ఎపి సీఎం కూడా బంకర్లు సిద్ధం చేసుకోవాలి.. టీడీపీ నేత సంచలన కామెంట్స్
posted on Jun 4, 2020 @ 2:35PM
నేర స్వభావం ఉన్న వ్యక్తి పరిపాలిస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో సీఎం జగన్ ఏడాది పాలన అందుకు చక్కని ఉదాహరణ అని టీడీపీ నేత యరపతినేని వ్యాఖ్యానించారు. ప్రజావ్యతిరేక విధానాలతో జగన్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారని అయన తీవ్రంగా విమర్శించారు. ప్రజలు కనుక తిరగబడితే అమెరికాలో ట్రాంప్ వెళ్లి బంకర్లో దాక్కున్నారని .. అలాగే ఏపీలో జగన్ కూడా బంకర్లు కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అయన అన్నారు. ఎపి ప్రభుత్వం తప్పిదాలను కోర్టులు తప్పుబడుతుంటే దిక్కు తోచక ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసిపి నేతలు తెలుగుదేశాన్ని నిందిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతీదానికీ వైకాపా నేతలు చంద్రబాబు వయస్సు మీద విమర్శలు చేస్తున్నారని.. ఐతే వారికి వయస్సు పెరగదని ఆ నేతలు భావిస్తున్నారా అని యరపతినేని ప్రశ్నించారు. చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడే అంబటి రాంబాబు ఆయనతో కలిసి తిరుమల కొండ ఎక్కగలరా అని సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీకి ఫ్యూచర్ లీడర్లు ఎందరో ఉన్నారని.. అలాగే వైకాపా నేతలు విమర్శిస్తున్నట్లుగా లోకేష్‌కి అవినీతిలో అనుభవం లేదని అన్నారు. వైసిపి నేతల మాదిరి సూట్ కేసు కంపెనీలు పెట్టడం, దొంగ సొమ్ము దోచుకోవటం, అక్రమార్జన చేయటంలో జగన్‌లా లోకేష్‌కి అనుభవం లేదని అయన విమర్శించారు. ప్రస్తుతం జగన్ చుట్టూ ఉన్నవారంతా అవకాశవాదులు కాదా అని అయన ప్రశ్నించారు. బొత్స, ధర్మాన మొదలైన వాళ్లంతా జగన్‌ని ఒకప్పుడు విమర్శించిన వారే అని.. వై.ఎస్ మరణం వెనుక కూడా జగన్ హస్తం ఉందని బొత్స విమర్శలు చేయలేదా అని అయన నిలదీశారు. చంద్రబాబు, లోకేష్‌ల మీద అనవసరంగా నోరు పారేసుకుంటే ఉతికి ఆరేస్తాం ఖబడ్దార్ అని యరపతినేని హెచ్చరించారు.