చెయ్యికి చెయ్యి, కాలికి కాలు విరగ్గొడతారు.. కొడాలి నానికి రఘురామరాజు సీరియస్ వార్నింగ్

ఏపీ మంత్రి కొడాలి నాని తిరుమలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మంత్రి కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో స్పందించారు. విగ్రహాలు విరిగిపోతే ఏంటని మంత్రి కొడాలి అనడం నిజంగా సిగ్గుచేటని అయన అన్నారు. అసలు కొడాలి వెనుక ఉన్న ఆ శక్తి ఎవరో... అందరికీ తెలుసని.. దీనిపై పెద్దగా బుర్రలు బద్ధలు కొట్టుకోవాల్సిన అవసరం లేదని తాను ఆ శక్తికి చేతులు ఎత్తి మొక్కుతున్నానని రఘురామరాజు వ్యాఖ్యానించారు. ‘‘కొడాలి వేంకటేశ్వర రావు (నాని) అలాగే అయన వెనుక ఉన్న అదృశ్య శక్తికి స్పష్టంగా చెబుతున్నా... రాబోయే రోజుల్లో చెయ్యి విరగ్గొడితే చెయ్యి.. కాలు విరగ్గొడితే కాలు విరగ్గొడతారు ఖబడ్దార్’’ అని మండి పడ్డారు .   ఢిల్లీలో ఈరోజు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన ఎంపీ రఘురామరాజు ‘‘అయ్యా.. కొడాలి వేంకటేశ్వరరావు.. ఎదో విరిగిపోతే దేవుడికి ఏంటి నష్టమని అడుగుతున్నారు. అయ్యా దేవుడి పరమ భక్తుడైన కొడాలి నాని గారు నష్టం దేవుడికి కాదు. మాకు నష్టం. మన హిందువులకు నష్టం.. మొత్తం మన హిందువుల మనసులను గాయపరుస్తున్నారు. అక్కడ తగలబెట్టింది రథాలను కాదు.. భక్తుల మనోరథాలను, విరగొట్టింది విగ్రహాలను కాదు.. భక్తుల మనోభావాలను గాయపరిచారు. మతోన్మాదంతో మీరు చేస్తున్న ఈ గాయాలకు తగిన శిక్ష అనుభవించే రోజు వస్తుంది. నన్ను బహిష్కరించానని చెప్పుకొనే శక్తి లేని నిస్సహాయ స్థితిలో మీరున్నారు. దేవాలయాలపై పార్లమెంట్‌లో మాట్లాడుతుంటే మీ సాటి కులస్థుడితో.. మీ సాటి మతస్తుడితో అల్లరి చేయిస్తారా? ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలారా.. కులాన్ని కులంతో.. మతాన్ని మతంతో... అదే మతంలో అతి పవిత్రంగా తిరుమల ఆచారాలను పాటించే కేబినెట్ సహచరుడితో ఇలా నాపై విమర్శలు చేయించడం అత్యంత హేయమైన చర్య. మీరు ప్రవేశపెట్టిన నాన్న బుడ్డి పథకాలకోసం... మీకు రివర్స్ వచ్చే పథకాలు చాలక... ఎక్కడా అప్పు పుట్టక మీ బంధువు ద్వారా స్వామి డబ్బుపై దృష్టి పెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. టీటీడీలో ఇద్దరు ఉన్నతాధికారులను మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందన్న అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి.’’అని ప్రభుత్వాధినేతల పై దుమ్మెత్తిపోశారు.   హిందువైన కొడాలి నాని కానీ, క్రిస్టియన్ అయిన సీఎం జగన్ కానీ... ఎవరూ కూడా మక్కాలో అడుగుపెట్టలేరు. ఎందుకంటే అది ముస్లింలకు పవిత్ర స్థలం. మసీదుల గురించి నానిమాట్లాడటం విచారకరం. మీ ఏరియాలో మీరు హీరోనే.. మీరు మాట్లాడితే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. దేవాలయాలపై దాడులు జరిగితే ఎవరికి నష్టం అని మీరు అంటున్నారు. మీ జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం లేదు కదా. నష్టం మాకు. రథం చేయంచుకుంటే ఎవరికి లాభం.. మీకు ఉండొచ్చు. అంతేకాకుండా వెండి పోతే కొనుక్కుంటారని మీరు చెబుతున్నారు. పోయింది కేవలం వెండి కాదండి... అది అమ్మవారి వెండి. మీరు విగ్రహాన్ని రాయిగా చూస్తున్నారు. మా దృష్టిలో దేవుడు. అక్కడ పోయిన సొమ్ము అమ్మవారికి చెందినది. మీరు ఒక హిందూ అయ్యి ఉండి.. ఓ క్రిస్టియన్ సీఎం చేతిలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఎన్నికల్లో గెలవాలంటే హిందూ మతం కావాలి. ఇంట్లో ఓ హిందూ దేవుడి ఫొటో ఉండదు. ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఎవరెవరు చర్చిలకు వెళుతున్నారో రాష్ట్రపతికి రిపోర్టు ఇచ్చాను. త్వరలో వివరాలు అందరికి తెలుస్తాయి. హిందువులు అంటే శాంతస్వభావులు. పెద్దగా తిరగబడరు. మా స్వభావం అలాగే ఉంటుంది. మీ వెనుక ఉన్న ఆ అదృశ్యశక్తికి చెబుతున్నా.. మా మతం జోలికి రాకండి. భరతమాత ముద్దుబిడ్డ ఇక్కడే మా వెనక ఉన్నారు. మీరు గౌరవించకపోయినా ఫర్వాలేదు. కానీ అవమానించకండి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పెద్దలు మాడభూషి శ్రీధర్ ఇప్పటికే ఓ లేఖ రాశారు. అది చదివితే అన్నీ తెలుస్తాయి. ఇక దేవుడి సొమ్మును కొట్టేసినోడు బాగుపడినట్టు ఈ ప్రపంచంలో లేదు. మేము మీ దేవుణ్ణి గౌరవిస్తాం. మీరు మా దేవుణ్ణి గౌరవించండి’’ అని వ్యాఖ్యానించారు.

కరోనా డేంజర్ బెల్స్... లక్షణాలు లేని రోగులతో మరింత ప్రమాదం

కరోనా మహమ్మారి మానవాళిని బెంబేలెత్తిస్తోంది. అయితే ఈ వైరస్ గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వచ్చి జనాన్ని భయపెడుతోంది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఒక సర్వేలో కొన్ని ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ చేసిన ఈ సర్వేలో కరోనా లక్షణాలు ఉన్నవారి కంటే ఎటువంటి లక్షణాలు లేని వారితోనే ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టు ఈ సర్వేలో తేలింది. ఎటువంటి లక్షణాలు లేని (అసింప్టమాటిక్) రోగుల్లోనే వైరస్ లోడు ఎక్కువగా ఉందని ఈ సర్వేలో స్పష్టమైంది. గత మే, జూన్ నెలల్లో హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కరోనా సోకిన 210 మంది రోగుల డేటాను విశ్లేషించిన తరువాత తాజాగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతేకాకుండా వీరిలో 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం కరోనా వైరస్ ఉన్నట్టుగా తెలుస్తోంది.   ఎటువంటి లక్షణాలు లేని రోగుల్లో ఇటు వైరస్ లోడు అధికంగా ఉండడంతోపాటు రోగ నిరోధక శక్తి కూడా అదే స్థాయిలో ఉండడంతో వారంతా బయటకు ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంటారని ఈ తాజా సర్వేలో తేలింది. ఈ రోగుల నుండి రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకి వారి మరణానికి కారణమవుతున్నట్టు తాజా సర్వే లో తేలింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ అని నిర్ధారణ అవుతోంది. మిగిలిన 30 శాతం మందిలోనే కరోనా లక్షణాలైన జ్వరం, దగ్గు, జలుబు వంటివి కనిపిస్తున్నాయి. దీంతో వైరస్ లోడు ఎక్కువగా ఉండే అసింప్టమాటిక్ రోగుల నుండి పిల్లలు, వృద్ధులకు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.

హైదరాబాద్ లో భారీ వర్షాలకు మరో వ్యక్తి బలి..

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలతో నగర ప్రజల జీవనం అతలాకుతలం అవుతోంది. మరో పక్క వరుస ప్రమాదకర సంఘటనలతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. కొద్ది రోజుల క్రితం నేరేట్‌మెట్‌కు చెందిన చిన్నారి సుమేధ సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లి నాలాలో పడి కొట్టకుపోయి ప్రాణాలు కొల్పోయిన సంగతి మరిచిపోకముందే.. వరదనీటిలో తాజాగా మరో వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన సరూర్‌నగర్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.    బాలపూర్‌ ప్రాంతంలోని 35 కాలనీలకు చెందిన వరదనీరు సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ లో వచ్చి కలుస్తాయి. గత వారం రోజులుగా నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు పెద్ద ఎత్తున మినీ ట్యాంక్‌బండ్‌ లోకి వచ్చి చేరుతున్నాయి. నిన్నరాత్రి అందరూ చూస్తుండగానే ఈ ప్రాంతంలో ఓ వ్యక్తి వరదనీటిలో పడి కొట్టుకుపోయాడు. బాలాపూర్ మండలం అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్ (32) అనే ఎలక్ట్రీషియన్ నిన్న రాత్రి సరూర్‌నగర్‌ చెరువుకట్ట మీద నుంచి తపోవన్‌ కాలనీ మీదుగా సరూర్‌నగర్‌ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీపై బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు దాటేందుకు కాసేపు అక్కడే నిరీక్షించిన నవీన్ కాసేపటి తర్వాత వరద నీటిని దాటే ప్రయత్నం చేశాడు. అయితే స్కూటీ అదుపుతప్పడంతో వరద నీటిలో పడి కొట్టుకుపోయాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే దీనిపై సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.    హైదరాబాద్ నగరంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు చోట్ల రోడ్లపైకి భారీగా నీళ్లు చేరడం తో పాటు నాలాలు పొంగిపోర్లడంతో బయటకు వెళ్లాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు.

సీఎం జగన్ కోసమే వైవీ ఏకపక్ష నిర్ణయం.. శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ఎవరూ ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మెన్  వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటన దుమారం రేగుతోంది. టీటీడీ చైర్మెన్ నిర్ణయంపై శ్రీవారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సీఎం జగన్ కోసమే ఆయన బాబాయ్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 23న సీఎం హోదాలో స్వామివారి గరుడ సేవ లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు జగన్మోహన్ రెడ్డి. గత ఏడాది కూడా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అయితే ఆలయంలో డిక్లరేషన్ ఇవ్వలేదు. సీఎం జగన్ తీరుపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. హిందూ సంఘాలు ఆందోళన కూడా చేశాయి. పలు ధార్మిక సంఘాలు ఈ విషయమై టీటీడీని   ప్రశ్నించాయి. దీంతో వారికి సరైన సమాధానం చెప్పుకోలేకపోయింది టీటీడీ బోర్డు. ఈసారి కూడా సీఎం జగన్  శ్రీవారి  గరుడ సేవకు వస్తుండటంతో మళ్లీ డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. దీంతో జగన్ కు ఇబ్బంది రాకుండా ఆయన బాబాయ్ అయిన చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి ఎక్కడా సంతకం పెట్టాల్సిన అవసరం లేదనే నిర్ణయం ప్రకటించారనే ఆరోపణలు వస్తున్నాయి.                             తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్యమతస్థులుగా కనిపించిన వారి దగ్గర నుండి కచ్చితంగా డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఈ నిబంధన ఎప్పటి నుండో వస్తుంది. ఇతర మతస్థులు శ్రీవారిని దర్శించుకోడానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. అయితే టీటీడీ విషయంలో సీఎం జగన్ తీరుపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. వైఎస్ కుటుంబమంతా క్రిస్టియన్ మతాచారాలను ఆచరిస్తున్నారు. చర్చీలకు వెళ్లి ప్రార్ధనలు చేస్తారు. జగన్ ఇంట్లోనే మత బోధకులు ఉంటారని, ఆయన కుటుంబంలో ఏ కార్యక్రమమైనా క్రైస్తవ పద్ధతిలోనే జరుగుతుందని రాష్ట్రమంతా తెలుసు. వైఎస్ కుటుంబ సభ్యులే వీటిని అంగీకరించారు. సో.. టీటీడీ నిబంధనల ప్రకారం వైఎస్ జగన్ శ్రీవారి ఆలయానికి వెళితే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాని జగన్ మాత్రం దీన్ని ఆచరించడం లేదు. ప్రతిపక్ష నేతగా గతంలో టీటీడీ ఆలయానికి వెళ్లినప్పుడు కూడా డిక్లరేషన్ ఇవ్వలేదు.    ఈసారి కూడా సీఎం జగన్ అలానే చేయవచ్చు. కాని టీటీడీ మాత్రం శ్రీవారి అలయానికి ఎవరూ వచ్చినా అభ్యంతరం లేదని, డిక్లరేషన్ అవసరం లేదని ప్రకటించింది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు వివాదమవుతోంది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి భంగం కలిగించేలా టీటీడీ వ్యవహరించిందనే ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీలో ఎప్పటి నుంచో వస్తున్న గొప్ప అచారాన్ని తొలగించడమేంటని శ్రీవారి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చూడటం కోసం కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించారని విమర్శిస్తున్నారు. అత్యంత  కీలకమైన, భక్తుల విశ్వాసాలకు సంబంధించిన డిక్లరేషన్ అంశంపై.. టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించారా లేక చైర్మెన్ ఒక్కరే నిర్ణయం తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.                           క్రిస్టియన్ గా ఉన్న సీఎం జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి. టీటీడీ రూల్స్ పాటించాల్సిందేనని, లేదంటే ఆలయానికి రాకుండా ఉండాలని సూచిస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి ముఖ్యమంత్రే పట్టు వస్త్రాలు ఇవ్వాలన్న రూలేమి లేదని.. మంత్రులు, అధికారులు కూడా ఇవ్వొచ్చంటున్నారు భక్తులు. గతంలో బ్రోహ్మత్సవాల్లో మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించిన సందర్భాలున్నాయని గుర్తు చేస్తున్నారు. ఇతర మతస్తులు శ్రీవారి ఆలయానికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పటి నుంచో వస్తున్న ఈ ఆచారాన్ని తప్పకుండా పాటించి తీరాలని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే తిరుమలలో అన్య మత ప్రచారం జరుగుతుందని.. టీటీడీ తీసుకుంటున్న ఇలాంటి చర్యలతో ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.    భారత రాష్ట్రపతి హోదాలో తిరుమలకు వచ్చిన అబ్దుల్ కలాం డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు యూపీఏ చైర్ పర్సన్ గా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళగా గుర్తింపు పొందిన సోనియా గాంధీ కూడా టీటీడీ రూల్స్ పాటించారు. డిక్లరేషన్ ఇచ్చాకే ఆమె ఆలయంలో ఎంట్రీ ఇచ్చారు. దేశంలోని పలువురు ఇతర మతాల ప్రముఖులు కూడా తిరుమల వచ్చినప్పడు.. డిక్లరేషన్ ఇచ్చారు. అబ్దుల్ కలాం, సోనియా గాంధీ వంటి ప్రముఖులే తిరుమలకు వచ్చినప్పుడు డిక్లరేషన్ తీసుకున్న సందర్భాలున్నాయని.. జగన్ కు వచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్న శ్రీవారి భక్తుల నుంచి వస్తోంది.    ఇక టీటీడీ బోర్డు నిర్ణయాలపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించకపోవడాన్ని శ్రీవారి భక్తులు, హిందూ ధార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. హిందూ మత రక్షకుడిగా చెప్పుకునే స్వరూపానందేంద్ర స్వామి .. అన్యమతస్తులకు సంబంధించిన డిక్లరేషన్ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ చైర్మెన్ నిర్ణయాన్ని ఆయన అంగీకరిస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అంతర్వేది రథం దగ్ధం, బెజవాడ దుర్గమ గుడిలో వెండి సింహాలు మాయమైనా స్వామి స్పందించలేదని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నా, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోరా అని నిలదీస్తున్నారు. గతంలో ఆలయంలో ఏ చిన్న ఘటన జరిగినా ఏదో జరిగిపోయినట్లు హడావుడి చేసిన స్వరూపానందేంద్ర స్వామి.. ఇంత పెద్ద ఘటనలు జరుగుతున్నా, భక్తుల విశ్వాసాలకు భంగం కలిగే చర్యలను ప్రభుత్వాలు తీసుకుంటున్నా కనిపించడం లేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. స్వామిజీలు రాజకీయాలు చేయకుండా హిందూ ధర్మ రక్షణకు పాటుపడాలని కోరుతున్నారు.

నింగీ, నేల, నీరు మనదే.. సునీతా విలియమ్స్ (19సెప్టెంబర్ 1965)

సునీతా విలియమ్స్ పేరు వినగానే.. అంతరిక్ష యానంలో ఆమె చేసిన సాహసాలు గుర్తుకు వచ్చి ప్రతి మహిళ గర్వంగా ఫీల్ అవుతారు. యునైటెడ్ స్టేట్స్ నావికా దళ అధికారిగా పనిచేసిన ఆమె నాసా వ్యోమగామి. రెండుసార్లు అంతరిక్ష యానం చేయడంతో పాటు నాలుగు సార్లు స్పేస్ వాక్ చేసి రికార్డు సృష్టించారు.  ఎక్కువ రోజులు (322రోజులు) అంతరిక్షంలో ఉన్న మహిళా వ్యోమగామిగా  ప్రపంచ చరిత్రలో తన పేరు నమోదు చేసుకున్నారు. అంతేకాదు నీటి అడుగుభాగంలో తొమ్మిదిరోజులు ఉండి మరొ కొత్త రికార్డును ఆమె తన ఖాతాలో జమచేసుకున్నారు. ప్రస్తుతం నాసాలో వ్యోమగాములకు శిక్షణ ఇస్తున్నారు. సునీతా విలియమ్స్ యూక్లిడ్, ఒహియోలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు డాక్టర్ దీపక్ పాండ్య, బొన్నీ పాండ్య. దీపక్ పాండ్య తండ్రి, తాత భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. సునీత మసచుసేట్స్ లోని నీధం హై స్కూల్ లో చదివారు. 1987లో యు.ఎస్. నావల్ అకాడమీ నుండి భౌతికశాస్త్రంలో బి.ఎ. పట్టా అందుకున్నారు. యుద్ధ విమానాల పైలట్‌గా నియమించబడిన  ఆమె నావల్ టెస్ట్ పైలట్ స్కూలు నుంచి 1993లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1995లో ఎం.ఎస్సీ, పట్టా అందుకున్నారు. ఆ తర్వాత  1998లో నాసాకు ఎన్నికయ్యారు. పైలట్ శిక్షణ పొందిన  సునీత  వ్యోమనౌకలో పయనించడంతో పాటు నాసా అంతరిక్షంలో ఏర్పాటుచేసిన స్పేష్ స్టేషన్ లోనూ పనిచేశారు. విలియమ్స్ ఎఎస్-116 అంతర్జాతీయ అంతరిక్ష స్టేషనుకు డిస్కవరీ వ్యోమనౌకలో మొదటిసారి డిసెంబర్ 9, 2006లో పయనమయ్యారు. ఏప్రిల్ 2007లో తిరిగి భూమి మీదకు వచ్చారు. రికార్డు స్థాయిలో విలియమ్స్ 195రోజులు అంతరిక్షంలో ఉన్నారు. నింగిలోనే కాదు నీటిలోనూ ఆమె సాహసాలు చేశారు. నీమో2 సంస్థలో సభ్యత్వం పొందిన ఆమె నీటి అడుగు భాగంలో ఉండే ఆక్వాటిక్ లో తొమ్మిది రోజులు ఉన్నారు. సునీతా పూర్వీకులు భారతీయులు కావడంతో ఆమె 2007లో ఇండియాకు వచ్చారు. రన్నింగ్, స్విమ్మింగ్, బైకింగ్, ట్రయాథాన్, స్నోబోర్డింగ్, హంటింగ్ ఆమె అభిరుచులు. ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సునీతా అందుకున్నారు.

చైనాలో బయట పడ్డ మరో కొత్త జబ్బు

కరోనా వైరస్ ను ప్రపంచానికి వ్యాపింప జేసిన చైనాలో మరో ఉపద్రవం ముంచుకు వస్తుంది. వాయువ్య చైనాలో బ్రూసె ల్లోసిస్   అనే బ్యాక్టీరియా ద్వారా కొన్నివేల మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ బ్యాక్టీరియా కారణంగా మగవారి శరీరభాగాల్లో వాపు, వృషణాలు ఎర్రబడటం, సంతాన హీనత వంటి దీర్ఖకాలిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. శుభ్రత లేని ఆహారం తీసుకున్నప్పుడు ఇది మనుషుల్లో కి వ్యాపించి ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా మారుతుందని గన్సు ప్రావిన్స్  రాజధాని నగరం లాన్జౌ ఆరోగ్య కమిషన్ స్పష్టం చేసింది. వారి లెక్కల ప్రకారం  3,245 మందికి ఈ వ్యాధి సోకింది. చైనాలో వేలాది మంది పురుషులను వంధ్యత్వానికి గురిచేసే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం పరీక్షలు నిర్వహించినప్పుడు ఈ విషయం బయటపడింది. చైనాలో  పశువులపై ఉండే బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. వాయువ్య చైనాలో అనేక వేల మంది ప్రజల్లో బ్రూసెల్లోసిస్ బ్యాక్టీరియా వ్యాధికి నిర్ధారణ పరీక్షలు చేసినట్లు చైనా అధికారులు ధృవీకరించారు. పరీక్షలు నిర్వహించిన 21వేల మందిలో 3245 పాజిటివ్ కేసులు బయటపడ్డాయని  చెప్పారు. బ్రూసెల్లోసిస్  బ్యాక్టీరియా సోకిన వారిలో  వచ్చే అనారోగ్యాన్ని మాల్ట ఫీవర్ లేదా మెడిటేరియన్ ఫీవర్ గా పిలుస్తారు.  తలనొప్పి, కండరాల నొప్పులు,  జ్వరం,  అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయని యునైటెడ్ స్టేట్స్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్  అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తెలిపింది. ఈ లక్షణాలు చికిత్స తర్వాత తగ్గినప్పటికీ వ్యాధి సోకిన వారు దీర్ఘకాలంలో ఆర్థరైటిస్, కొన్ని అవయవాలలో ముఖ్యంగా వృషణాలు వాపు , ఎర్రబడటం వంటి  సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. అంతేకాదు సంతాన హీనతకు ఈ బ్యాక్టీరియా కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు.  బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ఉన్న పశువులతో సంపర్కం వల్ల సంభవిస్తుందని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మగవారిపైనే దీని దుష్ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధి మనుషులకు సంక్రమించడం చాలా అరుదు అని సిడిపి స్పష్టం చేసింది.  కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం, శ్వాస ద్వారా బ్యాక్టీరియా శరీరంలోకి చేరడం వల్ల ఎక్కువగా వ్యాపిస్తుంది. వాపు, ఎర్రబడిన వృషణాలు  కొంతమంది మగవారిని వంధ్యత్వానికి గురిచేస్తాయని హెచ్చరిస్తున్నారు. సిఎన్ఎన్ నివేదిక ప్రకారం గత ఏడాది జూలై చివరి వారం,  ఆగస్టు మొదటి వారం మధ్యకాలంలో  లాన్జౌ బయోలాజికల్ ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో లీకేజ్ ద్వారా ఈ బ్యాక్టీరియా  వ్యాప్తి చెందింది. జంతువుల కోసం బ్రూసెల్లా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని వివరిస్తున్నారు.  ఫ్యాక్టరీలో అవుట్ డేటెడ్ మందులు, శానిటైజర్లు ఉపయోగించడంతో ఈ బ్యాక్టీరియా అలాగే ఉండిపోయిందని అంటున్నారు. ఈ వ్యాధి సోకిందన్న అనుమానంతో  21,000 మందిని పరీక్షించడంతో ఇన్ఫెక్షన్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేలింది. అయితే ఇంతవరకు ఈ వ్యాధి కారణంగా ఎవరూ చనిపోలేదని చైనా పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కోంది. అయితే ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య  ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని, వ్యాప్తిని నివారించడానికి  చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ పత్రిక తెలిపింది. చైనాలో పుట్టి ప్రపంచమంతా వ్యాపించిన కోవిడ్ 19 వైరస్ వ్యాప్తినే  అరికట్టలేక గత కొన్ని నెలలుగా ప్రపంచదేశాలన్నీ ఆందోళన చెందుతుంటే కొత్తగా  ఈ బ్యాక్టీరియా వ్యాప్తి  మరింత ఆందోళన కలిగిస్తుంది.      

త్వరలో రోడ్డెక్కనున్న హైదరాబాద్ సిటీ బస్సులు

గడచిన మార్చి నెలలో కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా జనతా కర్ఫ్యూ తరువాత హైదరాబాద్ లో సిటీ బస్సులు రోడ్డెక్కని సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుండి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నప్పటికీ హైదరాబాద్ లో సిటీ బస్సులు మాత్రం రోడ్డెక్కలేదు. కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ సడలింపులతో నగరంలోని మెట్రో రైలును కూడా కొన్ని షరతులతో తిరిగి ప్రారంభించినా సిటీబస్సులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనికి ప్రధాన కారణం కరోనా నిబంధనలతో సిటీ బస్సులలో రద్దీని కంట్రోల్ చేయడం కష్టమని సర్కార్ భావించిందని వార్తలు వచ్చాయి.   అయితే తాజాగా గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో ఆర్టీసీ బస్సుల‌ను పున ప్రారంభించేందుకు ముహుర్తం ఖ‌రారు అయ్యింది. క‌రోనా సమస్య ఉన్నప్పటికీ ఇత‌ర రాష్ట్రాల్లోని మెట్రో న‌గ‌రాల్లో సిటీ బ‌స్సులు ఎప్పుడో ప్రారంభం అయ్యాయి. ముంబై, చెన్నై, బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లో ఇప్పటికే బ‌స్సులు తిరుగుతుండ‌టంతో… అక్క‌డ ప‌రిస్థితులను అధ్య‌య‌నం చేసిన తెలంగాణ‌ ఆర్టీసీ అధికారులు.. మొద‌ట ద‌శ‌లో 50శాతం బ‌స్సుల‌ను నడిపి, తరువాత ద‌శ‌ల వారీగా బస్సులను పెంచాల‌ని డిసైడ్ అయిన‌ట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ప్ర‌యాణికుల‌ను కేవ‌లం సీట్ల వ‌ర‌కే పరిమితం చేయాలనీ నిలబడి, లేదా కిక్కిరిసేలా ప్ర‌యాణికుల‌ను ఎక్కించకూడదని అధికారులు నిర్ణ‌యించారు. దీంతో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండే 7 రూట్లలో సిటీ బస్సు సర్వీస్‌లు ముందుగా ప్రారంభించే అవకాశం ఉంది. ఒకసారి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెలాఖరుకు సిటీ బస్సులు ప్రారంభమయ్యే అవ‌కాశం ఉంది.

భారత్ లో భారీ విధ్వంసానికి కుట్ర... 9 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్ట్

మనదేశంలో విధ్వంసానికి పథకం రచించిన ఉగ్రవాదుల కుట్ర మరోసారి భగ్నమైంది. దేశంలో భారీ విధ్వంసం సృష్టించేందుకు అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ ఈ కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. అల్ ఖైదాకు చెందిన అంతర్రాష్ట్ర ఉగ్రవాద ముఠా దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాల్లో దాడులు చేయాలని కుట్ర చేసినట్లు నిఘా వర్గాల ద్వారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) కి సమాచారం అందింది. దీంతో పక్కా సమాచారంతో ఈరోజు ఉదయం కేరళలోని ఎర్నాకుళం, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు చేసి 9 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎర్నాకుళంలో ముర్షద్ హసన్, ముషారఫ్ హుసేన్ ఇయాకుబ్ బిశ్వాస్ ‌తో పాటు పశ్చిమ బెంగాల్‌కు చెందిన అబు సూఫియాన్, నజ్ముస్ షకీబ్, మైనుల్ మోండల్, అల్ మమున్ కమల్, లీ యీన్ అహ్మద్, అతితుర్ రెహమాన్ ఉన్నారు. వారి వద్ద నుంచి కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డివైజులు, జిహాది సాహిత్యం, ఆయుధాలు, కంట్రీమేడ్ తుపాకులు, శరీర రక్షణ కవచాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ తెలిపింది.   అరెస్టు అయిన అల్ ఖైదా ఉగ్రవాదులు పాకిస్థాన్ కు చెందిన అల్ ఖైదా ఉగ్రవాదుల సోషల్ మీడియా ద్వారా స్ఫూర్తి పొందారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. వీరిలో కొందరు ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారని. అక్కడ తుపాకులు, బాంబుల తయారీకి వాడే ముడి పదార్థాలు, ఇతర ఆయుధాలను సేకరించాలని వారు భావించినట్లుగా అధికారులు తెలిపారు. అంతేకాకుండా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ, ఎన్‌సీఆర్ తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ఈ అల్ ఖైదా ఉగ్రవాదులు కుట్ర పన్నారని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఎన్ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు.

జగన్ సర్కార్ కు మరో కొత్త తలనొప్పి.. వైవీ సుబ్బారెడ్డి పై మండిపడ్డ ఐవైఆర్

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని టీటీడీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్య మతస్థులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తాజాగా చెప్పారు.   అయితే దీనికి సంబంధించి ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు స్పందిస్తూ "ఈ నిబంధన ఈనాటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీలో కొనసాగుతున్న నిబంధన. విద్యార్థి దశలో తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు మాతోపాటు క్యూలో ఉన్న విదేశీయుడిని డిక్లరేషన్ సంతకం పెట్టిన తర్వాత దర్శనానికి అనుమతించారు". అంతేకాకుండా "సోనియా గాంధీ దర్శనానికి వచ్చినప్పుడు కూడా నాటి కార్యనిర్వహణాధికారి ఈ డిక్లరేషన్ కొరకు గట్టిగా పట్టుబట్టి కొందరు నేతల ఆగ్రహానికి గురయ్యాడు. ఈనాడు ఉన్న ఫళంగా ఈ మార్పు తీసుకుని రావాల్సిన అవసరం ఏమి వచ్చిందో టీటీడీ అధ్యక్షులు సెలవిస్తే బాగుంటుంది" అని ఐవైఆర్ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పై మండి పడ్డారు.   అంతేకాకుండా "రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదు. నమ్మకం లేని నాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి కూడా నిర్వహించవచ్చు" అని ఐవైఆర్ కృష్ణారావు మరో కీలక వ్యాఖ్య చేసారు. ఇప్పటికే రాష్ట్రం లో నిత్యం హిందూ ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న దాడులతో ఉక్కిరిబిక్కరి అవుతున్న జగన సర్కార్ కు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజా నిర్ణయం మరో కొత్త తలనొప్పి అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పేటీఎం మళ్లీ వెనక్కీ - గూగుల్ ప్లేస్టోర్ లోఅందుబాటు

పేటీఎం కరో అంటూ విసృత్త ప్రచారంతో దాదాపు ఐదు కోట్లమందికి చేరువైన పేటీఎం యాప్ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి  తొలగించిన కొన్ని గంటల్లోనే తిరిగి యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్థికలావాదేవీలను డిజిటలైజ్ చేసిన ఈ యాప్ ను తొలగించడానికి కారణాలు గూగుల్ వివరించింది. పేటీఎం సంస్థ గ్యాంబ్లింగ్‌ నిబంధనలు చాలా సార్లు ఉల్లంఘించిందని.. పదేపదే చెప్పినా , నోటీసులు జారీ చేసినా ఆ సంస్థ తీరులో మార్పు లేదని గూగుల్ ప్రకటించింది. గూగుల్‌ సంస్థ నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌ బెట్టింగులు నిషేధం. అయితే  పేటీఎం, పేటీఎం ఫస్ట్‌గేమ్‌ యాప్స్‌ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చి వాటి ద్వారా గేమ్స్ ఆడే అవకాశం కల్పిస్తోంది. దీంతో చాలామంది డబ్బులు కోల్పోయారు. బెట్టింగులు ప్రోత్సహించేదిగా ఉండటంతో గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకుంది.  పేటీఎం, పేటీఎం ఫస్ట్ గేమ్స్ యాప్స్ ను గూగుల్ తొలగించింది. అయితే పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం గూగుల్ ప్లేస్టోర్ లో యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. పేటీఎంకు దాదాపు ఐదు కోట్ల మంది యూజర్లు ఉన్నారు.  గూగుల్ చర్యపై స్పందించిన పేటీఎం వెంటనే స్పందించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించబడిన కొన్ని గంటల్లోనే ‘Update: And we are back’ అంటూ ట్వీట్టర్ ద్వారా వినియోగదారులకు సమాచారం చేరవేసింది. ఇంతకుముందులానే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. యూజర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేటీఎం స్పష్టం చేసింది. పేటీఎంతో లింకై ఉన్న అన్ని అకౌంట్లు నూటికి నూరుశాతం  సేఫ్ అని ట్విట్ట్ చేసింది.దాంతో గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించిన కొన్ని గంటల్లోనే తిరిగి అందుబాటులోకి వచ్చింది. ఇటీవల సోషల్ మీడియా దిగ్గజాలైన సంస్థలు తమ ఖాతాదారుల చర్యలను గమనిస్తూ వారిపై నిబంధనల ఉల్లంఘన చర్యలను తీసుకోవడం గమనించదగిన విషయం.  

ఉత్తరాంధ్రలో టీడీపీకి పెద్ద షాక్.. సీఎం జగన్ కు జై కొట్టనున్న మరో ఎమ్మెల్యే

ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగలనుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార వైసిపిలో చేరడమో లేక ఆ పార్టీకి సపోర్ట్ గా ఉండడమో చేస్తుండగా తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే టీడీపీకి దూరం కానున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఈరోజు ఆయన సీఎం జగన్‌ను కలవనున్నారు. జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లుగా తెలుస్తోంది.    ఇప్పటికే గత కొంతకాలంగా టీడీపీ కార్యక్రమాలకు వాసుపల్లి గణేష్‌ దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పటికే వైసీపీలో అధికారికంగా చేరకుండా ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటలోనే వాసుపల్లి గణేష్ కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే గణేష్ సీఎం జగన్‌ను కలిసినా వైసీపీ కండువా కప్పుకోకుండానే ఆ పార్టీకి మద్దతు తెలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.    మరో పక్క వాసుపల్లి గణేష్ టీడీపీ గుడ్ బై చెప్పడం వల్ల టీడీపీకి భారీ నష్టమే జరుగుతుంది. ఇప్పటికే విశాఖను కార్యనిర్వహక రాజధానిగా చేయడానికి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ చేరిక వైసిపికి మరింత బలాన్ని చేకూర్చే అవకాశం ఉంది.

నీకు మెంటలా అంటూ సీఐకి వార్నింగ్.. మరో వివాదంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి  

ఏపీ రాజధాని ప్రాంత వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిని ఒక దాని తరువాత ఒకటి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఒక వైసిపి కార్యకర్త వద్ద ఎన్నికల సమయంలో 1.40 కోట్లు తీసుకుని అందులో కొంత మాత్రమే చెల్లించగా మిగిలిన 80 లక్షలు తిరిగి చెల్లించమంటే అతడిని బెదిరించినట్లుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు పేకాట క్లబ్ నిర్వహణలో ఎమ్మెల్యే హస్తముందని విమర్శలు వచ్చాయి. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక పోలీస్ అధికారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే శ్రీదేవి పేరుతో తాజాగా ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో సీఐని నోటికొట్టినట్లు ఆమె దూషించారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని పట్టుకున్నందుకు సీఐకి ముక్క చివాట్లు పెట్టారు. వాళ్లు నా మనషులు.. వదలిపెడతావా? లేదా? అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. తాను కనుక తలుచుకుంటే రెండు నిమిషాల్లోనే వెళ్లిపోతావ్ అంటూ ఆ సిఐ పై ఎమ్మెల్యే శ్రీదేవి మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ ఆడియో క్లిప్‌పై తీవ్ర దుమారం రేగుతోంది.   ఆ ఫోన్ సంభాషణలో ఏముందంటే.. హలో.. నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా? వాళ్లను పంపేయొచ్చుగా.. నీకేమైనా మెంటలా? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్. నేనంటే రెస్పెక్ట్ లేదా? అందరినీ వదిలిపెడతావ్. మా వాళ్లను మాత్రం వదలిపెట్టవా..? నాన్సెన్స్.. అసలు నీవు పంపిస్తావా? లేదా చెప్పు. నువ్వు నా కాళ్లు పట్టుకుని ఇక్కడికి పోస్టింగ్ తెచ్చుకున్నావ్. నేను చెప్పింది చేస్తానని ఆ రోజు చెప్పావు. ఇప్పుడు ఎమ్మెల్యేనని కూడా చూడకుండా కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నావ్. నేను తలచుకుంటే రెండు నిమిషాల్లో ఇక్కడి నుండి వెళ్లిపోతావ్.. ఎక్స్ ట్రాలు చేయొద్దు.. మావాళ్లను వదిలిపెట్టు. లేదంటే ఎస్పీకి, డీజీపీకి చెబుతా.. అని ఆ వైరల్ ఆడియో క్లిప్‌లో ఉంది.   అయితే దీనికి సమాధానంగా సీఐ మాట్లాడుతూ అక్రమంగా మట్టి, ఇసుక తరలించడానికి వీల్లేదని చెబుతున్నట్లు ఆ ఆడియోలో ఉంది. అక్రమ మట్టి, ఇసుక తరలింపుపై ఉక్కుపాదం మోపడం రాష్ట్ర ప్రభుత్వ పాలసీ అని, అంతేకాకుండా ఇలా చేస్తే మీకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆయన ఎమ్మెల్యేకు నచ్చచెప్పే ప్రయత్నం చేసారు. దీంతో నా మాటంటే నీకు లెక్కలేదా అని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నట్లుగా ఆ ఆడియో క్లిప్ లో ఉంది. ఈ ఆడియోపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అధికారులను బెదిరించడమేమంటని ప్రతిపక్షాల నేతలు మండిపడుతున్నారు.

10 వేల మందితో పులివెందులలో సభ పెట్టే దమ్ముంది నాకు.. రఘురామరాజు

వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తన తోటి వైసిపి ఎంపీలపై మరోసారి ఫైర్ అయ్యారు. తన తోలు తీస్తామంటూ నిన్న వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలపై రఘురామ రాజు తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తన ఒంటిపై చేయి పడితే తనను కాపాడేందుకు హేమాహేమీలు ఉన్నారని... ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థితిలో తాను లేనని ఆయన స్పష్టం చేసారు. న్యాయవ్యవస్థలను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా తమ పార్టీ వైసిపి పనిచేస్తోందని అయన వ్యాఖ్యానించారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పెట్టుకున్నారన్నారు. అయితే తనను బహిష్కరించే దమ్ము వారికి లేదన్నారు.   ఎంపీ రఘురామకృష్ణం రాజు మీడియాతో మాట్లాడుతూ ‘‘తోలు తీయడం నా వృత్తి కాదండి. వారు బహుభాషా కోవిదులు. అలా మాట్లాడటం కాస్తో కూస్తో వచ్చినా... నాలో నేను మాట్లాడతాను కానీ.. ప్రజలు అసహ్యించుకొని.. ఉమ్మేసేలా మాట్లాడటం నాకు చేతకాదు. దానికి నేనేమీ చేయలేను. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90శాతం మంది ఉన్నారు. అయితే ఇలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు కూడా నాకున్నారు. ఎంపీ రాజా భయ్యా.. నాకు మంచి స్నేహితుడు. అయన అసలు పేరు రఘు రాజ్ ప్రతాప్. రాజా భయ్యా మాత్రమే కాదు.. నన్ను కంటికి రెప్పలా కాపాడేవాళ్లు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. నా ఒంటిపై చిన్న చేయి పడితే.. దానికి స్పందించి.. నన్ను కాపాడగలిగే వ్యక్తులు, స్నేహితులు అటు రాయలసీమలో కూడా ఉన్నారు. పులివెందులలో కూడా నా స్నేహితులు ఉన్నారు. పదివేల మందితో పులివెందులలో సభ పెట్టగల కెపాసిటీ నాకు ఉంది. అయితే ఈ విషయాలన్నీ కరోనా తగ్గిన తర్వాత చూద్దాం. న్యాయస్థానాల్లో నాకు న్యాయం జరుగుతుంది’’ అని అయన తెలిపారు.

హాట్ గా ఆ ఎమ్మెల్సీ సీటు.. రేసులో కోదండ, జర్నలిస్టులు! కారణమిదేనా? 

నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి హాట్ సీటుగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానంతో పాటు ఈ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. అయితే హైదరాబాద్ కంటే వరంగల్ స్థానంలో పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. టీజేఎస్ చైర్మెన్ కోదండరామ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తారని ఇప్పటికే ప్రచారం జరుగుతుండగా.. పలువురు సీనియర్ జర్నలిస్టులు కూడా బరిలో ఉంటామని ప్రకటించారు. ప్రజా సంఘాల నేతలు కూడా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతమిస్తున్నారు.    తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన చెరుకు.. పలు సార్లు జైలుకు కూడా వెళ్లారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి తీన్మార్ మల్లన్న గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. పట్టభద్రులను కలిసేందుకు, కొత్త ఓటర్ల నమోదు కోసం వేదికను కూడా సిద్ధం చేసింది మల్లన్న టీమ్. ఇప్పటికే  సోషల్ మీడియాలో ఆయనకు మద్దతుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తెలుగు మీడియాలో యాంకర్ గా చాలా కాలం పని చేసిన రాణి రుద్రమాదేవి కూడా ఎమ్మెల్సీ బరిలో ఉంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆమె ప్రస్తుతం యువ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ పార్టీ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. టీ న్యూస్ సీనియర్ జర్నలిస్ట్ పీవీ శ్రీనివాస్ కూడా ఎమ్మెల్సీ స్థానానికి  పోటీ చేయబోతున్నానని ప్రకటించారు. తనకు మద్దతు ఇవ్వాలని ఆయన సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. టీవీ9లో సుదీర్ఘ కాలం పని చేసిన సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్ కూడా ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే వీరిలో ఎంతమంది చివరి వరకు పోటీలో ఉంటారన్నది మాత్రం తెలియడం లేదు. గతంలోనూ కొందరు జర్నలిస్టులు పోటీకి ముందుకు వచ్చి ..చివరి నిమిషంలో బరి నుంచి తప్పుకున్నారు.    నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల సీటుపైనే అందరూ ఫోకస్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సీటుపైనే ఎందుకంత ఆసక్తి అన్న చర్చ కూడా జరుగుతోంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలపై  సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడం, పాలమూరు పనులను పట్టించుకోకపోవడంపై దక్షిణ తెలంగాణ ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లోనూ ఇదే తేలింది. ఇక ఉస్మానియా యూనివర్శిటీ ప్రభావం ఈ జిల్లాలపై ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా విద్యార్థి నేతలంతా ఎక్కువగా ఈ మూడు జిల్లాలకు చెందిన వారే. ఉస్మానియా ఓల్ట్ విద్యార్థులు ఈ జిల్లాల్లో వేలల్లో ఉంటారు. ఈ మూడు జిల్లాల పరిధిలో ఎక్కువగా నిరుద్యోగులు ఎమ్మెల్సీ ఓటర్లుగా ఉన్నారు. కేసీఆర్ సర్కార్ ఉద్యోగ ప్రకటనలు ఇవ్వడం లేదనే కోపంలో ఉన్నారు వారంతా. ఇవన్ని తమకు కలిసి వస్తాయని.. ఈ సీటు నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలిచే అవకాశాలుంటాయని పోటీ చేయాలనుకునే వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోటీలో ఉంటామన్న జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలంతా ఉస్మానియా యూనివర్శిటీతో అనుబంధం ఉన్నవారే. దీంతో తమకు ప్రచారం ఈజీగా ఉంటుందని వారంతా ఈ సీటును ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.    హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ కూడా దక్షిణ తెలంగాణే అయినా.. ఎక్కువ ఓటర్లు గ్రేటర్ పరిధిలోనే ఉంటారు. సిటీలో ఉన్నవారికి సాగు నీటి ప్రాజెక్టులు, వాటాలో అన్యాయం వంటి విషయాలను ఎక్కువగా పట్టించుకోరు. ఈ సీటు పరిధిలో ఉద్యోగస్తులే ఎక్కువగా ఉంటారు. ఎన్నికల్లో వారు  ఏ స్టాండ్ తీసుకుంటారో ఊహించడం కష్టం. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతూనే.. అధికార పార్టీకు  సపోర్ట్ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్సీ ఓటర్లను గుర్తించడం కష్టమనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే హైదరాబాద్ సీటులో పోటిపై పార్టీల నుంచి కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి.. కాని వరంగల్ మాదిరి తటస్టులు, జర్నలిస్టులు, ప్రజా సంఘాల నేతలెవరు ఇంట్రెస్ట్ చూపడం లేదు.     పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జర్నలిస్టులు, తటస్థులు, ప్రజా సంఘాల నేతలు  పోటీ చేస్తుండటంతో ప్రధాన పార్టీలకు టెన్షన్ పట్టుకుంది. జర్నలిస్టుల ప్రచారంతో ప్రభుత్వంపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని అధికార పార్టీ ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఈ స్థానాానికి ఎమ్మెల్సీగా మండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన పల్లా.. ఓటమి భయంతోనే పోటీ చేయడానికి ఇష్ట పడటం లేదని టీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నారు. అందుకే పట్టభద్రుల స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన పీవీ శ్రీనివాస్ కు టీఆర్ఎస్ మద్దతు ఇచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జర్నిలిస్టులు, తటస్టులు ఎక్కువ మంది పోటీ చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలి తమకు నష్టం కలుగుతుందని కాంగ్రెస్, బీజేపీ అంచనా వేస్తున్నాయి.

వెండి రథం సింహాలు మాయం ఘటనలో ట్విస్ట్.. సబ్ కాంట్రాక్టర్ వెంకట్‌ మిస్సింగ్!! 

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి రథానికి ఉండాల్సిన నాలుగు సింహాల్లో మూడు సింహాలు మాయమైన ఘటన ఏపీలో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయని, వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, అధికార పార్టీ మాత్రం.. విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని, అసలు ఆ రథాన్ని తాము అధికారంలోకి వచ్చాక ఉపయోగించలేదని, గత ప్రభుత్వ హయంలోనే ఆ వెండి సింహాలు మాయమై ఉంటాయని చెప్పుకొస్తుంది. ఇక ఆలయ ఈవో సంగతి సరేసరి. అసలు ఆ సింహాలు అంతకముందు ఉన్నాయో లేదో, ఉన్నా అసలు ఆ సింహాలు వెండివో కాదో రికార్డ్స్ చూసి చెప్తాం అంటూ వింత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు.   ఇదిలా ఉంటే, వెండి రథం సింహాలు మాయం ఘటన మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే క్రైమ్ బ్రాంచ్ డిసిపి కోటేశ్వరరావు రథాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే, ఆలయానికి సంబంధించి వెండి, బంగారం, ఇత్తడి పొలిషింగ్ కి నెలకి 47వేలు రూపాయలు చొప్పున శ్రీ శర్వాని ఇండస్ట్రీ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ శ్రీ శర్వాని ఇండస్ట్రీ నుండి వెంకట్ అనే వ్యక్తి సబ్ కాంటాక్ట్ తీసుకున్నారు. ఈ ఏడాది ఉగాది(మార్చి  2020)కి రథాన్ని సిద్ధం చేసేందుకు 15 రోజుల ముందు రథాన్ని సబ్ కాంట్రాక్టర్ వెంకట్ చూసినట్లు పోలీసులు చెబుతున్నారు.   మరోవైపు, దేవస్థానానికి చెందిన అప్రైజర్ షమీ, స్తపతి షణ్ముకం, ఏఈవో ఎన్.రమేష్ ల నుంచి రథం వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రథానికి నాలుగు సింహాలు ఉన్నాయని అప్రైజెర్ షమీ కి వెంకట్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని షమీ పోలీసులకు చెప్పారని సమాచారం.   ఈ కేసులో సబ్ కాంట్రాక్టర్ వెంకట్‌ స్టేట్‌మెంట్ కీలకం కానుంది. అయితే ప్రస్తుతం వెంకట్ అందుబాటులో లేరు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దీంతో, వెంకట్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.   గత రెండు రోజులుగా వెండి సింహాలు మాయం మీ హయాంలో అంటే మీ హయంలో జరిగింది అంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ.. చివరిసారిగా రథాన్ని సబ్ కాంట్రాక్టర్ వెంకట్ చూసాడని తెలియడం, ఇప్పడు అతను అందుబాటులో లేకుండా పోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

ఆ బెంజ్ కారు నాదని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడిగా ఉన్న కార్తీక్.. మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడని ఆరోపించారు. ఏ సంబంధంతో కార్తీక్ కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలని అన్నారు. ఏ 14 కార్తీక్ మంత్రి జయరాంకు బినామీ. ఆ కారు మంత్రికి అతడు ఇచ్చిన లంచం అని ఆరోపించారు. అంతేకాకుండా, మంత్రి కొడుకుకు ఈఎస్ఐ స్కామ్ లో ఏ 14 నిందితుడుగా ఉన్న కార్తీక్ గిఫ్ట్ అందిస్తున్న కారు ఫోటోను అయ్యన్నపాత్రుడు మీడియాకు విడుదల చేసారు. ఈ ఫోటోను కార్తీక్ తన ఫేస్‌బుక్ లో కూడా పోస్టు చేశాడని ఆయన చెప్పారు.   అయ్యన్నపాత్రుడు చేసిన బెంజ్ కారు లంచం ఆరోపణలపై మంత్రి జయరాం స్పందించారు. అయ్యన్న మతిభ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బెంజ్ కారు తనదే అని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఆ కారు ఎవరి పేరు మీద ఉందో చూసుకోవచ్చన్నారు. తన కుమారుడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని.. అలా తన కొడుకు చేతుల మీదుగా ఎవరైనా ఫ్యాన్స్ కారు కీస్ తీసుకుంటే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఏదో ఫ్రెండ్స్ హైదరాబాద్ లో కలిశారు. కారు తీసుకున్నప్పుడు ఫోటోలు దిగారు. అయ్యన్న ఒకటే ఫోటో చూపించారు..ఇంకా నాలుగైదు ఉన్నాయని మంత్రి చెప్పుకొచ్చారు.

ఎంపీ మరణించే రెండు రోజులే.. అప్పుడే తిరుపతి ఉపఎన్నికపై కన్ను

బహుశా దేశం మొత్తంలో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలే సెపెరేట్. ఏ చిన్న అవకాశాన్నైనా ఉపయోగించుకోవడంలో ఈ రాష్ట్ర రాజకీయ పార్టీల రూటే సెపరేటు.  అది అధికారంలో వున్న పార్టీనా, ప్రతిపక్షంలో వున్న పార్టీ నా అని పెద్ద తేడాలేమి ఉండవ్.    దీనికి ఒక గొప్ప ఉదాహరణే తిరుపతి లోక్ సభ స్థానం. ఈ స్థానం నుండి సిట్టింగ్ లోక్ సభ సభ్యులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 64 సంవత్సరాల బల్లి దుర్గా ప్రసాద్ కేవలం రెండు రోజుల క్రితం, అంటే బుధవారం చెన్నై లో హృద్రోగ వ్యాధితో మరణించారు. కనీసం రెండు రోజులు కూడా గడవక ముందే, ఈ స్థానానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది, జరిగితే అది తిరిగి వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఖాతా లోకి వెళ్తుందా, లేక ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ చేజిక్కించుకుంటుందా అనే విశ్లేషణ అప్పుడే మొదలయింది.    బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఈ స్థానానికి కూడా ఉపఎన్నిక జరుగుతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకులు గట్టిగా నమ్ముతున్నారు. అంటే ఆక్టోబర్ చివరిలో గాని, నవంబర్ మాసం మొదట్లో గాని ఈ ఉప ఎన్నిక జరగవచ్చని, అందువల్ల దీనికి ఇప్పటి నుండే తయారు కావాలని పార్టీ కార్యకర్తలకు అధినాయకత్వం ఆదేశాలు ఇప్పటికే జారీచేసినట్లు సమాచారం. ఈ స్థానంలో గెలిస్తే, ప్రస్తుతం రాజధాని తరలింపుపై అమరావతి లో 275 రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు చెక్ పెట్టవచ్చని, దీనిని రాజధాని తరలింపుపై ప్రజామోదంగా జనంలోకి తీసుకు వెళ్ళ వచ్చని అధికార పార్టీ వ్యూహంగా చెబుతున్నారు.    ఇక, ప్రతిపక్ష తెలుగు దేశం కూడా తక్కువేమి తినలేదు. తిరుపతి లోక్ సభ స్థానం, పార్టీ జాతీయ ఆధ్యక్షుడైన చంద్రబాబు సొంత జిల్లాలో ఉండడంతో, ఆ పార్టీ దీనిని కొంతమేరకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా, ఈ స్థానంలో గెలిస్తే అమరావతి తరలింపుపై ప్రజలు అధికార పార్టీ నిర్ణయాన్ని అంగీకరించలేదని ప్రజలలోకి తీసుకెళ్లవచ్చని, దీనిని రెఫరెండం గా భావించాలని డిమాండ్ చెయ్యాలని కూడా తెలుగు దేశం నాయకత్వం భావిస్తోయిందని సమాచారం. అసలు తాము ఇప్పుడే ఎన్నికలకు రెడీ కాకపోయినా, వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకత్వం దూకుడుతో, తాము వెకబడ్డామనే భావన ప్రజలలో రాకుండా ఉండాలంటే తాము కూడా అదే స్థాయిలో ముందుకు వెళ్ళ్లాలని నిర్ణయించామని చెబుతున్నారు టీడీపీ నాయకులు.    ఏది ఏమైనప్పటికి, అసలు సిట్టింగ్ పార్లమెంట్ సభ్యులు చనిపోయి కేవలం రెండు రోజులు కూడా కాకుండా, ఇలా తిరిగి ఎప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయనే ఆలోచన రావడమే ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

ఈఎస్ఐ స్కామ్ లో మంత్రి కుమారుడికి బెంజి కారు లంచం.. అయ్యన్న సంచలన ఆరోపణలు   

ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. కొద్దిసేపటి క్రితం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడిగా ఉన్న కార్తీక్ మంత్రి జయరాం కుమారుడికి బెంజ్ కారును బహుమతిగా ఇచ్చాడని అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ సంబంధంతో కార్తీక్ కారును కానుకగా ఇచ్చారో మంత్రి సమాధానం ఇవ్వాలి. ఏ 14 ఐన కార్తీక్ మంత్రి జయరాంకు బినామీ. ఆ కారు పుట్టినరోజు కానుక కాదు.. అది మంత్రికి అతడు ఇచ్చిన లంచం. అంతేకాకుండా కార్మిక శాఖలో అవినీతికి పాల్పడింది అచ్చెన్నాయడు కాదు.. మంత్రి జయరాం. దీనిపై న్యాయస్థానంతో విచారణ చేయించాలి. ఈఎస్ఐ స్కాంలో నిందితుడిగా ఉన్న ప్రమోద్ రెడ్డిని ఏసీబీ అధికారులు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు   సీఎం జగన్ కు కార్మికశాఖ మంత్రి జయరాంపై దర్యాప్తు చేసే దమ్ము ఉందా..? మేము ప్రశ్నిస్తే మమ్మల్ని ముఖ్యమంత్రి బూతులు తిట్టిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై సీఎం మాత్రం నోరు మెదపరు. ఒకవేళ జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి జయరాంతో రాజీనామా చేయించాలి లేదంటే మంత్రి మండలి నుంచి జయరాంను తప్పించాల్సిందే. దీనిపై విచారణకు ఆదేశిస్తే తాను ఈ విషయాన్నినిరూపిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపరులపై ఫిర్యాదు చేసేందుకు ప్రేవేశపెట్టిన 11440కు లైవ్‌లో కాల్ చేసి మంత్రి కుమారుడు ఈశ్వర్‌పై ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం అవినీతిలో సీఎం జగన్‌కు పోటీ పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి కొడుకుకు ఈఎస్ఐ స్కామ్ లో ఏ 14 నిందితుడుగా ఉన్న కార్తీక్ గిఫ్ట్ అందిస్తున్న కారు ఫోటోను అయ్యన్నపాత్రుడు మీడియాకు విడుదల చేసారు. ఈ ఫోటోను కార్తీక్ తన ఫేస్‌బుక్ లో కూడా పోస్టు చేశాడని ఆయన చెప్పారు.