ఏప్రిల్ 8న ఏపీలో పరిషత్ ఎన్నికలు
posted on Apr 1, 2021 @ 9:03PM
ఆంధ్రప్రదేశ్ లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 8వ తేదీ గురువారం పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 10వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. అవసరమైన చోట్ల ఈనెల 9న రీపోలింగ్ నిర్వహించనుంది ఎస్ఈసి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా గురువారం ఉదయం నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె పరిషత్ ఎన్నికలపై ఫోకస్ చేశారు. గవర్నర్ ను కలిసి చర్చించారు. మధ్యాహ్నాం సీఎస్, డీజీపీతో పాటు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సన్నద్దతపై సమీక్షించిన తర్వాత ఎన్నికల ప్రకటన చేశారు ఎస్ఈసీ నీలం సాహ్నీ. 2020 మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నామినేషన్ల ప్రక్రియతో పాటు పరిశీలన, ఉప సంహరణ కూడా ముగిసింది. ఎన్నికలకు వారం రోజుల ముందు కరోనా కారణాంగా ఎన్నికలను వాయిదా వేశారు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అప్పడు ఆగిపోయిన ప్రక్రియ నుంచే ఇప్పుడు మళ్లీ మొదలు పెట్టారు కొత్త ఎస్ఈసీ. వారం రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.
మరోవైపు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది.పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవని ఆరోపిస్తున్న టీడీపీ.. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడినట్టు భావిస్తున్న టీడీపీ అందుకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.