డాక్టర్ మీద ఉమ్మేసిన కరోనా పేషేంట్, హత్యాయత్నం కేసు నమోదు

తమ ప్రాణాలను పణంగా పెట్టి చికిత్స అందిస్తున్న వైద్యులపై దాడులు, వేధింపులు పెరుగుతున్నాయి. తాజాగా, తమిళనాడులో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడిపైనే ఓ రోగి ఉమ్మివేశాడు. కరోనా లక్షణాలతో 40 ఏళ్ల వ్యక్తి ఒకరు తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. అతడు చేరినప్పటి నుంచి చికిత్సకు సహకరించకపోగా, ముఖానికున్న మాస్కును తొలగించి వైద్యులపై విసురుతూ వేధించడం మొదలుపెట్టాడు. తాజాగా, తనకు చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడిపై ఉమ్మి వేశాడు. వైద్యుల ఫిర్యాదు మేరకు అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

తెలంగాణలో 531కి చేరిన పాజిటివ్ కేసులు! ఇప్ప‌ట్టి వ‌ర‌కు 16 మంది మృతి!

తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతూనే వుంది. నిన్న మ‌రో ఇద్ద‌రు మ‌ర‌ణించ‌డంతో పాజిటివ్ మృతుల సంఖ్య 16కు పెరిగింది. పరిస్థితి తీవ్రతను ప్రజలు అర్థం చేసుకొని ఇళ్లకే పరిమితం కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణలో కొత్తగా మ‌రో 28కి పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యాయి. దీంతో క‌రోనా బాధితులు 531కి పెరిగారు. చికిత్స పొందుతున్న వారిలో ఆదివారం మరో ఏడుగురు పూర్తిగా కోలుకుకోవ‌డంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఇప్ప‌ట్టి వ‌ర‌కు క‌రోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ చేసిన వారి సంఖ్య 103కి చేరిందని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ లో తెలిపింది. వివిధ కొవిడ్ ఆస్పత్రుల్లో 412 మంది చికిత్స పొందుతున్నారు.

నిర్మ‌ల్‌లో మర్కజ్ ప్రకంపనలు...

ఢిల్లీ మర్కజ్ కు వెళ్లొచ్చిన మహిళ భర్త నుంచి ఆమెతో పాటు ఏడాది కుమారుడికి  వైరస్ సోకింది. వీరినీ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో కేసుల సంఖ్య 19కి పెరిగింది. వీరిలో ఇప్పటికే ఇద్దరు మరణించారు.  కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ పెరుగుతూనే ఉండటంతో పల్లె వాసుల్లో ఆందోళన ఎక్కువైంది.  వైరస్ తమను చేరకుండా ఉండాలని నిర్ణయించుకొని వారు ఊర్లకు సైతం దూరంగా వెళ్లిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొంత మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. మ‌రొ కొంత మంది తమ పంట పొలాల్లో తాత్కాలికంగా టెంట్లు వేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.

రోడ్డుపై భ‌య‌పెట్టిన 500 రూపాయ‌ల నోట్లు!

ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూ ప్రజలు రోడ్డు మీద ప‌డి వున్న 500 రూపాయ‌ల నోట్ల‌ను చూసి తెగ హైరానా ప‌డిపోయార‌ట‌.  ప‌క్కాగా ఈ  నోటుపై క‌రోనా వైరస్ ఉంద‌నేది వారి అనుమానం. స్థానిక పేపర్‌ మిల్‌ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.  ఇక్కడి రోడ్డుపై  రెండు 500 రూపాయ‌ల‌ నోట్లు రోడ్డుపై ప‌డివుండ‌టాన్ని చూసిన స్థానిక వ్య‌క్తి హ‌డావిడి చేసేశాడ‌ట‌.  కరోనా వ్యాప్తికై ఎవరో చేసిన కుట్రగా  భావించి వెంటనే  పోలీసుల‌కు సమాచారం ఇచ్చాడ‌ట‌. పోలీసులు, ఆ నోట్లను స్వాధీనపరచుకుని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. రోడ్డు మీద డ‌బ్బు దొరికినా జ‌నానికి క‌రోనానే గుర్తుకు రావడాన్నిస్థానికులు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటున్నారు.

జలియన్‌వాలా దురంతానికి వందేళ్లు...

నేడు జలియన్ వాలభాగ్ ఉచ కోత కోసిన రోజు ఆ సంఘటనలో చనిపోయిన వీరులను స్మరించుకుంటు.. జలియన్ వాలాబాగ్ ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్ పట్టణంలో ఒక తోట పేరు. ఏప్రిల్ 13, 1919 న బ్రిటీష్ సైనికులు జనరల్ డయ్యర్ సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది నిమిషాలపాటు కొనసాగాయి. 1650 రౌండ్లు కాల్పులు జరిగాయి. అప్పటి ఆంగ్ల ప్రభుత్వ లెక్కల ప్రకారం 379 మంది మరణించారు. కానీ ఇతర గణాంకాల ప్రకారం అక్కడ 1000 కి పైగా మరణించారు. 2000 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 20 వేల మంది ప్రజలు ఆ తోటలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.    1919 రౌలట్ చట్టం భారత పౌరులను ఎటువంటి విచారణ జరపకుండా శిక్షించే అధికారం అధికారులకు సంక్రమింపజేసింది. ఆనాడు ఆ చట్టాన్ని దేశ ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లో హర్తాళ్ జరిగినప్పుడు ఉద్యమకారులు సత్యపాల్, సైఫుద్ధీన్ కిచ్లూలను ప్రభుత్వం నిర్బంధించింది. అందుకు నిరసనగా జరిగిన ప్రదర్శనపై పోలీసులు కాల్పులు జరపగా 20 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల సంస్మరణార్థం, పోలీసుల చర్యలకు నిరసనగా అమృతసర్‌ స్వర్ణ దేవాలయం దగ్గర గల జలియన్‌వాలా బాగ్‌లో 1919 ఏప్రిల్ 13 న ప్రజలు పెద్దయెత్తున సమావేశం ఏర్పాటు చేశారు. దీన్ని నిషేధిస్తూ పంజాబ్ ప్రభుత్వం చేసిన ప్రకటన తగినంతగా ప్రచారం కాలేదు. అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు శాంతియుతంగా జరుపుకుంటున్న సమావేశంపై ఒక్కసారిగా బ్రిటీష్ సైనికులు కాల్పుల దాడి చేశారు.    1920లో గాంధీజీ పిలుపు మేరకు ‘సహాయ నిరాకరణ ఉద్యమం’ ప్రారంభమయింది. భగత్ సింగ్ విప్లవకారుడిగా మారేందుకు ఈ ఘటనే ప్రధానమైన కారణంగా చెప్పవచ్చు. దీనికి నిరసననగా బ్రిటిష్ వారు తనకు ఇచ్చిన ‘సర్’ బిరుదును రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తిరిగి ఇచ్చేశారు.

ఇంటి వైద్యంతో కరోనాను మట్టి కరిపించిన డాక్ట‌ర్‌!

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని రణంపల్లికి చెందిన నిమ్మగడ్డ శేషగిరిరావు కాకినాడలో వైద్యవిద్యను పూర్తి చేసి ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లారు. అక్కడి రాయల్ కాలేజ్ ఆప్ సైకియాట్రిస్ట్స్ లో మానసిక వైద్య విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత అక్కడే మానసిక వైద్యుడిగా స్థిరపడ్డారు. 25 ఏళ్లుగా అక్కడే సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్న నిమ్మగడ్డ... లండన్ సమీపంలోని న్యూబెర్రీలో మానసిక వైద్యశాలకు సంచాలకుడిగా పనిచేస్తున్నారు. నిమ్మగడ్డ శేషగిరిరావు - హేమ దంపతులకు 12 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కవల కూతుళ్లున్నారు. అంతా బాగుందనుకున్న తరుణంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గత నెల మార్చి 13న హేమకు అంటేసుకుంది.  స్కూలుకెళ్లిన పిల్లలను తీసుకొచ్చేందుకు బయటకెళ్లిన హేమకు బయటే వైరస్ సోకింది. అయితే స్వతహాగా వైద్యుడైన నిమ్మగడ్డ... రెండు రోజుల్లోనే తన సతీమణికి కరోనా సోకిందని నిర్ధారించేసుకున్నారు. అయితే కరోనా అంటేనే హడలిపోకుండా ఇంటిలోనే హేమకు చికిత్స మొదలెట్టేశారు. ఈ క్రమంలో తనకూ వైరస్ సోకిందని నిమ్మగడ్డ గ్రహించారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పిల్లలిద్దరినీ ఓ గదిలో ఉంచేసిన నిమ్మగడ్డ... తను తన సతీమణి ఇద్దరూ కలిసి మరో గదిలో దాదాపు సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఏమాత్రం బెదిరిపోని నిమ్మగడ్డ.. కరోనాపై పోరు ప్రారంభించేశారు.  కరోనా కారణంగా ఇద్దరికీ రోజూ జ్వరం వచ్చేది. అంతేకాకుండా దగ్గు కూడా వచ్చేది. జ్వరం తగ్గేందుకు పారాసిటమాల్ వేసుకోవడం స్టార్ట్ చేసిన నిమ్మగడ్డ... దగ్గు తగ్గేందుకు సిరప్ తాగేవారు. ఈ క్రమంలో కరోనా సోకిందన్న ఆందోళనను పక్కనపెట్టేసిన నిమ్మగడ్డ దంపతులు... పారాసిటమాల్ తో పాటు రోజూ ఉప్పు నీళ్లు వీలయినంత ఎక్కువ తాగడం - పసుపు - అల్లం - మిరియాల పొడి వేసిన నీటిని మరిగించుకుని తాగడం నిమ్మరసం తాగడం.. ఒంట్లో శక్తి తగ్గకుండా ఏదో ఒకటి తినడం... ఇలా కరోనాపై పోరు సాగించారు. చివరకు వారిద్దరి శరీరాల్లో నుంచి కరోనా పారిపోయింది.      ఈ క్రమంలో చిన్నపిల్లలైన తన ఇద్దరు కూతుళ్లు తమకు వంట చేసిపెట్టడం - తల్లిదండ్రులిద్దరికీ కరోనా సోకినా.. పేరెంట్స్ తో పాటు వారు కూడా నిబ్బరంగా ఉండటంతో.. ఆ కుటుంబం మొక్కవోని ధైర్యం ముందు కరోనా తల వంచేసింది.  ఇంటి వైద్యంతో కరోనాను మట్టి కరిపించి... వైరస్ ను తమ శరీరాల్లో నుంచి తరిమేశారు. గుండె నిబ్బరం కోల్పోకుండా పోరు సాగిస్తే.. కరోనా మహమ్మారి మనల్నేమీ చేయలేదని చెబుతున్న ఈ కుటుంబం విజయగాథ ఇప్పుడు యావత్తు ప్రపంచ ప్రజలకు మార్గదర్శకంగా నిలిచింది.

ఏపీలో తాజాగా 15 పాజిటివ్ కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని తాజా హెల్త్ బులెటిన్ వెల్లడించింది. ఏపి లో 420 కి కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరిగింది. కొత్తగా ఆదివారం 15 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు 7, నెల్లూరు 4, కర్నూల్ 2,చిత్తూరు1,కడప1 పాజీటీవ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరొకరు కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. ఇప్పటివరకు కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వారి సంఖ్య 7 కు చేరుకుంది.  కరోనా పాజిటివ్ చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 12 కాగా, ప్రస్తుతం కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 401 అని హెల్త్ బులెటిన్ పేర్కొంది.

భారత్ లో చైనా ఆర్ధిక దురాక్రమణ షురూ...

*ఇప్పటికే శ్రీలంక, పాకిస్తాన్ లకు అప్పులిచ్చి, ఆ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకున్న చైనా  * కమ్యూనిజం నుంచి ఇంపీరియలిజం వైపు సాగుతున్న చైనా ప్రయాణం  అంతా అనుకున్నట్టే అయింది. ఏది జరుగుతుందో అని భయపడ్డామో, అదే జరిగింది. భారత ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే దిశగా, ప్రపంచ ఆర్థిక రంగంలో భారీ లావాదేవీ చోటుచేసుకుంది. ఓవైపు కరోనా రక్కసి ఆర్థిక వ్యవస్థలను సైతం కూలదోస్తున్న తరుణంలో, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా కీలక ముందడుగు వేసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో 1.75 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. మార్చి త్రైమాసికంలో ఈ కొనుగోలు ప్రక్రియ జరిగినట్టు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ షేర్ల విలువ క్రమంగా పతనమవుతోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఇప్పటివరకు 41 శాతం క్షీణత చవిచూసింది. అంతకుముందు జనవరి 14న 52 వారాల గరిష్ట పతనంతో హెచ్ డీఎఫ్ సీ షేర్ రూ.2,499.65 వద్ద ట్రేడయింది. ఏప్రిల్ 10 నాటికి హెచ్ డీఎఫ్ సీ షేర్ వాల్యూ రూ.1,710కి పడిపోయింది. అదే సమయంలో భారత సూచీల్లో సెన్సెక్స్ 25 శాతం నష్టపోగా, నిఫ్టీ 26 శాతం నష్టాలు చవిచూసింది. హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) కూడా వాటాదారు కాగా, డిసెంబరు త్రైమాసికంలో తన వాటాను 4.21 శాతం నుంచి 4.67 శాతానికి పెంచుకుంది. ఇక, తాజా లావాదేవీపై హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ వైస్ చైర్మన్, సీఈఓ కెకీ మిస్త్రీ మాట్లాడుతూ, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాకు తమ కంపెనీలో 2019 మార్చి నాటికే 0.8 శాతం వాటాలున్నాయని వెల్లడించారు. ఇప్పుడా వాటాలు ఒక్క శాతాన్ని దాటాయని, ప్రస్తుతానికి హెచ్ డీఎఫ్ సీ లిమిటెడ్ లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వాటా 1.1 శాతం అని వివరించారు. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే చైనా ప్రపంచ ప్రధాన ఆర్థిక సంస్థల్లో భారీగా వాటాలు దక్కించుకుంటోంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా కొనుగోళ్ల ప్రక్రియ సాగిస్తున్న చైనా ఇతర ఆసియా దేశాల్లో తన పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ, టెక్నాలజీ రంగంలోనూ భారీగా పెట్టుబడులు పెడుతోంది.

కరోనా తో చెన్నై లో కన్నుమూసిన నెల్లూరు సర్జన్

నెల్లూరు జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. నగరంలోని ప్రముఖ కార్పోరేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆర్ధోపెడిక్ సర్జన్ లక్ష్మీనారాయణ రెడ్డి ఇటీవల కరోనా బారిన పడ్డారు. అయితే ముందుగా గుర్తించకపోవడంతో పరిస్థితి విషమించింది. నెల్లూరులోనే ఐసోలేషన్ వార్డులో వుంచి ఆయనకు ప్రత్యేకంగా చికిత్సలు చేయించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంది. అయితే వెంటిలేటర్ కూడా అమర్చేందుకు కొంతమంది డాక్టర్లు, అనస్తీషియా సిబ్బంది రాకపోవడంతో ఆయన పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయనను నాలుగైదు రోజుల క్రితం నెల్లూరు నుంచి చెన్నయ్ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసోలేషన్ వార్డులో ఉంచి ఆయనకు చికిత్సలు మొదలుపెట్టారు. అప్పటికే ఆయన పరిస్థితి విషయంగా వుండడం, వైద్యానికి ఆయన శరీరం స్పందించకపోవడంతో... చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. ఆయన మృతిచెందిన విషయాన్ని డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆయన డెడ్ బాడీని నెల్లూరుకు తరలించే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో చెన్నయ్ లోనే ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశముంది.

దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్ లోకి 400 జిల్లాలు

కరోనా వ్యాప్తి, సహాయకచర్యలు తదితర అంశాలపై ప్రధాని నరేంద్రమోదీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చ జరిగింది. కరోనా వ్యాప్తి తీవ్రతను అనుసరించి భారత్ ను మూడు జోన్లుగా విభజించాలన్నది వాటిలో ముఖ్యమైనది. ఒక ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య ఎంత అన్నదాన్ని బట్టి రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలన్న ప్రతిపాదన రాగా, దీనికి అనేక మంది ముఖ్యమంత్రులు అంగీకారం తెలిపినట్టు సమాచారం. గ్రీన్ జోన్ అంటే... ఎలాంటి కరోనా కేసులు నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్ లో చేర్చుతారు. ఈ జోన్ లో లాక్ డౌన్ పూర్తిగా సడలించే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో ఒక్క కొవిడ్-19 కేసు కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలను గ్రీన్ జోన్ లో చేర్చనున్నారు. ఇక ఆరెంజ్ జోన్ విషయానికొస్తే.... 15 కంటే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉండి, పాజిటివ్ కేసుల సంఖ్యలో పెరుగుదల లేని జిల్లాలను ఆరెంజ్ జోన్ గా పరిగణిస్తారు. ఈ ఆరెంజ్ జోన్ జిల్లాల్లో పరిమిత స్థాయిలో ప్రజారవాణా, వ్యవసాయపనులు, ఇతర నిత్యావసర కార్యకలాపాలకు అనుమతిస్తారు.ఇక, 15 కేసుల కంటే మించి నమోదైన ఏ ప్రాంతాన్నైనా రెడ్ జోన్ గా పరిగణిస్తారు. అక్కడ ఎలాంటి కార్యకలాపాలైనా నిషిద్ధం. లాక్ డౌన్ కఠినంగా అమలవుతుంది. ఎల్లుండితో తొలి దశ లాక్ డౌన్ ముగియనుండగా, ఈ లోపే ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని, జోన్ల వారీగా లాక్ డౌన్ సడలింపుపై స్పష్టమైన ప్రకటన చేస్తారని కేంద్ర వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతానికి భారత్ లో 8,356 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 7,367 మంది క్రియాశీలక రోగులుగా ఉన్నారు. 273 మంది కరోనాతో మరణించగా, 716 మంది కోలుకున్నారు.

ఇటలీ నుంచి వచ్చిన తెలుగు విద్యార్థులకు లైన్ క్లియర్

ఇటలీ నుంచి వచ్చి ఛత్తీస్ గడ్ బోర్డర్ లో ఆగిపోయిన తెలుగు విద్యార్థులకు లైన్ క్లియర్ అయింది. 33 మంది తెలుగు విద్యార్థులకు ఏపీకి రప్పించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఏపీ చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని చొరవతో సమస్య పరిష్కారం అయింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగు విద్యార్థులకు విముక్తి దొరికింది. రంగంలోకి దిగిన డిజిపి గౌతం సవాంగ్‌ , సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి క్రిష్ణబాబు. రాయ్ పూర్ , జగదల్ పూర్ మీదుగా రేపటికి వైజాగ్ చేరుకోనున్న 33 మంది విద్యార్థులు. వీరంతా క్షేమంగా ఏపీకి చేరుకునేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

జైల్లో టైం పాస్ చేయ‌డంఎలా? డే టు డే షెడ్యూల్ వేసుకో సాయి! 

దేశంవ్యాప్తంగా లాక్‌డౌన్‌ న‌డుస్తుంటే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం ఎం.పి. విజయసాయిరెడ్డి, కొణిదెల నాగబాబు ల మధ్య ట్విటర్ లో యుద్ధం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌ర‌స్ప‌రం ఆరోప‌ణ‌లు చేసుకుంటూ జ‌నానికి కావాల్సినంత మ‌సాలా అందిస్తూ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. పావలా బ్యాచికి రోషం పొడుచుకొచ్చింది. సిన్మాలు, టీవీ షోలు చేసుకుంటూ పార్టీని గాలికొదిలినోళ్లకు రాజకీయాలెందుకు? 2014లోనే మేం పొత్తులు పెట్టుకోలేదు. పొత్తులుండవని పార్టీ అధినేత జగన్ గారు మా విధానాన్ని స్పష్టంగా ప్రకటించారు. చిరంజీవి గారి తమ్ముళ్లు కాకపోతే కుక్కలు కూడా మొరగవు. అంటూ విజయసాయి రెడ్డి చేసిన‌ ట్వీట్ పై నాగబాబు ఘాటుగా స్పందించారు.  దొంగ లెక్క‌లు వేసుకుని, దోచుకుంటూ బ్ర‌తికేయ‌కుండా నాతో ట్వీట్‌లేంటి? అంటూనే నాగ‌బాబు చుర‌క‌లంటించారు. ఫ్యూచ‌ర్‌లో జైల్లో ఎలా టైం పాస్ చెయ్యాలి అని ఒక డే టు డే షెడ్యూల్ వేసుకో టైం క‌లిసి వ‌స్తుందంటూ నాగ‌బాబు ట్వీట్ చేశారు.  మాకు సినిమాలు, టీవీ షోలు చేయ‌కుంటే కుటుంబాలు పోషించ‌లేము. మీకు ఆ అవ‌స‌రం లేద‌నుకోండి. మంది సొమ్ము బాగా మెక్కారు. ఇంకో వెయ్యేళ్ళు కాలు మీద కాలు వేసుకొని దొంగ లెక్క‌లు వేసుకుంటూ బ్ర‌తుకుతార‌ని మాకు తెలుసు. అవార్డ్స్ అందుకోగ‌ల పారిశ్రామిక వేత్త‌ల‌ని జైలు పాలు చేసింది త‌మ‌రి ప్ర‌తిభే క‌దా. చిన్న విష‌యం మీరు వైఎస్సార్ ఆడిట‌ర్ కాక‌పోయి వుంటే శ‌త కోటి గొట్టంగాళ్ల‌లో ఒక గొట్టంగాడాని వ‌దిలేసి వాడిని వ‌ద్దు సాయి ఈ క‌రోనా టైంలో అంటూ నాగ‌బాబు రెచ్చిపోయారు. దీనిపై విజయసాయి రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో ఏమిటో...

క్షమాపణలు కోరిన ఏపీ డిప్యూటీ సీఎం!

కరోనా వైరస్ విషయంలో మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిపై చేసిన వ్యాఖ్యలను ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వెనక్కి తీసుకున్నారు. త‌న మాట‌లు ఎవ‌రినైనా బాధించి ఉంటే క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లు తెలిపారు. "జమాత్ నుంచి వచ్చిన ముస్లిం లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కలిగించే ప్రయత్నం చేశాను. కరోనా చికిత్స పొందుతున్న రోగులు వైద్యులకు సహకరించడం. ఇతరులకు వైరస్ అంటుకోకుండా జాగ్రత్త పడాలన్నదే నా ఉద్దేశం. ప్రతీ మతస్థుడు తమ ఆరాధ్య దైవాలను పూజించుకోవచ్చు. ప్రస్తుత కఠిన సమయం లో ఇళ్లలోనే ఇష్ట దేవతల ఆరాధన చేయాలనీ భాద్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి గా సూచిస్తు వస్తున్నాను. భావ వ్యక్తీకరణ లోపం కారణం గానే నేను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంతేగాని ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బ తీయడం నా అభిమతం కాదు." అని నారాయణ స్వామి చెప్పారు. "నాకు ముస్లిం సోదరులు పట్ల అపార గౌరవం ఉంది. ఈ విషయాన్ని నా ఆత్మసాక్షి గా చెబుతున్నాను. గత 5 సంవత్సరాలుగా నా వ్యక్తిగత భద్రత ను చూసే గన్ మెన్ కూడా ముస్లిం సోదరుడే. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మతాన్ని, సామజిక వర్గాన్ని కించపరచలేదు. సమాజం లో SC, ST, BC మైనార్టీ వర్గాలు వెనుకబడి ఉన్నాయి. నేను కూడా అణగారిన SC వర్గానికి చెందిన వాడినే. ముస్లిం ల సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వ్యక్తిని. నా నియోజకవర్గం లో ప్రతీ ముస్లిం కి ఇంటి స్థలాలు మొదలుకొని అన్ని సంక్షేమ పధకాలు అందేలా పనిచేస్తున్నాను. వారిపై ఎలాంటి ద్వేషభావం లేని వ్యక్తిని. నా వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం పై ముఖ్యమంత్రి గారికి పూర్తి వివరణ ఇచ్చాను. దురదృష్టవశాత్తు నా వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నా మాటలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తే క్షమించాలని కోరుకుంటున్నాను. నా మాటలను బేషరతుగా వాపసు తీసుకుంటున్నాను. అల్లా దయతో దేశం నుంచి కరోనా మహమ్మారి త్వరలోనే వెళ్లిపోవాలని కోరుకుంటున్నాను." అని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. నారాయ‌ణ స్వామి.. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. కరోనా కేసులు భారీగా పెరగడానికి ఢిల్లీలో సామూహిక మత ప్రార్థనలను నిర్వహించడమే ప్రధాన కారణమని అన్నారు. మత ప్రార్థనల సమయంలో శుభ్రత పాటించి ఉండరని.. ప్లేట్లను కడగరని, స్పూన్లను నాకేస్తుంటారని అన్నారు. దేశ ప్ర‌జ‌లంతా ఓ ప‌క్క ఉంటే, వీరు మాత్రం అర్ధంప‌ర్ధం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని అన్నారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని ఓ వైపు విజ్ఞ‌ప్తి చేస్తుంటే, వీళ్లు మాత్రం ప్రభుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించ‌లేద‌ని అన్నారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో నారాయణ స్వామి క్షమాపణలు చెప్పారు.

సి.ఎం. కేసీఆర్‌గారు పేదల ఆకలి తీర్చండి!

తెలంగాణా ప్ర‌జ‌లు ఎవరి మాస్కులు వాళ్లే కొన్నారు, ఎవరి శానిటేషన్ వాళ్లే తెచ్చుకున్నారు, లాక్ డౌన్ నేప‌థ్యంలో ఇన్ని రోజుల సంపాదనలో మిగిలిన డబ్బులతో కడుపు నింపుకుంటున్నారు, తప్పని పరిస్థితుల్లో రోడ్డు మీదికి వస్తే పోలీస్ లతో లాఠీ దెబ్బలు తింటున్నారు కానీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేస్తుంది ఏంటి? శపార్ధాలు, పోలీస్ దెబ్బలు, ఇంట్లో నిర్బంధించడం తప్పుడు ప్రకటనలతో అయోమయం కలిగించడం మినహా ఇంకేముంద‌ని కాంగ్రెస్ పార్టీ అంటోంది. అధికార‌పార్టీ నేత‌లు మొహాలకు మాస్కులు కట్టుకొని రాజకీయాలు చేయడం మినహా ఎక్కడ ఎవరికి ఏ సహాయం చేయడం లేదు. మీకు తిట్టడం మినహా పాలన చేతకాదు అని మరోసారి రుజువైంది ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి పేదలను ఆదుకోక‌పోతే జ‌నం తిరగబడ‌తార‌ని కాంగ్రెస్ పార్టీ హెచ్చ‌రిస్తోంది. ఈరోజు దాకా ఆకలితో ఉన్న వాళ్లకోసం తెలంగాణా ప్ర‌భుత్వం ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుద‌ల చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. లాక్ డౌన్ వేళా కోట్ల అప్పు తెస్తున్నారు, వందల కోట్ల ఫండ్ వచ్చింది, ప్రభుత్వ ఉద్యోగుల జితల్లో కోతలు ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రాన్ని మీరు ఎంత ల నాశనం చేశారో తెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమ‌ర్శించారు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు అని సమేత తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరెక్ట్ గా సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 12 కిలోల బియ్యం మినహా ఈ నిమిషం దాకా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సహాయం అంద‌లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ విమ‌ర్శించారు. పేదలు పని చేసుకోలేక పోతున్నారు, ఇంట్లో తినడానికి ఏమి లేదు, మీరు ఇవ్వరు మరి వాళ్ళు ఎలా బ్రతకాలి. వందల కోట్ల ఫండ్ వస్తుంది, జీతాలు కట్ చేశారు, మనది మిగులు బడ్జెట్ రాష్ట్రం మరి ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి ఖర్చుపెడుతున్నారు శ్వేతపత్రం విడుదల చేయాల‌ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

36మందికి కరోనా అంటించిన ఐఏఎస్ అధికారిణి..!

ఆస్పత్రికి రానంటూ మొండిపట్టు, ఇంటి వద్దే డాక్టర్ల సపర్యలు..!! మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ అధికారిణి పల్లవిజైన్ గొవిల్ వ్యవహారం మరింత వివాదంగా మారుతోంది. ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీ ఆమె. కొడుకు ట్రావెల్ హిస్టరీని దాచిపెట్టింది. విదేశాలనుంచి వచ్చిన కొడుకు కారణంగా ఆమెకు కరోనా సోకింది. అది బైటపడేలోపే.. ఆమె ఇతర అధికారులతో కలిపి అనేక సమీక్షలకు హాజరైంది..  మొత్తం ఆమె కారణంగా 36మందికి మధ్యప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖలో కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో పల్లవి జైన్ హోమ్ ఐసోలేషన్ లో ఉంది. ఆస్పత్రికి రాకుండా.. ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వైద్యం అందించాలని హుకుం జారీ చేసింది. ఉన్నతాధికారి కావడంతో.. డాక్టర్ల బృందం ఉదయం, సాయంత్రం ఆమెకు వైద్యం అందించడానికి వెళ్తోంది..  ఈ వ్యవహారంపై మానవహక్కుల సంఘం సీరియస్ గా స్పందించింది. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆస్పత్రికి ఎందుకు తరలించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

లాక్ డౌన్ సమయంలో ఇలాంటి విన్యాసాలు అవసరమా?

ఆంధ్రలో వైసీపీ నేత‌లు, కార్య‌క్త‌లు లాక్‌డౌన్ రూల్స్ ను ప‌ట్టించుకోకుండా ఊరేగింపులు నిర్వ‌హిస్తున్నారు. పిచ్చి ముదిరితే ఇలాగే వుంటుందని జ‌నం చెప్ప‌కుంటున్నారు. క‌రోనా బాధితుల కోసం విరాళాలు ఇచ్చిన వారి ఫొటోల‌ను ఊరేగిస్తూ భారీ ర్యాలీ నిర్వ‌హించ‌డం వివాదాస్ప‌ద‌మైంది. అంతే కాదు ఆందోళ‌న క‌లిగించే విష‌యం కూడా. సామాజిక దూరం పాటించాల్సిన స‌మ‌యంలో ప్ర‌చారం కోసం ఇలా రోడ్ల మీద ప‌డ‌టం ఏమిట‌ని జ‌నం ఛీ కొడుతున్నారు. వైసిపి వారేమో చూసిన వారు స్ఫూర్తి పొంది మ‌రిన్ని విరాళాలు ఇస్తార‌ని రోడ్డు మీద ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. రామోజీ రావు 20 కోట్లు ఇచ్చాడు ఆయన ఫోటో ఉండదు...పవన్ కళ్యాణ్ 2 కోట్లు ఇచ్చాడు ఆయన ఫోటో ఉండదు...గల్లా జయదేవ్ కుటుంబం 8 కోట్లు ఇచ్చింది ఆయన ఫోటో ఉండదు కానీ భారతి ఫోటోను మాత్రం ఊరూరా ఊరేగిస్తున్నారు...చేసింది సాయమా లేక పబ్లిసిటీ లో భాగమా? శవాల మీద పేలాలు ఏరుకునే బ్యాచ్ అంటూ తెలుగుదేశం పార్టీ నేత‌లు ముఖం మాడ్చుకుంటున్నార‌ట‌.

హైదరాబాద్ ను వరదల నుంచి కాపాడిన మోక్షగుండం!

ఈరోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య 58వ వర్ధంతి. ఈ సంద‌ర్భంగా ఆ మ‌హానుభావుడికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను గుర్తుచేసుకుందాం!  ఈయన  శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ అనే దంపతులకు,  కర్ణాటక రాష్ట్రంలోని, బెంగుళూరు సమీపంలోని ముద్దినేహళ్లి అనే కుగ్రామంలో జన్మించారు. వీరిది అతి పేదకుటుంబం. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లాలోని 'మోక్షగుండం' గ్రామానికి చెందినవారు. అయితే వీరి కుటుంబం  కర్ణాటకలోని మైసూరు ప్రాంతానికి వలస వెళ్ళారు.  శ్రీ విశ్వేశ్వరయ్య గారి తండ్రి గొప్ప సంస్కృత పండితుడు, ఆయుర్వేద వైద్యుడు. సంపాదనకోసం ఎక్కువగా ఇతర గ్రామాలను సంచరించేవారు. కుటుంబ బరువు, బాధ్యతలు మోయటం విశ్వేశ్వరయ్యగారి తల్లి మీద పడింది. ఆమె గొప్ప భక్తిపరాయణురాలు. విశ్వేశ్వరయ్యగారు తల్లి సంరక్షణలో విద్యాబుద్ధులు పొందటమే కాకుండా-ఋజువర్తన, క్రమశిక్షణ కూడా అలవాటు చేసుకున్నారు.   అయన ప్రాధమిక విద్య చిక్ బళ్ళాపూరులోనే జరిగింది. ఉపాధ్యాయులు అతని ప్రతిభను గుర్తించి, అతని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు. వీరికి గణిత శాస్త్రమంటే ఎక్కువ మక్కువ. ఈ విషయాన్ని గ్రహించి శ్రీ నాదముని నాయుడు గారు అనే ఉపాధ్యాయుడు ఇతనికి గణిత శాస్త్రంలో బాగా తర్ఫీదునిచ్చి, ప్రవీణుడిని చేసారు. మేనమామగారైన శ్రీ రామయ్య గారి ఆర్ధిక సహాయంతో బెంగుళూరులోని సెంట్రల్ కళాశాలలో బి. ఎ లో చేరారు. సరిగ్గా ఈ సమయంలో శ్రీ విశ్వేశ్వరయ్య గారికి పితృవియోగం కలిగింది. అప్పుడు విశ్వేశ్వరయ్య గారి వయసు 15 సంవత్సరాలే! ఈ విషాద ఘట్టం ఆయనను మానసికంగా బాగా కృంగతీసింది. తన్ను తానే ఓదార్చుకొని, గుండె నిబ్బరపరచుకొని, పిల్లలకు ట్యూషన్లు చెప్పి కష్టపడి బి. ఎ ను పూర్తిచేసారు. అదృష్ట వశాత్తు మైసూరు మహారాజావారి దృష్టిలో పడ్డారు. రాజావారి ఆర్ధిక సహాయంతో పూనాలో ఇంజనీరింగ్ విద్యను పూర్తిచేసారు. ఇంజనీరింగ్ విద్యను విజయవంతంగా పూర్తిచేసుకున్న తరువాత, మొదటిసారిగా బొంబాయిలో ప్రభుత్వ ఉద్యోగిగా చేరారు.  ఆ సమయంలో వీరు బొంబాయిని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. 1908 లో నిజాం నవాబు ఆహ్వానం మేరకు, నిజాం ప్రభుత్వంలో ఇంజనీరుగా చేరి పలు రిజర్వాయులను నిర్మించటమే కాకుండా, హైదరాబాద్ ను ఒక సుందర నగరంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ లో అత్యంత భారీ వరదలు రావడంతో మూసీ నది ఉప్పొంగింది. ఆ వరదల్లో 50,000 మంది చనిపోయారు. అప్పుడు హైదరాబాద్ ను పాలిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విశ్వేశ్వరయ్య సేవలను వాడుకోవాలనుకున్నారు. విశ్వేశ్వరయ్య సలహా మేరకు హిమాయత్ సాగర్, గండి పేట్ జలాశయాలను నిర్మించారు. విశ్వేశ్వరయ్య ప్రతిభ నేడు హైదరాబాద్ నగరానికి శాశ్వతంగా వరద ముప్పును దూరం చేసింది.  నిజాం నవాబు వీరి మేధస్సును గుర్తించి 1912 లో దివాన్ గా పదోన్నతిని కల్పించారు. విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది. ఏ పనిని ఆయనకు ఎవరు అప్పగించినా, ఆయన ఆ పనిని ఒక తపస్సుగా చేపట్టేవారు.  నిజం నవాబు తనకు అప్పగించిన పని పూర్తి అయిన తరువాత, నాటి మైసూరు రాష్ట్రంలో ఉద్యోగిగా చేరారు. అన్నివిధాలా ఆ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డారు. వారి పనితీరుని, నిజాయితీని మెచ్చి, మైసూరు మహారాజావారు బహుమానాలతో, బిరుదులతో సత్కరింపతలచిన వేళ, విశ్వేశ్వరయ్య గారు వాటిని సున్నితంగా తిరస్కరించారు. జీతం తప్ప మరే ఇతర ప్రతిఫలాన్ని ఆయన తన జీవితంలో ఆశించలేదు. నేటి కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణరాజ సాగర్ డ్యాం, బృందావన్ గార్డెన్స్, మైసూరు విశ్వ విద్యాలయం మొదలగునవి ఆయన కృషి వలెనే సాధ్యపడ్డాయి. ఆయన ప్రఖ్యాత ఆర్ధికవేత్త కూడా! ఆయన మైసూరు బ్యాంకు అనే సంస్థను కూడా స్థాపించి, మధ్యతరగతి ప్రజలకు పొదుపు చేసుకోవలసిన అవసరం గురించి తెలియచేసారు. ఆయన ప్రతిభను గుర్తించి, దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్ తో సత్కరించాయి. 1917 లో బెంగుళూరులో ప్రభుత్వ ఇంజనీరింగు కాలేజి స్థాపించడంలో అయన ప్రముఖ పాత్ర వహించారు. తరువాత ఈ కాలేజికి ఆయన పేరే పెట్టడం జరిగింది. ఈనాటికి కూడా విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్ణాటక లోని ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటి. ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరపున ఐదవ కింగ్ జార్జి నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు.  1955 లో భారత ప్రభుత్వం ఆయనను 'భారతరత్న' బిరుదుతో సత్కరించింది. ప్రాంతీయ బేధాలను పట్టించుకోకుండా భారత దేశానికి అనితర సేవలందించిన ఈ మహనీయుడు, తన శతజయంతి ఉత్సవాలను పూర్తిచేసుకొని, 12-04-1962 న స్వర్గస్తులయ్యారు. ఎవరైనా అఖండ మేధావిని గురించి చెప్పేటప్పుడు, 'ఆయన బ్రెయిన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బ్రెయిన్'అని చెప్పటం ఒక సామెతగా మారింది. ఆయన పుట్టిన రోజును 'ఇంజనీర్స్ డే !' గా జరుపుకోవటం ఒక ఆనవాయితీగా వస్తుంది.