ఏప్రిల్ 14 న లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: ప్రధాని

కరోనా విజృంభణ, లాక్‌డౌన్ విషయంపై ప్రధాని మోడీ బుధవారం అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ ఒక్కటే సరైన పరిష్కారమని మోడీ తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు మునుపటిలాగా సాధారణంగా ఉండవు. కరోనా కు ముందు, కరోనా కు తరువాత అనే విధంగా పరిస్థితి ఉంటుందని మోడీ  అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల సీఎంలతో, నిపుణులతో చర్చిస్తూనే ఉన్నా. ఏ ఒక్కరూ కూడా లాక్‌డౌన్ ఎత్తివేయాలని అభిప్రాయపడలేదు. మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతా. ఒకే సారి లాక్‌డౌన్ ఎత్తేయడం సాధ్యం కాకపోవచ్చు. మున్ముందు మరిన్ని ఊహించని నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని ఫ్లోర్ లీడర్లతో మోడీ అన్నట్లు సమాచారం. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సానుకూలంగా ఉంటేనే.. కరోనా మహమ్మారిపై విజయం సాధించగలమని మోడీ అన్నారు. ఈ కష్ట సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఐకమత్యంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు. అలాగే, వైరస్ కట్టడికి విశేష కృషి చేస్తున్న రాష్ట్ర  ప్రభుత్వాలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.

ఏదైనా గౌతమ్ రెడ్డి సార్ టోన్, టెనార్ చాలా డిఫరెంట్ సిద్దప్పా...

* జగదేకవీరుడు చిత్రం లో ఎన్ టీ ఆర్ ఎలాగో, పరిశ్రమల శాఖ లో జితేందర్ శర్మ అలాగన్న మాట  * జితేందర్ శర్మ అవినీతిపై విచారణ ఇహ అటకెక్కినట్టేనా ? * చంద్రబాబు నాయుడు 'బ్లూ ఐడ్ బాయ్' శర్మ అంటే -గౌతమ్ రెడ్డి కి మక్కువ ఎక్కువ  * రెండు ప్రభుత్వాల్లోనూ చక్రం తిప్పుతూ, ఎందరినో అబ్బురపరిచిన శర్మ ఏది ఏమైనా గౌతమ్ రెడ్డి సార్ టోన్, టెనార్ చాలా డిఫెరెంట్ అని వెలగపూడి సచివాలయం ఐ ఏ ఎస్ లు చెవులు కొరుక్కుంటున్నారు. 'ఇద్దరు తల్లుల ముద్దు బిడ్డ', 'సాహసమే నా ఊపిరి ' లాంటి స్లోగన్లు మనం చిన్నప్పుడు లారీల వెనుక, బస్సుల వెనుక చూస్తూ చదువుతూ ఉండే వాళ్ళం కదా .. అందులో ఫస్ట్ స్లోగన్ అంటే మంత్రి గౌతమ్ రెడ్డి గారికి మహా ప్రీతి అనీ, అందుకనే రెండు ప్రభుత్వాలలో ( తెలుగు దేశం, వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వాలు ) ఒక వెలుగు వెలిగి, ఇంకా వెలుగుతూనే ఉన్న పూనమ్ మాలకొండయ్య, జితేందర్ శర్మ లాంటి వారిని ఆ స్లోగన్ కిందకు తీసుకువచ్చి వారికి పెద్ద పీట వేశారని కొందరు కిట్టని ఐ ఏ ఎస్ లు, మంత్రులు అనుకుంటున్నప్పటికీ, ధీశాలి గౌతమ్ రెడ్డి మాత్రం అవేమీ పెద్దగా పట్టించుకోకుండానే, ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి-ఆంధ్ర ప్రదేశ్ మెడ్ టెక్ జోన్ ( ఏ ఎం టీ జెడ్) అద్భుతాలను ప్రెజెంట్ చేసిన తీరు, ఆ నిమిత్తం జగదేకవీరుడు సినిమా లో ఎన్ టీ ఆర్ మాదిరి జితేందర్ శర్మ ఏ రకంగా అసాధ్యాలను సుసాధ్యం చేశారో వివరించుకుంటూ వచ్చిన తీరు చూపరులను, మీడియా ప్రతినిధులను ఆద్యంతం అబ్బురపరిచింది. ఆ విశేషాలేమిటో, మంత్రి గౌతమ్ రెడ్డి మాటల్లోనే వినండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. జితేందర్ శర్మ అనే అద్భుత వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కూడా. నాదస్వరానికి నాగుపాము ఎలా తల ఊపుతూ నాట్యం చేస్తుందో, సరిగ్గా అదే తీరున జితేందర్ శర్మ ప్రతిపాదనలను ఆద్యంతం ప్రోత్సహిస్తూ వచ్చి, ఏ ఎం టీ జెడ్ అవినీతి వివాదాల్లో చిక్కుకోవటానికి చంద్రబాబు నాయుడు కూడా శాయశక్తులా సాయపడ్డారు. అపుడు  ఏ ఎం టీ జెడ్ ఆరోగ్య శాఖ పరిధిలో ఉంటె, ఈ ప్రభుత్వం లో మాత్రం గౌతమ్ రెడ్డి గారి పరిశ్రమల శాఖ పరిధిలోకి వచ్చింది. ఏ జితేందర్ శర్మ మీద అయితే, వై ఎస్ ఆర్ సి పి అలుపెరుగని పోరాటం చేసిందో, తాము అధికారం లోకి రాగానే, మళ్ళీ అదే శర్మ గారిని ఏ ఎం టీ జెడ్ కి సి ఈ ఓ గా నియమించింది. ఇక్కడ కూడా గిట్టనివారు, చంద్రబాబు నాయుడును, కీలక బీ జె పీ నేతలను, పూనమ్ మాలకొండయ్య నూ ఆడిపోసుకున్నా కూడా- గౌతమ్ రెడ్డి మాత్రం తన హృదయ వైశాల్యాన్ని చాటుకుని మరీ జితేందర్ శర్మ చేత కరోనా కిట్లు తయారు చేయిస్తున్నారు. అదీ పరిశ్రమల మంత్రి గొప్పతనం.  ఇహ, మిగిలిన కథా క్రమమెట్టిదో మీరే చదవండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ -19 వైరస్ టెస్ట్ కిట్లు తయారు చేయడం గర్వించదగ్గ పరిణామమనీ, అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విప్లవాత్మక మార్పులకు విశాఖ మెడ్ టెక్ జోన్  శ్రీకారం చుట్టిందని ప్రెస్ మీట్ లో చెప్పిన గౌతమ్ రెడ్డి, ఏపీతో పాటు, దేశానికే మెడ్ టెక్ జోన్ కిట్ల తయారీలో కీలకంగా మారుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖ మెడిటెక్ జోన్ లో కోవిడ్-19 టెస్టింగ్ కిట్ల తయారీకి ఐసీఎంఆర్ అనుమతి లభించిందని, వెంటిలేటర్ల తయారీకి అవసరమైన అన్ని అనుమతులకు  డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా  మినహాయింపు ఇచ్చారని, కరోనా వైరస్ ను ధృవీకరించడంలో ఈ కిట్లు చాలా అద్భుతంగా పని చేస్తాయని చెప్పుకొచ్చారు. రోజుకు 2000 కోవిడ్-19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల తయారీ, రానున్న రోజుల్లో 25 వేల కిట్ల తయారే లక్ష్యం, ర్యాపిడ్ టెస్టింగ్ ద్వారా గంటలోనే ఫలితం, పాలిమరస్ చైన్ రియాక్షన్ (PCR)టెస్ట్ నిర్ధారణ ప్రక్రియకు  2-3 రోజుల సమయం అవసరమని చెప్పిన మంత్రి, కిట్లు తయారీతో పాటు, 6వేల మెషిన్లు నిల్వ సిద్ధంగా ఉందన్నారు. స్క్రీనింగ్ పరీక్షలకు కావలసిన సామాగ్రిని త్వరలోనే 60 శాతం సిద్ధంగా ఉంచుతామన్నారు. దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్ల కొరత ఉన్న నేపథ్యంలో త్వరలోనే కావల్సినన్ని సమకూరుస్తామన్నారు. N95 కన్నా సురక్షితమైన P 95 మాస్కుల తయారీ పనులను కూడా 4 పరిశ్రమలకు అప్పగించామన్నారు. వ్యక్తిగత రక్షణ సామాగ్రీ (PPE-పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్) కూడా  రాష్ట్రంలో అవసరాలకు లోటు లేకుండా తయారు చేస్తామని, డీఎన్ఏ , ఆర్ఎన్ఏ మోడల్ కాబట్టి కచ్చితమైన నిర్ధారణ జరుగుతుందని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ లో సుమారు 20వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, అందుబాటులో ఉన్న వనరులతో  రోగుల ప్రాణ నష్టం లేకుండా చూడాలనేది ముఖ్యమంత్రి తరచూ చెప్పే మాట. వైద్య పరికరాల కొరత, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికగా ముందుకు వెళుతున్నామని కూడా మంత్రి చెప్పారు. అత్యవసర వైద్య పరికరాలు, మాస్కులు, టెస్టింగ్ కిట్లు తయారు చేసే పరిశ్రమలకు కావలసిన కార్మికులు, సిబ్బందికి లోటు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.  అత్యవసర సేవలు, సామాగ్రి అందించే పరిశ్రమలలో పని చేస్తున్న ఉద్యోగులకు పౌష్ఠికాహారం, వసతులు లోటు రానివ్వడం లేదని, కరోనా ఇబ్బందులలోనూ 25-30 శాతం పారిశ్రామిక ఉత్పత్తి చేస్తూ దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ ముందుంది. మిగతా రాష్ట్రాలలో  20 శాతం కన్నా తక్కువేనని చెప్పారు.  పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 1000 టెస్టింగ్ కిట్లు, 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ అందజేస్తామన్నారు.  కోవిడ్-19 బాధితులకు వెంటిలేటర్ల సాయం అత్యవసరమని, అటువంటి వెంటిలేటర్ల తయారీకి కూడా రాష్ట్రంలో ప్రాధాన్యతనిస్తూ వాటిని కూడా విశాఖ మెడ్ టెక్ లో తయారీకి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ క్రమంలో హిందుస్థాన్ లైఫ్ కేర్(హెచ్ఎల్ఎల్) సంస్థతో కలిసి ఏప్రిల్ 15 నుండి నెలకు 3000 వెంటిలేటర్లు మరియు మే చివరి నాటి 6 వేల వెంటిలేటర్లు ఉత్పత్తి చేయనున్నామని మంత్రి తెలిపారు. కేంద్రం ఇప్పటికే 3500 వెంటిలేటర్లు కావాలని ప్రతిపాదించిన నేపథ్యంలో వాటి తయారీకి తొలిదశలో 6 కంపెనీలను ఎంపిక చేయడం జరిగిందని, అవి ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తాయని తెలిపారు. అధునాతన టెక్నాలజీ వాడటం ద్వారా ఒక్క వెంటిలేటర్ సహాయంతో ఐదు నుండి ఆరుగురుకి వినియోగించే టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రతరమైన నేపథ్యంలో పరిశ్రమల శాఖ తమ వంతు సహకారంగా 1000 టెస్టింగ్ కిట్లను ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అదే విధంగా రూ. 10 లక్షల విలువ చేసే 10 వేల లీటర్ల హ్యాండ్ శానిటైజర్ ను కూడా ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఏపీఐఐసీ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం(5 లక్షల 4వేల 570 రూపాయలు) ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా  అందజేశారని వెల్లడించారు. అత్యాధునిక వైద్యపరికరాల తయారీలో విశాఖ మెడ్ టెక్ జోన్  విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో కరోనా నియంత్రణకు విశాఖ మెడ్ టెక్ జోన్ సంస్థ ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు.  పరిశ్రమలు శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ మాట్లాడుతూ, ప్రస్తుతం క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే మిషన్ లలో ఈ టెస్టింగ్ కిట్లను వినియోగించనున్నామన్నారు. రాష్ట్రంలో 230 ఈ తరహా మిషన్లు ఉన్నాయని, వాటన్నింటిని వినియోగిస్తూ ఈ కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలను నిర్వహించి 55 నిమిషాల్లోనే ఫలితాలు వెల్లడిస్తామన్నారు.

టీడీపీ గుట్టు విప్పిన 'సజ్జలోపాఖ్యానం'

* మాజీ సి ఎం దోస్తు శ్రీనివాసులు నాయుడి యవ్వారంపై నోరు మెదపరేమని సజ్జల ప్రశ్న  * మాజీ మంత్రి గంట ఆ విషయం లో హర్ట్ అయ్యారని సజ్జల వ్యాఖ్య ఇంతకీ సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పే ఆ శ్రీనివాసులు నాయుడు ఎవరు? ఆయన, అప్పటి హెచ్ ఆర్ డీ మంత్రి గంట శ్రీనివాసరావుని కూడా పక్కన పెట్టి మరీ, యూనివర్సిటీ పాలక మండళ్లను నియమించారా? ఈ విషయం లో అప్పటి సి ఎం చంద్రబాబు నాయుడు కు, గంటా శ్రీనివాసరావుకు మధ్య నిజంగానే గ్యాప్ పెరిగిందా? శ్రీనివాసులు నాయుడు నిజంగా అంత తురుమ్ ఖానా? అవుననే అంటున్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. వివరాలన్నీ అయన మాటల్లోనే వినండి.  రాష్ట్రం లోని యూనివర్సిటీలను విద్యాపరంగా అత్యున్నతంగా తీర్చిదిద్దడానికి పాలక మండళ్ళను నియమించినట్టు ప్రభుత్వ ప్రజావ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం, అలాగే ఆ పార్టీ కి వంత పడుతున్న కొన్ని మీడియా సంస్థలపై మండిపడ్డ సజ్జల, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చాక యూనివర్సిటీల పాలక మండలి నియామకం తొలిసారి జరిగిన విషయాన్ని గుర్తు చేశారు.  "దేశ చరిత్రలో తొలిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి 50 రిజర్వేషన్లతో యూనివర్సిటీ పాలక మండలి పోస్టులు భర్తీ చేశారు. బీసీ, ఎస్సి ,ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం మేరకు పాలక మండలిలో అవకాశం కల్పించారు.. పాలక మండలిలో  మహిళలకు సైతం 50 శాతం మేర అవకాశం కల్పించారు.సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశ్యం తో సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 యూనివర్సిటీల్లో 50 శాతం రిజర్వేషన్లు దాటి బీసీ, ఎస్సి, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారు. 116 మంది పాలకమండలి సభ్యులకు గాను 58 మంది మహిళలకు సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి స్దానం కల్పించారు. పాలకమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి ప్రజాస్వామ్యబద్దంగా,ఎవరైతే అప్లయ్ చేసుకున్నారో వారి అర్హతలను ఉన్నత విద్యకు సంబంధించి ప్రత్యేక కమిటి పరిశీలించింది. 390 మంది దరఖాస్తు చేసుకుంటే వారిని అన్ని విధాలా వడపోత పోసి యూనివర్శిటిల అభివృధ్దికి దోహదపడేవారిని 116 మందిని నియమించారు. మా నాయకులు సిఫార్స్ చేసారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నియమితులైన సభ్యులలో అందరూ కూడా ఆయా రంగాలలో నిష్ణాతులే పైగా రిజర్వేషన్ లకు లోబడి నియమించబడ్డవారు. ఉన్నత విద్యావంతులు, సమాజంలో ఆయా రంగాలలో ఉన్నతమైన వ్యక్తులను పాలకమండలి పదవుల్లో నియమించారు.. పాలక మండలి సభ్యులు నియామకం పై టీడీపీ నేతలు తప్పుడు దుష్ప్రచారం చేస్తున్నారు," అని సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పుకొచ్చారు.  పాలకమండళ్ల నియామకాలలో సామాజిక న్యాయం పాటించడాన్ని పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని, మూడు రోజుల నుంచి పసిరికా పాముల పచ్చ మీడియా తప్పుడు వార్తలు వండివారుస్తోందని, ప్రపంచ మంతా కరోనా వైరస్ గురించి ఆలోస్తుంటే పచ్చమీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారని , లాక్ డౌన్ ఉందని రాజకీయ పాలక మండలి అంటూ మెడకాయమీద తలకాయలేని వార్తలు రాస్తున్నారని సజ్జల మండిపడ్డారు.  "కరోనా లాంటి మహమ్మారి  నేపథ్యంలో మేము మంచి పని చేసి కూడా చెప్పలేకపోయము. కరోనా ను ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న తీరు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందిముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పని చేయడమే తప్ప ప్రచారం అలవాటు లేదు. పాలకమండలికి సంబంధించి అన్ని పదవులు అర్హులకే కట్టబెట్టారు.యూనివర్సిటీ పాలక మండలి పోస్టుల భర్తీ విషయంలో రిజర్వేషన్లు ఖచ్చితత్వం పాటించాలని సీఎం ఆదేశించారు.మహిళ రిజర్వేషన్లు విషయంలో రెండు పోస్టులు తగ్గితే సీఎం వైయస్ జగన్ ఒప్పుకోలేదు.రిజర్వేషన్లు ప్రకారం మహిళలకు, బడుగు, బలహీన వర్గాలకు పదవులు దక్కవలసిందేనని సీఎం స్పష్టంగా చెప్పారు.చంద్రబాబు హయాంలో 11 యూనివర్సిటీల పాలక మండలి భర్తీలో పదవులను నామినేటెడ్ పద్దతిలో నియమించారు.దాని కోసం ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు.ఇప్పటి పాలకమండలి నియామకానికి ప్రత్యేకంగా ఓ కమిటిని మా ప్రభుత్వం నియమించింది.చంద్రబాబు హయాంలో అయితే  క్లాస్ మేట్ శ్రీనివాసులు నాయుడు తయారు చేసిన పాలక మండలి సభ్యులు జాబితాను చంద్రబాబు ఆమోదించారు.శ్రీనివాసులు నాయుడు కు ఏ అర్హత ఉందని పాలకమండలి సభ్యులను నియమించారో కూడా తెలియదు.దీనిపై  ఎల్లో మీడియా అప్పడు  ఎందుకు వార్తలు రాయలేదు. అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు కు కూడా తెలియకుండా యూనివర్సిటీ పాలక మండలి సభ్యులను నియమించారు.ఈ విషయం అప్పట్లో అందరికి తెలిసిందే.చంద్రబాబు హయాంలో పాలకమండలి సభ్యుల నియామకాల్లో తప్పులు జరిగితే ఎల్లో మీడియా గాడిదలు కాసిందా. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులుపై పచ్చమీడియా ఎందుకు నోరు మెదప లేదంటూ" సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రశ్నించారు.

సీఆర్డీఏ వర్సెస్ మందడం రైతులు

తుళ్ళూరు మండలం మందడం గ్రామ పంచాయతీ కార్యాలయంలో  సీఆర్డీఏ సిబ్బంది తో రైతుల వాగ్వివాదం కారణంగా ఉద్రిక్తత నెలకొంది. ఇళ్ళు లేని నిరుపేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సి ఆర్ డి ఏ అధికారులు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.  గతంలోనే  పట్టాలు ఇవ్వటం కుదరదు అంటూ  కోర్టును ఆశ్రయించిన రైతులు. అభ్యంతరాలు తెలిపేందుకు కోర్టుకు రావాలంటూ రైతులకు నోటీసులు ఇచ్చేందుకు మందడం పంచాయితీ కార్యాలయంలో కి వచ్చిన సీఆర్డీఏ సిబ్బంది. లాక్ డౌన్ ఉన్నపుడు రైతులు కోర్టుకు ఎలా వస్తారంటూ సీఆర్డీఏ సిబ్బందిని ప్రశ్నించిన రైతులు. సామాన్య ప్రజలు కూరకాయలు తెచుకోవటానికే బయటకు రానివ్వని పోలీసులు మీకు బయటకు రావటానికి ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రశ్నించిన రైతులు. దీంతో సీఆర్డీఏ సిబ్బంది అనివార్యంగా వెనుతిరిగి వెళ్లాల్సి వచ్చింది.

దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు! కిషన్‌రెడ్డి

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రాలు, నిపుణుల నుంచి సూచనలు వస్తున్నాయని వెల్లడించారు. ‘‘ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.  అనవసర కారణాలతో రోడ్డపై తిరగొద్దు. తాజా కూరగాయలు అవసరంలేదు.  పప్పుతో తినండి. వారం రోజులకు సరిపడా సరుకులు దగ్గర పెట్టుకోండని కిష‌న్‌రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు. ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఎక్కడివారు అక్కడే ఉంటారు. విదేశాల నుంచి వచ్చి నిర్బంధంలో ఉన్నవారి నిర్బంధం కొనసాగుతుంది. ఆహార కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయికూడా దుర్వినియోగం చెయ్యలేదు. ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

డిజిపి కార్యాలయంలో సూక్ష్మక్రిముల కిల్లర్ టన్నెల్!

తెలంగాణ డిజిపి కార్యాలయంలో సూక్ష్మక్రిములను నివారించే 3V సేఫ్ టన్నెల్ ఏర్పాటు చేశారు. 1.5 మైక్రాన్స్ నుండి 20 మైక్రాన్స్ వరకు పరమాణువుల సూక్ష్మ క్రిములను ఈ టన్నెల్ నుంచి వెళ్లితే డిస్-ఇన్ఫెక్ట్ చేస్తుంది. S-3-V వాస్కులర్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన ఈ టన్నెల్ డీజీపీ మహేందర్ రెడ్డి, ఉన్నత పోలీస్ అధికారులు పరిశీలించారు.  ఈ టన్నెల్ లోపల 20 క్షణాల పాటు ఉండటంతో అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుండి దూరం కావచ్చని వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు వివరంచారు. డీజీపీతో పాట అడిషనల్ డీజీలు జితేందర్, ఉమేష్ ష్రాఫ్, రాజీవ్ రతన్, శివధర్ రెడ్డి, ఐజీలు సంజయ్ జైన్, నాగిరెడ్డి తదితర అధికారులు ఈ విధానాన్ని పరిశీలించారు.

ప్రధాని అఖిలపక్షంతో వీడియో కాన్ఫరెన్స్ భేటి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో కరోనా వైరస్ విజృంభన, లాక్ డౌన్ అమలు చేస్తోన్న అంశాలపై అఖిలపక్ష పార్టీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్ సభ, రాజ్యసభలలో కనీసం 5 మంది ఎంపీలున్న పార్టీల నాయకులతో ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో చ‌ర్చించారు. మార్చి 24 న ప్రధాని మోడీ ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుంది, అయితే చాలా రాష్ట్రాలు పొడిగింపును కోరాయి., COVID-19 కేసుల్లో పెరుగుదల మరియు రాబోయే వారాల్లో ఇన్‌ఫెక్షన్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరికల అభిప్రాయాలు వచ్చాయి.  దేశంలో కేసుల నమోదు సంఖ్య పెరగడంతో కరోనా వైరస్ పోరాటంపై వీడియోకాన్ఫరెన్స్‌లో చ‌ర్చించారు. క‌రోనా వైరస్‌తో  దేశంలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 149 మరణాలు నమోదయ్యాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ అలాగే కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుదీప్ బండియోపాధ్యాయ, శివసేన నాయకుడు సంజయ్ రౌత్, సమాజ్ వాదీ పార్టీ రామ్ గోపాల్ యాదవ్, బిఎస్పి నాయకుడు ఎస్సీ మిశ్రా, లోక్ జనశక్తి పార్టీ చిరాగ్ పాస్వాన్, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, డిఎంకె నాయకుడు టిఆర్ బాలు, TRS కేశవరావు, YSR కాంగ్రెస్ విజయసాయి రెడ్డి తదితరులు కాన్ఫరెన్స్ పాల్గొన్నారు.

నర్సీపట్నం డాక్టర్‌ ను సస్పెండ్ చేసిన ఏపీ సర్కార్!

విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి డాక్టర్ కె. సుధాకర్‌ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు బుధవారం వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు డాక్టర్ సుధాకర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి. జాతీయ విపత్తు సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం, 144 సెక్షన్ ఉల్లంఘన, ఉన్నతాధికారులను వ్యక్తిగతంగా దూషించడం వంటి నేరాల కింద సుధాకర్‌పై కేసులు నమోదు చేసినట్టు నర్సీపట్నం టౌన్ సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఏపీ ప్రభుత్వంపై డాక్టర్ సుధాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మాస్కులు మరియు కనీస రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలున్న వారికి వైద్యం చేయాలంటూ డాక్టర్లపై ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసారు. తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. డాక్టర్ సుధాకర్‌ వ్యాఖ్యలు  అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కూడా దారితీశాయి. డాక్టర్ సుధాకర్‌ వ్యాఖ్యల ప్రతిపక్ష టీడీపీ ఉందని అధికార పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ఏకంగా ఆయనకు సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.

ముఖ్యమంత్రి, హోంమంత్రి మ‌ధ్య దూరం పెరుగుతోందా?

తెలంగాణ హోం శాఖా మంత్రి మొహమ్మద్ అలీని ప్రగతి భవన్‌లోకి అనుమతించలేదు. ఈ విష‌యం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.  హోంమంత్రికి ప్రగతిభవన్‌లో నేరుగా ప్రవేశం లభించలేదు. కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై బుధవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే మహమూద్‌ అలీ ప్రగతి భవన్‌కు వచ్చారు. అయితే ప్రగతిభవన్‌ ప్రవేశ ద్వారం వద్దే ఆయనను భద్రతా సిబ్బంది నిలిపేశారు. కొంతసేపు అక్కడే వేచిచూసిన మహమూద్‌ అలీ తిరిగి వెళ్లిపోయారు. ఆ త‌రువాత  ఆదివారం నాడు అదే ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సమీక్షా సమావేశం నిర్వహించారు, ఇందులో ఆరోగ్య మంత్రి ఈటేలా రాజేందర్, వ్యవసాయ మంత్రి మైనర్ నిరంజన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వ్యవసాయ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, పౌర సరఫరా కమిషనర్ సత్య నారాయణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు నర్సింగ్ రావు, శాంత కుమారి, రామ కృష్ణారావు ఉన్నారు. కానీ హోం మంత్రి మొహమ్మద్ అలీ క‌నిపించ‌లేదు. ఈ సంక్షోభ పరిస్థితిలో ఆ కీలకమైన సమావేశంలో, హోమ్ మినిస్టర్  హాజరు కాలేదు. సమీక్షా సమావేశంలో పాల్గొనమని కెసిఆర్ కోరారా లేదా అనేది తెలియ‌దు. నిజంగా సిఎం, హోం మినిస్ట‌ర్ మ‌ధ్య ఏదో న‌డుస్తోందా? లేక హోం మినిస్ట‌ర్ త‌బ్లీక్ జ‌మాత్ వారితోకానీ, వారి బంధువుల‌తో కానీ క‌లిసి వుంటార‌నే భ‌యంతో దూరం పెట్టారా?  అని చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే తనకు ప్రగతి భవన్‌లోకి అనుమతించలేదని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని హోంమంత్రి మహమూద్ అలీ వివరణ ఇస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు.  అయితే నిన్నమంగ‌ళ‌వారం నాడు ఎం.ఐ.ఎం. నేత‌ల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ సామాజిక‌దూరాన్ని కూడా మ‌రిచి అంత ఆప్యాయ‌త‌తో క‌లిశార‌ట‌. సి.ఎం. కేసీఆర్ స్టైల్ వేరు.

లామినేట్‌ షీట్ తో కొత్తరకం మాస్క్! ధ‌ర 50 రూపాయ‌లే!

ఓ ప‌క్క‌ కరోనా విశ్వ‌రూపం చూపిస్తోంది. మ‌రో వైపు మాస్కుల కొరత వుంది. ఈ నేప‌థ్యంలో వైద్య సిబ్బందికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. పైగా మాస్కుల ధరలను ఒక్కసారి పెంచేశారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో ఎల్‌వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల, పరిశోధన సంస్థ. కొత్తరకం మాస్క్ ను త‌యారు చేసింది. ఆసుపత్రికి చెందిన యువ ఇంజనీరింగ్‌ బృందం సందీప్‌ వెంపటి, కార్తీకేశ్‌, ఆశిష్‌తోపాటు నేత్ర వైద్యులు వినీత్‌ జోషి తదితరులు ఈ వైజర్‌ను కొత్తరకం మాస్క్ ను రూపొందించారు. కరోనా చికిత్సలు అందించే వైద్యులు, సిబ్బందికి ఈ మాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన సందీప్‌ తెలిపారు.  లామినేషన్‌ కోసం ఉపయోగించే 150 మైక్రాన్ల ప్లాస్టిక్‌ షీట్‌ను తీసుకొని 3డీలో మాస్క్‌ నమూనాను రూపొందించారు. మాస్క్‌ను పెట్టుకునేందుకు అవసరమైన విడి భాగాల సాయంతో ఆసుపత్రిలోనే ఈ వైజర్‌ను తయారు చేశారు. దీనికి వెనుక రబ్బర్‌ బ్యాండ్‌తో మాస్క్‌ను అనుసంధానించడం వల్ల ప్రత్యేకంగా తాళ్లతో కట్టుకోవాల్సిన అవసరం ఉండదు.  ఒకసారి ముఖానికి తగిలించుకుంటే  మళ్లీ తీసేవరకు అలాగే ఉంటుంది. నుదురు నుంచి గడ్డం కిందవరకు ఈ మాస్క్‌ షీటు ఉంటుంది. దీంతో ఎలాంటి వైరస్‌ దాడి చేసే పరిస్థితి వుండ‌దు.  నిరాటంకంగా 8 గంటలపాటు వాడుకొని... తర్వాత షీట్‌ను శానిటైజర్‌ లేదా సబ్బు నీళ్లతో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా ఎన్నిసార్లయినా దీనిని శుభ్రంచేసి వాడుకోవచ్చని సందీప్ చెప్పారు.  ఇప్పటివరకు 2 వేల వైజర్లను తయారు చేశారు. దీని ధ‌ర 50 రూపాయ‌లుగా నిర్ణ‌యించారు. ముందుగా ప్రభుత్వ ఆసుపత్రులకు అందజేయనున్నట్లు సందీప్‌ వెల్లడించారు.

సింగరేణిలో గల్లంతైన కార్మికుడు! గోదావరిఖనిలో టెన్షన్!

మంగళవారం ఏప్రిల్ 7న‌ గనిలో మోటార్ రన్ చేయడానికి వెళ్లిన సంజీవ్ అనే కార్మికుడు ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో గోదావరిఖనిలో విషాధం అలుముకుంది. విషయం తెలుసుకున్న సంజీవ్ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అతడి కోసం అధికారులు అర్ధరాత్రి వరకు తీవ్రంగా గాలించారు. బుధవారం ఉదయం సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. 11 ఇంక్లైన్ బొగ్గుగనిలోని నాలుగో సీమ్, ఒవటవ డిప్ వద్ద మోటార్ రన్ చేయడానికి సంజీవ్ వెళ్లినట్లు సింగరేణి సిబ్బంది తెలిపారు.  మంగళవారం రాత్రి జీఎంతో సహా అధికారులంతా కలిసి గనిలో వెతికారు. అయినప్పటికీ ఫలితం లేదు. సంజీవ్ గని లోపల సంప్‌లో పడినట్లు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది అతడి కోసం గాలింపు చేపట్టారు.

షబే బారత్ జాగారం! ఇంట్లోనే జరుపుకోండి! మసీదులకు వెళ్ళొద్దు!

కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి‌ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించబడుతున్న‌ నేపధ్యంలో ముస్లింలు ష‌బేబార‌త్ సంద‌ర్భంగా సామూహిక ప్రార్ధనలు చేయ‌వ‌ద్ద‌ని జమాతె ఇస్లామీ హింద్ పిలుపునిచ్చింది. ముస్లింలందరూ గురువారం రాత్రి సామాజిక బాధ్యతతో వ్య‌వ‌హ‌రించి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ బోర్డ్ సీఈఓ అలీం బాషా మసీదు కమిటీలకు ముస్లింలకు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ నెల 9 గురువారంనాడు జరిగే షబ్ ఎ బరాత్ పెద్దల పండగ జరుపుకోవడంలో ముస్లింలందరూ లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకోవాలి. ఫాతేహా ​​మొదలైన మతపరమైన ఆచారాలు ఇళ్లనుంచే నిర్వహించాలి. ముస్లిం స్మశానవాటికలో సమూహముగా ఫాతేహా ​​మొదలైనవాటిని నిర్వహించరాదని వ‌క్ఫ్‌బోర్డు ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా వైరస్ శాశ్వతంగా ప్ర‌పంచం నుండి తొలగిపోయి ప్రజలందరికీ విముక్తి కలగాలని ప‌విత్ర షబే బారత్ సంద‌ర్భంగా అల్లాహ్ ను దువా చేసి వేడుకోవాల‌ని ఎం.బి.టి. నేత అంజ‌దుల్లాఖాన్ హైద‌రాబాద్‌లో పిలుపునిచ్చారు. ఈ మహోన్నతమైన, ప్రాముఖ్యత కలిగిన షబే బరాత్ పండుగను పుర‌స్క‌రించుకొని త‌మ‌ పూర్వీకులు చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ పేద వాళ్లకు అన్నదానం చేయ‌మ‌ని ఎం.ఐ.ఎం.పార్టీ ముస్లింల‌కు సూచించింది. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లల్లోనే ప్ర‌త్యేక ప్రార్థనలు విడివిడిగానే జరుపుకోవాలని మ‌త‌పెద్ద‌లు సూచించారు.

వచ్చే వారం రోజలు అత్యంత కీలకం! అకుంఠిత దీక్షతో ఎదుర్కొందాం!

వచ్చే వారం రోజులు లాక్‌డౌన్‌లో అత్యంత కీలకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ వారంలో ఉండే కరోనా తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగించాలా, వద్దా అనే ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.  మార్చి 24న ప్రధాని మోదీ మూడువారాల లాక్‌డౌన్‌ ప్రకటించాక మొదటి రెండు వారాలు ప్రజలంతా బలమైన సంకల్పంతో కరోనాపై పోరాటం చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.  ప్రస్తుతం మూడో వారంలోకి చేరుకున్న క్రమంలో ఏప్రిల్‌ 14 తర్వాత ప్రధాని మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పటి మాదిరిగానే దేశప్రజలంతా ప్రభుత్వానికి సహరించి కరోనాను పూర్తిగా అంతం చేయాలని  పిలుపునిచ్చారు. బలమైన నాయకత్వం వల్లే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలంతా సురక్షితంగా బయటపడతారన్నారు.  ఆర్థికంగా దేశానికి నష్టం వాటిల్లినప్పటికీ తిరిగి గాడిలో పెట్టవచ్చని, అదే మనుషుల ప్రాణాలు పోతే మాత్రం తిరిగి రావని ఈ సందర్భంగా ఆయన  వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలు కారణంగా కరోనావైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకోగలుగుతున్నామన్నారు. భౌతికదూరం పాటించకపోతే ఎంతటి విపత్తు ఏర్పడుతుందో తబ్లీగీజమాత్‌ కార్యక్రమం ద్వారా తేటతెల్లమైందని, ప్రజలంతా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కచ్ఛితంగా భారతదేశం కరోనాపై విజయం సాధించితీరుతుందని ఆయ‌న‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా కలకాలం హాయిగా జీవించాలంటే ఇంకొన్ని రోజులు ఇబ్బందులను భరించాలని ప్రజలకు ఉప‌రాష్ట్ర‌ప‌తి విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా పై అంతిమ విజయం సాధించే వరకు అకుంఠిత దీక్ష ను మనం ప్రదర్శించాల్సి ఉందన్నారు.

ఊహాగానాలు వ‌ద్దు! లాక్ డౌన్ పై నిర్ణ‌యం తీసుకోలేదు!

ఏప్రిల్‌ 14 తరువాత కూడా కొంతకాలం లాక్‌డౌన్‌ను కొనసాగించడం పై కేంద్రం కసరత్తు చేస్తోంది. లాక్ డౌన్ పొడిగించాలని కేంద్రానికి వివిధ రాష్ట్రాల సీఎంలు, నిపుణుల సూచనలు చేశారు. అయితే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, ఊహాగానాలు వద్దని కేంద్ర ప్రభుత్వం స్ప‌ష్టం చేసింది. మత ప్రదేశాల్లో కార్యకలాపాలపై మే 15 వరకు ఆంక్షలతో పాటు, మే15 వరకు విద్యా సంస్థల మూసివేయాల‌ని కరోనా నేప‌థ్యంలో కేంద్ర మంత్రుల బృందం సిఫారసు చేసింది. అయితే విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్, మతపరమైన కేంద్రాల్లో ఏప్రిల్‌ 14 తరువాత కనీసం నెల రోజుల పాటు లాక్ డౌన్ కొనసాగే అవకాశం వుంది. సాధారణ కార్యకలాపాలను ఎట్లిపరిస్థితుల్లో అనుమతించకూడదని జీఓఎం సిఫారసు చేసింది. మత ప్రాంతాలు, షాపింగ్‌ మాల్స్‌ తదితర బహిరంగ ప్రదేశాలపై డ్రోన్లతో సునిశిత పర్యవేక్షణ పెట్ట‌నున్నారు. ఆల్కహాల్‌ ఉత్పత్తులను అమ్మేందుకు అనుమతించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆల్కహాలిక్‌ బేవరేజ్‌ కంపెనీస్‌ (సీఐఏబీసీ) తెలంగాణ, కర్నాటక, రాజస్తాన్, హరియాణా, మహారాష్ట్ర, యూపీ సహా 10 రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది.