కేసీఆర్ పై రగిలిపోతున్న ఉద్యోగులు.. మాటిచ్చి తప్పారంటూ నిప్పులు...

పీఆర్సీ ఆలస్యంపై తెలంగాణ ఉద్యోగులు రగిలిపోతున్నారు. పీఆర్సీ గడువు దాటిపోయి ఇప్పటికే 20 నెలలు గడిచిపోగా, మరోసారి వేతన సవరణ కమిషన్ గడువును పెంచడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం ఆశించినస్థాయిలో, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం అదనపు గంటలు పనిచేస్తున్నా, పీఆర్సీపై ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వేతన సవరణ కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు... మొన్నటి మంత్రివర్గ సమావేశం తర్వాత ప్రకటన వస్తుందని ఆశించారు. అయితే, వేతన సవరణ కమిషన్‌ గడువును వరుసగా మూడోసారి పొడిగించడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే పీఆర్సీ ఆలస్యమైందని, ఇప్పుడు కమిషన్ గడువును ఈ ఏడాది డిసెంబర్ 31వరకు పొడిగించమేంటని మండిపడుతున్నారు. గడువు ప్రకారం 2018 జులై ఫస్ట్‌ నుంచి పీఆర్పీ అమలు కావల్సి ఉంది. అయితే, 2018 ఆగస్టులో వేతనాలు పెంచుతామంటూ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు, కానీ, ఇఫ్పటివరకు కార్యరూపం దాల్చలేదు. అయితే, కాస్త ఆలస్యమైనా, ఉద్యోగులు ఆశించినదాని కంటే ఎక్కువగానే పీఆర్సీ ప్రకటిస్తారని మంత్రులు అంటున్నారు. అయితే, తెలంగాణ పునర్ నిర్మాణం కోసం అదనపు గంటలు పనిచేస్తున్నామంటోన్న ఉద్యోగులు... పీఆర్సీ విషయంలో ఆలస్యం చేస్తూ నిరాశపర్చొద్దని అంటున్నారు.

శత్రు దుర్బేధ్యం ట్రంప్ కారు.. బీస్ట్ ప్రత్యేకతలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే...

అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కోసం అహ్మదాబాద్‌, ఆగ్రా, ఢిల్లీలో కట్టుదిట్టమైన కేంద్ర ప్రభుత్వం.... భద్రతా ఏర్పాట్లు చేసింది. అయితే, ట్రంప్ పర్యటించనున్న ప్రాంతాలను అమెరికా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే, భారత పర్యటనలో ట్రంప్ వినియోగించే కాన్వాయ్ లో, బీస్ట్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన బీస్ట్‌ కారు ప్రత్యేకతలు మీకోసం. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే బీస్ట్ కారును కాడిలాక్ వన్, ఫస్ట్ కార్ అని పిలుస్తారు. అమెరికా మాజీ ప్రెసిడెంట్ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా ఉండేలా రూపొందించారు. అయితే ట్రంప్ కాన్వాయ్‌లో ఏకంగా12 బీస్ట్ కార్లుంటాయి. ప్రపంచంలోని ఏ మూలకు ట్రంప్ వెళ్లినా.... ఈ బీస్ట్ కార్లు వెంట నడవాల్సిందే. ఈ కారు అద్దాలు 5 అంగుళాల మందం కలిగిన స్టీల్‌, అల్యూమినియం, టైటానియం, సిరామిక్స్‌తో తయారు చేస్తారు. దాంతో, ఎలాంటి బాంబు పేలుళ్లనైనా ఈ కారు తట్టుకుంటుంది. అంతేకాదు, అత్యంత విలాసవంతమైనది. భద్రతాపరంగా శత్రుదుర్బేధ్యంగా ఉంటుంది. ఇక, కారు టైర్లు ఎట్టి పరిస్థితుల్లో పంక్చర్‌ అవకుండా ఉండేలా ఉక్కు కలిపి ప్రత్యేకంగా తయారు చేస్తారు. టైర్​పేలినప్పటికీ రిమ్‌తోనూ కారు నడవగలుగుతుంది. బోయింగ్‌ 757 విమానానికి ఉండే డోర్లు బీస్ట్‌ కారుకు ఉంటాయి. ఇక, ట్రంప్ ప్రయాణించే కారులో ఆయుధాలు అమర్చి ఉంటాయి. దాడి జరిగితే కారు కిటికీ అద్దాలే ఆయుధాలుగా మారిపోతాయి. అవసరమైతే బుల్లెట్ల వర్షాన్ని కురిపిస్తాయి. అలాగే, గ్యాస్‌, రసాయనాల వంటివి కూడా లోపలికి వెళ్లకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే భాష్పవాయువును ప్రయోగించవచ్చు అంతే కాకుండా రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నైట్ విజన్ కెమెరాల ద్వారా స్పష్టంగా కనిపించే సదుపాయం కూడా ఉంది. కారులో డ్రైవర్‌, సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌ మాత్రమే ఉంటాడు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా కారును నడిపేలా వీరికి శిక్షణ ఇస్తారు. ఒక్కసారిగా 180 డిగ్రీల కోణంలోనూ తిరగగలదు ఈ కారు. డ్రైవర్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉండే జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ..సమాచార కేంద్రానికి అనుసంధానమై ఎప్పటికప్పుడు వివరాలందిస్తుంది. నేరుగా వైస్ ప్రెసిడెంట్, పెంటగాన్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు.  ఇక, కారు డీజిల్‌ ట్యాంక్‌ ఏ పరిస్థితుల్లోనూ పేలకుండా ఉండేలా ప్రత్యేకమైన రక్షణ కవచం ఉంటుంది. అధ్యక్షుని సీటు వద్దే శాటిలైట్‌ ఫోన్‌, అగ్నిమాపక వ్యవస్థ ఉంటుంది. ఇక వెనుక భాగంలో అధ్యక్షుడితో పాటు మరో నలుగురు కూడా కూర్చోవచ్చు. లోపలి భాగం గాజుతో వేరుచేసి ఉంటుంది. దీన్ని అధ్యక్షుడు మాత్రమే కిందికి దించే వీలుంది. మొత్తానికి, శత్రుదుర్బేధ్యంగా ఉండే బీస్ట్ కారు.... ఎలాంటి దాడులనైనా తట్టుకోవడమే కాకుండా, మినీ వైట్ హౌస్ గా పనిచేయనుంది.

ఎగిరే శ్వేతసౌథం... ఎయిర్ ఫోర్స్ వన్... ఇది మామూలు విమానం కాదు...

అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఎయిర్‌ఫోర్స్‌ విమానంలోనే వెళ్తారు. అయితే, ఎగిరే శ్వేతసౌథంగా చెప్పుకునే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, విలాసవంతమైన విమానం. మాజీ అధ్యక్షులు వినియోగించిన ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ తో పోలిస్తే, ఇఫ్పుడు ట్రంప్ కోసం వినియోగిస్తున్న బోయింగ్ 747-200బీ విమానం మరింత శక్తివంతమైనది. అంతేకాదు, అతిపెద్ద అధ్యక్ష విమానం కూడా ఇదే. అత్యంత లాంగ్ రేంజ్ విమానం కూడా ఇదొక్కటే.  గగనతలంలో ఇంధనం నింపే సౌకర్యం ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ఉంటుంది. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ఫ్లోర్‌ స్పేస్‌ ఉంటుంది. దీనిని మూడు భాగాలుగా విభజించి కాన్ఫరెన్స్‌ హాల్‌, డైనింగ్‌ రూమ్‌, అధ్యక్షుడు, అతని సతీమణికి ప్రత్యేక గదులు, సీనియర్‌ స్టాఫ్‌కు ప్రత్యేక గదులు, వైద్య అవసరాల నిమిత్తం ప్రత్యేక గది, అధ్యక్షుడి సలహాదారులకు, ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ ఉద్యోగులకు, మీడియాకు ఇలా వేరువేరు గదులు ఉంటాయి. ఒకేసారి 100 మంది భోజనం చేసే విధంగా ప్రత్యేక డైనింగ్‌ సదుపాయం కలదు. భద్రత విషయానికొస్తే అధునాతన సెక్యూరిటీ టెక్నాలజీ దీని సొంతం.  ఎయిర్‌ ఫోర్స్‌వన్‌ విమానంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియో వ్యవస్థ ఉంటుంది. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌పై దాడులు జరిగితే మొబైల్‌ కమాండ్‌ సెంటర్‌గా పనిచేస్తుంది. హాల్‌ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ కోసం మల్టీ ఫ్రీక్వెన్సీ రేడియోలు ఉంటాయి. ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం రెక్కల పొడవు 195 అడుగులు కాగా.. ఇది టేకాఫ్‌ తీసుకునేటపుడు మోయగలిగే బరువు 8లక్షల 33వేల పౌండ్లు ఉంటుంది. ఇక, అమెరికా అధ్యక్షుడి నివాసం శ్వేతసౌధంలో ఉండే, సకల సౌకర్యాలు, భద్రతా వ్యవస్థా ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ లో ఉంటాయ్. అందుకే, ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ను ఎగిరే శ్వేత సౌధంగా పిలుస్తారు.

తెలంగాణ ఆర్టీసీలో నిధుల గోల్‌మాల్‌..! ఆడిటింగ్ లో బయటపడుతోన్న అక్రమాలు

తెలంగాణ ఆర్టీసీ సమ్మె సమయంలో భారీగా నిధుల గోల్‌మాల్‌ జరిగినట్టు తేలింది. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిన అధికారులు... పెద్దఎత్తున డబ్బును పక్కదారి పట్టించినట్లు ఆడిటింగ్ లో గుర్తించారు. అయితే, నచ్చిన రూట్లలో బస్సులను నడిపించి డబ్బులు నొక్కేశారన్న మాటలు సమ్మె సమయంలోనే వినిపించాయి. దాంతో, సమ్మె కాలంలో జరిగిన అక్రమాలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సుమారు రెండు నెలలపాటు జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో, ప్రజలకు ఇబ్బంది కలుగకుండా, మొదట టికెట్లు లేకుండానే బస్సులను నడిపించారు. ఆ, తర్వాత ప్రింటెడ్‌ టికెట్లతో సర్వీసులను రన్ చేశారు. అయితే, సమ్మె కాలంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఆడిటింగ్ విభాగం ఎంక్వైరీ చేపట్టింది. దాంతో, సమ్మె కాలంలో నడిపిన సర్వీసుల ఆదాయ వ్యయాల్లో భారీ తేడాలను ఆడిటింగ్ విభాగం గుర్తించింది. ఆ డబ్బుంతా డిపో స్థాయి అధికారుల జేబుల్లోకి వెళ్లాయనే మాటలు వినిపిస్తున్నాయి. సమ్మె తర్వాత ఆర్టీసీలో సమూల ప్రక్షాళన చేపట్టిన ఉన్నతాధికారులకు... ఆడిటింగ్‌లో బయటపడుతున్న అక్రమాలను చూసి కంగుతింటున్నారు. సమ్మెకాలంలో ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్లే పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందని అంటున్నారు. అయితే, అధికారుల చేతివాటం రుజువైతే మాత్రం కఠిన చర్యలు తప్పవని మంత్రి పువ్వాడ అజయ్‌ హెచ్చరిస్తున్నారు.   అయితే, సమ్మెకాలంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు ఇస్తామన్న డబ్బు కూడా ఇవ్వకుండా, డిపో స్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడ్డారని యూనియన్ నేతలు అంటున్నారు. అంతేకాదు, ఆర్టీసీ సమ్మె కాలంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. వేలకోట్ల నష్టాల్లో కొనసాగుతోన్న ఆర్టీసీలో చేతివాటం ప్రదర్శిస్తోన్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని ఉద్యోగులు అంటున్నారు.

కేసీఆర్ కు అరుదైన అవకాశం... ట్రంప్ తో కలిసి ఢిల్లీలో డిన్నర్...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందుకు హాజరుకావాలని ఆహ్వానం వచ్చింది. ప్రధాని మోడీ, కొద్దిమంది కేంద్ర మంత్రులతోపాటు మొత్తం 90మంది అతిథులు మాత్రమే పాల్గొనబోయే ఈ విందులో సీఎం కేసీఆర్‌ కూడా పాలు పంచుకోనున్నారు. రాష్ట్రపతి ఆహ్వానం మేరకు ఫిబ్రవరి 25న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గౌరవార్ధం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవ్వనున్న విందులో కేసీఆర్ పాల్గోనున్నారు. ప్రధాని మోడీతోపాటు కేవలం 90మంది మాత్రమే పాల్గొనే ఈ విందులో కేవలం 8మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఆహ్వానం అందింది. అసోం, హర్యానా, కర్నాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ కలిపి మొత్తం 8మంది ముఖ్యమంత్రులను మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. అలాగే, అరుదైన ఈవెంట్ లో పాల్గొనే అవకాశం కేసీఆర్ కు దక్కింది.

పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఏపీ బీజేపీ ఛీఫ్ ఎంపిక!.. రేసులో ఉన్నదెవరు?

తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకత్వాలను మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. వచ్చేవారం దీనిపై కాషాయ పెద్దలు ఓ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. తెలంగాణలో ఎంపీలు బండి సంజయ్ లేదా అరవింద్ కు అవకాశం దక్కవచ్చన్న ప్రచారం సాగుతుండగా.. ఏపీలో మాత్రం ఈ జాబితా అరడజనుకు పైగానే కనిపిస్తోంది. వీరిలో ప్రస్తుత సీనియర్ నేతలు పురంధేశ్వరి, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్సీలు పీపీఎన్ మాథవ్, సోము వీర్రాజు.. బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రధానంగా రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు ముగ్గురు ఉన్నా వారికి అవకాశం దక్కడం కష్టమే. అయితే ఏపీ బీజేపీ ఛీఫ్ గా ఎన్నికయ్యే వారికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులు తప్పనిసరన్న వాదన వినిపిస్తోంది. ఏపీలో బీజేపీ కొత్త ఛీఫ్ ఎంపిక అధిష్టానానికి ఈసారి గట్టి సవాలే విసురుతోంది. గతంలో సార్వత్రిక ఎన్నికల ముందు కాపు కోణంలో కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడిగా ఎంపిక చేసిన కాషాయ నేతలు.. అది కాస్తా వర్కవుట్ కాకపోవడంతో ప్రత్యామ్నాయాల ఎంపికలో బిజీగా ఉన్నారు. అప్పట్లో కన్నాను ఎంపిక చేయడంలో కులం కోణం సహా పలు కారణాలు ఉన్నాయి. వైసీపీ రెడ్ల పార్టీగానూ, టీడీపీ కమ్మ ప్లస్ బీసీ పార్టీగానూ పేరు తెచ్చుకున్న తరుణంలో కాపులను ఓన్ చేసుకునే లక్ష్యంతో కన్నాకు పగ్గాలు అప్పగించారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి దిగిన కన్నా లక్ష్మీనారాయణ భారీ తేడాతో ఓటమి పాలయ్యారు. పార్టీని విజయం దిశగా నడిపించడంలోనూ విఫలమయ్యారు. బీజేపీ దాదాపు పోటీ చేసిన స్ధానాలన్నింటిలోనూ డిపాజిట్లు కోల్పోవడమే అందుకు నిదర్శనం. అప్పటి నుంచి కన్నా సమర్ధతపై సందేహాలు మొదలయ్యాయి. అయితే అప్పటి పరిస్ధితులు వేరు. బీజేపీ ఏపీకి ద్రోహం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో అప్పటి అధికార టీడీపీ సక్సెస్ అయింది. దీంతో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే స్ధానం కూడా దక్కకపోగా.. చాలా చోట్ల డిపాజిట్లు కూడా కోల్పోవాల్సిన పరిస్ధితి. కానీ ఎన్నికల తర్వాత వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కన్నా గట్టిగా పోరాటం చేస్తున్నారు. అయినా బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్, కన్నా ఒకే సామాజికవర్గం వారే కావడంతో మిగతా సామాజికవర్గాలను ఆకర్షించడంలో బీజేపీ విఫలమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయే స్ధితికి చేరుకున్న బీజేపీకి ఆ తర్వాత కూడా ఊరట లభించలేదు. పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోమువీర్రాజు, పీవీఎన్ మాధవ్, వాకాటి నారాయణ రెడ్డి వంటి నేతలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్లలేకపోవడం ఆ పార్టీకి చేటు చేస్తోంది. దీంతో ఇప్పటికీ బీజేపీ నేతలు పవన్ ఛరిష్మాపైనే ఆధారపడాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడంతో పాటు కార్యవర్గంలోనూ భారీ మార్పులు చేసేందుకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మంచి వ్యూహకర్తగా పేరున్న మాధవ్ కు పగ్గాలు అందిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని బీజేపీ పెద్దలు తీవ్రంగా పరిశీలిస్తున్నారు. అటు వైసీపీని ఎదుర్కొనే వ్యూహాన్ని సీరియస్‌ గా తీసుకుంటే మాత్రం బీజేవైఎం నేత విష్ణువర్ధన్ రెడ్డికీ అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు. వీరిద్దరు కాకుండా మిగతా వారి పేర్లను పరిగణనలోకి తీసుకోవడం కష్టమే అనిపిస్తోంది. అటు టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ముగ్గురు ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వీరిని అధిష్టానం పెద్దలు పూర్తిగా నమ్మకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిస్ధితుల్లో పవన్ తో సమన్వయం చేసుకుంటూ మందుకెళ్లే వారికే అవకాశాలు మెరుగ్గా ఉండొచ్చని తెలుస్తోంది. అదే జరిగితే జనసేనానితో గొప్ప సంబంధాలు లేకపోయినా మృదుస్వభావిగా పేరున్న ఎమ్మెల్సీ మాధవ్ ఈ రేసులో ముందుంటారనేది పార్టీ వర్గాల సమాచారం.

రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఆస్తుల వేలం ప్రకటన.. ఓ వృథా ప్రయత్నం!

837.37కోట్ల రూపాయల రుణం ఎగవేత కేసులో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు ఆంధ్రాబ్యాంక్ తాజాగా బహిరంగ ప్రకటన జారీ చేసింది. వచ్చే నెల 23న వేలం నిర్వహించనున్నట్లు ఆంధ్రాబ్యాంక్ ఈ ప్రకటనలో పేర్కొంది. అంతవరకూ బాగానే ఉన్నా రాయపాటి తనఖా పెట్టిన ఆస్తుల విలువ, ఆయన ఎగవేసిన రుణం విలువ తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం. రాయపాటి సాంబశివరావు ప్రమోటర్ గా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఇండియాతో పాటు రాయపాటి రంగారావు, చెరుకూరి శ్రీధర్, మల్లినేని సాంబశివరావు, దేవికారాణి, లక్ష్మి పేరిట తీసుకున్న రుణం విలువ 837 కోట్లయితే ఆయన ఇందుకోసం తనఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం 17.5 కోట్లు మాత్రమే. ఇందులో గుంటూరులో ఉన్న భవనం విలువ 16.44 కోట్లు కాగా.. ఢిల్లీలోని ఫ్లాట్ విలువ 1.09 కోట్లుగా బ్యాంకు నిర్ధారించింది. అంటే దీన్ని బట్టి ఈ వేలం నిర్వహణ ద్వారా బ్యాంకుకు ఒనగూరే ప్రయోజనం విలువ తీసుకున్న రుణంలో కేవలం రెండుశాతం మాత్రమే. ఈ రుణానికి హామీ దారులుగా ఉన్నది రాయపాటి జగదీష్, రాయపాటి జీవన్, నారయ్య చౌదరి, రాయపాటి రంగారావు, దేవికారాణి, లక్ష్మి, సీహెచ్ వాణి, యలమంచిలి జగన్ మోహన్. వీరందరి ఆస్తులను ఒకేసారి వేలం వేయకుండా కేవలం రాయపాటి పేరు మీద ఉన్న ఆస్తులను మాత్రమే వేలం వేస్తున్నారంటే పరిస్ధితి అర్ధమవుతోంది. వాస్తవానికి 2014 కంటే ముందు కాంగ్రెస్ ఎంపీగా ఉన్న రాయపాటి సాంబశివరావు సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీలో చేరి గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అప్పట్లో ఆయన కున్న పరపతితోనే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టును ఆయన ప్రమోటర్ గా ఉన్న ట్రాన్స్ ట్రాయ్ సంస్ధ దక్కించుకోగలిగింది. అయితే అప్పటికే ఆర్ధిక ఇబ్బందుల‌్లో ఉన్న ట్రాన్స్ ట్రాయ్ ఆ తర్వాత దివాలా తీసింది. పోలవరం పనులు పూర్తి చేయలేక చేతులెత్తేయడంతో నవయుగ ఇంజనీరింగ్ కు అప్పటి టీడీపీ సర్కారు పనులు అప్పగించింది. పోలవరం ప్రాజెక్టులో పని చేయకుండానే ఆయన ట్రాన్స్ ట్రాయ్ క్లెయిమ్ చేసిన మొత్తాన్ని చెల్లించి మరీ నవయుగతో అప్పటి ప్రభుత్వం ఒప్పందం కుదిర్చి రాయపాటిని ఒడ్డున పడేసింది. అయితే దివాలా నోటీసు నేపథ్యంలో బ్యాంకులు ఒక్కొక్కటిగా ఆయన ఆస్తులను వేలం వేయడం ద్వారా రుణాల వసూలుకు ప్రయత్నిస్తున్నాయి. రుణాలు ఎగవేసిన బడా బాబుల వ్యవహారంలో బ్యాంకులు వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. వారికి ఇచ్చే రుణాలకూ, తనఖా పెట్టే ఆస్తులకూ ఎక్కడా పొంతనం ఉండటం లేదు. ఇదే రుణాల ఎగవేతకు కారణమవుతోంది. కేవలం వ్యక్తులకు సమాజంలో ఉన్న పరపతి, రాజకీయంగా వారి పదవులను చూసి భారీగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు ఇప్పటికే దివాలా తీస్తున్నాయి. అయినా వాటి వైఖరిలో మార్పు రావడం లేదు. కోట్లాది రూపాయలు నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) రూపంలో పేరుకుపోతున్నా కనీసం ఎగవేతదారుల ఆస్తులను పూర్తిస్దాయిలో వేలం కూడా వేసే పరిస్ధితి లేదు. ప్రస్తుతం రాయపాటి సాంబశివరావు ఆస్తుల వేలం వ్యవహారంతో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది.

నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై వీసీ స్పందన

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్ధినుల హాస్టల్లో విద్యార్ధి రోజంతా ఉన్న వ్యవహారంపై వైస్ ఛాన్సలర్ హేమచంద్రారెడ్డి స్పందించారు. పిల్లల భవిష్యత్తు పాడవుతుందనే ఉద్దేశంతోనే తాము ఈ వ్యవహారంపై మౌనంగా ఉన్నామన్నారు. అదే సమయంలో హాస్టల్లో భద్రతా వైఫల్యం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని వీసీ తెలిపారు. విద్యార్ధినుల హాస్టల్ కిటికీ బయటి నుంచి కంటే లోపల నుంచి తెరవడం సులువని ఆయన పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే లోపల ఉన్న విద్యార్ధినుల్లో ఒకరు కిటికీ తెరిచి తనకు పరిచయమైన విద్యార్ధిని లోపలికి ఆహ్వానించారని వీసీ వెల్లడించారు. అదే గదిలో ఉన్న మిగిలిన విద్యార్ధినుల్లో ఒకరు మంచం కింద ఎవరో ఉన్నారని వార్డెన్ కు ఫిర్యాదు చేయడంతో గది తాళం బద్దలు కొట్టి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వాస్తవానికి ట్రిపుల్ ఐటీలో వార్షిక ఫెస్ట్ జరుగుతోంది. ఈ సమయంలో మిగిలిన విద్యార్ధులంతా ఫెస్ట్ లో బిజీగా ఉండటంతో ఓ విద్యార్ధిని ఉద్దేశపూర్వకంగానే కిటీకీ తెరిచి అదే ట్రిపుల్ ఐటీలో చదువుతున్న తనకు పరిచయమైన విద్యార్దిని లోపలికి తీసుకొచ్చింది. అయితే మిగిలిన విద్యార్ధినుల్లో ఒకరికి అనుమానం రావండంతో హాస్టల్ గది తలుపులకు తాళం వేసి వెళ్లిపోయింది. అయితే మరో విద్యార్దిని ఫిర్యాదు మేరకు వార్డెన్ సెక్యరిటీతో కలిసి తాళం బద్దలు కొట్టి తలుపు తెరవడంతో బండారం బయటపడింది. అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ మైనర్లు కావడంతో వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లితండ్రుల దగ్గరికి పంపినట్లు వీసీ హేమచంద్రారెడ్డి వెల్లడించారు. అయితే ఈ ఘటనపై క్రమశిక్షణా కమిటీకి సిఫార్సు చేశామని, నివేదిక రాగానే తదుపరి చర్యలుంటాయన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో మొత్తం 4500 మంది అమ్మాయిలు, 3500 మంది అబ్బాయిలు చదువుతున్నారు.

విశాఖలో రాజధానిపై నేవీ క్లారిటీ.. అలాంటి ప్రతిపాదన రాలేదని ప్రకటన

విశాఖలో ఏపీ కార్యనిర్వాహక రాజధాని దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు నేవీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు వచ్చిన వార్తలను తూర్పు నావికా దళం ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సచివాలయం ఏర్పాటు కోసం తమ వద్దకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదని, దానికి తాము ఎలాంటి అభ్యంతరాలు చెప్పలేదని వివరణ ఇచ్చింది. దీంతో విశాఖలో నేవీ అభ్యంతరాల వార్తలకు బ్రేక్ పడినట్లయింది. వాస్తవానికి విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో సచివాలయానికి ప్రతిపాదిస్తున్న మిలీనియం టవర్స్ పై నేవీ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వార్తలొచ్చాయి. ఐఎన్ఎస్ కళింగ పరిధిలోకి వచ్చే మిలీనియం టవర్స్ లో సచివాలయం ఏర్పాటు చేస్తే రాకపోకలు పెరుగుతాయని దీంతో భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వానికి నేవీ లేఖ రాసినట్లు వార్తలు వెలువడ్డాయి. తాజాగా నేవీ ఇచ్చిన వివరణతో ఈ ఊహాగానాలకు తెరపడింది.

నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్లో రోజంతా యువకుడు.. ఆరుగురు విద్యార్దినుల సస్పెన్షన్

కృష్ణాజిల్లా ట్రిపుల్ ఐటీలో భద్రతా లోపాలు మరోసారి బయటప్డాయి. నిన్న సెక్యూరిటీ కళ్లుగప్పి విద్యార్ధినుల హాస్టల్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. హాస్టల్ కిటికీ ఊచలు వంచి అతడు లోపలికి ప్రవేశించాడు. అంతే కాదు రోజంతా అక్కడే ఉన్నాడు. చివరికి విద్యార్ధినులు అతడిని ఓ గదిలో బంధించి సెక్యూరిటీకి సమాచారం అందించారు. దీంతో సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆగంతకుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిగా గుర్తించారు. ఈ వ్యవహారంలో స్పందించిన ట్రిపుల్ ఐటీ అధికారులు ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేయడం కలకలం రేపుతోంది. గతంలోనూ నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్ధినుల వ్యవహారాలు రచ్చకెక్కాయి. పలువురు విద్యార్ధులపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. వరుస వివాదాలకు ట్రిపుల్ ఐటీ యాజమాన్యం వైఖరే కారణమనే విమర్శలు ఉన్నాయి. విద్యార్ధులకు సంబంధించిన సున్నితమైన అంశాలను సైతం యాజమాన్యం పట్టించుకోవడం లేదని గతంలో ఆందోళనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈసారి ఏకంగా ఓ విద్యార్ధి తనకు సంబంధం లేని విద్యార్దినుల హాస్టల్లోకి చొరబడటం, అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, బాధ్యులుగా ఆరుగురు విద్యార్ధినులను సస్పెండ్ చేయటంతో ఈ మొత్తం వ్యవహారం సంచనలంగా మారింది. విద్యార్ధినుల సస్పెన్షన్ ను బట్టి చూస్తుంటే వారే సదరు విద్యార్ధిని లోపలికి ఆహ్వానించినట్లు అర్ధమవుతోంది. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు విద్యార్ధికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.

యూపీలో పసిడి పంట.. 3,500 టన్నుల బంగారు గనులు!!

దేశంలోనే అతి పెద్ద బంగారు గనిని ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లాలో గుర్తించారు. ఈ జిల్లాలోని సోన్ పహాడీ ప్రాంతంలో 2,700 టన్నులు, హార్ది ప్రాంతంలో మరో 650 టన్నుల బంగారం కలిపి మొత్తంగా 3,350 టన్నుల బంగారు నిక్షేపాలు గుర్తించినట్టుగా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లోని కొండల దిగువన.. బంగారంతోపాటు ఇనుము, పొటాషియం వంటి ఇతర విలువైన ఖనిజాలు కూడా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, 'ఉత్తరప్రదేశ్‌ డైరెక్టరేట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్' వారితో కలిసి ఎన్నో ఏళ్లుగా బంగారు గనుల కోసం తవ్వకాలు జరుపుతున్నారు. అయితే వారి శ్రమకు ఇన్నాళ్లకు ఫలితం లభించింది. సోన్ భద్ర జిల్లాలో 3,350 టన్నుల బంగారు ఖనిజాన్ని కనుగొన్నారు. ఆ ప్రాంతంలో బంగారు ఖనిజాలున్నట్టు 2012 లోనే శాస్త్రవేత్తలు గుర్తించినప్పటికీ అది ఇప్పుడు నిజమైంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వ మైనింగ్ ఆఫీసర్ కె.కె.రాయ్ నిర్ధారించారు. ప్రభుత్వం ఈ బంగారు గనులను మైనింగ్ కు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. కాగా, మన దేశంలో ప్రస్తుతం నాలుగు బంగారు గనులు ఉన్నాయి. అందులో మూడు కర్ణాటకలో ఉండగా, ఒకటి జార్ఖండ్ లో ఉంది. తాజాగా యూపీలో గుర్తించిన గని.. వాటన్నింటికన్నా చాలా పెద్దది. ఆ నాలుగు బంగారు గనులు కలిపినా కూడా.. ఇప్పుడు యూపీలో గుర్తించిన గనిలోనే ఎక్కువ బంగారం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

విశాఖలో రాజధాని వద్దు: భారీ ట్విస్ట్ ఇచ్చిన ఇండియన్ నేవీ

విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు మరింత ఆలస్యం కానుందా అంటే అవుననే సమాధానమొస్తోంది. మిలీనియం టవర్స్‌లో పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేయాలనుకున్న ప్రభుత్వానికి నేవీ నుంచి తీవ్ర అభ్యంతరాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఐటీ కేంద్రంగా ఉన్న మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఏపీ సర్కార్‌కు నేవీ తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో మిలీనియం టవర్స్ ఉన్నాయని లేఖలో పేర్కొంది. విశాఖను ప్రభుత్వం పరిపాలనా రాజధానిగా ప్రకటించడం.. మిలీనియం టవర్స్‌లో విభాగాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం కావడంతో నేవీ తీవ్ర అభ్యంతరాలు లేవదీసింది. రక్షణకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు సమీపంలో జనావాసాలను ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించింది. శత్రుదేశాలకు విశాఖపట్నం ప్రధాన లక్ష్యంగా ఉందని, ఇక్కడ ఎన్నో పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని ప్రభుత్వానికి రాసిన లేఖలో నేవీ అధికారులు తెలిపారు. కాబట్టి దేశభద్రత దృష్ట్యా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోకపోవడమే మేలని నేవీ అధికారులు సలహా ఇస్తున్నారు. ఒకసారి రాజధాని ఏర్పాటైతే.. ఆ ప్రాంతమంతా జనావాసాలతో కిటకిటలాడుతుందని.. దీంతో చాలా సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని.. ఇక్కడ రాజధాని ఏర్పాటుపై సాంకేతిక, భౌగోళిక అంశాలను సమీక్షించాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపింది. కాగా.. ఐఎన్ఎస్ కళింగ సుమారు 734 ఎకరాల మేర విస్తరించి ఉంది. తూర్పు నావికా దళానికి ఈ ప్రాంతం అత్యంత కీలకమైనది. దీనిపై నేవీ మరింత దృష్టి కేంద్రీకరిస్తోంది. మరిన్ని భూములను సేకరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే 400 ఎకరాల భూమిపై నేవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదం నడుస్తోంది. ఈ భూమిని 1980లలో అధికారుల ఇళ్ల కోసం జిల్లా పరిపాలనా విభాగం కేటాయించింది. మే నెల తర్వాత విశాఖకు పాలనా రాజధానిని తరలించేందుకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అటు కేంద్రం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఉండేందుకు సీఎం జగన్ తాజాగా డిల్లీలో పర్యటించి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతోనూ చర్చలు జరిపారు. శాసనమండలి రద్దు నిర్ణయానికి వచ్చే నెలలో పార్లమెంటు ఆమోదముద్ర కూడా పడుతుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి తరుణంలో విశాఖలో రాజధాని నిర్ణయానికి నేవీ అభ్యంతరాలు చెప్పిందన్న వార్తలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. విశాఖ కేంద్రంగా పలు కేంద్ర ప్రభుత్వ సంస్ధలు ఉన్నా రాజధాని విషయంలో నేవీ అభ్యంతరాలు చెప్పడం చర్చనీయాంశంగా మారుతోంది. అదే నిజమైతే విశాఖలోనే ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలా లేక పూర్తిగా విశాఖను వదిలి మరో ప్రాంతాన్ని ఎంచుకోవాలా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. నేవీ రాసిన లేఖపై ప్రభుత్వం నంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన లేదు. నేవీ లేఖపై మాట్లాడేందుకు ప్రభుత్వ వర్గాలు కూడా నిరాకరిస్తున్నాయి.

ఏపీలో వరుస విచారణలు.. స్ధానిక ఎన్నికల వేళ టీడీపీని బదనాం చేసేందుకేనా?

ఏపీలో ప్రతిపక్ష టీడీపీ నేతలే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత టీడీపీ సర్కారులో తీసుకున్న నిర్ణయాలపై వరుసగా విచారణకు ఆదేశించడం నిజంగా వారి మెడకు చుట్టుకుంటుందా? లేక కేవలం ప్రజల్లో టీడీపీని పలచన చేయడమే వాటి అంతిమ లక్ష్యమా అన్న చర్చ మొదలైంది. వైసీపీ అధికారం చేపట్టి 9 నెలలవుతున్నా ఇప్పటివరకూ ఏ ఒక్క దర్యాప్తులోనూ టీడీపీ నేతలపై చర్యలకు ఉపక్రమించకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. గతేడాది జూన్ నెలలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపించింది. ఏకంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా కేంద్రంగా వాడుకున్న ఉండవల్లి కరకట్ట ప్రజావేదికను అక్రమ కట్టడంగా గుర్తిస్తూ రాత్రికి రాత్రే కూల్చివేసింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా లక్షల కొద్దీ ఉన్న అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. విశాఖలోని టీడీపీ కార్యాయానికి కూడా నోటీసులు ఇచ్చి వదిలేశారు. మిగతా చోట్ల ఒకటీ అరా కట్టడాల కూల్చివేతలు చేపట్టారే కానీ వాటిని ఆ తర్వాత కొనసాగించలేదు. అదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో పాటు మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. కానీ సంచలన అంశాలేవీ లేకపోవడంతో మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏమీ చేయలేని పరిస్ధితి. ఆ తర్వాత రాజధాని అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ఈ ప్రచారాన్ని అధికారంలోకి వచ్చాక తీవ్రంగా పరిగణించి విచారణ జరిపిస్తుందేమోనని అంతా ఆశించారు. కానీ ఇన్ సైడర్ ట్రేడింగ్ ను నిరూపించే ఆధారాలేవీ పకడ్బందీగా దొరక్కపోవడంతో సీఐడీ కూడా నోటీసులతోనే సరిపెట్టింది. చివరకు దాన్ని మరింత లోతుగా విచారించేందుకు అంటూ ఈడీ, ఐటీకి అప్పచెప్పారు. ఇదే కోవలో ఇంటిలిజెన్స్ మాజీ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు అక్రమంగా భద్రతా పరికరాలు కొన్న వ్యవహారంలోనూ వైసీపీ ప్రభుత్వం గట్టిగా ముందుకెళ్లలేని పరిస్ధితి. ఏబీ వెంకటేశ్వరరావు విదేశాల నుంచి నిఘా పరికరాలు కొనే ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని ఇజ్రాయెల్ కు అందించారని, తన కుమారుడి సంస్ధకు మేలు చేశారని, పై అధికారుల అభ్యంతరాలను పట్టించుకోలేదని పలు ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. కానీ అంత తీవ్రత ఉన్న అంశాన్ని కేంద్రానికి ఎందుకు రిఫర్ చేయలేదంటే జవాబు లేదు. చివరికి క్యాట్ ఇదే ప్రశ్న వేస్తే రాష్ట్ర ప్రభుత్వం తెల్లమొహం వేయాల్సిన పరిస్ధితి. తాజాగా ఈఎస్ఐ స్కామ్ లోనూ ఇదే తంతు. ఈఎస్ఐకు చెందిన పలువురు డైరెక్టర్ స్ధాయి అధికారులు చెల్లింపులు జరిపారంటూ ఆరోపించిన ప్రభుత్వం... అందులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఏంటనే దానిపై స్పష్టత ఇవ్వలేకపోతోంది. ఓవైపు ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ మరోవైపు కొనుగోళ్లకు ఆయన ఆదేశించారని నిరూపించే ఆధారాలేవీ బయటపెట్టలేకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్ధితిగా మారింది. ఇదే కోవలో మంత్రివర్గ ఉపసంఘం అప్పుడెప్పుడో గత ప్రభుత్వ నిర్ణయాల ద్వారా చోటుచేసుకున్న అక్రమాలపై ప్రారంభించిన దర్యాప్తు 9 నెలల తర్వాత ఇప్పటికి పూర్తి చేస్తే ప్రభుత్వం చివరికి సిట్ కు అప్పగించింది. ఇందులోనూ అదే డొల్లతనం. రాజధాని భూములతో పాటు విశాఖ భూములపై విచారణ, ఎర్రచందనం వంటి పలు అంశాలను ఇందులో ప్రస్తావించినా అందులో అక్రమాలను మంత్రివర్గ ఉపసంఘం నిరూపించిందా అంటే అధీ లేదు. దీంతో ఈ వరుస విచారణల పర్వం కేవలం టీడీపీ నేతలను ప్రజల్లో పలుచన చేయడమే లక్ష్యంగా సాగుతున్నట అర్ధమవుతోంది. స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో విపక్షాన్ని సాధ్యమైనంత అప్రతిష్ట పాలు చేయాలనేదే ఇందులో లక్ష్యంగా కనిపిస్తోంది.

హస్తిన చుట్టూ ఏపీ ఐఏఎస్ అధికారుల ప్రదక్షిణలు.. ఏం జరుగుతోంది?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీ నుంచి హస్తినకు ఐఏఎస్ అధికారుల టూర్లు గతంతో పోలిస్తే ఎక్కువయ్యాయి. ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలతో పాటు మూడు రాజధానుల వ్యవహారం, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం అధికారులు కేంద్రంతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో జగన్ భేటీల నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న పనుల కోసమే ఐఏఎస్ లు ఢిల్లీలో మకాం వేసినట్లు సమాచారం. ఏపీలో మే నెల తర్వాత మూడు రాజధానుల ప్రక్రియను అమల్లో పెట్టాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం అందుకు తగినట్లుగా కార్యాచరణను వేగవంతం చేసింది. ఇప్పటికే తన తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్.. ఆ మేరకు తన మనసులో మాటను వారి చెవిన వేయడం దానికి గ్రీన్ సిగ్నల్ లభించడం జరిగిపోయాయి. ఢిల్లీ నుంచి తిరిగివచ్చాక సీఎం జగన్ తో భేటీ అయిన పలువురు అధికారులు, వైసీపీ పెద్దలతో మాట్లాడినప్పుడు వారు ముఖ్యమంత్రి అనుకున్నవన్నీ జరిగేలా కేంద్రం నుంచి గట్టి హా్మీ లభించినట్లు తెలిసింది. దీని ఆధారంగా తదుపరి ప్రక్రియను మొదలుపెట్టాలని భావిస్తున్న జగన్ తన ప్రబుత్వంలోని కీలకమైన ఐఏఎస్ అధికారులను ఢిల్లీలోని సంబంధిత శాఖల వద్దకు పంపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవోలను గమనించినా ఐఏఎస్ అధికారులు హస్తినకు క్యూ కట్టిన విషయం ఇట్టే అర్ధమవుతుంది. మోడీ, అమిత్ షా ఇచ్చిన హామీల్లో మొదటిది శాసనమండలి రద్దు కాగా రెండోది కర్నూలుకు హైకోర్టు తరలింపు, విభజన సమస్యల పరిష్కారం, రాష్ట్రానికి నిధులు ఇతర హామీలు. అయితే వీటిలో మొదటిదైన శాసనమండలి రద్దుకు వచ్చే నెల 2న ప్రారంభమయ్యే బడ్జెట్ రెండో విడత సమావేశాలు వేదిక కానున్నాయి. ఈ సమావేశాల్లోనే మండలి రద్దుకు కేంద్రం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లులు ప్రవేశపెట్టడం ఆమోదించడం జరుగుతుందని ఢిల్లీ సర్కిల్స్ లోనూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో హైకోర్టు తరలింపునకు సుప్రీంకోర్టుతో పాటు కేంద్ర న్యాయశాఖ అనుమతి తప్పనిసరి. కేంద్ర న్యాయశాఖ నుంచి అనుమతి లభిస్తే తరలింపునకు అవసరమైన మిగతా ప్రక్రియను సుప్రీంకోర్టు చేపట్టడం లాంఛనమే అవుతుంది. కాబట్టి న్యాయశాఖ వర్గాల వద్ద ఏపీ ఐఏఎస్ లు ఈ అంశంపైనా లాబీయింగ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు సర్కారు తరహాలోనే ఐఏఎస్ అధికారులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న జగన్ సర్కారు... కేంద్రంతో లాబీయింగ్ లోనూ వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు తాజా పరిణామాలను బట్టి అర్ధమవుతోంది. అదే సమయంలో గతంలో కేంద్రంలో పనిచేసిన రాష్ట్రానికి చెందిన కొందరు ఐఏఎస్ ల పరిచయాలను కూడా వాడుకోవడం ద్వారా కేంద్రం ఇస్తున్న హామీలను తమకు అనుకూలంగా మార్చుకునేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

గుంటూరులో కలకలం.. ప్రేమను ఒప్పుకోలేదని ఆర్మీ జవాన్ కాల్పులు!

గుంటూరు జిల్లాలోని చెరుకుపల్లి మండలం నడింపల్లి గ్రామంలో ఓ ఆర్మీ జవాన్‌ కాల్పులు జరపడం కలకలం రేపింది. నాటు తుపాకీతో అతను కాల్పులకు తెగపడ్డాడు. ఈ కాల్పుల్లో రమాదేవి అనే మహిళ గాయపడింది. కాల్పులు జరిపిన ఆర్మీ జవాన్‌ బాలాజీ అక్కడ నుంచి పరారయ్యాడు. స్థానికులు వెంటనే గాయపడ్డ మహిళను తెనాలి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. బాలాజీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కాల్పులకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. రమాదేవి కూతురిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేయాలనీ అంటూ బాలాజీ కొంతకాలంగా వెంటపడుతున్నాడు. ఇందుకు రమాదేవి ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న బాలాజీ.. ఉదయం ఆమె ఇంటికి వెళ్లి.. నాటు తుపాకీతో కాల్పులు జరిపి రమాదేవిని చంపేందుకు యత్నించాడు. అయితే ఆమె చాకచక్యంగా కాల్పుల నుంచి తప్పించుకుని బయటకు పరుగులు తీసి, ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో ఆమె కుడి చెవికి బుల్లెట్ గాయమైంది. కాల్పుల శబ్దం విని.. స్థానికులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో.. బాలాజీ అక్కడి నుంచి పరారయ్యాడు.

'రస్ ఆల్ ఖైమా'కు రూ. 800 కోట్లతో వైసీపీ ఎంపీలు.. త్వరలో జగన్ జైలుకి!!

రస్ ఆల్ ఖైమా కేసు నుంచి దృష్టి మారల్చేందుకే జగన్ సర్కార్ అమరావతి భూముల వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసిందని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎం జగన్ సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అయిన నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా జైల్లో ఎందుకున్నారో జగన్ చెప్పాలని బోండా ఉమా నిలదీశారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో ఏం మాట్లాడారో జగన్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. రస్ ఆల్ ఖైమా కేసు విషయంలో వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. రస్ ఆల్ ఖైమాకు రూ. 800 కోట్లు చెల్లించేందుకు జగన్.. వైసీపీ ఎంపీలను ఆ దేశం పంపారని ఆరోపించారు. నేరస్థుల ఒప్పందంలో భాగంగా ఆ దేశానికి జగన్‌ను అప్పగించే పరిస్థితి ఉందని అన్నారు. ఈ కేసుల నుంచి బయటపడేయాలని జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని వేడుకున్నారని బోండా ఉమా ఆరోపించారు. 

ఈసారి ఏపీ బడ్జెట్ సమావేశాలు వారం రోజులే?

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. దీనికి కారణం స్ధానిక సంస్ధల ఎన్నికలే. ఎట్టి పరిస్ధితుల్లోనూ అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఎన్నికలు నిర్వహించి తీరాలని పట్టుదలగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రిజర్వేషన్ల వ్యవహారం తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో హైకోర్టు రిజర్వేషన్లపై ఇచ్చే తీర్పు ఆధారంగానే స్ధానిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై క్లారిటీ రానుంది. ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలోనే దీనికి సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. అయితే అసెంబ్లీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన కీలక బిల్లులు ఆమోదం పొందినా శాసనమండలిలో మాత్రం చుక్కెదురైంది. ఓవైపు బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లాయో లేదో తెలియక సాధారణ జనం గందరగోళంలో మునిగిపోతే ప్రభుత్వం మాత్రం బిల్లులు ఆమోదం పొందాయని చెప్పుకుంటోంది. మండలి ఛైర్మన్ గవర్నర్ కు చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం గవర్నర్ కోర్టులోకి వెళ్లినట్లయింది. అధికార విపక్షాల విమర్శనాస్త్రాల సంగతి ఎలా ఉన్నా కేంద్రంతో సీఎం జగన్ నెరుపుతున్న సంబంధాల పుణ్యమాని శాసనమండలి రద్దుకు అడుగులు వేగంగా పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్చి 2న పార్లమెంటు తిరిగి ప్రారంభం కాగానే ఏపీ మండలి రద్దు బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించేలా కేంద్రం నుంచి జగన్ కు హామీ లభించినట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రం ఏపీ శాసనమండలి రద్దుకు ఆమోద ముద్ర వేస్తే మాత్రం మూడు రాజధానుల ప్రక్రియ జోరందుకోనుంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ లోపే స్ధానిక సంస్ధల ఎన్నికలను కూడా పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేయడంతో పాటు దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. దీంతో హైకోర్టు రిజర్వేషన్లపై తుదితీర్పు ఇచ్చిన వెంటనే స్ధానిక ఎన్నికల నోటిఫికేషన్ విడదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరులోగా హైకోర్టు తీర్పు వస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు శరవేగంగా స్ధానిక ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయబోతోంది. అదే సమయంలో స్ధానిక ఎన్నికల షెడ్యూల్ ను బట్టి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనుంది. స్ధానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు ఆలస్యమైతే మాత్రం బడ్జెట్ సమావేశాలను మార్చి నెలాఖరుకు వాయిదా వేయనుంది. అదే జరిగితే ఈసారి వారం రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా స్ధానిక సంస్ధల రిజర్వేషన్ల వ్యవహారం హైకోర్టులో వాయిదా పడుతూ పోతే మాత్రం స్ధానిక సంస్ధల ఎన్నికలు మరింత ఆలస్యమవుతాయి. అదే జరిగితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మాత్రం మార్చి మొదటి వారంలోనే నిర్వహించే ఛాన్సుంది. అలా అయినా సరే బడ్జెట్ సమావేశాలను వారంలో ముగించి స్ధానిక ఎన్నికల ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే పంచాయతీ రాజ్ చట్టం సవరణపై జారీ చేసిన ఆర్డినెన్స్ స్ధానంలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. దీంతో పాటు కేంద్రం మండలి రద్దుపై నోటిఫికేషన్ జారీ చేస్తే మూడు రాజధానులపై తదుపరి ప్రక్రియ కూడా మొదలు కానుంది. అప్పుడు మూడు రాజదానులపై అసెంబ్లీ వేదికగా వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముంది.

వెలిగొండ ప్రాజెక్టు పురోగతిపై వైసీపీ, టీడీపీ మాటలయుద్ధం.. అసలు వాస్తవాలివే...

ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టు (పూలసుబ్బయ్య ప్రాజెక్టు) పనుల పురోగతి, ఎవరి హయాంలో ఎంతశాతం పూర్తి చేశారు. అందులో అవినీతి ఆరోపణలపై ప్రస్తుతం అధికార విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో ప్రధానంగా గత ఏడాది కాలంలో జరిగిన పనులు, వాటిలో చోటుచేసుకున్న అవినీతి ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, అంచనాల సవరణ, అవినీతి ఆరోపణల్లో నిజమెంతో మీరే చూడండి.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో 4.6 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మంది ఫ్లోరైడ్, కరవు బాధిత ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో పురుడు పోసుకున్న వెలిగొండ ప్రాజెక్టు పనులు 2005 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమయ్యాయి. అఫ్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. 18.8 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను తవ్వి 43.5 టీఎంసీల కృష్ణానది వరద నీటిని శ్రీశైలం రిజర్వాయర్ పరిధిలోని నల్లమల సాగర్ రిజర్వాయర్ కు తరలించడం దీని లక్ష్యం. దీని ప్రకారం మొదటి సొరంగం పనులను 2018 ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని గడువు పెట్టిన ప్రభుత్వం... సాబిర్ స్యూ అండ్ జేవీ ప్రసాద్ సంస్ధకు పనులను అప్పగించింది. ఈ సొరంగం తవ్వకం, ఇతర పనుల కోసం 626.60 కోట్లు కేటాయిస్తూ 2005 ఆగస్టు 20న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రెండో సొరంగం పనుల కోసం హెచ్.సి.సి. సంస్ధకు కాంట్రాక్టు అప్పగిస్తూ 735 కోట్ల విడుదలకు ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే 2019 మే 31 లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. కానీ నిర్ణీత సమయంలో పనులు పూర్తి కాలేదు. ఆలోగా వైఎస్ మరణం, ప్రభుత్వాలు మారిపోవడంతో వెలిగొండ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులు మరో ఏజెన్సీకి అప్పగించాలని నిర్ణయించారు. 2017 డిసెంబర్ 20న ప్రభుత్వం ముందుకు కొత్త ప్రతిపాదనలు వచ్చాయి. 2018 మార్చి 22న మొదటి సొరంగంలో 15.2 కి.మీ నుంచి 18.8 కిలోమీటర్ల వరకూ పనులు మిగిలి ఉన్నట్లు గుర్తించారు. వీటిని పూర్తి చేయాలంటే 116.447 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. చివరికి సవరించిన అంచనాల ప్రకారం 292.15 కోట్లు విడుదల చేస్తూ టీడీపీ సర్కారు 2018లో ఉత్తర్వులు ఇచ్చింది.. అంటే మొదటి సొరంగంలో కేవలం 3.6 కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తేలింది. రెండో సొరంగంలో 10.7 కిలోమీటర్ల నుంచి 18.7కిలోమీటర్ల వరకూ పనులు మిగిలి ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని పూర్తి చేసేందుకు 299.48 కోట్ల నుంచి 720.26 కోట్లకు అంచనాలు పెంచుతూ నిధుల విడుదలకు అనుమతించింది. అంటే రెండో సొరంగంలో 8 కిలోమీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నట్లు లెక్కించారు.. 2018 ఆగస్టులో మొదలైన పనులు నత్తనడకన సాగుతున్నాయి. సాంకేతిక ఇబ్బందుల వల్ల టీడీపీ హయాంలో పనులు ఆలస్యమైనట్లు అధికారులు కూడా చెబుతున్నారు. తిరిగి 2019 జూన్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై సమీక్షలు జరిపి పనుల వేగం పెంచింది. చివరికి తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలించడానికి సీఎం జగన్ పర్యటించిన సందర్భంగా అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం పనులు తిరిగి ప్రారంభమైన 2018ఆగస్టు నుంచి ఇప్పటివరకూ మొదటి సొరంగం 2 కిలోమీటర్లు, రెండో సొరంగం 600 మీటర్లు మాత్రమే పూర్తయ్యాయి. మొదటి సొరంగం పనుల్లో జరిగిన రెండు కిలోమీటర్ల పనుల్లో 1.4 కిలోమీటర్ల మేర పనులు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగాయని అధికారులు తాజాగా నివేదించారు. అంటే అంతకుముందు టీడీపీ హయాంలో కేవలం 600 మీటర్లు మాత్రమే జరిగినట్లు. ఇప్పుడు దీనిమీదే అధికార, విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. అంటే టీడీపీ హయాంలో సవరించిన అంచనాల ప్రకారం కొత్త ఏజెన్సీలకు పనులు అప్పగించే నాటికి మొదటి సొరంగంలో 80 శాతం, రెండో సొరంగంలో 57 శాతం పనులు పూర్తయినట్లు అర్ధమవుతోంది. తాజాగా అధికారులు ముఖ్యమంత్రికి తెలిపిన వివరాలను బట్టి చూస్తే మొదటి సొరంగం పనులు మరో రెండు కిలోమీటర్లు పూర్తి చేసుకుని 94 శాతానికి చేరాయి. అలాగే రెండో సొరంగం పనులు ఇరు ప్రభుత్వాల హయాంలో కలిపి కేవలం 600 మీటర్లు అంటే 60 శాతం మాత్రమే పూర్తయినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వివరాలను క్రోడీకరిస్తే టీడీపీ హయాంలో వెలిగొండ ప్రాజెక్టులో మొదటి టన్నెల్ పనులు 600 మీటర్లు మాత్రమే పూర్తికావడం వాస్తవమే అని తెలుస్తోంది. అయితే ఇందుకు కారణం సాంకేతిక కారణాలే అని అధికారులు చెబుతున్నారు. అయితే వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా అంచనాల పెంపులో 414 కోట్ల అవినీతి ఆరోపణలు మాత్రం నిర్ధారణ కాలేదు.

బొత్సతో లీకులు ఇప్పిస్తున్నదెవరు? జగనా? విజయసాయిరెడ్డా?

జరిగింది చెబుతారు... జరగబోయేది చెబుతారు... లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు... ఏదో చెబుతూ కనికట్టు చేస్తారు... ఏం మాట్లాడుతున్నారో అసలు అర్ధమే కాదు... కానీ, కీలక వ్యాఖ్యలే చేస్తారు... ఈ మాటలన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా? మీరు గెస్ చేసేశారు? అవును బొత్స సత్యనారాయణ గురించే. జగన్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే, పరిపాలనాపరమైన అంశాలతోపాటు  రాజకీయంగా వైసీపీ తీసుకోబోయే ప్రతి నిర్ణయాన్నీ ప్రెస్ మీట్ పెట్టిమరీ చెప్తున్న బొత్స, తిరిగి వెనువెంటనే వాటిని ఖండించడం రొటీన్ గా మారింది. అయితే, రాజధాని అమరావతి వివాదం దగ్గర్నుంచి... బీజేపీ-వైసీపీ పొత్తు వరకు బొత్స చేస్తున్న వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు. అందుకే, విపక్ష నేతలతోపాటు, కేంద్ర ప్రభుత్వంపై బొత్స చేస్తున్న కామెంట్స్ పై రాష్ట్రంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే, మొదటి నుంచి బొత్స చేస్తున్న ప్రతి ప్రకటన వెనుకా, బలమైన కారణం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే, ప్రభుత్వం తీసుకునే ప్రతి వివాదాస్పద కీలక నిర్ణయాలన్నీ ముందుగా బొత్సతోనే చెప్పిస్తున్నారు. ఆవిధంగా రాజధాని మార్పునకు సంబంధించి మొదట హింట్‌ ఇచ్చింది కూడా బొత్స సత్యనారాయణే. డైరెక్టుగా రాజధాని తరలింపు ఉంటుందని చెప్పకపోయినా, అమరావతిలో ఏముందంటూ కామెంట్ చేశారు. అప్పుడు చేసిన కామెంట్... ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు అతికినట్టు సరిపోతోంది. అలాగే మరోసారి అమరావతిలో శ్మశానం తప్ప ఏముందని కామెంట్ చేసినప్పుడే, రాజధానిని ఇక్కడ ఉంచే ఉద్దేశం లేదన్న అంశం అర్థమైపోయింది. మంత్రిస్థాయిలో బొత్స చేసిన వ్యాఖ్యలు అమరావతిలో అలజడులు, ఆందోళలకు కారణమయ్యాయి. అయితే, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని భావించిన బొత్స, తరువాత తీరిగ్గా తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మీడియా ముందుకొచ్చారు. ఆ తరువాత మళ్లీ కట్టుబడి ఉన్నానంటూ కామెంట్ చేస్తారు. ఇలా కొన్ని  ఔననీ, ఇంకొన్ని కాదని చేస్తున్న వ్యాఖ్యల వెనుక, బొత్స ఒక్కరే లేరని, ఆయనతో ఎవరో అలా మాట్లాడిస్తున్నారని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసలు బొత్స కామెంట్స్ వెనుక పొలిటికల్‌ గేమ్‌ ఉందంటున్నారు. రాజధాని విషయంలో అనేక వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన బొత్స, ఇప్పుడు ఎన్డీయేతో పొత్తు అంటూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అవసరమైతే ఎన్డీయేలో కలుస్తామంటూ బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. అయితే, బొత్స డైరెక్టుగా ఆ మాట అనకపోయినా... ఏపీ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాం...ఎంతమంది గడ్డాలైనా పట్టుకుని బతిమలాడతాం అంటూ కామెంట్ చేశారు. జగన్‌ ఢిల్లీ టూర్‌లో ప్రధానిని, అమిత్‌షాను, కేంద్ర పెద్దలను కలిసి తరువాత.. వెంటనే బొత్స నుంచి ఈ కామెంట్ రావడంతో కేంద్రంలో వైసీపీ చేరడం ఖాయమనే చర్చ పెద్దఎత్తున జరిగింది. అమరావతి విషయంలో మొదటి నుంచి బొత్స చెప్పిందే జరిగిందంటున్న విపక్ష నేతలు, రాబోయే రోజుల్లో వైసీపీ ఎన్డీయేలో చేరడం ఖాయమని, అందుకే బొత్సతో  లీకులు ఇస్తున్నారనే చర్చ జోరుగా సాగింది. బొత్స వ్యాఖ్యల ప్రకంపనల ప్రభావంతో, ఏకంగా జనసేన అధినేత పవన్‌ స్పందించాల్సి వచ్చింది. బీజేపీ-వైసీపీ పొత్తు ఉంటే, తాము బీజేపీకి దూరం జరుగుతామన్నారు. బొత్స మాటల సునామీకి పవన్ కామెంట్లే ఎగ్జాంపుల్‌. బొత్స మాటలను కాస్త జాగ్రత్తగా గమనిస్తే, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సొంతంగా చేస్తున్నవి కాదన్నది మాత్రం తెలుస్తోంది. తెర వెనుక ఉండి, ఎవరో బొత్సతో మాట్లాడిస్తున్నారన్న విషయం, అర్థమవుతోందన్న మాటలు వినపడ్తున్నాయి. ప్రభుత్వంలో కీలక శాఖకు మంత్రిగా, రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న బొత్స, ఆలోచన లేకుండా చెయ్యరని, పొలిటికల్ మైండ్ గేమ్‌లో భాగంగా, ఆయనతో ప్రకటనలు చేయిస్తున్నారని విశ్లేషిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా బొత్సతో మాట్లాడిస్తున్నారని, అది చర్చనీయాంశం అయ్యేలా చూస్తున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. బొత్సతో లీకులిప్పించి, ప్రజాభిప్రాయాన్ని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి, రాజధాని మార్పు నుంచి ఎన్డీయేలో వైసీపీ చేరడం గురించి, ఆయన లీక్స్‌ చేశారో, ఏదో అలా మాట్లాడారో తెలియదు కానీ, ఆ మాటలు మాత్రం సంచలనం అవుతున్నాయి. ఆయన చెప్పినవి కొన్ని నిజం కావడంతో, ఆయన  ప్రస్తుతం చెబుతున్నవి కూడా రేపు నిజమవుతాయన్న చర్చ జరుగుతోంది.