బీజేపీకి కన్నా రాజీనామా.. 26న తెలుగుదేశంలో చేరిక
posted on Feb 16, 2023 @ 11:42AM
భారతీయ జనతా పార్టీ, ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 26న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించక మానదు. ఎందుకంటే.. ఇప్పుడు ఆయన రాజీనామా వార్త విన్న వారంతా.. కన్నా ఇప్పటి వరకూ బీజేపీలోనే ఉన్నారా? అని ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే కన్నా చాలా కాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన వైదొలగిన నాటి నుంచీ పార్టీ వ్యవహారాలకు దూరంగా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.
నిజానికి ఒక్క కన్నా అనే కాదు రాష్ట్ర విభజన తర్వాత కట్టకట్టుకుని కాషాయం గూటికి చేరిన కాంగ్రెస్ మాజీ నేతలు చాలా మంది 2019 తర్వాత సైడైపోయారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి కటీఫ్ చెప్పేసి తెలుగుదేశం, లేదా జనసేన లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరనున్నడంతో ఆ ప్రచారానికి తెరపడింది. వాస్తవానికి గత కొంత కాలంగా కన్నా రాష్ట్ర బీజేపీ తీరుపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ఆయన దారి ఎటు అన్నది చెప్పకనే చెప్పేశాయి. వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం, జనసేన కూటమికి చేరువౌతారని ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది కూడా. ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలకు కన్నా హాజరు కాలేదు. అలాగే గత నెల 24న భీమవరంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ డుమ్మా కొట్టారు. ఆ రోజు బీజేపీ నేతలంతా భీమవరంలో ఉంటే కన్నా మాత్రం వ్యక్తిగత పనులు అంటూ హైద్రాబాద్ లో ఉన్నారు. అప్పుడే రాజకీయ విశ్లేషకులు కన్నా కమలాన్ని వీడిన ట్లేనని తేల్చేశారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరడం ఖాయమని కూడా విశ్లేషించారు.
వాస్తవానికి బీజేపీకి కన్నా గుడ్ బై చెప్పేందుకు గ్రౌండ్ గత ఏడాది డిసెంబర్ లోనే గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అ పాత మిత్రులం కదా అందు ఓ సారి కలిసి కబుర్లు చెప్పు కున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని అటు నాదెండ్ల, ఇటు కన్నా కూడా అప్పట్లో చెప్పినా వారి మాటలను ఎవరూ విశ్వసించలేదు. అప్పట్లోనే జనసేనలో కన్నా లక్ష్మీనారాయణ చేరిక అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ బీజేపీలో కన్నా ఉక్కపోతకు కారణం ఎవరంటే మాత్రం కచ్చితంగా సోము వీర్రాజే అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమించిన ఆరు జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించారు. దీంతో అంతవరకూ కొంత సైలెంట్ గా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు జనసేనతో సంబంధాలు బలహీనం అవ్వడానికి కూడా సోము వీర్రాజ వైఖరే కారణమని కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే తప్పుబట్టారు. కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని, ఆ తరువాత రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరు కావడంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అప్పట్లోనే నిర్ధారణ అయ్యింది. అయితే కన్నా ఏ పార్టీలో, ఎప్పడు చేరుతున్నారు అన్నదే తేలాల్సి ఉందని పరిశీలకుల పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదని తెలుస్తోంది. అయితే, ఇ బుజ్జగింపులకు ముందే కన్నా ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తారని అప్పటి నుంచీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. కన్నా బీజేపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సత్తెన పల్లిలో ఈ నెల 26న కన్నా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా లేనట్టుగానే ఉంటున్న మరి కొందరు మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కన్నా బాటలోనే నడిచే అవకాశాలు ఉన్నాయనీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు.