ఆంధ్రాలో బిజినెస్ అదుర్స్
posted on Oct 9, 2014 @ 7:53PM
భారతదేశం చాలా బీద దేశం కానీ భారతీయులు మాత్రం బీదవారు కారని విదేశీయులు చెప్పుకొంటు౦టారు. అది నిజమేనని నిరూపిస్తున్నారు ఆంధ్రాలో సౌండ్ పార్టీలు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రం ఆర్ధికంగా చాలా క్లిష్ట పరిస్థితులో ఉందని నిత్యం మనల్ని మనం ఓదార్చుకోవడం పరిపాటయిపోయింది. కానీ ఈ ఏడాది ఏప్రిల్ నెల నుండి సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలాసవంతమయిన కార్ల అమ్మకాలు ఏకంగా 62శాతం వరకు పెరిగాయని వివిధ కార్ల షో రూమ్స్ మేనేజర్లే స్వయంగా చెపుతున్నారు. ఆ విషయాన్ని ఆర్.టీ.యే. అధికారులు కూడా ద్రువీకరిస్తున్నారు.
రూ. 10లక్షలకు పైబడి ఉన్న కార్లను విలాసవంతమయిన కార్లగా గుర్తిస్తే, మళ్ళీ వాటిలో రూ. 50 నుండి 60 లక్షల ధరలున్నకార్లని ‘సి’ మరియు ‘ఈ’ కేటగిరీల క్రింద విభజించారు. ఇవి కాక జీ.యల్. కేటగిరీ కూడా ఒకటుంది. అదొక రేంజిలో ఉంటుంది. అంటే కనీస ధర రూ.85 లక్షలతో మొదలయ్యి రూ.1.36 కోట్లవరకు సాగుతుంది. ఆ పైన ఇంకేమయినా కేటగిరీలు పెడితే మనోళ్ళు దానికీ సిద్దమేనంటున్నారు. కానీ అమ్మే వాళ్ళే లేరు.
ఇక లెక్కలోకి వస్తే గతేడాది ఏప్రిల్ నెల నుండి సెప్టెంబరు నెలాఖరు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మూడు కేటగిరీలలో మొత్తం 1,931 కార్లు రిజిస్టర్ అయ్యాయిట. కానీ ఈసారి ఏకంగా 3,129 కార్లు అమ్ముడయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఏకంగా 62శాతం అమ్మకాలు పెరిగాయన్నమాట. అవి కూడా అల్లాటప్పా కార్లు కాదు. ఆడి, బెంజ్, బి.యం.డబ్ల్యు.వోల్వో వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీల కార్లు.
ఇక హైదరాబాదులోనే సంపద అంతా పోగుపడుంది కనుక అక్కడ దీనికి రెండితలు అమ్ముడయ్యే ఉంటాయని అందరూ భావించవచ్చు. కానీ గతేడాది ఇదే సమయంలో అక్కడ ఈ కేటగిరీ కార్లు 4,162 అమ్ముడయితే, ఈ ఏడాది కేవలం 5,088 మాత్రమే అమ్ముడయ్యాయిట. అంటే కేవలం 22శాతం అమ్మకాలు పెరిగాయన్నమాట.
అందుకే ఆడి, బెంజ్, బి.యం.డబ్ల్యు.వోల్వోల షోరూములు ఇప్పుడు వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, చివరికి మంగళగిరికి కూడా వచ్చేసాయి లేదా త్వరలో వచ్చేస్తున్నాయి. అందువల్ల బెంజి కారు కొనుకోవడానికి మనం ఏ హైదరాబాదో డిల్లీకో పరిగెత్తనవసరం లేదు విజయవాడ బెంజి సర్కిల్లోనే దొరకవచ్చు, లేదా వైజాగ్ రామా టాకీస్ సందు పక్కన దొరకవచ్చును.