సరిహద్దులో టెన్షన్ల మధ్య భారత, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం
posted on Sep 11, 2020 @ 10:21AM
భారత చైనాల మధ్య లడాఖ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడి నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణ వాతావరణాన్ని సాకుగా చూపుతూ చైనా భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తుండటంతో భారత సైన్యాలు వాటిని తిప్పి కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికే దిశగా భారత్, చైనా మధ్య మాస్కోలో అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ప్రస్తుతం మాస్కోలో షాంఘై సహకార సంస్థ సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ గురువారం చర్చలు జరిపారు. ఇద్దరు మంత్రులు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే అంశంపై సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు.
ఈ చర్చలలో ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికోసం ఐదు అంశాలతో కూడిన ఒక ప్రణాళికను ఈ సమావేశంలో ఖరారు చేశారు. ప్రస్తుతం సరిహద్దులలో నెలకొన్న పరిస్థితులు రెండు దేశాలకు కూడా మంచిది కాదని రెండు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఎల్‌ఏసీ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని రెండు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగించడం, అలాగే వెంటనే సైన్యాలను వెనక్కి రప్పించడంతో పాటు ఎల్ఏసీ నుంచి సమదూరం పాటిచడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చాయి.
నిన్న జరిగిన ఈ సమావేశంలో చైనా తీరుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్ని సంవత్సరాలలో ఎపుడు లేనంతగా ఎల్‌ఏసీ సమీపంలో చైనా బలగాలు భారీగా ఆయుధాలను తరలించడాన్నిఅయన ప్రశ్నించారు. అంతేకాకుండా 1993, 1996 లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని ఎప్పుడూ మోహరించలేదని.. అసలు ఆ పరిస్థితులు ఎందుకొచ్చాయని అయన నిలదీయగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అయితే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదరడం ఒక మంచి పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.