చిత్రకారిణి హేమ హత్య కేసులో మరో ట్విస్ట్!
posted on Dec 23, 2015 @ 2:15PM
ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి హేమ ఉపాద్యాయ్, ఆమె లాయర్ హరీష్ భంబానీలు ఈనెల 12వ తేదీన హత్య చేయబడ్డారు. ముంబై సమీపంలో ఖాండివిల్లీ అనే పట్టణంలో ఒక మురికి కాలువలో వారి శవాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. గత రెండు మూడేళ్ళుగా ఆమెకు తన భర్త చింతన్ ఉపాద్యాయ్ తో గొడవలు జరుగుతుండటంతో విడాకులకు దరఖాస్తు చేసుకొంది. లాయర్ హరీష్ భంబానీ ఆమె కేసులను చూస్తున్నారు. వారిరువురు హత్య చేయబడటంతో సహజంగానే ఆమె భర్తపై అనుమానం కలిగి పోలీసులు అతనిని అరెస్ట్ చేసారు.
ఈ హత్యతో తనకు ఎటువంటి సంబందమూ లేదని, ఆమె తన నుండి విడిపోవాలనుకొంటునప్పటికీ తను ఆమెను ప్రేమిస్తూనే ఉన్నానని, ఆమె చనిపోయే ముందు రోజే ఆమెకు రెండు లక్షల రూపాయలు భరణంగా ఇచ్చేనని తెలిపాడు. ఆమె అంత్యక్రియలు కూడా అతనే చేసాడు. పోలీసుల దర్యాప్తు చేసి ఈ హత్యకి కారకులయిన ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆజాద్ రాజ్బర్, ప్రదీప్ రాజ్బర్, విజయ్ రాజ్బర్, శివకుమార్ రాజ్బర్ అనే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసారు. వారు తమ నేరాన్ని అంగీకరించడంతో హేమ భర్త చింతన్ ఉపాద్యాయ్ నిర్దోషి అని అందరూ నమ్మారు.
కానీ పోలీసుల విచారణలో అతనే ఈ హత్యలకు ప్రధాన సూత్రధారి అనే సంగతి బయటపడింది. తన భార్య పెట్టిన కోర్టు కేసులతో వేగలేక ఆమెను హత్య చేసి ఆ కేసులను వదిలించుకోవాలని రెండు నెలల క్రితమే నిశ్చయించుకొన్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. అతనికి ఖాండివిల్లీలో విద్యాధర్ రాజ్బర్ అనే వ్యక్తితో పరిచయం అయ్యింది. అతను హేమ హత్యకు సహకరించేందుకు అంగీకరించి అందుకోసం కొంత మొత్తం కూడా తీసుకొన్నాడు.
ముందు అనుకొన్న ఒక పధకం ప్రకారం అతను హేమకు ఫోన్ చేసి, ఆమె భర్త నుండి విడాకులు పొందేందుకు తన వద్ద ఒక బలమయిన ఆధారం ఉందని చెప్పాడు. ఇంతకు ముందు ఆమె భర్త ఇంట్లో పనిచేసిన పనిమనిషి ద్వారా తనకు ఆ విషయం తెలిసిందని, ప్రస్తుతం ఆ పనిమనిషి తన వద్దనే ఉందని చెప్పడంతో హేమ అతనిని కలిసేందుకు అంగీకరించింది. ఆ పనిమనిషిని దాదార్ రైల్వే స్టేషన్ వద్ద కలుస్తానని హేమ చెప్పింది. కానీ ఆ పనిమనిషి అక్కడికి వచ్చేందుకు ఇష్టపడటం లేదని కనుక హేమనే ఖాండివిల్లీలో ఉన్న తన గోదాము దగ్గరకి రమ్మని విద్యాధర్ రాజ్బర్ పిలిచాడు.
అప్పటికీ అతనిపై హేమకు ఏ మాత్రం అనుమానం కలగలేదు. ఆమె తన లాయర్ హరీష్ భంబానీని వెంటబెట్టుకొని ఆ గోదాము వద్దకు వెళ్ళింది. అక్కడ ఆమె కోసం సిద్దంగా ఉన్న ఐదుగురు రజ్బర్ దుండగులు కలిసి ఆమెను హత్య చేసారు. ఆమెతో వచ్చిన పాపానికి ఆమె లాయర్ కూడా బలయ్యి చివరికి మురికి కాలువలో తేలాడు. తన భార్యపెట్టిన కేసులతో వేగలేకనే ఆమెను హత్య చేయాలనుకొన్నానని చింతన్ ఉపాద్యాయ్ పోలీసుల ముందు అంగీకరించాడు. కేసుల బాధ నుండి విముక్తి పొందడానికి ఇంత దారుణానికి పాల్పడినందుకు ఇప్పుడు ఉరి కంబం ఎక్కబోతున్నాడేమో?