ధనిక రాష్ట్రానికి కూడా లక్ష కోట్లు కావాలా?
posted on Dec 26, 2015 @ 12:24PM
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో గెలిచేందుకు కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి లక్ష కోట్లు మంజూరు చేస్తుందా? అని అడిగితే ఎవరయినా నవ్వకుండా ఉండలేరు. కానీ మంత్రి కె. తారక రామారావు మాత్రం అటువంటి గొప్ప సవాలు విసిరి బీజేపీని భలే ఇరుకున పెట్టేసానని భావిస్తున్నట్లున్నారు. ప్రధాని నరేంద్ర మోడి బిహార్ రాష్ట్రానికి 1.25లక్షల కోట్లు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రూ.80 వేల కోట్ల ఆర్ధిక ప్యాకేజీలు ప్రకటించారని, కానీ తెలంగాణా రాష్ట్రానికి ఎటువంటి ప్యాకేజీ ప్రకటించలేదని ప్రశ్నించారు. కనుక కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి దైర్యం ఉంటే మోడీని అడిగి లక్ష కోట్లు పట్టుకురావాలని సవాలు విసిరారు.
దేశంలో గుజరాత్ తరువాత తెలంగాణా రెండవ ధనిక రాష్ట్రమని కె.టి.ఆర్. తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అనేకసార్లు పదేపదే ప్రకటించుకొంటునప్పుడు ఇంకా లక్ష కోట్ల ఆర్ధిక ప్యాకేజి ఎందుకు ఆశిస్తున్నారంటే అది వస్తుందని కాదు. తెలంగాణా బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏమి చేయడం లేదు...కేంద్రం కూడా తెలంగాణా రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదు...అని జంటనగరాలలో ప్రజలకు భోదించి జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవడానికే.
రాష్ట్ర విభజన తరువాత అన్ని విధాల చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తామని చెపుతున్న ఆర్ధిక ప్యాకేజినే ఇంతవరకు మంజూరు చేయలేదు. అటువంటిది దేశంలో రెండవ ధనిక రాష్ట్రమయిన తెలంగాణాకు కేంద్రప్రభుత్వం లక్ష కోట్లు మంజూరు చేస్తుందని ఏవిధంగా ఆశించగలము? అని ఆలోచిస్తే మంత్రి కె.టి.ఆర్. విసిరినా ఈ సవాలు కేవలం జి.హెచ్.ఎం.సి. పరిధిలో చాలా బలంగా ఉన్న బీజేపీని దెబ్బతీయడానికేనని అర్ధమవుతోంది.
దానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేన్ ప్రధాన్ చాలా గట్టిగానే బదులిచ్చారు. హైదరాబాద్ లో నిన్న జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి కుమారుడు కె.టి.ఆర్.కి మరీ అంత అహంకారం పనికిరాదు. ఆయన మోడీని విమర్శించే ముందు తన తండ్రి కేసీఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వస్తున్నారో తెలుసుకొంటే మంచిది. కేంద్రప్రభుత్వం తెలంగాణా రాష్ట్రానికి ఏమేమి చేస్తోంధో కె.టి.ఆర్.కి తెలియకపోతే తన తండ్రిని అడిగి తెలుసుకొంటే మంచిది,” అని అన్నారు.
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ “తెలంగాణా రాష్ట్రానికి నిరంతర విద్యుత్ పైలట్ ప్రాజెక్టు మంజూరు చేయడం వలననే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవనే సంగతి మంత్రి కె.టి.ఆర్.కి తెలియదా? ఎం.ఎం.టీ.ఎస్.రెండో దశ పనులు పూర్తి చేయడానికి నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి? కేంద్రం నుంచే కదా? రాష్ట్రంలో అమలవుతున్న పలు సంక్షేమ పధకాలకు కేంద్రమే నిధులు మంజూరు చేస్తున్న విషయం కె.టి.ఆర్.కి తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం తెలంగాణాతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తోందని, అవసరమయిన నిధులు, ప్రాజెక్టులు త్వరితగతిన మంజూరు చేస్తోందని బండారు దత్తాత్రేయ అన్నారు.