పరిషత్ ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ!
posted on Apr 1, 2021 @ 7:48PM
ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని ఆరోపిస్తున్న టీడీపీ.. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా ఉన్నప్పుడే అధికార పార్టీ రెచ్చిపోయిందని, ఇప్పుడు ఆయన లేకుండా జరిగే ఎన్నికలను మరింత దిగజార్చడం ఖాయం అని టీడీపీ అభిప్రాయపడుతోంది. నిన్నటి వరకు ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న నీలం సాహ్నీ తాజాగా ఎస్ఈసీగా రావడంతో టీడీపీ పరిషత్ ఎన్నికల సరళిపై ఓ అంచనాకు వచ్చింది.
ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. శుక్రవారం రాజకీయ పార్టీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల అంశం చర్చించనున్నారు. పార్టీల అభిప్రాయాలను తీసుకోనున్నారు. గురువారం ఉదయం ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న నీలం సాహ్ని.. వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఫోకస్ చేశారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ కూడా హాజరయ్యారు. పరిషత్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు నీలం సాహ్నీ స్పష్టం చేశారు. ఈ భేటీ సందర్భంగా జిల్లాల్లో కరోనా పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.