నిమ్మగడ్డ కేసు.. స్టే పిటిషన్ ఉపసంహరించుకున్న జగన్ సర్కార్
posted on Jun 2, 2020 @ 12:22PM
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో హైకోర్టులో వేసిన స్టే పిటిషన్‌ను జగన్ సర్కార్ ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాల్సిందేనంటూ ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను, జీవోలను హైకోర్టు కొట్టివేసింది. అయితే, జగన్ సర్కార్ మాత్రం హైకోర్టు తీర్పు అమలుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ కేసులో తీర్పుపై స్టే ఇవ్వాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది తెలిపారు.