విశాఖ టీడీపీలో కొణతాల కలకలం
posted on Dec 22, 2015 @ 4:55PM
గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా వున్న విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాలు ఇప్పుడు మరోసారి రాజుకున్నాయి. నిన్నటి వరకూ పైకి ప్రశాంతంగా కనిపించిన విశాఖ టీడీపీ అంతర్గత రాజకీయాలలో ఇప్పుడు కలకలం రేగింది. ఆ కలకలం పేరు... కొణతాల రామకృష్ణ. వైసీపీకి గుడ్‌బై కొట్టిన తర్వాత కొణతాల చాలాకాలంగా ఏపార్టీలోనూ చేరలేదు. టీడీపీ నుంచి గౌరవప్రదంగా ఆహ్వానం వస్తే వాలిపోవాలని ఎదురుచూస్తు్న్నారు. అయితే జిల్లాలో గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు వర్గాలు బలంగా వున్నాయి. ఒక వర్గం మీద మరొక వర్గం ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నాలు నిరంతరం జరుగుతూనే వున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పొట్టేళ్ళ మధ్యకు తాను వెళ్ళడం ఎందుకులే అని కొణతాల మేకలాగా మిన్నకున్నారు. ఈ నేపథ్యంలో గంటాకు చెక్ పెట్టడం కోసం చింతకాయల అయ్యన్నపాత్రుడు చాణక్య వ్యూహం ప్రయోగించారు. కొణతాల రామకృష్ణను, ఆయన ప్రధాన అనుచరుడు, ఎమ్మెల్యే గండి బాబ్జీని తన మధ్యవర్తిత్వం ద్వారా టీడీపీలో చేర్పించినట్టయితే తన వర్గం బలం పెరిగి, గంటా శ్రీనివాసరావు వర్గం మీద పైచేయి సాధించవచ్చనేది చింతకాయల వారి వ్యూహం. దీనిలో భాగంగా ఆయనతో పాటు ఆయన మిత్రులైన ఏపీ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మంగళవారం ఉదయం కొణతాల రామకృష్ణను, గండి బాబ్జీని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి నివాసానికి తీసుకుని వెళ్ళారు. గంటాకు ఎంతమాత్రం తెలియకుండా ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో వీరిద్దరూ టీడీపీలో చేరే విషయం గురించి చర్చ జరిగినట్టు సమాచారం. అన్నీ అనుకూలిస్తే త్వరలో వీరిద్దరూ టీడీపీ తీర్థం, ప్రసాదం పుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయ్యన్నపాత్రుడు ఈ భేటీ ఏర్పాటు చేశారన్న విషయాన్ని తెలుసుకున్న గంటా వర్గం అప్రమత్తమైపోయింది. వీరిద్దరూ కనుక టీడీపీలో చేరితో విశాఖ జిల్లాలో తమ వర్గం డౌనైపోయే డేంజరుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించడానికి గంటా వర్గం అత్యవసరంగా సమావేశమైంది. మంత్రి గంటా ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఆ వర్గానికి చెందిన జిల్లా ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, పీలా గోవింద్, పి.గణబాబు పాల్గొన్నారు. కొణతాల, గండి టీడీపీలో చేరడాన్ని తమ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసినప్పటికీ, తమకు షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అయ్యన్నపాత్రుడు ఆ ఇద్దర్నీ చంద్రబాబు దగ్గరకి తీసుకెళ్ళారని, దీన్ని ఎలాగైనా తిప్పికొట్టాలని ఆ సమావేశంలో భావించినట్టు తెలుస్తోంది.
ఏది ఏమైనప్పటికీ, ప్రస్తుతం టీడీపీలో ఉన్న చాలామంది నాయకులు సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికి తంటాలు పడుతున్నారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయడం లేదు. పార్టీలో నానాటికీ పెరిగిపోతున్న ఈ ధోరణిని అరికట్టే విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారో అర్థం కాని విషయమని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజకీయాలలో 1+1=2 ఎప్పటికీ అవ్వదనే విషయం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి చేరికలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల క్వశ్చన్ మాదిరిగా తయారైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ చేరికలను ప్రోత్సహించడం వెనుక వైసీపీని నిర్వీర్యం చేసే వ్యూహం వుందని అనుకోవచ్చు... అయితే వైసీపీ నుంచి ఎవరు వచ్చి టీడీపీలో చేరినా అప్పటికే టీడీపీలో వున్న వర్గాల్లో కలకలం రేగుతోంది తప్ప ప్రయోజనమేమీ వుండటం లేదు. దీనితోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పార్టీలో ప్రాధాన్యం పెరుగుతోందని, ఎప్పటి నుంచో పార్టీ జండా మోసిన తమకు ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదన్న అభిప్రాయం, నిర్లిప్తత పార్టీ శ్రేణుల్లో రోజు రోజుకూ పెరిగిపోతోంది. పదేళ్ళ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నామన్న ఆనందం కూడా పార్టీ శ్రేణులకు మిగలని పరిస్థితులు ప్రస్తుతం పార్టీలో నెలకొన్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పార్టీ అభివృద్ధికి శ్రమించిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చే విషయాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని చూసి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాలని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ పరిస్థితిని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది.