వైకాపా తీరు మారదా?

 శాసనసభలో నేడు వైకాపా సభ్యులు, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి అవలంభించిన ద్వంద వైఖరి వ్యవహరించిన తీరు చూస్తే వారికి ఇంకా పాత అలవాట్లు పోలేదనిపించింది. ఇదివరకు భూటకపు సమైక్యవాదంతో, సమైక్య ఉద్యమాలతో సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొని ఎన్నికలలో గెలుద్దామని భంగపడినట్లే, మళ్ళీ ఇప్పుడు కూడా రాజధాని విషయంలో రభసచేసి రాయలసీమ ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నించి మంత్రి అచ్చెం నాయుడు చేతిలో భంగపడ్డారు.   రాజధానిపై చర్చకు పట్టుబడుతూ సభను స్తంభింప జేసిన వైకాపా సభ్యుల నేత జగన్మోహన్ రెడ్డిని, “అసలు మీ పార్టీ రాజధానిని ఎక్కడ నిర్మించాలని కోరుకొంటోందో స్పష్టంగా చెప్పండి,” అని మంత్రి అచ్చెం నాయుడు నిలదీయడంతో, జగన్ నోట కాసేపు మాట రాలేదు. ఎందుకంటే ఆయన ఏ ప్రాంతం పేరు చెప్పినా మరో ప్రాంతం వారికి అది ఆగ్రహం కలిగించవచ్చును. బహుశః అందుకే రాజధానిపై తమ పార్టీ వైఖరి చెప్పకుండా, ఆ సమస్యను అధికార తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టేసి రాజధానిపై చర్చ అంటూ సభలో నానా రభస చేసి రాయలసీమ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. అయితే తీరా చేసి అచ్చెం నాయుడు నిలదీసినప్పుడు జగన్ ఏ కడపో, కర్నూలో అనంతపురమో అని దైర్యం చేసి చెప్పి ఉంటే కనీసం అక్కడి ప్రజల మద్దతు ఆయనకు దొరికి ఉండేది. కానీ చెప్పలేకపోయారు.   మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో రాజధాని అని ప్రకటించిన తరువాత, కోస్తా ఆంధ్రాలో కూడా తన పార్టీకి ఇబ్బంది లేకుండా చూసుకొనేందుకు, తాము కూడా ఆ ప్రతిపాదనకు స్వాగతం పలుకుతున్నామని జగన్ ప్రకటించారు. అంతేకాక అంతవరకు సభలో నానా రభస చేసిన వైకాపా సభ్యులు రాజధానిపై జరిగిన చర్చలో ఎంచక్కా పాల్గొన్నారు. అటువంటప్పుడు ఈ రభస అంతా ఎందుకంటే రాయలసీమ ప్రజలను ఆకట్టుకోవడానికేనని అర్ధమవుతోంది.   అయితే వైకాపా అనుసరించిన ఈ ద్వంద వైఖరి వలన రెండు ప్రాంతాల ప్రజలలో ఆయన పట్ల మరింత అపనమ్మకం పెరుగుతుందే తప్ప ఆయన చేసిన పనిని మెచ్చుకొనేవారు ఉండరు. నిజాయితీకి, విశ్వసనీయతకు, విలువలకు తానే కేర్ ఆఫ్ అడ్రెస్స్ అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో కూడా తన ద్వంద వైఖరిని ప్రదర్శించి తనలో, తన పార్టీ తీరులో ఎటువంటి మార్పులు రాలేదని మరోసారి నిరూపించి చూపారు.

రాజధానిపై రభస

  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్చించాల్సిన అధికార, ప్రతిపక్షాలు ఒకదానినొకటి విమర్శలు చేసుకొంటున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ దీనిపై శాసనసభలో ఎటువంటి చర్చకు అనుమతించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొంటోందని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైకాపా ఆరోపిస్తుంటే, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి సభా వ్యవహారాలు తెలియకుండా వ్యవహరిస్తున్నారని, సభలో అజెండాపై చర్చించకపోగా అజెండాను తానే నిర్ణయించాలనుకోవడం అవివేకమని అధికార పార్టీ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాజధాని అంశంపై సభలో ముందు చర్చించిన తరువాతనే ప్రకటన చేయాలని వైకాపా డిమాండ్ చేస్తుంటే, ప్రకటన చేసిన తరువాతనే దానిపై చర్చ జరపాలనే చిన్న విషయం కూడా ప్రతిపక్ష పార్టీకి తెలియదని అధికార పార్టీ సభ్యుల సమాధానం. అధికార పార్టీ ఇందులో తన ప్రయోజనాలను మాత్రమే చూసుకొంటోంది తప్ప దీర్ఘకాల రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని వైకాపా ఆరోపిస్తుంటే, వైకాపా తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని తెదేపా సభ్యుల ఆరోపణ.   ఈ విధంగా అధికార ప్రతిపక్షాల సభ్యులు ప్రకటనకు ముందు చర్చ జరగాలా లేక తరువాత జరగాలా అనే దానిపై తీవ్రంగా వాదోపవాదాలు చేసుకొన్నారు తప్ప రాజధాని ఏర్పాటుపై జరగవలసిన అసలు చర్చ జరపకుండానే సభలో నుండి బయటపడ్డారు. వారి ఈ ఆరోపణ ప్రత్యారోపణలు, విమర్శలు ప్రతి విమర్శల మధ్య అసలు విషయం కనబడకుండా పోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు సభలో రాజధాని అంశంపై ఒక ప్రకటన చేసేవరకు కూడా బహుశః సభలో ఈ రభస కొనసాగినా ఆశ్చర్యం లేదు. కనీసం ముఖ్యమంత్రి ప్రకటన తరువాతయినా సభలో దీనిపై అర్ధవంతమయిన చర్చ జరిగితే చూసి తరించాలని ప్రజలు కూడా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వారిది అత్యాశేమీ కాదు కదా!

అఖిలపక్ష సమావేశం మంచిదే కదా

  ఇంతవరకు రాజధాని విషయంపై వ్యూహాత్మకంగా మౌనం పాటించిన వైకాపా ఇప్పుడు తెదేపా ప్రభుత్వం విజయవాడ-గుంటూరు వద్ద రాజధాని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకొన్న తరువాత అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టింది. అభివృద్ధి చెందిన ప్రాంతంలో రాజధాని నిర్మించడం కంటే, వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో నిర్మిస్తే ఆ ప్రాంతం కూడా రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని వైకాపా వాదన. అదేవిధంగా రాజధాని ఏర్పాటుపై శివరామ కృష్ణన్ కమిటీ సమర్పించిన నివేదికను కూడా బహిర్గతం చేయమని ప్రతిపక్షాలు గట్టిగా కోరుతున్నాయి. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి లోతుగా చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొన్న తరువాతనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని కోరుతోంది. అసెంబ్లీలోకి అడుగుపెట్టలేని కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతోంది.   రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన విషయం కనుక కాంగ్రెస్, వైకాపాల సూచనలను తప్పుపట్టలేము. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పనిని మొదటే చేసి ఉండి ఉంటే చాలా హుందాగా ఉండేది. ఇప్పటికయినా మించి పోయింది ఏమీ లేదు కనుక ప్రభుత్వం ఒకసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించినట్లయితే ప్రతిపక్ష పార్టీలను గౌరవించినట్లు ఉంటుంది. వారి నుండి ప్రభుత్వానికి ఇంకా ఏదయినా మంచి సలహా దొరికినా దొరకవచ్చును. పైగా వారిని సంప్రదించి నిర్ణయం తీసుకొంటున్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక ఎవరూ నిందించే అవకాశం ఉండదు. ఒకవేళ అందరూ కలిసి కూర్చొని చర్చించిన తరువాత ఈ అంశంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసినట్లయితే ప్రజల దృష్టిలో అవే పలుచనవుతాయి. కానీ ప్రభుత్వం రాజధానిపై ఒక నిర్ణయం ప్రకటించిన తరువాత, ఇక ఆ తరువాత వచ్చే సమస్యలన్నిటికీ రాష్ట్రప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయం కూడా గుర్తుంచుకోవాలి.   కర్నూలు రాజధానిని చేయమని కోరుతున్న రాయలసీమ ప్రజలు విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు చేసినట్లయితే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించడమే కాకుండా అప్పుడే రెండు మూడు సార్లు కర్నూలులో ధర్నాలు, ర్యాలీలు బహిరంగ సభలు, బందులు నిర్వహించారు. అందువలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శాసనసభలో తన నిర్ణయం ప్రకటించేసిన తరువాత ఎదురవ్వబోయే ఇటువంటి సమస్యలతో ప్రతిపక్షాలకు ఎటువంటి సంబందమూ ఉండదు కనుక అవి కూడా రాష్ట్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించవచ్చును. అందువలన ప్రభుత్వం ప్రతిపక్షాలతో కూడా ఈ అంశంపై చర్చించడమే అన్ని విధాల ఉత్తమం. అయితే ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఈ అంశంపై రాజకీయాలు చేయకుండా నిజాయితీగా వ్యవహరిస్తే అందరూ హర్షిస్తారు. కానీ పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సున్నితమయిన ఈ అంశంపై రాజకీయాలు చేస్తే ప్రజల దృష్టిలో మరింత పలుచనవడం ఖాయం.

మంచి ముహూర్థం ఒకటే సరిపోతుందా?

  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అంశంపై నిన్న శాసనసభలో ప్రకటన చేయవలసిఉంది. కానీ, రేపు దశమి మంచిరోజు కనుక రేపే ప్రకటన చేయాలని నిర్ణయించుకొన్నారు. అందుకు సిద్దాంతులు మధ్యాహ్నం 12.57 నిమిషాలకి ముహూర్తం కూడా ఖరారు చేసారు. రాజధానిపై ప్రకటనకు మంచి ముహూర్తం చూసుకోవడం వరకు బాగానే ఉంది. కానీ విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న రాయలసీమవాసుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వారికి ముందుగా నచ్చజెప్పి ప్రకటన చేసినట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా పనిమొదలవుతుంది కనుక మొదలుపెట్టిన వేళా విశేషం అని తృప్తి పడటానికి అవకాశం ఉండేది. కానీ మంచి ముహూర్తం చూసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేసిన తరువాత రేపటి నుండి రాష్ట్రంలో మళ్ళీ ఉద్యమాలు, నిరసనలు మొదలయితే అది రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా!

తెలంగాణాలో పర్యటిస్తా..పార్టీని బలోపేతం చేస్తా..చంద్రబాబు

  తెదేపా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీని వీడటంపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందిస్తూ, “తెలుగుదేశం పార్టీకి పార్టీ కార్యకర్తలే బలం. పార్టీలో నుండి ఎందరు నేతలు బయటకు వెళ్ళిపోయినా, నేటికీ పార్టీ అంతే పటిష్టంగా నిలబడి ఉండటమే అందుకు ఒక సజీవ ఉదాహరణ. అందువలన ఒకరిద్దరు నేతలు పార్టీని వీడిపోయినంత మాత్రాన్న పార్టీకి ఎటువంటి నష్టం లేదు. పార్టీకి ఎల్లప్పుడు అండగా నిలబడుతున్న కార్యకర్తలలో నుండే సమర్దులయిన నాయకులను తయారుచేసుకోగల శక్తి నాకుంది. అందువలన ఒక నేత బయటకు వెళ్లిపోతే వందమంది నేతలను తయారు చేసుకొనే శక్తి, అవకాశం నాకుంది. తెలంగాణాలో కూడా పార్టీని బలోపేతం చేసుకోవడమే కాకుండా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తప్పకుండా విజయం సాధించే విధంగా పార్టీని తీర్చిదిద్దుతాను. త్వరలోనే ఖమ్మం జిల్లాలో మరియు ఇతర తెలంగాణా జిల్లాలో కూడా నేను పర్యటించి పార్టీ కార్యకర్తలతో, స్థానిక నేతలతో మాట్లాడుతాను,” అని అన్నారు.   చంద్రబాబు స్పందన అందరూ ఊహించిందే. కానీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన, తెలంగాణకు సమయం కేటాయించగలరా లేదో అనుమానమే. ఒకవేళ చెప్పినట్లుగానే ఆయన తెలంగాణాలో తరచూ పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసుకోగలిగితే మంచిదే. కానీ వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో తెదేపాను పూర్తిగా ఖాళీ చేసేస్తామని పదేపదే చెపుతున్న అధికార తెరాస పార్టీ చూస్తూ ఊరుకొంటుందని భావించలేము. కనుక ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పర్యటించగలిగినట్లయితే, అప్పుడు తెరాస కూడా తప్పకుండా ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయడం తధ్యమని చెప్పవచ్చును.

తుమ్మల వెనుక అదృశ్యహస్తం ఎవరిది?

  చెరువు మీద అలిగిన సామెత చందాన తెలుగుదేశం పార్టీని విడిచిపెడతా... విడిచిపెడతా అని ఎప్పటి నుంచో బెదిరిస్తూ వచ్చిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఎట్టకేలకు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తెలుగుదేశం అధినేతకు ఏకవాక్య రాజీనామా లేఖను రాసేసి, ఆ లేఖమీద సంతకం చేసే సమయంలో కన్నీరు కూడా పెట్టుకుని సెంటిమెంట్ సీన్ పండించారు. ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం పార్టీలో వున్న తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఖమ్మం జిల్లా టీడీపీలోని తన ప్రత్యర్థి నామా నాగేశ్వరరావును సాకుగా చూపించి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై కొట్టారు. ఇటీవల తుమ్మల అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం నాయకులు తుమ్మలను పరామర్శించారు. తమ సొంత మనిషి అనారోగ్యానికి గురయ్యారన్న సానుభూతిని ప్రదర్శించారు. అయితే ఆ సమయంలో తుమ్మల త్వరలో చేరబోయే పార్టీకి సంబంధించిన వారెవరూ పరామర్శించిన పాపాన పోలేదు. దీన్ని గమనించైనా తుమ్మల తెలుగుదేశం పార్టీని వీడరన్న అభిప్రాయాలు కలిగాయి. అయితే, తుమ్మల ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన మర్నాడు చేసిన ఘనకార్యం తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడమే. తుమ్మల తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టడం పార్టీకి నష్టమా, ఆయనకే నష్టమా, పార్టీని విడిచినందుకు ఆయనకు లభించిన ‘హామీలు, తాయిలాలు’ వాస్తవరూపాన్ని ధరిస్తాయా, చివరకు చెవిలో పూలుగా మిగులుతాయా.... ఇలాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. అయితే ఎంతో అనుబంధం వున్న తెలుగుదేశం పార్టీని తుమ్మల విడిచిపెట్టడం వెనుక వున్న అదృశ్యహస్తం గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.   ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అధినేతగా వున్న ఒక వ్యక్తి అదృశ్య హస్తం తుమ్మల తెలుగుదేశం పార్టీ వీడటానికి కారణమైందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ ‘మీడియా వ్యక్తి’ తుమ్మలకు సన్నిహితుడు. ఆయనగారు తుమ్మలకు తెలుగుదేశం పార్టీలో వున్న అసంతృప్తిని కనిపెట్టారు. అలాగే తెలంగాణలోని అధికార పార్టీకి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడి అవసరాన్నీ గుర్తించారు. ప్రస్తుతం తెలంగాణలో తన మీడియా సంస్థకు సంబంధించి ఇబ్బందిని ఎదుర్కొంటున్న ఆయన ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడేలా ఒక పథకం ఆలోచించారు. అది తుమ్మలను తెలుగుదేశం నుంచి బయటకి తీసుకొచ్చి తెలంగాణ పార్టీలో చేర్పించడం ద్వారా అటు తుమ్మలకు వున్న అసంతృప్తిని తొలగించడం, ఇటు తెలంగాణ పార్టీకి ఉన్న నాయకత్వ లోటుని తీర్చడం. ఈ ఉభయులకూ ఈ మేలు చేయడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో తన మీడియాకి వున్న ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోయేలా చేసుకోవడం. ఈ ప్లాన్‌తో పావులు కదిపి, సంప్రదింపులు జరిపిన ఆయన ఇప్పటి వరకు కొంతమేర సక్సెస్ అయ్యారు. కాకపోతే ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్ ఏమిటంటే, సదరు మీడియా వ్యక్తి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కూడా సన్నిహితుడు కావడం. అంటే, తన మీడియా సంస్థను కాపాడుకోవడం కోసం తన సన్నిహితుడి పార్టీకే చిల్లు పెట్టడానికి ఆవ్యక్తి పూనుకున్నాడన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్గాలవారు తుమ్మల పేరు చెబితే ఎంత కస్సుమంటున్నారో సదరు ‘మీడియా వ్యక్తి’ పేరు చెప్పినా అంతకంటే ఎక్కువ బుస్సుమంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికైనా ఆ వ్యక్తి అసలు స్వరూపాన్ని అర్థం చేసుకుని దూరంగా పెడితే మంచిదని భావిస్తున్నారు.

బొగ్గు గనుల కేటాయింపుల రద్దుకు కేంద్రప్రభుత్వం సిద్దం

  ఇటీవల సుప్రీం కోర్టు 1993 నుండి 2010సం.వరకు జరిగిన అన్నిబొగ్గు గనుల కేటాయింపులు అక్రమమయినవేనని ప్రకటించింది. వాటిపై సుప్రీం కోర్టు పంపిన నోటీసులపై మోడీ ప్రభుత్వం వెంటనే స్పందిస్తూ, తను కూడా కోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపడమే కాక, కోర్టు సూచించిన మొత్తం కేటాయింపులన్నిటినీ రద్దు చేసి వాటికి మళ్ళీ కొత్తగా వేలం వేసేందుకు సంసిద్దత వ్యక్తం చేయడం విశేషం. అయితే వాటిలో 40 బొగ్గు గనులపై ఆధారపడి నడుస్తున్న విద్యుత్ ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకొని, వాటి కేటాయింపులపై తగిన నిర్ణయం తీసుకోవలసిందిగా కోర్టుని కోరింది. బొగ్గు గనుల కేటాయింపుల ఒప్పందాలను అన్నిటినీ రద్దు చేసి, మళ్ళీ వేలం వేసేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు సూచించినట్లు ఈ అక్రమ కేటాయింపులను విచారించేందుకు సుప్రీం కోర్టు రిటర్డ్ జడ్జీలతో కూడిన కమిటి ఏర్పాటును వ్యతిరేఖించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దాదాపు ఇరవై ఏళ్లుగా జాతి సంపదను పందికొక్కులా దోచుకొని తిన్న పెద్ద కంపెనీలు, బడా పారిశ్రామిక వేత్తలు వారితో కుమ్మక్కయిన రాజకీయ నేతలు, అధికారుల పట్ల ఉదాసీనత చూపడం అంటే ఈ అవినీతిని కొనసాగింపుకి అనుమతించినట్లే అవుతుంది. అందువలన వారందరిపై చట్టపరంగా కటిన చర్యలు తీసుకోవడమే కాక, వారు ఇంతకాలంగా కొల్లగొట్టిన జాతి సంపదను కక్కించడం కూడా అంతే అవసరం. అదేవిధంగా ఒకేసారి అన్ని అనుమతులు రద్దు చేసినట్లయితే, వాటిపై ఆధారపడి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యుత్ సంస్థల ఉత్పత్తికి అంతరాయం కలగకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.

మెదక్ సీటు కోసం కాంగ్రెస్ ఆరాటం

  తెలంగాణా ఇచ్చిన కారణంగా తెలంగాణా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే గంపగుత్తగా ఓట్లేసేస్తారని దురాశకు పోయి భంగపడిన టీ-కాంగ్రెస్ పార్టీ నేతలు ఈసారి ఎలాగయినా మెదక్ ఉపఎన్నికలలో పార్టీ అభ్యర్ధి సునీతా లక్ష్మా రెడ్డిని గెలిపించుకొని తమ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నారు. తమ భరోసాతో రాష్ట్ర విభజనకు పూనుకొని తీవ్రంగా నష్టపోయానని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానికి మెదక్ సీటును గెలుచుకొని బహుమతిగా అందివ్వాలని టీ-కాంగ్రెస్ నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకే ఈసారి టీ-కాంగ్రెస్ నేతలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ విబేధాలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్దం అవుతున్నారు. అయితే తెరాస అధినేత కేసిఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టినప్పటికీ, ప్రజలను ఆకట్టుకొనే విధంగా చాలా దూకుడుగా పరిపాలన కొనసాగిస్తునందున తెరాసపై కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడం కొంచెం కష్టమేనని చెప్పక తప్పదు. అదీగాక కేసీఆర్ రాజీనామాతో ఖాళీ అయిన మెదక్ లోక్ సభ సీటును ఎలాగయినా తిరిగి దక్కించుకోవాలని తెరాస కూడా చాలా పట్టుదలగా ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అభ్యర్ధి విజయం కోసం మరింత చెమటోడ్చక తప్పదు. కాంగ్రెస్, తెరాసలు చాలా బలమయిన అభ్యర్ధులు నిలబెట్టి చాలా గట్టిగా కృషి చేస్తునందున, కొత్తగా బీజేపీలోకి చేరి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న జగ్గారెడ్డి వారి ముందు చాలా బలహీన అభ్యర్ధిగా కనిపిస్తున్నారు. అందువలన బహుశః పోటీ ప్రధానంగా తెరాస, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉండవచ్చును.

మోడీ ప్రభుత్వం కాపీ కొట్టేస్తోందిట

  ఇటీవల దేశవ్యాప్తంగా చాలా అట్టహాసంగా ప్రారంభించబడిన ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పధకంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశ ప్రజలకు ఎన్నో గొప్ప గొప్ప కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఏమిచేయలేక యూపీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలను ఒకటొకటిగా కాపీ కొడుతూ వాటికి పేర్లు మార్చి తమ పధకాలుగా గొప్పలు చెప్పుకొంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిష్క్ సింఘ్వీ ఎద్దేవా చేసారు. తాము 2004లో అధికారం చేప్పట్టిన తరువాత దేశంలో 43.9 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయగా, తాము 2014లో అధికారం నుండి దిగిపోయే సమయానికి అవి 77.32 కోట్లు ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం కృషి వలన చివరి మూడు సం.లలో 67,000 నుండి ఒకేసారి 2.48 లక్షల ఖాతాలు పెరిగాయని గణాంకాలతో సహా వివరించారు. తాము ఇంతగా కృషి చేసి దేశ ప్రజలందరికీ బ్యాంక్ ఖాతాలు ఏర్పాటు చేస్తే, మోడీ ప్రభుత్వం కనీసం ఆ విషయం ఎక్కడా ప్రస్తావించకుండా, ఇప్పుడే కొత్తగా ప్రవేశపెడుతున్నట్లుగా చాలా ఆర్భాటంగా ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పధకం ప్రవేశపెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది చూస్తే మోడీ ప్రభుత్వం అప్పుడే చేతులేట్టేసినట్లే ఉందని ఆయన ఎద్దేవా చేసారు.   అయితే ప్రజలకు అర్ధం కాని విషయం ఏమిటంటే, కేవలం బ్యాంకు ఖాతాలు తెరిపించినంత మాత్రాన్న ఏమయినా ఒరుగుతుందా? అదే నిజమయితే ఇప్పటికే బ్యాంకు ఖాతాలున్న77.32 కోట్ల మంది ప్రజలు తమ సమస్యలు, బీదరికం నుండి బయటపడిపోయినట్లేననుకోవలసి ఉంటుంది. కనుక దేశంలో మిగిలిన వారి చేత కూడా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తునందుకు మోడీ ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోగా తమ పధకాన్ని కాపీ కొట్టేస్తున్నారని విమర్శించడం ఎందుకు? కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా ఇదేదో సర్వ రోగ నివారిణిగా భావిస్తున్నట్లున్నాయి.

రాజధానిపై కావలసింది చర్చలు, ఆరోపణలు కాదు

  అధికార తెదేపా నేతలు రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఏర్పాటు చేయాలని కోరుకొంటున్న విషయం పెద్ద రహస్యమేమీ కాదు. రాజధాని ఎక్కడ ఏవిధంగా నిర్మించాలనే విషయంపై అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవలసి ఉంటుందని నిపుణుల కమిటీ ఇదివరకే చాలా సార్లు చెప్పినప్పటికీ, అధిచ్చిన నివేదిక వారి అభిప్రాయానికి పూర్తి భిన్నంగా ఉండటంతో ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరమయిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ అంశంపై మరింత లోతుగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నారు.ఇది సవ్యమయిన పద్ధతి. కానీ, మాజీ కాంగ్రెస్ నేత రాయపాటి సాంభశివరావు కమిటీ సభ్యులపై, వారిచ్చిన నివేదికపై చేసిన తీవ్ర ఆరోపణలు, రాష్ట్రప్రభుత్వానికే కొత్త సమస్యలు సృష్టించేలా ఉన్నాయి.   మారుమూల ప్రాంతమయిన దోనకొండ వద్ద రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ సభ్యులు అసలు ఆ ప్రాంతాన్ని సందర్శించకుండానే తమ నివేదికను తయారుచేసారని, కమిటీ సభ్యులలో కొందరు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున స్థలాలు కొనుగోలు చేసినందునే అక్కడ రాజధానికి సిఫార్సు చేసారని తీవ్ర ఆరోపణలు చేసారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన శివరామ కృష్ణన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగానే తన నివేదికను తయారుచేసిందని, దానిని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రభావితం చేసారని ఆయన ఆరోపించారు.   కమిటీ ఇచ్చిన నివేదిక ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినమాట వాస్తవం. అయితే అందుకని రాయపాటి సాంభశివరావు కమిటీపై ఈవిధమయిన ఆరోపణలు, విమర్శలు చేయడం అనుచితం. కమిటీ సభ్యులు అసలు దోనకొండకే వెళ్లలేదని చెపుతూనే అక్కడ వారు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసారని చెప్పడం ఏవిధంగా సమంజసం? గత ప్రభుత్వం కమిటీని నియమించింది కనుక కమిటీపై అటు కేంద్రంలోనూ, ఇటు రెండు రాష్ట్రాలలోను అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉందనే ఆయన వాదన అర్ధరహితం. ఇక కొందరికి లబ్ది చేకూర్చేందుకే దోనకొండను రాజధానిగా సూచించారన్న ఆయన కమిటీపై చేసిన ఆరోపణలకు బహుశః ప్రతిపక్షాలు సరయిన సమాధానమే చెప్పవచ్చును.   రాజధాని ఎక్కడ ఏవిధంగా నిర్మించాలనేది సాంకేతిక అంశం. అందుకే ఆయా రంగాలలో నిపుణులతో కూడిన కమిటీని వేసారు. అయితే ఈ అంశంపై ప్రజల, ప్రతిపక్షాల అభిప్రాయాలకు విలువ ఈయాల్సి ఉంటుంది కనుక దానిపై లోతుగా చర్చ జరగడం కూడా చాలా అవసరమే. కానీ అందరు ఏకాభిప్రాయానికి రావడమనేది అసంభవం కనుక మెజార్టీ ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగవలసి ఉంటుంది. అంతే కాని కమిటీపై ఈవిధమయిన అర్ధం లేని విమర్శలు, ఆరోపణలు చేయడంవలన సమస్య మరింత జటిలమవుతుంది వేరే ఒరిగేదేమీ ఉండదని గ్రహిస్తే మేలు.   ఈ నివేదిక అందగానే రాష్ట్ర ప్రభుత్వం చర్చించుకొని అఖిలపక్ష పార్టీ సమావేశం నిర్వహించి అభిప్రాయాలు పంచుకొనే ప్రయత్నం చేస్తే ఈ సమస్య మరింత ముదరకుండా అడ్డుకట్ట వేయవచ్చును. కానీ సున్నితమయిన ఈ అంశంపై నేతలందరూ ఈవిధంగా రాజకీయాలు చేయడం వలన ఇప్పటికే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. కనుక ఇకనయినా రాజకీయ నేతలందరూ సంయమనం పాటిస్తూ ఈ సమస్యకు విజ్ఞతతో పరిష్కరించే ప్రయత్నం చేయాలని ప్రజల కోరిక.

యూపీ ఉపఎన్నికల ప్రచారానికి మొహం చాటేసిన సోనియా, రాహుల్

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 11 అసెంబ్లీ నియోజక వర్గాలకు సెప్టెంబర్ 13న జరగనున్న ఉపఎన్నికలకు అన్ని పార్టీలు భారీ ప్రచారం చేసేందుకు సన్నదమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ మాత్రం ఈసారి ప్రచారానికి దూరంగా ఉండేందుకు నిశ్చయించుకొన్నారు. అయితే అందుకు కారణాలు వారు చెప్పన్నప్పటికీ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆ తల్లి కొడుకుల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఘోరపరాభవం పాలయిందని అందరూ అభిప్రాయపడుతున్నందున, ప్రాంతీయ పార్టీల, బీజేపీ ప్రభావం అధికంగా ఉండే ఈ ఉప ఎన్నికలలో కూడా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే పార్టీలో తమ స్థానం మరింత క్రిందకు దిగజారుతుందనే భయంతోనే వారిరువురూ ఎన్నికల ప్రచారంలో పాల్గోవడం లేదని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.   కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మెకన్ బీజేపీ ఆరోపణలను త్రిప్పి కొడుతూ, “అయితే బీహార్, ఉత్తరాఖండ్ మరియు కర్ణాటకలో ఉపఎన్నికల ప్రచారానికి నరేంద్ర మోడీ ఎందుకు వెళ్ళలేదు? ఆయన ప్రచారానికి వెళ్ళకపోతే మేము ప్రశ్నించామా? అని ఎదురు ప్రశ్నించారు. ఆయన వాదన వినడానికి సొంపుగానే ఉన్నప్పటికీ, అదొక వితండవాదం అని అర్ధమవుతూనే ఉంది.   సోనియా, రాహుల్ గాంధీ ఇరువురూ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి సారధ్యం వహించారు కనుక ఆ పార్టీ ఓటమికి వారే బాధ్యులవుతారు. అదేవిధంగా బీజేపీని మోడీ గెలిపించారు కనుక ఆ ఖ్యాతి మొత్తం ఆయనకే దక్కుతుంది. సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని ఒంటిచేత్తో గెలిపించి మోడీ తన సత్తా చాటి చూపారు. అందుకే ఆయన ఇప్పుడు దేశానికి ప్రధానమంత్రి కాగలిగారు. అందువల్ల ఆయన తన సత్తాను మళ్ళీ మళ్ళీ నిరూపించుకొనవసరం లేదు. కానీ, తను గాంధీ-నెహ్రూ వంశానికి చెందినందున ప్రధానమంత్రి పదవి తన జన్మహక్కు అని రాహుల్ గాంధీ భావించి భంగపడ్డారు. పార్టీకి నాయకత్వం వహించలేని వ్యక్తి ప్రధానమంత్రి అయిపోదామనుకోవడం అత్యాశే అవుతుంది. పార్టీ ఓటమి తరువాత దానికి గల కారణాలు విశ్లేషించుకొని, ఆయన మళ్ళీ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టే బదులు, పూర్తిగా అస్త్ర సన్యాసం చేసేసి ఉత్తరకుమారుడు అనిపించుకొంటున్నారు. మళ్ళీ తల్లి సోనియాగాంధీయే పార్టీ భాధ్యతలను భుజానికెత్తుకోవలసి వస్తోంది. అందుకే ఆయనకు ఈ దెప్పిపొడుపులు తప్పడం లేదు. రాహుల్ గాంధీ రాజకీయాలలో రాణించలేనప్పుడు అందులోనే కొనసాగుతూ ఇంకా అవమానాలు పాలవడంకంటే, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలాగ రాజకీయసన్యాసం పుచ్చేసుకొంటే, ఆయనలాగే ఇక ఏ నిందలుపడకుండా హాయిగా కాలక్షేపం చేసేయోచ్చు కదా?

తుమ్మల రాజీనామా తెదేపాకు మేల్కొలుపు?

  తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందించిన తుమ్మల నాగేశ్వరరావు నిన్నపార్టీకి రాజీనామా చేయడంతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన పార్టీ తెలంగాణా నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యి ఈ అంశంపై చర్చించారు. అటువంటి సమర్దుడయిన సీనియర్ నేతను పోగొట్టుకోవడం తెదేపాకు చాలా నష్టం కలిగిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన పార్టీ వీడకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయిన తెదేపా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడం సహజమే. ‘తెదేపా నాయకుల మీద కాక కార్యకర్తల అండతోనే బలంగా ఉందని, ఒకరు పోతే వందమంది నేతలను తయారు చేసుకొంటామని’ అని చెప్పుకొంది. అయితే ఇదివరకు కడియం శ్రీహరి, దాడి వీరభద్ర రావు వంటి సీనియర్ నేతలు పార్టీని వీడినప్పుడు కూడా తెదేపా ఇదేవిధంగా స్పందించింది తప్ప వారి స్థానాలలో మళ్ళీ అంతటి సమర్దులయిన నాయకులను ఏర్పాటు చేసుకోవడంలో అశ్రద్ధ వహించిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశః ఇప్పుడు కూడా అదే ఉదాసీనత కనబరచవచ్చును.   పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నపుడు, ఆంధ్రాలో రాష్ట్ర విభజనకు వ్యతిరేఖంగా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు కూడా రెండు ప్రాంతాలకు చెందిన పార్టీ నేతలను చంద్రబాబు నాయుడు ఎంతో జాగ్రత్తగా కాపాడుకొచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ చక్కబడిన తరువాత పార్టీ నుండి నేతలు ఒకరొకరుగా జారిపోకుండా జాగ్రత్తపడలేక పోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నా, ఆయన పని ఒత్తిడి కారణంగా ఇదివరకులా పార్టీ తెలంగాణా శాఖపై దృష్టి పెట్టలేకపోవడం వలననే ఈవిధంగా జరుగుతోందని భావించవచ్చును.   అసలు తెలంగాణాలో అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు అధికార తెరాస పంచన ఎందుకు చేరుతున్నారు? అనే ప్రశ్నకు జవాబు అందులోనే కనబడుతుంది. రాజకీయ నేతలందరూ తాము కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాలలోకి ఉన్నామని ఎన్ని కధలు చెప్పినా వారి లక్ష్యం అధికారం, పదవులు చెప్పట్టడమేననేది ఎవరికీ తెలియని విషయం కాదు. అందుకు తుమ్మల కూడా మినహాయింపు కాదు. అందుకే ఆయన కేసీఆర్ మంత్రివర్గంలో బెర్త్ ఖాయం చేసుకొని గోడ దూకేసారని వార్తలు వినిపిస్తున్నాయి. తుమ్మలను పార్టీలోకి ఆకర్షించి ఖమ్మం జిల్లాలో బలహీనంగా ఉన్న తెరాసను బలోపేతం చేసుకోవాలని తెరాస అధ్యక్షుడి ఆలోచన కావచ్చును. వచ్చే ఎన్నికల సమయానికి తెలంగాణాలో తెదేపాను ఖాళీ చేసేస్తామని తెరాస నేతలు చెప్పిన మాట తెదేపా అధిష్టానం సీరియస్ గా తీసుకొన్నట్లు లేదు. కానీ తెరాస మాత్రం సీరియస్ గానే చెప్పిందని తుమ్మల రాజీనామా రుజువు చేసింది.   చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలతో తలమునకలవక ముందే తెలంగాణాకు ప్రత్యేకంగా పార్టీ అధ్యక్షుడిని, పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారిలో ఐఖ్యత, సమన్వయం లోపించడంతో పార్టీలో నేతలందరూ ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణా ఏర్పడిన తరువాత ఒక్క మహానాడు సమావేశంలో తప్ప ఆ తరువాత పార్టీ నేతలందరూ ఒక్క వేదికపైకి వచ్చి గట్టిగా మాట్లాడిన సందర్భాలు లేవనే చెప్పవచ్చును. తెదేపా-తెలంగాణా నేతలందరూ మంచి రాజకీయ అనుభవజ్ఞులే కానీ వారిలో ఐఖ్యత లోపించడంతో పార్టీ సమావేశాలు, కార్యక్రమాలు కూడా తగ్గిపోయాయి. దీనితో పార్టీలో చాల స్తబ్ధత, నిరుత్సాహ వాతావరణం నెలకొని ఉంది.   ఇటువంటి సమయంలో వారందరికీ పార్టీ అధినేత అండదండలు, ప్రోత్సాహం, మార్గదర్శనం, వారి భవిష్యత్ కు భరోసా చాలా అవసరం ఉంది. కానీ అదే వారికి దొరకడంలేదని చెప్పవచ్చును. తెదేపా పదేళ్ళపాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను, కార్యకర్తలను చైతన్యంగా ముందుకు నడిపిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఏవిధంగా ముందుకు నడిపించారో ఇప్పుడు కూడా అదేవిధంగా చేయగలిగితే బహుశః ఇటువంటి పరిస్థితి తలెత్తదు. కానీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక క్లిష్టమయిన బాధ్యతలు తలకెత్తుకొన్న చంద్రబాబు నాయుడు, తన తెలంగాణ శాఖపై ఇది వరకులా దృష్టి పెట్టగలరా? లేదా? లేకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేస్తారు? అవి ఎంతవరకు ఫలిస్తాయి? అనే దానిపైనే పార్టీ మరియు నేతల భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలంగాణా విద్యుత్ సమస్యలకు పరిష్కారమేది?

  తెలంగాణాలో ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ఇంతవరకు అవిభాజ్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, తెదేపాలే కారణమని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అంతకంటే ముందు ఇన్నేళ్ళుగా తెలంగాణాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణా ప్రజాప్రతినిధులందరినీ కూడా నిందించవలసి ఉంటుంది. వారికే కనుక తమ తెలంగాణాను అభివృద్ధి చేసుకోవాలనే తపన ఉండి ఉంటే, తమ మద్దతుతోనే నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణాకు అన్ని సాధించుకొనే అవకాశం ఉంది. కానీ వారు ఎంతసేపు తమ పదవులు, అధికారం, పార్టీల రాజకీయ ప్రయోజనాల గురించే చూసుకొన్నారు తప్ప తెలంగాణా గురించి పట్టించుకోలేదు.   అయితే ఇప్పుడు గతం త్రవ్వుకొని విమర్శలు చేసుకోవడంకంటే, ఈ సమస్య నుండి బయటపడేందుకు ఇకపై ఏమి చేయాలని ఆలోచించడమే ఉత్తమం. తెలంగాణా ప్రభుత్వం ఆ దిశగా గట్టిగా కృషి చేస్తోంది కానీ ఈ విద్యుత్ సమస్యల నుండి బయటపడేందుకు కనీసం మరో రెండేళ్ళు పట్టవచ్చని చెపుతోంది.   రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత చేప్పట్టిన అనేక చర్యల మూలంగా క్రమంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేయబడటం కళ్ళెదుటే కనబడుతోంది. కేంద్ర విద్యుత్ గ్రిడ్ నుండి అదనపు విద్యుత్ సంపాదించడమే కాకుండా కేంద్రప్రభుత్వం అక్టోబరు రెండు నుండి ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్న ‘నిరంతర విద్యుత్ సరఫరా’ పైలట్ ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి ఆయన సాధించుకొన్నారు.   ఇవ్వన్నీ కేంద్రప్రభుత్వంతో చంద్రబాబు సత్సంబంధాలు నెలకొల్పుకోవడం వలననే సాధ్యమవుతోందని వేరే చెప్పనక్కరలేదు. కానీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు నెలలలో అటు కేంద్రం, ఇటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలతో నిత్యం ఘర్షణ వైఖరే అవలంబించడం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా ద్వేషిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుండి కూడా కేసీఆర్ కు స్నేహహస్తం అందిస్తూనే ఉన్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్దమని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకొందామని సూచిస్తూనే ఉన్నారు. కానీ గవర్నర్ నరసింహన్ కలుగ జేసుకోనేంతవరకు కేసీఆర్ ఏనాడు సానుకూలంగా స్పందించిన దాఖలాలు లేవు.   కానీ ఇప్పటికయినా కేసీఆర్ అటు కేంద్రంతో, ఇటు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంతో సత్సంబంధాలు పెంచుకొనే ప్రయత్నం చేస్తే, బహుశః రెండు వైపుల నుండి కూడా సహాయం లభించే అవకాశం ఏర్పడుతుంది. పరిశ్రమలు, పంటలు ఏ రాష్ట్రానికి చెందినవయినా వాటివల్ల అన్ని రాష్ట్రాల ప్రజలు ఏదోవిధంగా ప్రయోజనం పొందుతుంటారు. కనుక ఆంధ్రా, తెలంగాణా ప్రభుత్వాలు రెండు కూడా తమ రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం తమ విభేదాలు, బేషజాలు, అహం అన్నీపక్కనబెట్టి ఒకదానికొకటి అన్ని విధాల సహకరించుకొంటూ సమస్యల నుండి బయటపడేందుకు కృషి చేస్తే అందరూ హర్షిస్తారు.   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో మిగులు విద్యుత్ ఉంటే దానిని మొట్ట మొదట తెలంగాణాకే ఇస్తానని ప్రకటించారు. ప్రస్తుతం మిగులు విద్యుత్ లేకపోయినా, రాష్ట్రంలో విద్యుత్ కొరత అంతగా లేదు కనుక వీలుంటే తెలంగాణా రాష్ట్రానికి కొంత విద్యుత్ కేటాయించగలిగితే అక్కడి పరిశ్రమలు, పంటలను కాపాడుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయపడితే, రేపు తెలంగాణా ప్రభుత్వం కూడా అదేవిధంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించే అవకాశం ఉంటుంది.

జగ్గారెడ్డిని ఓడించాలా?

  తూరుపు జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి మెదక్ లోక్ సభ ఉపఎన్నికలలో బీజేపీ టికెట్ పై పోటీ చేస్తున్నారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేఖించిన ఆయనను ఓడించడమే ద్యేయంగా పనిచేస్తామని ఉస్మానియా జేఏసీ ప్రకటించింది. కాంగ్రెస్, తెరాసలు కూడా ఆయనపై తెలంగాణా వ్యతిరేఖి అనే ముద్రవేసి ఓడించాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ వారందరూ ఆయనను ఓడించేందుకు ఇంతగా శ్రమ పడనవసరం లేదు. ఆయన టికెట్ కోసం బీజేపీలో చేరడంతోనే, ఆయన ఓటమి ఖరారు అయిపోయిందని చెప్పవచ్చును. ఏవిధంగా అంటే, అందుకు అనేక కారణాలు చెప్పుకోవచ్చును.   ఆయన బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నప్పటికీ, ప్రజలకు కాంగ్రెస్ నేతగానే చిరపరిచితుడు, కానీ ఆఖరి నిమిషంలో బీజేపీలో చేరిన ఆయనను ప్రజలు బహుశః బీజేపీ నేతగా గుర్తించేందుకు ఇష్టపడకపోవచ్చును. కొత్తగా పార్టీలో చేరిన జగ్గారెడ్డి కోసం ప్రచారం చేసేందుకు పేరున్న పెద్ద నేతలెవరూ వచ్చే అవకాశం లేదు. కనుక ఆయన స్వంత బలంపైనే ఆధారపడి పోటీ చేయవలసి ఉంటుంది. కానీ బలమయిన కాంగ్రెస్, తెరాస అభ్యర్ధులను ఎవరి మద్దతు, సహాయ సహకారాలు లేకుండా జగ్గారెడ్డి తన స్వంత బలంపైనే గెలవడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చును. కాంగ్రెస్ అభ్యర్ధి సునితా లక్ష్మారెడ్డి మంత్రిగా చేసిన అనుభవం, జిల్లాలో అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు, ముఖ్యంగా పార్టీలో అందరి అండదండలు ఉన్నాయి.   ఇక తెరాస అభ్యర్ధి కే. ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వం, దానిని నడిపిస్తున్న కేసీఆర్, ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే మంత్రులు, పార్టీ నేతలు అండగా నిలబడి ఉన్నారు. కనుక ఆయన గెలుపు దాదాపు ఖాయమనే చెప్పవచ్చును.   కానీ జగ్గారెడ్డికి అన్నీ ప్రతికూలంశాలే కనబడుతున్నాయి. ఆయనపై తెలంగాణా వ్యతిరేఖి అనే ముద్ర ఉండనే ఉంది. దానికి తోడు ఆయనకు ఆంధ్రాకు చెందిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారం వలన ఆయనకు మేలు జరుగకపోగా, ప్రజలలో తీవ్ర వ్యతిరేఖత ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణా మంచి ప్రజాధారణ ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన చేస్తున్న విమర్శలు కూడా ప్రజలలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేఖత కలిగించే అవకాశం ఉంది. బీజేపీతో ఎన్నికలు పొత్తులు పెట్టుకొని, బీజేపీ నేతలతో భుజాలు భుజాలు రాసుకొని తిరుగుతున్న తెదేపా నేతలే కేంద్రం చేత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు ఒక్క పైసా కూడా రప్పించలేక ఆపసోపాలు పడుతుంటే, జగ్గారెడ్డి మాత్రం తనను గెలిపిస్తే కేంద్రం నుండి భారీగా నిధులు తీసుకు వచ్చి మెదక్ జిల్లాను అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తుండటం నమ్మశక్యంగా లేదు. అందువల్ల ఆయనను ఓడించేందుకు ఎవరూ ప్రయాస పడనవసరం లేదు. బీజేపీ తరపున నామినేషన్ వేసినపుడే ఆయన ఓటమి ఖరారయిపోయిందని చెప్పవచ్చును.

ఇంతకీ అసెంబ్లీ సమావేశాలు దేనికోసం నిర్వహిస్తున్నట్లో?

  ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర శాసన సభలో వ్యవహరిస్తున్న తీరు చూసి విసిగిపోయిన ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన బహుశః హౌస్ అంటే తన ‘లోటస్ పాండ్’ హౌస్ అని భావిస్తునందునే సభా మర్యాదలు కూడా పాటించకుండా చాలా అహంకారంగా మాట్లాడుతున్నారని, ఆయనకు కనీసం సభా వ్యవహారాలపై కూడా ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈరోజు సభలో వైకాపా సభ్యుడు జలీల్ ఖాన్ మాట్లాడుతూ అధికార పార్టీ సభ్యులు శాసనసభను పార్టీ కార్యాలయంలా భావిస్తూ, ప్రతిపక్షాల గొంతు నొక్కి అంతా ఏకపక్షంగా నడిపిస్తున్నారని ప్రతివిమర్శ చేసారు. ఈవిధంగా జగన్ శాసనసభను ‘లోటస్ పాండ్’ గా భావిస్తున్నారని అధికార పార్టీ ఎద్దేవా చేస్తే, అధికార పార్టీ సభను పార్టీ కార్యాలయంలా నడిపిస్తోందని ప్రతిపక్ష పార్టీ ఎద్దేవా చేసింది. అంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ కూడా సభను సభలా నడపడం లేదని అంగీకరిస్తున్నట్లే ఉంది.   విలువయిన ప్రజాధనంతో నడుస్తున్న చట్ట సభలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు, ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఈవిధంగా ఒకరినొకరు నిందించుకోవడానికే వృధా చేయడం బాధ్యతారాహిత్యమే. అధికార, ప్రతిపక్షాలు ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి చర్చించి, వాటికి పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేయకుండా ఈవిధంగా కాలక్షేపం చేయడం తమనెనుకొన్న ప్రజల పట్ల చులకన భావం ప్రదర్శించడమేనని చెప్పక తప్పదు. ఈ వారం రోజులలో స్సమావేశాలలో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ఒక్క ఆలోచనా చేయలేదు. ఒక్క సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. సభలో ప్రజా సమస్యలను చర్చించి వాటికి పరిష్కారాలు కనుగొనలేనప్పుడు, ఒకరినొకరు తిట్టుకోవడానికి, విమర్శించుకోవడానికే అయితే ప్రజాధనం వృధా చేస్తూ ఈ సమావేశాలు నిర్వహించడం దేనికి? ఆ పనేదో అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీ కార్యాలయాలలోనే మీడియా సమావేశాలు పెట్టుకొని చేసుకొంటే సరిపోతుంది కదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఈ రకంగా కూడా కాంగ్రెస్ వల్ల ఏపీకి నష్టం...

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టే దాఖలాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు లేదంటూ ప్రజలు గత ఎన్నికలలో స్పష్టంగా చెప్పినా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ని గబ్బిలం పట్టుకున్నట్టు పట్టుకుని వేలాడుతోంది. అలాంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కి ఎలాంటి లాభాలు లేకపోగా ఎన్నో నష్టాలు ఎదురవుతున్నాయి. తాజాగా మరో నష్టం ఎదురవుతోంది.   నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఆకస్మిక మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నికను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అయితే మంచి నాయకుడు తంగిరాల మరణం ఆ ప్రాంతంలోని ప్రజల మనసులను కలచివేసింది. ఆ స్థానం నుంచి ఆయన కుమార్తె సౌమ్యను అసెంబ్లీకి పంపించాలన్న అభిప్రాయం అందరిలోనూ వుంది. ఇండిపెండెంట్లు ఎవరూ పోటీచేసే ఉద్దేశంలో లేరు. ఒకవేళ ఎవరైనా పోటీ చేసినా వారికి సర్దిచెప్పి నామినేషన్ ఉపసంహరింపజేసే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా ఇక్కడ పోటీ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే శోభానాగిరెడ్డి మరణం వల్ల ఖాళీగా వున్న ఆళ్ళగడ్డ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టకుండా వుండాలంటే నందిగామ స్థానం నుంచి తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య మీద అభ్యర్థిని పోటీకి నిలపకుండా వుండాలి. ఒకవేళ వైసీపీ తన అభ్యర్థిని ఇక్కడ పోటీకి నిలిపినా గెలిచే అవకాశాలు లేవు. అందువల్ల వైసీపీ అభ్యర్థిని నిలిపే ఆలోచనలో లేనట్టు తెలుస్తోంది.   అయితే నందిగామ నుంచి కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ అభ్యర్థిని నిలపాలని నిర్ణయం తీసుకుంది. బోడపాటి బాబూరావును ఈ స్థానం నుంచి పోటీలో నిలిపింది. ఆయన నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సమాధి అయిపోయిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికే ఇక్కడ పోటీకి నిలబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీకి నిలవడం వల్ల ఇక్కడ ఎన్నిక తప్పనిసరి అయ్యే అవకాశం వుంది. దానివల్ల ఎన్నిక నిర్వహణకు ప్రజాధనం చాలా ఖర్చవుతుంది. రూపాయి కూడా ఖర్చు కాకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరగాల్సిన స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీకి నిలబడి ఈ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది.

బీజేపీ దుస్థితికి అద్దం పడుతున్న మెదక్ ఉపఎన్నికలు

  ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో తెదేపాతో పొత్తు వద్దని, బీజేపీయే ఒంటరిగా పోటీ చేసే గెలవగల సత్తా ఉందని ఆ పార్టీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా అనేకమంది గట్టిగా వాదించారు. కానీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సమర్దులయిన అభ్యర్ధులు కూడా దొరకలేదు. ఎలాగో అతికష్టం మీద అభ్యర్ధులను తెచ్చి నిలబెట్టినా గెలవలేకపోయింది. ఇప్పుడు మెదక్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలలో కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతోంది. పార్టీ తరపున నిలబెట్టేందుకు సమర్దుడయిన ఒక్క అభ్యర్ధి కూడా దొరకకపోవడంతో ఇతరులను నిలబెట్టేందుకు ఆ పార్టీ నేతలు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. మెదక్ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరుగుతుందని చాలా ముందే తెలిసినప్పటికీ, అభ్యర్ధిని సిద్దం చేసుకోకుండా నామినేషన్ వేసే సమయం ముగిసేవరకు అభ్యర్ధిగా ఎవరిని నిలబెట్టాలని చర్చించడం చూస్తుంటే రాష్ట్ర బీజేపీ నేతలు గతం నుండి ఎటువంటి పాటాలు నేర్చుకోలేదని స్పష్టమవుతోంది.     ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 2019 ఎన్నికలలో తెలంగాణాలో తమ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ప్రకటించారు. తెలంగాణాలో అధికార తెరాసకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ కలలు కంటోంది. బీజేపీ తెలంగాణా ఉద్యమాలలో ఎంత చురుకుగా పాల్గోనప్పటికీ, బీజేపీ సహకారంతోనే తెలంగాణా రాష్ట్రం సాకారమయినప్పటికీ, అందుకే ఆ పార్టీ ఎన్నికలలో గెలవలేకపోయింది. కారణం ఏమిటంటే తెలంగాణా ఉద్యమాల ద్వారా పార్టీ కొంత బలం పుంజుకొనప్పటికీ పార్టీకి వెన్నుదన్నుగా ఉండే ద్వితీయ శ్రేణి నాయకులను తయారుచేసుకోవడంలో ఆ పార్టీ విఫలమవడమేనని చెప్పవచ్చును.   తన పార్టీ బలాబలాల గురించి బాగా ఎరిగిన బీజేపీ అధిష్టానం తెలంగాణాలో పటిష్టమయిన క్యాడర్ ఉన్న తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకొంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం వాపును చూసి బలుపనుకొని తమ శక్తిని అతిగా అంచనా వేసుకొని, తెదేపాతో సయోధ్య పాటించకుండా ఎన్నికలబరిలో దిగి చతికిలపపడ్డారు. వారి అప్రయోజకత్వం వలన ఒక అద్బుత అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకొన్నారు. అయితే నేటికీ తెలంగాణా రాష్ట్ర బీజేపీ నేతలకు తమ ఈ బలహీనత గురించి తెలుసుకొన్నట్లు లేదు. అందుకే నేడు పార్టీ తరపున నిలబెట్టేందుకు తమకు అనుకూలంగా ఉన్న ఇతర పార్టీల నేతల వైపు దిక్కులు చూడవలసి వస్తోంది. ఒకవేళ ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి పోటీలో నిలబెట్టినా అతనిని గెలిపించుకోగలరా లేదా అనేది కూడా అనుమానమే. అందువల్ల కనీసం ఇప్పటికయినా బీజేపీ నేతలు మేల్కొని ఈ ఐదేళ్ళలో పార్టీకి బలమయిన, చురుకయిన రెండవ శ్రేణి నాయకులను తయారుచేసుకొంటే మంచిది. అదేవిధంగా తెలంగాణా తెదేపా నేతలతో కూడా సక్యత పాటిస్తే అది రెండు పార్టీలకు మేలు చేస్తుంది. రెండు పార్టీలు కూడా బలపడే అవకాశం ఉంది.  

వైఎస్ జగన్‌కి అభిమానుల లేఖ

  వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గారికి మిమ్మల్ని ఎంతగానో అభిమానించే మీ అభిమానుల బృందం హృదయపూర్వకంగా నమస్కరిస్తూ రాయుచున్న లేఖ. మీరు మా అభిమాన నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎలాంటి రాజకీయ నాయకుడు వుండాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటూ వుంటామో మీరు కచ్చితంగా అలాంటి రాజకీయ నాయకుడే. ఎప్పటికైనా మీలాంటి నాయకుడిని చూస్తామా లేదా అనుకునేవాళ్ళం... మిమ్మల్ని చూశాక మా కోరిక తీరింది.. మా జన్మలు ధన్యమైపోయాయి.   అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి మిమ్మల్ని టీవీలో రెగ్యులర్‌గా చూస్తున్నాం. మీరు మాట్లాడే తీరు మాకెంతో నచ్చుతోంది. శాంతి భద్రతల సమస్య మీదగానీ, బడ్జెట్ మీద గానీ స్పీకర్ వద్దు అంటూ ఆపుతున్నప్పటికీ మీరు పట్టుబట్టి మాట్లాడుతున్న తీరు చాలా బాగుంది. అధికారపార్టీని ఇబ్బందులు పెట్టడానికి మీరు అనుసరిస్తున్న వ్యూహం మా అందరికీ చాలా నచ్చింది. మా మనసులలో ఏయే భావాలు, ఆలోచనలు వున్నాయో మీరు ప్రతిపక్ష నాయకుడిగా వాటిని కచ్చితంగా అలాంటి భావాలనే ప్రదర్శిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అసెంబ్లీలో మాట్లాడుతున్న మిమ్మల్ని చూస్తూ వుంటే, మమ్మల్ని మేం చూసుకుంటున్నట్టే వుంది.   మాక్కూడా అప్పుడప్పుడు రాజకీయాల్లోకి రావాలని అనిపిస్తూ వుంటుంది. అయితే మేం రావాల్సిన అవసరం లేకుండానే ఆ లోటు మీరు తీర్చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా వుంది. మేం ప్రతిపక్ష నాయకుడు అయితే ఎలా వుంటామో, ఎలా మాట్లాడతామో, ఎలా ప్రవర్తిస్తామో మీరు కూడా అచ్చం అలాగే చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీరే మేము మేమే మీరు అనిపిస్తూ వుంటుంది. మీరు మా మనసులకు అంతగా దగ్గరైన నాయకుడు. మీలాంటి ప్రతిపక్ష నాయకుడు వున్న రాష్ట్రంలో పౌరులం అయినందుకు మాకెంతో గర్వంగా వుంది. మిమ్మల్ని ఎంతగానో అభిమానించే మేం మీ పేరు మీద అభిమాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాం. మీరెప్పుడైనా వీలు చూసుకుని మా దగ్గరకి వస్తే మిమ్మల్ని ఘనంగా సత్కరించి మమ్మల్ని మేం సత్కరించుకున్నట్టుగా ఫీలవుతాం. ఇట్లు, వైఎస్ జగన్మోహనరెడ్డి అభిమాన సంఘం సభ్యులు, ఇన్ పేషెంట్ వార్డ్, మెంటల్ హాస్పిటల్, వైజాగ్.

ఆ దూకుడే కొంప ముంచుతోంది

  వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి శాసనసభలో చాలా ధాటిగా మాట్లాడుతుండవచ్చు గాక. కానీ తన పార్టీ సభ్యులెవరూ మాట్లాడేందుకు అవకాశం ఈయకుండా సభలో నేనొక్కడినే టైపులో మాట్లాడేస్తుండటంతో, స్వంత పార్టీ సభ్యులందరూ ఆయన ప్రతీ మాటకి బల్లలు చరుచుకోవడానికే పరిమితమయిపోతున్నారు. తన వెనక తన సైన్యం ఫాలో అవుతోందో లేదో కూడా చూసుకోకుండా దూకుడుగా ముందుకు సాగుతున్న జగన్మోహన్ రెడ్డి సభలో ప్రభుత్వాన్ని, తెదేపా సభ్యులను ఇరుకున పెట్టాలని ప్రయత్నించబోయి ప్రతీసారి తనే ఇరుకున పడుతున్నారు. అప్పుడు వైకాపా సభ్యులు అందరూ లేచి నినాదాలు చేస్తూ, సభలో మైకులు విరిచేస్తూ సభలో గందరగోళం సృష్టించి ఆయనను తెదేపా సభ్యుల బారి నుండి తమ అధినేతను కాపాడుకోవలసి వస్తోంది. ఆ తరువాత షరా మామూలుగానే ఆయన తనను అధికార పార్టీ వారు 18 సార్లు తిట్టారని, 17సార్లు తన ప్రసంగానికి అడ్డుపడ్డారని, 17సార్లు స్పీకర్ తన మైక్ కట్ చేసారని గణాంకాలు ప్రకటిస్తుంటారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాసం పెడతామని హూంకరిస్తుంటారు కూడా. ఈరోజు కూడా సభనుండి బయటపడిన తరువాత గణాంకాల ప్రకటన పూర్తయిన తరువాత, స్పీకర్ కు మరో లాస్ట్ వార్నింగ్ జారీ చేసారు. ఆయన తన తీరు మార్చుకోకుంటే, ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతామని హెచ్చరించారు.   ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి సభలో వ్యవహరించిన తీరు చూసిన వారు, ఇప్పుడు ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూసి చాలా ఆశ్చర్యపోతున్నారు. సభలో ప్రతిపక్షాలు ఎంతగా తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ వై.యస్స్.రాజశేఖర్ రెడ్డి ఎల్లపుడు చాలా ప్రశాంతంగా నవ్వుతూ సభా కార్యక్రమాలను కూడా మనసారా ఆనందిస్తున్నట్లు వ్యవహరించేవారు. ఆయన అధికార పార్టీలో ఉన్నందున ప్రతిపక్షాలు నిత్యం చాలా ఘాటుగా విమర్శలు గుప్పిస్తుండేవి. వాటిని ఆయన చాలా కులాసాగా నవ్వుతూ అంతే సమర్ధంగా త్రిప్పికొట్టేవారు తప్ప ఏనాడూ కూడా జగన్మోహన్ రెడ్డిలాగ సభలో ఆవేశంతో ఊగిపోయిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి ఊరికే ఆవేశాపడిపోతుంటే, అధికార పార్టీ సభ్యులందరూ కలిసి ఆయననే ఇరుకున పెట్టి వినోదిస్తున్నారు. అందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ సభ్యులెవరికీ సభలో మాట్లాడే అవకాశం ఈయకుండా ఎప్పుడూ తానొక్కడే మాట్లాడేస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించాలని తాపత్రయం పడటమేనని చెప్పవచ్చును.   కానీ అధికార పార్టీ వైపు చంద్రబాబు తక్కువగా మాట్లాడుతూ తన పార్టీ సభ్యులందరూ మాట్లాడేందుకు అవకాశం ఇస్తుండటంతో, తెదేపా సభ్యులందరూ జగన్మోహన్ రెడ్డిపై తలోవైపు నుండి ఆరోపణలు చేస్తూ, విమర్శలు గుప్పిస్తూ, కవ్విస్తూ సహనం కోల్పోయేలా చేస్తున్నారు. ఇది గ్రహించలేని జగన్మోహన్ రెడ్డి నేనొక్కడినే అన్నట్లుగా చాలా దూకుడు ప్రదర్శిస్తూ పదేపదే భంగ పడుతున్నారు. అంతే కాదు సభలో అధికార పార్టీని సమర్ధంగా నిలదీయలేక భంగపడి బయటకొచ్చిమీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకోవడం ద్వారా ప్రజల దృష్టిలోకూడా మరింత చులక అవుతున్నారు.