ఎర్రబెల్లి, రేవంత్‌రెడ్డి.. కలవని మనసులు...

  తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌రెడ్డి మధ్య రోజు రోజుకూ దూరం పెరుగుతోంది. ఆ దూరం కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల కాకుండా, పార్టీకి సంబంధించిన కారణాలు కాకుండా కేవలం తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ మీద రేవంత్‌రెడ్డి దూకుడుగా చేస్తున్న విమర్శల కారణంగానే దూరం పెరుగుతోంది. తెలంగాణలో అధికారంలో వున్న టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడుతోందని రేవంత్‌రెడ్డి విమర్శిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోకి సంబంధించిన స్థలాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ తన బంధువు జూపల్లి రామేశ్వరరావుకు అక్రమ మార్గంలో ఇస్తున్నారన్నది రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలకు ఎర్రబెల్లి దయాకరరావు మరోరకం భాష్యం చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా ఒక కులాన్నే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. రేవంత్ రెడ్డి విమర్శల మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అభ్యంతరం ఎంతవరకూ వచ్చిందంటే, ఎర్రబెల్లి కొంతమంది వ్యక్తులతో కలసి కేసీఆర్ని కలిసేంత వరకూ వచ్చింది. అది ఎర్రబెల్లి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టబోతున్నారని, త్వరలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిపదవి పొందబోతున్నారన్న పుకార్లు రావడానికి కూడా కారణమైంది. అయితే ఎర్రబెల్లి వెంటనే ఆ పుకార్లను ఖండించారు. తాను వేరే కారణం వల్ల కేసీఆర్ని కలిశానే తప్ప పార్టీ మారడానికి కాదని వివరణ ఇచ్చారు.   ఇలా ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించడానికి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేశారు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేశారు. ఇద్దరి మనసులనూ కలిపే ప్రయత్నం చేశారు. అయితే అటు రేవంత్ రెడ్డిగానీ, ఇటు ఎర్రబెల్లిగానీ తమ వాదన నుంచి వెనక్కి తగ్గడానికిగానీ, విభేదాలు మరచి స్నేహపూర్వకంగా వ్యవహరించడానికి గానీ అంగీకరించనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలను స్థానిక నాయకులకే అప్పగించారు. అయితే ఇలాంటి చిన్న చిన్న వివాదాలతో తెలంగాణ నాయకులు దూరాన్ని పెంచుకుంటూ వుండటం చంద్రబాబుకు ఇబ్బందిని కలిగిస్తోంది.   ఇదిలా వుంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాక్కుని తమ పార్టీలో చేర్చుకోవడానికి టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకరు ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టయితే వారి మీద పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం, ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేసే అవకాశం వుంటుంది. అందుకే మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు ఒకేసారి పార్టీ మారినట్టయితే వారి మీద అనర్హత వేటు పడే ప్రమాదం వుండదు. అందువల్ల సాధ్యమైనంత ఎక్కువమంది ఎమ్మెల్యేలను సమీకరించి పార్టీ మారేలా చేయాలన్నది టీఆర్ఎస్ వ్యూహమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అలా టీడీపీ ఎమ్మెల్యేలను ఒక్క తాటి మీదకు తెప్పించే బాధ్యతను టీఆర్ఎస్ అధినేత ఎర్రబెల్లి భుజస్కందాల మీద పెట్టారని కూడా అంటున్నారు. అయితే ఎర్రబెల్లి మాత్రం తాను పార్టీ మారే అవకాశమే లేదని స్పష్టంగా చెబుతున్నారు.

విజయవాడలో ఔటర్ రింగ్‌రోడ్ పనులు త్వరలో ప్రారంభం...

  ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు దేశమంతా విజయవాడ వైపు ఆసక్తిగా చూస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజధానిగా విజయవాడ పరిసరాలు సాధించే అద్భుతమైన ప్రగతిని దేశమంతా ఊహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ నగరానికి కంఠహారంలా నిలిచే ఒక అద్భుతమైన ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కాబోతోంది. ఆ ప్రాజెక్టు మరేదో కాదు... విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్. అయితే ‘విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్’ అంటే తాజాగా ప్రభుత్వం సంకల్పించిన విజయవాడ, గుంటూరు తెనాలి, మంగళగిరి (వీజీటీఎం)లను కలిపే రింగ్‌రోడ్ అనుకునే అవకాశం వుంది. కానీ ఈ ఔటర్ రింగ్‌రోడ్ అది కాదు. ఇది ఎప్పటి నుంచో ప్రతిపాదనలో వుండి, కాంట్రాక్ట్ ఒప్పందాలు కూడా పూర్తయిన విజయవాడ బైపాస్ ఔటర్ రింగ్ రోడ్. వీజీటీఎం పరిధిలో నిర్మించే భారీ ఔటర్ రింగ్ రోడ్డు కంటే నిర్మాణం పూర్తి చేసుకునే ప్రాజెక్టు.   ఈ ఔటర్ రింగ్ ‌రోడ్డు నిర్మాణం వల్ల విజయవాడ నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి బాగా తగ్గే అవకాశం వుంది. ఈ రోడ్డు నిర్మాణానికి 2009 సంవత్సరంలోనే ప్రభుత్వ వర్గాలు శ్రీకారం చుట్టాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ రోడ్డును నిర్మిస్తారు. నేషనల్ హైవే నంబర్ 5 మీద వున్న మంగళగిరి నుంచి నేషనల్ హైవే నంబర్ 9 మీద వున్న గొల్లపల్లి వరకు నున్న, ముస్తాబాద్ మీదుగా గన్నవరం సమీపంలోని పెద్ద అవుటపల్లి మీదుగా వెళ్ళే ఈ రోడ్డు పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండుగొలను వరకు వుంటుంది. ఈరోడ్డు నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడం మాత్రమే కాకుండా. ఈ బైపాస్ రోడ్డు ఉన్నంత మేర అద్భుతమైన అభివృద్ధి జరిగే అవకాశం వుంది. ఈ ప్రాజెక్టుకు 1,664 కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి. గామన్ ఇండియా సంస్థ కాంట్రాక్టును కూడా దక్కించుకుంది. పదిహేను రోజుల్లో ఈ రోడ్డుకు సంబంధించిన పనులు మొదలయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.

రాజయ్య చెపితే నో రెడ్డి గారు చెపితే యస్

  కొన్ని రోజుల క్రితం వరంగల్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెడతామంటూ సాధ్యం కాని, అనవసరమయిన హామీలు ఇవ్వవద్దని ఉప ముఖ్యమంత్రి డా. రాజయ్యకు అందరి ముందు చివాట్లు పెట్టారు. దళితుడయిన రాజయ్యపై కేసీఆర్ ఆవిధంగా దొరతనం ప్రదర్శించడాన్ని అందరూ తప్పు పట్టారు. కానీ యన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సస్ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు, మరియు 22 మంది సభ్యులతో కూడిన తెలంగాణా కమిటీకి అధ్యక్షుడు అయిన డా. కే. సుధాకర్ రెడ్డి వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ పెట్టవలసిన అవసరం ఎంతయినా ఉందని గట్టిగా వాదిస్తున్నారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ తో ఆ కమిటీ అనేక మార్లు సమావేశమయిన తరువాత వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ స్థాపనకు మార్గం సుగమం అవడంతో తెలంగాణా ప్రభుత్వం వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ స్థాపనకు ప్రతిపాదనలను గవర్నర్ నరసింహన్ ఆమోదం కోసం పంపినట్లు తెలుస్తోంది. యన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సస్ ఇప్పుడు ఆంధ్రాకు వెళ్ళిపోతుంది కనుక ఆ లోటును భర్తీ చేసేందుకు వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పాలని ఆయన సూచిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీకి అనుబంధంగా 600 ఎకరాల విస్తీర్ణంలో ఐదు మెడికల్ కాలేజీలున్నాయని, అందువల్ల అక్కడే హెల్త్ యూనివర్సిటీ కూడా నెలకొల్పినట్లయితే ప్రభుత్వం భూసేకరణకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయవలసిన అవసరం ఉండదని ఆయన సూచిస్తున్నారు. వరంగల్ పట్టణం రాజధాని హైదరాబాదుకు సమీపంగా ఉండటమే కాకుండా రైలు రోడ్డు మార్గాల ద్వారా కలపబడి ఉన్నందున వరంగల్ పట్టణం హెల్త్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు అన్ని విధాల అనువయిందని ఆయన ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అయితే ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా హెల్త్ యూనివర్సిటీ పెడతామని చెప్పినందుకు రాజయ్యను నలుగురిలో అవమానించిన కేసీఆర్ ఇప్పుడు రాజ్య చెప్పినట్లుగానే వరంగల్లోనే హెల్త్ యూనివర్సిటీ ఎందుకు స్థాపిస్తున్నారో? ఇప్పుడు ఆయనకు ఏమని సమాధానం చెపుతారో మరి? రాజయ్య చెపితే ఒప్పుకొని కేసీఆర్, ఇప్పుడు డా. కే. సుధాకర్ రెడ్డి చెపితే ఎందుకు ఒప్పుకోన్నారో?

ఆంద్రప్రదేశ్ లో పర్యాటక విశ్వవిద్యాలయం

  ఈరోజు పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూజిలాండ్ తరహాలో రాష్ట్రంలో కూడా ఒక పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయమని కోరారు. దీనిలో రాష్ట్రంలో గల పర్యాటక ప్రాంతాలు, వాటి చరిత్ర, ప్రత్యేకతలు, రవాణా, ఆరోగ్యం, అతిధి మర్యాదలు, ఆధునిక, సాంప్రదాయ వంటలలో శిక్షణ వంటివి పాట్యాంశాలుగా పెట్టవచ్చని చంద్రబాబు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రసిద్ద పర్యాట కేంద్రాలు ఉన్నందున పర్యాటక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినట్లయితే యువతకు ఉపాధికి అవసరమయిన శిక్షణ కల్పించడమే కాకుండా, రాష్ట్రంలో పర్యాటక రంగం త్వరగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.   ఈ రంగంలో ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇంతవరకు ప్రభుత్వాలు పర్యాటక రంగానికి పెద్దగా ప్రాధాన్యతనీయకపోవడం, యువతకు సరయిన శిక్షణ లేకపోవడంతో పెద్దగా అభివృద్ధి చెందలేదు. యువత కూడా దానిపట్ల ఆసక్తి చూపలేదు. కానీ న్యూజిలాండ్ దేశంలో మాత్రం పర్యాటక రంగం బాగా అభివృద్ధి చెందడానికి పర్యాటక విశ్వవిద్యాలయం చాలా దోహదపడింది. ఈ సంగతి గమనించిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నిస్తేజంగా పడిఉన్న పర్యాటక రంగానికి ఒక కొత్త ఒఊపు నీయాలని భావిస్తూ ఈ ప్రతిపాదన చేసారు. హైదరాబాదుకి ఐటీ రంగాన్ని తీసుకువచ్చి అక్షయపాత్ర వంటి ఒక శాశ్విత ఆదాయ వనరును సృష్టించిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పర్యాటక రంగం ద్వారా ఒక శాశ్విత ఆర్ధిక వనరును అందించవచ్చని భావించడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని చెప్పవచ్చును.   ఇది కాక ఆయన ఇంకా మరికొన్ని సూచనలు, ప్రతిపాదనలు కూడా చేసారు. అవేమిటంటే,   1. వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలలో అంతర్జాతీయ స్థాయి సమావేశ మందిరాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయమని అధికారులను ఆదేశించారు.   2. దాదాపు 10, 000 మందికి సరిపోయే విధంగా 100 ఎకరాలలో ఈ సమావేశ మందిరాలు నిర్మింపబడాలి. ఇందులో కేవలం సమావేశాలే కాక పెళ్ళిళ్ళు, విందులు, జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వగైరా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించుకొనే విధంగా అన్నిఆధునిక హంగులతో నిర్మించాలి.   3. ఈ సమావేశ మందిరాలు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్దతిలో నిర్మించి నిర్వహించవలసి ఉంటుంది.   4. ఈ ప్రతిపాదనలపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి వారిని దేశవిదేశాలలో గల పర్యాటక కేంద్రాలకు పంపాలని చంద్రబాబు నిశ్చయించుకొన్నారు. మళ్ళీ ఆ టాస్క్ ఫోర్సు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటయ్యే ఒక ఉన్నత కమిటీ పర్యవేక్షిస్తుంటుంది.

చంద్రబాబుకి హరిబాబు ఉచిత సలహా

  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమయిన బీజేపీ నుండి ఒక అనూహ్య ప్రతిపాదన వచ్చింది. అది చేసిన వారు ఎవరో సాధారణ నేత కాదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు. నిన్న అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 12జిల్లాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేసారు. అంతే కాదు రాష్ట్రంలో ఏ ఏ జిల్లాలను చిన్న చిన్న జిల్లాలుగా విడదీయవచ్చో కూడా ఆయనే చెప్పారు. రాష్ట్రంలో పెద్ద జిల్లాలయిన అనంతపూరు, చిత్తూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.   ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది మేలు చేస్తుందో లేదో తెలియదు. కానీ ఖచ్చితంగా మరిన్ని కొత్త సమస్యలు సృష్టించడం మాత్రం తధ్యం. తెలంగాణా ఏర్పాటు కాగానే పది జిల్లాలుగా ఉన్న రాష్ట్రాన్ని 25 జిల్లాలుగా మారుస్తానని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో చాలా సార్లు వాగ్దానం చేసారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అందులో సాధకబాధకాలు తెలిసొచ్చాయి. అప్పటికీ కనీసం ఏడు కొత్త జిల్లాలు సృష్టిద్దామని చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. పైగా ఇదే అదునుగా కాంగ్రెస్ పార్టీ మరిన్ని కొత్త జిల్లాలు కావాలంటూ ఆందోళనలు, బందులు, నిరాహార దీక్షలు చేయడంతో తెలంగాణా ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఒకవేళ ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అటువంటి ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ అక్కడి పరిస్థితులే పునరావృతం అవడం తధ్యం.   అయినా ఉన్న సమస్యలు సరిపోవన్నట్లు ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు ఐడియా ఎందుకు వచ్చిందో హరిబాబుకి. ఆయనకు ఓపికుంటే డిల్లీ వెళ్లి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వివిధ ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటు, రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం, వైజాగ్-చెన్నై మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటివాటి గురించి పోరాడితే అందరూ హర్షిస్తారు కదా?

వచ్చే మహానాడు నాటికి జాతీయపార్టీగా తెదేపా

  రాష్ట్ర విభజన తరువాత రెండు రాష్ట్రాలలో తమ పార్టీని కొనసాగించేందుకు తెలుగుదేశం పార్టీని జాతీయపార్టీగా మార్పు చేయవలసిన అవసరం ఏర్పడింది. దీనిపై చర్చించేందుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయడు ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో నిన్న హైదరాబాదులో సమావేశమయ్యారు. వారు పార్టీ అధ్యక్షుడికి ఈ విషయంపై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. పార్టీని జాతీయపార్టీగా మారుస్తున్నందున పార్టీ పేరు కూడా అందుకు తగిన విధంగా ఉండాలని సూచించారు. అఖిలభారత తెదేపా, జాతీయ తెదేపా, తెదేపా(జాతీయ పార్టీ) వంటి కొన్నిపేర్లు సూచించారు. కానీ పార్టీలో కొందరు నేతలు పార్టీని జాతీయ పార్టీగా మార్చుతున్నప్పటికీ దాని పేరులో ఎటువంటి మార్పు చేయనవసరం లేదని చెపుతూ అందుకు ఉదాహరణగా జాతీయాపార్టీలయిన కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలను ప్రస్తావించారు.   జాతీయ పార్టీ హోదా పొందేందుకు కనీసం మూడు రాష్ట్రాలలో పార్టీ ఎన్నికలలో పోటీ చేయవలసి ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికలలో తమిళనాడు, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు పార్టీని ఇప్పటి నుండే క్రమంగా విస్తరించి, ఆ ప్రాంతాలలో పోటీ చేయడం ద్వారా ఆ అర్హత సాధించవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలు, జాతీయపార్టీలుగా ఏవిధంగా మార్పు చెందాయనే విషయంపై అధ్యయనం చేయమని చంద్రబాబు తన పార్టీ నేతలకు సూచించారు.   నిన్న జరిగిన ఈ పోలిట్ బ్యూరో సమావేశంలో పార్టీ నుండి వెళ్ళిపోయిన నామా నాగేశ్వర రావు స్థానంలో సుజనా చౌదరిని తీసుకొన్నారు. కొత్తగా రేవంత్ రెడ్డి, వెంకట వీరయ్యలను దీనిలో సభ్యులు తీసుకొన్నారు. ఆంధ్ర, తెలంగాణా రెండు రాష్ట్రాల పార్టీ శాఖలకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేయాలని, తెలంగాణాలో పార్టీ కార్యాలయం నిర్మించేందుకు అవసరమయిన భూమిని సమకూర్చమని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.   ఇవి కాక ఇంకా అనేక ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. వచ్చే ఏడాది విజయవాడలో నిర్వహించనున్న ‘మహానాడు’ సమావేశంలో పార్టీని జాతీయపార్టీగా ప్రకటించేందుకు అవసరమయిన ఏర్పాట్లు చేసేందుకు చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలకు చెందిన నేతలతో ఒక కమిటీని వేయాలని భావిస్తున్నారు.

జగన్ బాధకు అద్దం పట్టిన కధనం

  ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో చాలా ఆసక్తికరమయిన కధనం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నెహ్రు-గాంధీ వంశ పారంపర్యపాలన కొనసాగించేందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అధిష్టానానికి అత్యంత విధేయులైన వారిని, కొన్నిసార్లు అసమర్ధులను ముఖ్యమంత్రులుగా నియమిస్తోందని చెపుతూ అందుకు కొన్ని ఉదాహరణలు పేర్కొంది. ఆ తరువాత మెల్లగా కధనాన్ని ఆంద్రప్రదేశ్ వైపు మళ్ళించి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగి ఎవరూ ఊహించని విధంగా 2009ఎన్నికలలో విజయం సాధించిపెట్టేరో వివరించబడింది. ఆయన హటాన్మరణం తరువాత శాసన సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరినప్పటికీ, ఆయనకు అధికారం కట్టబెడితే ఎక్కడ తన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందో అనే భయంతో కాంగ్రెస్ అధిష్టానం మొదట అసమర్దుడయిన రోశయ్యకు ఆ తరువాత ఎటువంటి అనుభవమూ లేని కిరణ్ కుమార్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. అందువలన ముఖ్యమంత్రి కావాలనుకొన్న జగన్మోహన్ రెడ్డికి తీరని అన్యాయం జరిగిపోయింది. ఎందుకంటే అనేకమంది శాసనసభ్యులు ఆయనే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేసారు. అతని వంటి బలమయిన నేత ముఖ్యమంత్రి కాలేకపోవడం చేత రాష్ట్రం బలహీనపడింది. ఈవిధంగా రాష్ట్రాలను బలహీనపరిచి వాటిని సామంత రాజ్యాలుగా మలిచే ప్రయత్నం సమాఖ్య స్పూర్తికి ప్రమాదకరం అంటూ కధనం ముగించారు. ఈ కధనం ఏ పత్రికలో వచ్చి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు.   ఇక అసలు విషయంలోకి వస్తే ఇక్కడ ప్రస్తావించని అంశాలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో గాంధీ-నెహ్రు వంశపారంపర్య పాలన కొనసాగించడానికే ఇదంతా అని చెపుతున్నపుడు, ఇక్కడ రాష్ట్రంలో వైయస్స్ కుటుంబపాలన సాగడం చాలా అవసరమని ఏవిధంగా సమర్ధించుకొంటారు? నేటికీ వైకాపాలో వైయస్స్ భార్య విజయమ్మ, ఆయన కుమారుడు జగన్, ఆయన కుమార్తె షర్మిల ముగ్గురూ ప్రధాన పాత్ర పోషిస్తున్నపుడు కాంగ్రెస్ పార్టీలో వంశ పారంపర్య పాలనను వేలెత్తి చూపడం ఎందుకు? ఇక సుదీర్గ రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న రోశయ్య, తీవ్ర అల్లకల్లోల పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మూడేళ్ళు పాలించిన కిరణ్ కుమార్ రెడ్డిల కంటే జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా సమర్ధుడు? వారిరువురితో పోలిస్తే అతనికి ఎటువంటి అనుభవమూ లేదు కదా? అయినప్పటికీ వారు అసమర్ధులు, తను సమర్ధుడని ఏవిధంగా సమర్ధించుకొంటున్నారు?   రోశయ్య ముఖ్యమంత్రిగా రాణించలేకపోయి ఉండవచ్చును. కానీ ఆయన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయం వరకు కూడా గొప్ప ఆర్ధిక మంత్రిగా పేరు గడించిన సంగతి అందరికీ తెలుసు. అదేవిధంగా ఉదృతంగా సాగిన తెలంగాణా ఉద్యమాలు, ఆ తరువాత రాష్ట్ర విభజన, సమైక్యాంద్ర ఉద్యమాలు ఒకదాని తరువాత మరొకటి వరుసగా తరుముకొచ్చినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి తన సత్తా చాటుకొన్నారు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం ఆయన మాట విని ఉండి ఉంటే రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారేమో కూడా. కానీ అలా జరగకపోవడంతో, ఆయనకు, పార్టీకి తీరని నష్టం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా వారిరువురి కంటే తను సమర్ధుడని భావిస్తున్నారు?   ఇక తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే అది సమైక్య స్పూర్తికి విరుద్దం అని నేర్పుగా కలరింగ్ ఇవ్వడం కూడా హాస్యాస్పదం. నిజమే! కాంగ్రెస్ అధిష్టానం తనకు అత్యంత విధేయులు, నమ్మకస్తులనే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా నియమించుకొని వారిపై కర్ర పెత్తనం చేసింది. వైకాపాలోనే ఆయన నియంతృత్వ పోకడలు భరించలేక అనేకమంది సీనియర్లు ఆయనకు, పార్టీకి దణ్ణం పెట్టి బయటకు వెళ్ళిపోయిన సంగతి పెద్ద రహస్యం ఏమీ కాదు. అటువంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఎంచడం ఎందుకు?   జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత సమర్ధుడు రాజకీయ దురంధుడు అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎందుకు విజయం సాధించి ముఖ్యమంత్రి కాలేకపోయారు? తన అతివిశ్వాసమే కొంప ముంచిందని ఒకవైపు అంగీకరిస్తూనే మళ్ళీ చంద్రబాబును ఎందుకు నిందిస్తున్నట్లు? ఇలా ప్రశ్నించుకొంటూపోతే జవాబు దొరకని ప్రశ్నలు చాలానే వస్తాయి. అయితే అంతిమంగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఈ కధనం కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిపై ఎంత ఆరాటం ఉందో ఇది మరోసారి బయటపెట్టింది.

విడిపోవడం ఎలాగో పాపం స్కాట్లాండ్ వాళ్ళకి తెలీదు...

  బ్రిటన్‌లో అంతర్భాగంగా వున్న స్కాట్లాండ్ దేశంలో కొంతమంది వేర్పాటు వాదులు పుట్టుకొచ్చారు. మూడు వందల సంవత్సరాలుగా అంతర్భాగంగా వున్న బ్రిటన్లోంచి స్కాట్లాండ్‌ని విడదీయాల్సిందేనని ఉద్యమం లేవదీశారు. గత కొన్ని సంవత్సరాలుగా తెల్లారిందంటే చాలు.. కొంతమంది ఓ చోట గుంపుగా చేరడం.. ప్లకార్డులు పట్టుకోవడం.. స్కాట్లాండ్‌ని విడదీయాలని నినాదాలు చేయడం! వీరి బాధ చూసిన బ్రిటన్ మొన్న 28వ తేదీన స్కాట్లాండ్ వ్యాప్తంగా రెఫరండం నిర్వహించింది. బ్రిటన్‌తో కలసి వుంటారా వద్దా అనే పాయింట్ మీద ఎస్ ఆర్ నో చెప్పేయండని అడిగింది. అత్యంత ఉత్కంఠ భరితంగా నిర్వహించిన రెఫరెండంలో స్కాట్లాండ్ వాసులలో మెజారిటీ జనం బ్రిటన్లోనే కలసి వుండాలని నిర్ణయించడంతో ఈ ఇష్యూకి తెరపడింది. స్కాట్లాండ్ వేర్పాటువాద ఉద్యమం ముగిసింది.   అయినా స్కాట్లాండ్ వేర్పాటువాదుల అమాయకత్వం కాకపోతే, తెలివైన వాళ్ళు ఎవరైనా శాంతియుతంగా విభజన ఉద్యమం చేస్తారా? విడిపోవాలంటే ఏం చేయాలి? బ్రిటన్ వాళ్ళని నోటికొచ్చినట్టు తిట్టిపోయాలి. స్కాట్లాండ్‌ని విభజించకపోతే మారణహోమం సృష్టిస్తామని, భూకంపం తెస్తామని బెదిరించాలి. స్కాట్లాండ్‌లో వున్న బ్రిటన్ వాళ్ళు భయభ్రాంతులు అయ్యేలా చేయాలి. స్కాట్లాండ్‌ని విభజిస్తే మీకు ఫలానా ఫలానా ఉపయోగాలుంటాయని స్థానికంగా వున్న జనాన్ని ప్రలోభపెట్టాలి. బ్రిటన్ వాళ్ళు మనని దోచేస్తున్నారని స్కాట్లాండ్ ప్రజల మనసులలో విషం నూరిపోయాలి. బోలెడన్ని ఉద్యోగాలు వస్తాయని విద్యార్థులని రెచ్చగొట్టాలి. జనం మధ్య విద్వేషాలు పెంచాలి. అధికారంలో వున్నవాళ్ళకి చాక్లెట్లు వేయాలి. నోటికొచ్చిన అబద్ధాలు చెప్పాలి. విషాన్ని పంచే సొంత మీడియాని సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి రెఫరెండంలు కాకుండా ఎలాంటి అభిప్రాయ సేకరణ, తోటకూర కట్టా లేకుండా దౌర్జన్యంగా, దుర్మార్గంగా, అన్యాయంగా విభజించే మార్గాలని అన్వేషించి, వాటిని అమలులో పెట్టాలి. అవసరమైతే స్థానిక అసెంబ్లీలలో ఎమ్మెల్యేలని, పార్లమెంటులో ఎంపీలని చావగొట్టాలి... ఇలాంటివి చేస్తే విడిపోవడం వీలవుతుందిగానీ, ఇప్పటిలా శాంతియుత ప్రదర్శనలు, రెఫరెండంలు చేస్తే స్కాట్లాండ్ బ్రిటన్ నుంచి ఎప్పటికీ విడిపోదు. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు... విభజన ఉద్యమం ఎలా చేయాలో ఇండియాలోని కొంతమంది రాజకీయ నాయకులను చూసి నేర్చుకోండి. ఆ పద్ధతిలో మరోసారి ఉద్యమాన్ని మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్.

అసలు ఎందుకొచ్చావ్ మిస్టర్ జి జిన్‌పింగ్?

  చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మూడు రోజులపాటు ఇండియాలో పర్యటించి వెళ్ళారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంతో ఆయన కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుని వెళ్ళారు. ఆ ఒప్పందాలు ఎంతవరకు అమలవుతాయో లేదోగానీ, ఆయన గారి భారత పర్యటన పుణ్యమా అని దూరదర్శన్ యాంకర్ ఉద్యోగం పోయింది. చైనా నుంచి వచ్చిన అయ్యగారి పేరు జి జిన్‌పింగ్. ఇందులో జి అనే మాట XI అని వుంటుంది. ఆ మాటని సదరు యాంకర్ ‘ఎలెవన్’ జింగ్‌పింగ్ అని చదివింది. దాంతో దూరదర్శన్ అధికారులు సీరియస్‌ అయిపోయి ఆమెని ఉద్యోగంలోంచి తీసేశారు. జిన్‌పింగ్ పర్యటన వల్ల ఇండియాకి ఒరిగేదేంటో తెలియదుగానీ, ఒకరి ఉద్యోగం మాత్రం పోయింది.   అసలు జిన్‌పింగ్ ఏమైనా సూపర్ పాపులర్‌ నాయకుడా. ఆయనగారు మొన్న ఇండియాకి వచ్చేవరకూ ఆయన పేరు ఎంతమందికి తెలుసంట? జిన్‌పింగ్‌ అనడానికి బదులు జిన్‘పిగ్’ అంటే బాధపడాలిగానీ, తెలియక చేసిన పొరపాటుకి ఉద్యోగం తీసేసేంత శిక్ష దేనికంట? అయినా చైనావాళ్ళ పేర్లు మరీ విచిత్రం. ఒక పట్టాన అర్థమై చావవు. వాటిని ఎలా పలకాలో కూడా అర్థమేకాదు. అందరి పేర్లూ చింగ్‌చాంగ్ అన్నట్టే వుంటాయి. పైగా చైనావాళ్ళు వాళ్ళ పేర్లు కూడా విచిత్రమైన పద్ధతిలో పెడతారట. నామకరణం రోజున ఓ స్పూను నేలమీద విసిరేస్తారట. ఆ స్సూన్ ఎలాంటి సౌండ్ చేస్తే అలాంటి పేరు పెట్టేస్తారట. అలాంటి విచిత్రమైన ఆచారంతో పెట్టే పేర్లు విచిత్రంగా వుండక ఇంకెలా వుంటాయి? ఆ విచిత్రమైన పేరును పొరపాటుగా చదివిన పాపానికి ఒకరి ఉద్యోగమే పోగొట్టారే! అసలు చైనా పేర్లు ఇండియన్లకి తెలియాలని, నోరు తిరగాలని రూలేమైనా వుందా? ఒక్కసారి జింగ్‌పింగ్ ‌సార్ చేత ‘నరేంద్రమోడీ’ అనిపించండి.. ఎంత అందంగా పలుకుతాడో చూడండి. అసలు చైనావాళ్ళు ఏనాడైనా ఇతర దేశాల భాషలు మాట్లాడిన దాఖలాలు ఏవైనా వున్నాయా?   సరే, ఓ పెద్దమనిషి పొరుగు దేశం నుంచి మన ఇండియాకి వచ్చాడు. ‘జి’ అనేబదులు ‘ఎలెవన్’ అనడం వల్ల ఆయన గౌరవం పోయిందని అనుకుంటున్నారా? అయినా, ఆయన్ని అంత గౌరవించాల్సిన అవసరం ఏమీ కనిపించడం లేదు. ప్రతిరోజూ సరిహద్దుల్లో చైనా సైనికులు దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తూనే వుంటారు. వారిని ఏనాడైనా ఈ పెద్దమనిషి ఆపిన దాఖలాలు వున్నాయా? చివరికి ఆయన ఇండియాలో పర్యటిస్తున్న రోజుల్లో కూడా సరిహద్దుల్లో దురాక్రమణకి ప్రయత్నించి కాల్పులు జరిపారు. అలాంటి దేశాధ్యక్షుడి పేరును తప్పుగా చదివారని ఒక యాంకర్ని బంగారం లాంటి ఉద్యోగంలోంచి తీసేశారు. అసలు ఈ జింగ్‌పింగ్ ఇండియాకి రాకుండా వుంటే ఒక ఉద్యోగి రోడ్డు మీద అయినా పడకుండా వుండేవారు. నాయనా జి జింగ్‌పింగ్ అసలు నువ్వు మా ఇండియాకి ఎందుకొచ్చావ్?

మెట్రో వివాదంలోకి నన్నెందుకు లాగుతారు?

  హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో చెలరేగిన వివాదం వెనుక ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఉందని కొందరు ఆరోపణలు చేయడంతో దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “ఒకప్పుడు ఈ ప్రాజెక్టు బెంగళూరుకు తరలిపోతుంటే దానిని నేనే హైదరాబాదుకి తీసుకువచ్చాననే సంగతి చాలా మందికి తెలియదు. అటువంటివారు ఇప్పుడు నాపేరును కూడా ఈ వివాదంలోకి లాగి నాపై కూడా నిరాధారమయిన ఆరోపణలు చేయడం చాలా దురదృష్టకరం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏమయినా సమస్యలుంటే వాటిని యల్.యండ్.టీ. సంస్థ, తెలంగాణా ప్రభుత్వం కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి తప్ప ఈవిధంగా ఇతరులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం, నిందించడం మంచి పద్ధతి కాదు,” అని అన్నారు.   తెదేపా శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి మెట్రో ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని, వాటికి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని నేటికీ తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. కానీ ఆయన ఆరోపణలపై కొందరు తెరాస నేతలు ఎదురు దాడి చేయడానికే పరిమితమయ్యారు తప్ప ఇంతవరకు కూడా తెలంగాణా ప్రభుత్వం నుండి ఆ ఆరోపణలకు సరయిన సమాధానం రాకపోవడం గమనార్హం. కానీ ఆయన చేస్తున్న ఈ ఆరోపణల కారణంగా తెరాస ప్రభుత్వం ఇబ్బందులలో పడటం మాటెలా ఉన్నప్పటికీ, వాటి వలన తెదేపా-తెలంగాణా నేతల మధ్య చిచ్చు రగులుతున్నట్లు తెలుస్తోంది. అదే నిజమయితే దానివల్ల తెదేపాకు కూడా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఇది తెలిసీ కూడా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీనికి దూరంగా ఉండేందుకే మొగ్గు చూపడం గమనిస్తే, ఈ మెట్రో వివాదంలో ఆయనకు ఎటువంటి సంబంధము లేదని స్పష్టమవుతోంది. కనుక ఈ సమస్య నుండి తెలంగాణా ప్రజల దృష్టి మళ్ళించడానికే కొందరు పనిగట్టుకొని ఆయన పేరును కూడా ఈ వివాదంలోకి లాగుతున్నట్లు భావించవలసి ఉంటుంది.

‘ఎర్ర’ దొంగలు ‘పెద్దాయన’ తాలూకేనా?

  ఎర్ర చందనం దొంగల గురించి పరిశోధించేకొద్దీ అనేక నిజాలు బయటపడుతున్నాయి. ఎర్ర చందనం దొంగల వెనుక వున్న ‘పెద్దమనుషుల’ పేర్లు బయటకి వస్తున్నాయి. ఇంతకాలం తమిళనాడు నుంచి వస్తున్న ఎర్ర చందనం కూలీలు, దొంగల సహకారంతో స్థానికంగా వున్న కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం చెట్ల కొట్టివేత, ఎర్ర చందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని అనుకుంటూ వచ్చారు. అయితే ఈ ఘనకార్యంలో కొంతమంది పోలీసు అధికారుల హస్తం వున్నట్టు బయటపడింది. వారి వెనుక రాజకీయ నాయకుల హస్తం కూడా వుండొచ్చన్న అనుమానాలు కూడా వస్తున్నాయి.   ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు ఎర్రచందనం దొంగల మీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పరిశోధన జరుపుతున్నారు. ఇటీవలి కాలంలో అనేకమంది దొంగల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుకుంది. వారి దగ్గర్నుంచి కీలక సమాచారం రాబట్టింది. ఈ సమాచారంతో ఎర్రచందనం దొంగలకు సహకరిస్తున్న ఇద్దరు ఇంటిదొంగలను పట్టేసింది. ఇంతకాలం ఎర్రచందనం దొంగలకి సహకరిస్తూ సొంత ఇంటికే కన్నం వేస్తున్న ఇద్దరు పోలీసు అధికారులు అడ్డంగా దొరికిపోయారు. ఆ ఘనులు ఎవరో కాదు... ఒకరు మాజీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ జి. ఉదయ్ కుమార్, మరొకరు రాజంపేట డిఎస్‌పి జి.వి.రమణ. ఎర్రచందనం చెట్లు ఎవరూ కొట్టేయకుండా, ఎర్ర చందనం స్మగ్లింగ్ జరక్కుండా చూడండయ్యా అని వీళ్ళకి బాధ్యతలు ఇస్తే, వీళ్ళే నెలనెలా ‘కానుకలు’ అందుకుంటూ ఎర్రచందనం దొంగలకు, వారి వెనుక వున్న ‘పెద్దమనుషులకు’ అండగా నిలిచారు. ఆమధ్య కోటి రూపాయల విలువైన ఎర్రచందనం లారీ దొరికిపోయినప్పుడు దాని వెనుక ఎర్రచందనం డాన్ గంగిరెడ్డి మామ పేరు బయటపడింది. అయితే ఎఫ్ఐఆర్ రాసేప్పుడు వీరిద్దరూ ఉద్దేశపూర్వకంగా గంగిరెడ్డి మామ పేరును తప్పించారు. ఇంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ విషయంలో వీరిద్దరి ‘ఇన్వాల్వ్‌‌మెంట్’ ఒక్కటొక్కటిగా బయట పడుతోంది.   ఎర్రచందనం డాన్ గంగిరెడ్డి ఎంత ఘనుడో అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు నాయుడిని చంపడానికి ప్లాన్ చేసిన చరిత్ర కూడా అతనికి వుంది. గంగిరెడ్డి వెనుక వున్న ‘రాయలసీమ రాజకీయ శక్తులు’ కూడా ఎవరో బహిరంగ రహస్యమే. ఇప్పుడు సస్పెన్షన్‌కి గురైన ఇద్దరు పోలీసు అధికారులలో జి.ఉదయ్ కుమార్‌కి కూడా ఆ ‘రాజకీయ శక్తులతో’ సన్నిహిత సంబంధాలు వున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముఖ్యమైన పదవిలో వుండి, అందరిచేతా ‘పెద్దాయన’ అని పిలిపించుకున్న పెద్దమనిషి ఉదయ్‌కుమార్‌ని తన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమించుకున్నారు. ఆ పెద్దాయనకు అంత నమ్మకస్తుడిగా వున్న ఉదయ్ కుమార్ ఇప్పుడు ఎర్రచందనం కేసులో దొరికిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు రాష్ట్రంలో ఎర్రచందనం దొంగల వెనుక వున్న అసలు వ్యక్తి ఎవరనే దానిమీద ఇప్పటికే ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం మరింత పకడ్బందీగా విచారణ ఎర్రచందనం దొంగల వెనుక వున్న అసలు దొంగలు బయటపడతారు.

చంద్రబాబు పర్యవేక్షణలో రాజధాని నిర్మాణం?

  ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ఇప్పటికే మూడు కమిటీలు వేయబడ్డాయి. కొత్తగా రాజధాని అభివృద్ధి మండలి ఒకటి ఏర్పాటు చేయబడింది. అయితే రాజధాని నిర్మాణం కోసం ఇన్ని కమిటీలు ఎందుకని ప్రతిపక్షాల ప్రశ్న.   దానికి సంబంధిత అధికారులు చెపుతున్న సమాధానం ఏమిటంటే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో పనిచేస్తున్న కమిటీ కేవలం రాజధాని ఏవిధంగా నిర్మింపబడితే బాగుంటుంది, అందులో సాధకబాధకాలను వివిధ నగరాలలో పర్యటించడం ద్వారా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడంతో దాని పని పూర్తవుతుంది.   అదేవిధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన కొందరు మంత్రులు, శాసనసభ్యులతో కూడిన కమిటీ కేవలం భూసేకరణకే పరిమితమవుతుంది. భూసేకరణ కార్యక్రమం సజావుగా సాగేందుకు ఆ కమిటీ కృషి చేస్తుంది. భూసేకరణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికే ఆ కమిటీ పరిమితమవుతుంది. అన్నిటి కంటే అదే సంక్లిష్టమయిన వ్యవహారం కనుకనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక మంత్రులు, శాసనసభ్యులను ఆ కమిటీలో వేసారు.   ఇక ఆర్ధిక, మున్సిపల్ మరియు రవాణా శాఖల ప్రధాన కార్యదర్శులతో వేసిన మరో కమిటీ హైదరాబాదు నుండి ప్రధాన ప్రభుత్వ శాఖలను ఏవిధంగా, ఎంత కాలంలో విజయవాడకు తరలించాలి, అందుకు అవసరమయిన ఏర్పాట్లు, అందులో సాధకబాధకాలు, వివిధ శాఖలకు, అందులో పనిచేసే సిబ్బందికి, అధికారులకు విజయవాడలో ఎక్కడెక్కడ కార్యాలయాలు, ఇళ్ళు కేటాయించాలి? వాటి లభ్యత వంటి విషయాలపై సమగ్ర అధ్యయనం చేసి ప్రభుత్వానికి తగిన సలహా ఇవ్వడానికే పరిమితమవుతుంది. కనుక ఈ త్రిసభ్య కమిటీ రాజధాని నిర్మాణంతో ఎటువంటి సంబంధమూ ఉండదు.   ఇప్పుడు కొత్తగా వేయబడిన రాజధాని అభివృద్ధి మండలి మాత్రమే రాజధాని నిర్మాణంలో పూర్తి బాధ్యత వహిస్తుంది. ముఖ్యమంత్రి లేదా ఒక ఐఏయస్. అధికారి నేతృత్వంలో అనిచేసే కమిటీ, రాజధాని నిర్మాణం కోసం టెండర్లు పిలవడం, వాటి పరిశీలన, ఆమోదం, నిధుల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మండలి కనుసన్నలలోనే రాజధాని నిర్మాణం జరుగుతుందని చెప్పవచ్చును. అంతే కాదు రాజధాని నిర్మాణం కోసం కేంద్రం విడుదల చేయబోయే భారీ నిధులు కూడా ఈ మండలి ఆధీనంలోనే ఉంటాయి. వాటిని ఏవిధంగా, ఎప్పుడు ఎంత ఖర్చు చేయాలనే దానిపై ఈ మండలిదే తుది నిర్ణయం. ఇక అందులో ఇక వేరెవరి పాత్ర ఉండబోదు.   అయితే ఇటువంటి కీలకమయిన బాధ్యతలు నిర్వహించే మండలికి ముఖ్యమంత్రి చంద్రబాబే అధ్యక్షుడుగా ఉండాలని కొందరు మంత్రులు అభిప్రాయపడుతుంటే, ఇంత భారీ నిధులను ఖర్చు చేస్తునప్పుడు, అందులో భారీ అవినీతి జరిగిపోతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం ఉంది కనుక సమర్దుడు, నిజాయితీపరుడు అయిన ఒక ఐఏయస్. అధికారికి ఈ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇంత భారీ నిర్మాణ కార్యక్రమానికి ఇంత అధ్యయనం, ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమేనని ఎవరయినా అంగీకరిస్తారు.

ఎల్ అండ్ టి గాడ్గిల్‌కి కేసీఆర్ క్లాస్...

  హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇక మా వల్ల కాదు బాబోయ్ అంటూ చేతులు ఎత్తేస్తూ ఎల్ అండ్ టి సంస్థ తెలంగాణ గవర్నమెంట్‌కి లేఖ రాయడం, అది మీడియాకి లీక్ కావడం, ఆ తర్వాత అందరూ నాలుకలు కరుచుకుని వివరణలు ఇవ్వడం తెలిసిందే. లేఖ లీక్ అయిన తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ని ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ గాడ్గిల్ కలిసిన విషయం కూడా తెలిసిందే. గాడ్గిల్ కేసీఆర్ని కలిసిన సందర్భంలో కేసీఆర్ ఏం మాట్లాడారన్న విషయాలు కూడా మీడియాకి లీక్ అయ్యాయి. లేఖ లీక్ కావడం వల్ల యమా సీరియస్ అయిపోయిన కేసీఆర్ గాడ్గిల్ తన కార్యాలయంలోకి వచ్చీ రాగానే చాలా సీరియస్‌గా ఆయన మీద విరుచుకుపడినట్టు సమాచారం. ‘‘మీ నాటకాలు నాకు తెలుసు... లేఖ రాసేదీ మీరే.. దాన్ని మీడియాకి లీక్ చేసేదీ మీరే. ఆ తర్వాత మీకేమీ తెలియనట్టు మాట్లాడేదీ మీరు. ఇలాంటి పాలిటిక్స్ నా దగ్గర నడవవు. అయినా లేఖలో మీ ప్రాజెక్టుకు సంబంధించిన బాధలేవో చెప్పుకోవాలిగానీ, రాజకీయ అంశాలు ప్రస్తావించడమేంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడ్డం వల్ల హైదరాబాద్ వాల్యూ తగ్గిపోయిందని, హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అవుతుందనే నమ్మకంతోనే ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయ్యామని ఆ లేఖలో ఎందుకు రాశారు? ఏంటీ రాజకీయాలు? మీ లెటర్‌లో హైదరాబాద్‌ని చాలా డ్యామేజ్ చేశారు. దీన్ని నేను ఉపేక్షించను. ఈ లెటర్ మీడియాకి లీక్ అయిన అంశం మీద విచారణ జరిపిస్తే ఏమవుతుందో ఆలోచించుకోండి’’ అని గాడ్గిల్‌ని కేసీఆర్ దులిపేసినట్టు తెలుస్తోంది. ఇంతకాలం తన జీవితంలో ఎప్పుడైనా చాలా మర్యాదపూర్వక సంభాషణలే చూసిన గాడ్గిల్ కేసీఆర్ క్లాసు దెబ్బకి ఖిన్నుడైపోయినట్టు తెలుస్తోంది.

చైనా ద్వంద వైఖరి-భారత్ నిస్సహాయత

    ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో డిల్లీలో సమావేశమయినప్పుడు సరిహద్దు వద్ద చైనా దళాల చొరబాట్ల గురించి ప్రస్తావించి, అటువంటి వ్యవహారాలు రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ తీస్తాయని స్పష్టంగానే చెప్పినట్లు సమాచారం. ఉభయ దేశాల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు తగిన చర్యలు చేపడుతాము. సరిహద్దు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొనే శక్తి ఉభయ దేశాలకు ఉందని పడికట్టు పదాలతో సమాధానం చెప్పారు తప్ప అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తానని కానీ, ప్రస్తుతం భారత్ లోకి చొచ్చుకు వచ్చి తిష్ట వేసిన తన దళాలను వెనక్కి పొమ్మని ఆదేశిస్తానని కానీ అయన హామీ ఇవ్వలేదు.   జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో లడక్ సమీపంలో చుమ్మార్ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన 600 చైనా సైనికులు ఇప్పటికీ ఇంకా అక్కడే తిష్టవేసుకొని కూర్చొని ఉన్నారు. వారికీ చైనా హెలికాఫ్టర్ల ద్వారా ఆహార పొట్లాలు అందూతూనే ఉన్నాయి. చైనా మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చినా ఏమీ చేయలేని మన నిస్సహాయ స్థితికి బాధపడాలో లేక అదే చైనాతో డజనుకు పైగా ఒప్పందాలు కుదుర్చుకొన్నందుకు సంతోషించాలో తెలియని పరిస్థితి.

తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్న విద్యార్ధులకు కాంట్రాక్టు ఉద్యోగాలు?

  ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఒక ఆసక్తికరమయిన కధనం వచ్చింది. తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు డజను మంది విద్యార్ధి నేతలను అదే విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా తెలంగాణా ప్రభుత్వం నియమించినట్లు ఆ పత్రిక కధనం. అంతే కాక తెలంగాణాలో ఉన్న మిగిలిన విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విద్యాసంస్థలలో గల దాదాపు 350 తాత్కాలిక పోస్టులకు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్ధి నేతలకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని కధనం. అయితే ఇప్పటి వరకు నియమితులయిన డజను మంది జాతీయ అర్హత పరీక్షలలో ఉతీర్ణులు కాలేదని, ఇప్పడు చేప్పట్టిన ఉద్యోగాలకి తగిన అర్హతకూడా కలిగిలేరని, ఆ పత్రికకు ఉస్మానియాకు చెందిన అధికారి ఒకరు చెప్పినట్లు వ్రాసింది.   తెలంగాణ ఉద్యమాల కోసం విద్యార్ధులు తమ చదువులు, జీవితాలను పణంగా పెట్టి పోరాడారు. కానీ వారి త్యాగాల ఫలాలను కొందరు రాజకీయ నాయకులు ఆస్వాదిస్తున్నారిప్పుడు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే విద్యార్ధులకు బంగారు భవిష్యత్ కల్పిస్తామని చెప్పిన వారు ఇప్పుడు వారిలో కొందరికి మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగాలు విదిలించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

మెట్రో లేఖ కలకలం... అంతా ఎల్ అండ్ టి పథకమా?

  తెలంగాణ ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తాము తప్పుకుంటామని మెట్రో రైలు పనులు నిర్వహిస్తున్న ఎల్ అండ్ టి సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఎల్ అండ్ టి రాసిన లేఖ గురించి పత్రికలలో కథనాలు రావడంతో రాష్ట్ర రాజకీయాలలో కుదుపు సంభవించింది. కేసీఆర్ ప్రభుత్వంతోపాటు ఎల్ అండ్ టి సంస్థ కూడా ఉలిక్కిపడినట్టు కనిపించింది. గంటల వ్యవధిలోనే రకరకాల మీటింగ్స్ జరిగాయి. ఎల్ అండ్ టి సంస్థ ఛైర్మన్ గాడ్గిల్‌తో సీఎం కేసీఆర్ కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశాలన్నీ జరిగిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికల్లో వెలువడిన కథనాలను ఖండిస్తూ, ఆ కథనాలు తెలంగాణకు నష్టం కలిగించేలా వున్నాయని ప్రకటించింది. మెట్రో రైలు సంస్థ కూడా మెట్రో పనులన్నీ సూపర్‌గా జరుగుతున్నాయని, పనులు ఎక్కడా ఆగలేదని వివరణ ఇచ్చింది. ఎల్ అండ్ టి ఛైర్మన్ గాడ్గిల్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇలాంటి లేఖలు మామూలేనని, తాము రాసిన లేఖ ఎలా బయటపడిందో అర్థం కావడం లేదని అమాయకత్వాన్ని ప్రదర్శించారు. మొత్తమ్మీద ఎల్ అండ్ టి సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖ ప్రభుత్వంలో కదలిక తెచ్చింది. సాధ్యమైనంత త్వరగా మెట్రో రైలును పూర్తి చేయాలన్న నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చేలా చేసింది. మొత్తం మీద ఎల్ అండ్ టి లేఖ లీకేజ్ వ్యవహారం మెట్రో రైలును ఒక గాడిన పడేసిందని చెప్పవచ్చు.   అంతా బాగానే వుంది.. మరి ఇంతకీ ఎల్ అండ్ టి లేఖను బయటకి లీక్ చేసిందెవరు? దీనికి రాజకీయ పరిశీలకులు ఈ ఇష్యూ అంతా ఎల్ అండ్ టి పథకంలో భాగమేనని విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి మెట్రో రైలుకు అనేక రకాల ఆటంకాలు కలిగిస్తూ వున్నారు. మెట్రో రైలు అలైన్‌మెంట్ విషయంలోగానీ, మెట్రో రైలుకు కేటాయించిన స్థలాల విషయంలో కానీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ అయితే మేం చెప్పినట్టే ఎల్ అండ్ టీ సంస్థ వినాలి. మేం చెప్పినట్టే ప్రతిపనీ చేయాలని అన్నట్టుగా ధీమాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా కాంట్రాక్టులు చేస్తూ వ్యాపారంలో బాగా ముదిరిపోయి వున్న ఎల్ అండ్ టి సంస్థ సంస్థ కొంతకాలం తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిని గమనించి, తనదైన శైలిలో పావులు కదిపి తాను తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలను తానే బయటపెట్టి వుండొచ్చన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి తాను ఘాటుగా రాసిన లేఖను తానే లీక్ చేసి తద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి, మెట్రో పనుల విషయంలో తనకు ఏర్పడిన ఆటంకాలను తొలగించే పథక రచన చేసి వుండొచ్చని అంటున్నారు.

బీజేపీ హడావుడి అందుకేనా?

   తెలంగాణా విమోచన దిన సందర్భంగా నిన్న తెలంగాణా బీజేపీ నేతలు గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామని చాలా హడావుడి చేసారు. కానీ పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకొని అరెస్టు చేసిఅక్కడి నుండి తరలించారు. ఆ తరువాత షరా మామూలుగానే బీజేపీనేతలు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణా ప్రభుత్వం స్వయంగా అధికారికంగా తెలంగాణా విమోచన దినోత్సవం నిర్వహించకపోగా, అది చేస్తున్న తమను అడ్డుకొని అరెస్టులు చేయించారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.   బీజేపీ కోరికను కాదనడానికి ఏమీ లేదు. నిజానికి ఇంతకు ముందు తెరాస నేతలే ఈ డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఈ అంశంపై వారు పెదవి విప్పడం లేదు. అందుకు కారణాలు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డే చెపుతున్నారు. మజ్లిస్ పార్టీతో సత్సంబంధాలు నిలుపుకొనేందుకే తెరాస ప్రభుత్వం ఇందుకు వెనకాడుతోందని ఆరోపిస్తున్నారు. త్వరలో జీ.హెచ్.యం.సి. ఎన్నికలు జరగనున్నాయి కనుక అందులో గెలిచేందుకు మజ్లిస్ పార్టీ మద్దతు అవసరం ఉంటుందనే ఆలోచనతోనే తెరాస ప్రభుత్వం అధికారికంగా తెలంగాణా విమోచన దినోత్సవం జరిపేందుకు వెనుకాడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.   బహుశః ఆయన ఆరోపణలలో ఎంతో కొంత వాస్తవం ఉందని నమ్మవచ్చును. అయితే బీజేపీ నేతలు కూడా సరిగ్గా అదే కారణంతో అంటే రానున్న జీ.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఇంత హడావుడి చేసారని తెరాస ఆరోపిస్తే దానికి బీజేపీ ఏమి సమాధానం చెపుతుందో?   అయితే గోల్కొండ కోటలో ఇదేవరకే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించి, గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సంగతి బీజేపీ నేతలు పట్టించు కోకుండా, ఇప్పుడు కోటపై జెండా ఎగురవేయాలనుకోవడం దేనికంటే బహుశః ప్రజల దృష్టిని ఆకర్షించేందుకేనని చెప్పక తప్పదు. నిజానికి వారు ఆపని చేయదలిస్తే ఇదివరకు తెలంగాణా ప్రభుత్వం గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు పురావస్తు శాఖ నుండి ఏవిధంగా అనుమతి తీసుకొని చేసిందో అదేవిధంగా బీజేపీ కూడా చేసి కోటపై జెండా ఎగురవేసి ఉండవచ్చును. కానీ బీజేపీ నేతల ఉద్దేశ్యం కోటపై జెండా ఎగురవేయడం కాక జెండా ఎగురవేయడానికి వెళుతున్న తమను తెలంగాణా ప్రభుత్వం అడ్డుకొందని ప్రజలకు చాటి చెప్పి వారి దృష్టిని ఆకర్షించడమే కనుక ఇంత హడావుడి చేసి ఉండవచ్చును.   కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా తెలంగాణా విమోచన దినోత్సవం జరిపినంత మాత్రాన్న ముస్లిం ప్రజలందరూ దానిని వ్యతిరేఖిస్తారా? చరిత్రలో జరిగిన కొన్ని ప్రధాన ఘటనలని స్మరించుకొనంత మాత్రాన్న ప్రజలలో వ్యతిరేఖత ఏర్పడుతుందనే ఆలోచనే ఒక అపోహగా చెప్పుకోవచ్చును. ఒకవేళ అదే నిజమయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోట మీద కేసీఆర్ మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేసినందుకు ముస్లిం ప్రజలు ఆయనకు దూరం అయ్యి ఉండేవారు. కానీ కాలేదు.   ఏ కులం, మతం, ప్రాంతానికి చెందిన ప్రజలయినా ప్రభుత్వాల పనితీరును చూసే అధికారం కట్టబెడతారు తప్ప ఇటువంటి కారణాలను చూసి కాదు. అయినప్పటికీ రాజకీయ పార్టీలు తమ అపోహల నుండి ఎన్నడూ బయట పడలేకపోతున్నాయి. అందుకు ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

ఇక ఆ హీరో మనవాడే

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి, సమర్ధత కారణంగా చేజారి పోయిందనుకొన్న హీరో మోటార్ సైకిల్స్ కంపెనీ మళ్ళీ ఆంద్రప్రదేశ్ వైపే మొగ్గు చూపుతూ నిన్న ఆయన సమక్షంలోనే హైదరాబాదులో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద పత్రాలపై (యం.ఓ.యూ.) సంతకాలు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్ళీ పదేళ్ళ తరువాత రాష్ట్రానికి ఒక ప్రముఖ సంస్థ రావడం తనకు చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. ఇలాగే వోల్క్స్ వ్యాగన్ కార్ల తయారీ సంస్థను కూడా రాష్ట్రానికి రప్పించడానికి కృషి చేస్తానని అన్నారు. ఇటువంటి పెద్ద పరిశ్రమలను రాష్ట్రానికి ఆకర్షించగలిగితే రాష్ట్ర విభజన కారణంగా ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలను అవలీలగా అధిగమించవచ్చని ఆయన అన్నారు.   హీరో మోటార్ సైకిల్స్ సంస్థ జనరల్ మేనేజర్ రాకేశ్ వశిష్ట మాట్లాడుతూ, అన్ని సజావుగా సాగినట్లయితే నేటి నుండి సరిగ్గా 18 నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ లో తమ కర్మాగారం నుండి మోటార్ సైకిల్స్ తయారయి బయటకు రావచ్చునని తెలిపారు. తమ సంస్థలో ప్రత్యక్షంగా 3000మందికి పరోక్షంగా మరో 7000 మందికి ఉపాధి దొరుకుతుందని తెలిపారు.   ఈ కర్మాగారం పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలుపెడితే ఏడాదికి దాదాపు 11లక్షల ద్విచక్ర వాహనాలు తయారవుతాయని అంచనా. అందుకోసం హీరో కంపెనీ మొత్తం రూ.3,100కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది. దానిలో మోటార్ సైకిల్స్ తయారీ మరియు పరిశోధన విభాగంపై రూ.1,600 కోట్లు, అనుబంధ సంస్థలపై మరో రూ.1,500 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది.ఇది భారతదేశంలో ఆరవ మరియు దక్షిణ భారతదేశంలో మొట్ట మొదటి ఉత్పత్తి కేంద్రం అవుతుంది.   చిత్తూరు వద్ద గల శ్రీసిటీ సెజ్ వద్ద 600ఎకరాల స్థలం ఈ సంస్థకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఏపీఐఐసీకి చెందిన ఈ భూములలో కొంత భాగం ప్రస్తుతం రైతుల అధీనంలో ఉంది. దానిలో వారు పంటలు సాగుచేసుకొంటున్నారు. వారిని ఆ భూముల నుండి త్వరలో ఖాళీ చేయించి హీరో సంస్థకు భూమిని అప్పగిస్తామని ఏపీఐఐసీ చైర్మన్ పీ.కృష్ణయ్య తెలిపారు.

రియల్ ‘హీరో’ కంభంపాటి!

  ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పారిశ్రామికంగా ఒక అద్భుతమైన ఘనతను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో హీరో మోటార్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి హీరో మోటార్స్ సంస్థ శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. నిన్నమొన్నటి వరకు హీరో సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమను ఏర్పాటు చేయబోతోందని అందరూ అనుకున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా హీరో మోటార్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి షిఫ్ట్ అయిపోవడం, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను, పరిణామాలను గమనిస్తున్న వారిని ఈ ‘ట్విస్ట్’ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమర్థతకు జాతీయ స్థాయి నుంచి కూడా అభినందనలు అందేలా చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ఘనత సాధించడానికి కీలకంగా నిలిచిన వ్యక్తి, ఈ ఇష్యూలో రియల్ ‘హీరో’గా నిలిచిన వ్యక్తి మరెవరో కాదు... తెలుగుదేశం నాయకుడు కంభంపాటి రామ్మోహనరావు.   కంభంపాటి రామ్మోహనరావు తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. వివాదాలకు చాలా దూరంగా వుండే వ్యక్తి. తెలుగుదేశం నాయకత్వం మనసెరిగి ప్రవర్తిస్తూ, పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేసిన నాయకుడు. కంభంపాటి సమర్థతను గుర్తించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించి ఆయన సేవలను అందుకుంటున్నారు. ఇటీవల కాశ్మీర్‌‌లో వరదలు సంభవించినప్పుడు ఆ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థులతోపాటు తెలంగాణకు చెందిన విద్యార్థులను కూడా అక్కడి నుంచి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ తెలుగువారందరికీ అండగా వుంటుందనే విషయాన్ని మరోసారి చాటారు.   ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హీరో పరిశ్రమ ఏర్పాటు కావడానికి కూడా కంభంపాటి రామ్మోహనరావే కీలకం అయ్యారు. కంభంపాటి గత 26 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ డీలర్‌గా వ్యవహరిస్తున్నారు. సమర్థుడైన డీలర్‌గా హీరో సంస్థలో ఆయనకు మంచి పేరు వుంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్‌కాంత్ ముంజాల్‌తో కూడా కంభంపాటికి సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో కంభంపాటి ఆయనను హీరో కర్మాగారాలకు తీసుకెళ్ళారు. ఏపీలో హీరో ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అప్పుడే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ ప్రయత్నాలకు కామా పడింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కంభంపాటి రంగంలోకి దిగారు. హీరో సంస్థ దక్షిణాదిలో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలియగానే అధికారులతోపాటు రంగంలోకి దిగిన కంభంపాటి తనకున్న పరిచయాలను ఉపయోగించి హీరో మోటర్స్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేలా చేశారు.   హీరో మోటార్స్‌కి దక్షిణాదిలో తొలి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతుంది. ఈ పరిశ్రమ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు పదివేల మందికి ఉపాధి లభించే అవకాశం వుంది. ఈ పరిశ్రమ వల్ల రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు విజయవంతంగా చెక్ పెట్టే అవకాశం వుంది. హీరో పరిశ్రమ దక్షిణాదిలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మరో ఆరు నెలల సమయం తీసుకోవాలని భావించింది. అయితే కంభంపాటి చొరవతో అది ముందుగానే, అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడం సాధ్యమైంది. ఒక మంచి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కావడానికి కీలక వ్యక్తిగా నిలిచిన కంభంపాటిని తెలుగుదేశం పార్టీ వర్గాలు అభినందిస్తున్నాయి. రియల్ ‘హీరో’ అని అభినందిస్తున్నాయి. కంభంపాటి లాంటి చిత్తశుద్ధి కలిగిన వ్యక్తుల కృషి ఆంధ్రప్రదేశ్‌ని అనతికాలంలోనే అగ్రస్థానంలో నిలబెడుతుందన్న నమ్మకం అక్కడి ప్రజల్లో మరింత బలపడుతోంది.