ఫస్ట్ టార్గెట్ పత్తిపాటి పుల్లారావు.. సంచలనం రేపుతున్న సిట్ సోదాలు!

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై వైఎస్ జగన్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిట్ మొదట మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై గురిపెట్టింది. ఆయన బినామీలేమోనన్న అనుమానంతో.. ఆయన వియ్యంకుడితో పాటు, విజయవాడకు చెందిన ఓ బిల్డర్, మరో చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో సోదాలు జరిపారు. రాజధాని ప్రకటన సమయంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు కొన్నారని, దీని వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్న అనుమానాల నేపథ్యంలో  పత్తిపాటి పుల్లారావుని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. ఆయన వియ్యంకుడి ఇంట్లో సోదాలు చేశారు. అదేవిధంగా, విజయవాడలోని పటమటలంకలో ఉండే ఓ బిల్డర్ నివాసంతో పాటు, అతని కార్యాలయంలో సోదాలు చేశారు. ఓ చిన్న స్థాయి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లోనూ సోదాలు చేశారు. అయితే, దీనిపై సిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే టీడీపీకి చెందిన మరికొంతమంది నేతల ఇళ్లలో కూడా సోదాలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్ లో చిరంజీవి ఇంటి వద్ద టెన్షన్.. ఆ పుకార్లే కారణం!

హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద ఇవాళ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏపీలో మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన చిరంజీవి ఇంటిని ముట్టడిస్తామంటూ అమరావతి యువజన జేఏసీ పేరుతో కొన్ని ఊహాగానాలు చెలరేగాయి. చిరంజీవి తీరుకు నిరసనగా ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకూ ధర్నాకు దిగుతామని వాట్సాప్, ఫేస్ బుక్ తో పాటు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రచారం జరిగింది. అయితే చిరంజీవి ఇంటి ముట్టడికి తామెలాంటి పిలుపు ఇవ్వలేదని జేఏసీ నేతలు స్పష్టత ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ధర్నా పిలుపు హైదరాబాద్ లోని పలు సోషల్ మీడియా గ్రూప్ ల్లో వైరల్ కావడంతో ఇవాళ ఉదయం నుంచే జూబ్లీహిల్స్ లోని చిరంజీవి ఇంటికి అభిమాన సంఘాల నేతలు తరలివచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోని మెగా కుటుంబ అభిమాన సంఘాల నేతలు భారీగా తరలిరావడంతో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. అమరావతి జేఏసీ నుంచి ఎవరైనా వచ్చి నిరసనలకు దిగితే ప్రతిఘటించేందుకు అభిమాన సంఘాల నేతలు తరలివచ్చినట్లు తెలిసింది. అయితే ముందుగా తాము ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోమని, అమరావతి జేఏసీ పిలుపు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకే తాము ఇక్కడికి వచ్చినట్లు చిరంజీవి అభిమాన సంఘాల నేతలు తెలిపారు. భారీ ఎత్తున అభిమానులు తరలిరావడంతో పోలీసులు చిరంజీవి నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. చిరంజీవి నివాసానికి వెళ్లే దారులను బ్లాక్ చేస్తున్నారు.

ఏపీ గవర్నర్ తో బీజేపీ, టీడీపీ నేతల భేటీలు.. ఫిర్యాదులు

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో టీడీపీ నేతల బృందం శనివారం ఉదయం భేటీ అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై.. టీడీపీ నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటనకు అనుమతి ఉన్నా,  రాజకీయ కక్షతో అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న విశాఖలో అలజడి రేపుతున్నారని మండిపడ్డారు. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని కళా వెంకటరావు కోరారు. మరోవైపు, గవర్నర్‌ బిశ్వభూషణ్ తో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలను ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. భేటీ అనంతరం జీవీఎల్ మీడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతలకు ప్రమాదం ఏర్పడే రీతిలో రాష్ట్రంలో పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఘర్షణ వైఖరిని అవలంభిస్తున్నాయని పేర్కొన్నారు. స్నేహపూర్వకమైన రాజకీయాలు ఉండాలే తప్ప.. ఇలాంటి ఘర్షణ వాతావరణం రాష్ట్రంలో నెలకొనడం బాధాకరమని అన్నారు. రోడ్లపైకి వచ్చి ఒకరినొకరు అడ్డుకోవడం సరికాదని హితవు జీవీఎల్ పలికారు.

ఏపీ పోలీసుల మెడకు చుట్టుకున్న 151...

ప్రభుత్వానికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి పోలీసులు కూడా సెక్షన్ 151 అంటే బాగా ఇష్ట పడుతున్నారని ప్రతి పక్షం ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి గురువారం విశాఖపట్నం విమానాశ్రయం బయట చంద్రబాబును అడ్డుకుని నగరంలోకి అడుగుపెట్టకుండా నిలవరించడంలో విజయం సాధించిన ఏపీ పోలీసులు ఈ క్రమంలో చేసిన సాంకేతిక తప్పు వల్ల హైకోర్టులో అడ్డంగా ఇరుక్కుపోయారు. సెక్షన్ 151 కింద మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు భద్రత కోసమే అరెస్టు చేస్తున్నట్లు చేతితో రాసిన లేఖను చంద్రబాబుకు ఇచ్చిన పోలీసు అధికారులు చివరికి ఆ సెక్షన్ వల్లే హైకోర్టులో అడ్డంగా దొరికిపోయారు.  ఎలాగా.. అంటారా.. చంద్రబాబును అరెస్టు చేయడానికి తగిన కారణాలు ఆ సెక్షన్‌లో లేవని న్యాయనిపుణులు అంటున్నారు. శుక్రవారం నాడు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా.. హైకోర్టు కూడా ఈ విషయాన్ని ఆక్షేపించింది.. అక్షింతలు వేసింది. ఈ లేఖను, అందులో పేర్కొన్న సెక్షన్ ను  పిటిషనర్  కోర్టు ఎదుట ప్రస్తావించినప్పుడు.. కోర్టు అభ్యంతరాలు తెలిపింది. ఆ సెక్షన్ కింద నోటీసు ఇవ్వడం తప్పని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  ఒక వ్యక్తి నేరం చేయకుండా అదుపు చేసేందుకు మాత్రమే సెక్షన్ 151ని ఉపయోగించాలని.. డీసీపీ ఇచ్చిన నోటీసు ప్రకారం చూస్తే వ్యవహారం అలా కనిపించడం లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం.  ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ చేసిన వాదన కూడా చంద్రబాబుకే అనుకూలంగా మారింది. ఆయన తన వాదనలో చంద్రబాబు భద్రత దృష్ట్యానే ముందస్తు నోటీసు ఇచ్చి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాదనతోనే పోలీసులు ఇరుక్కున్నారు.దీనిపై పోలీసులు న్యాయస్థానంలో మరో సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాల్సిఉంది. సోమవారం దీనిపై మళ్లీ విచారణ జరుగనుంది.  చంద్రబాబును విశాఖ విమానాశ్రయం వెలుపల అడ్డుకుని నిలవరించిన వందలాది మంది ఆందోళనకారులను చెదరగొట్టకుండా చంద్రబాబును ముందస్తు నిరోధక చర్య కింద అరెస్టు చేయడం ఏమిటని రాష్ట్ర హైకోర్టు ఆక్షేపించింది. చంద్రబాబును నిరోధించడంతో పాటు ఆయన్ని అడ్డుకున్న వారిని అడుపుచేసే పనిని పోలీసులు ఎందుకు చేయలేకపోయారని హైకోర్టు ప్రశ్నించింది. అధికార పక్షానికి ఒక రూల్, ప్రతిపక్షాలకు మరో రూల్ ఎలా ఉంటాయని వ్యాఖ్యానించింది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో.. ఎందుకు వెనక్కు వెళ్లమంటున్నారో లిఖితపూర్వకంగా ఇస్తే తప్ప వెళ్లనంటూ రోడ్డుమీదే బైఠాయించిన చంద్రబాబుకు పోలీసులు అనాలోచితంగా ఇచ్చిన లేఖతో మొత్తం పరిస్థితులను తనకు అనుకూలంగా మల్చుకుని హైకోర్టులో తనకు అనుకూల వాదనలు వచ్చేలా చేసుకున్నారని న్యాయ నిపుణుల అంటున్నారు. కరడుగట్టిన నేరస్తులను అదుపులోకి తీసుకోవడానికి ఉద్దేశించిన సెక్షన్ 151ని మాజీ ముఖ్యమంత్రిపై ప్రయోగించిన పోలీసులు తమ స్వయంకృతాపరాధం వల్లే న్యాయస్థానం ముందు నిలబడాల్సి వచ్చిందని,  ప్రజలు మొత్తం గమనిస్తున్నారని, ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేయడం మానుకోవాలని తెలుగుదేశం నాయకులు సూచిస్తున్నారు.

ఇది లక్ అంటే.. గూగుల్ పేలో 3 వేలు పంపితే లక్ష క్యాష్ బ్యాక్ వచ్చింది!

ఒకప్పుడు మనీ ట్రాన్స్ ఫర్ చేయాలంటే.. ఓ విధానం ఉండేది, కాస్త సమయం పట్టేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్, యాప్ ఉంటే చాలు.. నిమిషంలో మనీ ట్రాన్స్ ఫర్ చేయొచ్చు. ఇలా మనీ ట్రాన్స్ ఫర్ ని ఇంత సులభం చేసిన యాప్స్ లో గూగుల్ పే ఒకటి. ఈ యాప్ లో మనీ ట్రాన్స్ ఫర్ చేస్తే రివార్డ్స్ కూడా వస్తుంటాయి. అయితే, ఎక్కువ సార్లు 'బెటర్ లక్ నెక్స్ట్ టైం', అప్పుడప్పుడు పదుల్లో, వందల్లో.. ఎప్పుడో ఒకసారి వేలల్లో కాష్ బ్యాక్ వస్తుంటాయి. వేలల్లో క్యాష్ బ్యాక్ రావడం అనేది చాలా అరుదు. కానీ తాజాగా ఓ వ్యక్తికి మాత్రం ఏకంగా లక్ష రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది.  అనంతపురం జిల్లా పెనుకొండకి చెందిన సూర్య ప్రకాశ్ అనే యువకుడు.. గూగుల్ పే ద్వారా మూడు వేల రూపాయలను తన స్నేహితునికి పంపగా, అతనికి ఏకంగా రూ. 1,00,000 క్యాష్ బ్యాక్ వచ్చింది. మొదట షాక్ అయ్యాడు, నమ్మలేకపోయాడు. కానీ, కాసేపటికే సూర్య ప్రకాశ్ బ్యాంకు ఖాతాకు లక్ష జమ అయినట్టు మెసేజ్ రావడంతో ఇక అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆ ఆనందాన్ని సన్నిహితులతో పంచుకున్న సూర్య ప్రకాష్.. అదే ఆనందంతో తను తీసుకున్న రూ.80 వేల గోల్డ్ లోన్ అప్పుని వెంటనే తీర్చేశాడు. మొత్తానికి అందరినీ 'బెటర్ లక్ నెక్స్ట్ టైం' అంటూ ఆడుకునే గూగుల్ పేతో సూర్య ప్రకాష్ కి మాత్రం బాగానే లక్ కలిసొచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ను వెనక్కినెట్టిన తెలంగాణ.. సింగిల్ డేలో పవర్ ఫుల్ రికార్డు...

తెలంగాణ విద్యుత్ శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఏపీలో కూడా సాధ్యంకాని రికార్డును తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణలో ఒక్కరోజే 13వేల 168 మెగావాట్ల అత్యధిక వినియోగం జరిగింది. ఇంత పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడినా, ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సంస్థలు పవర్‌ సప్లై చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. 23 జిల్లాల ఉమ్మడి ఏపీ చరిత్రలో 2014 మార్చి 23న అత్యధికంగా 13వేల 132 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంతకు మించిన వినియోగంతో 2020 ఫిబ్రవరి 20న రికార్డు నెలకొల్పింది. 2014లో తెలంగాణ రాష్ట్రం మొత్తం 47వేల 338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, 2018-19లో అది 68వేల 147 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే, ఆరేళ్లలో దాదాపు 44శాతం వినియోగం పెరిగింది. అదే సమయంలో దేశ సగటు మాత్రం 23శాతంగా మాత్రమే నమోదైంది. ప్రపంచంలో ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం... దేశ సగటునే మించిపోయింది. దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 11వందల 81 మెగావాట్లు కాగా, తెలంగాణలో మాత్రం 18వందల 96 మెగావాట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 13వందల 56 మెవావాట్లుంటే.... అది ఆరేళ్లలో 39.82శాతం పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలతో విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఇక, 2018 జనవరి 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి, రాష్ట్రంలో 19లక్షలకు పైగా పంపు సెట్లు ఉంటే, ఇప్పుడు 24లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఇక, 2014లో ఎత్తిపోతల పథకాలకు కేవలం 680 మెగావాట్ల డిమాండ్ ఉండగా, అదిప్పుడు 2వేల200 మెగావాట్లకు పెరిగింది. అయితే, ప్రభుత్వం చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా ఇది మరింత పెరిగే అవకాశముంది. ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుముందు, పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ప్రకటించే పరిస్థితి ఉండగా, ఇప్పుడు, 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. పట్టణీకరణ, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధితో వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు భారీగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి కోటీ 11లక్షలకు పైగా వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇప్పుడది కోటీ 54లక్షలు దాటింది. అంటే, విద్యుత్ కనెక్షన్లలో 38.61శాతం వృద్ధి నమోదైంది. ఇక, తెలంగాణ ఏర్పడే నాటికి 233 సబ్ స్టేషన్లుంటే, అవిప్పుడు 347కి చేరాయి. ఇక, తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి స్టేట్‌లో 7వేల 78 మెగావాట్ల స్థాపిత విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడది 16వేల 246 మెగావాట్లకు చేరిందని, అలాగే, అప్పుడు 74 మెగావాట్ల సోలార్ పవర్ మాత్రమే అందుబాటులో ఉంటే, ఇప్పుడు 3వేల 650 మెగావాట్లకు పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగం... ఇప్పుడు ఇంత గొప్పగా రూపాంతరం చెందడానికి ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదని, దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, అనుక్షణ పర్యవేక్షణ, విద్యుత్ ఉద్యోగుల కృషి ఉందని జెన్ కో అండ్ ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ఇక, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలను త్వరలోనే నిజం చేస్తామన్నారు.

మరో భారీ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో... అమెరికాను తలదన్నేలా GSLV-F10

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమవుతోంది. పీఎస్ఎల్వీ రాకెట్‌ ప్రయోగాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ఇస్రో... అదే స్ఫూర్తితో ఇప్పుడు జీఎస్ఎల్వీ సిరీస్‌పై ఫోకస్‌ పెట్టింది. అత్యంత బరువైన ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన జీఎస్ఎల్వీ అంతరిక్ష వాహక నౌకల రూపకల్పనలో... స్వీయ పరిజ్ఞానాన్ని సాధించిన ఇస్రో ఇప్పుడు ఆ ప్రయోగాలపై గురిపెట్టింది. శ్రీహరికోట నుంచి మార్చి 5న జీఎస్ఎల్వీ-ఎఫ్10 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు.  ఇప్పటికే GSLV వాహక నౌక అనుసంధానం ప్రక్రియ పూర్తికావచ్చింది. ఇక ఉపగ్రహాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది. ఈ ప్రయోగం ద్వారా 2వేల 300 కిలోల బరువున్న గీశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఇంధనం నింపే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్... షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ల పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. జీఎస్ఎల్వీ-ఎఫ్10 ప్రయోగం కారణంగా మరో ప్రయోగం వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 18న PSLV-C49 రాకెట్‌ను ప్రయోగించాలనుకున్నారు. ప్రస్తుతం జీఎస్ఎల్వీ-ఎఫ్10పై దృష్టిపెట్టినందున, ఏప్రిల్ మొదటివారంలో PSLV-C49 ప్రయోగం చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.

జగన్ ఇంటి దగ్గరలో టెన్షన్ టెన్షన్... కలకలం రేపిన ఇద్దరు పిల్లలు...

పిల్లలన్నాక అల్లరి పనులు చేస్తుంటారు. అయితే, పిల్లలు చేసే అల్లరి పనులు ఒక్కోసారి పెద్దలను టెన్షన్ పెట్టిస్తుంటాయి. వాళ్లు చేసే కోతి పనులు కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలకు దారి తీస్తుంటాయి. సరదా కోసం వాళ్లు చేసే పనులు పెద్దలను టెన్షన్ పెడుతుంటాయి. పిల్లల కోతి పనులు పేరెంట్స్ తోపాటు అందరినీ ఉరుకులు పరుగులు పెట్టిస్తుంటాయి. ఇలాంటి హైటెన్షన్ ఇన్సిడెంటే ఏపీ రాజధాని ప్రాంతంలో జరిగింది. ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయారు. వెళ్లడమైతే వెళ్లారు గానీ, బయటికి రాలేకపోయారు. ఇంకేముంది, ఉరుకులు పరుగులు పెట్టడం పెద్దల వంతయ్యింది. వాళ్లను బయటికి తీసేందుకు నానా తిప్పలు పడాల్సి వచ్చింది.   గుంటూరు జిల్లా తాడేపల్లిలో నూకలపేట ఉర్దూ పాఠశాలలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ రెండు గోడల మధ్యలోకి వెళ్లారు. వెళ్లడమైతే సులభంగానే వెళ్లారు గానీ, బయటకి రాలేక అక్కడే ఇరుక్కుపోయారు. అయితే, గోడ సందులో నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నించినా, వాళ్ల వల్ల కాలేదు. దాంతో, గోడ సందులోనే ఇరుక్కుపోయి ఎటూ కదల్లేక సతమతమయ్యారు. బయటికి వచ్చేందుకు చేసిన ప్రయత్నంలో ఊపిరిరాడక నరకయాతన పడ్డారు. దాంతో, ఏడవడం, గట్టిగా అరవడం ప్రారంభించారు. చిన్నారుల కేకలను గమనించిన స్థానికులు, స్కూల్ సిబ్బంది... వాళ్లను చాకచక్యంగా బయటికి తీశారు. అయితే, రెండు గోడల మధ్యలో నుంచి బయటికి తీసే క్రమంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే, రెండు గోడల మధ్య ఇరుక్కున్న పిల్లలిద్దరూ నూకలపేట ఉర్దూ స్కూల్‌లో చదువుకునే విద్యార్ధులు కాదని పాఠశాల సిబ్బంది తెలిపారు. దాంతో, పిల్లలను అలా, నిర్లక్ష్యంగా ఎలా వదిలిపెట్టారంటూ తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వాళ్లు ఎక్కడ ఉన్నారో, ఎలా ఆడుకుంటున్నారో గమనించాలని, లేదంటే ప్రమాదాల బారినపడే ప్రమాదముందని పోలీసులు హెచ్చరించారు. మొత్తానికి, తాడేపల్లి నూకలపేట ఉర్దూ స్కూల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా టెన్షన్ పుట్టించింది. అయితే, పిల్లలిద్దరూ క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులతోపాటు అక్కడున్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.  

ఢిల్లీలో బలగాల కవాతు... 42కి పెరిగిన మృతులు...

ఢిల్లీ అల్లర్ల మృతుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నవారిలో పలువురు మృత్యువాత పడుతున్నారు. దాంతో, ఢిల్లీ అల్లర్ల మృత్యుల సంఖ్య 42కి చేరింది. ఇంకా, 200మందికి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈశాన్య ఢిల్లీలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దుకాణాలు, ఇతర కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి.  ఢిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సిట్ దర్యాప్తు చేపట్టింది. మరోవైపు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు పెద్దఎత్తున కవాతు నిర్వహించారు. వీధుల్లో మార్చ్ ఫాస్ట్ చేపట్టారు. అలాగే, అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించిన ఢిల్లీ అడిషనల్ కమిషనర్ ఓపీ మిశ్రా ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. భయం వద్దంటూ.. భరోసా కల్పించారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 48 ఎఫ్ఐఆర్ లు నమోదు కాగా, 130మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గా ఎస్ఎన్ శ్రీవాస్తవను నియమించారు. తాము భద్రంగా ఉన్నామనే భావనను ప్రజల్లో కలిగించడమే తన ప్రధాన కర్తవ్యమని, వారిలో నమ్మకం కలిగించేందుకు కృషి చేస్తానని శ్రీవాస్తవ వెల్లడించారు. మరోవైపు, ఢిల్లీలో పరిస్థితి కుదుటపడుతోందని, వదంతులను ఎవరూ నమ్మవద్దని ప్రజలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు.

లక్షా 65వేల కోట్ల అంచనాలతో తెలంగాణ బడ్జెట్.. లెక్కలు పక్కాగా ఉండాలన్న కేసీఆర్...

తెలంగాణ వార్షిక బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఏఏ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఏ రంగానికి ఎంత కేటాయించాలి? ఆదాయం పెంచుకునే మార్గాలేంటి? కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులెన్ని? ఇలా, అన్నింటిపై ఆర్ధికశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. అయితే, ఒకవైపు ఆర్ధిక మాంద్యం... మరోవైపు కేంద్రం నుంచి నిధులు తగ్గడంతో... వాస్తవిక లెక్కల ఆధారంగా బడ్జెట్‌ను తయారు చేయాలని కేసీఆర్‌ ఆదేశించారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల కారణంగా లక్షా 82వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం... ఆర్ధిక మాంద్యం కారణంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ అంచనాలను లక్షా 46వేల కోట్లకు కుదించుకుంది. అయితే, ఆర్ధిక మాంద్యం ఇంకా కొనసాగుతుండటం... మరోవైపు, కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాను 19వేల 718 కోట్ల నుంచి 15వేల 987 కోట్లకు తగ్గించడంతో ఆ ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్రంగా పడుతోంది.అయితే, ఈసారి 10 నుంచి 12శాతం వృద్ధితో బడ్జెట్ రూపకల్పన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ఆర్ధికశాఖ అధికారులు చెబుతున్నారు. సుమారు లక్షా 65కోట్ల అంచనాలతో ఈసారి బడ్జెట్ ఉంటుందని అంటున్నారు. రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు దాదాపు 9.5శాతం ఉండటంతో, మిగిలిన లోటును కోకాపేటలో భూములను విక్రయించడం ద్వారా సమీకరించుకోవాలని ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు. భూముల విక్రయం ద్వారా దాదాపు 10వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోబోంది. గతేడాది రాష్ట్రానికి ఇవ్వాల్సిన 19వేల 719కోట్లలో కేవలం, 10వేల 304కోట్లను మాత్రమే కేంద్రం ఇవ్వడంతో, ఆర్ధికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అలా, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కోత పడుతుండటం, మరోవైపు ఇవ్వాల్సిన నిధులకు ఎగనామం పెడుతుండటంతో, వాస్తవ లెక్కల ఆధారంగా మాత్రమే బడ్జెట్‌ రూపకల్పన జరుగుతోంది.

'కేజీఎఫ్' హీరో హత్యకు కుట్ర.. నిందితుడిని ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు!

'కేజీఎఫ్' మూవీతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న కన్నడ స్టార్ యశ్ హత్యకు కుట్ర చేసిన స్లమ్ భరత్ అనే మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ ను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. భరత్ పై ఓ మర్డర్ కేసు సహా 50కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాదిగా యశ్ ను హత్య చేసేందుకు భరత్ ప్లాన్ చేస్తుండగా, అతను ప్లాన్ ను అమలు చేయకముందే పోలీసులు దాన్ని భగ్నం చేశారు. భరత్ ని గత సంవత్సరం యూపీలో అరెస్ట్ చేసిన పోలీసులు, కర్ణాటకకు తీసుకువచ్చారు. కాగా, ఓ కేసుకి సంబంధించి సీన్ రీ కన్ స్ట్రక్షన్ నిమిత్తం తాజాగా అతన్ని బయటకు తీసుకెళ్లగా, పోలీసులపై అతను దాడికి దిగాడని, దీంతో ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి  జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం భరత్ తో పాటు నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో భరత్.. యశ్ హత్యకు కుట్ర పన్నినట్టు తెలిపాడు. ఈ వార్త కలకలం రేపింది. ఈ వార్తలపై అప్పట్లో యశ్ కూడా స్పందించాడు. ఇలాంటి వార్తలు తనను బాధిస్తున్నాయని, తనపై ఎటువంటి కుట్రలూ జరుగడం లేదని అప్పట్లో యశ్ మీడియాకు వెల్లడించాడు. తనకు ఎలాంటి థ్రెట్స్ లేవని, ఈ విషయమై హోమ్ మంత్రితో పాటు, డీజీపీతో మాట్లాడానని అన్నారు. యశ్ అప్పుడు ఆ వార్తల్ని ఖండించినప్పటికీ.. ఇప్పుడు, అదే క్రిమినల్ ఎన్ కౌంటర్ లో హతం అవడం చర్చనీయాంశమైంది.

చంద్రబాబుని ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం?

టీడీపీ అధినేత చంద్రబాబుని ప్రజలలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనంత కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం. ఈ తొమ్మిది నెలల కాలంలో.. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి వెళ్లడానికి ఆయనకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆయన ఏదైనా సమస్య మీద నిరసన తెలపాలి అనుకున్న ప్రతిసారి ఆయనను నిర్బంధిస్తున్నారు. ఈ తొమ్మిది నెలల కాలంలో ఆయనను నాలుగు సార్లు నిర్బంధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇసుక కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టింది. ఇసుక కొరతను ప్రభుత్వం కృత్రికంగా సృష్టించిందని, తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబు నిరసన బాట పట్టగా.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గ్రామాలలో టీడీపీ కార్యకర్తలపై.. వైసీపీ శ్రేణులు దాడులు చేస్తున్నాయని అప్పుడు టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ దాడుల్లో కొందరు టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని టీడీపీ చెప్పుకొచ్చింది. ఆ దాడులకు నిరసనగా చంద్రబాబు 'చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చారు. అయితే, చంద్రబాబును ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు పర్యటనకు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్న కారణంగా ఈ పర్యటనను అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇక కొద్ది రోజులుగా రాజధాని అంశం రాష్ట్రాన్ని ఓ కుదుపు కుదుపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు తెరలేపడంతో.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు  ఉద్యమం బాట పట్టారు. ఆ ఉద్యమానికి టీడీపీ అండగా నిలిచింది. చంద్రబాబు కూడా వారి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అయితే, ఒకసారి అమరావతి జేఏసీ బస్సు యాత్రని ప్రారభించాల్సిన సమయంలో.. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీనికి నిరసనగా చంద్రబాబు పాదయాత్రగా బస్సుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధమవడంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.  తాజాగా విశాఖ పర్యటన అయితే సరే సరి. జగన్ తొమ్మిది నెలల పాలనలో చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా చంద్రబాబు 'ప్రజా చైతన్య యాత్ర'కు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా గురువారం చంద్రబాబు విశాఖకు వెళ్లగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదట చంద్రబాబు కాన్వాయ్ ని అధికార పార్టీ కార్యకర్తలు అడ్డుకొని.. కాన్వాయ్ పైకి చెప్పులు, కోడిగుడ్లు విసిరారు. వారిని పోలీసులు నిరువరించలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకొని వెనక్కి పంపారు. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అనుమతిచ్చి ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆందోళన కారుల్ని అడ్డుకోవాల్సింది పోయి, ఇలా అనుమతిచ్చి మరీ ప్రతిపక్ష నేతని అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించింది. మొత్తానికి ఇదంతా చూస్తుంటే.. తమ నేతని కావాలనే ప్రజల్లోకి వెళ్లనివ్వకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.

విశాఖ ఘటనపై హైకోర్టు సీరియస్.. వాళ్లకో రూల్, వీళ్లకో రూలా?

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన నేపథ్యంలో నిన్న విశాఖ ఎయిర్‌పోర్టులో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు కాన్వాయ్ ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కాన్వాయ్ పైకి కోడిగుడ్లు, టొమాటోలు, చెప్పులు విసిరారు. పోలీసులు వారిని నిలువరించలేక చంద్రబాబుని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి వెనక్కి పంపించారు. అనుమతి ఇచ్చి ఇలా అడ్డుకోవడం ఏంటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మరోవైపు, ఎయిర్ పోర్ట్ వ్యవహారంపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారపక్షానికి ఒక రూల్‌, ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా?.. చట్టం ముందు అందరూ సమానమే కదా? అని ప్రశ్నించింది. అనుమతి ఇచ్చిన తర్వాత 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని క్వశ్చన్ చేసింది. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వాళ్లని కదా?.. మరి, ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?.. ఎయిర్‌పోర్టుకు రాకుండా వాళ్లని ఎందుకు నిలువరించలేకపోయారు? అని హైకోర్టు నిలదీసింది. దీనిపై వచ్చే నెల 2న కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీని ఆదేశించింది. అదే రోజే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది.

సీఎం జగన్ ఫ్రెండ్ ని బలి తీసుకున్న అభిమానం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తమకున్న అభిమానాన్ని చాటుకోవాలన్న తాపత్రయంతో ఇద్దరు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన విశాఖ జిల్లాలోని అనకాపల్లిలో జరిగింది. పట్టణ పరిధిలో నివాసం ఉంటున్న ఏడిద జగదీష్ (39), ముప్పిడి శ్రీను (42) వైసీపీ అభిమానులు. జగదీష్, తన చిన్న వయసులో హైదరాబాద్ లోని పబ్లిక్ స్కూల్ లో వైఎస్ జగన్ తో కలిసి చదువుకున్నాడు. ఆ స్నేహమే పెద్దయ్యాక జగన్ మీద అభిమానంగా మారింది. అయితే ఆ అభిమానమే ఇప్పుడు ఆయనను బలి తీసుకుంది. జగన్ తో తీయించుకున్న ఫోటోలు, జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఫొటోలతో కలిపి ఓ భారీ ఫ్లెక్సీని తయారు చేయించాడు. దానిని తన ఇంటి ముందు కట్టేందుకు శ్రీనుతో కలిసి జగదీష్ డాబా పైకి ఎక్కాడు. అయితే, ఆ సమయంలో గాలి అధికంగా వీచడంతో, ఫ్లెక్సీ ఒక్కసారిగా ఇంటి ముందు ఉన్న విద్యుత్ తీగలపై పడింది. దీంతో ఫ్లెక్సీని పట్టుకుని ఉన్న ఇద్దరూ షాక్ కు గురై మరణించారు.

మోడీ, బాబు వంటి వీఐపీల సెక్యూరిటీ చేతిలో బ్రీఫ్ కేస్.. దానిలో ఏముందో తెలిస్తే షాక్!

జెడ్ లేదా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే ప్రముఖులను ఎప్పుడైనా గమనించారా?. ప్రధానిని మొదలుకొని ప్రత్యేక రక్షణ అవసరమైన పలువురు ప్రముఖులకు ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఈ ప్రముఖుల చుట్టూ సెక్యూరిటీ వారిని సరిగ్గా గమనిస్తే.. ఒకరిద్దరి చేతుల్లో బ్రీఫ్ కేస్ లు కనిపిస్తాయి. ఆ బ్రీఫ్ కేస్ లో ఏముంటదని ఎప్పుడైనా ఆలోచించారా?.. అబ్బే ఏముంది ఆ ప్రముఖులకు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ కానీ, విలువైన వస్తువులు కానీ ఉండి ఉంటాయి అంటారా?.. అలా అనుకుంటే మీరు పప్పు, సాంబార్, రసం ఇలా అన్నింట్లో కాలేసినట్టే. అది బ్రీఫ్ కేస్ లా కనిపిస్తుంది.. కానీ బ్రీఫ్ కేస్ కాదు. బ్రీఫ్ కేస్ లా కనిపించే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. బ్రీఫ్ కేస్ ఏంటి? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏంటి? అని షాక్ అవుతున్నారా.. నిజం.. ఆ బ్రీఫ్ కేస్ ఓ పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాంటిది. అది ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఇది జెడ్ లేదా జెడ్ ప్లస్ రక్షణ కల్పించే అందరికీ ఉంటుంది. ఒక వేళ సదరు వీఐపీ మీద దాడి జరిగితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లా పనిచేస్తుంది. దాడి జరిగినప్పుడే కాదు, సదరు సెక్యూరిటీ అధికారికి దాడి జరగవచ్చేమో అనే అనుమానం వచ్చినా ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయవచ్చు. ఇది ప్రముఖులకు తక్షణ మరియు తాత్కాలిక రక్షణ కల్పించే కవచంగా పనిచేస్తుంది. ప్రధాని మోడీ పక్కన ఉండే సెక్యూరిటీ చేతిలో బ్రీఫ్ కేస్ ఉంటుంది. అది పోర్టబుల్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్టే. అంతెందుకు టీడీపీ అధినేత చంద్రబాబు  శుక్రవారం విశాఖ పర్యటనకు వెళ్లగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది కదా. విశాఖ విమానాశ్రయంలో వైసీపీ కార్యకర్తలు.. చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకున్నారు. కోడిగుడ్లు, చెప్పులు విసురుతూ కాన్వాయ్ మీదకు దూసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బంది.. వారి చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేసి రక్షణ కవచంగా ఉపయోగించారు. అలా ఆ  బ్రీఫ్ కేస్ ప్రముఖులకు తక్షణ మరియు తాత్కాలిక రక్షణ కల్పించే కవచంగా ఉపయోగపడుతుంది.

సీఎం పోలవరం పర్యటనలో రచ్చ.. పోలీసులు వర్సెస్ వైసీపీ నేతలు!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా.. ప్రాజెక్ట్ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. సీఎం హోదాలో జగన్ పోలవరానికి వెళ్లడం ఇది రెండోసారి. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన జగన్.. పోలవరం పురోగతి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.  ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు హెలిపాడ్ వద్ద పోలీసులకు- వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం జగన్ దగ్గరకు వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడంతో కొందరు వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారట. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న మరికొందరు నేతలు రంగంలోకి దిగి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగిందని సమాచారం. కాగా.. ఇటీవలే జగన్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి- సీఎం సిబ్బంది మధ్య జరిగిన వాగ్వాదం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ వివాదం మరువక ముందే తాజాగా మరోసారి ఇలాంటి ఘటన జరగడం చర్చనీయాంశమైంది.

విప్లవాత్మక చట్టం దిశగా కేసీఆర్ అడుగులు... మొత్తం వ్యవస్థ సమూల ప్రక్షాళనే లక్ష్యం

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పాలనా సంస్కరణలు చేపడుతోన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, రెవెన్యూ వ్యవస్థ సమూల ప్రక్షాళనకు కసరత్తు చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై గట్టి పట్టుదలతో ఉన్న కేసీఆర్, కొద్దిరోజులుగా ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పూర్తి పారదర్శకంగా ఉండే నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. దాదాపు 85నుంచి 90శాతం భూములకు ఎలాంటి వివాదాల్లేవని భూరికార్డుల ప్రక్షాళనతో తేలినప్పటికినీ, రెవెన్యూ యంత్రాంగం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్న అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఎలాంటి సమస్యల్లేని భూముల విషయంలోనూ ప్రజలకు నరకం చూపిస్తున్నారన్న ఆరోపణలతో, మొత్తం వ్యవస్థనే సమూలంగా మార్చేసేందుకు సిద్ధమవుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారులకు విచక్షణాధికారం లేకుండా చేయడం లేదా నామమాత్రం చేస్తూ కొత్త చట్టం రూపొందించాలని భావిస్తున్నారు. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగించే కోర్ బ్యాంకింగ్ విధానాన్నే భూముల లావాదేవీలకు కూడా అమలు చేయాలని భావిస్తున్నారు. రుణాల మంజూరు, మార్ట్ గేజ్ కోసం రైతుల పాస్‌‌బుక్స్‌ ఆధారంగా ఎలక్ట్రానిక్ భూరికార్డులను పరిగణలోకి తీసుకోవాలని గతంలోనే చట్ట సవరణ చేసినా, అది పూర్తిస్థాయిలో అమలుకాకపోవడంతో... కొత్త చట్టంలో సంబంధిత అంశాలను విధిగా పేర్కొనేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్యాంకు లావాదేవీల తరహాలోనే భూలావాదేవీలు నిర్వహించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ యంత్రాంగానికి విచక్షణాధికారాలు ఉండటం వల్లే అవినీతికి ఆస్కారం ఏర్పడిందని భావిస్తోన్న కేసీఆర్... ఏమాత్రం అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా కొత్త చట్టాన్ని తేవాలనుకుంటున్నారు. కొత్త రెవెన్యూ చట్టంలో భూములు, ఆస్తులపై సర్వాధికారం యజమానులకు ఉంటుంది. వీటి రిజిస్ట్రేషన్లను స్వతంత్ర వ్యవస్థ దగ్గర చేసుకుంటే టైటిల్‌ డీడ్‌ జారీ చేస్తారు. దానికన్నా ముందే భూములు పొజీషన్‌లో ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలిస్తారు. రిజిస్ట్రేషన్‌కు ముందే అభ్యంతరాలు స్వీకరిస్తారు. భూములు రిజిస్ట్రేషన్‌ అయినా తర్వాత అవి పరాధీనం అయినా, లేక ఆ భూములు తమవేనని ఎవరైనా అర్జీలు సమర్పించినా విచారణ జరుపుతారు. వారి వాదన నిజమేనని తేలితే వారికి నష్టపరిహారం చెల్లిస్తారు. కొత్త చట్టం ప్రకారం భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌పై సబ్‌ రిజిస్ట్రార్‌, తహశీల్దార్లకు అధికారం ఉండదు. ప్రభుత్వం ప్రతిపాదించే స్వతంత్ర వ్యవస్థ చూసుకుంటుంది. భూములు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నప్పుడు ఆ భూమికి రక్షణ కల్పించడానికి వీలుగా ప్రత్యేక రుసుమును ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఆ భూమికి వసూలు చేసే నిధిని బీమా రూపంలో జమ చేస్తుంది. స్వతంత్ర వ్యవస్థ ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ చేసి, రికార్డుల్లో మ్యుటేషన్‌ చేస్తే ఆ భూమికి కంక్లూజివ్‌ టైటిల్‌ దక్కుతుంది. ఇలా, అనేక మార్పులు చేర్పులతో, కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోన్న కేసీఆర్ ప్రభుత్వం.... విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

పోలవరం పరిశీలనకు జగన్... 2021 లక్ష్యంగా వర్క్ యాక్షన్...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇవాళ పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరంలో ఏరియల్ సర్వే నిర్వహించి, గంటన్నరపాటు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును సీఎం జగన్‌ స్వయంగా తెలుసుకోనున్నారు. 2021 చివరి నాటికల్లా ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో... పనుల వేగవంతానికి దిశానిర్దేశం చేయనున్నారు. స్పిల్‌వే 18వ గేటు దగ్గర ఏర్పాటు చేసిన పోలవరం పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు. అనంతరం, హిల్‌ వ్యూ-2పైకి వెళ్లి స్పిల్‌వే కాంక్రీట్ పనులను పరిశీలిస్తారు. అలాగే, గోదావరి నది ఒడ్డుకు వెళ్లి ఎగువ కాఫర్ డ్యామ్‌ను చూస్తారు. అక్కడ్నుంచి పోలవరం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలన తర్వాత, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశంకానున్నారు. పనులు జరుగుతున్న తీరు, నిర్వాసితుల పునరావాసంపై ఉన్నతస్థాయి సమీక్షిస్తారు. ముఖ్యంగా పరిహారం, పనుల వేగవంతంగా అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, ఈ సమావేశంలోనే నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.