రేవంత్ టార్గెట్‌గా తెరపైకి భూ-వివాదం... డిప్యూటీ కలెక్టర్ పై సస్పెన్షన్ వేటు

రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలో తప్పుడు డాక్యుమెంట్ల ఆధారంగా అక్రమ మ్యుటేషన్లు చేసిన శేరిలింగంపల్లి మాజీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటుపడింది. గోపనపల్లి సర్వే నెంబర్ 127లో అత్యంత ఖరీదైన భూమిని అక్రమంగా తమ పేర రాయించుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్‌ ‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. మొత్తం 6.24 ఎకరాల భూమిని మ్యుటేషన్లు చేయించుకున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అధికారులు.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక ఇచ్చారు. అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా, శేరిలింగంపల్లి మాజీ తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటేశారు. హైదరాబాద్‌లో ఐటీ కారిడార్‌కు అత్యంత సమీపంలోని గోపనపల్లిలో అత్యంత విలువైన భూమికి రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారు ఎవరనే వివరాలు సక్రమంగా లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి భూదందాకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అత్యంత విలువైన భూమిని తనతోపాటు, తన సోదరుడి పేరుమీద మ్యుటేషన్‌ చేయించుకున్నారన్న అభియోగాలపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. అయితే, శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో ఏడెకరాల భూమిని రేవంత్‌రెడ్డి సోదరులు అక్రమమార్గంలో దక్కించుకున్నట్టు రంగారెడ్డి జిల్లా అధికారులు తమ విచారణలో తేల్చారు. దీనిపై ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదికను అందజేశారు. దాంతో, నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్‌ చేసిన అప్పటి తాసిల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు.  గోపనపల్లి సర్వే నంబరు 127లో 10.21 ఎకరాల భూమి ఉన్నది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ భూమి క్రయవిక్రయాలు జరిగినట్టు కొందరు కోర్టును ఆశ్రయించారు. సర్వే నంబర్‌ 127లోని భూమిలో తమకు హక్కు ఉన్నదని, రేవంత్‌రెడ్డి ఆ భూములను అమ్ముకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కొల్లా అరుణ ...2017లో హైకోర్టులో 17542, 17637 నంబర్లతో రిట్‌పిటిషన్‌ వేశారు. అలాగే అనుముల కొండల్‌రెడ్డి ఈ భూములు అమ్ముకోకుండా ఆదేశాలు జారీచేయాలని అనిల్‌కుమార్‌ అనే వ్యక్తి 2015లో రంగారెడ్డి జిల్లా సివిల్‌ కోర్టులో 780/2015 నంబర్‌తో పిటిషన్‌ దాఖలుచేశారు. వీటిపై నిజానిజాలు తెలుసుకునేందుకు అధికారులు విచారణ చేపట్టారు. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ముందుగా ఈ భూమిని వేరేవారి పేరుమీద రాయించి... తర్వాత వారి నుంచి రేవంత్‌రెడ్డి, అతడి సోదరుడు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. 6 ఎకరాల 39.5 గుంటలను ఎంపీ రేవంత్‌రెడ్డి, సోదరుడు కొండల్‌రెడ్డి తమపేరు మీద రాయించుకున్నట్టు తేల్చారు. రేవంత్‌రెడ్డి పేరు మీద రెవెన్యూ అధికారులు వివిధ మ్యుటేషన్ల ద్వారా బదిలీచేసి ప్రొసీడింగ్స్‌ ఇచ్చినట్టు విచారణలో తేలింది. నకిలీ డాక్యుమెంట్ల ద్వారానే ఈ మ్యుటేషన్లు జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. 127 సర్వే నంబర్‌లోని భూమికి నకిలీ డాక్యుమెంట్లతో మ్యుటేషన్లు చేయడంతోపాటు, రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన నాటి శేరిలింగంపల్లి తాసిల్దార్‌ శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లాకలెక్టర్‌.. రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు నివేదిక పంపించారు. దీంతో డిప్యూటీ కలెక్టర్‌/తాసిల్దార్‌ డీ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇక, వివాదంలో ఉన్న భూమి, ఎకరం విలువ పాతిక కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు.

ఢిల్లీలో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు... ఇప్పటివరకు 13మంది మృతి...

దేశ రాజధాని ఢిల్లీ రణరంగంగా మారింది. సీఏఏ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. సీఏఏ అనుకూల-వ్యతిరేక వర్గాల ఘర్షణల్లో ఇప్పటివరకు 13మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దాంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. అల్లర్ల నేపథ్యంలో, ఈశాన్య ఢిల్లీలో కర్ఫ్యూ విధించి, కనిపిస్తే ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఢిల్లీ-గజియాబాద్ రహదారిని మూసివేశారు. ఈశాన్య ఢిల్లీ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని పోలీసులు ఆదేశించారు. 13 పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. పది సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కేంద్ర బలగాలను మోహరించారు. అయితే, కేంద్ర బలగాలను పెద్దఎత్తున మోహరించినా, ఈశాన్య ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులు షాపులను, వాహనాలను తగలబెడుతున్నారు. ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారు. మౌజ్‌పుర్‌, జఫరాబాద్‌, చాంద్‌బాగ్‌, కరవాల్‌నగర్‌లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో డ్రోన్ల ద్వారా అల్లరి మూకలను గుర్తించి, వాళ్ల పని పట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. స్పెషల్ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాత్సను నియమించింది. ఢిల్లీలో పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా... అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు, ఈశాన్య ఢిల్లీలో ఈరోజు కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇవాళ జరగాల్సిన సీబీఎస్‌ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో, మీడియాకి కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ కీలక సూచనలు చేసింది. దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా ప్రోగ్రామ్స్‌ను, వీడియోలను ప్రసారం చేయొద్దని సూచించింది. అలాగే, ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించపర్చేలా ఉన్న వీడియోలు గానీ... పదాలను గానీ, టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్లే చేయకూడదని ఆదేశించింది. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదని కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ తన ప్రకటనలో తెలిపింది.

ఇచ్చినప్పుడే తీసుకుందాం.. తొందరేముంది? టీపీసీసీపై ఆశావహుల విచిత్ర కామెంట్స్ 

తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారధి ఎంపికపై అధిష్టానం నాన్చుతూ పోతోంది. అదిగో కొత్త సారధి... ఇదిగో న్యూ పీసీసీ చీఫ్ అంటూ కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్నా, హైకమాండ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా నిర్ణయం తీసుకోలేకపోతోంది. అధ్యక్ష పదవి నుంచి తాను తప్పుకుంటానంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించి ఐదారు నెలలు గడిచిపోతున్నా, కొత్త పీసీసీ చీఫ్‌ను మాత్రం నియమించలేకపోతోంది.  అయితే, మొన్నటివరకు పీసీసీ పదవి కోసం హోరాహోరీగా తలపడ్డ ఆశావహులు కూడా, హైకమాండ్ ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదన్న తరహాలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ మార్పు ఎప్పుడు ఉంటుంది, మిమ్మల్నే వరిస్తుందా? అంటూ ఆశావహులను ఎవరైనా అడిగితే, విచిత్రమైన సమాధానం చెబుతున్నారట. తొందరేముంది, ఇచ్చినప్పుడే తీసుకుందామంటూ ఆశావహులు వ్యాఖ్యానిస్తున్నారట.   సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లకు పైగా టైమున్నా, త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, హైదరాబాద్‌లో కాంగ్రెస్ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాలంటే పీసీసీ అధ్యక్షుడికి ఆర్ధిక భారం తప్పదు. ఒకవేళ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు వెంటనే పీసీసీని మార్చాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. దాంతో, అప్పుడే పీసీసీ పదవి ఎందుకనే భావనలో ఆశావహులంతా ఉన్నారని, అందుకే అధిష్టానంపైనా కూడా ఒత్తిడి తేవడం లేదని టీకాంగ్రెస్ నేతలు అంటున్నాయి. మొత్తానికి నిన్నమొన్నటివరకు పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా పోటీపడిన ఆశావహులంతా, ఇప్పుడు సడన్‌గా సైలెంట్ అయిపోవడంపై గాంధీభవన్‌లో చర్చించుకుంటున్నారు.

అమెరికా ప్రెసిడెంట్ టూర్ ఫుల్ సక్సెస్.. మళ్లీ వస్తానని చెప్పి వెళ్లిన ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ రెండ్రోజుల భారత పర్యటన విజయవంతమైంది. మొదటి రోజు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండైన దగ్గర్నుంచి.... తిరిగి అమెరికాకు పయనమయ్యేంతవరకు ట్రంప్‌కు అడుగడగునా ఘనస్వాగతం లభించింది. మొదటి రోజు అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి మొతెరా స్టేడియం వరకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పట్టగా, ఇక, మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‌ కార్యక్రమం అయితే... అమెరికా అధ్యక్షుడిని ఫుల్ ఖుషీ చేసింది. ట్రంప్ తోపాటు సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకాలు... అహ్మదాబాద్‌లో లభించిన అతిథి మర్యాదలకు ట్రంప్‌, మెలానియా ఉబ్బితబ్బిబైపోయారు. ఇక, తాజ్ అందాలను చూసి ట్రంప్ దంపతులు మైమరిపోయారు. ట్రంప్ కుమార్తె ఇవాంకా అయితే, తాజ్ అందాలకు ఫిదా అయిపోయారు. రెండు గంటలకుపైగా తాజ్ దగ్గర గడిపి తనివితీరా ఆస్వాదించారు. ఇక, రెండో రోజు రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్ దంపతులకు గ్రాండ్ వెల్‌కమ్‌ లభించింది. భారత త్రివిధ దళాల నుంచి ట్రంప్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం, రాజ్ ఘాట్‌లో గాంధీజీకి నివాళులర్పించి అక్కడ ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత, ట్రంప్-మోడీ మధ్య సుమారు రెండు గంటలపాటు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అనంతరం, మోడీ, ట్రంప్ కలిసి సంయుక్త సమావేశం నిర్వహించి ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందాలను వివరించారు.  ఇక, చివరిగా మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.... రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందు అనంతరం నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడ్నుంచి అమెరికా బయల్దేరారు. ఎయిర్‌ ఫోర్స్ వన్ ప్రత్యేక విమానంలో తిరుగుపయనమైన ట్రంప్, మెలానియా దంపతులకు కేంద్ర పెద్దలు వీడ్కోలు పలికారు.

ఉగాదికి పేదలకు ఇళ్ల స్ధలాల వ్యవహారంలో ట్విస్ట్.. రంగంలోకి జగన్ టీమ్

వచ్చే ఉగాది నాటికి ఏపీలో 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని పట్టుదలగా ఉన్న వైసీపీ సర్కారుకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. పలు జిల్లాల్లో ప్రభుత్వ స్ధలాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు స్దలాలను కొనుగోలు చేయడం, గతంలో ఇచ్చిన పట్టాలని రద్దు చేసి మరీ తాజాగా వాటిని సేకరించడం వంటి చర్యలకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో భూసేకరణ కోసం క్షేత్రస్ధాయికి వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. మరోవైపు సమయం కూడా తక్కువగా ఉన్నందున సమస్య పరిష్కారానికి సీఎం జగన్ నేరుగా సీఎంవోలోని తన టీమ్ ను రంగంలోకి దింపుతున్నారు. ఏపీలోని వివిధ జిల్లాలో దాదాపు పాతిక వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించి 25 లక్షల పేదలకు ఉగాది సందర్భంగా ఒక్కో సెంటు చొప్పున పంచేందుకు వైసీపీ సర్కారు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. నవరత్నాలు- పేదలకు ఇళ్ల స్ధలాలు పథకం కింద చేపడుతున్న ఈ కార్యక్రమానికి జిల్లాల్లో భూసేకరణలో పలు ఇబ్బందులు తలెత్తాయి. అనుకున్న స్ధాయిలో ప్రభుత్వ భూముల లభ్యత లేకపోవడంతో గతంలో పేదలకు ఇచ్చిన స్ధలాల్లో ఇళ్లు నిర్మించని వాటని వెనక్కి తీసుకుని తిరిగి వారికే ఇచ్చే కార్యక్రమానికి అధికారులు తెరలేపారు. దీంతో పేద ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతోంది. భూసేకరణ వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు క్షేత్రస్ధాయికి వెళుతున్న అధికారులకు ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. పలు జిల్లాల్లో రెవెన్యూ అధికారులపై ప్రజలు తిరగబడే పరిస్ధితి ఉండటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. మందుగా అనుకున్న ప్రకారం ఉగాది నాటికి భూసేకరణ పూర్తయితే కానీ పథకం అమలు చేయడం సాధ్యం కాదు. దీంతో తాజా పరిస‌్ధితిపై మంగళవారం జరిగిన స్పందన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన జగన్… క్షేత్రస్ధాయిలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి ఏకంగా సీఎంవోలోని తన టీమ్ ను రంగంలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. సీఎస్ నీలం సాహ్ని, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం, రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఇతర కార్యదర్శులు ధనుంజయ్ రెడ్డి, సాల్మన్ ఆరోక్య రాజ్ వంటి వారికి పలు జిల్లాల బాధ్యతలను సీఎం అప్పగించారు. నీలం, ప్రవీణ్ ప్రకాష్ లకు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను అప్పగించిన సీఎం... అజయ్ కల్లంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను, ఆరోక్య రాజ్ కు రాయలసీమ జిల్లాలను, ధనుంజయరెడ్డికి ఉత్తరాంధ్ర జిల్లాలను కేటాయించారు. ఆయా జిల్లాల్లో భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ఈ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేయడం వీరి బాధ్యత. మార్చి 1 నాటికి ఇళ్ల స్ధలాల కోసం భూములన్నీ పొజిషన్ లోకి తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ తన టీమ్ కు టార్గెట్ పెట్టారు. ప్లాట్లు మార్కింగ్ చేస్తే వెంటనే లాటరీ ద్వారా కేటాయించాలని వారికి సూచించారు. భూసేకరణలో జిల్లా కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ఎవరి ఉసురూ తగలకుండా చూడాలని సైతం సీఎం జగన్ కోరారు. కలెక్టర్లు ఉదారంగా వ్యవహరించాలని సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పదేపదే కోరారు.

విజయవాడలో ఐటీ పంజా.. కార్పోరేట్ హాస్పటల్స్ పై మెరుపు దాడులు

దేశవ్యాప్తంగా ఐటీ ఎగవేత దారులపై వరుస దాడులు నిర్వహిస్తున్న ఐటీ అధికారులు ఇవాళ విజయవాడలోని కార్పోరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా మెరుపు దాడులు చేపట్టారు. ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపిస్తున్న పలు కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో కార్పోరేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నగరంలోని విజయ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు పలుచోట్ల ఇవాళ ఐటీ దాడులు కొనసాగాయి. ఇందులో పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. రోగుల నుంచి లక్షలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేస్తన్న కార్పోరేట్ ఆస్పత్రులే లక్ష్యంగా ఇవాళ విజయవాడలో ఐటీ అధికారులు మెరుపు దాడలు చేపట్టారు. ఇందులో కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న పలు కార్పోరేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా ఎగవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్నిరోజులుగా వీరిపై నిఘా పెట్టిన ఐటీ బృందాలు ఇవాళ మెరుపు దాడులకు దిగాయి. దీంతో కార్పోరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఐటీ దాడుల్లో వివిధ ఆస్పత్రులకు సంబంధించిన కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇందులో ఆదాయపన్ను చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయంలో కోట్లాది రూపాయల ఆదాయం చూపుతున్నా పన్ను చెల్లించే సమయానికి తక్కువగా చూపుతున్నట్లు ఐటీ సోదాల్లో తేలింది. ఇవాళ ఉదయం నుంచి విజయవాడలోని పలు ఆస్పత్రుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఐటీ అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఐటీలో ఆదాయాన్ని తక్కువగా చూపుతున్న వారితో పాటు భవిష్యత్తులో రిటర్న్స్ దాఖలు చేయని ఆస్పత్రుల్లోనూ సోదాలు నిర్వహిస్తామని ఐటీ వర్గాలు వెల్లడించాయి.

అనుకున్నదొకటి అయిందొకటి.. రాజధాని తరలింపుతో వాళ్ళెంత నష్టపోయారు?

“చేసుకున్నోడికి చేసుకున్నంత మహాదేవా” అన్న సామెత అందరికీ తెలిసిందే..అచ్చు అలానే ఉంది కొందరి పరిస్థితి. మింగలేక కక్కలేక అన్నట్లుంది వారి స్థితి. పైకి చెప్పలేరు లోపల దాచుకోనూలేక సతమతం అవుతున్నారు. ఇంతకీ వీరెవరు అనుకుంటున్నారా? రాజధాని గ్రామాల ప్రజలు.. ఆ ప్రజల్లో కూడా 15 వేల కుటుంబాలు.. ఈ 15 వేల కుటుంబాల ప్రత్యేకత ఏమిటనుకుంటున్నారా? వీరంతా రెడ్లు.. అమరావతి నుంచి రాజధాని తరలిపోతే వీరంతా అక్కడ ఒక్క రోజు కూడా ఉండలేరు. జీవనోపాధి కోసం బయటకు వెళ్లాల్సిందే. ఏం చేయాలో అర్ధం కాక రెడ్లంతా జుట్టుపీక్కుంటున్నారు. పైకి విమర్శించలేరు. ఊరుకోనూ లేరు. అలా అని రాజధాని ఉద్యమంలో పాలుపంచుకోనూ లేరు..పాపం. అసలేం జరిగిందో చూద్దాం.. ఈ కుటుంబాలు రాజధాని గ్రామాలలో తరతరాలుగా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి ఇక్కడ ఎకరం నుంచి 20 ఎకరాల వరకూ భూములు ఉన్నాయి. ఇంతకాలం పంటలు పండించుకుంటూ సంతోషంగా ఉండేవారు. ఈ ప్రాంతానికి రాజధాని వస్తుందని వారు కూడా అనుకోలేదు. రాష్ట్ర విడిపోవడం రాజధాని రావడం జరిగిపోయింది. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ లో ఈ 15 వేల కుటుంబాలూ పాలు పంచుకున్నాయి. కొందరు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. మరికొందరు అన్ని బేరీజు వేసుకుని చివరిలో ఇచ్చారు. మరి కొందరు సగం భూమి అమ్ముకున్నారు.. సగం ఉంచుకున్నారు. ఎప్పుడైతే రాజధాని వచ్చేసి భూముల విలువ పెరిగిందో అప్పటికే రాజధాని కోసం భూములు ఇచ్చిన ఈ 15 వేల కుటుంబాలలోని వారు చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులుగా మారిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటే ఏదో కోట్ల రూపాయల టర్నోవర్ చేసేంత కాదు. తమకు పరిచయం ఉన్నవారి భూములు అమ్మిపెట్టడం, తమకు తెలిసిన వారు వస్తే భూములు కొనిపించడం.. మధ్య వర్తులుగా కొంత కమిషన్ తీసుకోవడం.. అంతే. ఏదోలా వ్యవసాయంపై తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకుంటూ సంతోషంగానే ఉన్నారు. ఇప్పుడు భూముల అమ్మకాలు కొనుగోళ్లు దాదాపుగా పూర్తి అయినందున ఫ్లాట్లు, ఇళ్లు అమ్మకాలపై వీరు ఆధారపడ్డారు. ఇంతవరకూ బాగానే ఉంది గత ఎన్నికల్లో వీరంతా చందాలు పోగేసుకుని మరీ వైసిపి అభ్యర్ధులను గెలిపించుకున్నారు. కమ్మ వాళ్ల రాజ్యం అంతరించిందని సంబరాలు చేసుకున్నారు. కట్ చేస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు వారికి తెలిసి వచ్చింది. 15 వేల కుటుంబాలకు చెందిన దాదాపు 60 నుంచి 70 వేల మందికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. దాదాపు 12 నుంచి 14 వేల ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చింది రెడ్డి కులస్తులే. ఇటు భూమీ పోయింది..అటు రియల్ ఎస్టేట్ వ్యాపారమూ పోయింది.. కమ్మ రాజ్యం అంతరించిందని, రెడ్డి రాజ్యం వచ్చిందని సంతోషించే లోపే వారి ఆనందం కూడా ఆవిరైంది. రెడ్డి రాజ్యాన్ని విమర్శిస్తే కమ్మోళ్ల దృష్టిలో చులకన అవుతామని, విమర్శించకపోతే జీవనోపాధి పోతోందని రెడ్లు అంతర్గతంగా కుమిలిపోతున్నారు.

ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జ్‌లకు స్వైన్ ఫ్లూ!

ఒక వైపు చైనా, కొరియా వంటి దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంటే, మరోవైపు మన దేశంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఈ వైరస్ కారణంగా హైదరాబాద్ లో ఓ మహిళ కూడా మృతి చెందింది. అయితే ఈ స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ ఈ సుప్రీం కోర్టుకూ తాకింది. తాజాగా ఆరుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఈ వైరస్ బారినపడ్డారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన అత్యవసర సమావేశం ఏర్పాటుచేయనున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. స్వైన్‌‌ఫ్లూ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా, న్యాయవాదులకు స్వైన్‌ఫ్లూ టీకాలు వేయించాలని నిర్ణయించినట్టు జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు.

ఏపీ రాజ్యసభ ఎన్నికల రేసులో అనూహ్యంగా కొత్త పేర్లు?

రాజ్యసభలో ఈ ఏడాది ఖాళీ అవుతున్న 55 స్ధానాల భర్తీ కోసం వచ్చే నెల 26న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్ధానాలకూ వచ్చే నెల 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నాలుగు స్ధానాలను అధికార వైసీపీ దక్కించుకునే అవకాశముంది. దీంతో ఆ పార్టీలో నాలుగు బెర్తుల కోసం గట్టి పోటీ నెలకొంది. వీటిని బీసీ, ఓసీ, ఎస్సీ, మైనారిటీలకు తలొకటి చొప్పున కేటాయించాలని సీఎం జగన్ గతంలో నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో తీవ్ర పోటీ కారణంగా మార్పులు చేర్పులు తప్పవని భావిస్తున్నారు. ఏపీ నుంచి ఈసారి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్ధానాల కోసం అధికార వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చి హామీలు, సామాజిక సమీకరణాలు, పార్టీ విదేయత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నాలుగు బెర్తులకు అభ్యర్ధులను ఖరారు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ నాలుగు సీట్ల కోసం పార్టీలో పలువురు సీనియర్లతో పాటు సామాజిక వర్గాల వారీగా చాలా మంది రేసులో ఉన్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం మేరకు శాసనమండలి రద్దుతో మంత్రి పదవులు కోల్పోతున్న సీఎం జగన్ సన్నిహిత మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీనియర్లు వైవీ సుబ్బారెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆయన బావ అయోధ్య రామిరెడ్డి వంటి వారు ఉన్నారు. అలాగే బీజేపీ కోటాలో ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజుకు అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. బీసీ కోటాలో నెల్లూరు జిల్లాలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావుకు ఓ బెర్తు దక్కనున్నట్లు తెలుస్తోంది. అలాగే మైనారిటీ కోటాలో వైసీపీ డాక్టర్ల విభాగం అధ్యక్షుడు మహబూబ్ పేరు వినిపిస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న మహబూబ్ కు ఈసారి రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎంపిక చివరి నిమిషంలో సమీకరణాల ఆధారంగా ఉండొచ్చనే వాదన కూడా ఉంది. మండలి కోటాలో మంత్రులుగా ఉన్న మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లలో ఒకరికి రాజ్యసభ ఇచ్చి మరొకరికి ప్రాంతీయ అభివృద్ధి మండలి ఛైర్మన్ పదవి కట్టబెట్టొచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరో వారం రోజుల్లో తుది నాలుగు పేర్లను జగన్ ఖరారు చేసే అవకాశముంది.

ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదు!!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, రాష్ట్రపతి భవన్ లో ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ విందుకు కేరళ, ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం అందకపోవడంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. కాగా దీనిపై తాజాగా మాజీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆర్థిక నేరగాడు కాబట్టే ట్రంప్ పర్యటనకు జగన్‌ను పిలవలేదని చంద్రబాబు ఆరోపించారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యకర్తలతో ఈరోజు చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. టీడీపీ హయాంలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయని, వైసీపీ హయాంలో అవన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. జగన్ సైకో లాగా మారిపోయారన్నారు. తనపై కక్షతో కుప్పంకు నీళ్లు రానివ్వకుండా చేస్తున్నారని మండిపడ్డారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నింటినీ ఆపేశారన్నారు. అమరావతి, అభివృద్ధి కోసం యువత పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

భారత్-అమెరికా మధ్య రూ.21 వేల కోట్ల విలువైన ఒప్పందం!!

ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ కీలక చర్చలు జరిపారు. పలు ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేశారు. చర్చల అనంతరం.. ట్రంప్‌-మోదీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ.. తన భారత పర్యటన ఎంతో ప్రత్యేకమైనదని, ఈ పర్యటన జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. భారత్-అమెరికా మధ్య రూ.21 వేల కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. దీనివల్ల ఇరు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. భారత్ కు అత్యంత అధునాతనమైన అపాచీ, ఎంహెచ్ 60 రోమియో హెలికాప్టర్లను అందజేయనున్నామని తెలిపారు. ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలకమైన ఒప్పందాలపై అవగాహనకు వచ్చామని ట్రంప్ చెప్పారు. 5జీ వైర్ లెస్ నెట్ వర్క్ పై చర్చించామని తెలిపారు. ఇండో– పసిఫిక్ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలపై చర్చించామన్నారు. భారత్ కు పెద్ద మొత్తంలో సహజ వాయువు (ఎల్ఎన్ జీ) సరఫరాకు సంబంధించి కూడా ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇస్లామిక్ తీవ్రవాదం నుంచి ఇరు దేశాల పౌరులకు భద్రత కల్పించుకునే విషయంపైనా చర్చించామని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ట్రంప్ చెప్పారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ట్రంప్‌కు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్‌ సతీసమేతంగా భారత్‌ రావడం ఆనందం కలిగించిందని, గత 8 నెలల్లో తానూ, ట్రంప్‌ 8 సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు. అమెరికా-భారత్‌ మధ్య స్నేహ బంధం పెరిగిందని, ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని అన్నారు. రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని మోదీ పేర్కొన్నారు.

ఇన్ని నెలల తరువాత ప్రజా వేదిక ఫర్నీచర్ వేలం!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేసిన విషయం తెలిసిందే. ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి పక్కనే ఉన్న ప్రజా వేదిక అక్రమ నిర్మాణం అని కూల్చివేసింది ఏపీ సర్కార్. ప్రభుత్వ కార్యాకలాపాలకు వినియోగించుకోవాలని పలువురు సూచించినా వినకుండా జగన్ సర్కార్ ప్రజావేదికను కూల్చి వేసింది. అప్పట్లో ఇది హాట్ టాపిక్ అయింది. అయితే కూల్చివేసిన ఎనిమిది నెలల తరువాత ప్రజావేదిక మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ప్రజా వేదికకి సంబంధించిన సామాగ్రిని వేలం వేయాలని సీఆర్‌‌డీఏ నిర్ణయించింది. ప్రజావేదిక కూల్చివేత తర్వాత.. అక్కడ ఉన్న కూలర్లు, ఏసీలు, ఫర్మీచర్ ఇతర విలువైన సామాగ్రిని అధికారులు పక్కన పెట్టేసారు. అయితే ఇప్పుడు ఆ పరికరాలను రక్షించడంలో ఇబ్బందులు కలుగడంతో పాటు, ఆ పరికరాలను స్టోర్ చేస్తే పాడైపోయే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. దీంతో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. సీఆర్డీఏ ప్రజావేదిక సామాగ్రిని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఆసక్తి ఉన్న బిడ్డర్లు వచ్చే మర్చి మూడో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మార్చి 4న వేలం నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రజా వేదిక సామగ్రిని వేలం వేయాలన్న నిర్ణయంపై టీడీపీ సీనియర్‌‌ నాయకుడు నక్కా ఆనంద్ బాబు స్పందించారు. ప్రజా వేదిక కూల్చివేసిన 8 నెలల తర్వాత అందులోని సామగ్రిని వేలం వేయడాన్ని ఆయన తప్పుబట్టారు. కూల్చిన వెంటనే ఈ పని చేస్తే కొన్ని కోట్ల రూపాయలైనా వచ్చేవన్నారు. ఇప్పుడు అందులో పది శాతం కూడా రాదని నక్కా ఆనంద్ బాబు అభిప్రాయపడ్డారు.

ఇప్పటిదాకా తీసుకున్న జీతం కట్టి పోండి.. గ్రామ సచివాలయ ఉద్యోగులకు షాక్!!

మీరు గ్రామ, వార్డు సచివాలయంలో ఉద్యోగా?.. మీకు అంతకన్నా మెరుగైన ఉద్యోగం వచ్చిందని రాజీనామా చేయాలనుకుంటున్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్. మీరు కేవలం రాజీనామా లేఖ ఒక్కటే ఇస్తే సరిపోదు. సచివాలయ ఉద్యోగానికి ఎంపికైన తరువాత శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం చేసిన ఖర్చు, తీసుకున్న వేతనాలను తిరిగి చెల్లించాలి. అప్పుడే అధికారులు రాజీనామాను ఆమోదిస్తారు. లేదంటే మెరుగైన ఉద్యోగాన్ని వదులుకొని, సచివాలయ ఉద్యోగిగా మిగిలిపోక తప్పదు.    అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నేవారిపల్లి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన మహేశ్వర్ రెడ్డికి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన తనకు రైల్వేలో ఉద్యోగం వచ్చిందని ఆ వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అయితే ఆయన శిక్షణ కోసం ఖర్చు చేసిన రూ.2 వేలు, 3 నెలల 25 రోజులకు చెల్లించిన వేతనం కలిపి మొత్తం రూ.57,095 తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేసిన తరువాత మాత్రమే రాజీనామా ఆమోదం తెలుపుతామని అధికారులు చెప్పినట్టు సమాచారం. ఇక, విజయనగరం జిల్లా గజపతినగరం మండలం కొత్తబగ్గం, గంట్యాడ మండలం కొర్లాం గ్రామ సచివాలయాల్లో ఇద్దరు డిజిటల్ అసిస్టెంట్లు.. మెరుగైన ఉద్యోగాలు వచ్చాయని రాజీనామాలు చేశారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత ఎంపీడీవోలకు లేఖ రాస్తూ.. ఉద్యోగానికి రాజీనామాలు చేసిన ఇద్దరూ ఇప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలు, ఇతర అలవెన్సులు సంబంధిత శాఖలకు జమ చేసిన తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విశాఖ వైపే ఏపీ సర్కారు అడుగులు.. మిలీనియం టవర్స్ లో ఐటీ సంస్ధలకు సాయిరెడ్డి బెదిరింపులు?

విశాఖలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారు అందుకు అనుగుణంగా చకచకా పావులు కదుపుతోంది. విశాఖలోని రుషికొండ వద్దనున్న మిలీనియం టవర్స్ ను తొలుత రాష్ట్ర సచివాలయంగా ఎంపిక చేసిన ప్రభుత్వం ఆ తర్వాత దీనిపై ఆలోచనలో పడింది. అయితే తాజాగా వైసీపీలో నంబర్ టూగా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మిలీనియం టవర్స్ కు వెళ్లి అక్కడ ఉన్న ఐటీ కంపెనీ కాడ్యుయెంట్ ను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత విశాఖపట్నం నుంచి పాలన సాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారు అందుకు తగిన స్ధలాల కోసం నగరంలో అన్వేషణ సాగిస్తోంది. అదే సమయంలో రుషికొండలోని మిలీనియం టవర్స్ లో ఉన్న పలు ఐటీ సంస్ధలను బెదిరించి బయటికి పంపుతున్నారన్న విమర్శలను నిజం చేస్తూ కాడ్యుయెంట్ ఐటీ కంపెనీ పెద్దలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా బెదిరించినట్లు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో సాయిరెడ్డి మిలీనియం టవర్స్ కు వచ్చారు. దాదాపు 2000 మంది ఉద్యోగుల‌తో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ఏకైక ఐటీ కంపెనీ కాడ్యుయెంట్లోకి విజ‌య‌సాయిరెడ్డి నేరుగా వెళ్లారు. కాడ్యుయెంట్ కంపెనీని ఇక్క‌డి నుంచి త‌ర‌లిస్తే మీకేంటి అభ్యంత‌రం అంటూ ప్ర‌శ్నించారు. ఉద్యోగులు ఇక్క‌డ మాకు చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంద‌ని చెప్పారు. ఉద్యోగుల‌తో నేరుగా కంపెనీ ఖాళీ చేయ‌క‌పోతే, చేయిస్తామ‌నే అర్థం వ‌చ్చేలా న‌ర్మ‌గ‌ర్భంగా హెచ్చ‌రించేందుకే తాను ఆక‌స్మికంగా వ‌చ్చాననే సంకేతాలిచ్చారు. దీంతో కాడ్యుయెంట్ ఉద్యోగుల్లో అల‌జ‌డి ప్రారంభమైంది. కాసేపటి తర్వాత కంపెనీ పెద్దలను కలిసిన సాయిరెడ్డి.. అక్కడి నుంచి ఖాళీ చేస్తే పరిసరాల్లో వేరే చోట స్ధలం కేటాయిస్తామంటూ కాడ్యుయెంట్ యాజమాన్యానికి ఆఫర్ ఇచ్చారు. అయితే తమకు ఇక్కడే సౌకర్యవంతంగా ఉంటుందని కంపెనీ యాజమాన్యం, ఉద్యోగులు సాయిరెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మిలీనియం టవర్ ఖాళీ చేయకుంటే తామే చేయిస్తామనే అర్దం వచ్చేలా వారికి సాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చి వెనుదిరిగారని సమాచారం. మరోవైపు తాజాగా విశాఖలో పర్యటించిన ఇద్దరు మంత్రులు మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు వార్తలను ఖండించారు. అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. సచివాలయం కోసం మిలీనియం టవర్స్ లోని ఐటీ సంస్ధలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలను కూడా వారు తోసిపుచ్చారు. ఇది జరిగిన కొన్ని రోజులకే సాయిరెడ్డి అక్కడికి వెళ్లి కాడ్యుయెంట్ సంస్ధ ఉద్యోగులను బెదిరించారన్న వార్తలు స్ధానికంగా కలకలం రేపుతున్నాయి.

జగన్ సర్కార్ కి గట్టి షాక్.. కృష్ణకిషోర్ సస్పెన్షన్ రద్దు చేసిన క్యాట్!

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్ వ్యవహారంలో ఏపీ సర్కారుకు క్యాట్ లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలపై కృష్ణకిషోర్ ను విధుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఇవాళ క్యాట్ కొట్టేసింది. అంతే కాకుండా కృష్ణ కిషోర్ ను కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతిస్తూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కృష్ణకిషోర్ పై ఉన్న కేసును చట్టపరంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉందని క్యాట్ తన ఆదేశాల్లో పేర్కొంది. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవోగా వ్యవహరించిన ఐఆర్ఎస్ అధికారి కృష్ణ కిషోర్ ను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేసింది. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ అచ్చిన నివేదిక ఆధారంగా కృష్ణకిషోర్ అవినీతికి పాల్పడినట్లు నిర్ధారించి ప్రభుత్వం గతంలో సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈవోగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ అనుమతి లేకుండా కోట్లాది రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేశారని కృష్ణకిషోర్ పై ఆరోపణలు వచ్చాయి. వీటని విచారించిన ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని కృష్ణ కిషోర్ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ లో సవాలు చేశారు. విచారణ జరిపించిన క్యాట్ సస్పెన్షన్ ఆదేశాలను రద్దు చేయడంతో పాటు కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లేందుకు అనుమతి కూడా ఇచ్చింది. అదే సమయంలో కృష్ణ కిషోర్ పై నమోదైన కేసును చట్టప్రకారం విచారించుకోవచ్చని స్పష్టం చేసింది.

అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏపీ రాజధాని అమరావతిలోని సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో పేదలకు ఇళ్లస్ధలాలు ఇచ్చేందుకు వీలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 54 వేల 307 మంది పేదలకు అవసరమైన 1251.5 ఎకరాలను ఉగాది నాటికి ఇళ్లస్ధలాలుగా పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటి ప్రకారం విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల, పెదకాకాని మండలాల్లో ఉన్న ప్రజలకు రాజధానిలోని మందడం, నిడమర్రు, కురగల్లు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నవులూరు గ్రామాల్లో స్ధలాలు పంపిణీ చేయనున్నారు. అమరావతి రాజధాని రైతులకు ఏపీ సర్కారు మరో చేదు కబురు అందించింది. ఇప్పటికే రాజధాని తరలింపు నేపథ్యంలో ప్రతీ రోజూ ఆందోళనలకు దిగుతున్న రాజదాని ప్రాంత రైతులకు వారు ప్రభుత్వానికి గతంలో అప్పగించిన భూములను తిరిగి పేదలకు పంచాలని సర్కారు నిర్ణయించడం మింగుడు పడని వ్యవహారమే.  నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఒక్కొక్కరికి ఒక్కో సెంటు స్ధలం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కార్పోరేషన్ పరిధిలోని 28, 952 మంది, తాడేపల్లి మండలంలోని 11,300 మందికి, మంగళగిరి మండలంలోని 10,247 మందికి, దుగ్గిరాలలో 2500 మందికి, పెదకాకానిలో 1308 మందికి ప్రభుత్వం ఉగాది రోజు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయబోతోంది.

రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

ఏప్రిల్‌లో ముగియనున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 17 రాష్టాల నుంచి 55 మంది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు  ఎన్నికలు జరుగనున్నాయి.  ఏపీ నుంచి ఎమ్.ఏ ఖాన్, సుబ్బిరామిరెడ్డి, కేశవరావు, తోట సీతారామలక్ష్మి.. తెలంగాణ  నుంచి కేవీపీ, గరికపాటి మోహన్ రావు  రిటైర్ కానున్నారు.  మార్చి 6న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నామినేషన్లకు తుదిగడువు. మార్చి 16న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు మార్చి 18 వ తేదీ. మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహించనున్నారు.

మోడీ... ట్రంప్... ఇద్దరూ ఇద్దరే... ఇద్దరికీ దేశ ప్రయోజనాలే ముఖ్యం..

అమెరికా అధ్యక్షులు ఇండియాలో పర్యటించడం కొత్తేమీ కాదు. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి సగటున పదేళ్లకొకరు చొప్పున అమెరికా అధ్యక్షులు ఇండియాలో పర్యటిస్తూనే ఉన్నారు. ఒబామా అయితే తన పదవీ కాలంలో రెండుసార్లు భారత్ లో పర్యటించారు. అమెరికా అధ్యక్షులు ఎప్పుడు పర్యటించినా ...అవి రెండు దేశాల్లో పెద్దగా సంచలనాలు సృష్టించిన దాఖలాలు లేవు. తాజాగా ట్రంప్ పర్యటన మాత్రం అమెరికా గత అధ్యక్షుల పర్యటనలకు భిన్నంగా జరిగింది. పర్యటన గురించి రెండు దేశాల్లోనూ ఎంతో హైప్ క్రియేట్ అయింది. భారీ స్థాయి వాణిజ్య ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని అమెరికాలో ప్రచారం భారీగా జరిగింది. అయితే, భారీ వాణిజ్య ఒప్పందాలేవీ లేవని....రక్షణ ఒప్పందాలు మాత్రమే ఉంటాయని తేలిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్ ప్రధాని మోడీ ఇద్దరూ జాతీయవాదానికి పట్టంకట్టే నాయకులే. దేశ ప్రయోజనాలే వీరిద్దరికీ ముఖ్యం. అందుకే, ఒకరికొకరు నచ్చినట్లుగా ఉంది. కరచాలనం చేసుకోవడం మొదలుకొని ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం, భుజాలు తట్టుకోవడం దాకా వారు ప్రదర్శించే ధోరణి, హావభావాలు అన్నీ కూడా ఒకరి పట్ల మరొకరికి గల స్నేహభావాన్ని సూచిస్తుంటాయి. ఈ స్నేహం వ్యక్తిగతం మాత్రమే....దేశ ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి ఎవరికి వారు తమ దేశ ప్రయోజనాలకే కట్టుబడి ఉంటారు. అమెరికా ప్రతిపాదించిన రీతిలో సుంకాలు తగ్గించేందుకు, భారీగా మాంసం, పాలు, వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు మోడీ నిరాకరించారు. దాంతో వాణిజ్య ఒప్పందాల అంశాన్ని  అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాయిదా వేసుకున్నారు. ఆ విషయం గురించి అమెరికా అధ్యక్ష ఎన్నికల అంశం తరువాత ఆలోచిద్దామన్నారు. ఇక్కడే అసలు విషయం అందరికీ అర్థమైపోయింది. మోడీ పర్యటన కారణంగా భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఏర్పడింది. మరీ ముఖ్యంగా రక్షణ ఒప్పందాలు కుదరడం అంటే పాకిస్థాన్ కు భారత్ ఓ హెచ్చరిక సంకేతం పంపడమే. అయితే ఇలాంటి హెచ్చరిక సంకేతాలతో అటు పాకిస్థాన్ కు కూడా ఆయుధాలు విక్రయించి అమెరికా సొమ్ము చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ దఫా అమెరికా అలాంటి ఎత్తుగడతో వచ్చిందనుకోలేం. భారత్ ప్రపంచంలోని ముఖ్యమైన ఆర్థిక, సైనిక శక్తుల్లో ఒకటిగా మారుతోంది. గతంలో మాదిరిగా అమెరికా డబుల్ గేమ్ ఆడే అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరో వైపున అమెరికా, భారత్ వాణిజ్యబంధం కూడా పెరిగిపోతున్నది. మొన్నటి వరకూ భారత్ కు చైనా అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉండింది. ఇప్పుడు ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమిస్తోంది. 2019లో  ఏప్రిల్ నుంచి  డిసెంబర్ మధ్య కాలంలో భారత్ చైనా వ్యాపారం 65 బిలియన్ డాలర్లుగా ఉండింది. అదే సమయంలో అమెరికాతో వాణిజ్యం 68 బిలియన్ డాలర్లకు చేరుకుంది. రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగడం ఇప్పటికైతే హర్షదాయకమే. అమెరికా ఎన్నికల అనంతరం మాత్రం సుంకాల తగ్గింపు విషయంలో భారత్ పై అమెరికా ఒత్తిళ్లు తెచ్చే అవకాశం ఉంది. అలాంటి ఒత్తిళ్లను తట్టుకునేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి.  అమెరికా, భారత్......ఈ రెండు దేశాలకూ ఉగ్రవాదం ప్రధాన శత్రువుగా ఉంది. ఉగ్రవాదం అంతు చూడడంలో అమెరికా కఠినంగానే వ్యవహరిస్తోంది. భారత్ కు కావాల్సింది కూడా అదే. ఈ నేపథ్యంలో ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా, ఇండియా మధ్య స్నేహసంబంధాలు ఎంతో కీలకం. నాయకుల రాజకీయ ప్రయోజనాలు మాట అటుంచి....రెండు దేశాల మధ్య వాణిజ్య, రక్షణ ఒప్పందాలు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. కాకపోతే అవి ఉభయతారకంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నాయకుల మధ్య, దేశాల మధ్య స్నేహం పదికాలాల పాటు నిలుస్తుంది.

వర్షిత కేసులో సంచలన తీర్పు... మానవ మృగం రఫీకి ఉరిశిక్ష...

ఆరేళ్ల చిన్నారి వర్షిత హత్యాచారం కేసులో చిత్తూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషికి ఉరిశిక్ష విధించింది. వర్షిత కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు.... 17 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను రుజువు చేయడంలో పోలీసులు విజయవంతం కావడంతో దోషి మహ్మద్ రఫీకి మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. 2019, నవంబరు ఏడున చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుంటపాలేనికి చెందిన ఆరేళ్ల వర్షిత... తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వచ్చింది. అయితే, పెళ్లి వేడుకలో పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా, లారీ క్లీనర్ మహమ్మద్ రఫీ కన్ను ఆ చిన్నారిపై పడింది. మాయ మాటలు చెప్పి వర్షితను ఎత్తుకెళ్లిన మహ్మద్ రఫీ... దూరంగా తీసుకెళ్లి అత్యాచారంచేసి చంపేశాడు. అయితే, వర్షిత కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు ఆ ప్రాంతమంతా వెదికారు. కానీ, ఎక్కడా కనిపించలేదు. తెల్లారిన తరువాత మ్యారేజ్ ఫంక్షన్ వెనుక నిర్జీవంగా మారిన వర్షిత కనిపించింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా మానవ మృగం మహ్మద్ రఫీని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. 17 రోజుల్లోనే ఛార్జిషీట్ దాఖలు చేశారు. నేరం రుజువు చేసేందుకు పలు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. రఫీ పదిహేనేళ్ల  వయస్సులోనే పదో తరగతి విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దాంతో, జువైనల్ హోంలో శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. అయితే, ఏడాది క్రితం 12ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని గ్రామస్థులు దేహశుద్ది చేశారు. ఈ కేసులో 45మంది సాక్షులను విచారించిన చిత్తూరు కోర్టు...తగిన సాక్ష్యాధారాలు రుజువు కావడంతో రఫీకి ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఉరిశిక్ష తేదీని హైకోర్టు నిర్ణయిస్తుందని జడ్జి తెలిపారు. అయితే, మానవ మృగం రఫీకి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు తీర్పు వెలువరించడంతో చిన్నారి వర్షిత ఇంటి దగ్గర బంధువులు, గ్రామస్తులతోపాటు చిన్నారి చదివిన పాఠశాల విద్యార్ధులు సంబరాలు జరుపుకున్నారు.