వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందే నియోజకవర్గాల పునర్విభజన!

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన పక్కాగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అది కూడా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. డీ లిమిటేషన్ తరువాతనే సార్వత్రిక ఎన్నికలు ఉంటాయన్న మాట.  తనను కలిసిన పలు రాష్ట్రాలఎంపీలతో  అమిత్ షా ఈ విషయం చెప్పారు.   జనగణన నిర్దేశిత సమయానికే పూర్తవుతుందని అమిత్ షా అన్నారు.   జనగణనకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిసిదే.  ఈ జనగణన రెండు దశలలో పూర్తి కానుంది.  ఇలా ఉండగా నియోజకవర్గాల పునర్విభజనపై ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  డీలిమిటేషన్‍లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక పోతే 2027 నాటికి  జనాభా లెక్కల సేకరణ పూర్త వుతుందనీ, ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలౌతుందనీ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు.  

ప్రత్యక్ష ఎన్నికలకు దూరం.. శ్రీకాకుళం సీటుపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు

జనసేన ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరమని సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీ కార్యకర్తగానే ఉంటాననీ, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ తన సోదరుడు పవన్ కల్యాణ్ కు అండగా, సహాయంగా ఉంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీగా చాలా హ్యాపీగా ఉన్నానన్న నాగబాబు, తనకు ఇది చాలని అన్నారు. వచ్చే ఎన్నికలే కాదు, అసలు ఏ ఎన్నికలలోనూ తాను పోటీ చేయనన్నారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం (డిసెంబర్ 14) శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన ఐదారేళ్ల తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేనన్న ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.  వాస్తవానికి తాను ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే.. 2024 ఎన్నికలలోనే పోటీకి దిగేవాడనన్న ఆయన.. తాను స్వయంగా   నిర్ణయించుకోవడం వల్లే పోటీకి దూరంగా ఉన్నట్లు తెలిపారు.    అయితే వాస్తవానికి నాగబాబు 2024 ఎన్నికలలో అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీకి దిగాలని భావించారు. అందుకు అన్ని విధాలుగా సంసిద్ధమయ్యారు కూడా. అయితే కూటమి పొత్తు ధర్మంలో బాగంగా ఆయన అనివార్యంగా విరమించుకోవలసి వచ్చింది. అనకాపల్లి నుంచి అవకాశం లేదన్నది నిర్ధారణ అయ్యాక కూడా నాగబాబు శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీకి ప్రయత్నించారు. అయితే పొత్తు ధర్మం కారణంగా అప్పట్లో ఆ అవకాశం కూడా దక్కలేదు.  సరే వచ్చే ఎన్నికల్లో అయినా శ్రీకాకుళం నుంచి బరిలో దిగాలని ఆయన భావిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగా ఆయన తరచుగా శ్రీకాకుళంలో పర్యటనలు చేస్తూ వచ్చారు. ఎంత ఎక్కువగా అంటే గత ఏడాది కాలంలో ఆయన శ్రీకాకుళంలో 12 సార్లు పర్యటించారు. దీంతో నాగబాబు కేంద్ర మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడి సీటుపై కన్నేశారంటూ తెలుగుదేశం శ్రేణుల నుంచి ఆగ్రహం వ్యక్తం అయ్యింది. ఇదో పెద్ద వివాదంగా పరిణమించే అవకాశాలున్నాయని గ్రహించిన నేపథ్యంలో నాగబాబు శ్రీకాకుళం వేదికగా తనకు అసలు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశమే లేదంటూ ప్రకటించి, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

    హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచందర్‌రావు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో తయారు చేయించారు. విగ్రహావిష్కరణలో భాగంగా రవీంద్ర భారతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బాలసుబ్రహ్మణ్యంకు ఇష్టమైన 20 సాంగ్స్‌తో ఇవాళ సాయంత్రం 50 మందితో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు.  

వారానికి నాలుగు పనిదినాలు.. మూడు వీక్లీ ఆఫ్‌లపై చర్చ!

జపాన్, స్పెయిన్, జర్మనీలాంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని దినాలపై ప్రయోగాలు చేస్తున్నారు. మరి ఇండియాలో మూడు రోజుల వీక్లీ ఆఫ్ ల పరిస్థితి ఏంటి? ఈ విషయంలో కొత్త లేబర్ కోడ్స్ ఏం చెబుతున్నాయి? లేబర్ కోడ్స్ సూచిస్తున్న మేరకు ఆ దిశగా నిబంధనల అమలు సాధ్యమేనా? అన్న చర్చ నడుస్తోంది. ప్రతీ ఉద్యోగికి జీతం పడే రోజు ఎంత ముఖ్యమో.. వీక్లీ ఆఫ్ కూడా అంతే ముఖ్యం. వారం మొత్తం గొడ్డులా పని చేసిన ఉద్యోగులు వీక్లీ ఆఫ్ అదేనండీ వారాంతపు సెలవు  కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. చాలా వరకు ప్రభుత్వ, కార్పొరేట్ ఆఫీసుల్లో వారానికి రెండు వీక్లీ ఆఫ్ లు ఉంటాయి. ఐదు రోజులు కష్టపడ్డ ఉద్యోగులు రెండు రోజులు సెలవు  తీసుకుంటారు. కొంతమంది ఉద్యోగులు వారానికి నాలుగు రోజుల పని దినాలు.. మూడు వీక్లీ ఆఫ్ లు ఉంటే బాగుండును అనుకుంటున్నారు. జపాన్, స్పెయిన్, జర్మనీలాంటి దేశాల్లో వారానికి నాలుగు రోజుల పని దినాలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ఇండియాలో మూడు రోజుల వీక్లీ ఆఫ్ లపై  చర్చ మొదలైంది. డిసెంబర్ 12వ తేదీన మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ తనఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో వారానికి నాలుగు రోజుల పని దినాలపై చర్చించింది.  మిత్ బస్టర్  పేరిట ఆ పోస్టు పెట్టింది. వారానికి నాలుగు రోజుల పని దినాలపై ఉన్న అపోహలకు ఫుల్ స్టాప్ పెట్టింది. కొత్త లేబర్ కోడ్ ప్రకారం వారానికి నాలుగు రోజులు వీక్లీ ఆఫ్ లు కావాలంటే.. మిగిలిప  నాలుగు రోజులూ  రోజూ 12 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది. అప్పుడే  మూడు రోజుల పాటు పెయిడ్ హాలిడేస్ వస్తాయి. 12 గంటల్లో ఇంటర్వెల్ కూడా ఉంటుంది. వారానికి పని గంటలు 48 గంటలుగానే కొనసాగుతాయి. రోజులో సాధారణ పని గంటల కంటే ఎక్కువ పని చేస్తే జీతాన్ని డబుల్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది.  2025, నవంబర్ 21వ తేదీన భారత ప్రభుత్వం 29 పాత లేబర్ లాస్‌ను తొలగించింది. కొత్తగా నాలుగు లేబర్ కోడ్స్‌  తీసుకుని వచ్చింది. కోడ్ ఆన్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్ కోడ్ 2020లను అందుబాటులోకి తెచ్చింది. పలు రకాల ఉద్యోగుల వర్క్‌ప్లేస్ రైట్స్‌ను కాపాడ్డానికి ఈ కొత్త లేబర్ కోడ్స్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఊరికే రారు మహాను భావులు.. అంబటి, ఉండవల్లి గుంటూరు ట్రిప్ మర్మమేంటో?

గుంటూరులో  ఇటీవల   ఉండవల్లి అరుణకుమార్, అంబటి రాంబాబు కలిసి,  ఇద్దరు మాజీ ఎంపీలు, టీడీపీ నాయకులు యలమంచిలి శివాజీ, రాయపాటి సాంబశివరావులను కలిశారు. వారిద్దరూ ఆనారోగ్యంతో ఉన్నారని పరామర్శకు వెళ్ళామని అంబటి ఒక వీడియో చేసి యూట్యూబ్ లోని తన సొంత సైట్‌లో పెట్టారు. దీనిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.  తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి?  ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.  అంబటి రాంబాబు అప్పుడెప్పుడో అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట, 1989లో రేపల్లెలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదైపోయాక మళ్లీ 2019లో వైసీపీ నుంచి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు మంత్రిగా కూడా పని చేశారు.  అంతే మళ్లీ ఆయన్ని సత్తెనపల్లికి కూడా పనికిరాడని తేల్చేసిన జగన్ జిల్లా మార్చేసి.. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే ఆయన ఆశలు పెట్టుకున్న గుంటూరు వెస్ట్ పార్టీ బాధ్యతలు మాత్రం అప్పగించలేదు. దాంతో అంబటి వారు నియోజకవర్గం లేని మాజీ మంత్రిగా మిగిలిపోయారు. అదలా ఉంటే రాజధాని  అమరావతి ప్రాంతం విస్తరించి ఉన్న గుంటూరు జిల్లాలో వైసీపీకి గత ఎన్నికల్లో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. అమరావతిపై కమ్మ సామాజికవర్గం ముద్ర వేసి, ఆ ఆక్కసుతో అమరావతిని నిర్వీర్యం చేయాలని చూసిన వైసీపీకి జిల్లా వాసులు తగిన బుద్ది చెప్పారు. ఇప్పటికీ అమరావతిపై వైసీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించడం లేదు. ఆ క్రమంలో జిల్లాలో పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారింది. ఆ ఎఫెక్ట్‌తో ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారిస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షులకు, పార్టీ ఇన్చార్జులకు బాధ్యతలు కట్టబెడుతోంది. అందులో భాగంగానే తమ పార్టీపై ఉన్న కమ్మ వ్యతిరేక ముద్రను తుడిచేసుకోవడానికి అంబటి రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నారు. పొలిటికల్‌గా ఎక్స్‌పైర్ అయిపోయి, దాదాపు అందరూ మర్చిపోతున్న టీడీపీ మాజీ ఎంపీలు, గుంటూరులో సీనియర్ కమ్మ నేతలు రాయపాటి సాంబశివరావు, యలమంచిలి శివాజీలు అందుకే అంబటికి గుర్తు కొచ్చారంటున్నారు. ఏదో ఒక వంక చెప్పి వారితో మాట్లాడివస్తే, లేనిపోని విమర్శలు వస్తాయి కాబట్టి... వారి అనారోగ్యం పేరు చెప్పి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో కలిసి వారిని కలిసి వచ్చారు. ఆ సందర్భంగా 80 ఏళ్లు పైబడిన యలమంచలి శివాజీ రాజ్యసభ స్థానానికి ఇప్పటికీ అర్హులని అయన్ని అందలానికెక్కించేసేలా మాట్లాడారు.  ఈ సందర్భంగా ఉండవల్లికి సోదరుడు వరుసయ్యే రఘు అనే పెద్దాయన్ని కలిస్తే.. ఆయన అంబటి రాంబాబు ముఖ్యమంత్రి అయిపోతారని జోస్యం చెప్పేశారు. అదలా ఉంటే వైఎస్ కు అంబటి , ఉండవల్లి ఇద్దరూ ఆప్తులు.. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు కూడా. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం ప్రకటించేసిన ఉండవల్లి   సమయం వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబును విమర్శిస్తుంటారు.  జగన్ పై కూడా విమర్శలు చేసినా అవి చాలా సున్నితంగా, జనగ్ హితం కోరి ఇస్తున్న సలహాల్లా  ఉంటాయి. అటువంటి ఉండవల్లి ఇప్పుడు  పనిమాలా గుంటూరు రావడం, అంబటితో కలసి రాయపాటిని, శివాజీ ని కలవడం.. శివాజీ రాజ్య సభలో ఉండాల్సిన వారంటూ పొగడ్తలు కురిపించడం వెనుక ఎదో మతలబు ఉందంటున్నారు విశ్లేషకులు. మొత్తానికి సొంత పార్టీలో నియోజకవర్గం లేక .. టీడీపీ మాజీలైన కమ్మ దిగ్గజాలతో అలా కానిచ్చేస్తున్న అంబటి లెక్కలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

జీహెచ్‌ఎంసీ డివిజన్ల పునర్విభజనపై హైకోర్టులో పిటిషన్‌

  జీహెచ్‌ఎంసీ డివిజన్ల పెంపు వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. డివిజన్ల పెంపును సవాల్ చేస్తూ వినయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి.విజయ్ సేనరెడ్డి విచారణ చేపట్టారు. డివిజన్ల పునర్విభజనలో అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని వినయ్‌కుమార్‌ పిటిషన్‌లో తెలిపారు.   డివిజన్‌పై తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. అనంతరం పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. మరోవైపు రేపు బల్ధియా ప్రత్యేక కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. ఈ సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోనున్నారు.   ఇప్పటి వరకు 1,328 అభ్యంతరాలు వచ్చాయిని  జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్, జోనల్, సర్కిల్ ఆఫీసుల్లో అభ్యంతరాలు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ 17వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.   

ఎన్ని జన్మలు ఎత్తిన తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రాదు : స్టాలిన్

  తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో భారతీయ జనత పార్టీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. అనుకొగానే బీజేపీ  అధికారంలోకి రావడానికి "ఇది బీహార్ కాదని.. తమిళనాడు అని స్టాలిన్ అన్నారు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు అని తీవ్ర విమర్శలు చేశారు. కేవలం కేంద్ర మంత్రి  అమిత్ షా మాత్రమే కాదు, బీజేపీ నాయకులు అందరూ వచ్చినా కూడా తమిళనాడులో గెలవలేరని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజల మనస్తత్వాన్ని వివరిస్తూ, "ప్రేమతో వస్తే తమిళ ప్రజలు స్వాగతిస్తారు. కానీ అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు" అని స్టాలిన్ హెచ్చరించారు. ఈ కామెంట్స్ రానున్న శాసన సభ ఎన్నికల నేపథ్యంలో  బీజేపీ, డీఎంకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉంది

శ్రీవారికి విరాళాలిచ్చేభ‌క్తుల‌కు టీటీడీ అందించే సౌకర్యాలేంటో తెలుసా?

తిరుమల వెంక‌టేశ్వ‌ర స్వామివారికి రూ. 1లక్ష నుంచి.. రూ.1కోటి విరాళం ఇచ్చే భక్తులకు టీటీడీ కొన్ని ప్రత్యేక సౌకర్యాలు అందజేస్తున్నది.   తిరుమల శ్రీవారి సేవలో భాగంగా విరాళాలు అందించే భక్తులకు, టీటీడీ ప్రత్యేక దర్శన,వసతి, ప్రసాదం వంటి పలు అవకాశాలను కల్పిస్తోంది. విరాళం మొత్తాన్ని బ‌ట్టి భక్తులకు అందే సౌకర్యాలు, అవకాశాలు ఉంటాయి.   1లక్ష రూపాయల నుంచి   5 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులు, ఆ విరాళానికి సంబంధించిన నగదు ధృవీకరణ రశీదు,  ఆదాయపు పన్ను మినహాయింపు ధ్రువీకరణ పత్రం,1 రోజు ఐదుగురికి సుపథం దర్శనం, అలాగే వంద రూపాయల టారిఫ్ ఒక రోజు వసతి కల్పించడంతో పాటు, ఆరు చిన్న లడ్డూలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ టీటీడీ ఇస్తుంది.   అలాగే ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక ఏడాదిలో 3 రోజులు  ఐదుగురికి   సుపథం దర్శనం,  వంద రూపాయల టారిఫ్ తో 3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 10 చిన్న లడ్డూలు, 5 మహాప్రసాదాలు,  ఒక దుపట్టా, 1 బ్లౌజ్ పీస్ ఇస్తారు. ఇక 10లక్షల రూపాయల నుంచి  పాతిక లక్షల రూపాయల వరకూ విరాళం  ఇచ్చే వారికి నగదు ధృవీకరణ రశీదు,  ఆదాయపు పన్ను మినహాయింపు ధృవీకరణ, ఏడాదిలో మూడు రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం,   అలాగే వెయ్యిరూపాయల టారిఫ్ తో  3 రోజుల వసతి కల్పించడంతో పాటు,  20 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ తో పాటు  50 గ్రాముల శ్రీవారి వెండి నాణెం టీటీడీ అంద జేస్తుంది.  అలాగే పాతిక లక్షల నుంచి  50 లక్షల రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు ధృవీకరణతో పాటు ,  ఏడాదిలో ఒక రోజు  ఐదుగురికి  మందికి సుపథం దర్శనం, 3 రోజులు ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనం,  1500  రూపాయల టారిఫ్ తో   3 రోజుల వసతి కల్పించడంతో పాటు, 4 పెద్ద లడ్డూలు, 5 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక  బ్లౌజ్ పీస్ టీటీడీ అందిస్తుంది.  ఇక పోతే.. 50 లక్షల నుంచి  75 లక్షల రూపాయల విరాళం ఇచ్చే భక్తులకు  నగదు ధృవీకరణ + పన్ను మినహాయింపు ధృవీకరణ, ఒక రోజు సుప్రభాత సేవ, 5 గురికి రెండు రోజులు  సుపథం దర్శనం, ఐదుగురికి, మూడు రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి రూ.2000 టారిఫ్‌తో మూడు రోజుల వసతి, 10 చిన్న లడ్డూలు, పది పెద్ద లడ్డూలు, పది మహా ప్రసాదాలతో పాటు 5 గ్రాముల బంగారు డాలర్, 50 గ్రాముల వెండి నాణెం, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందిస్తుంది. ఇక 75 లక్షల నుంచి కోటి రూపాయల వరకూ విరాళం ఇచ్చే భక్తులకు  నగదు ధృవీకరణ, పన్ను మినహాయింపు, రెండు రోజులు సుప్రభాత సేవ-, ఐదుగురికిమందికి, 3 రోజులు సుపథం దర్శనం- ఐదుగురికి 3 రోజులు విఐపి బ్రేక్ దర్శనం, అలాగే ఐదుగురికి  రూ.2500 టారిఫ్‌తో 3 రోజుల వసతి,  8 పెద్ద లడ్డూలు, 15 చిన్న లడ్డూలు, 10 మహాప్రసాదాలు, 5 గ్రాముల బంగారు డాలర్ + 50 గ్రాముల వెండి నాణెంతో  పాటు, ఒక దుపట్టా, ఒక బ్లౌజ్ పీస్ అందజేస్తుంది. కోటి రూపాయలు అంత కన్నా  ఎక్కువ విరాళం ఇచ్చే భక్తులకు నగదు ధృవీకరణ రశీదు, పన్నుమినహాయింపు దృవీకరణ,  ఏడాదిలో 3 రోజులు ఐదుగురికి సుప్రభాత సేవ, వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డూ ప్రసాదాలు, బంగారు డాలర్, వెండి నాణెం, దుపట్టా, జాకెట్ పీస్ సహా పలు అదనపు సౌకర్యాలను టీటీడీ కల్పిస్తుంది.  

నూతన సీఐసీగా రాజ్‌కుమార్ ప్రమాణ స్వీకారం

  నూతన చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ రాజ్‌కుమార్ గోయల్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. రాజ్‌కుమార్‌తో పాటు మరో 8 మందిని సమాచార కమిషనర్లుగా సిఫార్సు చేశారు. 9 ఏళ్ల తర్వాత కమిషన్ పూర్తిస్థాయి సామర్థ్యంలో పనిచేయనుంది.  ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్​, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ సహా పలువురు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కమిటీ రాజ్‌కుమార్‌ గోయల్‌ పేరును ప్రతిపాదించింది.  రాజ్‌కుమార్‌ గోయల్ 1990 బ్యాచ్​ అరుణాచల్ ప్రదేశ్-గోవా-మిజోరం-కేంద్రపాలిత ప్రాంతాల క్యాడర్‌కు చెందిన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి. ఆయన ఆగస్టు 31న కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని న్యాయ విభాగ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. హోం శాఖలో కార్యదర్శి (సరిహద్దు నిర్వహణ)గా కూడా పనిచేశారు. కేంద్రంతో పాటు జమ్మూ కశ్మీర్​లోనూ కీలక పదవులను నిర్వహించారు.

కవిత జనజాగృతి ఎఫెక్ట్.. పంచాయతీల్లో బీఆర్ఎస్ కుదేలు

తెలంగాణ‌లో  మూడు విడతల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో బాగంగా తొలి రెండు విడతల పోలింగ్ జరిగి ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు బీఆర్ఎస్ పార్టీ పునాదులు కదిలిపోతున్నాయా అనిపించేలా ఉన్నాయి. రెండు విడతలలోనూ కూడా కాంగ్రెస్ హవా బ్రహ్మాండంగా సాగింది. ఈ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే అత్యధికంగా విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో అయితే.. 193 మండలాల పరిధిలోని 3వేల‌, 911 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు  గాను  1,728 మంది స‌ర్పంచ్‌లు కాంగ్రెస్ మద్దతుదారులే.   తొలి విడతలో కాంగ్రెస్ హవాతో కంగుతిన్న బీఆర్ఎస్ రెండో విడత వచ్చే సరికి అప్రమత్తమైంది. రెండో విడ‌త‌లో  తడాఖా చూపాలని బీఆర్ఎస్ అగ్రనాయత్వం తన కేడర్ కుస్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది  అయినా కూడా రెండో విడతలోనూ బీఆర్ఎస్ చతికిల పడింది. కేవలం  912 స‌ర్పంచ్ స్థానాలలోనే విజయం సాధించింది.  గ్రామీణ స్థాయిలో బీఆర్ఎస్‌కు ప్ర‌జ‌ల నుంచి పెద్దగా మద్దతు లేదని ఈ రెండు విడతలలోనూ రూఢీ అయిపోయింది.   వాస్తవానికి తొలి విడతతో పోల్చుకుంటే రెండో విడతలో పోలింగ్ శాతం అధికంగా నమోదైంది. ఈ పెరిగిన ఓటింగ్ తమదేనని బీఆర్ఎస్ భావించింది. కానీ ఫలితాలు వెల్లడైన తరువాత ఆ పార్టీకి విషయం బోధపడింది.  పోలింగ్ శాతం అధికంగా ఉన్న చోట్లా, , స్వల్పంగా నమోదైన చోట్లా కూడా కాంగ్రెస్ ఆధిపత్యం సుస్పష్టంగా కనిపించింది.  మొత్తంగా.. రెండు విడతల్లోనూ కూడా రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వాతావరణం అనుకూలంగా లేదనీ, ప్రజా మద్దతు కూడగట్టడంలో ఆ పార్టీ ఘోరంగా విఫలమైందనీ తేటతెల్లమైంది.  ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పంచాయతీల్లో చతికిలబడటానికి కారణాలపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు. జగజాగృతి పేరుతో కల్వకుంట్ల కవిత వ‌రంగ‌ల్‌, క‌రీంగ‌న‌గ‌ర్‌, న‌ల్లగొండ‌, మ‌హ‌బూబాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించారు.  ఆయా జిల్లాల్లోని ప‌ల్లెల్లో కాంగ్రెస్ మ‌ద్ద‌తు దారులు విజ‌యం ద‌క్కించుకున్నారు. సో.. మొత్తానికి క‌విత దెబ్బ కూడా బీఆర్ ఎస్‌కు గట్టిగానే త‌గిలింద‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సిడ్నీలో ఉగ్రఘాతుకం.. నిందితులు పాక్ కు చెందిన తండ్రీకొడుకులు

అస్ట్రేలియా సిడ్నీలోని బోండీబీచ్ లో జరిగిన నరమేథం ఉగ్రదాడేనని తేలింది. ఐసీస్ తో సంబంధాలున్న పాక్ జాతీయులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.  యూదులు లక్ష్యం వారు హనూకా వేడుకలు జరుపుకుంటున్న సమయంలో పాకిస్థాన్ జాతీయులైన తండ్రీ కొడుకులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని తేలింది. కాల్పులకు తెగబడ్డవారిని   నవీద్ అక్రమ్, అతడి తండ్రి సాజిద్ అక్రమ్ గా రక్షణ బలగాలు గుర్తించాయి. వీరిరువురూ పాక్ నుంచి వచ్చిన వారేనని వెల్లడించాయి. భద్రతాదళాల కాల్పుల్లో నవీద్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఓ హంటింగ్ క్లబ్‌లో సభ్యుడైన అతడి తండ్రి సాజిద్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. సాజిద్ పేరిట 2015 నుంచి గన్ లైసెన్స్ ఉందని తేలింది. సాజిద్ వద్ద ఉన్న ఆరు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ తండ్రీకొడుకులు జరిపిన దాడిలో16 మంది మరణించగా, పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు.  ఇలా ఉండగా నిందితుల్లో ఒకరు చాలా కాలంగా ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ నిఘాలో ఉన్నట్లు చెబుతున్నారు.  కాల్పుల ఘటన తరువాత జరిపిన సోదాలలో వీరి కారులో  ఐసీస్ నల్లజెండాలు లభ్యమయ్యాయి. కాగా వీరిని ఓ సామాన్యుడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. ఆ క్రమంలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలకు తెగించి నిందితులను అడ్డుకున్న వ్యక్తిని 43 ఏళ్ల అహ్మద్ గా గుర్తించారు,  ప్రాణాలకు తెగించి మరీ నిందితుడితో పోరాడిన అహ్మద్‌ రియల్ హీరోగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.  ఇక పోతే   కాల్పులకు తెగబడిన నిందితులు ఇద్దరూ చాలా ఏళ్లుగా సిడ్నీలో నివాసం ఉంటున్నా వారి మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.  విచారణలో భాగంగా పోలీసులు ఆదివారం డిసెంబర్ 14) రాత్రి వారి నివాసాల్లో సోదాలు చేశారు. ఈ సందర్భంగా  నవీద్ అక్రమ్ లైసెన్స్ పొందిన ఆయుధాలను విక్రయిస్తుంటాడని తేలింది.  

పంచాయతీ సిత్రాలు సూడ‌రో!.. సుసైడ్ విన్నర్ ఎవరో తెలుసా?

సింగిల్ ఓట్ విన్న‌ర్స్ అనే మాట వినే ఉంటాం ఆ మాట‌కొస్తే ల‌క్కీ డ్రా విన్న‌ర్స్ అనే క్యాప్ష‌న్ కూడా చ‌దివే ఉంటాం.. ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.  స‌ర్పంచ్ అభ్య‌ర్ధిగా పోటీ చేసిన  రాజుది ఓ  విషాద గాథ‌. మ‌ద్ధ‌తుదారులు స‌హ‌క‌రించ‌డం లేద‌నీ, ఎన్నిక‌ల్లో ఖ‌ర్చుకు డ‌బ్బుల్లేవ‌న్న మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు రాజు. ఈ నెల 8న అత‌డు ఉరి వేసుకుని చ‌నిపోగా.. సర్పంచ్ ఎన్నికలలో అతడు  గెల‌వ‌డం పంచాయితీ  ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే కొత్త రికార్డుగా న‌మోద‌య్యింది. అత‌డి మ‌ర‌ణం కార‌ణంగా మ‌ళ్లీ ఎన్నిక నిర్వ‌హించాల్సి వ‌స్తోంది. ఏది ఏమైనా రాజు సూసైడ్ విన్న‌ర్ గా నిలిచి చ‌రిత్ర సృష్టించాడ‌న్న చర్చ జరుగుతోంది. ఇక సింగిల్ ఓట్ విన్న‌ర్లు ఎవ‌రెవ‌రున్నారో చూస్తే.. నిర్మల్ జిల్లా, బాగాపూర్ గ్రామంలో ముత్యాల శ్రీవేద అనే మహిళ ఒకే ఒక్క ఓటు తేడాతో సర్పంచ్‌గా గెలిచారు, ఈమెకు పోటీగా బ‌రిలో నిలిచిన హ‌ర్ష స్వాతికి  కూడా 180 ఓట్లే వ‌చ్చాయి. దీంతో పోస్ట‌ల్ బ్యాలెట్ లెక్కించగా..  ఒక్క ఓటు కార‌ణంగా శ్రేవేదను విజ‌యం వ‌రించింది. అమెరికా నుంచి వచ్చిన తన మామ వేసిన పోస్టల్ ఓటు ఆమె విజయానికి కారణమైంది.   కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్‌ఖుర్ద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బెస్త సంతోష్ సంచలన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠ భ‌రితంగా సాగింది.. చివరకు సంతోష్ తన సమీప ప్రత్యర్థిపై కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సంతోష్‌ను చూసి గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, ప్రతి ఓటూ కీలకమని ఈ ఫలితం నిరూపించిందని అంటున్నారు అధికారులు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం గణేశ్‌పాడు గ్రామ పంచాయతీలో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుదారుడైన రమేశ్ నాయక్, కాంగ్రెస్ మద్దతుదారుడిపై విజయం సాధించారు. అయితే ఈ విజయం నల్లేరు మీద నడకలా సాగలేదు. ఎంతో స‌స్పెన్స్ తో  జరిగిన కౌంటింగ్‌లో రమేశ్ నాయక్ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో ప్రత్యర్థిని ఓడించి సర్పంచ్ పీఠాన్ని కైవ‌సం  చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా, మర్పల్లి మండలం, రామాపూర్ గ్రామ పంచాయతీలో కూడా ఇదే తరహా ఫలితం వెలుగు చూసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రమాదేవి తన ప్రత్యర్థి నుంచి తీవ్ర  పోటీని ఎదుర్కొన్నారు. చివరి రౌండ్ వరకు ఇద్దరి మధ్య ఓట్లు సమానంగా వస్తాయేమో అన్నంత ఉత్కంఠ నెలకొంది. చివరకు ఫలితం వెలువడేసరికి రమాదేవి ఒక్క ఓటు తేడాతో గెలుపు సాధించారు.

టోలిచౌక్‌లో ఓ యువకుడి దారుణ హత్య

ఘర్షణ ఆపడానికి వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ టోలీచౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం (డిసెంబర్ 14) రాత్రి జరగింది. వివరాలిలా ఉన్నాయి.  పరమౌంట్‌ కాలనీలో ఆదివారం రాత్రి సమయంలో టోలిచౌక్‌ కుంట విరాట్‌నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌ తన తమ్ముడు అదనాన్‌  బిలాల్‌ లమధ్య గొడవ జరుగుతున్నట్లు  తెలుసుని ఆ గొడవ ఆపేందుకు అక్కడకు వెళ్లాడు.  అయితే చినికి చినికి   గాలి వాన అయినట్లుగా ఆ గొడవ కాస్తా పెద్దదైంది.  బిలాల్ ఒక్కసారిగా ఇర్ఫాన్‌పై  కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఇర్ఫాన్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇర్ఫాన్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యం లోనే మరణించాడు.  సమాచారం అందుకున్న  టోలిచౌక్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు బిలాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేశారు, గొడవకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో పరమౌంట్‌ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. గొడవ ఆపడానికి వెళ్లిన కొడుకు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో  అతడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

సఫారీలను చిత్తు చేసిన టీమ్ ఇండియా

సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా అలవోక విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సఫారీ సేన.. టీమ్ ఇండియా బౌలర్ల ధాటికి కేవలం 117 పరుగులకే ఆలౌటైంది.  118 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమ్ ఇండియా   15.5 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంలో  5 టీ ట్వంటీల సిరీస్ లో టీమ్ ఇండియా  2-1 ఆధిపత్యంలోకి దూసుకెళ్లింది. ధర్మశాల వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో భారత బౌలర్లు చెలరేగారు. తొలుత టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. అసాధారణ ప్రదర్శన చేసింది. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా విజృంభించి సౌతాఫ్రికాను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. ఆ తరువాత  ఛేదనలొ భారత్ మూడు వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ ఓటమిపై  సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ మాట్లాడుతూ..  బ్యాటింగ్‌కు కఠినమైన పరిస్థితులు ఉన్నాయన్నాడు. భారత బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. తాము వరుసగా ఐదు వికెట్లు కోల్పో యామన్న మార్కరమ్,  భారత బౌలర్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలన్నాడు. బ్యాటింగ్ వైఫల్యమే తమ  ఓటమికి కారణమన్న మార్కరమ్..  భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. వాటిని ఎదుర్కో వడానికి.. తిరిగి ప్రత్యర్థులపై ఒత్తిడి తీసుకురావడానికి కావాల్సిన మార్గాలు కనుగొనాలని అభిప్రాయపడ్డాడు.   టీమ్ ఇండియా బౌలర్లు తమకు పరుగులు చేసే అవకాశమే ఇవ్వలేదనీ,  తాను ఇన్నింగ్స్‌ను చివరి వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని,  తాను ఇంకాస్త దూకుడు పెంచి 140-150 పరుగుల స్కోరు జట్టుకు అందించి ఉంటే.. మ్యాచ్ రసవత్తరంగా జరిగేదన్నాడు. డెత్ ఓవర్లలో తాను ఔటైన బంతి భారీ షాట్ కొట్టగలిగేదేనని, ఇలాంటి పరిస్థితుల్లో టార్గెట్ చేయాలనుకునే బౌలర్‌పై మాత్రమే విరుచుకుపడాలని తెలిపాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన ప్రొటీస్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 117 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల ధాటికి సఫారీల బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఛేదనకు దిగిన టీమిండియా 15.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1తో ముందంజలో ఉంది.

ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ప్రముఖ జర్నలిస్టు ఐ.వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్  పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం (డసెంబర్ 14) ఆవిష్కరించారు. ఇదే పుస్తకాన్ని 'విలీనం -విభజన' పేరిట ఎన్.అనురాధ తెలుగులోకి  అనువదించారు.  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విలీనం, విభజన  అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు చెందిన  22 మంది ముఖ్యమంత్రుల పాలనా కాలాన్ని కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించారు. పరిశోధకులకు, భవిష్యత్ తరాలకు ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ను తెలుగులోని విలీనం- విభజన పేరిట అనువదించిన అనూరాధను అభినందించారు.  

కరీంనగర్ లో పునుగుపిల్లి

తిరుమల శేషాచలం కొండల్లో ఎక్కువగా కనిపించే అరుదైన పునుగుపిల్లి తెలంగాణలోని కరీంనగర్ లో దర్శనమిచ్చింది. సాధారణంగా దట్టమైన అడవుల్లో మాత్రమే కనిపించే ఈ అరుదైన క్షీరజం మైదాన ప్రాంతంలో కనిపించడం విస్మయం గొలిపింది. కరీంనగర్ లోని హిందుపురి కాలనీలో ఆదివారం (డిసెంబర్ 14) ఓ వ్యక్తి ఇంట్లో పునుగుపల్లి కనిపించింది. వెంటనే ఆ ఇంటి యజమాని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఈ పునుగుపిల్లిని క్షేమంగా పట్టుకుని డీర్ పార్క్ కు తరలించి వైద్యం అందించారు. అది పూర్తిగా కోలుకున్న తరువాత  దానిని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టనున్నారు.  ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల శేషాచలం కొండల్లో మాత్రమే అధికంగా కనిపించే పునుగుపిల్లి   తైలాన్ని తిరుమల శ్రీవారి అభిషేక సేవలో ఉపయోగిస్తారు.  అలాగే ఈ పునుగు పిల్లి విసర్జన నుంచి సేకరించిన గింజలతో తయారుచేసే  కోపి లువాక్' కాఫీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ప్రసిద్ధి చెందింది.   

కీలక రంగాల్లో దూసుకుపోతున్న ఏపీ.. పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ పలు కీలక రంగాల్లో ముందంజ వేస్తున్నది. ముఖ్యంగా పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రిజర్వబ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.  ఆంధ్రప్రదేశ్  1 కోటి 93 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తితోనూ,  51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో నూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.   అంతే కాకుండా ఏపీ ఆర్థికంగానూ  స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నట్లు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది.   2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర  జీఎస్డీపీ రూ.15.93 లక్షల కోట్లు ఉండగా  జీఎస్‌డీపీ రూ.2.66 లక్షలుగా నమోదైందని ఆ నివేదిక పేర్కొంది. అదే విధంగా విద్యుత్ లభ్యతలో ఏపీ1481 యూనిట్లతో దేశంలో 14వ స్థానంలో ఉంది. ప్రజారోగ్యం విషయంలో  ఏపీ సగటు ఆయుర్దాయం 70 ఏళ్లుగా నమోదైంది. ఇందులో పురుషుల సగటు జీవితకాలం 68 సంవత్సరాలు కాగా, మహిళల సగటు జీవితకాలం 73 ఏళ్లుగా ఉంది.

కూటమిలో పవన్ సొంత అజెండా?

అమరావతి వేదికగా తాజాగా  జరిగిన రెండు సమావేశాలు.. రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. ఓ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగితే.. మరో సమావేశం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగింది. అదేంటి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే సమావేశానికి ఉపముఖ్యమంత్రి, ఐదు శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరవ్వాలి కదా? పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? అనే  అనుమానాలు మీకు కలగవచ్చు... మీకే కాదు.. కూటమిలో ఉన్న నేతలతో పాటు రాజకీయ నాయకులకు ఇదే అనుమానం కలుగుతోంది.  అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అన్ని శాఖల హెచ్‌ఓడీలు, కార్యదర్శులు , మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులతో  సమావేశం నిర్వహించారు.  ఈనెల 17, 18 తేదీల్లో జరగబోతున్న కలెక్టర్స్ కాన్ఫిరెన్స్ కి కర్టెన్ రైజర్ గా జరిగింది ఈ సమావేశం. పరిపాలకు సంబంధించినటు వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ఇలాంటి కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ  రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్  కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి  సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.  వాస్తవంగా కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లో ఎన్డీఏలో అత్యంత యాక్టివ్‌గా కనిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారన్న ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో వేగంగా విస్తరిస్తోంది. మొదటి రోజుల్లో జరిగిన ప్రతి ముఖ్య సమావేశానికి స్వయంగా హాజరై, ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందున్న జనసేనాని, ఇటీవల మాత్రం కీలక అధికారిక ఈవెంట్స్‌కి కూడా హాజరుకాకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ముఖ్య మీటింగ్‌లకు కూడా పవన్ డుమ్మా కొడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అమరావతిలోనే ఉన్నప్పటికీ...సీఎం చేపట్టే అత్యావశ్యక కార్యక్రమాలకు వెళ్లకుండా, ఆయన సొంత షెడ్యూల్‌ని ఫాలో అవుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ఐబీపీ సమావేశాలు, విశాఖ ఇండస్ట్రియల్ సమ్మిట్, సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం, రాజధాని ప్రాజెక్టుల రివ్యూ, పెన్షన్ల పంపిణీ వంటి ప్రభుత్వ ముఖ్య వేడుకలు, మీటింగ్‌లు, లాంచింగ్‌లు.. వీటి వేటిలోనూ  పవన్ కనిపించకపోవడం చిన్న విషయం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి భాగస్వామ్యంలో ఇలాంటి గ్యాప్… ముఖ్య కార్యక్రమాల్లో పవన్ కనిపించకపోవడం… సమ్‌థింగ్ ఈజ్ రాంగ్ అన్న అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోందంటున్నారు.  అయితే ఇదంతా పవన్ కళ్యాణ్ వాంటెడ్ గా చేస్తున్నారా? లేక ముందస్తుగానే షెడ్యూల్ అయిన కారణంగానే  సీఎం సమావేశానికి హాజరు కాలేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో నడుస్తుంది. అంతే కాదు  పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పాలనలో తన ఇమేజ్‌ని పెంచుకోవాలని భావిస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక పార్టీ అధినేతగా  విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం ద్వారా.. దాని ఇంపాక్ట్ క్యాడర్ మీద కూడా పడే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి సభల్లో  మూడు పార్టీల కార్యకర్తలు కలిసి ఉండాలని, చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలని... కార్యకర్తలు, నేతల ప్రవర్తన కారణంగా కూటమి ఐక్యతను దెబ్బతీయొద్దంటూ  పదేపదే చెబుతున్న పవన్ కళ్యాణ్.... ఆచరణలో తాను స్వయంగా ఎందుకు ఫాలో కావట్లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కారణాలు ఏమైనా గానీ.. పవన్ కళ్యాణ్ విడివిడిగా సమావేశాలు పెట్టుకోవడం.. కూటమి కలిసి చేస్తున్న  కార్యక్రమాలకు హాజరు కాకపోవడం వల్ల నెగిటివ్ టాక్ స్ప్రెడ్  అవుతుందనే అభిప్రాయం పొలిటికల్ సర్కిల్స్ వినపడుతోంది. పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కీలకమైన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎంగా  ఉన్న మల్లు భట్టి విక్రమార్క  కచ్చితంగా పాల్గొంటున్నారు.. కర్ణాటకలోనూ ఇదే తరహా వాతావరణం కనిపిస్తోంది. కానీ ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి సమావేశాలకు, కూటమి నిర్వహించే సమావేశాలకు పవన్ దూరంగా ఉండడం వెనుక  మతలబు ఏంటో జనసేన నాయకులే చెప్పాలంటున్నారు. మొత్తానికి తాజాగా జరిగిన హెచ్ఓడీలు, సెక్రటరీల సమావేశానికి పవన్ రాకపోవడం.. అమరావతి లోనే  తన శాఖకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడం వెనుక మతలబు ఏంటనే దానిపై పెద్ద చర్చే జరుగుతోందిప్పుడు.

మధుర జ్ఞాపకంగా మిగిలిన మెస్సీ టూర్ : రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి, అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో శనివారం (డిసెంబర్ 13) జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఫుట్ బాల్ అభిమానులకు మధురానుభూతిని ఇచ్చింది. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా మెస్సికి ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్‌‌రెడ్డి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి , అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సిల మధ్య ఉప్పల్‌ స్టేడియంలో  ఫ్రెండ్లీ మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.  మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్న రేవంత్.. మాతో చేరి శనివారం సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి  హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ అంటే క్రీడలు, శ్రేష్ఠత, ఆతిథ్యం అని ప్రపంచానికి చాటామన్నారు. నగరం అంతటా విధుల్లో ఉన్న అన్ని శాఖల అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం తరపున, మా అతిథులకు, క్రీడా ప్రేమికులు, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో సీఎం పర్యటన బిజీ బిజీగా ఉంది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి శనివారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా ఆదివారం (14న) ఢిల్లీలో జరిగే మహార్యాలీ కార్యక్రమంలో సీఎం  రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు .