ఈ డ్రగ్ తీసుకుంటే, రెండు రోజుల్లో కరోనా పరార్!

* హెచ్ఐవీ, డెంగ్యూ, జికా, ఇన్ ఫ్లుయెంజా లను కూడా ఛాలెంజ్ చేసి నిలిచిన ఇవెర్ మెక్టిన్   ఇదొక లేటెస్ట్ ఆవిష్కరణ. మానవ దేహంలోని పరాన్నజీవులను తరిమికొట్టే ఇవెర్ మెక్టిన్ అనే,  యాంటీ పారసైటిక్ ఔషధం -ప్రయోగశాలలో సృష్టించిన కరోనా వైరస్ కణజాలంపై ఇవెర్ మెక్టిన్ ప్రభావవంతంగా పనిచేసిందని, వైరస్ అభివృద్ధిని సమర్థంగా నిరోధించిందని ఓ అధ్యయనం వెల్లడించింది. కేవలం 48 గంటల్లో కరోనా వైరస్ ను రూపుమాపిందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న కైలీ వాగ్ స్టాఫ్ తెలిపారు. ఇవెర్ మెక్టిన్ ప్రమాదకర హెచ్ఐవీ, డెంగ్యూ, జికా, ఇన్ ఫ్లుయెంజా తదితర వైరస్ లపై ప్రభావశీలంగా పనిచేస్తుందని గతంలోనే గుర్తించారు. తాజాగా కరోనాను కూడా ఇది దీటుగా తిప్పికొడుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు.  ఇవెర్ మెక్టిన్ ఎంతో సురక్షితమైన ఔషధం అని, మనుషుల్లో కూడా సరైన మోతాదులో ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని వాగ్ స్టాఫ్ తెలిపారు. అయితే, కరోనాను ఇవెర్ మెక్టిన్ ఎలా రూపుమాపుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని ఆమె వెల్లడించారు. కొన్నిరకాల వైరస్ లు ఆతిథ్య కణాలను మందగింపచేస్తాయని, ఆ సామర్ధ్యంపైనే ఇవెర్ మెక్టిన్ బలంగా దెబ్బతీస్తుందని, కరోనా వైరస్ విషయంలోనూ ఇవెర్ మెక్టిన్ అలాంటి పనితీరునే ప్రదర్శిస్తుందని భావిస్తున్నామని వివరించారు.

తెలంగాణ లో ర్యాపిడ్ ఫీవర్ సర్వే!

తెలంగాణాలో పాజిటివ్ కేసులున్న వారి ఇళ్ల చుట్టుపక్కల కిలోమీటరు పరిధి వరకు వైద్యశాఖ బృందాలతో ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనున్నారు. ఈ సర్వే ఆధారంగా జ్వరం - జలుబు - ఇతరత్రా కరోనా లక్షణాలున్నట్లు అనుమానాలుంటే వారి రక్త నమూనాలని తీసుకోని - ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పరీక్షా కేంద్రాలకు పంపించి ఎంతమందికి కరోనా పాజిటివ్ ఉన్నదీ తెలుసుకుంటారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా - ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు నిర్వహించే కార్డన్ ఆఫ్ వంటివి చేపట్టాల‌ని తెలంగాణా ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది. కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తుంది. ఈ నేప‌థ్యంలో కరోనా కట్టడి కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలకి అనుగుణంగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పోలీస్ - వైద్య అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అలాగే మర్కజ్ సంబంధీకులున్న ప్రాంతాల జియోట్యాగింగ్ పనులు వేగంగా చేస్తున్నారు.

విలేక‌రులైనా దందా చేస్తే శిక్ష త‌ప్ప‌దు! చ‌ట్టానికీ అతీతులుకారు!

జ‌ర్న‌లిస్ట్‌లు చ‌ట్టానికి అతీతం కాదు? నైతిక‌త‌కు విరుద్ధంగా విలేక‌రులు ఏం చేసినా చెల్లుతుంద‌నుకోవ‌డం దారుణ‌మే! లాక్‌డౌన్ న‌డుస్తోంది. స‌ద‌రు ప‌త్రిక‌కు స్థానికంగా విలేక‌రి వున్నాడు. ఏదైనా వివ‌ర‌ణ కావాల్సి వ‌స్తే అత‌నితో తెప్పించుకోవ‌చ్చు. కానీ అలా జ‌ర‌గ‌లేదిక్క‌డ‌. త‌మ‌కు అవ‌స‌రం అనుకున్నారేమో 80 కిలో మీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణం చేసి ఓ రాజ‌కీయ నేత‌తో బేరం పెట్టుకున్నారు. అత‌ను గుట్టుగా మొత్తం వ్య‌వ‌హారం రికార్డు చేసి జ‌ర్న‌లిస్టుల బ‌తుకు రోడ్డు మీద కీడ్చాడు.  జ‌ర్న‌లిస్టులు రెడ్ హ్యాండెడ్‌గా పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. చ‌ట్ట విరుద్ధ చ‌ర్య‌లకు ఎవ‌రు పాల్ప‌డినా,  విలేక‌రులైనా, రాజ‌కీయ‌నేత‌లైనా చ‌ట్ట ప్ర‌కారం శిక్ష ప‌డాల్సిందే. అప్పుడే ఇత‌రుల‌కు బుద్ధి వ‌స్తుంది. ఇలాంటి సంఘ‌ట‌న‌లు మ‌ళ్ళీ పున‌రావృత్తం కావు. ఇలాంటి సంద‌ర్భాల్లో జ‌ర్న‌లిస్టు సంఘాలు జ‌ర్న‌లిస్టుల‌ను వెన‌కేసుకొని రాకుండా వాస్త‌వాల్ని గ్ర‌హించి నిజాయితీతో ఖండించాల్సిన అవ‌స‌రం వుంది. అస‌లు విజ‌య‌బాబు ఇంటికి ఎందుకు వెళ్ళారు? బ‌్లాక్ మెయిల్ చేయ‌డం నేరం కాదా. ప్ర‌జ‌లు జ‌ర్న‌లిస్టుల‌ను అస‌హించుకునే దుస్థితి రాకుండా చూసుకోవాల్సిన స‌మ‌యం ఇది. జ‌ర్న‌లిజం వ్య‌వ‌స్థ‌ను స‌ర్వ‌నాశ‌నం చేస్తున్నారు. ఇది పెద్ద క‌ళంకం.  జ‌డ్జి లాంటి వాడు జ‌ర్న‌లిస్ట్‌. అయితే ముద్దాయిలా ఎందుకు విజ‌య‌బాబు ఇంటికి వెళ్ళారు. మీ స్థానిక విలేక‌రి అక్క‌డున్నా 80 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేసి  వివ‌ర‌ణ కోసం వెళ్ళారు స‌రే. బేర‌సారాలు ఎందుకు ఆడాల్సి వ‌చ్చింది. ఆ వీడియోకు ఏం స‌మాధానం చెబుతారు? తాను నిజాయితీగా పని చేశానని, తనపై నిరాధార వార్త‌లు రాస్తూ డ‌బ్బులు డిమాండ్ చేశార‌ని మువ్వా చెబుతున్నారు. కనీసం 15 లక్షల రూపాయలు అయినా ఇస్తే తాము కథనాలు రాయడం నిలిపి వేస్తామని వారు చెప్పినట్లు విజయ్ బాబు తెలిపారు. అయితే తాను అంత ఇవ్వలేని ఆయన స్పష్టం చేశారు. చివరకు ఐదు లక్షల రూపాయల నగదు, 500 పత్రికలకు సంవత్సర చందా కట్టే విధంగా ఒప్పందం కుదిరింది. మాజీ డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు ఫిర్యాదు మేరకు విలేకరులయిన మూర్తి, సత్యనారాయణ, శ్రీకాంత్‌ లపై  ఒక బెయిబుల్‌, మరో నాన్‌ బెయిబుల్‌ సెక్షన్‌ ల తోకూడిన కేసు నమోదు అయింది.

త‌న ఆరోగ్యం మెరుగ్గానే ఉందంటూ ఆసుపత్రి నుంచి బ్రిటన్ ప్రధాని బోరిస్ సందేశం!

తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గానే ఉందని బ్రిటన్ ప్రధాని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప‌ది రోజులు పూర్తయినా తనలో ఇంకా వైరస్ లక్షణాలు కనిపిస్తున్న‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు. శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువగా ఉండ‌టంతో తాను ఆసుప‌త్రిలో చేరాన‌ని బోరిస్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైరస్ లక్షణాలు పూర్తిగా తొలగిపోయేంత వరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోనే ఉంటానని వీడియోలో వివరించారు. మార్చి 27న జాన్సన్‌కు నిర్వహించిన పరీక్షల్లో కొద్దిపాటి కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయన గత వారం రోజులుగా డౌనింగ్ స్ట్రీట్ నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. పది రోజులుగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నప్పటికీ కరోనా లక్షణాలు తగ్గకపోవడంతో తన వ్యక్తిగత వైద్యుని సలహ మేరకు బ్రిటన్‌ ప్రధాని ఆసుపత్రిలో చేరారు.

UK లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులను వెనక్కు తీసుకురండి!

తెలంగాణా విద్యార్థుల్ని వెన‌క్కి తీసుకురావాలంటూ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. Covid-19 కారణంగా UK లో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. దాదాపు 4,500 మరణాలు మరియు 42,000 కంటే ఎక్కువ కేసులతో అక్కడ ఉన్న మన విద్యార్థులు మాత్రమే కాకుండా UK లోని భారతీయులు చాలా ఆందోళన చెందుతున్నారు. నిన్నటి నుండి యుకె రవాణాను కూడా నిలిపివేసింది. విదేశీయులను తమను తామే రక్షించుకోవాలని uk ప్రభుత్వం కోరింది. ప్ర‌స్తుత పరిస్థితుల్లో వారికి సహాయం చేయడం చాలా కష్టమని అక్కడ ఉన్న వారు భావిస్తున్నారు. UK లోని భారతీయులంతా ఆందోళ‌న‌కు గురి అవుతున్నారు. వారితో పాటు ఇక్క‌డున్న వారి కుటుంబసభ్యులు మరింత ఆందోళనకు గురి అవుతున్నారు. ఇండియాలో వున్న వారు త‌మ పిల్లలను, బంధువులను UK నుండి రక్షించాలని సందేశాలను పంపుతున్నారని ఎం.పి.రంజిత్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. భారతదేశంలో చిక్కుకున్న యుకె పౌరులను తిరిగి పంపించడానికి ఎయిర్ ఇండియా ఆరు విమానాలను - ఢిల్లీ నుండి 4 మరియు ముంబై నుండి 2 నడుపుతుంది. కాబట్టి యుకె నుండి తిరిగి వచ్చేటప్పుడు, అదే విమానాలు యుకెలోని వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తీసుకురావాల‌ని ఎం.పి. సూచించారు. వారు ఇక్కడ దిగిన తర్వాత వారిని నిర్దేశిత కాలంపాటు క్వారెంటిన్ లో ఉంచిన తరువాత మాత్రమే ఇంటికి వెళ్ళడానికి అనుమతించవచ్చని ఎం.పి. త‌న లేఖ‌లో పేర్కొన్నారు. వివిధ విశ్వవిద్యాలయాల నుండి సుమారు 380 మంది భారతీయ విద్యార్థులు UK లోని ఇండియన్ హైకమిషనర్ కు భారతదేశానికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేయమని అభ్యర్థించారు. విద్యార్థులు మరియు ఇతరుల వివరాలన్నీ హైకమిషన్ వద్ద ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి 50 మంది విద్యార్థులు ఉన్నారని మరియు వారిని రక్షించాలని మంత్రిని కోరారు.

కాణిపాకం గెస్ట్ హౌస్ క్వారంటైన్ సెంటరా?

* మాజీ సి ఎస్ ఐ.వై. ఆర్. మండిపాటు  * చెప్పులతో గెస్ట్ హౌస్ లో కరోనా బాధితులు నడుస్తున్న వీడియో వైరల్  * విషయాన్ని తేలిగ్గా తీసుకున్న డీ జీ పీ కార్యాలయం హిందూ ఆలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతోందనే విషయం ఇప్పటికే రచ్చ రచ్చ అయింది. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రఖ్యాత కాణిపాకం ఆలయంలో అన్యమతస్తులకు ఏపీ ప్రభుత్వం వసతి ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. ఈ ఘటనను ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐవైఆర్ అన్నారు. ఇది ఆలయ ప్రాంగణమా? లేక వసతి సదుపాయమా? అని నిలదీశారు. ఇంకెక్కడా వసతి సదుపాయమే లేనట్టు... దీన్ని అన్యమతస్తుల కోసమే వాడుతుండటంలో అంతరార్థం ఏమిటని మండిపడ్డారు. ఇతర మతస్తులను ఆలయ ప్రాంగణంలోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రాంగణం నుంచి అన్యమతస్తులు వెలుపలకు వస్తున్న వీడియోను షేర్ చేశారు. అయితే, డీ జీ పీ కార్యాలయం మాత్రం ఆలయం గెస్ట్ హౌస్ ను క్వారంటైన్ సెంటర్ చేయటం లో తప్పేమీ లేదన్నట్టు ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది. 

అక్ర‌మంగా మ‌ట్టిని త‌వ్వే మాఫియాను అడ్డుకోరా?

మంత్రి అనుచ‌రులైతే అక్ర‌మంగా మ‌ట్టి త‌రలిస్తారా? ఒక ప‌క్క లాక్‌డౌన్ అమ‌లు అవుతోంది. అయినా మంత్రి అనుచ‌రులు ట్రాక్ట‌ర్ల ద్వారా మ‌ట్టిని అక్ర‌మంగా త‌వ్వి, క‌ళ్యాణ‌మండ‌పంతో పాటు మూడు ప్లాట్‌ల‌కు త‌ర‌లిస్తున్నారు. లాక్‌డౌన్ మీకు వ‌ర్తించ‌దా? అని గ్రామ‌స్థులు నిల‌దీస్తే జ‌నం మీద‌కే ట్రాక్ట‌ర్ల‌ను న‌డ‌ప‌డానికి వెళ్ళుతూ భ‌య‌పెడుతున్నార‌ట‌. గ్రామ‌స్థులంతా ఏక‌మై ట్రాక్ట‌ర్ల‌ను అడ్డుకున్నారు. ఒక పక్క ప్రభుత్వం కరోనా వ్యాప్తి ని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే గుడివాడ నియోజక వర్గ పట్టణ నడి బొడ్డు లో గౌతమ్ స్కూల్ దగర కొన్ని ఖాళీ స్థలాల్ని పూడ్చడానికి మట్టి ని ఇష్టానుసారంగా తరలిస్తున్నారు ఇదేమిటి అని స్థానికులు ప్రశ్నించగా మంత్రి కొడాలి నాని తాలూకా అని దౌర్జన్యం చేస్తున్న వైనం. సామాన్యుడు కి ఒక న్యాయం మంత్రి అనుచ‌రుల‌కు ఒక న్యాయం అని జ‌నం తిరగబడ్డారు. వి.ఆర్‌.వో. ద‌గ్గ‌రుండి మ‌ట్టి త‌ర‌లిస్తున్నార‌ని గ్రామ‌స్థులు ఆరోపిస్తున్నారు. తాము కూర‌గాయ‌లు కొన‌డానికి వెళ్ళితే వెంట‌బ‌డి పోలీసులు త‌రుముతున్నారు. కానీ ఇక్క‌డ మంత్రి అనుచ‌రులు అక్ర‌మంగా మ‌ట్టి త‌వ్వి ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నా పోలీసులు, మీడియా చూసి ప‌ట్టించుకోవ‌డం లేద‌ని గ్రామ‌స్థులు మండిప‌డుతున్నారు.

కరోనా దెబ్బకి ఇలా కూడా జ‌రిగింది!

మ‌ద్యం షాపులు బంద్ కావ‌డంతో సంపూర్ణ మద్య నిషేధం అమలు అయింది. దిక్కుమాలిన తెలుగు సీరియల్స్ ఆగిపోయాయి. పెద్ద నగరాల్లో ఆఫీస్ నుంచి ఇంటికి చేరే సమయంలో నాలుగు గంటల దాకా బయటే ట్రాఫిక్ లో గడిచిపోయే పరిస్థితి వుండేది. ఇప్ప‌డు రోడ్ల‌న్నీ ఖాళీగా వున్నాయి. అత్య‌వ‌స‌రం వున్న వారే రోడ్ల మీద క‌నిపిస్తున్నారు. ఎంత పెద్ద ప‌ట్ట‌ణం అయినా ఏ చౌర‌స్తా చూసిన ఎక్క‌డా ట్రాఫిక్ జామ్ లేదు. కాలుష్య రహిత న‌గ‌రాలుగా మారాయి. ఇంట్లో వుండి కుటుంబంతో స‌ర‌దాగా ఆట పాట‌ల‌తో గ‌డుపుతున్నారు. పిల్ల‌ల చ‌దువు గురించి తెలుసుకోవ‌డం, పిల్ల‌లు ఎలా వుంటున్నారో చూసే అవ‌కాశం ఇంటి పెద్ద‌కు దొరికింది. మగవాళ్ళు ఇంటి పనుల్లో, వంట పనుల్లో సాయం చేయడంతో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య అనురాగం పెరిగింద‌ట‌. డబ్బులు నగలు, షాపింగ్, ఇతర అనవసర వస్తువులు మీద తగలకుండా, అవసరమైనవి మాత్రమే కొనుక్కోవడంతో పొదుపు చేసే అల‌వాటు అవుతుంద‌ట‌. డబ్బులు అతి జాగ్రత్తగా పొదుపు గా వాడుకోవడం. బయట అడ్డమైన దరిద్రాలు తినకపోవడం లాక్‌డౌన్ వ‌ల్లే సాధ్య‌మైంద‌ని జ‌నం చెప్పుకుంటున్నారు. వ్యక్తిగత శుభ్రత మీద, పరిసరాల శుభ్రత మీద జాగ్రత్తలు తీసుకోవటం. బండిలో పెట్రోల్ తగలేసి తిర‌గ‌డం త‌గ్గింద‌ని ఇంట్లోవాళ్ళు సంతోష‌ప‌డుతున్నారు. జ‌నం సాధ్యమైనంతవరకు నాన్వెజ్ మానేసి వెజ్ తినడానికే ప్రాధాన్య‌త ఇస్తున్నారు. చిన్న‌ప్పుడు బామ్మ చెప్పిన సాంప్రదాయ పద్ధతులు గుర్తు తెచ్చుకుని మ‌రీ పాటిస్తున్నార‌ట‌. సామాజిక బాధ్యత గురించి ఆలోచించడం, పక్కవారికి రోగాలు రాకూడదు, వాళ్ళు కూడా మంచిగా ఉండాల‌ని కోరుకోవడం క‌రోనా వైర‌స్ నేర్పించిదంటున్నారు. పని మనిషి లేకపోయినా సంతోషంగా ఇంటి పనులు కలసి మెలసి అంతా చేసుకోవడం ఇప్పుడిప్పుడే అల‌వాటౌతోంది.

క‌రోనా నుంచి త‌ప్పించుకునే ట‌న్నెల్‌!

కరోనా నివారణకు తమిళనాడు ప్రభుత్వం ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ప్ర‌జ‌లు ర‌ద్దీగా తిరిగే ప్ర‌దేశాల్లో ప్ర‌త్యేక ట‌న్నెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మ‌నం ఇక్క‌డ చూస్తున్న ట‌న్నెల్ తిరుపూర్ మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. త‌మిళ‌నాడు రాష్ట్రం తిరుపూర్ జిల్లాకు చెందిన డి.వెంక‌టేష్ వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ న‌డుపుతూ వుంటాడు. అయితే స్థానిక జిల్లా యాంత్రాంగం స‌హ‌కారంతో కరోనా బారి నుంచి తప్పించుకోవడానికి 16 ఫీట్‌ల ట‌న్నెల్ రూపొందించాడు. ఈ ట‌న్నెల్ లోప‌ల‌కు ప్ర‌వేశించ‌డానికి ముందు చేతులు శుభ్రంగా క‌డుక్కోవాలి. ఈ ట‌న్నెల్ ను మార్కెట్ బ‌య‌ట ఏర్పాటు చేశారు. మార్కెట్‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ ఈ ట‌న్నెల్ ద్వారానే వెళ్ళాల్సి వుంటుంది. ముందుగా చేతులు క‌డుక్కొని ఈ ట‌న్నెల్ ప్ర‌వేశించి ఐదు సెకెండ్లు న‌డ‌క కొన‌సాగిస్తున్నారు. నీటితో క‌లిపిన సోడియం హైపో క్లోరైడ్ ద్రావ‌ణాన్ని స్ప్రే చేస్తున్నారు. ఇలా మ‌నుషుల్ని శుభ్రం చేస్తున్నారు. ఒకసారి ఒక వ్యక్తి ఇందులోకి వెళ్లి న‌డ‌క కొన‌సాగితే విద్యుత్‌ ఆధారంగా నడిచే పంపు ఇన్‌ఫెక్షన్లను నిర్మూలించే హైపోసోడియం క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తుంది. మార్కెట్ ఏరియాలో ప్ర స్తుతం దీన్ని వినియోగిస్తున్నారు. భ‌విష్య‌త్‌లో వాహ‌నాలు కూడా ఇందులోంచి వెళ్ళేలా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ కార్తికేయ‌న్ తెలిపారు. ఈ 16 ఫీట్‌ల ట‌న్నెల్ ఎన్‌క్లోజర్‌కు ఇరువైపులా స్టీల్ ఫ్రెమ్‌లు ఏర్పాటు చేశారు.

క‌రోనాను జ‌యించే రోజు వ‌స్తుంది!

కాంతి రుజు మార్గంలో ప్రయాణిస్తుందనుకునే వారు. ఐన్ స్టీన్ రాకతో కాంతి పెద్ద ఖగోళాల దగ్గర గురుత్వాకర్షణ కు లొంగి, ఒంగి ప్రయాణిస్తందని తేలింది. ఒకప్పుడు స్ఫోటకం అమ్మోరు వల్ల వస్తుందనుకుని బలులు, జాతర్లు చేశారు. ఇప్పుడు సూక్ష్మ జీవశాస్త్రం రోగాలకు కారణం వైరస్ కారణమనే సరికి, టీకాలతో దాన్ని నిర్మూలించారు. అంగ వైకల్యం జరిగితే పూర్వ జన్మ వికృత ఫలితమని సర్దుకున్నారు. కాని, ఇప్పుడు రెండు పోలియో టీకా చుక్కలతో దాన్ని అంతమొందించారు. గ్రహణమొస్తే బయటకు రాకూడదని, చూడకూడదని ,అది ఐన తర్వాత పూజలు చేసే వారు. కాని, నేడు లక్షలాది మంది , కాంతి ఫిల్టర్ల సాయంతో గ్రహణందాలను వీక్షిస్తున్నారు. ఒకప్పుడు దెయ్యం పట్టిందని వేప మండలతో థూ థూ అని తూతూ మంత్రాలు పెట్టిస్తే, నేడు అది మానసిక వికారమని, మందు బిళ్ళలతో నయం చేయించుకుంటున్నారు. ఒకప్పుడు కలరా విరోచనాలు వస్తే జాతర్లకు లంకించుకున్నారు, కాని, కలుషిత చెరువు నీరు వద్దని, ఫిల్టరు వాటర్ తాగి ద్రవ విరోచనాలను నిర్మూలిస్తున్నారు. ఒకప్పుడు నలతగా ఉందని మంత్రాలు పెట్టించుకుంటే, నేడు డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నారు. ఒకప్పుడు పాము కరిస్తే పాముల నరసయ్యలకు ఫోను చేసి, మంత్రాలు పెట్టించుకుంటే, నేడు, హాస్పటల్ ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన యాంటీ సీరం ఇంజక్షన్ ను చేయించుకుని బతుకు తున్నారు. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. పెరిగిన జ్ఞానం, పెరిగిన చికిత్స. క‌రోనాను క‌ట్ట‌డి చేసే రోజు వ‌స్తుంది. దీనికీ టీకాని కనుగొంటారు, ఈ రోజు కాకపోతే రేపు. ప్రస్తుతానికి, లాక్‌డౌన్‌. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డే వ‌ర‌కు ధైర్యంగా స్వ‌యం నియంత్ర‌ణ‌లో వుండ‌ట‌మే మేలు. పులి వేటాడేట‌ప్పుడు ఓపిక‌గా ఒక చోట కూర్చొని ఎదురుచూసిన‌ట్లు మ‌నం కూడా ఇంట్లోనే వుందాం. క‌రోనా విస్త‌రించ‌కుండా స‌హ‌క‌రించుదాం. క‌రోనా కాటు నుంచి త‌ప్పించుకుందాం.

దీపం వెలిగించ‌డంలోనూ క‌మ్యూనిస్టు మార్కు రాజ‌కీయం!

ఇండియ‌న్ క‌మ్యూనిస్టులు ఎలా వుంటారో షీలా ర‌షీద్ ట్వీట్ చూస్తే అర్థం అవుతుంది. ప‌క్క‌నున్న దేశాల‌పై వున్న ప్రేమ పుట్టిన గ‌డ్డ‌పై వుండ‌దు. ఢాకా బాధితుల‌కు క్యాండిల్ వెలిగిస్తుంద‌ట‌! కానీ భార‌త్‌లో మాత్రం వెలిగించ‌లేనంటుంది. డిన్న‌ర్ చేయ‌డానికి వంట చేసుకోవాల‌ట‌. ఎంత బ‌లుపు. ఈ సెల‌బ్ర‌టీకి. సంమ‌యం, సంద‌ర్భం లేకుండా ప్ర‌తి దానికి రాజ‌కీయాలు చేయ‌డం క‌మ్యూనిస్టు సిద్ధాంతాలు అనుస‌రించే వారికి అల‌వాటుగా మారింది. ప్ర‌జ‌ల్లో త‌మ‌కు ప‌లుకుబ‌డి పోతున్నా అల‌వాట్లు మాత్రం మార్చుకోలేక‌పోతున్నారు క‌మ్యూనిస్టు మేధావులు, సెల‌బ్రిటీలు.

మోడీ తన సొంత బ్లూ వేల్ ఆటను సృష్టిస్తున్నారు!

బ్లూవేల్ గేమ్‌లో మొత్తం భార‌త‌జాతిని దింప‌డంలో ప్ర‌ధాని మోదీ విజ‌యం సాధించారంటున్నారు శేఖ‌ర్‌గుప్తా. ప్ర‌స్తుత విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మోదీ చేస్తుంది అదే. బ్లూ వేల్ ఛాలెంజ్ అనునది సోషల్ మీడియా ఆధారిత ఆట. ఇది ఆటగాళ్ళను ఆలోచించ‌డానికి అవ‌కాశం ఇవ్వ‌దు. అక్క‌డ లింక్‌ల ద్వారా గ్రూప్‌లోకి తీసుకుంటారు. ఇక్క‌డ మోదీ త‌న సందేశాల ద్వారా దేశ ప్ర‌జ‌ల‌ను క‌ల్ట్ క‌ల్చ‌ర్‌లోకి తీసుకుంటున్నారు. తానిచ్చిన సందేశంలో జ‌నం లీనం అయిపోతున్నారు. మోదీ ఈ విద్య‌లో మాస్ట‌ర్స్ పొందారు. బ్లూవేల్ గేమ్‌లో చేరిన వారు తమంతట తామే తనువు చాలించేలా గేమ్‌ పేరిట ప్రోత్సహిస్తుంటారు. అదే ప్ర‌ధాని చేస్తున్నార‌ని శేఖ‌ర్ గుప్తా అంటున్నారు. తాను ఎవరితో మాట్లాడాలి, ఎవరితో టాసు చేయాలి, ఎవరితో ప్రసంగించవచ్చోప్ర‌ధాని మోడీకి బాగా తెలుసు. కాబట్టి, తాలి, దియా మరియు మొంబత్తి అంటూ ఈ విప‌త్క‌ర స్థితిలోనూ మోదీ ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుతున్నారు. ఈ ఆట చాలా వరకు ఆయ‌న విజయవంతమైయార‌ని ఇది నాకు తెలుసు. సరళమైన ఉపాయాల ద్వారా, మోడీ జీ ఒక "కల్ట్" ను పండిస్తున్నారు. క‌ల్ట్ క‌ల్చ‌ర్‌లో గురువు చెప్పింది తూచా త‌ప్ప‌కుండా పాటిస్తూ శిష్యులు హితుబ‌ద్ద‌త‌లేకుండా, క‌నీస ఆలోచ‌న లేకుండా త‌న్మ‌యంతో లీన‌మైపోతారు. ఏం చెబితే అదే నిజం అనుకుంటారు. ప్ర‌ధాని క‌ల్ట్ క‌ల్చ‌ర్‌ను అనుస‌రిస్తూ ప్ర‌జ‌ల‌కు ల‌క్ష్యాల‌ను ఇస్తున్నారు. తన చర్యకు వారిని సహకరించేలా చేస్తున్నారు. కల్ట్‌లోకి తీసుకురావడానికి సరళమైన పనులను చేయమని ప్ర‌జ‌ల్ని ప్రేరేపిస్తున్నాడు. భయంకరమైన ఒత్తిడికి గురైనప్పుడు, గందరగోళానికి గురైనప్పుడు ప్ర‌జ‌లు క‌నీస లాజిక్ మ‌రిచిపోయి క‌ల్ట్‌లోకి జారిపోతున్నారు. క‌ల్ట్ క‌ల్చ‌ర్‌లో ఒదిగిపోయాలే సొంత సోష‌ల్ మీడియా, ఐటి వింగ్‌లు ఎలానూ ఉన్నాయి. ఇప్పటికి మోడీ జిలో ఇలాంటి మోసపూరిత సంస్కృతి అనుచరులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు, వారు ఇతరుల నుండి విమర్శల నుండి రక్షించడానికి ఏదైనా చేస్తారు.

ముప్పతిప్పలు పెడుతున్న ఆ రెండు డొమెస్టిక్ ఎయిర్ లైన్స్

* 15 నుంచి డొమెస్టిక్ సర్వీసుల పునః ప్రారంభం అనుమానమే * ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30 తర్వాతే అంటోంది ఇండిగో, స్పైస్ జెట్ విమానయాన సంస్థలు లేవనెత్తిన అభ్యంతరాల కారణంగా , ఈ నెల 15 నుంచి తలపెట్టిన డొమెస్టిక్ ఎయిర్లైన్స్  సర్వీసుల విషయం లో -పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ ఇద్దరు ఆపరేటర్లు రకరకాల తలనొప్పులు తెస్తున్నట్టు, ఫలితంగా ఈ నెల 15 న తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్న డొమెస్టిక్ సర్వీసుల విషయం లో ఇంకా ఒక క్లారిటీ రాలేదని అధికారులు అంటున్నారు. ఈ రెండు ఎయిర్ లైన్స్ ఇప్పటికే, తాము చెల్లించాల్సిన రిఫండ్ విషయం లో ఎయిర్ పాసెంజర్స్ ను ఇబ్బంది పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న లాక్ డౌన్ ఈ నెల 14తో ముగియనున్న నేపథ్యంలో 15 నుంచి ఎయిర్ ఇండియా మినహా మిగతా అన్ని పౌరవిమానయాన సంస్థలూ విమాన సర్వీసులను నడిపించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విమాన సర్వీసుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటుందని, సమయ పాలన పాటించే అవకాశాలు అంతంతమాత్రమేనని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  21 రోజుల లాక్ డౌన్ అనంతరం 15 నుంచి సర్వీసులను నడిపించేందుకు ఇప్పటికే ప్రైవేట్ ఎయిర్ లైన్స్ బుకింగ్ లను తీసుకుంటున్నాయి. "ఇండియాలో వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. అందువల్ల 14 తరువాత పరిమిత సంఖ్యలోనే దేశవాళీ, అంతర్జాతీయ విమానాలను అనుమతిస్తాం. ఏప్రిల్ 14 తరువాత బుకింగ్స్ స్వీకరించే వెసులుబాటును, స్వేచ్ఛను ఎయిర్ లైన్స్ కు కల్పించాం" అని పౌర విమానయాన శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఇదే సమయంలో 14 తరువాత లాక్ డౌన్ కొనసాగితే, విమానాలు కూడా రద్దువుతాయని, బుక్ చేసుకున్న టికెట్లు వాటంతట అవే క్యాన్సిల్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30 వరకూ సర్వీసులను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మే 1 నుంచి ఎయిర్ ఇండియా బుకింగ్స్ స్వీకరిస్తోంది. ఇక ఇప్పటికే మాంద్యంలో కూరుకుపోయిన విమానయాన సంస్థలు ఉద్యోగులకు వేతనాల్లో కోతను విధిస్తున్నాయి. ఇండిగో, తన సీనియర్ ఉద్యోగులకు 25 శాతం కోతను ఇప్పటికే ప్రకటించగా, ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ మినహా ప్రతి ఉద్యోగికీ, మూడు రోజుల వేతన రహిత సెలవు తప్పనిసరి చేసింది. గో ఎయిర్ సైతం వేతనాల్లో కోతను విధించింది. ఉద్యోగులు రేషనల్ బేసిస్ లో వేతనం లేకుండా సెలవు తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన విధించింది. మార్చి 25న మొదలైన 21 రోజుల లాక్ డౌన్ మరో 8 రోజుల్లో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు వారాలూ అన్ని దేశవాళీ, విదేశీ కమర్షియల్ విమానాలు రద్దయ్యాయి.

అజిత్ దోవల్ దెబ్బకు దిగొచ్చిన తబ్లిగీ జమాత్‌

*  కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్న క్రైమ్ బ్రాంచ్ * ప్రతి అంగుళం గాలిస్తున్న ఎఫ్ఎస్ఎల్ పత్రినిధులు * మౌలానాల సమక్షంలోనే తనిఖీలు , వీడియో చిత్రీకరణ జాతీయ భద్రతా సలహాదారు ( ఎన్ ఎస్ ఏ) అజిత్ దోవల్ దెబ్బకు దెయ్యం వదిలింది. ఆయన జోక్యం తర్వాత, పోలీస్ యంత్రాంగం లో కదలిక మొదలైంది. ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని తబ్లిగీ జమాత్‌ కార్యాలయాన్ని నిన్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎస్ఎన్ఎల్) ప్రతినిధుల సంయుక్త బృందం పరిశీలించింది. మార్చిలో ఈ కేంద్రంలో జరిగిన సమావేశానికి దేశం నలుమూలల నుంచి పలువురు హాజరుకావడం, ఆ తర్వాత వీరిలో చాలామందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తెలిసిందే. దీంతో సమావేశానికి హాజరైన వారిని ఎక్కడికక్కడ గుర్తించి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కేంద్రంలోని వారందరినీ ఖాళీ చేయించిన అనంతరం రెండు రోజులపాటు వైరస్ నివారణ చర్యలు చేపట్టారు. అనంతరం ఈ భవనంలోకి ప్రవేశించడం సురక్షితమన్న సర్టిఫికెట్ వైద్యశాఖ ఇవ్వడంతో నిన్న రెండు విభాగాలకు చెందిన సైబర్ ఫోరెన్సిక్ యూనిట్, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ తోఫాటు ఫొటో డివిజన్ ప్రతినిధులు కేంద్రంలోని రెండు విభాగాల్లోని ఐదంతస్తులను పరిశీలించారు. దాదాపు ఆరు గంటలపాటు భవనంలోని ఆమూలాగ్రం పరిశీలించిన బృందం ప్రతినిధులు భవనం మొత్తాన్ని మ్యాప్ చేశారు. వీడియో షూట్ చేశారు. భవనంలో చాలా రహస్య అరలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ 'మాతోపాటు మేనేజ్మెంట్ కమిటీకి చెందిన మౌలానాలను కూడా తీసుకువెళ్లాం. వారి సమక్షంలోనే భవనంలోని కార్యాలయం నుంచి కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నాం. మార్చినెలలో రికార్డయిన సీసీ టీవీ పుటేజీ ఇవ్వాలని భవనం మేనేజరుని అడిగాం. అవసరమనుకుంటే మరోసారి భవనాన్ని సందర్శిస్తాం' అని తెలిపారు. 'ఇది చాలా సీరియస్ కేసు అయినప్పటికీ సున్నితమైన అంశాలతో ముడిపడివుంది. అందువల్ల ఆచితూచి అడుగు వేస్తున్నాం. అయినప్పటికీ అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు పూర్తయ్యాక న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్న తర్వాత ఏ విధంగా అడుగు ముందుకు వేయాలన్నదానిపై ఓ నిర్ణయానికి వస్తాం' అని ఆ పోలీసు అధికారి వివరించారు. కాగా, బృందం సభ్యులు భవనం లోపలి భాగాన్ని తనిఖీ చేసేందుకు వెళ్లే ముందు, తిరిగి వచ్చేటప్పుడు ప్రవేశ ద్వారం వద్దే వారికి పూర్తిగా వైద్యపరమైన తనిఖీలు నిర్వహించారు. పరిస్థితిని  నియంత్రించటానికి, చివరకు నేషనల్ సెక్యూరిటీ ఎడ్వైసర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సీనియర్ అధికారులే చెపుతున్నారు.

లాక్ డౌన్ ముగిసే వరకూ తెలంగాణ లో బీ జె పీ ఫీడ్ ద నీడ్

లాక్ డౌన్ ముగిసే వరకు బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అన్నదానం, సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయాలతో పాటు ప్రతి కార్యకర్త ఇంటి పై పార్టీ జెండా ఎగరేయ్యాలని, బీజేపీ కార్యకర్తలు -డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దిన్ దయల్ ఉపాధ్యాయ చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ ఎదుర్కొంటున్న ప్రజలకు సంఘీభావంగా బీజేపీ కార్యకర్తలు ఒక్క పూట భోజనం మానేయాలని, ఫీడ్ ది నీడ్ లో ప్రతి  కార్యకర్త 5 + 1 పేదలకు అన్నదానం చెయ్యాలని ఆయన కోరారు. లాక్ డౌన్ లో అత్యవసర సేవలు అందిస్తున్న వారికి కార్యకర్తలు మీ ఏరియాలో ఉన్న 40 మందితో సంతకాలు సేకరించి థాంక్యూ లెటర్స్ ని ఉద్యోగులకు ( కరోనా వారియర్స్ ) పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పరిశ్యుద్ధ కార్మికులకు అందించాలని సూచించారు. ప్రతి కార్యకర్త మాస్కులను ఇంట్లో తయారు చేపించి మరో ఇద్దరికి అందించేలా వ్యవస్థ ను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ కార్యక్రమాలు సామాజిక దూరం పాటిస్తూ ,ప్రభుత్వ నిబంధనలకు లోబడి చేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.  

ఢిల్లీ బహుత్ దూర్ హై, లేకిన్ కరోనా తో నజ్దీక్ మే.....

* సఫ్దర్ జంగ్ ఆస్పత్రి, ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైపు వెళ్లాలంటే ఒణుకుతున్న జనం * ఎయిమ్స్, సర్ గంగారాం ఆస్పత్రుల వద్ద కూడా అదే పరిస్థితి కరోనా పాజిటివ్ కేసుల్లో డాక్టర్లు, నర్సులు ఉండటం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ ని కలవరపెడుతోంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఢిల్లీ సర్కారు సిద్ధమైనప్పటికీ, కరోనా తీవ్రత మాత్రం ఢిల్లీని హడలెత్తిస్తోంది. న్యూఢిల్లీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన తరువాత ఇప్పటివరకూ 24 మంది డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ స్టాఫ్ తదితర హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా వైరస్ సోకడంతో తీవ్ర కలకలం రేగుతోంది. వీరిలో ఇద్దరు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు ఉండగా, వీరిద్దరూ రెండు మొహల్లా క్లినిక్స్ లో పని చేశారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో పని చేస్తున్న మరో డాక్టర్ కు తాను చికిత్స చేసిన రోగి నుంచి కరోనా సోకింది. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో పని చేస్తున్న ఆరుగురు నర్సులు, ఇద్దరు డాక్టర్లకు, ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రాగా, వీరికి వ్యాధి ఎలా సోకిందన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు. రెండు కొవిడ్-19 కేసులను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా అటెండ్ చేసినందుకు సర్ గంగా రామ్ ఆసుపత్రిలోని 108 మందిని క్వారంటైన్ చేశారు. మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో 20 రోజుల క్రితం చేరిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో, ఆసుపత్రిలో పని చేస్తున్న 81 మందిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. వీరిలో ఓ డాక్టర్ కు, ముగ్గురు నర్సులకు, హౌస్ కీపింగ్ స్టాఫ్ లో ఒకరికి ఇప్పటికే వైరస్ పాజిటివ్ రావడం గమనార్హం. ప్రస్తుతం ఢిల్లీలోని అన్ని ఆసుపత్రుల్లోనూ కరోనా లక్షణాలు లేకుంటేనే లోనికి పంపుతున్నారు. వారి ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు లేకుంటేనే ఓపీ సేవలు అందిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే, తొలుత క్వారంటైన్ సెంటర్లకు, పరీక్షల తరువాత పాజిటివ్ వస్తే, ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు బయట తిరగడం కూడా వారికి కరోనా సోకడానికి కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. "ఇప్పటివరకూ ఇళ్లల్లో ఉన్న వారు ఎవరికీ కరోనా సోకలేదు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లూ బయట తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. అందుకే వారికి ఇన్ఫెక్షన్ అధికంగా సోకుతోంది. వీరు పరిశీలించిన వారిలో 20 నుంచి 30 శాతం మందికి జ్వరం, దగ్గు లేకపోయినా, వారి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తోంది" అని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ జుగల్ కిశోర్ వ్యాఖ్యానించారు. వైద్యులంతా రక్షణ సూట్ లను ధరించి మాత్రమే ఏ రోగి వద్దకైనా వెళ్లాలని సలహా ఇచ్చారు. ఆసుపత్రులకు వచ్చేవారు మాస్క్ లను ధరించాలని కోరారు.

కాబా శానిటైజ్‌ ప్రక్రియలో 3,500 మంది కార్మికులు

3,500 మంది కార్మికులతో గ్రాండ్‌ మాస్క్‌ మక్కాలో క్లీనింగ్‌ ఆపరేషన్‌ జరుగుతోంది. జనరల్‌ ప్రెసిడెన్సీ ఫర్‌ ఎఫైర్స్‌ ఆఫ్‌ టూ హోలీ మాస్క్స్‌, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ఈ బృహత్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. 2,160 లీటర్ల ఎకో ఫ్రెండ్లీ శానిటైజేషన్‌ సొల్యూషన్‌ని 89 పీస్‌ల ఎక్విప్‌మెంట్‌ని రోజువారీ ఆరు క్లీనింగ్‌ ఆపరేషన్స్‌ని ఈ హోలీ సైట్‌లో చేపడుతున్నారు. ప్రతి ఐదు రోజులకోసారి కార్పెట్స్‌ని క్లీన్‌ చేస్తున్నారు. విజిటర్స్‌ సేఫ్టీ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. 13,500 పెద్ద ప్రేయర్‌ రగ్గుల్ని ఎప్పటికప్పుడు వాష్‌ చేసి, స్టెరిలైజ్‌ చేస్తున్నామని హోలీ మాస్క్‌ క్లీనింగ్‌ అండ్‌ కార్పెట్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జబెర్‌ విదాని చెప్పారు. జూలై చివరలో జ‌రిగే హజ్‌ యాత్రకు సంబంధించి సౌదీ ప్ర‌భుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు.

గర్భిణీకి వైద్యం నిరాకరణ, అంబులెన్స్‌లోనే  డెలివరీ బిడ్డ మృతి!

రాజస్తాన్‌లో కొంత మంది వైద్యులు చూపిన మత వివక్షకు ప‌సిపాప బ‌లైంది.  మతం పేరుతో వైద్యం నిరాకరించిన సంఘటన రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించింది. శుక్రవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రాగా, సిక్రీలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి తరలించారు. కేసు క్లిష్టంగా ఉందంటూ అక్కడి వైద్యులు ఆర్‌బిఎం జనన ఆసుపత్రికి వెళ్లమని చెప్పారు. అయితే అక్కడికి వెళ్లగా, డ్యూటీలో వున్న వైద్యురాలు  మహిళ భర్తను వివరాలు అడిగారు. అంతే మేం ఇక్కడ ముస్లింలకు చికిత్స అందించబోమని, జైపూర్‌కు తరలించాలని ఇర్ఫాన్‌తోనూ, అక్కడ ఉన్న మరో డాక్టర్‌తోనూ చెప్పారు.  వేరే దారిలేక జైపూర్ బ‌య‌లుదేరారు. దారిలోనే  అంబులెన్స్‌లో ఆమెకు డెలివరీ అయిందని ఆమె భ‌ర్త ఇర్ఫాన్‌ తెలిపారు. తమ బిడ్డ చనిపోయా డని భోరున విలపించాడు. ఈ ఘటనపై రాజస్తాన్‌ ఆరోగ్య శాఖ మంత్రి, భరత్‌ పూర్‌ ఎమ్మెల్యే సుభాష్‌ గార్గ్‌ దర్యాప్తునకు ఆదేశించారు. ఈ ఘటన బాధాకరమైన దని, జిల్లా యంత్రాంగానికి చెందిన బృందం విచారణ చేపడుతుందని సుభాష్‌ గార్గ్‌ తెలిపారు.