ప్రసక్తే ఉండదని సునీల్ అరోరా అన్నారు.

పార్టీ కేడర్ ఒత్తిడి తట్టుకోలేక చేతులెత్తేసిన వైసీపీ ఎమ్మెల్యే!!

ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజక వర్గం వైసీపీకి కంచుకోట. ఒకప్పుడు ఈ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ.. వైసీపీ ఆవిర్భావం తర్వాత తుడిచి పెట్టుకుపోయింది. 2014, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు నిలబడ్డారనేది చూడకుండా ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకే ఓటేయడంతో వరుసగా రెండు పర్యాయాలు అక్కడ వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత అధికార టిడిపిలో చేరి పోయారు. దీంతో స్థానికంగా ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపించింది. అందుకే 2019 లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ వైసీపీ అభ్యర్థి అన్నా రాంబాబును బంపర్ మెజారిటీతో గెలిపించారు. గిద్దలూరు ఎమ్మెల్యేగా పరిపాలన బాధ్యతలు చేపట్టిన అన్నా రాంబాబు మునుపెన్నడూ లేని విధంగా కార్యకర్తలు ప్రధానంగా ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. పనులు చేయించుకునే విషయంలో ముప్పేట దాడి చేస్తున్నారు సొంత పార్టీ నాయకులు.  మొత్తం నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్న నేపధ్యంలో ప్రతి మండలంలోనూ వైసీపీలో మూడు, నాలుగు వర్గాలున్నాయి. వారందరినీ ఏకతాటి పై నడిపించేందుకు సాధ్యమవడం లేదంటున్నారు కొందరు నేతలు. దీంతో ఏ వర్గానికీ పని చెయ్యాలో తెలియక రాంబాబు తల పట్టుకుంటున్నారు. చేతిలో పరిమిత అవకాశాలుండటం, నేతలు ఎక్కువ మంది ఉన్న నేపధ్యంలో ఎటు వైపు మొగ్గు చూపితే ఏమవుతుందోననే ఆందోళనలో ఎమ్మెల్యే ఉన్నారు. ఒక వర్గానికి సిఫారసు చేస్తే మరో వర్గం దూరమవుతుందనే ఉద్దేశంతో ఎవరికీ పనులు చేయకుండా అసలు తన వద్దకే రావద్దని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు అన్నా రాంబాబు. దీంతో వైసీపీ వర్గాలు ఆయన పై గుర్రుగా ఉన్నాయనే టాక్ గిద్దలూరు నియోజక వర్గాల్లో వినిపిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓటు వేసినా సామాన్య ప్రజలు సైతం తమకు పనులు చేసిపెట్టాలని అన్నా రాంబాబును సంప్రదిస్తుంటే వారి పై మండిపడుతున్నారు. తానేమీ చేయలేనని తన వద్దకు వచ్చిన ప్రయోజనం లేదని చెపుతున్నట్లు కార్యకర్తల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు జనాలు కూడా ఏదో చేస్తారని గెలిపిస్తే ఇలా చేస్తున్నారేంటని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

నర్సుపై డాక్టర్ అత్యాచారయత్నం.. పోలీసుల కళ్లుగప్పి పరార్!

ఆంధ్రప్రదేశ్ లో దిశ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత లైంగిక వేధింపులపై అవగాహన ఏర్పడుతుంది. తప్పు చేస్తే చట్టాలు శిక్షస్తాయనే భయం ప్రతి ఒక్కరిలో నాటుకొనేలా చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశం కూడా. ఆ దిశగా తప్పు చేసిన వారిని ఎక్కడికక్కడ అవగాహన ఏర్పరిచి.. ఆ చట్టం.. శిక్షలపై ప్రభుత్వం ప్రజలకు.. అవగాహనతో కూడిన ప్రచారం నిర్వహిస్తుంది. తాజాగా లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాసుపత్రి డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పరారైన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది.  ఉదయగిరి ప్రభుత్వాసుపత్రిలో డీడీవోగా విధులు నిర్వహిస్తున్న రవీంద్రనాథ్ ఠాగూర్ నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. ఓ నర్సును రాత్రి వేళ పిలిచి అత్యాచారయత్నం చేయడంతో రవీంద్రనాథ్ వ్యవహారం బయటకు వచ్చింది. ఇదే విషయంపై  నర్సు బంధువులు.. వచ్చి రవీంద్రనాథ్ కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రవీంద్రనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అదే సమయంలో రవీంద్రనాథ్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడంతో సర్వత్రా కలకలం రేపుతోంది. రవీంద్రనాథ్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.  

లాటరీలో 12 కోట్లు గెలుచుకున్న రోజువారీ కూలీ...

అతడు రోజువారీ కూలీ, ఇంట్లో అతను పని చేస్తే గానీ పూట గడవని పరిస్థితి. అయితే అతని కష్టాలను గట్టెక్కించేందుకు అదృష్టం లాటరీ రూపంలో తలుపు తట్టింది. రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. కేరళకు చెందిన ఓ రోజూ కూలి లాటరీలో 12 కోట్లు గెలుచుకున్నాడు. కేరళ లోని కన్నూరు జిల్లా మురళి మాల కుర్చియా కాలనీకి చెందిన యాభై ఐదేళ్ల పోరునన్ రాజన్ దినసరి కూలీ. రెక్కాడితే గాని డొక్కాడదు, అవసరం కోసం అప్పులు తప్పలేదు.  మూడు వారాల క్రితం ఓ రోజు రాజన్ రుణం కోసం వెళుతుండగా మార్గమధ్యలో లాటరీ టికెట్ సేల్ ఆకర్షించింది. అదృష్టంపై నమ్మకం లేకపోయినా ఎక్కడో ఓ చిన్న ఆశ టికెట్ కొనాలని ప్రేరేపించింది. అలా మూడు వందల రూపాయలు పెట్టి క్రిస్మస్, న్యూయర్ బంపర్ లాటరీ టికెట్ కొన్నాడు. అంత ఖరీదు పెట్టి లాటరీ టికెట్ కొన్నానని చెబితే ఇంట్లో వారు ఏమంటారో అని ఎవరికీ చెప్పలేదు. లాటరీ విజేతలను సదరు ఏజెన్సీ సంస్థ ప్రకటించగా అందులో రాజన్ కొన్న టికెట్ కు బంపర్ ఆఫర్ తగిలింది. ఆ లాటరీలో అతడు ఏకంగా పన్నెండు కోట్లు గెలుచుకున్నాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

150 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. మొబైల్ నిండా అశ్లీల వీడియోలే!

సైబర్ నిందితుడు కందగట్ల భాస్కర్ అరెస్ట్ లో కొత్త కోణాలు బయటికొస్తున్నాయి. రుణాల పేరుతో మహిళలను వేధింపులకు గురి చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. అతని మొబైల్ ఫోన్ లో వందల సంఖ్యలో అశ్లీల వీడియోలను చూసి ఖంగుతిన్నారు ఖాకీలు. కామాంధుడైన కందగట్లను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కందగట్ల భాస్కర్ అరెస్టులో సరికొత్త ట్విస్ట్ ఎదురైంది. అశ్లీల చిత్రాలు, వీడియోలు పంపిస్తూ సుమారు నూట యాభై మందికి పైగా మహిళలను భాస్కర్ వేధించినట్లు తేలింది. భాస్కర్ సెల్ ఫోన్ లో వందల సంఖ్యలో అశ్లీల చిత్రాలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకునే మహిళలను టార్గెట్ చేసి అశ్లీల వీడియోలు, న్యూడ్ వీడియో కాల్స్ తో వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.  జనగామ జిల్లా నేలపోగుల ప్రాంతానికి చెందిన కందగట్ల భాస్కర్ గతంలో ఆరోగ్య శ్రీ విభాగంలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పనిచేశారు. ప్రస్తుతం సొంతూరిలో వ్యవసాయం చేస్తున్నాడు, తెలంగాణ స్టేట్ ఆన్ లైన్ బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ అండ్ మోనిటరింగ్ సిస్టం పోర్టల్ ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించేవాడు. అలా మహిళల వివరాలను సేకరించి దుర్వినియోగం చేశాడు భాస్కర్. ఎన్జీవోలో పనిచేస్తున్నానంటూ కలరింగ్ ఇచ్చి, రుణాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికే వాడు. మహిళలతో పరిచయం పెంచుకొని అశ్లీల వీడియోలు పంపేవాడు, సిమ్ కార్డులు మారుస్తూ వాట్సాప్ లో న్యూడ్ వీడియో కాల్స్ చేసేవాడు. ఇలా ఇప్పటివరకు 150 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. భాస్కర్ వేధింపుల బారిన పడిన వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు సమాచారం. ఓ బాధితురాలు ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ పై 2007లో లింగాల ఘణపురం లోనే ఇలాంటి కేసు నమోదవడంతో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయినా భాస్కర్ ప్రవర్తనలో మార్పు రాలేదు, ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉన్న అతడిని మరోసారి విచారణ జరుపుతున్నారు పోలీసులు.

ఇళ్ల పట్టాలపై జగన్ సర్కార్ కొత్త వ్యూహం.. మమా అనిపిస్తున్నారు!!

ఉగాది రోజున పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రకటించిన వైఎస్ జగన్ సర్కార్.. విశాఖపట్నంలో భారీగా భూసమీకరణ జరుపుతోంది. ప్రభుత్వం జరిపే ఈ ప్రయత్నాలకు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. అయితే ఎక్కడైనా భూములను సమీకరించినా వాటిని పేదలకు పంపిణీ చేయాలంటే ముందుగా ఆ భూముల్లో లేఔట్ లు వేయాలి. భూమిని చదును చేసి రోడ్లు కాలువలు నిర్మించి విద్యుత్ సదుపాయం వంటి మౌలిక వసతులు కల్పించాలి. ఆ తర్వాత ఆయా స్థలాలను ఫ్లాట్టుగా విభజించి పంపిణీ చేయాలి. ఈ పనులను పూర్తి చేయటానికి సగటున ఎకరాకు 40 లక్షల రూపాయల అవుతుందని విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు ఉన్నతాధికారులకు వెల్లడిస్తున్నారు. ఈ మధ్య పెరిగిన వ్యయాలు ఈ సేవలకు జీఎస్టీని కూడా కలుపుకుంటే ఎకరాకు 52 లక్షలు అవుతుందని లెక్కకట్టి తేల్చేశారు. సమీకరించ దలచిన 6,000 ల పైచిలుకు ఎకరాలలో ఈ విధంగా లేఔట్ లు వేయాలి అంటే సుమారు 3,000 ల కోట్లు అవసరమని లెక్కకట్టారు.  అయితే అంత మొత్తంలో తాము సమీకరించలేమని వీఎంఆర్డీఏ అధికారులు చేతులెత్తేశారు. దీంతో వారికి ఆ విషయంపై బోధపడేలా మార్గదర్శకాలిచ్చారు. ఇతర వ్యాపార లేఔట్ ఉన్న అంత వ్యయం పెట్టనక్కర్లేదని నామమాత్రపు లేఔట్ వేస్తే చాలని సూచించారు. దాంతో అధికారులూ కిందా మీదా పడి ఆ వ్యయాన్ని 52 లక్షల నుంచి ఏకంగా 2.5 లక్షల రూపాయలకు తగ్గించారు. అదేవిధంగా వీఎంఆర్డీఏ పై పడే భారం 150 కోట్లన్నమాట. ఎకరా స్థలంలో 2.5 లక్షల రూపాయలతో మౌలిక వసతులు ఎలా సమకూరుతాయని ప్రశ్నిస్తే భూమిని చదును చేసి ట్రెంచ్ లు కొట్టి మార్కింగ్ వేస్తే చాలని అంతకు మించి ఏమీ అవసరం లేదని కూడా అంటున్నారు. మరి రోడ్లు వేయిస్తామని.. కాలువల కోసం చిన్న గోతులు తవ్వుతామని కూడా చెప్తున్నారు. ఇతర లేఅవుట్ ఉన్న తారు రోడ్లు, విద్యుత్ సదుపాయం వంటివి ప్రస్తుతానికి ఉండవని పరోక్షంగా వెల్లడిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆ సంస్థలో అన్ని నిధులు ఉన్నాయా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. చూద్దాం ఏం జరుగుతుందో.

తెలంగాణకు త్వరలో తొమ్మిది ప్రైవేటు విశ్వవిద్యాలయాలు!!

తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఎడ్యుకేషన్, ఇండస్ట్రీయల్, మెడికల్ హబ్ లుగా మారి వినూత్నంగా దూసుకుపోతుంది. అయితే కొత్తగా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రానున్నట్లు తెలుస్తోంది. రాబోవు విద్యా సంవత్సరం నుంచే వాటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కీలక అడుగు పడినట్లు తెలుస్తోంది. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై సీఎం కేసీఆర్ సంతకాలు చేసినట్టు సమాచారం అందుతుంది. సుమారు తొమ్మిది వర్సిటీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. అయితే వర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేరు వేరు యూనివర్సిటీలకు వేరు వేరు చట్టాలు కాకుండా ప్రైవేటు వర్సిటీల అన్నింటికీ కలిపి ఒకే చట్టం చెయ్యాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆ కసరత్తును తుది దశకు చేరినట్లు కూడా సమాచారం అందుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు బిల్లును ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆ తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల హడావిడి మొదలు కానుంది. నిజానికి ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి 2018 మార్చిలో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దాంతో అప్పటికే రాష్ట్రంలో వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్న పలు సంస్థలకు మార్గం సుగమమైంది. అప్పట్లోనే ప్రైవేటు వర్సిటీలు ప్రారంభమవుతాయని భావించిన పలు కారణాలతో సాధ్యం కాలేదు. గత ఏడాది కూడా సాధ్యం కాలేదు. ఈ యేడాది ఖచ్చితంగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో ఒకేసారి భారీగా ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఇప్పటికే సుమారు 15 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో పాటు రాష్ట్రంలోని పలు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఆసక్తి చూపాయి. వీటిలో మల్లారెడ్డి, శ్రీనిధి, అనురాగ్, ఎస్ఆర్, గురునానక్ ఉన్నాయి. ప్రస్తుతానికి తొమ్మిది యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో టెక్ మహీంద్రా, ఎస్ఆర్, మల్లారెడ్డి, గురునానక్, శ్రీనిధి, నిప్ మర్, అనురాగ్, ఎంఎన్ఆర్ వాక్సిన్ వర్సిటీలు ఉన్నాయి. వీటి దరఖాస్తులను పరిశీలించిన ప్రత్యేక కమిటీ వర్సిటీలు ఏర్పాటు చేసే భవనాలు ప్రాంతాలను కూడా తనిఖీ చేసింది. సంబంధిత నివేదికను రెండు నెలల క్రితమే ప్రభుత్వానికి పంపింది. ఆ వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ సీఎం కేసీఆర్ తాజాగా సంతకం కూడా చేశారని తెలుస్తోంది. మరో రెండు ప్రముఖ విద్యా సంస్థలు రాడ్ క్లిఫ్, అమిటీ కూడా రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి స్థలం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటు కానున్న తొమ్మిది ప్రైవేటు వర్సిటీల్లో ఒకటి మెడికల్, మరొకటి మహిళా వర్సిటీ అని తెలుస్తుంది. వీటిలో ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు మెడికల్ ప్రైవేటు వర్సిటీని, మల్లారెడ్డి విద్యాసంస్థలు మహిళా వర్సిటీని ఏర్పాటు చెయ్యాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి దీన్నిబట్టి తెలంగాణలో భారీ స్థాయిలో ప్రైవేలు వర్సిటీలు రానున్నట్లు తెలుస్తోంది.