రాజ్ భవన్, ప్రగతి భవన్ సయోధ్య మూన్నాళ్ల ముచ్చటేనా?
తెలంగాణలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోధ్య మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోర్టు సూచనలతో అనివార్యంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య కుదిరిన సయోధ్య కొనసాగుతుందా అంటూ అప్పట్లోనే తెలుగువన్ ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందని విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా కనిపంచిన సుహృద్భావం అక్కడితోనే మాయమైపోయిందని తేటతెల్లమైంది. అయితే ఒక్కటి మాత్రం నిజం అసలు గవర్నర్ శాసన సభకు వచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, నిజంగా... నిజమా, అనే అనుమానం అప్పట్లో అందరిలో కలిగింది. నిజం తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి అసెంబ్లీలోకి తోడ్కొని వెళ్లడం కూడా అప్పట్లో సంభ్రమాశ్చర్యాలను కలిగింది. అదే విధంగా ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్ అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చదవడం కూడా విభేదాలన్నీ గతించిన గతమేనా అన్న భావన కూడా కలిగించింది.
ఎందుకంటే అప్పటికి రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య జరుగుతన్న ప్రచ్ఛన్న పోరు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముందు చోటు చేసుకున్నపరిణామాలు, రాజ్యాంగ సంక్షోభం తప్పదా అనిపించేలా తలెత్తిన పరిస్థితులు గమనిస్తే.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారని కానీ, ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానిస్తారని కానీ ఎవరూ కనీసం ఊహించలేదు. నిజానికి తెలంగాణ హై కోర్టు జోక్యం చేసుకోవడం వలన కానీ లేదంటే నిజంగానే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేదే అన్న అభిప్రాయం ఇప్పటికీ పరిశీలకులలో వ్యక్తమౌతోంది. అయితే హైకోర్టు జోక్యంతో అనివార్యంగానైనా ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళి సై చాలా చక్కగా వారి వారి పాత్రలను వారు పోషించారు. ‘సయోధ్య’ చిత్రాన్ని రక్తి కట్టించారు.
అఫ్కోర్స్ అప్పట్లో ముఖ్యమంత్రి బాడీ లాంగ్వేజ్ లో కొద్దిపాటి అవమాన ఛాయలు, గవర్నర్ అడుగుల్లో కొద్దిపాటి విజయ దరహాసం కనిపించాయనుకోండి అది వేరే విషయం. అయినా రెండు వ్యవస్థల మధ్య సయోధ్య అవసరాన్ని ఇద్దరూ ఎంతో కొంత గ్రహించినట్లే అప్పట్లో కనిపించారు. అయితే, ఈ సయోధ్య ఇంత వరకేనా ముందు ముందు కూడా కొనసాగుతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు. కానీ ఇక ముందు గతంలోలాగా తెగే వరకూ లాగే పరిస్థితి అయితే రాకపోవచ్చనీ, ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత విజ్ఞత, వివేచనా, సంయమనం ఆశించ వచ్చననే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. కానీ ఆ అభిప్రాయం పూర్తిగా తప్పని తదననంతర పరిణామాలు రుజువు చేశాయి.
పెండింగ్ లో ఉన్న ఐదారు బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకూ అయితే తీసుకోలేదు. వాటికి ఆమోదముద్ర వేయలేదు. ప్రధానంగా మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో అవిశ్వాసం తీర్మానం గడువును ప్రస్తుతమున్న మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పొడిగిస్తూ గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన సవరణ బిల్లు విషయంలోనూ గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. అలాగని తిప్పి పంపనూ లేదు. పరిశీలనలో ఉంది (అండర్ కన్సిడరేషన్) అని మాత్రమే చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి ఏకంగా బిల్లులపై గవర్నర్ సంతకాలు చేసేలా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించింది.
ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను గవర్నర్ పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయటం సంచలనం సృష్టించింది. ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని, గవర్నర్ పరిధి ఏమిటి? ఎందుకు బిల్లులు ఆమోదించటం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ సర్కార్ బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గతంలో కనిపించిన సయోధ్య అంతా పైపై మెరుగేనని తేటతెల్లమైపోయింది.