మద్యం షాపుల ముందు దృశ్యాలు చూసి షాక్ అయ్యాను!

వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు ఏపీలో కరోనా విజృంభిస్తోంది. అయినా ముఖ్య‌మంత్రి జగన్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఇదెక్క‌డి దారుణం. కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. భౌతిక దూరం పాటించట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల ముందు మందుబాబులు కిలోమీటర్ల మేర క్యూలు కట్టడం, భౌతిక దూరం పాటించకపోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను ఆయన పోస్ట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్‌లో మద్యం దుకాణాల ముందు ఈ దృశ్యాలను చూసి షాకయ్యాను. మద్యం షాపుల ముందు మద్యం ప్రియులు భారీగా చేరుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ జగన్‌ ముందస్తు ప్రణాళికలు వేసుకోలేదు. సామాజిక దూరం నిబంధనలు పాటించాలన్న జాగ్రత్తలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలోనూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి' అంటూ ఆయన మండిపడ్డారు.

ఏపీలో 1650కి చేరిన పాజిటివ్ కేసులు!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,292 శాంపిళ్లను పరీక్షించగా 67 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,650గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 524 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,093గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో చిత్తూరులో 1, గుంటూరులో 19, కపడలో 4, కృష్ణాలో 12, కర్నూలులో 25, విశాఖపట్నంలో 6 కేసులు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 491కి చేరాయి.

అక్ర‌మ‌సంబంధాల గుట్టు విప్పుతున్న క‌రోనా!

క‌రోనా ఎవ‌రినీ వ‌ద‌ల‌డం లేదు. గుట్టుగా సాగుతున్న అక్ర‌మ‌సంబంధాల్ని సైతం ర‌ట్టు చేస్తోంది. క‌థ‌లు క‌థ‌లుగా బుద్ధిమంతుల బంఢారం బ‌య‌ట‌ప‌డుతోంది. క‌రోనా పాజిటివ్‌గా వ‌స్తే పేషంట్‌తో పాటు అత‌ని ప్రైమ‌రీ, సెంకండ‌రీ కాంట్రాక్ట్‌లపై పోలీసులు జ‌ల్లెడ ప‌డుతున్నారు. సెల్‌ఫోన్ లిస్ట్ ఆధారంగా విచార‌ణ చేస్తున్నారు. పోలీసు ఎంక్వైరీల్లో షాకింగ్ విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. బుద్ధిమంతుల ముసుగు వారు చేసిన త‌ప్పుడు ప‌నుల‌న్నీ బ‌య‌ట ప‌డుతున్నాయి.  బోపాల్‌లో ఓ అమ్మాయికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే ఆ అమ్మాయికి బాయ్ ఫ్రండ్ వున్నాడ‌నే విష‌యం ఎవ‌రికీ, ఇంట్లోవాళ్ళ‌కు కూడా  తెలియ‌దు. అయితే పోలీసులు ఆ అమ్మాయి ఫోన్‌పై నిఘా పెట్టారు. ఎవ‌రెవ‌రితో కాంట్రాక్ట్‌లో వుంటుందో లిస్ట్ తీశారు. అలా బాయ్ ఫ్రెండ్ బ‌య‌ట‌ప‌డ్డాడు. వెంట‌నే అత‌న్ని టెస్ట్ చేస్తే అత‌నికి పాజిటివ్ తేలింది.  దీంతో షాక్‌కు గురైన పోలీసులు అత‌డు ఇంకెవ‌రితోనైనా కాంట్రెక్ట్‌లో వున్నాడా?  ఫోన్‌లో ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రితో మాట్లాడాడు లిస్ట్ తీశారు. అంతే ఇక్క‌డా కూడా పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఈ అబ్బాయికి మ‌రో గ‌ర్ల ఫ్రెండ్ వుంది. త‌ర‌చూ ఆమెను క‌లుస్తూ వుండే వాడని చెప్పాడు. దీంతో పోలీసులు ఆ అమ్మాయికి టెస్ట్ చేశారు. ఆమెకు కూడా పాజిటివ్ వ‌చ్చింది.  ఈ చైనా ఇంత‌టితో ఆగ‌లేదు. ఊహించ‌ని రీతిలో మొద‌టి అమ్మాయి ద్వారా ఇంకో అబ్బాయికి క‌రోనా సోకింది. దీంతో ఆమె ఇద్ద‌రు అబ్బాయిల‌తో ల‌వ్ ఎఫైర్ న‌డిపింద‌ని బ‌య‌ట ప‌డింది. ఇదే ప్రాంతంలో ఇలాంటిదే మ‌రో విచిత్ర‌మైన కేసును పోలీసులు ఛేదించారు. లాక్‌డౌన్ వున్నా ప్ర‌తి రోజూ ఆఫీసుకు వెళ్ళే వ్య‌క్తికి క‌రోనా సోకింది. అయితే ఇంటి చుట్టుప‌క్క‌లా కానీ, అత‌ని ఫ్రెండ్స్‌కు కానీ, ఆఫీసులో కానీ ఎవ‌రికైనా క‌రోనా వుందా అని ఆరా తీస్తే అలాంటిదేమీ లేదు. అయితే ఈ వ్య‌క్తి ఆఫీసు ముగిసిన త‌రువాత త‌న సెకెండ్ సెట‌ప్ ద‌గ్గ‌ర‌కు వెళ్తున్న‌ట్లు పోలీసులు ఫోన్ లిస్ట్ ద్వారా గుర్తించారు.  ఆమెకు టెస్ట్ చేస్తే క‌రోనా పాజిటివ్ వుంది. ఇద్ద‌రికీ పాజిటివ్ తేల‌డంతో ఇద్ద‌ర్నీ ఐసొలేష‌న్ వార్డుకు త‌ర‌లించారు. అయితే ఈమె ద్వారా ఇంకెవ‌రికైనా వ‌చ్చిందా అని పోలీసులు ఆమె పోన్ లిస్ట్‌పై దృష్టి పెట్టి విచార‌ణ చేప‌ట్టారు.   గుట్టు చ‌ప్పుడు కాకుండా జ‌రిగిన వ్య‌వ‌హారాల‌న్నీ క‌రోనా పుణ్య‌మా అని వెలుగులోకి వ‌స్తున్నాయి. కరోనా క‌ట్ట‌డికి అధికారులు తీస్తున్న కాంట్రెక్ట్ లిస్ట్‌ల‌తో కొత్త విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బుద్ధిమంతులా న‌టించే వారి బండారాన్ని బ‌ద్ధ‌లై కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డుతున్నాయి.

ఆగిన మగ్గం! నేతన్నల ఆక‌లి కేక‌లు! స్థంభించిన కోట్లది రూపాయ‌ల లావాదేవీలు!

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ప్రతీక. ఆ వస్త్రాలు ధరిస్తే రాజసం ఉట్టిపడుతుంది. అయితే లాక్‌డౌన్ నేప‌థ్యంలో వేలాది మంది జీవనోపాధికి భరోసానిచ్చిన చేనేత రంగం ఇప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కక కష్టాలతో కునారిల్లుతోంది. మ‌రోప‌క్క‌ పెరిగిన ముడి సామగ్రి ధరలు, ఇంటిల్లిపాది శ్రమించినా గిట్టుబాటు దక్కక నేతన్నలు కన్నీళ్లుపెడుతున్నారు. ఆకలికేకలు, తెగిపోతున్న పోగుబంధంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల‌ని వారు కోరుతున్నారు.   దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా పరిస్థితుల్లో చేనేత మగ్గాలు ఆగిపోయి నేతన్నలు ఆకలితో బాధపడుతున్నారు. కరోనా నేతన్నను  పూర్తిగా ముంచేసింది. నేచిన చీరలు అమ్ముడుపోక అవస్థలు ప‌డుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా దుకాణాలు మూతపడటం, రవాణా రంగం స్తంభించడంతో  చేనేత రంగం నష్టాల బాటపట్టింది. వెంకటగిరి కేంద్రంగా చేనేత వస్త్రాల వ్యాపారం జోరుగా సాగుతుంది. రోజుకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల మేర వ్యాపార లావాదేవీలు నడుస్తాయి. అయితే, ఒక్కసారిగా దుకాణాలు మూతపడటంతో  కోట్లది రూపాయ‌ల లావాదేవీలు ఆగిపోయాయి.   రాష్ట్రంలో మాస్టర్స్ బేవర్స్ మరియు చేనేత సంఘాల వ‌ద్ద  పేరుకుపోయిన నిల్వ‌ల‌ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి చేనేత రంగాన్ని కాపాడాలి.  రంగులను డిపోల ద్వారా అందించి చేనేత కార్మికులకు పని కల్పించాలి. లేనిచో కార్మికుల్లో ఆకలి చావులు ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది.

5 ప్రధాన నగరాల్లో పెరిగిన అద్దెలు! గిరాకీ తగ్గినా అద్దె పెరిగింది!

దేశంలో హైదరాబాద్‌ సహా 5 ప్రధాన నగరాల్లో ఆఫీసు కార్యాలయాల అద్దెలు ఏడాది వ్యవధిలో 8 శాతం వరకు పెరిగాయని అమెరికాకు చెందిన స్థిరాస్తి కన్సల్టెంట్‌ వెస్టియన్‌ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి-మార్చిలో హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబయి, కోల్‌కతా నగరాల్లో కార్యాలయాల స్థలాలకు గిరాకీ 3 శాతం తగ్గినా, ఏడాది క్రితంతో పోలిస్తే అద్దెలు మాత్రం 8 శాతం వరకు పెరిగింది.  చదరపు అడుగు సగటు అద్దె బెంగళూరులో రూ.75.5 ఉండగా, హైదరాబాద్‌లో రూ.62గా ఉంది. చెన్నైలో  చ.అడుగుకు రూ.60 ఉండగా, ముంబయిలో  చ.అడుగుకు రూ.125గా ఉంది. కోల్‌కతాలో మాత్రం కార్యాలయాల అద్దె  చ.అడుగుకు రూ.48గా ఉంది. 2020 జనవరి-మార్చి మధ్య కాలంలో ఈ ఐదు న‌గ‌రాల్లో సుమారు 91.8 లక్షల చదరపు అడుగుల కార్యాలయాల స్థలాల్ని అద్దెకు తీసుకున్నారు. 2019 ఇదే కాలంతో పోలిస్తే ఇది 3 శాతం తక్కువ. తొలి రెండు నెలల్లోనే అధిక భాగం కార్యాలయాల స్థలాల్ని అద్దెకు తీసుకున్నారు. కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్‌ ప్రకటించగానే చాలా వరకు పెద్ద స్థాయి లీజింగ్‌ నిర్ణయాలు వాయిదా పడ్డాయి. బెంగళూరులో 11 శాతం తగ్గి, 35.3 లక్షల చదరపు అడుగులకు, కోల్‌కతాలో 57 శాతం తగ్గి, 1.5 లక్షల చ.అడుగులకు, హైదరాబాద్‌లో 25 శాతం తగ్గి, 16.4 లక్షల చ.అడుగులకు గిరాకీ పరిమితమైంది. ముంబయిలో మాత్రం గిరాకీ 31 శాతం పెరిగి 23.9 లక్షల చ.అడుగులకు, చెన్నైలో 23 శాతం వృద్ధి చెంది, 14.7 లక్షల చ.అడుగులకు చేరింద‌ని స్థిరాస్తి కన్సల్టెంట్‌ వెస్టియన్‌ నివేదిక తెలిపింది. 2020 తొలి త్రైమాసికంలో 75 లక్షల చదరపు అడుగుల కొత్త కార్యాలయాల స్థలాలు ఈ 5 నగరాల్లో కలిపి  సిద్ధమయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంతో పోలిస్తే ఇది 22 శాతం తక్కువ అని నివేదిక విశ్లేషించింది.

ఐదు వేల కోట్లు బాదుడు! ఖజానా నింపుకోవడానికే ధ‌ర‌ల పెంపు!

ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మద్యం ధరలు పెంచాల్సి వస్తోందని ప్రభు త్వం చెబుతున్నా ఆదాయం పెంచుకోవడమే అస లు ఉద్దేశంగా కనిపిస్తోంది.  అయితే ప్రజారోగ్యం, నిషేధం వంటివి సాకు మాత్రమేనని కరోనా కష్టకాలంలో ఖజానాను నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదాయం లేక విలవిల్లాడుతున్న ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా మద్యం ఒక్కటే కనిపిస్తోంది.  గతేడాది అధికారంలోకి రాగానే సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 20% దుకాణాలను అంటే 4,380 షాపులను 3,500కు తగ్గించారు. బెల్టుషాపులను పూర్తిగా తొలగించారు. అంతేకాదు మద్యం అక్రమ రవాణాను, తయారీని నిరోధిస్తూ శిక్షలను గణనీయంగా పెంచుతూ చట్టాలు తీసుకొచ్చారు. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా మద్యం అమ్మకాలకు అనుమతించడంతో షాపుల వద్ద భౌతిక దూరాన్ని అమలుచేయనున్నారు. మద్యం అమ్మకాల వేళలను నియంత్రించనున్నారు.  మూడో దశ లాక్‌డౌన్ లో భాగంగా కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మద్యం షాపులకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదే సమయంలో మద్యం షాపుల వద్ద భౌతిక దూరం తప్పనిసరి చేసింది. ఒకేసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపుల వద్ద అనుమతి ఇవ్వనున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటే కాసేపు షాపుల మూసివేయనున్నారు. మద్యం అమ్మకాలు తగ్గించేందుకే ధరలు పెంచినట్టు ఎక్సైజ్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్యం ధరల పెంపు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పెరిగిన మద్యం ధరలు.. బీరు 330ml - పెరిగిన ధర 20రూ. 500/650ml -30 రూ. 30000ml -  2000రూ. 50000ml- 3000రూ. రెడీ టూ డ్రింక్ 250/275ml. - 30రూ.పెరుగుదల 180ml ధర 120రూ.కంటే తక్కువ ఉన్న వాటిపై పెంపు 60/90ml.- 10రూ.పెరుగుదల 180 ml - 20రూ.పెరుగుదల 375ml - 40రూ.పెరుగుదల 750ml - 80రూ.పెరుగుదల 1000ml -120రూ.పెరుగుదల 2000ml - 240రూ.పెరుగుదల 180ml ధర 120 నుంచి 180 రూ.మధ్యలో ఉన్న వాటిపై పెంపు 60/90ml.- 20రూ.పెరుగుదల 180 ml - 40రూ.పెరుగుదల 375ml - 80రూ.పెరుగుదల 750ml - 160రూ.పెరుగుదల 1000ml -240రూ.పెరుగుదల 2000ml - 480రూ.పెరుగుదల 150రూ.కంటే ఎక్కువ ధర ఉన్న వాటిపై పెంపు 60/90ml.- 30రూ.పెరుగుదల 180 ml - 60రూ.పెరుగుదల 375ml - 120రూ.పెరుగుదల 750ml - 240రూ.పెరుగుదల 1000ml -360రూ.పెరుగుదల 2000ml - 720రూ.పెరుగుదల ₹120 లోపు క్వార్టర్ బాటిల్ పై రూ.20పెంపు ఆఫ్, బాటిల్ పై రూ.40, ఫుల్ బాటిల్ పై రూ.80పెంపుధర పెరిగినా షాపుల వద్ద రద్దీ తగ్గదు. క్షణాల్లో సరుకు ఖాళీ అవడం ఖాయం.  ‘ప్రొహిబిషన్‌ ట్యాక్స్‌’ ద్వారా మద్యం ధరలను పెంచారు. మద్యం బాటిల్‌పై ఉన్న ఎమ్మార్పీ ధర కంటే 25 శాతం అదనం. ఉదాహరణకు ఒక మద్యం బాటిల్‌ ధర రూ.300 ఉందనుకుంటే 25 శాతం ధర పెంచి రూ.375కి విక్రయిస్తారు.  రాష్ట్రంలో గతేడాది జరిగిన మద్యం అమ్మకాల విలువకు 25 శాతం ఆదాయం కూడా కలిపితే కొత్తగా రూ.4,406 కోట్లు వస్తుంది. దానికి ఏటా వచ్చే సాధారణ వృద్ధిని కలిపితే దాదాపు రూ.5వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది.  నిజంగా దుకాణాల వద్ద రద్దీని నియంత్రించడమే ప్రభుత్వ లక్ష్యం అయితే పోలీసులను పెట్టి అమ్మకాలు జరపొచ్చు. మద్య నిషేధమే లక్ష్యమైతే లాక్‌డౌన్‌తో వచ్చిన అవకాశంతో షాపులను పూర్తిగా బంద్‌ చేయవచ్చు.  హడావిడిగా ధరలు పెంచి షాపులు తెరవాల్సిన అవసరం ఏమిటి?

గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచివేస్తాం!

తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా తయారీని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయ పరిధిలో  సి ఐ, మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై కిష్టరం తాండ లో  గుడుంబా తయారీదారులు దాడి చేయగా దాడిలో గాయపడిన ఎక్సైజ్  సి ఐ ని, సిబ్బందిని మంత్రి  జడ్చర్ల ఎక్సైజ్ కార్యాలయం వద్ద పరామర్శించి మీడియాతో మాట్లాడారు. గుడుంబా తయారు చేస్తున్న వారిని ఉక్కుపాదంతో అణిచి వేస్తామని అన్నారు. అంతేకాక  పిడి యాక్ట్ తో పాటు ఇతర చట్టాలను కూడా ఉపయోగిస్తామన్నారు.  ప్రణాళికాబద్ధంగా ఎక్సైజ్, పోలీస్ శాఖల సంయుక్త సహకారంతో గుడుంబాను అణిచివేస్తామన్నారు. గుడుంబా నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యత  అని అన్నారు. ప్రజలు  ప్రాణాలు తమకు ముఖ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు గారు   గుడుంబా రహిత  తెలంగాణగా తీర్చిదిదామన్నారు. అయితే కొందరు  లాక్ డౌన్ ను   అదనుగా తీసుకొని ఇతర రాష్ట్రాల నుండి  బెల్లం ఇతర పదార్థాలు తీసుకువచ్చి ఆక్రమంగా గుడుంబా తయారు చేయడం బాధాకరమన్నారు. అయినప్పటికీ ఇలాంటి తయారీదారులను  అరికడతామని  మంత్రి పునరుద్ఘాటించారు. సిబ్బంది దాడులను ధైర్యంగా ఎదుర్కోవడమే కాక గుడుంబా స్థావరాలను ధ్వంసం చేసి రావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలు ముఖ్యమని  కరోనా  లాక్ డౌన్ సందర్భంగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా ఉద్యోగులకు లక్ష 70 వేల శాని టైజర్లను  రాష్ట్రంలో పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. లాక్ డౌన్ కారణంగా మందు దొరకనందున కొంతమంది తాగుడుకు బానిసైన వారు దొంగతనంగా గుడుంబా తయారు చేయడం, షాప్ ల లో దొంగతనం గా అమ్మటం వంటివి చేస్తున్నారని అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గుడుంబా రహిత తెలంగాణ గా తీర్చిదిద్దేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి  పునరావాసం కల్పించడం జరిగిందని, దీనివల్ల తండాలలో గుడుంబా తయారు చేసే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటమే కాకుండా, వారు వివిధ జీవనోపాధి పొందారని, ముఖ్యంగా చాలా మంది గుడుంబా తయారీదారులు ఆటోలు, మేకలు ఇతర వ్యాపారాలను చూసుకున్నారని తెలిపారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించడం , వ్యవసాయ పనులు పెరిగిపోవటం వల్ల గిరిజన ప్రాంతాలలో గుడుంబా తయారుచేసే సంస్కృతి తగ్గిపోయిందని ఆయన తెలిపారు. అయితే  లాక్ డౌన్ కారణంగా   గుడుంబా  అక్రమంగా తయారు చేయడం  బాధాకరమని మంత్రి తెలిపారు. అయినప్పటికీ తాము ఎలాంటి వారిని వదిలిపెట్టమని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని అసలు సహించమని హెచ్చరించారు. కొంతమంది కెమికల్స్ ను ఉపయోగించి కూడా గుడుంబాను తయారు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ,అలాంటి వారిని కూడా వదలబోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అన్ని రంగాలలో అభివృద్ధిలో  ముందుందని, రాష్ట్రంలో పేద ప్రజలకు అవసరమైన ఆసరా పెన్షన్లు, పాఠశాలలు  ఇతర అన్ని రకాల సేవలు అందిస్తున్నామని ,ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఎన్నో పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎక్కడైనా  గిడుంబా తయారు చేస్తున్నట్లు అనుమానం వస్తే యువకులు తక్షణమే ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలని ,అంతకాక మీడియా కూడా గుడుంబా నిర్మూలనలో ముఖ్యమైన పాత్ర పోషించాలని మంత్రి  కోరారు.

న్యూస్‌ పేపర్ పరిశ్రమకు రూ.15 వేల కోట్ల వరకు నష్టం: ఐఎన్ఎస్

వార్తా పత్రికల పరిశ్రమకు ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించాలి కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన న్యూస్‌ పేపర్‌ సొసైటీ   రెండు నెలల్లో రూ.4,000 కోట్ల నష్టం న్యూస్‌ ప్రింట్‌పై ఉన్న ఐదు శాతం పన్ను తగ్గించాలి కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వార్తా పత్రికలకు వస్తోన్న నష్టంపై ఇండియన్ న్యూస్‌ పేపర్‌ సొసైటీ (ఐఎన్‌ఎస్‌) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. వార్తా పత్రికల పరిశ్రమకు ఉద్దీపన ప్యాకేజ్ ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. లాక్‌డౌన్‌ వల్  ఇప్పటికే రెండు నెలల్లో రూ.4,000 కోట్ల నష్టం వాటిల్లిందని, కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించకపోతే తదుపరి ఏడు నెలల్లో మొత్తం కలిపి రూ.15,000 కోట్ల నష్టం వస్తుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఐఎన్‌ఎస్‌ లేఖ రాసింది. లాక్‌డౌన్‌ వల్ల అత్యధికంగా నష్టపోయిన పరిశ్రమల్లో వార్తా పరిశ్రమ ఒకటని తెలిపింది. రెవెన్యూ, యాడ్స్, సర్క్యులేషన్ భారీగా పడిపోయాయని తెలిపింది. ప్రైవేటు రంగం నుంచి ప్రకటనలు రావట్లేదని చెప్పింది. ఈ పరిస్థితులు మరో ఆరు లేక ఏడు నెలలు ఉండొచ్చని పేర్కొంది. అలాగే, న్యూస్‌ ప్రింట్‌పై ఉన్న ఐదు శాతం పన్ను తగ్గించాలని కోరింది. న్యూస్‌ పేపర్‌ పరిశ్రమలో జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, పేపర్ బాయ్స్ వంటి దాదాపు 30 లక్షల మంది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జీవనోపాధి పొందుతారని, ఇప్పటికే లాక్‌డౌన్‌ వల్ల వారిపై ప్రభావం పడిందని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న 800 న్యూస్‌ పేపర్ల సంస్థల్లోని వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పింది. లాక్‌డౌన్‌ ఇబ్బందుల వల్ల న్యూస్ పేపర్ పరిశ్రమ తమ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోతోందని తెలిపింది.

ఫ్రంట్ లైన్ వారియర్స్ కి పుష్పాభివందనం చేయడం అభినందనీయం: చిరంజీవి

దేశాన్ని కాపాడేది వీర సైనికులు ‘కరోనా’ కట్టడికి పోరాడుతోంది  ఫ్రంట్ లైన్ వారియర్స్   వీళ్లిద్దరికి మనం రుణపడి ఉన్నామంటూ చిరంజీవి ట్వీట్ ‘కరోనా’ కట్టడికి ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల సేవలను కేంద్రం ప్రశంసిస్తూ..  గగనతలం నుంచి హెలికాఫ్టర్ల ద్వారా వారిపై పూల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రముఖ హీరో చిరంజీవి స్పందించారు. సరిహద్దులు దాటి వచ్చే ఉగ్రవాదులపై పోరాడి దేశాన్ని కాపాడే వీర సైనికులు,  కనిపించని వైరస్ అందరిపై దాడి చేస్తుంటే, అహర్నిశలు మనల్ని కాపాడేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టి ముందు  వరుసలో ఉండి పోరాడుతున్న యోథులకు పుష్పాభివందనం చేయడం అభినందనీయమని ప్రశంసించారు. కరోనా పై పోరాడుతున్న వారికి,  వీర సైనికులకు తాము రుణపడి ఉన్నామని ప్రశంసిస్తూ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు.

పదివేల నిత్యవసర మోడీ కిట్ల పంపిణీ!

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు జంటనగరాల ప్రజల కోసం మరోమారు పదివేల నిత్యవసర మోడీ కిట్లను సిద్ధం చేశారు.(ఇది వరకే 10 వేల నిత్యావసర కిట్లు పంపిణీ జరిగింది) మసబ్ ట్యాంక్ లోని బంజారా ఫంక్షన్ హాల్ లో ఈ దఫా మరో పది వేలు నిత్యవసర కిట్లు సిద్ధమవుతున్నాయి. ఈరోజు మంత్రి గారి సతీమణి శ్రీమతి కావ్య కిషన్ రెడ్డి ఇతర బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి , గౌతం రావు , దీపక్ రెడ్డి , ఛాయా దేవి లతో కలిసి ప్యాకింగ్ తీరును పరిశీలించారు.  ప్రతి కిట్లో  మేలురకం రైస్- 5 కిలోలు, మేలురకం పప్పు -ఒక కిలో, నూనె -1 లీటర్,  పసుపు, కారం, చింతపండు -  ఒక్కొక్కటి పావు కిలో చొప్పున పికిల్ పాకెట్ -150గ్రామ్స్, ఎనర్జీ జ్యుస్ -1 లీటర్, మాస్కులు-4 లెక్కన మొత్తం 9 వస్తువులతో 10 వేల కిట్ల ప్యాకింగ్ బంజారా పంక్షన్ హాళ్ళో అయింది.  సురక్షితంగా  ప్యాకింగ్  అవుతున్న తీరును  పరిశీలించిన  శ్రీమతి కావ్యా కిషన్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ ఇంకా పొడిగించడంతో జంటనగరాల్లోని పేద ప్రజలకు ఈ కిట్లు అందించాలని కిషన్ రెడ్డి గారు  నిర్ణయించారని, అందుకే అన్ని జాగ్రత్తలతో  ప్యాకింగ్ సిబ్బందితో కిట్లను సిద్ధం చేసామని తెలిపారు. ఈ కిట్లను రేపు మధ్యాహ్నం నగరం నలుమూలలకు ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలియజేశారు. ఇప్పటికే నిత్యావసర కిట్లతో  పాటు  2 దఫాలుగా  నాణ్యమైన  తాజా కూరగాయలు 44 టన్నులు నగరానికి తెప్పించి పేద ప్రజలకు పంపిణీ చేయించామని, అంతేకాకుండా సెల్ఫ్ హెల్ప్ ఒమెన్ గ్రూప్స్ తో ప్రత్యేక కాటన్ క్లాత్ మాస్కులు కుట్టించి పేద ప్రజలకు పంపిణీ చేయించడం జరుగుతుందని కావ్య తెలిపారు.  ఢిల్లీలో దేశవ్యాప్త కమాండ్ కంట్రోల్ రూమ్ బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్న మంత్రి కిషన్ రెడ్డిగారు ప్రతినిత్యం తన హైదరాబాద్ కార్యాలయ సిబ్బందితో,పార్టీ క్యాడర్ తో,స్వచ్చంద సంస్థలతో  చర్చిస్తూ జంట నగర ప్రజల కోసం పని చేస్తున్నారని ,ఈ కష్ట కాలంలో కరోనాను జయించడమే మన అందరి లక్ష్యమని కావ్య కిషన్ రెడ్డి అన్నారు. లాక్‌డౌన్‌ కు సహకరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపారు. అలానే ప్రాణాలకు తెగించి కరోనాపై  పోరాడుతున్నా డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు, మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగువిద్యార్థుల్ని ఆదుకుంటున్నాం!

ప్రపంచంలోని తెలుగువాళ్లు కరోనా కారణంగా ఎటువంటి ఇబ్బందులకు లోనుకాకూడదు అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు ఇచ్చిన ఆదేశాలతో నార్త్ అమెరికా ఏపి ప్రత్యేక ప్రతినిధిగా పలు చర్యలు చేపట్టాం. కెనడాలో రెండుసిటీలు, అమెరికాలో దాదాపు 25 స్టేట్స్ లో 45 సిటీలలోని తెలుగువిద్యార్ధులు లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులకు లోనవుతున్నారు. లాక్ డౌన్ లో ఇబ్బందుల్లోఉన్నవారిని ఇక్కడి వాలంటీర్ వ్యవస్ధ స్పూర్తితో అమెరికాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, మధ్దతుదారులను కలుపుకుని ఈ 45 సిటీలలో చదువుతున్న తెలుగు విధ్యార్దులకు నిత్యావసరాలు ఇవ్వడం జరిగిందని నార్త్ అమెరికా ఏపి ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ తెలిపారు. ఆ విధ్యార్దులకు పర్సనల్ గా ఫోన్ చేయడం వారికి కావాల్సినవి లిస్ట్ అవుట్ చేసి డోర్ డెలివరీ చేయడం జరిగింది.మరి కొందరికి 100 డాలర్ల చొప్పున వారి బ్యాంక్ అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ చేశాం. సహాయం అందుకున్న తెలుగువిద్యార్ధులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారిని అభినందించారు. అమెరికాలో సహాయం అందించే మరింతమందిని కలుపుకుని విద్యార్ధులకు కావాల్సిన గ్రాసరీస్ పంపిణి కొనసాగుతుంది. మా కమిటీలో కొందరు ఫార్మర్స్ ఛాలెంజ్ అనే కాన్సెప్ట్ తీసుకుని సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. పొట్టకూటికోసం కువైట్ వెళ్లి వీసాలు, రిజిస్ర్టేషన్ లకోసం ఇబ్బంది పడుతున్న తెలుగువాళ్లను తక్షణం ఏపికి చేర్చేవిధంగా అటు కువైట్ ప్రభుత్వానికి,కేంద్రప్రభుత్వానికి జగన్ గారు లేఖ రాయడం జరిగింది. రవాణా బ్యాన్ కారణంగా అమెరికాలో ఇరుక్కుపోయిన తెలుగువాళ్ళను ఇండియాకు తీసుకువచ్చేవిధంగా చేయాలని ఏపి ఎన్ ఆర్ టి తరపున ముఖ్యమంత్రిగారికి లెటర్ ఇచ్చాం.దానికి సిఎంగారు వెంటనే స్పందించి విదేశీవ్యవహారాలశాఖకు లెటర్ రాశారు. అమెరికాలో రవాణా బ్యాన్ కారణంగా ఉండిపోయిన తెలుగువాళ్లను ఇండియాకు చేర్పించే ప్రయత్నం చేయాలని కోరారు. ముఖ్యంగా వృధ్దులకు ప్రయారిటీ ఇవ్వాలని సూచించారు. తెలుగుదేశం పార్టీనేతలు కరోనా నేపధ్యంలో కష్టాలు పడుతున్న ఇక్కడ ప్రజలకు గాని, అమెరికాలోని తెలుగుప్రజలకు ఏలాంటి సహాయకార్యక్రమాలు చేయ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. చంద్రబాబు ఎంతసేపటికీ వీడియో మీటింగ్ లు పెట్టుకుని పబ్లిసిటీకి వాడుకోవడం,కరోనాను నియంత్రించేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్న ప్రభుత్వంపై బురదచల్లడం చేస్తున్నారని ఆయ‌న ఆరోపించారు.

పేద‌ల్ని ఆదుకోవ‌డానికి సీఎం కు మనసు రావట్లేదా?

'ప్రభుత్వ భవనాలకురంగుల కోసం రూ.2600 కోట్లు ఖర్చు పెట్టారు కానీ పేదవారికి సాయం చేయడానికి జగన్‌కు మనసు రావడం లేదు. వాలంటీర్లతో నిత్యావసరాలను డోర్‌ డెలివరీ ఎందుకు చేయడం లేదు?. పేదల ఆకలి కంటే అవినీతికే ప్రాధాన్యత ఇస్తూ జగన్‌ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకున్నారు. ప్రతి పేద కుటుంబానికి రూ.10 వేల సాయం చేయాలి' అని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోందని అని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. కేరళ, తెలంగాణ రాష్ట్రాలు కరోనాను నియంత్రిస్తున్నాయని చెప్పుకొచ్చారు.

మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోనూ అవినీతి మయం...

జగన్ రెడ్డి అవినీతి బండికి సాయి రెడ్డి, రాజేంధ్రనాధ్ రెడ్డిలు  రెండు చక్రాలు లాంటి వార‌ని శాసనమండలి సభ్యులు బుద్ధా వెంకన్న విమ‌ర్శించారు.  జగన్ చేత‌గాని అసమర్ధత పాలన ఆయన మాటల్లోనే అర్ధం అవుతుంది.  భవిష్యత్ లో కరోనా మరింత ఉదృతం కాబోతుందని ఆయనే చెప్పారు.  రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కరోనా జ్వరం లాంటిది, వస్తుంది, పోతుందని చిన్నపిల్లవాడిలా జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉందని ఆయ‌న విమ‌ర్శించారు.  కరోనాతో సహజీవనం చేయాలని ఆయన వ్యాఖ్యలకు ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  కరోనా మహామ్మారి ఎక్కువగా ఉందని ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం కరోనా అంటే ఏమీ లేదని జగన్ చెప్పడం సిగ్గుచేటు.  చంద్రబాబు నాయుడు అనేక విపత్తు సమయంలో ఏపీని ఆదుకున్నారు. ఈ సమయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టకరమ‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగితుంటే జగన్ మాత్రం సిల్లీగా ఉంటున్నారు.  ప్రపంచ మేథావులు ఏం మాట్లాడుతున్నారు. అందుకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడటం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంద‌న్నారు.   తెలంగాణలో కేసులు  తగ్గుతుంటే ఏపీలో కేసులు పెరుగుతున్నాయి.  ప్రజలకు కరోనా రావాలని జగన్ కోరుకుంటున్నారా? కరోనా పుట్టిన చైనాలోను తగ్గుముఖం పడితే ఏపీలో మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  అభివృద్ధికి బ్రాండ్ అంబాసడర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు ను ఎందుకు ఆదర్శంగాతీసుకోవడం లేదు?  ప్రాతి వ్యక్తికి 3 మాస్కులు ఇస్తామన్నారు. ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదు?  డాక్టర్లకు మాస్కులు లేవని ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేశారు. శానిటైజేషన్ లేదని చెప్పిన నగిరి మున్సిపల్ కమీషనర్ ను సస్పెండ్ చేశారు.  5 కోట్లకు 3 మాస్కులు కావాలంటే 15 కోట్ల మాస్కులు కావాలి. ఇప్పటి వరకు ఎవరికి, ఎక్కడ ఇచ్చారు.  కరోనాను అడ్డం పెట్టుకొని మాస్కుల రూపంలో స్కాం చేద్దామని చూస్తున్నారు.  మొన్న కిట్లు, నేడు మాస్కులు కరోనా కాలంలోను అవినీతి మయం దేశంలో ముఖ్యమంత్రులందరూ లాక్ డౌన్ ను కొనసాగించాలని ప్రధానికి సూచనలిస్తే జగన్ మాత్రం లాక్ డౌన్ ను తొలగించాలని చెప్పడం సిగ్గుచేటని ఆయ‌న విమ‌ర్శించారు. తినడానికి తిండి లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైకాపా నేతల మందు కంపెనీలను తెరిచి అమ్ముకొని ప్రజలను దోచుకునేందుకు మద్యం షాపులు తెరిచేందుకు సన్నాహాలు చేస్తారా?  అని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిప‌డ్డారు.  రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల మధ్య సరిహద్దులు ఏ మాత్రం ఉన్నాయి? కరోనాను అంటించేందుకు మద్యం షాపులు తెరుస్తున్నారా?  ప్రజలకు రూ.5వేలు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు?  మూడు మాస్కులకు అయ్యే డబ్బులు ప్రజలకు ఇస్తే వాళ్లే మాస్కులు కొనుక్కుంటారు కదా?   విజయసాయిరెడ్డి  వైసీపీ మందిని రోడ్ల వెంటా తిప్పుతూ ఆర్బాటంగా తిరుగుతున్నారు.  కరోనా ఈ మాత్రం అదుపులో ఉందటానికి పోలీసులే కారణం. వారికి నా సెల్యూట్ చేస్తున్నాం. కాని అధికారపక్షం నాయకులు ఇష్టానుసారంగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజయసాయిరెడ్డి లెక్కలేని తనంగా తిరుగుతున్నారు. పరిపాలన అవగాహన లోపంలో భాగంగా ఇవ్వన్ని జరుతున్నాయి. లాక్ డౌన్ తగ్గుముఖం పట్టాల్సింది ఎందుకు పెరుగుతున్నాయి. కరోనా తగ్గించలేకపోతే వైసీపీ నేతలనైనా కంట్రోల్ లో పెట్టాలని ఎమ్మెల్సీ సూచించారు. వైసీపీ నేతలు బ‌యట తిరుగుతున్నారు. ప్రజలు పాలనతో విసుగెత్తిపోయారు. ఆరోగ్య సర్వే జగన్ ఎక్కడ, ఎప్పుడు చేయించారు.  ఇదంతా అవాస్తవం. ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు? జగన్ ఇప్పటికైనా కరోనా నివారణ చర్యలు తీసుకోవాలి.  ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి సొంత జిల్లా కర్నూలు జిల్లాలో కరోనా కేసులు ఇటలీ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆయన దాని గురించి మాట్లాడరు. ఇష్టానుసారంగా మాట్లాడే అనీల్ కుమార్ యాదవ్ కు కూడా నెల్లూరు లో కరోనా కేసులు కంట్రోల్ చేయడం చేతగాక చంద్రబాబు నాయుడును విమర్శిస్తున్నారు. విజయసాయిరెడ్డి, బుగ్గన ఇద్దరూ జగన్ అవినీతి బండికి రెండు చక్రాలు. ఎప్పటికైనా రెండు టైర్లు పంచర్ అవ్వడం ఖాయం.  వైన్ షాపులు ప్రభుత్వం తెరవటం విరమించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు.  చంద్రబాబు నాయుడు పాలన చూశాం కాబట్టి జగన్ పాలన ఒక సారి చూద్దామని ప్రజలు భావించారు. పరిపాలన ఇచ్చారని ఇష్టానుసారంగా చేసుకుంటే ప్రజలు విప్లవం ద్వారా గద్దె దింపుతారని బుద్ధా వెంకన్న అన్నారు.

వైసీపీ నేతలు 'జాంతోప్సియా' వ్యాధితో బాధపడుతున్నారు: గోరంట్ల

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విమర్శనాస్త్రాలు సంధించారు. వైసీపీ నేతలు తెల్ల కనుగుడ్డు పచ్చబడడం అనే సమస్యతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ వ్యాధిని 'జాంతోప్సియా' అంటారని కూడా వివరించారు. "ఒకవేళ దీనికి కూడా పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటారేమో.  పచ్చకామెర మరింత పెరుగుతుంది. రాష్ట్రంలో వెంటిలేటర్లు కూడా లేవు, పనిచేయని టెస్టింగ్ కిట్లు తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు బాగా అలవాటైన పని ఒకటి చేయండి. తూర్పుకు తిరిగి దణ్ణం పెట్టండి. అప్పటికీ అటువైపు కూడా పచ్చగా ఉందంటే అది మీ దురదృష్టం" అని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ మేరకు గోరంట్ల ట్వీట్ చేశారు.

మద్యం షాపులు ఏమైనా మెడికల్‌ షాపులా?

మద్యం డిస్టరీలు ఓపెన్‌ చేసి మద్యం తయారు చేయించే బదులు.. అన్న క్యాంటీన్లు తెరచి పేదల ఆకలి తీర్చాలని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు హితవు పలికారు. ఆధునిక యుగంలో కూడా రాష్ట్రంలో పేదలు అర్ధాకలితో అలమటిస్తున్నారంటే వైకాపా నేతలు సిగ్గుపడాలన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు.  ప్రపంచమంతా కరోనా నివారణకు ఔషధం తయారు చేసే పనిలోఉంటే ..జగన్‌ మాత్రం కమీషన్ల కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకీ కరోనాకేసులు పెరిగి నిత్యావసర సరకుల దుకాణాలే మూసివేసే పరిస్థితి ఉంటే మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏంటని నిలదీశారు.  మద్యం షాపులు ఏమైనా మెడికల్‌ షాపులా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎవరూ వెళ్లవద్దని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోందన్నారు.

ఏపీలో 25 శాతం పెరిగిన మద్యం ధరలు...

ఏపీలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో మద్యం దొరక్క అల్లాడుతున్న వారికి ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి సడలింపుల్లో భాగంగా మద్యం దొరుకుతుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మద్యం ప్రియులకు 25 శాతం ధరలు పెంచుతున్నట్లు ప్రభుత్వం చేసిన ప్రకటన మింగుడు పడటం లేదు. మద్యం విక్రయాలను నిరుత్సాహ పరిచే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం జగన్ సమీక్షలో నిర్ణయించారు. దీంతో మందుబాబులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. మద్య నియంత్రణలో భారంగా ఇప్పటికే తొలి ఏడాది 20 శాతం దుకాణాలను మూసేసిన ప్రభుత్వం... అదనపు పన్నులను సైతం వడ్డించింది. అంతటితో ఆగకుండా ఇప్పుడు కరోనా లాక్ డౌన్ నేఫథ్యంలో నష్టపోయిన మొత్తాన్ని కూడా వీరి నుంచే వసూలు చేయాలని నిర్ణయించినట్లు అర్దమవుతోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రేపటి నుంచి మద్యం దుకాణాలు తెరుస్తుండగా.. రేట్లను పెంచడం మాత్రం తథ్యమని చెబుతోంది. అలాగే మద్యం దుకాణాల వల్ల సామాజిక దూరం పాటించడంతో పాటు ఇతర ఆంక్షలను కూడా విధిస్తోంది. దీంతో మద్యం దుకాణాలకు రావాలంటేనే మందుబాబులు బెంబేలెత్తుతున్నారు.

నెలరోజుల్లోనే కరోనాకు వ్యాక్సిన్?

ప్రయోగాలు చేయిస్తున్న సీఎస్ఐఆర్... కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే వ్యాక్సిన్ ను భారతీయ శాస్త్రవేత్తలు నెల రోజుల్లోనే తయారు చేయడమే కాక మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాల సమాచారం. ఇండియాలోనే అత్యున్నతమైన పరిశోధన, అభివృద్ది సంస్థ సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్) ప్రస్తుతం కరోనా వైరస్‌ను నివారించే డ్రగ్‌ మీద ప్రయోగాలు చేస్తోంది. మరింత విస్తృతమైన ప్రయోగాలు చేసేందుకు డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కోరింది. అన్నీ కుదిరితే నెలరోజుల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నట్టు ఈ పరిశోధన గురించి అవగాహన ఉన్న సైంటిస్టులు తెలిపినట్టు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. కాడిలా ఫార్మాసిటికల్స్‌కు చెందిన Sepsivac‌ మీద ఈ పరిశోధనలు చేస్తున్నారు. ఈ రెండు సంస్థల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఒప్పందం ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా సీఐఎస్ఆర్ పరిశోధనలు చేస్తోంది. ఇమ్యునోథెరపీ ట్రీట్‌మెంట్‌‌కు ప్రాథమికంగా డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీ ఎయిమ్స్‌, భోపాల్ ఎయిమ్స్, మరోచోట 50 మంది పేషెంట్ల మీద పరిశోధించారు. 30 నుంచి 45 రోజుల్లో దీనికి సంబంధించిన ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ఫేజ్ 3 ట్రయల్స్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు త్వరగా వస్తాయని అంచనా వేస్తున్నారు. మూడో దశలో 1100 మంది మీద పరిశోధనలు చేయనున్నారు. అప్పటి వరకు లాక్ డౌన్ గడువును కూడా దశల వారీగా పెంచుకుంటూ పోవాలని శాస్త్రవేత్తలు కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్లు తెలిసింది.

కరోనా కేసులు పెరుగుతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా? కళా వెంకట్రావు

విపత్కర పరిస్థితిలో మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏముంది ఆర్థిక ఇబ్బందుల్లో వున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాలంటీర్లు నాటు సారా తయారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. కరోనా కట్టడి కోసం ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగోలేవని విమర్శించారు. ప్రపంచమంతా కరోనా నివారణ కోసం మందు తయారు చేసే పనిలో ఉందని, ఏపీ సీఎం జగన్‌ మాత్రం తన కమిషన్‌ కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుంటే మద్యం దుకాణాలు తెరుస్తారా? అని కళా వెంకట్రావు మండిపడ్డారు. విపత్కర పరిస్థితిలో మద్యం తయారు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలోని ఆర్థిక ఇబ్బందుల్లో రైతులు వున్న ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆయన అన్నారు. వారిని ఆదుకునే ప్రయత్నాలను ఏపీ ప్రభుత్వం చేయట్లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు నాటు సారా తయారు చేస్తున్నారని కళా వెంకట్రావు ఆరోపించారు. మద్యం దుకాణాలకు బదులు అన్న క్యాంటీన్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలకు పట్టెడన్నం పెట్టలేని ప్రభుత్వం ఎందుకు? అని ఆయన నిలదీశారు. వెంటనే రాష్ట్రంలోని పేదలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

దొంగ కేసులకు భయపడను.. టీడీపీ ఎంపీ కేశినేని

సామాజిక దూరం పాటిస్తూనే  పంపిణీ చేశాం ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పేదల కోసం పని చేస్తా ఈ నెల 1 వ తేదీన విజయవాడలోని 47 డివిజన్ లో సామాజిక దూరం పాటించకుండా టీడీపీ ఎంపీ కేశినేని నాని పెద్దఎత్తున కూరగాయల పంపిణీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై నాని స్పందిస్తూ, సామాజిక దూరం పాటిస్తూనే తాను నిత్యావసరాలు పంపిణీ చేశానని, గుమిగూడినట్టు మార్ఫింగ్ ఫొటోలు పెట్టి తనపై కేసు పెట్టారని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, వైసీపీపై మండిపడ్డారు. తనపై పెట్టిన దొంగ కేసులకు భయపడి పేదలకు, ఆపదలో ఉన్న వారికి సేవ చేయడం మానేస్తానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తానని, ఎన్ని దొంగ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండని మండిపడ్డారు. ఈ సందర్భంగా విజయవాడ పోలీస్ కమిషనర్ పైనా ఆయన విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు నిత్యావసరాల పంపిణీ సమయంలో గుమిగూడిన విషయమై తాము ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు? కేసు ఎందుకు నమోదు చేయలేదు? అని ప్రశ్నించారు. కేవలం, ప్రతిపక్ష పార్టీల నాయకులపైనే కేసులు నమోదు చేస్తారా? అంటూ విమర్శలు గుప్పించారు.