లాలూ ప్రసాద్ సలహాలు మాకు అవసరం లేదు: జెడియు

  బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో సవాలు విసురుతున్న ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలను ఎదుర్కొనేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన బద్ద విరోధి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపి మళ్ళీ అధికారం చేజిక్కించుకోగలిగారు. కానీ అప్పుడే ఆయనకు లాలూతో సమస్యలు మొదలయినట్లున్నాయి. కొడుకులిద్దరూ మంత్రులు కావడంతో లాలూ కూడా ప్రభుత్వ వ్యవహారాలలో వేలు పెడుతున్నారు.   బిహార్ లో రూ.750 కోట్ల వ్యయంతో ఒక భారీ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు కాంట్రాక్టుని బి.ఎస్.సి.& సి.సి. అనే రెండు ప్రైవేట్ సంస్థలు దక్కించుకొన్నాయి. అందులో 10 శాతం వాటా అంటే రూ.75 కోట్లు ఇమ్మని సంతోష్ ఝా అనే ఒక గూండా ఆ సంస్థలను డిమాండ్ చేస్తున్నాడు. ఆ సంస్థలు అందుకు అంగీకరించకపోవడంతో ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఇద్దరు ఇంజనీర్లను ఆ గూండా కోసం పనిచేస్తున్న ముఖేష్ పాఠక్ అనే షూటర్ గత శనివారం దర్బంగా జిల్లాలో హత్య చేసాడు. తక్షణమే పోలీసులు రంగంలోకి దిగి సంతోష్ ఝా, అతని అనుచరులను అరెస్ట్ చేసారు. ముఖేష్ పాఠక్ ఇంకా తప్పించుకొని తిరుగుతున్నాడు.   ఆ సంఘటనపై స్పందించిన లాలూ ప్రసాద్ యాదవ్, “ఆ ఇంజనీర్ల కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. ఒకవేళ బాధిత కుటుంబాలు తమకు న్యాయం జరుగకపోతే వారు నేరుగా నన్ను సంప్రదించవచ్చును. ఇంతకు ముందు రణవీర్ సేన అధినేత హత్య జరిగిన తరువాత నుండి రాష్ట్ర పోలీసులు మనోధైర్యం కోల్పోయినట్లున్నారు. అందుకే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ (శాంతి భద్రతలు) ఆందోళనకరంగా మారుతున్నాయి. కనుక రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి,” అని లాలూ ప్రసాద్ యాదవ్ మీడియాతో అన్నారు.   గత పదేళ్లుగా హోం శాఖను బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన వద్దే అట్టేబెట్టుకొని స్వయంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను అదుపులో ఉంచుతున్నారు. ఇప్పుడు కూడా హోం శాఖ ఆయనే అట్టేపెట్టుకొన్నారు. కనుక లాలూ చేసిన ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఉద్దేశ్యించి చేసినవిగానే అధికార జెడి(యు) పార్టీ భావించి లాలూకి ఘాటుగా జవాబు చెప్పింది.   రాష్ట్ర జెడి(యు) అధ్యక్షుడు వశిష్ట్ నారాయణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ “నితీష్ కుమార్ ప్రభుత్వం చాలా మంచి పరిపాలన చేస్తోందని భావించబట్టే ప్రజలు ఆయనకీ మళ్ళీ అధికారం కట్టబెట్టారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం చాలా సమర్ధంగా వ్యవహరిస్తోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కనుక ఆ విషయంలో ముఖ్యమంత్రికి ఎవరూ ఎటువంటి సలహాలు ఇవ్వనసరం లేదు,” అని ఘాటుగా జవాబిచ్చారు.

తీవ్రవాదాన్ని టీ సర్కార్‌ లైట్‌గా తీసుకుంటోందా?

తీవ్రవాదం అనేది మన దేశాన్ని మాత్రమే కాదు.. ప్రపంచాన్ని మొత్తం భయపెడుతున్న సమస్య. ఈ విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వుండి తీవ్రవాదానికి వ్యతిరేకంగా సమైక్య పోరాటాన్ని చేస్తున్నాయి. ఇండియా కూడా తీవ్రవాదం మీద పోరాటాన్ని ఇటీవలి కాలంలో ఉద్ధృతం చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో తీవ్రవాదాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకే దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని తీవ్రవాద దాడులు దేశంలో సంభవించాయి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో తీవ్రవాద కార్యకలాపాలను కట్టడి చేసే విషయంలో సమర్థంగా వ్యవహరిస్తోంది. కేంద్రం ఎంత సమర్థంగా వున్నప్పటికీ, రాష్ట్రాలు కూడా కేంద్రానికి ఈ విషయంలో సహకరించాల్సి వుంది. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తీవ్రవాదం విషయంలో కట్టుదిట్టంగా వ్యవహరించాల్సి వుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం తీవ్రవాదం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించడం లేదని, తీవ్రవాదాన్ని చాలా లైట్‌గా తీసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. దేశంలో ఎక్కడ తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా తీగలాగితే డొంక కదిలినట్టు హైదరాబా‌లో కూడా వాటికి సంబంధించి మూలాలు దొరుకుతున్నాయి. లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్, దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ళ వంటి తీవ్రవాద ఘటనలు ఇప్పటికే హైదరాబాద్‌ గుండెకు గాయాన్ని చేశాయి. హైదరాబాద్ నగరం తీవ్రవాదులకు విడిదిగా మారిందన్న అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రవాదం విషయంలో కఠినంగా వ్యవహరించాల్సి వుంది. అయితే అలాంటి దాఖలాలేవీ కనిపించడం లేదని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐసీస్ ఉగ్రవాదుల్లో చేరడానికి హైదరాబాద్ నుంచి అనేకమంది వెళ్తూ వుండటాన్ని వారు ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. నగరంలో ఐసీస్ కార్యకలాపాలను పరిశోధించడానికి సరైన యంత్రాంగం లేదని, సోషల్ మీడియా మీద నిఘా కొరవడిందని, తీవ్రవాదుల కాల్పుల్లో పోలీసులు చనిపోతే పరామర్శించని ఒక పార్టీ నాయకులు ఒక తీవ్రవాది చనిపోతే మాత్రం అతని అంత్యక్రియల్లో పాల్గొనడం దారుణమని, ఇలాంటి విషయాల మీద ప్రభుత్వం ఎంతమాత్రం స్పందించలేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తీవ్రవాదం విషయంలో మరింత అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందన్నది మాత్రం వాస్తవం అని పరిశీలకులు అంటున్నారు.

నెహ్రూ, సోనియాలపై పార్టీ పత్రికలోనే విమర్శలు?

  కాంగ్రెస్ పార్టీలో తరతరాలుగా భజన కార్యక్రమం కొనసాగుతుండటం అందరూ నిత్యం చూస్తున్నదే. అందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకే చెందిన ‘కాంగ్రెస్ దర్శన్’ అధికారిక పత్రికలో నెహ్రు, సోనియా గాంధీలపై విమర్శలు ప్రచిరితమయితే? అది కూడా కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటున్న సమయంలో? సరిగ్గా అదే జరిగింది. ముంబై నుంచి హిందీ బాషలో ప్రచురించబడిన "కాంగ్రెస్ దర్శన్" తాజా సంచికలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, దేశ ప్రప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహార్ లాల్ నెహ్రూలని తీవ్రంగా విమరిస్తూ రెండు కధనాలు ప్రచిరితమయ్యాయి. అవి చూసి కాంగ్రెస్ అధిష్టానమే కాదు పార్టీలో నేతలందరూ షాక్ కి గురయ్యారు.   సోనియా గాంధీ: ఆమె తండ్రి స్టెఫానో మైనో ఇటాలియన్ సైన్యంలో ఒక సాధారణ సైనికుడు. సోనియా గాంధీ ఎయిర్ హోస్టెస్ కావాలనుకొన్నారు. కానీ అనుకోకుండా ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయిపోయారు. పార్టీలో సభ్యత్వం స్వీకరించిన 62 రోజుల్లోనే ఆమె అధ్యక్షురాలయిపోగలిగారు. ఆ తరువాత ఆమె ప్రధాని కావాలని విఫలయత్నాలు చేసారు, అని ఒక కధనంలో వ్రాసారు.   జవహార్ లాల్ నెహ్రూ : డిశంబరు 15న స్వర్గీయ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ దర్శన్ లో నెహ్రూని విమర్శిస్తూ వ్రాసిన కధనం.   “నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఉపప్రధాని మరియు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. కానీ వారిరువురి మధ్య తరచూ భేదాభిప్రాయాలు ఏర్పడుతుండేవి. ఆ కారణంగా వాళ్ళిద్దరూ కూడా రాజీనామాలు చేస్తామని ఒకరినొకరు బెదిరించుకొనేవారు. అందుకు ప్రధాన కారణం సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పిన సలహాలను ప్రధాని నెహ్రూ పెడచెవిన పెడుతుండటమే! చైనా, టిబెట్, నేపాల్ దేశాల విషయంలో నెహ్రూ అనుసరిస్తున్న విదేశాంగ విధానం సరికాదని దాని వలన భారత్ కి సమస్యలు వస్తాయని సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ పదేపదే హెచ్చరించేవారు. కానీ నెహ్రూ పట్టించుకొనేవారు కాదు. అలాగే కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్యసమితి ముందుకు తీసుకు వెళ్ళవద్దని పటేల్ చెప్పిన సలహాని కూడా నెహ్రూ పెడచెవిన పెట్టారు. ఆ కారణంగానే నేటికీ భారతదేశానికి అదొక పెద్ద సమస్యగా మారిపోయింది. నాడు పటేల్ చెప్పిన సలహాలను నెహ్రూ పాటించి ఉండి ఉంటే నేడు ఇన్ని సమస్యలు ఉండేవి కావేమో?” అని మరో కధనంలో వ్రాశారు.   కాంగ్రెస్ పార్టీ స్వంత పత్రిక అయిన ‘కాంగ్రెస్ దర్శన్’ లో నెహ్రూ, సోనియా గాంధీలను ఈవిధంగా విమర్శిస్తూ ఎవరు కధనాలు వ్రాసారో తనకు తెలియదని ఆ పత్రిక సంపాదకుడు సంజయ్ నిరుపం చెప్పారు. ఆయన ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా కావడంతో పత్రికి దైనందిన వ్యవహారాలను తను చూడటం లేదని అందువలననే ఈ పొరపాటు జరిగి ఉండవచ్చని చెపుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు పాక్, చైనా, నేపాల్, శ్రీలంక వంటి ఇరుగు పొరుగు దేశాలతోను, అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలతోను అనుసరిస్తున్న విదేశీ విధానం ఏమాత్రం సరిగ్గా లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటించినపుడు అలాగే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు స్వంత పార్టీ పత్రికలోనే నెహ్రూ విదేశీ విధానం తప్పుల తడక అని విమర్శలు ప్రచురింపబడటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది.

భారత్, పాక్, బంగ్లాదేశ్ కామన్ కరెన్సీ?

  ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ ఆకస్మిక పర్యటనతో ఇరు దేశాల సంబంధాలు మళ్ళీ మెరుగుపడతాయనే భావన ఇరు దేశాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 15వ తేదీన ఇస్లామాబాద్ లో ఇరు దేశాల విదేశాంగ శాఖల ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగబోతుండటంతో ప్రజల అంచనాలు పెరిగిపోయాయి.   అయితే అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని ఆశించడం సరికాదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ యొక్క విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. మొదట ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు అవసరమయిన చర్యలు చేపడతామని, వాటిలో భాగంగా సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ అమలు గురించి జనవరి 15న జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.   బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ “భవిష్యత్తులో భారత్ పాక్, బంగ్లాదేశ్ మూడు మళ్ళీ ఏకం అయిపోతాయని జోస్యం చెప్పారు. దానిని మరింత వివరిస్తూ “అలాగని ఆ రెండు దేశాలను భారత్ లో బలవంతంగా కలిపేసుకొంటామని కాదు దానర్ధం. మూడు దేశాల ప్రజల అభీష్టంతో అది సాధ్యం అవవచ్చునని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.   ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న లోక్ జన్ శక్తి పార్టీ అధినేత, మరియు కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ “భవిష్యత్తులో భారత్ పాక్, బంగ్లాదేశ్ మూడు మళ్ళీ ఏకం అవుతాయో లేదో తెలియదు కానీ, ఈ మూడు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడి, ఉగ్రవాదం బెడద తగ్గాలంటే మూడు దేశాలు చేతులు కలపవలసిన అవసరం ఉంది. వీలయితే మూడు దేశాలు ఒకే కరెన్సీని ప్రవేశపెట్టగలిగితే మంచిది. అలాగే  స్వేచ్చా వాణిజ్యం అమలు చేయగలిగితే దాని వలన మూడు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. తద్వారా మూడు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి. అప్పుడు ఉగ్రవాదం మటుమాయం అవుతుంది,” అని అన్నారు.   రామ్ మాధవ్ జోస్యం నిజం అయ్యే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా రామ్ విలాస్ పాశ్వాన్ సూచిస్తున్నట్లుగా "స్వేచ్చా వాణిజ్యం" ‘కామన్ కరెన్సీ’ని ప్రవేశపెట్టడం మంచి ఆలోచనలేనని చెప్పవచ్చును. కానీ సాధారణంగా ఒకే స్థాయిలో ఉన్న దేశాల మధ్యనే కామన్ కరెన్సీ వంటి ప్రయోగాలు సఫలం అవుతాయి. ఉదాహరణకి ఇంచుమించు సమానంగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాలన్నీ కలిసి ‘యూరో’ కామన్ కరెన్సీని ప్రవేశపెట్టుకొన్నాయి. నేటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని అవి అధిగమించి కామన్ కరెన్సీని చెలామణి చేసుకోగలుగుతున్నాయి. కానీ భారత్ తో పోలిస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు అభివృద్ధిలో చాలా వెనుకపడి ఉన్నాయి కనుక పాశ్వాన్ సూచన అమలు చేయడం కూడా కష్టమే కావచ్చును. కానీ పాశ్వాన్ సూచిస్తున్న " మూడు దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్యం" అమలు చేయడానికి అవకాశాలున్నాయి. 

చండీయాగంలో అగ్నిప్రమాదం అరిష్టమా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన అయుత మహా చండీయాగం ఐదు రోజుల పాటు వైభవంగా జరిగింది.ఈ యాగంలో సామాన్య ప్రజానీకంతోపాటు దేశంలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ యాగంలో పాల్గొనడం విశేషం. శృంగేరి పీఠానికి చెందిన రుత్వికులు ఈ యాగాన్ని ఆద్యంతం వైభవంగా నిర్వహించారు. యాగం సందర్భంగా ఏర్పాట్లు కూడా బాగా జరిగాయి. అంతా బాగానే జరిగిందికానీ, యాగం చివరి రోజైన ఆదివారం నాడు మాత్రం యాగశాలకు నిప్పు అంటుకుని బూడిదైపోయింది. యాగశాలలో వున్నవారు భయభ్రాంతులకు గురై యాగశాల నుంచి బయటకి వెళ్ళిపోవడంతో యాగానికి ఒక గంటపాటు  అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడం చాలా సంతోషించాల్సిన విషయం. భారీ స్థాయిలో మంటలు రేగినప్పటికీ ఎవరికీ ఎలాంటి నష్టం జరకపోవడం కూడా యాగ మహిమ కూడా భావించడం న్యాయమే. అయితే కొంతమంది విమర్శకులు మాత్రం చండీయాగం సందర్భంగా అగ్నిప్రమాదం జరగడం అరిష్టమనే వాదనను పైకి తీసుకుని వస్తున్నారు. చండీయాగం కేసీఆర్ వ్యక్తిగతంగా చేస్తున్న యాగం కాబట్టి ఆయనకే అరిష్టమని కొంతమంది అంటూ వుంటే, తెలంగాణ వచ్చిన సందర్భంగా చేసిన యాగం కాబట్టి తెలంగాణ రాష్ట్రానికే అరిష్టమని మరికొందరు కొత్త భాష్యాలు చెబుతున్నారు. కేసీఆర్ ఒక మంచి ఉద్దేశంతో నిర్వహించిన ఈ చండీయాగం చివరిరోజున ఏదో ఒక చిన్న అపశ్రుతి జరిగినంత మాత్రాన అది అరిష్టానికి సంకేతమని వ్యాఖ్యానించడం మంచిది కాదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ శారదా పీఠ అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఈ విషయంలో స్పష్టత ఇచ్చారు. యాగశాల కాలిపోవడం శుభసూచకమేనని ఆయన చెప్పారు. ఇది ఈ విషయంలో చెలరేగుతున్న విమర్శలకు అడ్డుకట్ట వేసే అవకాశం వుంది. సహజంగా భారీగా యాగాలు నిర్వహించిన అనంతరం యాగం కోసం నిర్మించిన పాకలను కాల్చివేయడం సంప్రదాయం. ఇప్పుడు యాగం ముగియడానికి కొన్ని గంటల ముందే పాకలు వాటంతట అవేకాలిపోయాయి. దీనిని చండీమాత కరుణగానే భావించాల్సి వుంటుందని స్వరూపానందేంద్ర సరస్వతి చెబుతున్నారు. కేసీఆర్ చండీయాగాన్ని అద్భుతంగా నిర్వహించారు కాబట్టే చండీమాత కరుణించి కాస్తంత ముందుగానే యాగశాలను దగ్ధం చేసిందని భావించవచ్చు. ఇది నిజంగానే ఒక శుభసూచకం. యాగం ముగియకముందే శుభసూచకం కనిపించింది. ఇక ముందుముందు మరిన్ని శుభాలు జరుగుతాయని ఆశించవచ్చు.

చండీయాగ మంటపంలో అగ్ని ప్రమాదం

  తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవెల్లిలో నిర్వహిస్తున్న చండీయాగంలో చివరిరోజున చిన్న అపశ్రుతి జరిగింది. హోమ గుండంలో మంటలు ఒక్కసారిగా పైకి ఎగియడంతో యాగశాలకు మంటలు అంటుకొన్నాయి. దానితో లోపల ఉన్న ప్రజలు భయబ్రాంతులై బయటకు పరుగులు తీసారు. సరిగ్గా అదే సమయానికి రాష్ట్రపతి హెలికాఫ్టర్ లో ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. కానీ పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో రాష్ట్రపతి క్రిందకు దిగకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయారు. యజ్ఞకుండంలో ఒకేసారి ఎక్కువ నెయ్యి పోయడం వలననే మంటలు పైకి ఎగసిపడినట్లు తెలుస్తోంది. తక్షణమే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేయి. మళ్ళీ యాగం యధావిధిగా జరుగుతుంది. ఈరోజు సాయంత్రంతో యాగం పరిసమాప్తం అవుతుంది.

అడగక ఇచ్చిన రష్యా ఆఫర్ అదరహో...

  భారత ప్రధాని నరేంద్ర మోడీ మొన్న రష్యాకి, ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌కి, అటు నుంచి అదే పాకిస్థాన్‌కి వెళ్ళొచ్చిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ వెళ్ళినందుకు ఆ దేశంతో స్నేహ సంబంధాలు ఏర్పాటే అవకాశాలు మెరుగుపడ్డాయి... ఆప్ఘనిస్థాన్ వెళ్ళినందుకు మంచి మిత్రుడితో స్నేహం మరింత బలపడింది. రష్యాకి వెళ్ళినందుకు రష్యా మన దేశానికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు... చైనా, పాకిస్థాన్, అమెరికా దేశాలు బిత్తరపోయి, మనసులో కుళ్ళుకునే ఆఫర్. నరేంద్రమోడీ రష్యాలో అడుగుపెట్టిన వేళా విశేషం బాగున్నట్టుంది. అందుకే రష్యా మాంచి బంపర్ ఆఫర్ ప్రకటించింది. FAGA (T-50) వార్ ఫైటర్ టెక్నాలజీని మన దేశానికి ఇవ్వడానికి రష్యా అక్షరాలా ఆరు బిలియన్ డాలర్లు అడిగింది. అయితే ఇప్పుడు మోడీ రష్యా వెళ్ళినప్పుడు ఆ టెక్నాలజీని ఆరు బిలియన్ డాలర్లకు కాకుండా కేవలం 3.7 బిలియన్ డాలర్లకే మొత్తం టెక్నాలజీని మనకు ఇస్తానని రష్యా చెప్పింది. అక్కడితో ఆగకుండా నమూనాగా మరొక మూడు ఫైటర్లను ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంటే అత్యధునికమైన ఫైటర్లను, ఇకనుండి మనమే సొంతగా తయారుచేసుకొవచ్చు. సదరు టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చన్నమాట. ఊహించని ఈ ఆఫర్‌కి ఇండియా పాలకులు సంతోషంలో మునిగిపోతే, చైనా, పాకిస్థాన్లతోపాటు పాటు అమెరికా కూడా బిత్తరపోతున్నాయిట. గతంలో చైనా రష్యాని ఎంత బతిమాలినా, బామాలినా ఆయుధాల తయారీకి సంబంధించిన టెక్నాలజీని ఇవ్వనుగాక ఇవ్వనని రష్యా తేల్చి చెప్పేసింది. అదే ఇండియాకి మాత్రం అడక్కుండానే ఇచ్చింది. అడగక ఇచ్చిన ఆయుధాలే ముద్దు అంటే ఇదేనేమో. FAGA (T-50) రష్యన్ ఫైటర్ ప్రపంచంలోనే అత్యంత అత్యధునికమైన శక్తివంతమైన రెండవ వార్ ఫైటర్. మొదటిది అమెరికా తయారుచేస్తున్న 35G2. ఇది ప్రస్తుతం ట్రయల్ రన్‌లో వుంది. ఇప్పుడు రష్యా ఇచ్చిన ఆఫర్‌తో మన దేశం తయారు చేసే వార్ ఫైటర్లు కూడా త్వరలో అమెరికా ముందు మన దేశం తలెత్తుకునేలా చేస్తాయన్నమాట.

వాగ్ధాటి పెంచుకో రాహుల్!

మొన్నటి సాధారణ ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి, ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యాన్ని పార్టీలో ఎవరూ చేయలేకపోయేవారు. కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ హయాం నుంచి చక్రం తిప్పినవాళ్ళు కూడా ఏ విషయంలోనూ కిక్కురుమనేవాళ్ళు కాదు. సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. రాజకీయంగా అపరిపక్వంగా వున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తారేమోనన్న భయంతోనే జనం కాంగ్రెస్ పార్టీని ఓడించారన్న అభిప్రాయాలు కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపించాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడినప్పటి నుంచి సోనియా, రాహుల్‌కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో గళాలు వినిపించడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చౌహాన్ కూడా తన వ్యతిరేక గళం వినిపించారు. రాహుల్ గాంధీ భవిష్యత్తులో పార్లమెంటులో ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం వుందని పృథ్విరాజ్ చౌహాన్ చెప్పారు. ఎక్కువసేపు మాట్లాడ్డమే కాదు... ఎక్కువ విషయాలను కూడా పార్లమెంట్‌లో ప్రస్తావించాలని చెప్పారు. ప్రస్తుతం రాహుల్ ఏ అంశం మీదైనా ఒకటి, రెండు వ్యాఖ్యలు చేసి ఊరుకుంటున్నారని, అది సరైన పద్ధతి కాదని పృథ్విరాజ్ చౌహాన్ చెప్పారు. మాట్లాడే విషయంలో మాత్రమే కాదు.. బాడీ లాంగ్వేజ్ విషయంలో కూడా రాహుల్ గాంధీ తనను తాను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం వుందని సలహా ఇచ్చారు. రాహుల్‌కి ఇప్పుడున్న బాడీ లాంగ్వేజ్ జనాన్ని ఆకట్టుకునేలా లేదని కూడా పృథ్విరాజ్ చౌహాన్ చెప్పారు. మరి ఈ సలహాలను తల్లీకొడుకులు ఎలా తీసుకుంటారో చూడాలి.

ధనిక రాష్ట్రానికి కూడా లక్ష కోట్లు కావాలా?

  జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలిచేందుకు కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి లక్ష కోట్లు మంజూరు చేస్తుందా? అని అడిగితే ఎవరయినా నవ్వకుండా ఉండలేరు. కానీ మంత్రి కె. తారక రామారావు మాత్రం అటువంటి గొప్ప సవాలు విసిరి బీజేపీని భలే ఇరుకున పెట్టేసానని భావిస్తున్నట్లున్నారు. ప్రధాని నరేంద్ర మోడి బిహార్ రాష్ట్రానికి 1.25లక్షల కోట్లు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ.80 వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించారని, కానీ తెలంగాణా రాష్ట్రానికి ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదని ప్రశ్నించారు. కనుక కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి దైర్యం ఉంటే మోడీని అడిగి లక్ష కోట్లు పట్టుకురావాలని సవాలు విసిరారు.   దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా రెండవ ధనిక రాష్ట్రమని కె.టి.ఆర్. తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అనేకసార్లు పదేపదే ప్రకటించుకొంటునప్పుడు ఇంకా లక్ష కోట్ల ఆర్ధిక ప్యాకేజి ఎందుకు ఆశిస్తున్నారంటే అది వస్తుందని కాదు. తెలంగాణా బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏమి చేయడం లేదు...కేంద్రం కూడా తెలంగాణా రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు...అని జంటనగరాలలో ప్రజలకు భోదించి జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవడానికే.   రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాల చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామని చెపుతున్న ఆర్ధిక ప్యాకేజినే ఇంతవరకు మంజూరు చేయలేదు. అటువంటిది దేశంలో రెండవ ధనిక రాష్ట్రమయిన తెలంగాణాకు కేంద్రప్రభుత్వం లక్ష కోట్లు మంజూరు చేస్తుందని ఏవిధంగా ఆశించగలము? అని ఆలోచిస్తే మంత్రి కె.టి.ఆర్. విసిరినా ఈ సవాలు కేవలం జి.హెచ్.ఎం.సి. పరిధిలో చాలా బలంగా ఉన్న బీజేపీని దెబ్బతీయడానికేనని అర్ధమవుతోంది.   దానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేన్ ప్రధాన్ చాలా గట్టిగానే బదులిచ్చారు. హైదరాబాద్ లో నిన్న జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కుమారుడు కె.టి.ఆర్.కి మరీ అంత అహంకారం పనికిరాదు. ఆయన మోడీని విమర్శించే ముందు తన తండ్రి కేసీఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వస్తున్నారో తెలుసుకొంటే మంచిది. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి ఏమేమి చేస్తోంధో కె.టి.ఆర్.కి తెలియకపోతే తన తండ్రిని అడిగి తెలుసుకొంటే మంచిది,” అని అన్నారు.   కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ “తెలంగాణా రాష్ట్రానికి నిరంతర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు మంజూరు చేయడం వలననే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవనే సంగతి మంత్రి కె.టి.ఆర్.కి తెలియదా? ఎం.ఎం.టీ.ఎస్‌.రెండో దశ పనులు పూర్తి చేయడానికి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి? కేంద్రం నుంచే కదా? రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు మంజూరు చేస్తున్న విషయం కె.టి.ఆర్.కి తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం తెలంగాణాతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని, అవసరమయిన నిధులు, ప్రాజెక్టులు త్వరితగతిన మంజూరు చేస్తోందని బండారు దత్తాత్రేయ అన్నారు.

రామోజీ ఓం సిటీ కోసం 505 ఎకరాల భూమి మంజూరు?

  తెరాస అధికారంలోకి రాక మునుపు రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగళ్లను పెట్టి దున్నించి చదును చేసేస్తానని తెరాస అధినేత కేసీఆర్ అనేవారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనే స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఆ సంస్థ చైర్మన్ రామోజీరావుని కలిసి వచ్చేరు. అంతే కాదు ఆయన కట్టబోయే ఆధ్యాత్మిక నగరం ‘ఓం సిటీ’కి సుమారు 505 ఎకరాల భూమిని ఇవ్వబోతున్నాట్లు తాజా సమాచారం. ఆయన ఓం సిటీ నిర్మించేందుకు 2,000 ఎకరాల భూమి కావాలని కోరుతూ గత ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ తనని కలవడానికి వచ్చినప్పుడు, ఓం సిటీ చిత్రాలను చూపించినపుడు కేసీఆర్ అందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని వార్తలు వచ్చేయి. కానీ అంత భూమి ఒకేచోట లభించకపోవడంతో ముందుగా హయత్ నగర్ మండలంలోని కోహెడ, అబ్దుల్లాపూర్ గ్రామాలలో సుమారు 505 ఎకరాల భూమిని అప్పగించడానికి అధికారులు అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.   సుమారు రూ.3, 000 కోట్ల వ్యయంతో దేశంలో ఉన్న అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించడానికి రామోజీరావు ప్రణాళికలు సిద్దం చేసుకొన్నారు. అందులో కూడా సినిమా స్టూడియోలు, థియేటర్లు, అతిధుల కోసం హోటళ్ళు, సుందరమయిన పార్కులు వగైరాలన్నీ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే రామోజీ రావు డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడిని కలిసి తను చెప్పట్టబోయే ఆ ప్రాజెక్టు గురించి కలిసి వివరించేరు. నరేంద్ర మోడీ కూడా ఆయన ఆలోచనను అభినందించేరు.

మోడీ పాకిస్థాన్‌కి వెళ్ళడం కరెక్టేనా?

భారత ప్రధాని నరేంద్రమోడీ తాను పదవిలో వుండగానే ప్రపంచ దేశాలన్నిట్నీ చుట్టేయాలని కంకణం కట్టుకున్నట్టుగా వుందన్న విమర్శలు వినిపిస్తున్నప్పటికీ మోడీ ప్రధాని హోదాలో ప్రపంచ పర్యటన చేసే విషయంలో ఎంతమాత్రం వెనకడుగు వేయడం లేదు. మోడీ నిన్ననే రష్యాకి వెళ్ళారు. అటు నుంచి అటే ఆఫ్ఘనిస్థాన్‌లో పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి వెళ్ళారు. ముందుగా అనుకున్న షెడ్యూలు ప్రకారం ఇండియాకి తిరిగి వచ్చేసి, క్రిస్మస్ రోజున 91వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలపాలి. అయితే మోడీ ప్రోగ్రామ్‌లో సడెన్ మార్పు వచ్చేసింది. శుక్రవారం నాడు పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు కూడా కావడంతో నరేంద్రమోడీ ఆఫ్ఘనిస్థాన్ నుంచే షరీఫ్‌కి ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేశారు. దాంతో మురిసిపోయిన షరీఫ్ ఎలాగూ పక్కనే వున్నారుగా, మా దేశానికి కూడా వచ్చేయండి అని ఆహ్వానించేసరికి మోడీగారు వెంటనే లాహోర్ వెళ్ళిపోయారు. ఈ గొప్ప విషయాన్ని ప్రపంచానికి ట్విట్టర్లో ట్టిట్టడం ద్వారా తెలియజేశారు. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవాలని అనుకోవడం మంచి విషయమే. వాజ్‌పేయి తర్వాత పాకిస్థాన్‌కి వెళ్ళిన భారత ప్రధానిగా ఘన దక్కించుకోవడమే సంతోషకరమే. అయితే మోడీ పాకిస్థాన్‌కి వెళ్ళిన పద్ధతి మాత్రం సరైన విధంగా లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశం పాకిస్థాన్. ఎన్నో ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయమిస్తున్న దేశం పాకిస్థాన్. అలాంటి దేశానికి వెళ్ళేముందు భద్రతాపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వుంటుంది. పాకిస్థాన్‌లో ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని విషయం. అలాంటి పరిస్థితుల్లో మోడీ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా పాకిస్థాన్‌కి వెళ్ళడం సరైన పని కాదని పరిశీలకులు అంటున్నారు.

సల్మాన్ ఖాన్ దోషి కానప్పుడు నష్టపరిహారం ఎందుకు చెల్లించినట్లు?

  సల్మాన్ ఖాన్ కేసుపై బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయబోతోంది. ఈ కేసులో సరయిన సాక్ష్యాధారాలు లేనందున సల్మాన్ ఖాన్ న్ని నిర్దోషిగా ప్రకటించి, అతనికి దిగువ కోర్టు విధించిన ఐదేళ్ళ జైలు శిక్షని కూడా బోంబే హైకోర్టు రద్దు చేసింది. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ దోషి అని న్యాయస్థానంతో సహా అందరికీ తెలుసు. కానీ సల్మాన్ నిర్దోషి అని తేల్చి చెప్పింది. అతను నిర్దోషి అని తీర్పు చెప్పిన బోంబే హైకోర్టే ఈ కేసుపై విచారణ మొదలయినప్పుడు బాధితులకు నష్టపరిహారంగా కొంత సొమ్మును జమా చేయమని ఆదేశించింది. అంటే అతని వలననే ఆ ప్రమాదం జరిగిందని బోంబే హైకోర్టు నమ్మినట్లు అర్ధమవుతోంది. హైకోర్టు అదేశం మేరకు సల్మాన్ ఖాన్ మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 10 లక్షలు, గాయపడిన నలుగురుకి ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు చొప్పున కోర్టులో మొత్తం రూ.30 లక్షలు జమా చేసాడు. అంటే అతను కూడా నేరం ఒప్పుకొన్నట్లేనని అర్ధమవుతోంది.   ఒకవేళ అతని వలన ఆ ప్రమాదం జరగలేదని న్యాయస్థానం నమ్ముతున్నట్లయితే అతనిని నష్టపరిహారం చెల్లించమని అడిగి ఉండకూడదు. కానీ అడిగింది. అలాగే సల్మాన్ ఖాన్ తన వల్ల ఆ కారు ప్రమాదం జరుగలేదని నమ్ముతున్నట్లయితే, భాధితులకు నష్టపరిహారం చెల్లించి ఉండకూడదు. కానీ చెల్లించాడు. అతనిని నష్టపరిహారం చెల్లించమని హైకోర్టు ఆదేశించినపుడు, దానిని ఆయన చెల్లించినపుడే అతనే ఈ కేసులో దోషి అని ఖరారు అయిపోయింది. కానీ దిగువకోర్టు అతనికి శిక్ష కూడా విధించిన తరువాత అకస్మాత్తుగా అతను నిర్దోషి అయిపోయాడు!   బోంబే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేయగా దానిలో జోక్యం చేసుకోవలసిన అవసరం కనబడటం లేదని సుప్రీం కోర్టు చెప్పడంతో ఇక సల్మాన్ ఖాన్ నిశ్చింతగా తన సినిమా షూటింగులు చేసుకొంటున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయాలని నిశ్చయించుకోవడంతో మళ్ళీ సల్మాన్ ఖాన్ కి ఆదుర్ద మొదలవుతుంది. కానీ ఈకేసులో కలుగజేసుకొనేందుకు సుప్రీం కోర్టు మొదటే నిరాకరించింది కనుక మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళినా అది కూడా బోంబే హైకోర్టు తీర్పునే సమర్ధించే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది.   దీనికి కొసమెరుపుహా చాలా ఆసక్తికరమయిన పరిణామం ఒకటి జరిగింది. నిఖిల్ వాగ్లే అనే ఒక జర్నలిస్ట్ ఈ కేసులో బాధితులు అందరికీ సల్మాన్ ఖాన్ చేత నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ కొన్ని రోజుల క్రితమే బోంబే హైకోర్టులో ఒక ప్రజాహిత వాజ్యం దాఖలు చేసారు. దానిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. సల్మాన్ ఖాన్ నిర్దోషి అని ప్రకటించిన తరువాత కూడా మళ్ళీ బోంబే హైకోర్టు ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించడానికి అర్ధం ఏమిటో న్యాయనిపుణులే చెప్పాలి.

చండీయాగం ముగిసేలోపు వర్షం ఖాయం...

  తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి పతాక స్థాయికి చేరుకుంది. గత మూడేళ్ళ నుంచి వర్షాలు తక్కువగానే వున్నాయి. ఈ ఏడాది అయితే వర్షాకాలం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితి. వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో రైతులు భారీగా నష్టపోయారు. మామూలుగా అయితే ఈ సమయానికి మరో పంట వేసేవారే. అయితే వర్షాలు లేకపోవటం, భవిష్యత్తులో వర్షాలు పడే సూచనలు లేకపోవడంతో రైతులు మరో పంట వేసే ఆలోచనను విరమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అయుత మహా చండీయాగం వర్షాలు కురిపించే అవకాశం వుందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. చండీయాగం ముగిసేలోపు వర్షాలు పడటం ఖాయమని వారు అంటున్నారు. యజ్ఞ యాగాల వల్ల వర్షాలు కురుస్తాయి. మన వేదాలు చెప్పే విషయం ఇదే. బుధవారం నాడు చండీయాగం ప్రారంభమైంది. అదేంటోగానీ బుధవారం నాడు తెలంగాణ అంతటా మబ్బులు కమ్ముకున్నాయి. ఆ తర్వాత తేలిపోయాయి. ఈ మబ్బులు కమ్ముకున్నది చండీయాగం కారణంగానే అనే విషయాన్ని హేతువాదులు నమ్మకపోవచ్చుగానీ, టీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఇంతకాలం నుంచి లేని మబ్బులు బుధవారం నాడే పట్టాయంటే దానికి కారణం కేసీఆర్ చేస్తున్న చండీయాగమేనని అంటున్నారు. చూస్తూ వుండండి.... చండీయాగం ముగిసేలోపు తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురవడం ఖాయమని వారు అంటున్నారు. చండీయాగం కారణంగానో, ప్రకృతి కరుణించడం వల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండ్రోజుల పాటు అయినా వర్షాలు పడితే తెలంగాణలో రైతులు పంటలు వేసుకోవడంతోపాటు చెరువులు, కుంటలు నిండుతాయి. భూగర్భ జలాలు సమకూరుతాయి. వచ్చే వేసవిలో నీటికి కటకటలాడకుండా వుండే అవకాశం వుంటుంది. అంచేత దేవుడా... కారణం ఏదైనా కావచ్చు... వర్షాలు మాత్రం కురిపించు అని తెలంగాణ ప్రజానీకం కోరుకుంటున్నారు.

తప్పుకోమని ప్రధాని మోడీయే చెప్పారు కదా?

  డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక సతమతమవుతుంటే, ఆయనకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడి లోక్ సభలో మాట్లాడిన మాటలు ఆయనని ఇంకా ఇబ్బందుల్లో పడేశాయి.   “ఇదివరకు లాల్ కృష్ణ అద్వానీపై హవాలా కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు వాటిని ఆయన ఏవిధంగా ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకొన్నారో, అదేవిధంగా ఇప్పుడు అరుణ్ జైట్లీ కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటపడతారు,” అని ప్రధాని మోడీ అన్నారు. హవాలా కేసులో తనపై ఆరోపణలు వచ్చినప్పుడు అద్వానీ తన పదవికి రాజీనామా చేసి, కోర్టులో కేసును ఎదుర్కొని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొన్నారు. కనుక ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన ఈ మాట అరుణ్ జైట్లీని సమర్దిస్తునట్లుగా కాక ఆయనను కూడా రాజీనామా చేసి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమని సూచిస్తున్నట్లుగా ఉంది. ఇటువంటి సమయంలో మోడీ పొరపాటున అరుణ్ జైట్లీ కేసుని అద్వానీ కేసుతో పోల్చి మాట్లాడారని అనుకోలేము. కనుక ఆయన జైట్లీకి చెప్పదలచుకొన్నది చాలా స్పష్టంగానే చెప్పారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.   ప్రధాని మోడీ సూచిస్తున్నట్లుగా అరుణ్ జైట్లీ తక్షణమే తన పదవికి రాజీనామా చేసి న్యాయస్థానంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సిపిఐ (ఎం) జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారి కూడా అరుణ్ జైట్లీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. “ప్రధాని నరేంద్ర మోడియే స్వయంగా సూచించిన తరువాత కూడా ఇంకా పదవిలో కొనసాగడం సరికాదు. ఆయన తను నిర్దోషినని భావిస్తున్నట్లయితే, దైర్యంగా తనపదవికి రాజీనామా చేసి కోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు. ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే అద్వానీ కేసును వాదించింది అరుణ్ జైట్లీయే. ఇప్పుడు ఆయననే అవినీతి ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తోంది.

దాద్రీ హత్య కేసులో చార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు

  దేశంలో కలకలం సృష్టించిన దాద్రి హత్య కేసులో పోలీసులు నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న మొత్తం 15 మంది పేర్లను చార్జి షీట్ లో చేర్చారు. భీమ, పునీత్ అనే మరో ఇద్దరు నిందితులను నిన్ననే అరెస్ట్ చేసారు. పరారిలో ఉన్న సచిన్, పునీత్ అనే మరో ఇద్దరు విద్యార్ధుల కోసం పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. వారు దొరకగానే ఆ నలుగురిపై కూడా అనుబంధ చార్జ్ షీటు దాఖలు చేస్తామని నోయిడా సర్కిల్ ఇన్స్పెక్టర్ అనురాగ్ సింగ్ తెలిపారు. గౌతంబుద్ధ నగర్ లో ఉన్న జిల్లా కోర్టులో పోలీసులు నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసారు. దానిలో బీజేపీ నేత సంజయ్ రాణా కుమారుడు విశాల్ పేరు కూడా ఉంది. అలాగే ఈ నేరంలో ఒక మైనర్ కూడా పాల్గొన్నట్లు అనురాగ్ సింగ్ తెలిపారు. ఈ చార్జ్ షీట్లో విశేషమేమిటంటే దానిలో ఎక్కడా బీఫ్ అనే పదం పోలీసులు వాడలేదు. నిజానికి మొహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ‘బీఫ్’ తిన్నాడనే కారణంగానే ఈ హత్య జరిగింది.   సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దాద్రి అనే గ్రామంలో ఒక ఆవు దూడ మాయం అయినట్లు ప్రచారం జరిగింది. అదే ఊరులో నివసిస్తున్న 52 ఏళ్ల వయసు గల మొహమ్మద్ అఖ్లాక్ అనే వ్యక్తి ఆ ఆవు దూడని చంపి వండుకొని తింటున్నాడనే అనుమానంతో కొందరు దుండగులు అతని ఇంటిపై దాడి చేసి అతికిరాతకంగా కొట్టి చంపేసారు. తాను ఆవు మాంసం తినలేదని తనను విడిచిపెట్టమని ఆయన ఎంతగా ప్రాదేయపడినా వారు పట్టించుకోకుండా కొట్టి చంపారు. ఆ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యేయి. ఇంకా అక్కడే ఉన్నట్లయితే తమ ప్రాణాలకి కూడా ప్రమాదమని బావించిన అఖ్లాక్ కుటుంబ సభ్యులు చెన్నైలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న పెద్ద కుమారుడు దగ్గరకు తరలి వెళ్ళిపోయారు.

చిత్రకారిణి హేమ హత్య కేసులో మరో ట్విస్ట్!

  ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి హేమ ఉపాద్యాయ్, ఆమె లాయర్ హరీష్ భంబానీలు ఈనెల 12వ తేదీన హత్య చేయబడ్డారు. ముంబై సమీపంలో ఖాండివిల్లీ అనే పట్టణంలో ఒక మురికి కాలువలో వారి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. గత రెండు మూడేళ్ళుగా ఆమెకు తన భర్త చింతన్ ఉపాద్యాయ్ తో గొడవలు జరుగుతుండటంతో విడాకులకు దరఖాస్తు చేసుకొంది. లాయర్ హరీష్ భంబానీ ఆమె కేసులను చూస్తున్నారు. వారిరువురు హత్య చేయబడటంతో సహజంగానే ఆమె భర్తపై అనుమానం కలిగి పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు.   ఈ హత్యతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, ఆమె తన నుండి విడిపోవాలనుకొంటునప్పటికీ తను ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని, ఆమె చనిపోయే ముందు రోజే ఆమెకు రెండు లక్షల రూపాయలు భరణంగా ఇచ్చేనని తెలిపాడు. ఆమె అంత్యక్రియలు కూడా అతనే చేసాడు. పోలీసుల దర్యాప్తు చేసి ఈ హత్యకి కారకులయిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆజాద్ రాజ్బర్, ప్రదీప్ రాజ్బర్, విజయ్ రాజ్బర్, శివకుమార్ రాజ్బర్ అనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. వారు తమ నేరాన్ని అంగీకరించడంతో హేమ భర్త చింతన్ ఉపాద్యాయ్ నిర్దోషి అని అందరూ నమ్మారు.   కానీ పోలీసుల విచారణలో అతనే ఈ హత్యలకు ప్రధాన సూత్రధారి అనే సంగతి బయటపడింది. తన భార్య పెట్టిన కోర్టు కేసులతో వేగలేక ఆమెను హత్య చేసి ఆ కేసులను వదిలించుకోవాలని రెండు నెలల క్రితమే నిశ్చయించుకొన్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. అతనికి ఖాండివిల్లీలో విద్యాధర్ రాజ్బర్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అతను హేమ హత్యకు సహకరించేందుకు అంగీకరించి అందుకోసం కొంత మొత్తం కూడా తీసుకొన్నాడు.   ముందు అనుకొన్న ఒక పధకం ప్రకారం అతను హేమకు ఫోన్ చేసి, ఆమె భర్త నుండి విడాకులు పొందేందుకు తన వద్ద ఒక బలమయిన ఆధారం ఉందని చెప్పాడు. ఇంతకు ముందు ఆమె భర్త ఇంట్లో పనిచేసిన పనిమనిషి ద్వారా తనకు ఆ విషయం తెలిసిందని, ప్రస్తుతం ఆ పనిమనిషి తన వద్దనే ఉందని చెప్పడంతో హేమ అతనిని కలిసేందుకు అంగీకరించింది. ఆ పనిమనిషిని దాదార్ రైల్వే స్టేషన్ వద్ద కలుస్తానని హేమ చెప్పింది. కానీ ఆ పనిమనిషి అక్కడికి వచ్చేందుకు ఇష్టపడటం లేదని కనుక హేమనే ఖాండివిల్లీలో ఉన్న తన గోదాము దగ్గరకి రమ్మని విద్యాధర్ రాజ్బర్ పిలిచాడు.   అప్పటికీ అతనిపై హేమకు ఏ మాత్రం అనుమానం కలగలేదు. ఆమె తన లాయర్ హరీష్ భంబానీని వెంటబెట్టుకొని ఆ గోదాము వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె కోసం సిద్దంగా ఉన్న ఐదుగురు రజ్బర్ దుండగులు కలిసి ఆమెను హత్య చేసారు. ఆమెతో వచ్చిన పాపానికి ఆమె లాయర్ కూడా బలయ్యి చివరికి మురికి కాలువలో తేలాడు. తన భార్యపెట్టిన కేసులతో వేగలేకనే ఆమెను హత్య చేయాలనుకొన్నానని చింతన్ ఉపాద్యాయ్ పోలీసుల ముందు అంగీకరించాడు. కేసుల బాధ నుండి విముక్తి పొందడానికి ఇంత దారుణానికి పాల్పడినందుకు ఇప్పుడు ఉరి కంబం ఎక్కబోతున్నాడేమో?

జైట్లీని రాజీనామా చేయమని ప్రధాని సూచిస్తున్నారు: ఏచూరి

  డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ పై డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు పార్లమెంటులో కూడా ప్రతిధ్వనిస్తున్నాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు, ఇతర పార్టీల సభ్యులు అరుణ్ జైట్లీ రాజీనామాకు పట్టుబడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సహా బీజేపీ నేతలందరూ అరుణ్ జైట్లీకి అండగా నిలబడుతున్నారు.   అరుణ్ జైట్లీకి మద్దతుగా ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడుతూ “ఒకప్పుడు హవాలా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న లాల్ కృష్ణ అద్వానీ ఏవిధంగా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని బయటపడ్డారో, అదేవిధంగా ఇప్పుడు అరుణ్ జైట్లీ కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని ఈ కేసు నుంచి బయటపడతారు” అని అన్నారు.   "హవాలా కేసులో అద్వానీపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన తన పదవికి రాజీనామా చేసి ఆ కేసును ఎదుర్కొని నిర్దోషిగా బయటపడ్డారు. కనుక ఇప్పుడు అరుణ్ జైట్లీని కూడా తన పదవికి రాజీనామా చేసి నిర్దోషిగా బయటపడాలని ప్రధాని నరేంద్ర మోడి సూచిస్తున్నారని సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు. లేకుంటే ఇటువంటి సమయంలో అద్వానీ-హవాలా కేసు గురించి ఆయన మాట్లాడవలసిన అవసరమే లేదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.   డిల్లీ ప్రధాన కార్యదర్శి రాజేందర్ కుమార్ కార్యాలయంపై సిబిఐ అధికారులు దాడులు చేసి శోదాలు నిర్వహించి తేనెతుట్టెను కదిపినట్లయింది. బీజేపీకే చెందిన ఎంపి కీర్తి ఆజాద్ కూడా అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేస్తుండటంతో ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై అరుణ్ జైట్లీ రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసినప్పటికీ ఆయన రాజీనామా కోసం ప్రతిపక్షాల చేస్తున్న ఈ ఒత్తిడిని తట్టుకోవడం మోడీ ప్రభుత్వానికి చాలా కష్టంగా మారింది. బహుశః అందుకే ఇటువంటి సమయంలో ప్రధాని మోడి అద్వానీ ప్రసక్తి తీసుకువచ్చేరేమో?

బాలనేరస్థుల చట్టానికి రాజ్యసభ ఆమోదం

  బాల నేరస్తుల చట్టాన్ని రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. ఇంతవరకు 18 సం.లలోపు వయసున్న వారినందరినీ బాల నేరస్తులుగా పరిగణించేవారు. ఆ కారణంగానే నిర్భయ కేసులో అత్యంత క్రూరంగా ప్రవర్తించిన బాలనేరస్తుడు కేవలం మూడేళ్ళ నిర్బంధంతో బయటపడగలిగాడు. అందుకే వారి వయోపరిమితిని 16 సం.లకి తగ్గిస్తూ చట్ట సవరణలు చేసారు. కనుక ఇక నుంచి 16 సం.ల వయసున్న బాల నేరస్తుడు అటువంటి నేరాలకు పాల్పడితే అతనిని పెద్ద వారితో సమానంగా పరిగణించి కోర్టులు శిక్షలు వేస్తాయి.   ఈ బిల్లును ఆమోదించేముందు దానిపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి స్టాండింగ్ కమిటీకి పంపించాలని సిపిఐ (ఎం), డిఎంకె మరియు ఎన్.సి.పి. కోరాయి కానే వారి సూచనను మిగిలిన పార్టీలు తిరస్కరించి బిల్లును ఆమోదించాయి. ఇంతటితో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందినట్లయింది కనుక దానిని రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. ఆయన దానిపై సంతకం చేయగానే ఈ చట్టం అమలులోకి వస్తుంది.   అయితే అంత చిన్న వయసులో తెలిసీ తెలియనితనంతో నేరం చేసి ఉండి ఉంటే అటువంటి బాలనేరస్తుల హక్కులకు రక్షణ కల్పించేందుకు ఈ చట్టంలో అన్ని జాగ్రత్తలు తీసుకోబడ్డాయి. బాలనేరస్థుల బోర్డులో నిపుణులు, మానసిక వైద్యులు అతనిని మొదట విచారించి, అతను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ నేరాన్ని చేశాడా లేక ఒక చిన్న పిల్లాడి మాదిరిగా తెలిసీ తెలియనితనంతో ఆ నేరానికి పాల్పడాడా? అనే విషయం నిర్ధారణ చేసుకొన్నాకనే అతనిని న్యాయస్థానాలకు అప్పగిస్తాయి. అప్పుడు ఒకవేళ న్యాయస్థానాలు అతనికి జైలు శిక్ష విధించినట్లయితే, వెంటనే జైలుకి పంపకుండా బాల నేరస్తుల శిక్షణ, పరివర్తన కేంద్రాలకి పంపిస్తారు. అక్కడే అతనిలో పరివర్తన కలిగించేందుకు ప్రయత్నించి అతనికి 21 ఏళ్ల వయసు వచ్చేక అతనికి శిక్ష విధించిన ఆ కోర్టుకి అప్పగిస్తారు. అప్పుడు కోర్టులు సముచిత నిర్ణయం తీసుకొంటాయి. ఈరోజు ఆమోదించిన ఈ చట్టం ప్రకారం నిర్భయ కేసులో బాలనేరస్తుడిని మళ్ళీ శిక్షించే అవకాశాలు లేకపోయినప్పటికీ, ఇక ముందు ఆ వయసుగల పిల్లలు అటువంటి నేరాలకు పాల్పడకుండా ఈ చట్టం నిలువరించగలదని తను ఆశిస్తున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు.

విశాఖ టీడీపీలో కొణతాల కలకలం

గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా వున్న విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాలు ఇప్పుడు మరోసారి రాజుకున్నాయి. నిన్నటి వరకూ పైకి ప్రశాంతంగా కనిపించిన విశాఖ టీడీపీ అంతర్గత రాజకీయాలలో ఇప్పుడు కలకలం రేగింది. ఆ కలకలం పేరు... కొణతాల రామకృష్ణ. వైసీపీకి గుడ్‌బై కొట్టిన తర్వాత కొణతాల చాలాకాలంగా ఏపార్టీలోనూ చేరలేదు. టీడీపీ నుంచి గౌరవప్రదంగా ఆహ్వానం వస్తే వాలిపోవాలని ఎదురుచూస్తు్న్నారు.  అయితే జిల్లాలో గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్గాలు బలంగా వున్నాయి. ఒక వర్గం మీద మరొక వర్గం ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పొట్టేళ్ళ మధ్యకు తాను వెళ్ళడం ఎందుకులే అని కొణతాల మేకలాగా మిన్నకున్నారు. ఈ నేపథ్యంలో గంటాకు చెక్ పెట్టడం కోసం చింతకాయల అయ్యన్నపాత్రుడు చాణక్య వ్యూహం ప్రయోగించారు. కొణతాల రామకృష్ణను, ఆయన ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే గండి బాబ్జీని తన మధ్యవర్తిత్వం ద్వారా టీడీపీలో చేర్పించినట్టయితే తన వర్గం బలం పెరిగి, గంటా శ్రీనివాసరావు వర్గం మీద పైచేయి సాధించవచ్చనేది చింతకాయల వారి వ్యూహం. దీనిలో భాగంగా ఆయనతో పాటు ఆయన మిత్రులైన ఏపీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మంగళవారం ఉదయం కొణతాల రామకృష్ణను, గండి బాబ్జీని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసానికి తీసుకుని వెళ్ళారు. గంటాకు ఎంతమాత్రం తెలియకుండా ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వీరిద్దరూ టీడీపీలో చేరే విషయం గురించి చర్చ జరిగినట్టు సమాచారం. అన్నీ అనుకూలిస్తే త్వరలో వీరిద్దరూ టీడీపీ తీర్థం, ప్రసాదం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు ఈ భేటీ ఏర్పాటు చేశారన్న విషయాన్ని తెలుసుకున్న గంటా వర్గం అప్రమత్తమైపోయింది. వీరిద్దరూ కనుక టీడీపీలో చేరితో విశాఖ జిల్లాలో తమ వర్గం డౌనైపోయే డేంజరుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించడానికి గంటా వర్గం అత్యవసరంగా సమావేశమైంది. మంత్రి గంటా ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఆ వర్గానికి చెందిన జిల్లా ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, పీలా గోవింద్, పి.గణబాబు పాల్గొన్నారు. కొణతాల, గండి టీడీపీలో చేరడాన్ని తమ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసినప్పటికీ, తమకు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అయ్యన్నపాత్రుడు ఆ ఇద్దర్నీ చంద్రబాబు దగ్గరకి తీసుకెళ్ళారని, దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలని ఆ సమావేశంలో భావించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికి తంటాలు పడుతున్నారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం లేదు. పార్టీలో నానాటికీ పెరిగిపోతున్న ఈ ధోరణిని అరికట్టే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారో అర్థం కాని విషయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజకీయాలలో 1+1=2 ఎప్పటికీ అవ్వదనే విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి చేరికలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ మాదిరిగా తయారైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ చేరికలను ప్రోత్సహించడం వెనుక వైసీపీని నిర్వీర్యం చేసే వ్యూహం వుందని అనుకోవచ్చు... అయితే వైసీపీ నుంచి ఎవరు వచ్చి టీడీపీలో చేరినా అప్పటికే టీడీపీలో వున్న వర్గాల్లో కలకలం రేగుతోంది తప్ప ప్రయోజనమేమీ వుండటం లేదు. దీనితోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పార్టీలో ప్రాధాన్యం పెరుగుతోందని, ఎప్పటి నుంచో పార్టీ జండా మోసిన తమకు ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదన్న అభిప్రాయం, నిర్లిప్తత పార్టీ శ్రేణుల్లో రోజు రోజుకూ పెరిగిపోతోంది. పదేళ్ళ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామన్న ఆనందం కూడా పార్టీ శ్రేణులకు మిగలని పరిస్థితులు ప్రస్తుతం పార్టీలో నెలకొన్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పార్టీ అభివృద్ధికి శ్రమించిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ పరిస్థితిని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.