పట్టిన దయ్యం వదలాలంటూ భార్యకు కుక్కతో పెళ్లి!
posted on Feb 24, 2023 6:05AM
మనుషుల్లో మూఢనమ్మకాలు 21వ శతాబ్దంలోనూ సభ్య సమాజాన్ని వెక్కిరిస్తూనే ఉన్నాయి. శాస్త్ర, సాంకేతిక విజ్ణానం ఎంతగా అందుబాటులోకి వచ్చినా మనిషిలోని మూఢత్వాన్ని పారద్రోల లేకపోతున్నాయనడానికి తాజా ఉదాహరణగా నిలుస్తుందీ సంఘటన. తాజాగా ఓ వ్యక్తి తన భార్యకు ఓ కుక్కతో పెళ్లి జరిపించాడు. ఎందుకయ్యా అంటే తన భార్యకు దయ్యం
పట్టిందనీ, దానిని వదల్చాలంటే కుక్కతో పెళ్లి చేయక తప్పదని బదులిచ్చాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే అతగాడి భార్య కూడా తనకు దయ్యం పట్టిందనీ, కుక్కుతో పెళ్లి జరిగితేనే దయ్యం వదులుతుందనీ చెప్పడం. కుక్కతో పెళ్లికి తాను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నానని ముక్తాయించడం. అసలీ ఆలోచన వారికి ఎలా వచ్చిందంటే.. ఏదో మానసిక వ్యాధితో బాధపడుతున్న ఆమెకు దయ్యం పట్టిందని పండితులు(?) చెప్పారట. ఆ దయ్యం వదలాలంటే ఓ శునకంతో ఆమెక వివాహం జరిపించాలని, అలా చేస్తేనే దయ్యం వదులుతుందని నమ్మకంగా చెప్పారట.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్నది తెలియరాలేదు కానీ ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నీ భార్యకు దయ్యం పట్టడం సంగతేమిటో తెలియదు కానీ.. నీకు మాత్రం పిచ్చి పీక్స్ కు చేరిందయ్యా అంటూ సదరు భర్తపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ముందు ఇద్దరూ మంచి వైద్యుడి దగ్గరకు వెళ్లి చికిత్స చేసుకోండి అని సలహా ఇస్తున్నారు.