ఉందిలే మంచి కాలం ముందు ముందునా..
posted on Sep 26, 2014 @ 12:25PM
రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా దయనీయంగా మారిన సంగతి అందరికీ తెలుసు. ఆర్ధిక లోటు కారణంగా ప్రభుత్వానికి కాళ్ళు, చేతులు కట్టేసినట్లుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఈ పరిస్థితులను కూడా ఒక సవాలుగా స్వీకరిస్తాను తప్ప వాటిని చూసి నిరాశపడబోనని చెప్పడమే కాదు ఆచరణలో పెట్టి మరీ చూపిస్తున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే నెల మొదటి వారం నుండి రూ.10000కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసేందుకు సిద్దపడుతున్నారు. విభజన బిల్లులో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి ఉన్నత విద్యా సంస్థలు, పరిశ్రమలు, నిధులు, ప్రత్యేకహోదా కోసం గట్టిగా కృషి చేస్తున్నారు.
ఆ కారణంగానే ఇటీవల కేంద్రం నుండి రెండు వేర్వేరు బృందాలు పశ్చిమ గోదావరి జిల్లాలో యన్.ఐ.టీ. (నేషనల్ ఇన్స్తిటిట్యూట్ అఫ్ టెక్నాలజీ), తూర్పు గోదావరిలో పెట్రోలియం విశ్వవిద్యాలయం స్థాపన కొరకు తగిన ప్రాంతాన్ని, భవనాలను ఎంపిక చేసేందుకు వచ్చేరు. ఇప్పటికిప్పుడు భవన నిర్మాణం సాధ్యం కాదు కనుక అంతవరకు ఆ రెండు జిల్లాలో ఉన్న కాలేజీలలోనే వచ్చే ఏడాది నుండి తరగతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.
ఇక రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే తెలంగాణకు తరలిపోతుందనుకొన్న హీరో మోటార్స్ సైకిల్స్ తయారీ సంస్థ చిత్తూరుకి వస్తోంది. అదేవిధంగా అమెరికాలో స్థిరపడిన ఆంద్ర పారిశ్రామిక వేత్తలకు చెందిన దాదాపు 16 చిన్న మరియు మధ్య తరగతి ఐ.టీ. కంపెనీలు, త్వరలో రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషి ఫలించినట్లయితే, పరిశ్రమలకు భారీగా పన్ను రాయితీలు ఉంటాయి కనుక ఇంకా అనేక దేశ విదేశ సంస్థలు రాష్ట్రానికి తరలి రావచ్చును.
పరిశ్రమలు రావాలంటే ముందుగా అందుకు సరిపోయే విద్యుత్ సరఫరా కూడా ఉండాలి. అందుకే విశాఖలో 4,000 మెగా వాట్స్ సామర్ధ్యంతో యన్టీపీసీ ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నిర్మాణానికి, కర్నూలు మరియు కడప జిల్లాలో 2500 మెగా వాట్స్ సామర్ధ్యం గల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు కేంద్ర విద్యుత్ శాఖతో కొద్ది రోజుల క్రితమే ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసారు.
అదే విధంగా ఇంతవరకు ఎవరూ పట్టించుకోని పర్యాటక రంగానికి కూడా చంద్రబాబు నాయుడు చాలా ప్రాధాన్యం ఇచ్చి దాని ద్వారా కూడా రాష్ట్ర ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తున్నారు. అందువల్ల ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఇవన్నీ అమలయితే రాష్ట్రాదాయం ఊహించనంతగా పెరిగే అవకాశం ఉంది.
రాజధాని, వైజాగ్ నుండి చెన్నై వరకు పారిశ్రామిక కారిడార్, వైజాగ్, విజయవాడ, తిరుపతిలలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఒక కొలిక్కి వచ్చినట్లయితే ఇక ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రమే పూర్తిగా మారిపోతుంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి, చక్కటి రాజధాని నిర్మించి చూపినట్లయితే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పినట్లు మరో 20 ఏళ్ళపాటు తెదేపా అధికారం చెలాయించుకోవచ్చును.