ఇద్దరు ముఖ్య నేతలపై నిఘా! జగన్ కు తిరుగుబాటు భయమా?
posted on Dec 3, 2020 @ 4:44PM
రాజకీయాల్లో నమ్మకానికి చోటు ఉండదంటారు. పదవుల కోసం నాయకులు ఎంతకైనా తెగిస్తారు.. తమ అధినేతలనే ఎదురిస్తారు.. అవసరమైతే దిగజారిపోతారు. తమకు ఎప్పుడు సమయం దొరుకుంతుందా అన్నట్లుగా ఎదురు చూస్తుంటారు నేతలు. ఏ చిన్న అవకాశం వచ్చినా తిరుగుబాటుకు కూడా వెనుకాడరు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అందుకే రాజకీయ నేతలు పూర్తిగా ఎవరిని నమ్మరని చెబుతారు. ముఖ్య నేతలైతే తమ వెంట ఉండేవారిపైనా నిఘా పెడుతుంటారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. వైసీపీలో కీలక నేతలుగా ఉన్న ఓ కుటుంబంపై ఇప్పుడు.. ఆ పార్టీ పెద్దల్లో అనుమాన బీజం మొదలైందని చెబుతున్నారు. ఆ కారణంగానే నేతలను పక్కన పెడుతున్నారనే చర్చ జరుగుతోంది.
ఆ తండ్రి కొడుకులు ప్రస్తుతం ఏపీకి సంబంధించి కీలక పదవుల్లో ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆ తండ్రి కొడుకులపై జగన్‍రెడ్డి గతంలో ఎంతో నమ్మకం చూపించేవారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలోకి వచ్చాక కూడా ఆ ఇద్దరికి అత్యంత విలువ ఇచ్చేవారు. కాని ఇప్పుడు మాత్రం సీన్ మారిందంటున్నారు. ఆ తండ్రి కొడుకులపై సిఎం జగన్ రెడ్డికి అనుమానాలు వచ్చాయంటున్నారు. మీడియాతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో అవి మరింత బలపడ్డాయని చెబుతున్నారు. దీంతో గతంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన ఆ ఇద్దరు నేతలను ఇప్పుడు జగన్ ఎక్కువగా పట్టించుకోవడం లేదనే చర్చ వైసీపీ నేతల్లో జరుగుతోంది. ఆ మంత్రి కుమారుడు తాడేపల్లి నివాసానికి ఎప్పుడు వచ్చినా రెడ్ కార్పెట్ పరిచేవారు. ఆ ఎంపీ మాత్రమే జగన్ రెడ్డిని ఏ సమయంలోనైనా కలిసే వ్యక్తిగా పేరుంది. అలాంటి నేత ఇప్పుడు అనుమానపు చూపులతో తాడేపల్లి రావడమే మానేశారని తెలుస్తోంది.
వైసీపీ పెద్దలకు అనుమానం వచ్చిన ఆ ఇద్దరు నేతలు పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి. మిధున్ రెడ్డి. తండ్రి పెద్ది రాంచంద్రారెడ్డి జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉండగా.. ఆయన తనయుడు మిథున్ రెడ్డి వైసీపీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. వారిద్దరిపై జగన్ కు అనుమానం రావడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి పదవే. ఇటీవల సీఎం జగన్ పై ఓ చర్చ జరుగుతోంది. కోర్టు తీర్పుల వలన జగన్ జైలుకు వెళ్లవచ్చని.. జగన్ జైలుకు పోతే తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అవుతారన్నది ఆ చర్చ సారాంశం. జగన్ భార్య భారతిని కానీ.. తల్లి విజయలక్ష్మీని కానీ ముఖ్యమంత్రిని అవుతారని కొందరు చెబుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ముఖ్యమంత్రి రేసులో మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ఉన్నారనే ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జగన్ జైలుకు పోతే ముఖ్యమంత్రి కావాలని పెద్దిరెడ్డి ఆశ పడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఆయనకు 70 నుండి 80 మంది ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారని.. అవసరమైతే ఆయన తిరుగుబాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు కధనాలు ప్రచురించాయి. ఒకటి రెండు టివి ఛానెళ్లు ఆ మంత్రిని ఇంటర్యూ కూడా చేశాయి.
ఇదే ఇప్పుడు ఆ తండ్రి కొడుకులకు సమస్యగా మారిందంటున్నారు. తనకు అలాంటి ఆలోచన లేదని, సిఎం జగన్ రెడ్డి జైలుకు వెళ్లే ప్రసక్తే లేదని పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే .. సిఎంగా జగన్ ఎవరిని సూచిస్తే వారినే అంగీకరిస్తామే తప్ప సిఎం పోస్టు కోరుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేస్తున్నారు. అయినా పెద్దిరెడ్డిపై జరుగుతున్న ప్రచారం ఆగడం లేదు. దీంతో సీఎం జగన్ కూడా వారిని నమ్మడం లేదని చెబుతున్నారు. మంత్రి రామచంద్రారెడ్డితో పాటు ఎంపీ మిధున్ రెడ్డి కదలికలపై ముఖ్యమంత్రి నిఘా వేయించారని ప్రచారం జరుగుతోంది. ఎంపీ మిథున్ రెడ్డి మాత్రం తమపై ఎలాంటి నిఘా లేదంటున్నారు. తాము జగన్ వీర విధేయులమని, తమపై కావాలనే లేనిపోని అనుమానాలను కొందరు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. అయితే మంత్రి రామచంద్రారెడ్డి తిరుగుబాటు చేస్తారని జరుగుతున్న ప్రచారం వెనుక వైసీపీ నేతలే ఉన్నారనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఆ సూత్రదారులు, పాత్రదారులు ఎవరో బయట పడటం లేదు.. మొత్తానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై జరుగుతున్న చర్చ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.