ఆంధ్రప్రదేశ్ లో 252 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

* కరోనా పాజిటివ్ తో 1 మరణం నమోదు * ఆదివారం ఒక్కరోజే 60 కొత్త కేసులు నమోదు * ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం లో ఇప్పటి వరకు నమోదు కాని కరోనా పాజిటివ్ కేసులు ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన పరీక్షల్లో ఒక్క కర్నూలులో 26 పాజిటివ్ కేసులు. జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసుల వివరాలిలా ఉన్నాయి. అనంతపురం - 3, చిత్తూరు - 17, తూర్పుగోదావరి - 11, గుంటూరు - 30, కడప - 23, కృష్ణ - 28, కర్నూలు - 53, నెల్లూరు - 34, ప్రకాశం - 23, శ్రీకాకుళం - 0, విశాఖపట్నం - 15 , విజయనగరం - 0, పశ్చిమగోదావరి - 15. ఈ రోజు వరకు నమోదైన కేసులలో విదేశాల నుంచి వొచ్చిన వాళ్ళు 11. వారి కాంటాక్ట్స్ 6 మరియు వైరస్ లక్షణాలతో చేరిన వాళ్ళు మరో ఆరుగురు ఉన్నట్టు సమాచారం.

ఎపి సిఎం జగన్ కు ప్రధాని మోడీ ఫోన్ కాల్

ముఖ్యమంత్రి   వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి  ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం ఫోన్ చేసి, కోవిడ్ _19 నివారణా, నియంత్రణ చర్యల గురించి మాట్లాడారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ లో , ఎక్కువగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యల గురించి ప్రస్తావన వచ్చినట్టు సమాచారం.  కరోనా వ్యాధిని ఎదుర్కోవటంలో ఎపి ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకు సాగటం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో  స్థానిక ఎన్నికల ఊపులో ఉండి కరోనా ను అశ్రద్ధ చేశారు. తీరా పరిస్థితిని గుర్తించిన తర్వాత కూడా తగిన రీతిలో స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కూడా విపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో , ప్రధాని-ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.

వైఎస్ఆర్సీపీ పై గవర్నర్ కు టీ డీ పీ ఫిర్యాదు 

తెలుగుదేశం పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రామానాయుడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు లేఖ రాశారు. వైకాపా నాయకులు కరోనా వ్యాప్తి చెందేలా వ్యవహరిస్తున్నారని తెదేపా నేతలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం అన్నట్లుగా నగదు పంపిణీ చేస్తున్నారని గవర్నర్​కు ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌లో అందించే ఆర్థికసాయాన్ని వైకాపా దుర్వినియోగం చేస్తోందని ఫిర్యాదు చేశారు. లాక్​డౌన్‌లో ఇస్తున్న రూ.1000 నగదు, నిత్యావసరాలను దుర్వినియోగం చేస్తున్నారని లేఖలో ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం అన్నట్లు వైకాపా నేతలు నగదు పంపిణీ చేస్తున్నారని తెదేపా నేతలు విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం అన్నట్లుగా నగదు పంపిణీ చేస్తున్నారని గవర్నర్​కు వివరించారు.సామాజిక దూరం పాటించకుండా సమూహంగా వెళ్లి నగదు పంపిణీ చేస్తున్నారని తెదేపా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

కొండపోచమ్మ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ఇళ్ళు నేల మట్టం! 

సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకుండా, మరోవైపు హైకోర్టులో స్టే ఉండగానే పోలీసుల పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా చేస్తున్న అధికారులు. అడ్డుకున్న రైతుల్ని బెదిరిస్తూ పోలీసులతో పక్కకు నెట్టేస్తూ లాక్‌డౌన్‌లోనూ పనులు కొనసాగిస్తున్నారు.  బహిలింపూర్, మామూదాల గ్రామాల్లో కి ప్రజలు వెళ్లకుండా అడ్డంగా కాల్వను తొవ్వుతూ అడ్డుకున్న రైతులను పోలీసులు కెమెరాలతో వీడియో తీస్తూ బెదిరించే ప్రయత్నం చేశార‌ని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.   రెండు గ్రామాల పరిధిలోని రైతులకు సంబంధించి న పరిహారం చెల్లించకుండా రైతుల పైనే కేసులు పెడతామని బెదిరింపులు చేస్తున్నారు. ఒకవైపు కారోనాతో రైతులు బెంబేలెత్తిపోతుంటే ఇదే సమయంలో బలవంతంగా పనులు చేస్తే ప్రతిపక్షాలు గానీ ప్రజాసంఘాలు గానీ, రైతులుగానీ అడ్డుకోరని పనులను వేగవంతం చేశారు.  గత వారం రోజులుగా ఈ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలోని ఇళ్ళని నేల మట్టం చేశారు. అడ్డుకున్న గ్రామస్థులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నార‌ని స‌త్య‌నారాయ‌ణ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

కడప జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఏ టీ ఎం సెంటర్ మూసివేత!

★ఏటీఎం సెంటర్ పై ఉమ్మేసిన యువకుడు ఏ టీ ఎం సెంటర్లకు వెళ్లే వారూ ఓ సారి ఈ వార్త చదివి, ఆనక ఆలోచించి, నిర్ణయం తీసుకోండి. అసలే దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. కరోనా భయాందోళన ప్రపంచాన్ని కుదిపేస్తున్న వేళ, ఉంటే ఇంట్లో ఉండాలని, ఏవైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తుంటే, ఒకతను మాత్రం, ఎవరూ ఊహించని పని చేశాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు, పట్టణంలోని రాయల్ సర్కిల్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం సెంటర్ కు వచ్చాడు. లోపలికి వెళ్లి, ఏటీఎం డిస్ ప్లే, నంబర్ బోర్డు తదితరాలపై లాలా జలాన్ని ఊశాడు. దీన్ని గమనించిన కొందరు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా, అతన్ని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తీసుకుని వెళ్లి, వైద్యులతో పరీక్షలు జరిపించారు. అతనికి జలుబు, దగ్గు ఉన్నాయని, 101 డిగ్రీల జ్వరం కూడా ఉందని వైద్యులు తేల్చారు. దీంతో వెంటనే ఏటీఎంను మూసివేసిన పోలీసులు, బ్యాంకు ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు. ఈ యువకుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే కేసు నమోదు చేశామని, వైద్య చికిత్స తరువాత విచారణ కొనసాగుతుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా చర్యలు!

ఏప్రిల్‌ 14 తర్వాత కేంద్రం ఇచ్చే మార్గ దర్శకాల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని అధికారులను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. కోవిడ్‌ నివారణా చర్యలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రతి ఆస్పత్రిలో కూడా ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సంబంధిత లక్షణాలతో ఎవరు వచ్చినా... కోవిడ్‌ పేషెంట్‌గానే భావించి ఆమేరకు వైద్య  సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని, దీనిపై ఇదివరకే జారీచేసిన మార్గదర్శకాలను పాటించేలా చూడాలని కూడా సీఎం ఆదేశించారు. ఢిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు పరీక్షలు వీలైనంత వేగంగా పూర్తిచేయాలని, ప్రతి జిల్లాలో కూడా ఒక టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్నికూడా పెంచాలని, ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే జరుగుతుండాలని ముఖ్యమంత్రి మరో సరి మరోసారి స్పష్టం చేశారు.

ఏపీఎస్ ఆర్టీసీ రిజర్వేషన్లు మొదలైనట్లా, కానట్లా?

ఈ నెల 14తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ గడువు ముగియనుండగా, ఇప్పటికే ఎయిర్ ఇండియా మినహా మిగతా పౌర విమానయాన సంస్థలు 15వ తేదీ ప్రయాణాలకు బుకింగ్స్ ప్రారంభించాయి. అయితే, ఆర్టీసీ మాత్రం ఇంకాకొక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. 15 వ తేదీనుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడుస్తాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.   లాక్ డౌన్ ను తొలగిస్తూ, కేంద్రం నిర్ణయిస్తే, 15వ తేదీ నుంచి రైళ్లను నడిపించేందుకు సిద్ధమని చెప్పిన ఇండియన్ రైల్వేస్, ఇప్పటికే బుకింగ్స్ ను స్వీకరించడం ప్రారంభించాయి. ఇక, ఏపీఎస్ ఆర్టీసీ సైతం 15 నుంచి బుకింగ్స్ ను ప్రారంభించింది. ఓపీఆర్ఎస్ ద్వారా ప్రయాణికులు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతానికి ఏసీ బస్సులకు మాత్రం ఇంకా రిజర్వేషన్ మొదలు కాలేదు. ఏసీ బస్ లను ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపించక పోవచ్చన్న ఉద్దేశంలో అధికారులు ఉన్నారని తెలుస్తోంది. కాగా, విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 127 రైళ్లకు 15 నుంచి బుకింగ్స్ ఇప్పటికే మొదలైనట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, కాల్ సెంటర్ మాత్రం ఇంకా ఈ విషయమై ఏ రకంగానూ స్పందించటం లేదు.

జ్యోతి ప్రజ్వలనకు పీఠాధిపతుల పిలుపు

ఈ రాత్రి 9 గంటలకు జ్యోతిని వెలిగించి, దేశ ఖ్యాతిని పెంచాలని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి, అలాగే, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. జ్యోతిని ప్రజ్వలించాలన్న ప్రధాని మోడీ పిలుపు దేవీ సంపదతో కూడినదని స్వామి స్వాత్మానందేంద్ర చెపితే, జాతి లో సమైక్య స్ఫూర్తికి ప్రధాని పిలుపు ఒక సూచిక అని చినజీయర్ వివరించారు. కరోనా మహమ్మారిని అంతమొందించడానికి అంతా సైనికుల్లా కదిలి జ్యోతిని వెలిగించాలని స్వామి స్వాత్మానందేంద్ర పిలుపునిచ్చారు. భారతావనికి నష్టం వాటిల్లకుండా ఐక్యమత్యంతో, విశాల హృదయంతో, బుద్ధి వికాసంతో కలిసి కదలాలనీ, ఈ సామూహిక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అందుకు పీఠిక కావాలనీ ఇద్దరు పీఠాధిపతులు అభిలాష, ఆకాంక్ష వ్యక్తం చేశారు.

స్కూల్స్ ఎపుడు తెరుచుకునేది ఇప్పుడే చెప్పలేమన్న కేంద్రం

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ మరికొన్నిరోజుల్లో ముగియనున్న నేపధ్యం లో, దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభించాలనే దాని మీద కేంద్ర ప్రభుత్వం విద్యారంగ, ఆరోగ్య రంగ నిపుణులతో చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరులు అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పొక్రియాల్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 14తో లాక్ డౌన్ ముగియనుందని, విద్యా సంస్థల పునఃప్రారంభంపై లాక్ డౌన్ ముగిసిన తర్వాత సమీక్ష జరిపి ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని అన్నారు. ఏప్రిల్ 14 తర్వాత కూడా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాల్సి వచ్చినా, విద్యాసంవత్సరం నష్టపోకుండా కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని పొక్రియాల్ వెల్లడించారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పెండింగ్ లో ఉన్న పరీక్షల నిర్వహణ, ఇప్పటికే పూర్తయిన పరీక్షల మూల్యాంకనం చేపట్టడంపై ఓ ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.

పోలీసన్న కు ఆంధ్ర లయోలా కాలేజీ బాసట!

విజయవాడ, గుంటూరు లోని 4వేల మంది పోలీసు సిబ్బందికి ప్రతిరోజు 4వేల గుడ్లు పంపిణి చేయనున్నట్టు ఆంధ్ర లయోలా కళాశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రకటించింది.  డిజిపి గౌతం సవాంగ్ ఈ కార్యక్రమం ప్రారంభించారు. విజయవాడ ఎఆర్ గ్రౌండ్స్ లో సోషల్ డిస్టెన్స్  నిబంధనలు పాటిస్తూ డిజిపి గౌతం సవాంగ్, విజయవాడ సిపి ద్వారకా తిరుమలరావు కోడి గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ -లాక్ డౌన్ సందర్భంగా పోలిస్ సిబ్బంది 24గంటలు ప్రజల సేవలో నిమగ్నమయ్యారని చెప్పారు. ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని సూచించిన పట్టించుకోవటంలేదన్నారు. బయటకు వచ్చే వారికి తమ సిబ్బంది కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారని చెప్పారు. ఇంకా కేవలం 9రోజులు లాక్ డౌన్ పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చునని అన్నారు. ఇప్పుడు చాల కీలకం ఈ సమయంలో ప్రజలందరు తప్పక కుండా లాక్ డౌన్ పాటించాలని విజ్ఞప్తి చేశారు. పోలిస్ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తించి ఆంద్ర లయోలా కళాశాల పూర్వ విద్యార్థులు సిబ్బందిలో ఇమ్యూనిటి పవర్ పెంచేందుకు ‍ ఎగ్స్ డోనెట్ చేయటం సంతోషంగా ఉందని డి జీ పీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

కరోనా రోగి ఇంట్లో 46 మంది నివాసం!

హైద‌రాబాద్ నారాయ‌ణ గూడ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని కింగ్ కోఠి పరదా గెట్ ప్రాంతం నుంచి ఢిల్లీ ఇస్త‌మాకు వెళ్లొచ్చిన వ్యక్తిని గుర్తించారు. ఇత‌నితో పాటు మ‌రో ఐదుగురు మార్చి 18న విమానంలో హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చారు. నాలుగు రోజుల క్రితం ఈ ఆరుగురిని గాంధీ హాస్పిటల్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. వారిలో ఒక వ్యక్తికి క‌రోనా ఉన్నట్లుగా నిర్ధార‌ణ అయింది. పాజిటివ్ వ‌చ్చిన‌ వ్యక్తిది ఉమ్మడి కుటుంబం. ఒకే ఇంట్లో ఏకంగా 46 మంది కుటుంబసభ్యులు ఉంటారు. మిగిలిన ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉంది. అయితే వీరి ఇళ్ల‌ల్లో ఒక్కొక్కరి ఇంట్లో 20 మందికి పైగా నివసిస్తున్నార‌ని తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లిన వారిని గుర్తించేందుకు అటు పోలీసులు, ఇటు హెల్త్ టీమ్స్ ఇంటింటీకి తిరుగుతూ విచారణ చేపట్టిన‌ప్పుడు ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ 46 మంది కుటుంబ సభ్యులకు గాంధీ వైద్యురాలు దీప్తి ప్రియాంక ఆధ్వర్యంలో ఇంట్లోనే వైద్య పరీక్షలు చేస్తున్నారు. వారి శాంపిళ్లు సేక‌రించి గాంధీ ఆస్పత్రిలో టెస్టులకు పంపుతామని వైద్యులు తెలిపారు. అందరికీ చేతిపై క్వారంటైన్ స్టాంప్ వేసి ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావద్దని సూచించామ‌ని చెప్పారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే ఆస్పత్రికి త‌ర‌లిస్తామ‌ని చెప్పారు. అయితే వారందరిలో ఎంతమందికి వైరస్ సోకిందనే అంశం ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ 46 మంది వ్యక్తుల ద్వారా.. ఇంకా బయటవారికైనా సోకిందా అనేది కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.

కడపలో కరోనా కోర్ , బఫర్ జోన్స్ 

* కరోనా దృష్ట్యా ఆర్టీసీ కండక్టర్లకు స్పెషల్ డ్యూటీ  కడప జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరగడంతో ఆర్టీసీ కండక్టర్ల సర్వీసులను కూడా జిల్లాలో అవసరమైన చోట వినియోగిస్తున్నారు.  జిల్లా వ్యాప్తంగా 23కు చేరుకున్నాయి కేసులు. దీంతో ఆంక్షలు కఠినతరం చేశారు పోలీసులు. రోజు రోజుకు కేసులు పెరుగుతుండటంతో అంక్షలను తీవ్రతరం చేస్తూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎస్పీ అన్బురాజన్. నిత్యావసర వస్తువులు, కాయగూరల కొనుగోలుకు ఉదయం 5 నుంచి 8వరకే అనుమతిస్తున్నారు. ఉదయం 8 గంటలు దాటితే ప్రజలు రోడ్లపై తిరక్కుండా అంక్షలు అమలులోకి వచ్చాయి. కడప నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వయంగా పర్యవేక్షిస్తున్న ఎస్పీ అన్బురాజన్, డిఎస్పీ సూర్యనారాయణ, సిఐ, ఎస్ఐలు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇటుజిల్లాలో పర్యటించనున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఇవాళ నగరానికి రానున్న డిఐజి లాక్ డౌన్ అమలుతీరును పరిశీలించనున్నారు.  కోవిద్-19 కేసులు నమోదైన ప్రాంతాల్లో  భారీగా పోలీస్ బలగాలు మొహరించారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో అత్యవసర సేవల కోసం పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆంక్షలను కాదని బయట తిరిగితే కఠినంగా వ్యవహరించక తప్పదని హెచ్చరించారు. అంక్షలను పాటించక పోతే కేసులు నమోదు చేస్తామన్నారు ఎస్పీ.  కరోనా విషయంలో ఆర్టీసీ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటోంది. వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అన్ని శాఖల సేవలను వినియోగించుకుంటోంది.ఈ నేపథ్యంలో జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో కండక్టర్లను వినియోగించుకుంటోంది. 560 మందిని వారి సొంత ప్రాంతాల్లోని పోలీసుశాఖకు అటాచ్‌ చేశారు. శుక్రవారం రాజంపేట డిపో పరిధిలోని నందలూరుకు చెందిన 13 మంది కండక్టర్లను స్థానిక పోలీసుస్టేషన్ కి కేటాయించారు. డిపోల వారీగా రాజంపేటలో 90, కడప 90, ప్రొద్దుటూరు 100,రాయచోటి 100, జమ్మలమడుగు 70,పులివెందుల 60,మైదుకూరు 50 మంది కండక్టర్లను కరోనా వైరస్‌ నివారణ బాధ్యతలను అప్పగించారు. ఈ విధులను ఉద్యోగులు అంకితభావంతో చేస్తారని, దేశాన్ని రక్షించే బాధ్యతను తమకు కూడా అప్పగించడం సంతోషంగా ఉందని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన జిల్లా కేంద్రమైన కడపలో  ఇప్పటికే కోర్, బఫర్‌ జోన్లుగా విభజించారు. ప్రజలను బయటకు రానీయకుండా గట్టి చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు ఇతర పట్టణాల్లో కూడా జనం బయటికి రాకుండా నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయించాలని సంకల్పించింది.అన్ని మున్సిపాలిటీలతోపాటు పంచాయతీల్లో కూడా గుర్తింపు కలిగిన సూపర్‌ మార్కెట్ల ద్వారా డోర్‌ డెలివరీకి నడుం బిగించింది.

చెట్టుకున్న‌ క‌ల్లుకుండ‌ను చూసే జ‌నం ఊగిపోతున్నార‌ట‌!

లాక్‌డౌన్‌తో క‌ల్లు దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. స‌మ‌యానికి గొంతులో క‌ల్లు ప‌డ‌క‌పోవ‌డంతో క‌ల్లుతాగే కొందరికి చుక్కలు కనపడుతున్నాయి. దీంతో జనాలంతా పొలాలకు, తాటి చెట్ల దగ్గరకు క్యూ కడుతున్నారు. విష‌యం చెట్టు ద‌గ్గ‌రే తేల్చుకోవ‌డానికి మందుబాబులు గుమ్మిగూడారు. చెట్ట‌కు ఒక కుండ వుంది. కానీ చెట్టు చుట్టూ జ‌నం చేరారు. కుండ‌ క‌ల్లు ఎంత మందికి కిక్కు ఇస్తుంది. అయినా జ‌నం ఎగ‌బ‌డ‌టంతో చెట్టు దిగ‌కుండా క‌ల్లు తీసే అత‌ను చెట్టు పైనే నిల‌బ‌డ్డాడు. అయితే కింద వున్న జ‌నం క‌ల్లు తాగ‌కుండానే కుండ‌ను చూస్తూ ఊగిపోయారు. క‌ల్లు కంపౌడ్ తెరుచుకోవ‌డం లేదు. చెట్టు ద‌గ్గ‌ర చుక్క దొర‌క‌డం లేదని మందుబాబులు తెగ ఇబ్బందిపడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే పనిలో పడ్డారు. మ‌త్తుకు అల‌వాటు ప‌డిన వీరు త‌మ‌కు తోచిన రీతిలో మందు కోసం తంటాలు ప‌డుతున్నార‌ట‌. చెప్పుకుంటే సిగ్గు పోతుంది.. చెప్పకుంటే ప్రాణం పోతుంది అన్నట్లుగా ప‌ల్లెల్లో ప‌రిస్థితి వుంది.

ఏపీకి వైద్య సామాగ్రిని తెచ్చిన‌ ఎయిర్ ఇండియా విమానం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖకు వైద్య సామాగ్రిని తీసుకు వ‌చ్చిన స్పెషల్ ఎయిర్ ఇండియా కార్గో విమానం ఈ రోజు 1740 IST విజయవాడ గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యంలో ల్యాండ్ అయింది. లాక్డౌన్ తర్వాత విజ‌య‌వాడ‌ విమానాశ్రయంలో ఇదే మొదటి పెద్ద విమాన ఆపరేషన్. విశాఖ మెడ్‌టెక్ జోన్‌లో ప్రస్తుతం వైద్య పరికరాల ఉత్పత్తి జరుగుతోంది. వైద్య పరికరాలను కూడా పరీక్ష చేసే 13 లాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లు ఈనెల 10వ తేదీ నుంచి మార్కెట్లోకి రానున్నాయి. దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో అత్యంత కీలకంగా మెడ్ టెక్ జోన్ మారబోతోంది. కరోనా వల్ల వివిధ దేశాలు కరోనా కిట్లు, వెంటిలేటర్లు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నాయని, ఈ తరుణంలో మన రాష్ట్రంలో మెడ్‌టెక్ జోన్‌లో ఇవి తయారు అవుతుండటం చాలా కీలకమైన అంశం. ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ వైద్య పరికరాల తయారీలో కీలకపాత్ర పోషిస్తుందని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ వెల్లడించారు.

కరోనా కురుక్షేత్రంలో పోరాడుతున్న యోధుల‌కు స‌లాం!

ఎవరైనా దగ్గినా తుమ్మినా దూరంగా జరిగే రోజులివి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సైనికుల్లా ముందు వ‌రుస‌లో ధైర్యంగా నిలబడి, తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందించే మహనీయులు వైద్యులు, నర్సులు. క‌నిపించ‌ని శ‌త్రువు క‌రోనాతో చీకటితో యుద్ధం చేస్తోన్న ప్రాణ‌దాత‌లంటూ ప్రజలు వీరిని కీర్తిస్తున్నారు. కరోనా రక్కసి ఒకవైపు భయపెడుతున్నా, ముఖానికి పెట్టుకున్న మాస్క్‌ జారి పోతుందనో, కళ్లద్దాలు కళ్లను సరిగా కవర్‌ చేస్తున్నాయో లేదోననో, చేతికున్న గ్లౌజులు సరిగా వున్నాయో లేదో అనే భయం వెంటాడుతున్నా, ఆరు గంటల పాటు ఏకధాటిగా కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా, వాష్‌రూమ్‌లకు సైతం వెళ్లకుండా, శారీరకంగా, మానసికంగా ఆలసిపోతున్నా... ఒక లక్ష్యంతో, దీక్షతో కరోనా కురుక్షేత్రంలో పోరాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులకు సేవలందించడంలో కేరళ నర్సులు ముందు వరుసలో వున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కేరళ నర్సులే ఎక్కువ మంది సేవలందిస్తున్నారు. తెల్లని దుస్తులు, నెత్తిమీద చిన్నటోపీ, చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపులతో తిరుగుతూ, రకరకాల జబ్బులతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు ముందుగా మనోధైర్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులతో పాటు నర్సులు, ఆశావర్కర్లు, ఇతర వైద్య సిబ్బందిదే కీలక పాత్ర. తమ ప్రాణాలను పణంగా పెట్టి, కరోనాతో యుద్ధం చేస్తున్నారు. ఒక తపస్సులా సేవలందిస్తోన్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, పారామెడికల్‌ సిబ్బందికి, వారి మానవత్వానికి పాదాభివందనం.

వాట్సాప్ లో ఆ 10 త‌ప్పులు చేయ‌కండి!

తెలిసో, తెలియకో వాట్సాప్ నిబంధనలను ఉల్లంఘిస్తే మీ వాట్సాప్ ఖాతా పూర్తిగా పోవడంతో పాటు మీ మీద చట్టపరమైన చర్యలు త‌ప్ప‌వ‌ట‌. అందుకే మీరు వాట్సాప్ ఉపయోగిస్తుంటే ఆ 10 త‌ప్పులు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డండి! 1. బెదిరింపు, ద్వేషాన్ని పెంచేలా మెసేజ్ లు పెట్ట రాదు! ఎవ‌రి మ‌నోభావాల‌ను, వారి పేరుప్ర‌తిష్ట‌ల‌ను దెబ్బతీసే విధంగా మెసేజ్ లను పంపకూడదు. అలాగే బెదిరింపు మెసేజ్ లు, ద్వేషాన్ని పెంచేలా ఉన్న మెసేజ్ లు, ఒకరిని వేధించే విధంగా మెసేజ్ లు పంపడం కూడా వాట్సాప్ నియమ, నిబంధనలకు విరుద్ధం. అవతలి వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ​2. నేరాలను ప్రేరేపించే ఫొటోలు, మెసేజ్ పంప‌రాదు. నేరాలను ప్రేరేపించే విధంగా ఉన్న ఫొటోలు కానీ, వాటికి సంబంధించిన వీడియోలు కానీ సాధారణ సందేశాలు కూడా కావచ్చు. ఈ విధమైన మెసేజ్ లను పంపించడం వాట్సాప్ నిబంధనలకు విరుద్ధం. మీరు తెలియక పంపిన ఇబ్బందులు త‌ప్ప‌వు. ​3. సరదాకు కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయవ‌ద్దు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సహజమే. అలాగే వాట్సాప్ లో కూడా ఫేక్ అకౌంట్లు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఫేక్ అకౌంట్ సృష్టించారన్న విషయం వాట్సాప్ దృష్టికి వెళ్తే ఆ ఖాతాను వాట్సాప్ పూర్తిగా బ్యాన్ చేస్తుంది. ​4. కాంటాక్ట్ లిస్ట్ లో లేని వారికి మెసేజ్ లు పంపరాదు! మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వారికి ఎక్కువ మెసేజ్ లు పంపకూడదు. బల్క్ మెసేజింగ్, ఆటో మెసేజింగ్, ఆటో డయలింగ్ వంటి వాటిని అస్సలు చేయకూడదు. అటువంటి తప్పులు చేసినప్పటికీ మీ వాట్సాప్ ఖాతా బ్యాన్ అవుతుంది. ​5. వాట్సాప్ యాప్ కోడ్ ని మార్చకూడదు! కొంతమంది వాట్సాప్ యాప్ కోడ్ ను మార్చాలని చూస్తూ ఉంటారు. వాట్సాప్ కోడ్ ను రివర్స్ ఇంజనీర్, కోడ్ ను మార్చాలని చూడటం, వారి సేవలకు సంబంధించిన కోడ్ ను ఎక్స్ ట్రాక్ట్ చేయడం కూడా నిబంధనలకు విరుద్ధమే. అటువంటి పనులు చేసినప్పటికీ మీ వాట్సాప్ ఖాతా బ్యాన్ లేదా సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ​6. మాల్ వేర్ తో కూడుకున్న మెసేజ్ లను ఫార్వర్డ్ చేయకండి కొంతమంది వాట్సాప్ ద్వారా మాల్ వేర్ ను పంపిస్తూ ఉంటారు. వాట్సప్ లో పంపించే ఫొటోలు, జిఫ్ లు, వీడియోల ద్వారా కొంతమంది మాల్ వేర్ మెసేజ్ లను పంపిస్తూ ఉంటారు. ఇలా మాల్ వేర్ ను పంపించడం చట్టబద్ధంగా కూడా విరుద్ధమే. కాబట్టి సరదాగా కూడా ఇటువంటి మాల్ వేర్ తో కూడుకున్న మెసేజ్ లను ఎవ్వరికీ ఫార్వర్డ్ చేయకండి. ​7. వాట్సాప్ ఖాతాను వాట్సాప్ సర్వర్ల ను హ్యాక్ చేయడం మీ వాట్సాప్ ఖాతా ద్వారా వేరే వారి వాట్సాప్ ఖాతాను హ్యాక్ చేయడానికి ప్రయత్నించడం, అలాగే వాట్సాప్ సర్వర్లను కూడా హ్యాక్ చేయకూడదు. మిగతా వారి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాలని ప్రయత్నించడం చట్టపరంగా కూడా నేరమే. అలా చేస్తే వాట్సాప్ నుంచి బ్యాన్ చేయడమే కాకుండా జైలుకు వెళ్లేలా కూడా చేస్తుంది. ​8. వాట్సాప్ ప్లస్ ను ఉప‌యోగించ‌డానికి అనుమతి లేదు. వాట్సాప్ ప్లస్ అనే థర్డ్ పార్టీ యాప్ ను ఉపయోగించడం కూడా మీరు వాట్సాప్ లో బ్యాన్ అయ్యేలా చేస్తుంది. వాట్సాప్ ప్లస్ యాప్ ను వాట్సాప్ రూపొందించలేదు. అంతేకాకుండా దాన్ని ఉపయోగించడానికి అనుమతి కూడా ఇవ్వలేదు. వాట్సాప్ ప్లస్ యాప్ డెవలపర్లకు వాట్సాప్ కు ఎటువంటి సంబంధం లేదు. ​9. ఎక్కువ మంది బ్లాక్ చేసినా ప్రమాదమే! తెలియని వారితో చాట్ చేయాలని ప్రయత్నించి మీ వాట్సాప్ ఖాతాను పోగొట్టుకోకండి. వాట్సాప్ ఖాతాను దుర్వినియోగం చేయకండి. ఒకవేళ మిమ్మల్ని ఎక్కువ మంది యూజర్లు బ్లాక్ చేసినా మీరు వాట్సాప్ లో సస్పెండ్ అయ్యే ప్రమాదం ఉంది. ​10. రిపోర్ట్ చేయకుండా చూసుకోండి! మీ ఖాతా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని తెలిస్తే ఎవరైనా సరే మీ ఖాతాను రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. అలా రిపోర్ట్ వచ్చిన ఖాతాలపై ఆయా సోషల్ మీడియా సంస్థలు తనిఖీ చేస్తాయి. నిజంగా నిబంధనలను అతిక్రమించినట్లు తెలిస్తే ఆ ఖాతాను సస్పెండ్ చేస్తారు.

ఏప్రిల్ నెలాఖరుకల్లా కరోనా మహమ్మారి తీవ్రత పెరగొచ్చు... డాక్టర్ దేవిశెట్టి సంచలన వ్యాఖ్యలు

"మనమందరం సజీవంగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక వ్య‌వ‌స్థ ముఖ్యమని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, కాబట్టి మన ప్రాధాన్యతలను సరిగ్గా గుర్తించ‌డం చాలా ముఖ్యం." "మేము కర్ణాటకలో మరియు భారతదేశంలో ఇంకా కరోనావైరస్ మహమ్మారి యొక్క తీవ్ర‌త‌కు చేరుకోలేదు, ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో ఈ వైర‌స్ తీవ్ర‌త ఎక్కువ‌గా వుంటుంద‌ని నారాయణ హెల్త్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి అన్నారు. 21 రోజుల లాక్డౌన్ డౌన్లో, "లాక్డౌన్ మరణాల రేటును కనీసం 50% తగ్గించాలి, స్థానిక లాక్డౌన్ మరియు సామాజిక దూరానికి కఠినంగా కట్టుబడి ఉండటం వంటి అన్ని చర్యలతో మేము దానిని ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు, బంతి ప్రజల కోర్టులో ఉంది, ప్రభుత్వం కాదు. ’’ "లాక్డౌన్ యొక్క ఆర్ధిక ప్రభావం మరియు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల విషయానికొస్తే, మనమందరం జీవించి ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక ప‌ర‌మైన అంశాలు ముఖ్యమైనవ‌రి నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, కాబట్టి మన ప్రాధాన్యతలను సరిగ్గా గుర్తించ‌డం చాలా ముఖ్యం." ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో పరీక్షలు తక్కువగా జ‌రుగుతున్నాయి. కాబ‌ట్టి మనం ఎక్కువ మందిని పరీక్షించడం ప్రారంభించాలా అని అడిగినప్పుడు, డాక్టర్ శెట్టి వివ‌ర‌ణ ఇస్తూ, “పరీక్ష రోగికి చికిత్స చేయడంలో సహాయపడకపోవచ్చు, అయితే ఇది ఖచ్చితంగా రోగిని వేరుచేయడం, నిర్బంధించడానికి ఉప‌యోగ‌ప‌డుతోంది. భారతీయులకు రోగనిరోధక శక్తి క‌లిగి వున్నార‌నే అపోహ గురించి, అతను ఇలా అన్నాడు, “భారతీయులు ఎక్కువ రోగనిరోధక శక్తిగా ఉండటం వెనుక సిద్ధాంతం ఏమైనప్పటికీ, చైనా, యుఎస్, ఇటలీ మరియు ఐరోపాలో వైరస్ ప్ర‌భావంతో ఎలా విధ్వంసం జ‌రిగిందో మ‌నం గ‌మ‌నించాలి. భారతీయులు ఎక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారనేది నిజమైతే మనం సంతోషకరమైన వ్యక్తులు అవుతాము. విటమిన్ సి తీసుకోవడం వ‌ల్ల క‌రోనా బారిన ప‌డ‌రు అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం గురించి డాక్టర్ శెట్టి వివ‌ర‌ణ ఇస్తూ, “ప్రజలు ఏదైనా తినవచ్చు - విటమిన్ సి, వెల్లుల్లి మరియు వారు రోగనిరోధక శక్తిని మెరుగుపరచాలనుకుంటున్నారు మరియు వారికి సంతోషాన్నిస్తుంది. COVID-19 క్రొత్తది కనుక ఏదైనా నిరూపించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు, కాబట్టి ఇది ఎలా స్పందిస్తుందనే దానిపై ఎవరూ ఖచ్చితమైన అభిప్రాయాన్ని ఇవ్వలేరు. అవును, మంచి నిద్ర, పోషకమైన ఆహారం మరియు మంచి మానసిక ఆరోగ్య సమతుల్యత ఖచ్చితంగా COVID 19 కి వ్యతిరేకంగా పోరాడటానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ’ రోగిని నిర్బంధించడం వల్ల చెదిరిన మానసిక స్థితి ఖచ్చితంగా రోగనిరోధక శక్తి పై ప్ర‌భావం చూపుతోంది. కాని ఇది చాలా సాధారణం కాదని నేను నమ్ముతున్నాను. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో వైరస్ ఎలా ఉందో దానితో పోలిస్తే భారతదేశంలో వైరస్ తక్కువగా ఉందని ఆయన అన్నారు. లాక్డౌన్ చేయ‌డం వ‌ల్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర‌ప్ర‌భావం ప‌డుతోంద‌ని గ‌గ్గోలు పెడుతున్నారు. ప్ర‌జ‌లు క‌ష్టాల‌ను ఎదుర్కొంటున్నారంటున్నారు. అయితే కష్టాల విషయానికొస్తే, మనమందరం జీవించి ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికాంశాలు ముఖ్యమైనవ‌ని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఇక్క‌డ ఆర్థికాంశాల కంటే ప్రాణాలు కాపాడుకోవ‌డం చాలా ముఖ్యం.

లక్ష బాడీ బ్యాగ్స్ సిద్ధం చేయమని అమెరికా ఫెమాను ఆదేశించిందా?

ఇటలీలో కంటే అమెరికాలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచంలో ఇంకే దేశంలో లేనంతగా పెరిగిపోయాయి. అమెరికాలో మృతుల సంఖ్య 8444గా నమోదైంది. అమెరికా ప్రభుత్వం లక్ష బాడీ బ్యాగ్స్ సిద్ధం చేసుకుంటోంది. రోజురోజుకూ కొత్తగా కొన్ని వేల‌ మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. ఈ పరిస్థితుల్లో వైట్ హౌస్ వర్గాలు కనీసం లక్ష మంది చనిపోతారని అంచనా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా తన దేశ ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఫెమా)ను లక్ష బాడీ బ్యాగ్స్ సిద్ధం చేయమని ఆదేశించింది. పెంటగాన్ కూడా ఈ విషయం నిజమేనని ప్రకటించింది. న్యూయార్క్ నగరం పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్క‌డి ఆసుపత్రులలో వెంటిలేటర్లు లేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. న్యూయార్క్ తర్వాత న్యూజెర్సీ - కాలిఫోర్నియా - ఫ్లోరిడా - వాషింగ్టన్ - లూసియానా - పెన్సీల్వేనియా - జార్జీయా - టెక్సాస్ తదితర రాష్ట్రాల్లో ఈ మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. రానున్నది గడ్డు కాలం ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అనేక మరణాలను చూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో చైనాలో తలెత్తిన పరిస్థితి, ఆపై ఇటలీలో కరోనా సృష్టించిన కల్లోలాన్ని చూస్తూ కూడా అమెరికా అధ్యక్షుడు మాత్రం తమ దేశానికి ఎదురుకాబోయే ముప్పు తీవ్రతను ఎప్పటికప్పుడు తగ్గించి చూపించే ప్రయత్నం చేశారు. మొదట్లో కొద్ది సంఖ్యలో కేసులు నమోదైనప్పుడు పరిస్థితి అంతా అదుపులోనే ఉందని వేసవి నాటికి అంతా కుదుట పడుతుందని మసి పూసి మారేడుకాయ చేసేందుకు ట్రంప్ ప్రయత్నించి ఇప్పుడు ఈ దారుణ‌మైన ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఇండియాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పైనే క‌రోనా ప్రభావం!

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3113 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 213 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మనదేశంలో కరోనాసోకిన కేసుల్లో ఎక్కువగా 21 నుంచి 40 ఏళ్ల లోపు వ‌య‌స్సు వారే ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కరోనాసోకిన మొత్తం బాధితుల్లో వీరు 41 శాతం. ఆ తర్వాత 41నుంచి 50 ఏళ్ల‌ మధ్య వయస్సున్నవారు 83 శాతంగా ఉన్నారు. 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్నవారు 17శాతం ఉన్నారు. వీరికి కరోనా సోకి తగ్గడం కష్టసాధ్యమైన విషయమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నావెల్ కరోనావైరస్ మనదేశంలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ పై ప్రభావం చూపుతోందని తెలిపింది. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ కరోనావైరస్ విస్తరించిందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.