స‌మాధానం చెప్పండి. అప్పుడు మ‌తాన్ని అంట‌గ‌ట్టం!

ట్విట్టర్ లో నిల‌దీసిన మాజీ ఐఎఎస్ అధికారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికు మతాన్ని అంటగడితే చూస్తూ ఊరుకోబోమని మంత్రి వెల్లంపల్లి చేసిన ప్రకటనపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఘాటుగా స్పందించారు. జ‌గ‌న్‌కు మ‌త పిచ్చి లేక‌పోతే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల‌ని ట్విట్టర్ వేదికగా  ఐవైఆర్ సంధించిన పోస్టులు వైర‌ల్ అయ్యాయి. 1. హిందూ మత సంస్థల నుంచి హిందూయేతరలను తొలగిస్తామని చెప్పి ఇంతవరకు అమలు చేయకపోవడానికి కారణాలేమిటో? 2. చట్టబద్ధంగా ఏర్పాటు చేయాల్సిన ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దాని క్రిందికి ధార్మిక సిబ్బందిని నియ‌మించ‌క‌ పోవడం ఏమిటి? 3. హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ కు చట్టబద్ధత కల్పించి, దానిని సమరసత వేదికతో అనుసంధానం చేయకపోవడం. 4. రాజ్యాంగ విరుద్ధమని తెలిసి కూడా ఇమామ్‌ల‌కు, పాస్టర్లకు వేతనాలు చెల్లించ‌డంలో మ‌త‌ల‌బు ఏమిటి? 5. ప్రభుత్వ ధనం నుంచి జెరూసలేం, హ‌జ్‌ యాత్రకు సహాయం, చర్చిలు కట్టడానికి సహాయం ఎందుకు చేస్తున్నారు? 6. దేవతా విగ్రహాలపై దుండగులు దాడి చేస్తే త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం. దేవాదాయ శాఖ మాత్యులుగా ఆ ప్రదేశాలను కూడా సందర్శించకుండా ఉండటం. సరైన సమాధానం చెప్పగలిగితే ముఖ్యమంత్రి గారికి మతాన్ని అంట కట్టాల్సిన అవసరం ఉండదని ఐవైఆర్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌లోకి శ్రీధర్ బాబు..! సోషల్ మీడియాలో ప్రచారం

దుద్దిళ్ల శ్రీధర్ బాబు... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నియోజకర్గం ఎమ్మెల్యే. టీకాంగ్రెస్‌లో సీనియర్ నాయకుల్లో శ్రీధర్ బాబు ఒకరు. అంతేకాదు మొన్నటి అంసెబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. అయితే, శ్రీధర్ బాబుపై ఇటీవల వరుసగా ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది. శ్రీధర్ బాబు తెలంగాణ కాంగ్రెస్‌ పగ్గాలు ఇవ్వబోతున్నట్లు ఎప్పట్నుంచో వినిపిస్తోంది. అయితే, పీసీసీ రేసులో తానున్నంటూ, కావాలనే తనపై ప్రచారం చేస్తున్నారని, నెగెటివ్‌గా కథలు అల్లుతున్నారన్నది శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తంచేస్తున్నారట. మరోవైపు అధికార టీఆర్ఎస్‌ పార్టీలోకి కూడా వెళ్తున్నారంటూ మరో ప్రచారం మొదలయ్యింది. ఏకంగా డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారంటూ, ఒక డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఇదిప్పుటి ప్రచారం కాదు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్‌ కండువా కప్పుకున్న సమయంలోనే, శ్రీధర్ బాబు పేరు కూడా వినిపించింది. కానీ అప్పుడు ఆయన ఈ ప్రచారాన్ని తిప్పికొట్టారు. ఎట్టి పరిస్దితుల్లోనూ కాంగ్రెస్‌ను వీడేది లేదంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు మరోసారి శ్రీధర్ బాబుపై ఈ ప్రచారం స్టార్ట్ అయ్యింది. మార్చ్ 7న శ్రీధర్ బాబు సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అంతేకాదు శ్రీధర్ బాబు విషయంలో మంత్రి ఈటల రాజేందర్ మధ్యవర్తిగా మాట్లాడారంటూ కూడా ఊహాగానాలు వినపడ్తున్నాయి. అయితే శ్రీధర్ బాబు కాంగ్రెస్‌ను వీడుతున్నారనే ప్రచారంలో నిజం లేకపోగా, ఆ ప్రచారం వెనుక రాజకీయం ఉందంటున్నారు ఆయన అనుచరులు. పీసీసీ రేసులో శ్రీధర్ బాబు పేరు వినిపిస్తున్న క్రమంలో, కావాలనే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇందులో ఆయనకు పీసీసీ పదవి రాకుండా చేయాలనే రాజకీయ కుట్ర ఉందంటున్నారు. ఈ ప్రచారం చేస్తున్నవారిలో, టీఆర్ఎస్ లీడర్లతోపాటు సొంత పార్టీ నేతలు కూడా ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆరోపణలు, వదంతులు ఎన్ని వస్తున్నా, శ్రీధర్ బాబు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ కార్యకర్తలకు చెబుతున్న శ్రీధర్‌ బాబు... ఈ ప్రచారాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. పరిస్థితులన్నీ కుదుటపడ్డాక, సరైన సమయంలో స్పందిస్తానని, తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నవారిని వదిలిపెట్టేది లేదని శ్రీధర్ బాబు తన అనుచరులతో చెబుతున్నారట. మరి, శ్రీధర్ బాబు ఎప్పుడు నోరు విప్పుతారో అప్పటివరకు ఆగాల్సిందే.

పితానిని కావాలనే టార్గెట్ చేశారా? టీడీపీ నేతల మౌనం ఎందుకు?

  పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ ఏదైనా ఆచంట నియోజకవర్గం మాత్రం పితానికి కంచుకోట. గత ఎన్నికలకు ముందువరకూ ఆయన మాటకు ఎదురు నిలిచిన పార్టీ, నాయకుడు లేడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మొదలు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇలా ముఖ్యమంత్రులు, పార్టీలు అధికారం మారారే తప్ప పితాని సత్యనారాయణకు మంత్రి పదవి మాత్రం మారలేదు. అయితే, వరుసగా మూడుసార్లు మంత్రిని చేసిన అదృష్టం కాస్తా ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్టుంది. ఓ వెలుగు వెలిగిన పితానిపై తాజాగా ఈఎస్‌ఐ స్కామ్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. వాస్తవానికి పితాని... టీడీపీలో చేరకముందు వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్... వైసీపీని ఏర్పాటుచేశాక వైఎస్‌కు దగ్గరగా ఉన్నవారంతా ఆ పార్టీలో చేరతారని భావించారు. కానీ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు పితాని, వట్టి అటు వైపు చూడలేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చినా, ఆయన మొగ్గలేదనేది టాక్. ఎన్నికలు ముగిశాయి. అధికారం తారుమారైయ్యింది. నేతలు ఎవరి రాజకీయం వారు చేస్తూనే ఉన్నారు. పార్టీల మధ్య విభేదాలు తారాస్దాయికి చేరడంతో, ఆయా పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అనే స్దాయికి చేరుకున్నారు. విచారణలో నిజానిజాలు ఎలానూ తేలుతాయి. స్కామ్ లో పితాని భాగస్వామ్యం ఎంతవరకూ అనేది త్వరలో వెలుగుచూస్తుంది. అయితే ఈలోపు తమ పార్టీ నేతకు అండగా నిలవాల్సిన జిల్లా టిడిపి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మనకెందులే అని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే పితాని వర్గం ఆవేదన కూడా. మద్దతివ్వాల్సిన సొంత పార్టీ నేతలు మౌనం దాల్చడంతో పితాని ఒంటరి పోరాటం చేస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఏదైమైనా పితాని తనపై వచ్చిన అవినీతి ఆరోపణలో ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆయన అనుచరులంటున్నారు. అండగా నిలుస్తుందని ఆశించిన పార్టీ, అంతకంతకూ దూరం పెడుతోందని, పితాని వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇత‌ర‌ వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌ మరణాల రేటు తక్కువే!

క‌రోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణా మంత్రులు భ‌రోసా ఇస్తున్నారు.  క‌రోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, గత వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌లో మరణాల రేటు తక్కువని వారు చెబుతున్నారు. కరోనా వైరస్‌ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్ర‌భుత్వం  అత్య‌వ‌స‌ర‌ సమన్వయ సమావేశం నిర్వహించింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయితీరాజ్‌శాఖల అధికారులు, మంత్రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. ఆయా శాఖ కార్యదర్శులు, శాఖాధిపతులతో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సమావేశమై వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. జీహెచ్‌ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, వివిధ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.

వియ్యంకులే లేచిపోయారు!

అదే పెళ్లి కుమార్తె తల్లిని పెళ్లికొడుకు తండ్రి లేపుకెళ్ళాడు. గుజరాత్ లో చోటు చేసుకున్నఈ ఉదంతం సోషల్ మీడియా వైరల్గా మారింది. వరుడి తండ్రిపై  వధువు తల్లి మ‌న‌సు ప‌డింది. అంతే ఇద్ద‌రి మ‌న‌స్సులు క‌లిశాయి. మాటాలు పెరిగాయి. ఇరువురు ఒక‌రి విడిచి మ‌రొక‌రు ఉండ‌లేని ప‌రిస్థితికి వెళ్ళిపోయారు. పిల్లల పెళ్లికి కాస్త ముందుగా తామే లేచి పోయి వేరే కాపురం పెట్టి క‌లిసి వుంటున్నారు. గుజ‌రాత్ రాష్ట్రం సూరత్ కు చెందిన 46 ఏళ్ల హిమ్మత్ పాండవ్,  నవ్ సారీకి చెందిన శోభనా లేచిపోయిడంతో వారిద్దరి పిల్లల పెళ్లి నిలిచి పోయింది. దీంతో కుటుంబంలోని పెద్ద‌లు జోక్యం చేసుకొని లేచిపోయిన‌ కాబోయే వియ్యంకుల‌పై మిస్సింగ్ కేసు పెట్టి  ఒత్తిడి చేయ‌డంతో ఆ జంట  తిరిగి వచ్చింది. అయితే పెళ్లి కుమార్తె తల్లి భ‌ర్త ఈ సంఘ‌ట‌న‌తో షాక్‌కు గురై ఆమెతో తెగ‌తెంపులు చేసుకోవ‌డంతో  ఆమె తన తల్లిదండ్రుల వ‌ద్ద‌కు చేరింది. అయితే కొత్త ప్రేమికుడ్ని మ‌రిచిపోలేక మ‌రోసారి పారిపోయి హిమ్మ‌త్ పాండ‌వ్‌తో క‌లిసి వుంటోంద‌ట‌!

లొంగ‌దీసుకొని క‌డుపు చేశాడు! టీఆర్ఎస్ నేత అరాచ‌కం!

గుట్టుగా ఉంచితే 6 ల‌క్ష‌లు ఇస్తాడ‌ట‌! నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్‌కు చెందిన 27 ఏళ్ల మ‌హిళ‌ ఇంటర్‌ వరకు చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. ఆమెను అదే గ్రామానికి చెందిన ఓ టీఆర్‌ఎస్‌ నాయకుడు లొంగదీసుకున్నాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం కావడంతో త్వరగానే ఆ యువతి తల్లిదండ్రులకు దగ్గరయ్యాడు. మెల్లగా యువతిని కూడా లోబర్చుకున్నాడు. ఉన్నట్టుండి  ఆ యువతి కనపడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తర్వాత రెండు రోజులకు ఆ మ‌హిళ‌ తనంత తానుగా తిరిగి ఇంటికి వచ్చింది. ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు ప్రశ్నించగా సదరు టీఆర్‌ఎస్‌ నాయకుడు చేసిన బాగోతాన్ని తల్లిదండ్రులకు చెప్పి భోరుమంది. ఆమె త‌ల్లిదండ్రులు నేత‌పై ఒత్తిడి చేశారు. అయినా స్పందించ‌లేదు. అయితే ఇప్పుడామె గ‌ర్భ‌వ‌తి అయింది. విష‌యం తెలుసుకున్న స‌ద‌రు టీఆర్‌ఎస్‌ నాయ‌కుడు ఈ విష‌యాన్ని గుట్టుగా వుంచ‌మ‌ని 6 ల‌క్ష‌ల రూపాయ‌లిస్తాన‌ని కాళ్ళ‌బేరానికి వ‌చ్చాడు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ సంఘ‌ట స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది.

మండలి ఉంటుందా? ఊడుతుందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శాసన మండలి రద్దు విషయం లో వైసీపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. బడ్జెట్ సమావేశాల్లో  టీడీపీకి ఎలాంటి చాన్స్ ఇవ్వ‌కుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుంది. రాజధాని విషయం, సెలక్ట్ కమిటీ తదితర విషయాలపై టీడీపీకి ఎదుర్కొనేందుకు మండలిని నిర్వహించకుండా ఉండటమే మంచిదనే భావనలో వైసీపీ ఉంది. మ‌రో ప్ర‌క్క శాస‌న మండలిని సమావేశ పరచకుండా ప్ర‌భుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఎదుర్కోవాలో టీడీపీ ఎత్తుగ‌డ‌ల‌ను సిద్ధం చేసుకుంటోంది. అసెంబ్లీ రూల్స్‌ ప్రకారం ప్రోరోగ్ ఆఫ్ ఈచ్ హౌస్-కమెన్స్ ఆఫ్ ఈచ్ హౌస్ ఉన్నట్లు చెబుతున్నారు. నియ‌మావ‌ళి ప్రకారం ఏ సభకు ఆ సభను విడి విడిగా స‌మావేశ ప‌ర్చ‌వ‌చ్చు. లేదా వాయిదా వేయవచ్చు. కాబ‌ట్టి  ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల సందర్భం గా శాసనసభనే సమావేశ పరచాలని గ‌వ‌ర్న‌ర్‌ను కోరే అవకాశం వుంది. సాధారణంగా బడ్జెట్ సమావేశం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. బడ్జెట్ సమావేశాల కోసం ప్రత్యేకంగా శాసన మండలి నిర్వహించాల్సిన పనిలేదని వైసీపీ నేతలు అంటున్నారు. అలా జ‌రిగితే, ప్ర‌భుత్వం శాసన సభను మాత్రమే గవర్నర్ ద్వారా సమావేశ పరిస్తే టీడీపీ కోర్టును ఆశ్రయించాల‌ని భావిస్తోంది. అయితే కోర్టు తీర్పు వచ్చేలోగా సమావేశాలు ముగిసిపోయేలా ప్ర‌భుత్వం ప‌థ‌కం ర‌చించింది. ఇరుపార్టీల నేతలు న్యాయనిపుణుల సలహాలను తీసుకుంటున్నారు. బడ్జెట్ సమావేశాల నాటికి ఏపీ శాస‌న మండ‌లి పరిస్థితిపై  క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

గ‌ల్ఫ్‌లో తెలుగు మహిళ రోద‌న‌.. ఇక కువైట్‌లో వుండ‌లేను స్వగ్రామానికి పంపండి

చేతిలో చిల్లిగవ్వ లేదు ఇండియా వెళ్లాలంటే డ‌బ్బులు కావాలి ఎపి ప్ర‌భుత్వం ఆదుకోవాలి స్వంత‌ ఊరిలో ఉపాధి లేక కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎడారి దేశానికి వెళ్ళి రోడ్డున ప‌డిన స‌త్య‌భార‌తి. వెస్ట్‌ గోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన కనుబోయిన సత్యభారతి (48) గత పదేండ్లుగా గ‌ల్ఫ్‌లో కార్మికురాలుగా పనిచేస్తున్నది. తండ్రిని కోల్పోయి, కట్టుకున్న భర్తకూ దూరమై ఒంటరిగా మిగిలిపోయిన ఆమె ఏజెంట్లు ఆడిన నాట‌కాలతో, మోసాల‌కు గురి అయింది.  ఫ‌లితం పలుదేశాలు తిరిగి క్లీనింగ్‌, వంటపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంది. ఖతర్‌, దుబాయ్‌, బహ్రెయిన్‌, కువైట్‌లో పనిచేసిన సందర్భంలోనూ ఆమెకు పెద్దగా కలసిరాలేదు. ఖతర్‌లో ఉండగా మెదడులో రక్తసరఫరా సంబంధిత సమస్యతో బాధపడింది. అక్కడ ఆపరేషన్‌ చేయించుకునేందుకు డబ్బుల్లేక ఇండియాకు తిరిగొచ్చి, రాజమండ్రిలో చికిత్స చేయించుకుంది. తిరిగి వెళ్లిన తర్వాత ఓ ఇంట్లో పనిచేస్తుండగా చేయి విరగడంతో ఇండియాకు వచ్చేసింది. అనంతరం నవంబర్‌ 12, 2019న కువైట్‌కు వెళ్లి షేక్ ఇంటిలో ప‌నులు చేస్తోంది. అయితే నాలుగు నెలలుగా వేతనం లేక కనీసం బంధువులతో మాట్లాడేందుకు కూడా డబ్బుల్లేకుండా పోయాయి. ఆమె అకామా (రెసిడెంట్‌ స్టాంప్‌) బ్లాక్‌లో ఉంది, గ‌తంలో ప‌ని చేయించుకున్న షేక్‌లు కూడా ఈమె పై కేసులు పెట్టారు. దీంతో బాధితురాలు బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్ళ‌దీస్తోంది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇండియా వెళ్లాలంటే సుమారు 2 లక్షల రూపాయల వరకు చెల్లించాలనడంతో బాధితురాలు బోరుమంది. త‌న‌ను గ‌ల్ఫ్‌కు పంపిన‌  ఏజెంటుకు ఫోన్‌ చేసినా వారు స్పందించ‌డం లేదు. చేసేది లేక ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న షేక్ ఇంటి నుంచి ఎలాగోలా తప్పించుకుని, తెలిసినవారి దగ్గర బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంది. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న సత్యభారతి ద‌గ్గ‌ర‌ డ‌బ్బులు లేవు.  తనను స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు సాయం చేయాలని అందరినీ వేడుకుంటున్నది. కువైట్‌లో స్థానికంగా వుండే ఎన్జీవోలు ఆమెను ఇండియ‌న్ ఎంబసీకి  అప్ప‌గించారు.  ఇతరులు చేసిన త‌ప్పుల‌కు త‌న‌పై  కేసులు నమోదైనట్టు ఆమె ఎంబ‌సిలో తెలిపింది. ఆమె ప్రస్తుతం ఎంబసీ అధికారుల సంర‌క్ష‌ణ‌లో ఉంది.

హైకోర్టు తీర్పును అమలు చేసి త్వ‌ర‌లో స్థానిక ఎన్నికల నిర్వ‌హ‌ణ‌కు స‌ర్కార్ క‌స‌ర‌త్తు!

మార్చి నెలాఖరుకల్లా ఎన్నికలు పూర్తి మార్చి నెలాఖరు నాటికి 14వ ఆర్థిక సంఘం గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఏపీలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను పూర్తి చేయకపోతే గ్రామపంచాయతీలకు రావాల్సిన 3 వేల 400 కోట్లకుపైగా నిధులు.. అలాగే పురపాలక సంఘాలకు సంబంధించి 1400 కోట్లు ఆగిపోతాయి. అందుకే నెలాఖరుకల్లా ఎన్నికలు పూర్తి చేసే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఏపీ తీవ్రమైన ఆర్థిక కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు కూడా ఆగిపోతే మరింత ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో ఆఘ మేఘాలపై హైకోర్టు తీర్పును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది ఏపీ సర్కారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదు . అయినా ఏపీలో వైసీపీ సర్కార్ 59.85 శాతం రిజర్వేషన్ల తో జీవో ఇవ్వడంతో  టీడీపీకి చెందిన ప్రతాప్‌రెడ్డి అనే వ్యక్తే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ప్రభుత్వం ఖరారు చేసిన రిజర్వేషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను హైకోర్టు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ  50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది. దీంతో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లల్లో మార్పులపై సర్కార్ ఆగ‌మేఘాల‌పై కసరత్తు ప్రారంభించింది. గతంలో ఇచ్చిన జీవో మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లల్లో 09.85 శాతం మేర రిజర్వేషన్లు తగ్గించి,  బీసీ రిజర్వేషన్లను 24.15 శాతానికి పరిమితం చేసే అవ‌కాశం వుంది.   బీసీలకు 24.15 శాతం, ఎస్సీ, ఎస్టీలకు యధాతధంగా 19.08, 6.77 శాతాల మేర ఖరారయ్యే అవకాశం వుంది. అయితే కోర్టు తీర్పుపై టిడిపి, వైసిపి నేత‌లు ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. రిజర్వేషన్ల విషయంలో సమర్ధుడైన న్యాయవాదిని పెట్టకుండా ప్రభుత్వం కేసును నీరుగార్చిందని మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు  దుయ్యబట్టారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని, సుప్రీంకోర్టుకు వెళ్తే టీడీపీ కూడా ఇంప్లీడ్‌ అవుతుందని చంద్రబాబు అంటున్నారు.  బీసీల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని స్పష్టమైందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు, కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోవాలి, గ్రామీణ, పట్టాణాభివృద్ధి జరగకూడదు అన్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని బొత్స ఆరోపించారు. జనాభా ప్రతిపాదికన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలే కోర్టుకు వెళ్లారని వైసిపి ప్ర‌తివిమ‌ర్శ చేసింది. టీడీపీ కుట్ర కారణంగానే బలహీన వర్గాలకు న్యాయం చేయలేకపోయాం. రిజర్వేషన్ల ప్రక్రియను మూడు, నాలుగు రోజుల్లో పూర్తిచేస్తాం'' అని బొత్స సత్యనారాయణ చెప్పారు.

పాత‌బ‌స్తీలో మితిమీరుతున్న అర‌బ్‌షేక్‌ల ఆగ‌డాలు

స్థానిక బ్రోక‌ర్ సాబేర్ అండ‌తో కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్ప‌డిన ఇబ్రాహీంషేక్‌ బార్క‌స్‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఉదంతం ఇబ్రాహీం అనే అరబ్ షేక్ బార్క‌స్‌కు చెందిన ఒక మహిళను బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిరుపేద అక్కా చెల్లెళ్లు ఆరోపిస్తున్నారు.   హైద‌రాబాద్ ఓల్డ్ సిటీ బార్క‌స్ ప్రాంతానికి చెందిన నిరుపేద అక్కా చెల్లెళ్లు అవ‌స‌రాల‌కు త‌మ ఇల్లు అమ్ముదామ‌నుకున్నారు. వీరు స్థానిక బ్రోక‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళితే, అర‌బ్ షేక్‌ను పెళ్ళి చేసుకోమ‌ని బేరం పెట్టాడంట ఆ బ్రోక‌ర్‌. ఇల్లు కొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా చెప్పి అక్కాచెల్లెళ్లను తన ఇంటికి పిలిచాడు. నమ్మి వచ్చిన వారి ముందు. అరవైఏళ్ల ఇబ్రహీం అనే అరబ్ షేక్ ను పరిచయం చేశాడు. షేక్‌ను పెళ్లాడాలని బెదిరించాడ‌ట‌. అతడి ప్రతిపాదనను రిజెక్టు చేసిన అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లిపోయారు. అస‌లే మ‌ద‌మెక్కిన అర‌బ్ షేక్.  చెల్లెలిపై మోజు ప‌డ్డాడు. అంతే బ్రోక‌ర్ సాబేర్ ప‌క్కా ప్లాన్‌తో చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు. విష‌యం ఆల‌స్యంగా తెలుసుకున్న అక్క  రాత్రి నుంచి చెల్లెలు కనిపించకుండా పోవటంతో  ఆందోళనకు గురైంది.తన చెల్లెలు కనిపించకుండా పోవటానికి కారణం సాబేర్ అని అనుమానించిన ఆమె.. తన సోదరుడితో కలిసి సాబేర్ ఇంటికి వెళ్లింది. అయితే.. వారిపై సాబేర్ సతీమణి దాడికి పాల్పడింది. కనిపించకుండా పోయిన సోదరి ఆచూకీ కోసం వెతుకుతున్న వారికి బార్కాస్ లోని ఇబ్రహీం ఇంట్లో తమ చెల్లెలు ఉందని గుర్తించారు. బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లుగా చెల్లెల్లు చెప్ప‌డంతో వెంటనే వారు ఇబ్రహీం పాస్ పోర్టు లాక్కొని.. చెల్లెల్ని వారి చెర నుంచి విడిపించుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన అక్కాచెల్లెళ్లు.. తాజాగా పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు న‌మోదు చేసి  విచారణ జరుపుతున్నారు. 

లోగుట్టు పెరుమాళ్ళకెరుక.. గల్ఫ్ లో జుల్ఫీ చేసే పనేంటి?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక గత తొమ్మిది నెలలలో కొన్నివేల రహస్య జీవోలు విడుదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొనే కొన్ని నిర్ణయాలు వ్యతిరేకత తెచ్చే ప్రమాదం ఉందనుకుంటుంటే వాటిని రహస్యంగా ఉంచడం ప్రతి ప్రభుత్వం చేసే పనే అయినా జగన్ ప్రభుత్వం ఇందులో ఎప్పుడో పరిధులు దాటేసింది. అయితే, గత ఏడాది నవంబర్ 13వ తేదీన విడుదల చేసిన ఒక రహస్య జీవో వివరాలు తాజాగా బయటకొచ్చాయి. ఆ జీవో ఆర్ టీ 2561 ప్రకారం ఏపీ ప్రభుత్వం గల్ఫ్ దేశాలను కవర్ చేసేలా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఓ వ్యక్తిని మిడిల్ ఈస్ట్‌కు ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. ఆయన పేరు జుల్ఫీ రవ్‌డిజీ. ఆయనెవరో సామాన్యులెవరికీ తెలియదు కానీ ఆయనకు ఏపీలో ఉన్న మంత్రులకు ఉండే అధికారాలన్నీ కట్టబెడుతూ పదవి ఇచ్చారు. ఒక్క ఈయనే కాదు.. గల్ఫ్ దేశాలే కాదు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు సంబంధించి చాలా మందికి పదవులను పంచి పెట్టింది. వాళ్లందరికీ క్యాబినెట్ ర్యాంక్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ జుల్ఫీ రవ్‌డిజీ అనే వ్యక్తి మాత్రం అటు ఏపీ ప్రజలకే కాదు ప్రముఖులకు.. ప్రభుత్వంలో పనిచేసే ఉన్నతాధికారులకు కూడా తెలియదు. పోనీ ప్రభుత్వం ఇచ్చిన ఆ రహస్య జీవోలో అయినా చెప్పారా అంటే అది కూడా ఎక్కడా ఒక్క ముక్క కూడా లేదు. ఆయన ఏ రంగానికి చెందిన వ్యక్తి? ఆయనను నియమించడానికి గల కారణాలేమిటి? అయన నిర్వహించాల్సిన విధులు ఏంటి? అయన ఆయా దేశాలలో ఎవరెవరిని కలుస్తారు? ఏ బాధ్యతలను నిర్వర్తిస్తారు? అన్న విషయాలేమీ ఆ జీవోలో లేవు. కేవలం క్యాబినెట్ ర్యాంక్ అధికారాలతో పాటు అదే స్థాయిలో ఇచ్చే జీతభత్యాల వివరాలు మాత్రమె ఇచ్చారు. అయితే, ఈ జీవో ఇప్పుడు బయటపడగానే రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. గత ఏడాది జులై నెలలో పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఆ అరెస్ట్ జరిగిన మూడు నెలలకు జీవో విడుదల జరిగింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నివాసి అయిన ఆ వ్యక్తి కూడా గల్ఫ్ దేశాలలోనే విధులను నిర్వర్తించనున్నారు. ఇప్పటికి ఆయనను ఏపీ ప్రభుత్వం నియమించి ఆరు నెలల కాలం జరగగా ఈ సమయంలో అయన ఎవరిని కలిశారు.. ఏపీకి ఏం ప్రయోజనం సమకూర్చారు? అన్నది సస్పెన్స్ గా కొనసాగుతుంది. అయితే అసలు గత ఆరు నెలలుగా రహస్యంగా ఉన్న జీవోను ఇప్పుడు ఎందుకు బయటకు తెచ్చారు? ప్రభుత్వంలోని వ్యక్తులే బయటపెట్టారా? దానివెనుక ఉన్న మతలబు ఏంటో అన్నది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్షం నిమ్మగడ్డ ఇప్పటికే అరస్టైన రస్ అల్ ఖైమా కేసుతో ఈ జీఓ ముడిపెడుతూ ఆ కేసుకు సంబంధించి వ్యవహారం నడిపెందుకే  జుల్ఫీ ని నియమించుకున్నారని, అందుకే ఈ జీఓ రహస్యంగా ఉంచారని డంకా భజాయించి మరీ చెప్తోంది.  

క్లోజ్డ్ డోర్‌లో జ‌రిగిన మంత‌నాలేమిటి? అస‌లు అంబానీ ఎందుకు వ‌చ్చారు?

ఇద్ద‌రి మ‌ధ్య డీల్ డ‌న్ అయ్యిందా?   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ భేటీ పై రాష్ట్రంలో ఆస‌క్తిక‌రంగా మైన చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మృతి వెనుక రిల‌య‌న్స్ కుట్ర వుందంటూ గ‌గ్గోలు పెట్టిన వారే ఇప్పుడు చేతులు క‌లుపుతారా? బ‌బాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య ఉదంతంపై కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇప్పుడేమో తండ్రిని చంపిన‌వారితో జ‌గ‌న్ మంత‌నాలేమిట‌ని పార్టీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. సిఎం జ‌గ‌న్ అంబానీతో ఏం మాట్లాడారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత  ముఖేష్ అంబానీ పర్యటనకు గల కారణాలపై అటు పార్టీలో, ఇటు అధికారుల్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. గన్నవరం విమానాశ్రయంలో దిగేవరకూ అంబానీ వస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. వాస్తవానికి సీఎం జగన్ షెడ్యూల్ లో అంబానీతో భేటి లేదు. పోనీ పారిశ్రామిక పెట్టుబడుల కోసం కావచ్చు అంటే అదీ లేదు.   ఒక ప‌క్క అంబానీ తనతోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికారులను  తీసుకురాలేదు. అంటే ఇది అఫీషియ‌ల్ బిజెనెస్‌కు సంబంధించిన భేటి కాదని తెలిసింది. ముఖేష్ అంబానీతో అతడి కుమారుడు అనంత్ అంబానీ రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాత్వానీ ఉన్నారు. మ‌రో ప‌క్క సీఎం జగన్ - ముకేష్ అంబానీల సమవేశానికి ప్రభుత్వ అధికారులు ఎవరూ లేరు. ఇది పూర్తిగా ప్రైవేటు భేటి అని తెలిసింది. ఏప్రిల్ లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో  పరిమల్ నాత్వానీని ఏపీ కోటాలో వైసీపీ తరుఫున రాజ్యసభకు పంపడానికి నామినేట్ చేయాలని సీఎం జగన్ ను కోరడానికే ముఖేష్ అంబానీ వచ్చినట్టు తెలుస్తోంది. పరిమల్ నాత్వానీ జార్ఖండ్ రాష్ట్రం నుంచి రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. బీజేపీ జార్ఖండ్ లో దారుణంగా ఓడిపోవడంతో ఈసారి అక్కడి నుంచి నాత్వానీ రాజ్యసభకు వెళ్లడం కష్టం. అందుకే ముకేష్ అంబానీయే కదిలివచ్చి సీఎం జగన్ ను ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరినట్టు ప్రచారం సాగుతోంది.  వైసిపి త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యే అభ్య‌ర్థుల జాబితాలో రిల‌య‌న్స్ అభ్య‌ర్థికి చోటు ద‌క్కుతుందా? అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఈ ప్ర‌తిపాద‌న‌కు ఎలా రియాక్ట్ అయ్యార‌న్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఇల్లు కొనాలనుకుంటున్నారా?.. ఎస్బీఐ ఆఫర్

ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీరేట్లు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. హోమ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎస్బీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 7.90 శాతం వడ్డీ రేట్లతో గృహరుణాలు ప్రారంభం అవుతున్నాయని తెలిపింది. పారదర్శకమైన గృహ రుణాల కోసం ఎస్బీఐ హోమ్ లోన్స్ వెబ్ సైట్ను సందర్శించడని ఎస్బీఐ ప్రకటించింది. మరోవైపు ఎస్బీఐ కార్డు ఐపీవో సబ్స్క్రిప్షన్ మార్చి రెండో తేదీన మొదలు కానుంది. ఇప్పటివరకు ఎస్బీఐ కార్డ్ అండ్ పేమెంట్ సర్వీస్ ఎస్బీఐకు అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ఈ ఐపీవో ద్వారా దాదాపు పదివేల కోట్లకు పైగా సమీకరించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీవో ధర రూ.750 నుంచి రూ.755 మధ్య ఉండొచ్చునని భావిస్తున్నారు. దీనిలో మొత్తం 13 కోట్ల వాటాలను ఎస్బీఐ విక్రయిస్తోంది.

డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు హైకోర్టు నోటీస్‌!

టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై దాడి ఘటన పట్ల హైకోర్టు సీరియస్ గా స్పందించింది. స్వయంగా హాజరు కావాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ అయ్యాయి. మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబుపై దాడి చేయడానికి గల కారణాలపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని కోర్టు సూచించింది. దీనిపై డీజీపీ ఇప్పటికే కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసినప్పటికీ.. వ్యక్తిగతంగా హాజరు కావాలని తాజాగా ఆదేశించింది. విశాఖపట్నం విమానాశ్రయం వ‌ద్ద చంద్రబాబుపై కిందటి నెల 27వ తేదీన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు, కార్యకర్తల ఘ‌ర్ష‌ణ మ‌ధ్య చంద్ర‌బాబునాయుడు దాడికి గురిఅయ్యారు.  విమానాశ్రయం నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరకుండా అడ్డు పడ్డారు. కారుపై రాళ్లు, చెప్పులు, కోడిగుడ్లను రువ్వారు. ఈ సందర్భంగా పోలీసులు చంద్రబాబును అరెస్టు చేసి, వెనక్కి తిప్పి పంపించారు. ఈ మొత్తం వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని తప్పు పట్టింది. సిఎం ఆదేశాల మేర‌కు పోలీసులు ఇలా వ్య‌వ‌హ‌రించార‌ని టిడిపి ఆరోపించింది. పోలీసులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. చంద్రబాబు పర్యటనకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. అడ్డుకున్నారని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తించారని, తీవ్రమైన నేరాలకు సంబంధించిన సెక్షన్ 151ను చంద్రబాబుపై ప్రయోగించారని అన్నారు. 151 కింద నోటీసులు ఇచ్చి, అరెస్టు చేశారని తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్య‌వ‌హారంపై హైకోర్టు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని గ‌తంలో పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఈ కౌంటర్ అఫిడవిట్‌పై సోమవారం హైకోర్టు విచారణ నిర్వహించింది. పోలీసులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని, కౌంటర్ అఫిడవిట్‌లో సమగ్ర వివరాలను లేవని అభిప్రాయపడింది. అందుకే డీజీపీకి గౌతమ్ సవాంగ్ స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.

నారా లోకేష్ విందు రాజకీయం... భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ మీటింగ్

టీడీపీ చరిత్రలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇఫ్పటికే తెలంగాణలో తెలుగుదేశం తుడిచిపెట్టుకుపోగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగుదేశం హిస్టరీలోనే ఎన్నడూలేనివిధంగా అత్యంత దారుణమైన పరాజయం పాలవడంతో, పార్టీని బలోపేతం చేసేందుకు, నేతలకు కాపాడుకునేందుకు చంద్రబాబు, నారా లోకేష్ తీవ్రంగా కష్టపడుతున్నారు. అయితే, ఎంతకాదన్నా, ఎవరు అవునన్నా, కాదన్నా... ముందుముందు తెలుగుదేశం పార్టీకి ముందుకు నడిపించాల్సింది నారా లోకేషే. అందుకే, పార్టీలో పట్టు పెంచుకునేందుకు లోకేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పలువురు టీడీపీ సీనియర్ నేతలు వయోభారంతో దాదాపు రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. దాంతో, ఇప్పటికే ఆయా నేతల వారసులు తెరపైకి వచ్చారు. కొందరు మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అదే సమయంలో, టీడీపీని నడిపించాల్సిన నారా లోకేష్... పార్టీలో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా భవిష్యత్ పై భరోసా కల్పిస్తూ యువ నాయకులతో ఎక్కువగా టచ్ లో ఉంటున్నారు. అందులో భాగంగానే, టీడీపీ సీనియర్ లీడర్ల వారసులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేతలు, ముఖ్యనేతలు, మాజీ మంత్రుల వారసుల్లో కొందరిని ఎంపికచేసి విందు సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు యువ నాయకులు హాజరయ్యారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ విందు సమావేశంలో నారా లోకేష్ తోపాటు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. అలాగే, చంద్రబాబు, భువనేశ్వరి కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే, యువ నాయకులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన నారా లోకేష్ .... భవిష్యత్ టీడీపీదేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.

అప్పుడు గ్రామ కమిటీలు... ఇప్పుడు వాలంటీర్లు... 2025లో జగన్ కొంప మునగడం ఖాయమేనా?

టీడీపీ గ్రామ కమిటీలతో చంద్రబాబుకు ఎంత నష్టం జరిగిందో 2019 ఎన్నికల్లో రుజువైంది. తెలుగుదేశం గ్రామ కమిటీ సభ్యుల అతితో పార్టీకి నష్టం జరుగుతోందని, సొంత నేతలు నెత్తీనోరు మొత్తుకున్నా, ఆనాడు చంద్రబాబు వినిపించుకోలేదు. చివరికి, ఏమైంది, 2019లో ఎన్నడూలేనంతగా దారుణమైన ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. తెలుగుదేశం ఘోర పరాజయంలో టీడీపీ గ్రామ కమిటీ సభ్యుల పాత్ర అంత గొప్పది. చంద్రబాబు చేసిన తప్పిదాల కంటే క్షేత్రస్థాయిలో తెలుగుదేశం గ్రామ కమిటీ సభ్యులు చేసిన నష్టమే ఎక్కువ. అంతలా టీడీపీ కొంప ముంచారు వాళ్లు. అయితే, టీడీపీ గ్రామ కమిటీ సభ్యుల తరహాలోనే.... గ్రామ వాలంటీర్లు త్వరలో జగన్ కొంప ముంచడం ఖాయమంటున్నారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ... చివరికి, వైసీపీ పాలిట శాపమయ్యే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. గ్రామ వాలంటీర్లపై ప్రస్తుతం తీవ్రస్థాయిలో వ్యతిరేకత లేకపోయినా, ఇప్పడిప్పుడే అసంతృప్తి, నెగటివ్ నెస్ మొదలవుతోందని అంటున్నారు. ముఖ్యంగా పెన్షన్లు లాంటి నగదు సంబంధమైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో గ్రామ వాలంటీర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెడుతోన్న రకరకాల నిబంధనల్లో ఏదో ఒకటి సాకుగా చూపి, తమకు ముడుపులు ఇవ్వకపోతే... మీ పెన్షన్ తీసేస్తాం... మీకు ఆ పథకం వర్తింపకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, నిజంగా క్షేత్రస్థాయిలో ఇదే జరుగుతోంది. ఎందుకంటే, మంత్రులకు, స్థానిక ఎమ్మెల్యేలకు గ్రామ వాలంటీర్ల మీద ప్రతిరోజూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వ్యాఖ్యలే అందుకు రుజువు. గ్రామ వాలంటీర్ల అవినీతిపై ఆధారాలతో సహా తనకు ఎన్నో ఫిర్యాదులు అందాయని, బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, పైగా ఆ డబ్బును వైసీపీ నాయకులకు ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలనాగిరెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు ఎంతోమంది గ్రామ వాలంటీర్ల అవినీతిపై గుర్రుగా ఉన్నారు. లంచాలు డిమాండ్ చేయడం, లెక్కలేనితనంగా ఇష్టానుసారంగా మాట్లాడటం, మహిళలకు మర్యాద ఇవ్వకపోవడం లాంటి ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని చెబుతున్నారు. అయితే, ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను అప్రతిష్టపాలు చేయడం ఇష్టంలేకే మౌనంగా ఉంటున్నామని, కానీ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం, ఇప్పుడు టీడీపీకి పట్టిన గతే, 2025లో వైసీపీకి పడుతుందని హెచ్చరిస్తున్నారు.

సంగారెడ్డిపై హరీష్ ఫోకస్... నియోజకవర్గం మారతారా? లేక జగ్గన్నకు చెక్ పెట్టేందుకేనా?

హరీష్‌ రావు అంటే సిద్దిపేట... సిద్దిపేట అంటే హరీష్‌ రావు... అంతలా సిద్దిపేటను తన పేటగా మార్చేసుకున్నారు హరీష్ రావు.... ఎంతలా ఉంటే, మొత్తం రాష్ట్రంలోనే హైయ్యెస్ట్ మెజారిటీ తనకే వచ్చేలా ప్రజల మనిషిగా మారారు... అయితే, హరీష్‌ రావు మనసు ఇప్పుడు మరో సెగ్మెంట్‌పై మళ్లుతోందని అంటున్నారు. హరీష్ ఫోకస్ మరో నియోజకవర్గంపై పడిందట. అదేదో కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కంచుకోట సంగారెడ్డి. మున్సిపల్ ఎన్నికల దగ్గర్నుంచి సంగారెడ్డిపై హరీష్ ప్రత్యేక దృష్టిపెట్టారని అంటున్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రెండు కీలక మున్సిపాలిటీలను టీఆర్ఎస్‌ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు హరీష్ రావు. దాంతో, నియోజకవర్గంపై పూర్తి పట్టు సాధించాలనే పట్టుదలతో ఉన్నారట హరీష్. అందులో భాగంగానే తన నియోజకవర్గం సిద్దిపేట తర్వాత, సంగారెడ్డి నియోజకవర్గానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఏ చిన్న ప్రభుత్వ కార్యక్రమమైనా, సంగారెడ్డిలో హరీష్ వాలిపోతున్నారని మాట్లాడుకుంటున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా, సంగారెడ్డిలో కలియ తిరిగిన హరీష్ రావు.... పలు వార్డుల్లో పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అక్కడికక్కడే పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో మమేకం కావడానికి ప్రయత్నించారు. అంతేకాదు, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ క్యాడర్‌కు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారట హరీష్. సంగారెడ్డి గులాబీ నేతల ఫోన్ కాల్స్‌కు రెస్పాండ్ కావడంతోపాటు, వారికి కావాల్సిన పనులు చేసి పెడుతూ నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడల్లా ముఖ్య కార్యకర్తల ఇంటికెళ్లి మాట్లాడుతున్నారు.  సంగారెడ్డిపై హరీష్ ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి వైఖరే కారణమని అంటున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో హరీష్ ను జగ్గారెడ్డి బహిరంగంగా దూషించడం, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, మంత్రి కసి పెంచుకున్నారని అంటున్నారు. ఎలాగైనా జగ్గారెడ్డికి చెక్‌పెట్టాలన్న లక్ష్యంతోనే నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా, ఇప్పుడు నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు సాధించి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఊపిరాడకుండా చేయాలనేది హరీష్ వ్యూహంగా టీఆర్ఎస్‌ నేతలు మాట్లాడుకుంటున్నారు.

తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. భారత్‌లో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని తాజాగా కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని పేర్కొంది. ఆదివారం నాడు దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఐదుగురికి కోవిడ్‌-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌ రాగా.. మరొకరికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. అలాగే ఢిల్లీలో కూడా ఓ వ్యక్తికి కరోనావైరస్ సోకిందని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతను ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. కరోనా సోకిన వారిద్దరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.