నేరస్థుడి జీవితానికి భద్రత కల్పిస్తున్నారు సరే...కానీ,
బాల నేరస్థుడి విడుదలని నిలిపివేయాలని దాఖలయిన పిటిషన్ని కొట్టివేస్తూ ఈ విషయంలో సుప్రీం కోర్టు తన అసహాయత వ్యక్తం చేసింది. “బాలనేరస్థుల చట్టప్రకారం అతనికి గరిష్టంగా మూడేళ్ళ శిక్ష విధించబడింది. మేము కూడా ప్రజాభిప్రాయంతో ఏకీభవిస్తున్నప్పటికీ అతని శిక్షను పొడిగించడానికి చట్టం అనుమతించదు. చట్టం మా చేతులని కట్టివేసింది,” అని సుప్రీం కోర్టు ధర్మాసనం చెప్పింది.
ఇందులో సుప్రీం కోర్టును తప్పు పట్టడానికి లేదు. బాల నేరస్థుల చట్టానికి మోడీ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణల బిల్లును ఆమోదించడానికి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రాజ్యసభలో సహకరించి ఉండి ఉంటే బహుశః నేడు బాల నేరస్థుడి విషయంలో సుప్రీం కోర్టు ఈవిధంగా నిసహాయత వ్యక్తం చేయవలసిన అవసరం ఏర్పడేది కాదేమో?
ఈ హేయమయిన నేరానికి పాల్పడిన బాల నేరస్తుడిని ప్రజలు గుర్తుపట్టకుండా అతని మొహానికి ముసుగువేసి కోర్టుకి తీసుకువచ్చేవారు. అందుకు ఎవరూ తప్పు పట్టడం లేదు. అధికారులు అతనిని నిన్న విడుదలచేసిన తరువాత డిల్లీలో ఒక ఎన్జీఓ సంస్థకు అప్పగించారు. అప్పుడు కూడా అతనిని ప్రజలు గుర్తు పట్టకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు. అధికారులిచ్చిన ఒక సమాచారం ప్రకారం ఆ ఎన్జీఓ సంస్థ అతని పేరుతో సహా అతని వ్యక్తిగత వివరాలన్నీ మార్పు చేసేందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అతను రేపు బయట ప్రపంచంలోకి వెళ్ళినా ఎవరూ అతనిని గుర్తుపట్టి హాని తలపెట్టకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు తెలిపారు.
అతను మళ్ళీ సాధారణ జీవితం సాగించేందుకు వీలుగా బాలనేరస్థుల చట్ట ప్రకారం అతనికి రూ.10, 000 నగదు, అవసరమయిన సహాయ సహకారాలు అందించబోతున్నారు. బయట పరిస్థితుల తీవ్రత దృష్ట్యా ప్రస్తుతం అతనిని ఎన్జీఓ సంస్థలో భద్రంగా చూసుకొంటూ, అతనిని సమాజసేవా కార్యకలాపాలలో పాల్గొనేలా చేస్తూ అతనిలో మానసిక పరివర్తనకు ప్రయత్నిస్తారు. ఏదయినా వృత్తి శిక్షణలో అతను ఆసక్తి చూపినట్లయితే దానిలో అతనికి శిక్షణ ఇస్తారు. ఒకవేళ అతను తనకు అక్కడ ఉండటం ఇష్టం లేకపోయినట్లయితే తనకు నచ్చిన చోటికి వెళ్లిపోవచ్చును.
అత్యంత హేయమయిన నేరానికి పాల్పడిన వ్యక్తిలో మానసిక పరివర్తన తెచ్చేందుకు ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకొంటునప్పుడు, ఈ కేసులో భాదితురాలికి న్యాయం ఎందుకు చేయడం లేదు? ఇంకా ఎన్నేళ్ళ తరువాత న్యాయం చేస్తారు? అసలు న్యాయం జరుగుతుందా? లేక మిగిలినవారిని కూడా ఏదో ఒక రోజున వారి సత్ప్రవర్తన కారణంగా క్షమాభిక్ష పెట్టి ఇలాగే బయటకు పంపించివేస్తారా? అని ఆమె తల్లి తండ్రులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు మన ప్రభుత్వం, కోర్టులు, చట్టాలే జవాబు చెప్పవలసి ఉంటుంది. అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి, హత్యకి గురయిన నిర్భయకు ఇంత వరకు న్యాయం చేయలేకపోయినా, ఆ నేరం చేసిన వ్యక్తి తిరిగి జన జీవన స్రవంతిలో కలిసిపోయేందుకు మన ప్రభుత్వం, చట్టాలు, న్యాయ వ్యవస్థ అన్ని జాగ్రత్తలు తీసుకోవడాన్ని ఆమె తల్లితండ్రులు, ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ సమాజం ఆ బాలనేరస్థుడి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, అలాగే అతను బాల నేరస్తుల గృహంలో ఉన్నపుడు డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుళ్ళ కేసులో మరొక బాలనేరస్తుడితో స్నేహం చేసి మరింత రాటు తేలాడని తెలిసి కూడా అతనిని బయటకు విడిచిపెట్టారు. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నప్పటికీ అతని వలన సమాజానికి లేదా సమాజం వలన అతనికి ఎటువంటి ప్రమాదం జరగదని చెప్పలేము. నేడు కాకపోతే రేపయినా అతని ఉనికి బయటపడకుండా ఉండదు. అప్పుడు సమాజం అతనిపట్ల ఏవిధంగా స్పందిస్తుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ అప్పుడు అతను సమాజం పట్ల ఏవిధంగా రియాక్ట్ అవుతాడో ఎవరూ ఇప్పుడు ఊహించలేరు.
చట్టాలకి, ప్రభుత్వాలకి, న్యాయ వ్యవస్థలకి అంత లోతుగా ఆలోచించే తీరిక లేకపోవచ్చును లేదా సాధ్యం కాకపోవచ్చును. కానీ అటువంటి విపరీత పరిణామాలు జరిగినట్లయితే దానికి ఎవరు బాధ్యులు వహిస్తారు? అతని వలన మరొక మహిళ ఇలాగే ప్రాణాలు కోల్పోయినా లేదా సమాజంలో వ్యక్తులే అతనిపై దాడి చేసినా అప్పుడు తాపీగా ఈ నిర్ణయం తప్పని అందరూ చింతించవలసి ఉంటుంది. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే, ముందుగానే జాగ్రత్త పడితే మంచిది కదా?