భారత్, పాక్, బంగ్లాదేశ్ కామన్ కరెన్సీ?
posted on Dec 28, 2015 @ 10:11AM
ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ ఆకస్మిక పర్యటనతో ఇరు దేశాల సంబంధాలు మళ్ళీ మెరుగుపడతాయనే భావన ఇరు దేశాల ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. జనవరి 15వ తేదీన ఇస్లామాబాద్ లో ఇరు దేశాల విదేశాంగ శాఖల ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగబోతుండటంతో ప్రజల అంచనాలు పెరిగిపోయాయి.
అయితే అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయని ఆశించడం సరికాదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ యొక్క విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. మొదట ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేందుకు అవసరమయిన చర్యలు చేపడతామని, వాటిలో భాగంగా సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ అమలు గురించి జనవరి 15న జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.
బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ “భవిష్యత్తులో భారత్ పాక్, బంగ్లాదేశ్ మూడు మళ్ళీ ఏకం అయిపోతాయని జోస్యం చెప్పారు. దానిని మరింత వివరిస్తూ “అలాగని ఆ రెండు దేశాలను భారత్ లో బలవంతంగా కలిపేసుకొంటామని కాదు దానర్ధం. మూడు దేశాల ప్రజల అభీష్టంతో అది సాధ్యం అవవచ్చునని నేను భావిస్తున్నాను,” అని అన్నారు.
ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న లోక్ జన్ శక్తి పార్టీ అధినేత, మరియు కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ “భవిష్యత్తులో భారత్ పాక్, బంగ్లాదేశ్ మూడు మళ్ళీ ఏకం అవుతాయో లేదో తెలియదు కానీ, ఈ మూడు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడి, ఉగ్రవాదం బెడద తగ్గాలంటే మూడు దేశాలు చేతులు కలపవలసిన అవసరం ఉంది. వీలయితే మూడు దేశాలు ఒకే కరెన్సీని ప్రవేశపెట్టగలిగితే మంచిది. అలాగే స్వేచ్చా వాణిజ్యం అమలు చేయగలిగితే దాని వలన మూడు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు మెరుగుపడతాయి. తద్వారా మూడు దేశాల ప్రజల మధ్య సంబంధాలు బలపడతాయి. అప్పుడు ఉగ్రవాదం మటుమాయం అవుతుంది,” అని అన్నారు.
రామ్ మాధవ్ జోస్యం నిజం అయ్యే అవకాశాలు ఏమాత్రం లేకపోయినా రామ్ విలాస్ పాశ్వాన్ సూచిస్తున్నట్లుగా "స్వేచ్చా వాణిజ్యం" ‘కామన్ కరెన్సీ’ని ప్రవేశపెట్టడం మంచి ఆలోచనలేనని చెప్పవచ్చును. కానీ సాధారణంగా ఒకే స్థాయిలో ఉన్న దేశాల మధ్యనే కామన్ కరెన్సీ వంటి ప్రయోగాలు సఫలం అవుతాయి. ఉదాహరణకి ఇంచుమించు సమానంగా అభివృద్ధి చెందిన యూరప్ దేశాలన్నీ కలిసి ‘యూరో’ కామన్ కరెన్సీని ప్రవేశపెట్టుకొన్నాయి. నేటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని అవి అధిగమించి కామన్ కరెన్సీని చెలామణి చేసుకోగలుగుతున్నాయి. కానీ భారత్ తో పోలిస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు అభివృద్ధిలో చాలా వెనుకపడి ఉన్నాయి కనుక పాశ్వాన్ సూచన అమలు చేయడం కూడా కష్టమే కావచ్చును. కానీ పాశ్వాన్ సూచిస్తున్న " మూడు దేశాల మధ్య స్వేచ్చా వాణిజ్యం" అమలు చేయడానికి అవకాశాలున్నాయి.