పార్వతీప్రసాద్ ఇక లేరు!

ఆకాశవాణి న్యూస్ రీడర్ పార్వతి ప్రసాద్ గారు ఈ తెల్లవారుఝామున కన్నుమూసారు. గత కొద్దికాలంగా అస్వస్తులుగా వుంటున్నారు.  డి. వెంకట్రామయ్య గారు పోయినప్పుడు ఆవిడ కలిసారు. సంస్మరణ సమావేశంలో పార్వతి గారే సర్వం చూసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మాడపాటి సత్యవతి గారు, పొత్తూరి వెంకటేశ్వర రావు గారు, సి.నరసింహారెడ్డి గారు, ఈరోజు పార్వతి గారు.ఇంతమెల్లగా మృదువుగా మాట్లాడే పార్వతి గారు వార్తలు ఎలా చదువుతారు అనిపించేది. కానీ ఆవిడ రెడియోలోనే కాదు, దూరదర్సన్లో కూడా వార్తలు చదివారు. ఒకసారి ఢిల్లీ నుంచి ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ వచ్చారు. ఆర్వీవీ కృష్ణారావు గారు, సీజీకే మూర్తిగారు అందరం కలిసి మాట్లాడుతుంటుంటే అప్పుడే రేడియోలో వార్తలు మొదలయ్యాయి. పార్వతిగారు చదువుతున్నారు. తెలుగు తెలియని డీజీ గారు శ్రద్ధగా వింటున్నారు. ఆవిడ స్టూడియో నుంచి రాగానే డీజీ లేచి నిలబడి ఆవిడని అభినందించారు. చక్కటి స్వరం అని మెచ్చుకున్నారు. ఆవిడ క్యాజువల్ న్యూస్ రీడర్ అని చెబితే రెగ్యులర్ రీడర్ల కంటే బాగా చదివారని ఆయన అందరిలో ప్రశంసించడం పార్వతి గారి ప్రతిభకి తార్కాణం. ‘బాగున్నారు కదా!’ అని ఆత్మీయంగా పలకరించే మనిషి ఇక కనబడరు. ఆవిడ సుస్వర స్వరం మరి వినపడదు.పార్వతీ ప్రసాద్ గారి ఆత్మశాంతికి ప్రార్ధించడం మినహా ఈ కరోనా సమయంలో చేయగలిగింది లేదు.

కరోనా కట్టడికి మూడు జోన్ల ప్రతిపాదన

లాక్ డౌన్ పై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కేంద్రం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా కట్టడికి దేశాన్ని 3 జోన్లుగా విభజించాలనే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోంది.  గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లుగా విభజించి ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. వాస్తవానికి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి ఇప్పటికే ఈ తరహా ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముందుంచారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే రెడ్ జోన్లలో పూర్తి స్థాయి ఆంక్షలు విధించాలని, ఆరెంజ్ జోన్ లో పరిమిత స్థాయిలో ఆంక్షలు విధించాలని, గ్రీన్ జోన్ లో ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయాలని కేంద్రం ఆలోచన చేస్తోంది. లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉంది.

'ఐఏఎస్ లు గరం గరం... నిమ్మగడ్డకు బాసట' అంటూ తప్పులో కాలేసిన తెలుగుదేశం

* "ఐ ఏ ఎస్ ఫ్రాటెర్నిటీ" పేరిట ట్విట్టర్ లో పోస్ట్ అయిన సందేశం  * తెలుగు దేశం క్లెయిమ్ చేసినట్టు దీన్ని ఐ ఏ ఎస్ లు నడపడం లేదు.. * ప్రద్యుమ్న సింగ్ అనే వ్యక్తి "ఐ ఏ ఎస్ ఫ్రాటెర్నిటీ" ట్విట్టర్, ఫేస్ బుక్ లకు హ్యాండ్లర్ గా ఉన్నాడు  * FB పేజీ about లో ఉన్న విషయం మీరే చదవండి: IAS Fraternity shapes India's public administration, policy formulation & implementation. Our RTs & tweets DON'T represent official stand of IAS Association. * జాతీయ స్థాయిలో విజ్ఞులు ఛీ కొడుతున్నారంటూ-భారత ఐ ఏ ఎస్ అధికారుల సంఘం పేరిట తెలుగుదేశం ట్వీట్, ఆ లింక్ ఇదే -https://twitter.com/JaiTDP/status/1248903689948938240/photo/1 కరోనాను కట్టడి చేయడంలో తలమునకలై ఉండాల్సిన ప్రభుత్వం... కక్ష రాజకీయాలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తొలగించడం పై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ గారు రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ట్వీట్ చేసిన తెలుగుదేశం పార్టీ, దానికి సంబంధించిన ట్విట్టర్ లింక్ లను కూడా షేర్ చేసింది.  1. https://twitter.com/IASfraternity/status/1248942073748656130 2. https://twitter.com/IASfraternity/status/1248681035790835712 3. https://twitter.com/JaiTDP/status/1248903689948938240/photo/1 అలాగే- IAS fraternity మరొక ట్వీట్ కూడాచేసింది--" When IAS officers are busy in crisis management. Shameless Andhra Pradesh Govt brings notification to remove its State Election Commissioner Dr. N. Ramesh Kumar, retd. IAS due to ‘caste bias’ and another notification first of its own kind in which SEC will be a retd. HC judge." తొలిసారిగా ఇంత హార్ష్ ట్వీట్ ఆ గ్రూప్ నుంచి వెలువడటంతో రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారం తో ఐ ఏ ఎస్ లు ఎంత గరం గరం గా ఉన్నారో అర్ధం అవుతోందంటూ తెలుగుదేశం పార్టీ ట్వీట్ చేసింది. కానీ, వాస్తవానికి చూస్తే, ఐ ఏ ఎస్ అధికారుల జాతీయ సంఘానికీ, తెలుగుదేశం పార్టీ ట్వీట్ కూ ఎలాంటి సంబంధమూ లేదనేది, FB హ్యాండ్లర్ ప్రద్యుమ్న సింగ్ about ఇన్ఫర్మేషన్ లో స్పష్టంగా తెలిసిపోయింది. ఐ ఏ ఎస్ అధికారులు ఏదైనా ఒక సమాచారం మీడియాకు ఇవ్వదలిస్తే, ప్రాపర్ గా ఆ సమాచారాన్ని అసోసియేషన్ లెటర్ హెడ్ మీద, బాధ్యుల సంతకంతో రిలీజ్ చేస్తారు. ఇక్కడ అది జరగలేదు. నిమ్మగడ్డ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టకు పోయి, ఆయనకు కులం ఆపాదించి ఎంత అప్రదిష్ట పాలైందో, తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు, ట్విట్టర్ వేదికగా అదే స్థాయి లో నిమ్మగడ్డ వ్యవహారం నుంచి మైలేజ్ పొందాలని అభాసు పాలయ్యారు. ఈ విషయం లో పాలక వై ఎస్ ఆర్ సి పి, అలాగే విపక్ష టీ డీ పీ కూడా దొందూ దొందే పద్దతి లో వ్యవహరించి, జనం దృష్టిలో పలుచనయ్యాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంక్షోభం లో నుంచి, తెలుగుదేశం పార్టీ ఇలా అవకాశం సృష్టించుకుందన్న మాట! భేష్!!! https://twitter.com/IASfraternity/status/1248681035790835712  

జగన్ జనసేన సాయం కోరాడా!!

* విజయసాయి రెడ్డి ట్వీట్ పై 'బుస్సు' మన్న నాగబాబు  * పక్క దేశం పోవాలన్నా పోలీస్ క్లియరెన్స్ కావాలని పవన్ అభిమాని సెటైర్  కరోనా సమయాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధంగా లేనట్టుంది పాలక వై ఎస్ ఆర్ స్సి పీ, విపక్ష జనసేన ల వైఖరి చూస్తుంటే. విజయసాయిరెడ్డి, కొణిదెల నాగబాబు ల మధ్య నడిచిన ట్విటర్ యుద్ధం, అలాగే పరస్పరం ఆయా పార్టీల అభిమానుల ట్వీట్లు, కరోనా టైం లో జనానికి కావాల్సినంత మసాలా అందిస్తున్నాయి.  విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో -"కరోనా ఆపత్కాలంలో రాజకీయాలు చేయకుండా జనసేన స్వీయ నియంత్రణ పాటిస్తోందట. రాజకీయాలు చేయడానికి నీకు గ్రౌండే లేదు కదా పవన్. ఎక్కడో హైదరాబాద్ లో కూర్చుని ‘నేను లేస్తే మనిషిని కాదు’ అని చిటికెలేసినట్టుగా ఉంది నీ వాలకం. ప్రజా తీర్పును అప్పుడే మర్చిపోతే ఎలా?,"  అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.  దాంతో  అగ్గి మీద గుగ్గిలమైన నాగబాబు ఇలా రిటార్ట్ ఇచ్చారు-" నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఎదవ రాజకీయాలు చేయటానికి నీ లాంటి గుంటనక్కలున్న సంగతి  మాకుతెలుసు విజయ సాయి రెడ్డి..మరి మన ఇద్దరి కామన్ స్నేహితుడి ద్వారా నా ఇంటికి వచ్చి పవన్ తో దోస్తీ కి రెడి అన్నమీ గుంట నక్కరాజకీయలు నాకు గుర్తున్నాయి."  వారిద్దరి కామన్ స్నేహితుడెవరో కానీ, ఓ పవన్ కళ్యాణ్ అభిమాని మాత్రం ఇలా రెస్పాండ్ అయ్యాడు-" అయ్యా కసాయి రెడ్డి...  మాకు గ్రౌండ్, గ్రౌండ్ క్లియరెన్స్  లేకపోయినా..  నీకు పక్క దేశం పోవాలంటే పోలీస్ క్లియరెన్స్ కావాలి... అది చూడు..  మాకు ఏం లేదు అంటారు.. చూపిస్తే గంటకొకడు ప్రెస్ మీట్ లు పెట్టి పిసికేసుకుంటారు," అంటూ వ్యంగ్య ట్వీట్లు సంధించాడు.  ఇంకొక ట్వీట్ వీరుడు అయితే సుతిమెత్తగా ఇలా సెటైర్ విసిరాడు.."  నిజమే మాకు గ్రామస్థాయిలో పెద్దగా బలం లేదు అలానే సిబిఐ కోర్టులో మా మీద 38 అవినీతి కేసులు కూడా లేవు," అని. మరి ఫర్దర్ గా విజయసాయి రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో ఏమిటో...

ప్రైవేట్ ల్యాబ్‌ల్లో టెస్ట్‌లకు అనుమ‌తించం! మ‌ద్యం షాపులు తెర‌వం!

ఏకంగా ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘమైన కేబినెట్ సమావేశంలో తాము తీసుకున్న లాక్‌డౌన్ పొడిగింపు తీర్మానాన్ని ప్రధానమంత్రి మోదీకి పంపుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఈ నెల 30వ వ‌ర‌కు లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తాం. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో టెస్ట్‌లకు అనుమ‌తించం! మ‌ద్యం షాపులు తెర‌వమ‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. నిత్యావ‌స‌ర‌వ‌స్తువుల్లో క‌ల్తీ చేసే వారిపై, ధ‌ర‌లు పెంచిన వారిపై పి.డి. యాక్ట్ కింద చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి మ‌రోసారి హెచ్చ‌రించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా పంటలకు నీరు అందిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇక మోదీకి పంపుతున్న తీర్మానంలో లాక్ డౌన్ పొడిగింపు అంశంతో పాటు రైతులకు మేలు జరిగేలా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తాము మోదీకి పంపిన డిమాండ్లలో కోరామని కేసీఆర్ చెప్పారు.  రైతులు పొలం పనులకు అయ్యే కూలీ ఖర్చులో 50 శాతం భరిస్తే.. మరో 50 శాతం నరేగా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగా ఇది అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న రైతు కూలీలు, రైతులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ అవుతుంది. ఈ కరువు టైంలో ఇది మంచి ప్రయోజనం చేకూర్చినట్లువుతుంది. తెలంగాణాలో ఇప్పుడు రైతుల‌దే రాజ్యం. రైతుల‌కు ఏమాత్రం క‌ష్టం లేకుండా చూసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి భ‌రోసా ఇచ్చారు. ప్రైవేట్ ల్యాబ్‌ల్లో ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తించం. ఒకే రోజు వెయ్యి టెస్ట్‌లు చేసే సామ‌ర్థ్యం స్త‌తా ప్ర‌భుత్వానికి వుంది. ప్ర‌భుత్వం వ‌ల్ల కాక‌పోతే అప్పుడు ఆలోచించ‌వ‌చ్చు. ప్రైవేట్ ల్యాబ్‌ల‌లో ప‌రీక్ష‌లు చేసినా ఉచితంగా చేయాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ప్రైవేట్ ల్యాబ్‌ల వాళ్ళు వెన‌క్కి త‌గ్గారని సి.ఎం. ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో టెస్ట్‌లు, చికిత్స చేస్తేనే రోగికి ప్ర‌యోజ‌నంగా వుంటుంద‌ని, ప్రైవేట్ కంటే ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్సే ద్వారా ఎలే మేలు జ‌రుగుతుందో ముఖ్య‌మంత్రి వివ‌ర‌ణ ఇచ్చారు.   క‌రోనాను నియంత్రించ‌డంలో భార‌త్ మెరుగ్గా వుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గిందని సీఎం తెలిపారు. ఏప్రిల్ 24కు బాధితులంతా కోలుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్య‌క్తం చేశారు. తొలిదశలో విదేశాల నుంచి వచ్చినవారంతా డిశ్చార్జ్ అయ్యారు. కొత్త ఉప్పెన వచ్చి పడకపోతే మనం చాలా వరకు ఈ కష్టాల నుంచి బయట పడ్డట్టే అన్నారు. ఎవరూ భయపడొద్దు.. కష్టాలు వచ్చినపుడు తెలంగాణ ప్రజలు గట్టి పట్టుమీద ఉన్నారు.. లాక్ డౌన్ పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. లాక్ డౌన్ ఉల్లంఘించే వారికి శిక్షలు తప్పవని ముఖ్య‌మంత్రి హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తాం.

తెలంగాణలో ఈ నెల 30 వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగింపు!

తెలంగాణలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ కొనసాగించ‌డానికి తెలంగాణా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 30 త‌రువాత ప‌రిస్థితిని బ‌ట్టి ద‌శ‌ల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. లాక్‌డౌన్‌ను ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. క‌రోనా కార‌ణంగా తెలంగాణాలో ఇప్ప‌ట్టి వ‌ర‌కు 14 మంది చ‌నిపోయారు.  మొత్తం 503 మంది క‌రోనా బారిన ప‌డ్డారు. అందులో 96 మంది పూర్తిగా కోలుకుని ఇళ్ల‌కు వెళ్ళారు. 393 మంది చికిత్స పొందుతున్నారని ముఖ్య‌మంత్రి తెలిపారు.  తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ప్రగతిభవన్‌లో శనివారం మధ్యాహ్నం 3గంటల నుంచి ఐదు గం టలకుపైగా జరిగింది. లాక్‌డౌన్ పొడిగింపు అంశంతోపాటు ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించిన‌ట్లు సి.ఎం. చెప్పారు.   ఇతర దేశాలనుంచి వచ్చిన 34 మందితోపాటు 25937 మంది క్వారంటైన్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని సి.ఎం. తెలిపారు.   మర్కజ్‌కు వెళ్లిన వచ్చిన సుమారు 1200మందిని గుర్తించి, క్వారంటైన్ చేశామని 1640మంది ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని ముఖ్యమంత్రి తెలిపారు. కంటైన్మెంట్ జోన్లు 243 ఉన్నాయని, ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 123, ఇతర ప్రాంతాల్లో 120 ఉన్నాయని తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ వరకు అందరూ కోలుకుంటారని సీఎం కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు ప్రజలందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు పైక్లాస్‌కు ప్ర‌మోట్ చేస్తున్నాం. అయితే ప‌ద‌వ‌త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సి.ఎం. తెలిపారు.  క్యాబినెట్ నిర్ణ‌యాల‌ను ప్ర‌ధాన‌మంత్రికి పంపిస్తున్నాం.

కరోనా ఎగ్జిట్ అవగానే, వెలగపూడి నుంచి విశాఖకు... 

* రాజధాని తరలింపు పై సర్కారు పెద్దల సమాలోచన  * డిసెంబర్ వరకూ ఆగాలని ఒక పీఠాధిపతి సూచన  * అయితే, ఏప్రిల్ 28 తర్వాత, కాకపోతే డిసెంబర్ 25 న...  * తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో 'గండికోట రహస్యం'  ఇంతకీ ఏప్రిల్ 28 తర్వాతనా,  లేక డిసెంబర్ 25 నా.... ఇవీ ఇప్పుడు తాడేపల్లి సి. ఎం. క్యాంప్ ఆఫీస్ లో జరుగుతున్న శషభిషలు... ఇదంతాకూడా రాజధాని మార్పు మీదనే అని వేరే చెప్పనవసరం లేదేమో.. కరోనా దెబ్బ కొట్టకపోతే, ఈ పాటికి రాజధాని విశాఖపట్నం షిఫ్ట్ అయ్యేదేమో.. అయితే, ఈ మహమ్మారి విసిరిన పంజాకు కుదేలైన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  ప్రస్తుతం,ఒక స్వామీజీ  ( విశాఖ శ్రీ శారద పీఠాధిపతి కాదు) సలహా మేరకు కుదిరితే ఏప్రిల్ 28 తర్వాత , అంటే మే 2 వ తేదీ న, అదీ కాకపోతే క్రిస్మస్ రోజున , అంటే డిసెంబర్ 25 న రాజధాని ని తరలించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, ఈ శషభిషలన్నీ సి ఎం ఆంతరంగికుల మధ్యనే నడుస్తున్నాయని, ఐ ఏ ఎస్ ల అభిప్రాయాలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవడమేలేదని తాడేపల్లి, డోలాస్ నగర్ అభిజ్ఞ వర్గాల కథనం. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల‌ని చట్టం చేసిన వైకాపా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.  ముందుగా పాల‌నారాజధాని అయిన ‘విశాఖపట్నం’కు సచివాయాల‌న్ని తరలిస్తోందని, దీని కోసం ఏప్రిల్‌28 తరువాత ముహూర్తం పెట్టుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సచివాల‌య తరలింపు అంటే న్యాయస్థానాలు అడ్డంకులు సృష్టిస్తాయనే భావనతో ఉన్న వైకాపా పెద్దలు ఎటువంటి హడావుడి లేకుండా ముఖ్యమంత్రి కార్యాల‌యాన్ని ముందుగా ‘విశాఖపట్నం’లో ఏర్పాటు చేయబోతున్నారని ఆ వర్గాలు అంటున్నాయి. ఏప్రిల్‌ 28 తరువాత ‘కరోనా’ లాక్డ్‌డౌన్‌ ముగుస్తుందని, అదే సమయంలో ముఖ్యమంత్రి కార్యాల‌యాన్ని ‘విశాఖ’లో ప్రారంభించి ముఖ్యమంత్రిగా ‘జగన్‌’ అక్కడ నుంచే విధులు నిర్వహిస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి.  ఇప్పటికే దీనిపై వైకాపా పెద్దలు వ్యూహాన్ని రచించారని, దీని ప్రకారం ఏప్రిల్‌ నెలాఖరుకు ‘విశాఖ’కు సిఎంఒ కార్యాల‌యం తరలుతుందంటున్నారు. ఇప్పటికే పరిపాల‌నా రాజధానిని తరలించడానికి వైకాపా పెద్దలు గత మూడు నెల్లో మూడు ముహూర్తాలు పెట్టుకున్నారని, అయితే హైకోర్టు స్టే, అనుకోకుండా వచ్చిన ‘కరోనా’ వైరస్ వ‌ల్ల‌ ఆ మూహూర్తాల్లో అది సాధ్యం కాలేదని దీంతో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు ఎన్నికల‌ కమీషనర్‌ను తొల‌గించిన ఊపులో రాజధాని విషయాన్ని కూడా తేల్చేయానే వారు భావిస్తున్నట్లు సమాచారం.  ఏప్రిల్‌28 తరువాత సిఎంఒ కార్యాయాన్ని తరలించి తరువాత ‘కరోనా’ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత మిగతా కార్యాల‌యాల‌ను అక్కడకు తీసుకెళ్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ, ఏప్రిల్ 28 తర్వాత ఫిక్స్ చేసిన మే 2 వ తేదీ ముహూర్తం సమయానికి లాక్ డౌన్ కంటిన్యూ అయ్యే పక్షం లో, డిసెంబర్ 25 చాలా అద్భుతమైన ముహూర్తం ఉందని, ఒక విశాఖేతర స్వామి ఈ ముహూర్తం ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. టీ టీ డీ సలహాదారు వెంకట రమణ దీక్షితులు డిసెంబర్ 25 ముహుర్తానికే ఎక్కువ మక్కువ చూపుతున్నారని తిరుమల మాడ వీధుల సమాచారం. ఇందులో నిజమెంతో, ఆ గోవిందుడికే తెలియాలి.

మూగజీవాలపైనా శ్రీవారి దయ

*కరోనా నేపథ్యంలో పశువులకు గ్రాసం, దాణా సరఫరా *500 వీధికుక్కలకూ రెండు పూటలా ఆహారం  కరోనా  వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  లాక్ డౌన్ విధించడంతో  వేలాది మంది నిరాశ్రయులు, వలస కూలీలు తిండి లేక ఇబ్బంది పడ్డారు. తిరుపతి, పరిసర ప్రాంతాల్లో ఉండే ఇలాంటి వారి ఆకలి తీర్చడానికి టీటీడీ రంగంలోకి దిగింది. రోజూ 50 వేల మందికి అన్నప్రసాదం అందిస్తోంది. మనుషులు సరే మరి మూగ జీవాల సంగతేమిటి ? లాక్ డౌన్ వల్ల జన సంచారం ఆగిపోవడంతో మూగ జీవాలకు కూడా ఆకలి తిప్పలు ఎదురయ్యాయి.  గోసాలల్లో ఉన్న పశువుల సంగతి సరే..మరి  రోడ్ల మీద తిరిగే పశువుల పరిస్థితి ఏమిటి ? తిరుమల తిరుపతి దేవస్థానం ఈ దిశగా మానవీయ కోణంలో ఆలోచించింది. దేవుడి దృష్టి లో ప్రతి ప్రాణీ సమానమేననే ఆలోచనతో గత 11 రోజులుగా పశువులు,  వీధి కుక్కలకు కూడా ఆహారం సరఫరా చేస్తోంది. కోవిడ్ వైరస్ నేపథ్యంలో టీటీడీ తీసుకున్న ఈ మానవీయ నిర్ణయం వివరాలు ఇవీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  లాక్ డౌన్ విధించినప్పటి నుంచి అన్ని వ్యాపార సంస్థలతో పాటు పెద్ద హోటళ్లు, వీధి హోటళ్లు మూత పడిన విషయం  తెలిసిందే. హఠాత్తుగా తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయం  వల్ల తిరుపతిలోని వలస కూలీలు, బిచ్చగాళ్ళు అన్నం కోసం అష్టకష్టాలు పడ్డారు. ఇలాంటి వారి ఇబ్బందులు చూసిన టీటీడీ యాజమాన్యం గత 15 రోజులుగా తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న 50 వేల మంది పేదలకు  మధ్యాహ్నం, రాత్రి అన్నప్రసాదంఅందిస్తోంది. మూగ జీవాల సంగతి? లాక్ డౌన్ వల్ల మూగ జీవాలు కూడా ఆకలితో ఇబ్బంది పడుతున్న విషయం టీటీడీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. రవాణా ఇబ్బందులతో ఇప్పటికే గోశాలల్లోని పశువులతో పాటు రోడ్ల మీద తిరిగే మూగజీవాలు కూడా అలమటిస్తున్నాయని టీటీడీ యాజమాన్యం దృష్టికి వచ్చింది.  దీంతో యాజమాన్యం  వెంటనే  అధికారులను రంగంలోకి దించింది. గోశాల డైరెక్టర్ కు భాధ్యతలు తిరుపతి పట్టణం, తిరుచానూరులో రోడ్ల మీద తిరిగే పశువులతో పాటు, తనపల్లి క్రాస్ లోని అయోధ్య స్వామి ఆశ్రమం, నవజీ వన్ వృద్ధాశ్రమం, తిరుపతిలోని రాధ గోవింద గోశాలలోని పశువులకు రోజూ పచ్చి మేత, దాణా సరఫరా చేసే భాధ్యతను ఎస్వీ గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డికి అప్పగించారు. రోడ్ల మీద తిరిగే పశువులను అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక పశువులశాలకు తరలించి దాన్ని నిర్వహించే భాధ్యతను తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ కు అప్పగించారు. ఈ నెల 1 వ తేదీ నుంచి టీటీడీ ఆధ్వర్యంలో మూగ జీవాల ఆకలి కూడా తీరుతోంది. రోజుకు సుమారు 3  మెట్రిక్ టన్నుల పశుగ్రాసం, 300 కిలోల దాణాను పశువుల కోసం సరఫరా చేస్తున్నామని గోసంరక్షణ శాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి చెప్పారు. లాక్ డౌన్ ముగిసే వరకు ఇదే విధంగా గ్రాసం, దాణా సరఫరా చేసి పశువుల ఆకలి తీరుస్తామని ఆయన చెప్పారు. వీధి కుక్కలకూ ఆహారం లాక్ డౌన్ వల్ల ఆహారం సమస్య  ఎదుర్కొంటున్న వీధి కుక్కల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ  ప్రతిరోజూ సుమారు 500 వీధి కుక్కలకు కూడా ఆహారం సరఫరా చేస్తోంది.. తిరుపతి నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లతో  ఎక్కడి కుక్కలకు అక్కడే టీటీడీ సహాయం తో ఉదయం, సాయంత్రం ఆహారం అందిస్తున్నమని యానిమాల్ కేర్.  సంస్థకు చెందిన డాక్టర్ శ్రీకాంత్ చెప్పారు.

ఏపీ లో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 402కి చేరింది. గుంటూరులో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 909 మందికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా.. అందులో 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు మరణించగా.. 11 మంది డిశ్చార్జి అయినట్లు తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 385 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

రిషీకేష్ లో విదేశీయుల నదీ తీరవిహారం

*వారిచేత క్షమాపణ చెప్పించిన ఉత్తరాఖండ్ పోలీసులు  కరోనా వైరస్ భూతాన్ని కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్రాలు తమ శక్తిమేరకు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నాయి. ఉత్తరాఖండ్ కూడా లాక్ డౌన్ విధించినా, కొంతమేర ఆంక్షలు సడలించింది. అయితే అది నిత్యావసరాల కొనుగోళ్లు, ఇతర అత్యవసర పనుల కోసం మాత్రమే. కారణం లేకుండా బయట కనిపిస్తే మాత్రం అక్కడి పోలీసులు తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, రిషికేశ్ లో గంగానది ఒడ్డున షికార్లు చేస్తున్న 10 మంది విదేశీయులు పోలీసుల కంటబడ్డారు. లాక్ డౌన్ నిబంధనలను పట్టించుకోకుండా యధేచ్ఛగా విహరిస్తున్న వారిని పోలీసులు నిలువరించి, వారితో 500 సార్లు 'సారీ' అని రాయించారు. ఆ విదేశీయుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇజ్రాయెల్ దేశాలకు చెందినవారున్నారు. పోలీసులు ప్రశ్నించగా, సరైన కారణాలు చెప్పలేకపోవడంతో... "నేను లాక్ డౌన్ నిబంధన పాటించలేదు.... క్షమించండి" అనే వాక్యాలను కాగితంపై ఐదు వందల సార్లు రాయించారు. స్థానిక సహాయకులు తోడు లేకుండా విదేశీయులు సంచరిస్తే ఊరుకోబోమని, వారికి బస కల్పిస్తున్న హోటళ్లపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రిషికేశ్ విదేశీయులకు ఎంచక్కని పర్యాటక స్థలంగా పేరుగాంచింది. అయితే కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడంతో ఫ్రాన్స్, ఇటలీ, అమెరికా దౌత్యకార్యాలయాలు తమ వారిని వెంటనే భారత్ నుంచి తరలించాయి. ఇంకా కొందరు విదేశీయులు రిషికేశ్ లోనే ఉన్నట్టు తాజా ఘటన ద్వారా తెలిసింది.

ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాన్ని ప్రకటించింది. ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ప్రత్యేక ఓపీ ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రకటించారు. సి-19 పేరుతో ఓపీ రూం ఏర్పాటు చేసి, ప్రత్యేక ప్రవేశ మార్గాన్నిఏర్పాటు చేయాలని ఆయన చెప్పారు.  కొవిడ్-19 వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకే ఉద్దేశించిన ఈ ప్రత్యేక ఓపీ ఉదయం 9నుండి మధ్యాహ్నం 2 వరకే పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.  ఆరోగ్య నిపుణులు, ఇతర పేషంట్లకు కొవిడ్ సోకకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య నిపుణులు తప్పనిసరిగా పిపిఇలు, ఎన్95 మాస్కులు ధరించిపేషెంట్ల ను పరీక్షించాలని,  కొవిడ్  లక్షణాలతో  క్యాజువాలిటీలో అడ్మిట్ అయినా వారిని వెంటనే సెపరేట్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ  స్పెషల్ సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడు నుంచి వచ్చిన కనగరాజ్ కు క్వారంటైన్ వర్తించదా: సిపిఐ రామకృష్ణ 

సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కన్నెర్ర చేశారు. నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్  క్వారంటైన్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు,  75 ఏళ్ల వయస్సున్న జస్టిస్ కనగరాజ్ ను కరోనా ఏమీ చేయలేదా? ఆయనకు  లాక్ డౌన్ నిబంధనలు వర్తించవా, అంటూ రామకృష్ణ, సి.ఎం. ను ప్రశ్నించారు.  "కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో గత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయగా వైసిపి రాద్దాంతం చేసింది. ఆయన్ను తొలగించే వరకు ముఖ్యమంత్రి జగన్ నిద్రపోలేదు.కరోనా పాజిటివ్ కేసులలో దేశంలో 2వ స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడు నుండి ఏపీ ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి జస్టిస్ కనకరాజ్ విజయవాడ ఎలా చేరుకో గలిగారు," అని కూడా రామకృష్ణ ప్రశ్నించారు. ఇది "లాక్ డౌన్" నిబంధనల ఉల్లంఘన కాదా, అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని చెబుతున్న వైసీపీ నేతలు, జస్టిస్ కనగరాజ్ ను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచకుండా ఎలా తిరగనిస్తున్నారని కూడా సి పి ఐ నేత అనుమానం వ్యక్తం చేశారు.

జాన్ బీ, జహాన్ భీ..... వీడియోకాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌ధాని

మార్చి 24 నాటి తన ప్రసంగంలో ప్ర‌ధాన మంత్రి మోది మాట్లాడుతూ,  జాన్ హైతో జహాన్ (బతికుంటే... ఆర్థికాన్ని చూసుకోవచ్చు) అన్నారు. అయితే ఈ రోజు ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో ప్ర‌ధాని నినాదం మారింది. ప్ర‌ధాని మోదీ ఇపుడు జాన్ బీ, జహాన్ భీ, జీవితాలు ,ఆర్థిక వ్యవస్థ రెండూ ముఖ్యమైనవే అన్నారు. అటు ప్రాణాలు, ఇటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని అని మోదీ చెప్పారు. దేశ ప్రజల ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు.  ప్రాణాంతక వైరస్ నుంచి ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూనే అటు ఆర్థికవృద్దిని దృష్టిలో పెట్టుకుని గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.  దేశ ఉజ్జ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రాబోయే 15 రోజులు  చాలా కీలకమని పేర్కొన్నారు.

లాక్ డౌన్ పై సీఎం ది అవగాహనా రాహిత్యం: తెలుగుదేశం మండిపాటు

లాక్ డౌన్ ను ఎత్తివేసి కొన్ని జోన్లకే పరిమితం చేయాలని ప్రధాని మోడీని జగన్ కోరడం అవగాహనారాహిత్యమని, కరోనా నియంత్రణకు జగన్ ఇప్పటికైనా సీరియస్ స్టెప్స్ తీసుకోవాలని,  రమేష్ కుమార్ పై జగన్ ది కక్ష సాధింపు చర్య అని శ్రీకాకుళం ఎం. పి. కింజారపు రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. కోవిడ్ తీవ్రత నేపథ్యంలో ప్రధాని మోడీ 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించారని, అయినప్పటికీ కేసులు పెరుగుతున్నాయని ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అమెరికాలో 5 లక్షల పాజిటివ్ కేసులు దాటాయి. వీటన్నింటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.  ఇవాళ ప్రధాని మోడీ గారు సీఎంలతో సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని రంగాల ప్రముఖలతో కూడా మోడీ గతంలో మాట్లాడటం జరిగింది. అయితే ఇవాళ మోడీతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. లాక్ డౌన్ ఎత్తివేసి.. కొన్ని జోన్లకే పరిమితం చేయాలని జగన్ మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. 4,5 నెలల పాటు లాక్ డౌన్ లో ఉంటేనే కరోనాను అరికట్టగలమని పలు దేశాలు భావిస్తున్నాయి. మన దేశంలో కూడా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరాయి. ఒడిశాలో 50 కేసులు మాత్రమే ఉన్నప్పటికీ లాక్ డౌన్ ను కొనసాగించాలని అక్కడి ముఖ్యమంత్రి మొట్టమొదటగా నిర్ణయించారు. అలాంటప్పుడు మన రాష్ట్రంలో 400కు పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. 6గురు మరణించారు. ఇలాంటి తరుణంలో జగన్ అవగాహనారాహిత్యంతో కొన్ని జోన్ లకే లాక్ డౌన్ పరిమితం చేయాలని కోరారు.  కరోనాను జగన్ మొదటి నుంచీ సీరియస్ గా తీసుకోవడం లేదు. ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను జగన్ ఇవాల్టి వరకు తీసుకోలేదు. రాజకీయంగా మలుచుకోవాలనే చూస్తున్నారు. రహస్య జీవీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను తప్పించారు. రమేష్ కుమార్  నెల రోజుల క్రితం స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా తీవ్రత నేపథ్యంలో బాధ్యత గల అధికారిగా వాయిదా వేశారు. ముందుజాగ్రత్త వహించారు. జగన్ కు ఇది నచ్చక నియంతృత్వ ధోరణితో ఆయనపై పలు విమర్శలు చేశారు. జగన్ తన కక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఒక ఐఏఎస్ అధికారి ఎన్నికలను వాయిదా వేశారు. కోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ పరిస్థితుల్లో జగన్ తన రాజకీయ కక్ష కోసం ఆయనను తొలగించారు. హెల్త్ ఎమర్జెన్సీ సమయంలో సీఎంగా ఉన్న వ్యక్తి రాజకీయాలు చేయవచ్చా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండరు.  మరోవైపు తమకు రక్షణ పరికరాలు అందించాలని కోరిన డాక్టర్ ను సస్పెండ్ చేశారు. కమిషనర్ ను తప్పించారు. జగన్ ఎంత నియంతగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. కరోనాను కంట్రోల్ చేయడానికి జగన్ అసలు నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా లేక రాజకీయాలే చేద్దామనుకున్నారా. ఒక ప్రెస్ మీట్ కూడా సరైనది పెట్టుకోలేని స్థితిలో జగన్ ఉన్నారు. మహారాష్ట్ర సీఎం ప్రతిరోజు అక్కడి ప్రజలతో మాట్లాడుతున్నారు. వైసీపీ మంత్రులు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. లాక్ డౌన్ కొనసాగిస్తే.. జగన్ యాక్షన్ ప్లాన్ ఏమిటని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.  ప్రజలకు ఏం భరోసా ఇస్తారో చెప్పాలి. ఇప్పటివరకు ప్రభుత్వం వద్ద ఎలాంటి కార్యాచరణ లేదు. వలస కార్మికులను ఏవిధంగా ఆదుకుంటారని, ఇదంతా జగన్ వైఫల్యమే. మేం రాజకీయాలు చేయాలనుకోవడం లేదు. పరిస్థితి చేయిదాటితే దేశం నష్టపోతుందని జగన్ గ్రహించాలని కింజారపు రామ్మోహన్ నాయుడు సూచించారు.  " రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే ఏర్పాట్లు చేశారో సింగిల్ విండో కింద పోర్టల్ రిలీజ్ చేయాలి. డిజిటల్ గవర్నెన్స్ కు ఎందుకు వినియోగించుకోవడం లేదు. చంద్రబాబు హయాంలో సమర్థంగా రియల్ టైం గవర్నెన్స్ ను వినియోగించారు. పేదలు, కూలీలకు రూ.5వేలు సాయం అందజేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. రూ.వెయ్యి సాయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు," అని కింజారపు రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

లాక్‌డౌన్ రెడ్‌జోన్ల వరకే పరిమితం చేయండి: ప్రధానితో సీఎం జగన్‌‌

*లాక్ డౌన్ కొనసాగింపు పై జగన్ భిన్నాభిప్రాయం  * రెడ్ జోన్ల కు మాత్రమే లాక్ డౌన్ ను పరిమితం చేయాలని ఏ.పి. సి.ఎం. సూచన  * సినిమా హాళ్లు, మాల్స్‌, పాఠశాలలు యథావిథిగా మూసేయాలన్న ముఖ్యమంత్రి  రెడ్‌ జోన్ల వరకే లాక్‌డౌన్‌ను పరిమితం చేయాలని ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి తన అభిప్రాయంగా చెప్పారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జగన్‌.. రాష్ట్రంలో  676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని తెలిపారు. ఈ మండలాల్లోనే లాక్‌డౌన్‌ కొనసాగించాలని కోరారు. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవచ్చన్నారు. సినిమా హాళ్లు, మాల్స్‌, పాఠశాలలు యథావిథిగా మూసివేయవచ్చని జగన్‌ అభిప్రాయపడ్డారు.

దేశంలో మరణాలు  239, పాజిటివ్ సంఖ్య 7 వేల 447

ప్ర‌ధాన మంత్రి మోదీ ముఖ్య‌మంత్రుల వీడియో కాన్ఫ‌రెన్స్ త‌రువాత కేంద్ర ఆరోగ్యశాఖ జాయంట్ సెక్రటరీ మీడియా సమావేశం నిర్వహించి క‌రోనాపై తాజా ప‌రిస్థితిని వివ‌రించారు. ప్రధాని మోదీ నుంచి ఎలాంటి ప్రసంగం లేకపోవడంతో...ఇక లాక్ డౌన్ విషయంపై ఏ రాష్ట్ర సీఎంలు ఆ రాష్ట్ర ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రకటించే అవకాశాం వుంది. తెలంగాణ సీఎం కూడా ప్రధానితో సమావేశం అనంతరం ప్రగతి భవన్‌లో రాష్ట్రమంత్రులతో కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు.    ప్రధాని మోదీ మాస్క్ ధరించి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయనతో పాటు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎంలు కూడా మాస్కులు ధరించారు. ఇప్పటివరకు జరిగిన సమీక్షా సమావేశాల్లో ప్రధాని సామాజిక దూరం పాటించారు కానీ ఏ సందర్భంలో కూడా మాస్క్ మాత్రం ధరించలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ ఇలా మాస్క్ ధరించి కనపించారు.   ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య అమాంతం పెరిగింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడువేలు దాటింది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. దీంతో ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు లాక్ డౌన్ పొడిగించాలంటూ కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి. లాక్ డౌన్ పొడిగింపుపై ఈ సమావేశంలో ప్రధాని చర్చించారు. అందరికీ అన్ని వేళల అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా తనకు వెంటనే ఫోన్ చేయాలని ప్ర‌ధాని ముఖ్య‌మంత్రుల‌కు సూచించారు.  మోదీ సమావేశం జరిగిన అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ జాయంట్ సెక్రటరీ మీడియా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 7447కు చేరాయన్నారు. మరణాల సంఖ్య 239కి చేరిందని ఆయన ప్రకటించారు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1035 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. 40 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.

లక్ష కు పైగా ఐసోలేషన్ బెడ్స్ రెడీ: లవ్ అగర్వాల్

దేశవ్యాప్తంగా 7447 కేసులు నమోదయ్యాయని, 239 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.  6,565 యాక్టివ్  కేసులకుగాను , 643 మంది కోలుకున్నారని చెప్పారు.  గడిచిన 24 గంటల్లో 1,035 కొత్త కరోనా కేసులు నమోద, 40 మంది మృతి చెందారని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా 586 కోవిడ్‌-19 ఆస్పత్రులు ఏర్పాటు చేశామన్నారు.  లక్షకు పైగా ఐసోలేషన్‌ బెడ్స్‌ సిద్ధంగా ఉన్నాయని, కరోనాతో పోరాడటానికి లాక్‌డౌన్‌, నియంత్రణ చర్యలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు. భారత్ లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇప్పటి వరకు 2లక్షలకు పైగా కేసులు నమోదయ్యేవన్నారు.