నెహ్రూ, సోనియాలపై పార్టీ పత్రికలోనే విమర్శలు?
posted on Dec 28, 2015 @ 4:13PM
కాంగ్రెస్ పార్టీలో తరతరాలుగా భజన కార్యక్రమం కొనసాగుతుండటం అందరూ నిత్యం చూస్తున్నదే. అందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకే చెందిన ‘కాంగ్రెస్ దర్శన్’ అధికారిక పత్రికలో నెహ్రు, సోనియా గాంధీలపై విమర్శలు ప్రచిరితమయితే? అది కూడా కాంగ్రెస్ పార్టీ 131వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకొంటున్న సమయంలో? సరిగ్గా అదే జరిగింది.
ముంబై నుంచి హిందీ బాషలో ప్రచురించబడిన "కాంగ్రెస్ దర్శన్" తాజా సంచికలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, దేశ ప్రప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహార్ లాల్ నెహ్రూలని తీవ్రంగా విమరిస్తూ రెండు కధనాలు ప్రచిరితమయ్యాయి. అవి చూసి కాంగ్రెస్ అధిష్టానమే కాదు పార్టీలో నేతలందరూ షాక్ కి గురయ్యారు.
సోనియా గాంధీ: ఆమె తండ్రి స్టెఫానో మైనో ఇటాలియన్ సైన్యంలో ఒక సాధారణ సైనికుడు. సోనియా గాంధీ ఎయిర్ హోస్టెస్ కావాలనుకొన్నారు. కానీ అనుకోకుండా ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలయిపోయారు. పార్టీలో సభ్యత్వం స్వీకరించిన 62 రోజుల్లోనే ఆమె అధ్యక్షురాలయిపోగలిగారు. ఆ తరువాత ఆమె ప్రధాని కావాలని విఫలయత్నాలు చేసారు, అని ఒక కధనంలో వ్రాసారు.
జవహార్ లాల్ నెహ్రూ : డిశంబరు 15న స్వర్గీయ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వర్దంతి సందర్భంగా కాంగ్రెస్ దర్శన్ లో నెహ్రూని విమర్శిస్తూ వ్రాసిన కధనం.
“నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఉపప్రధాని మరియు హోం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించేవారు. కానీ వారిరువురి మధ్య తరచూ భేదాభిప్రాయాలు ఏర్పడుతుండేవి. ఆ కారణంగా వాళ్ళిద్దరూ కూడా రాజీనామాలు చేస్తామని ఒకరినొకరు బెదిరించుకొనేవారు. అందుకు ప్రధాన కారణం సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి చెప్పిన సలహాలను ప్రధాని నెహ్రూ పెడచెవిన పెడుతుండటమే! చైనా, టిబెట్, నేపాల్ దేశాల విషయంలో నెహ్రూ అనుసరిస్తున్న విదేశాంగ విధానం సరికాదని దాని వలన భారత్ కి సమస్యలు వస్తాయని సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ పదేపదే హెచ్చరించేవారు. కానీ నెహ్రూ పట్టించుకొనేవారు కాదు. అలాగే కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్యసమితి ముందుకు తీసుకు వెళ్ళవద్దని పటేల్ చెప్పిన సలహాని కూడా నెహ్రూ పెడచెవిన పెట్టారు. ఆ కారణంగానే నేటికీ భారతదేశానికి అదొక పెద్ద సమస్యగా మారిపోయింది. నాడు పటేల్ చెప్పిన సలహాలను నెహ్రూ పాటించి ఉండి ఉంటే నేడు ఇన్ని సమస్యలు ఉండేవి కావేమో?” అని మరో కధనంలో వ్రాశారు.
కాంగ్రెస్ పార్టీ స్వంత పత్రిక అయిన ‘కాంగ్రెస్ దర్శన్’ లో నెహ్రూ, సోనియా గాంధీలను ఈవిధంగా విమర్శిస్తూ ఎవరు కధనాలు వ్రాసారో తనకు తెలియదని ఆ పత్రిక సంపాదకుడు సంజయ్ నిరుపం చెప్పారు. ఆయన ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా కావడంతో పత్రికి దైనందిన వ్యవహారాలను తను చూడటం లేదని అందువలననే ఈ పొరపాటు జరిగి ఉండవచ్చని చెపుతున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు పాక్, చైనా, నేపాల్, శ్రీలంక వంటి ఇరుగు పొరుగు దేశాలతోను, అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలతోను అనుసరిస్తున్న విదేశీ విధానం ఏమాత్రం సరిగ్గా లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ పర్యటించినపుడు అలాగే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు స్వంత పార్టీ పత్రికలోనే నెహ్రూ విదేశీ విధానం తప్పుల తడక అని విమర్శలు ప్రచురింపబడటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది.