పీఎఫ్‌ వడ్డీరేట్లు తగ్గింపు

ఇది నిజంగా మధ్య తరగతి ప్రజలకు ఓ దుర్వార్తే! ఇప్పటికే ఏ మూల నుంచి ఏ పన్ను పడుతుందోనని భయంభయంగా బతుకుతూ, ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న ఖర్చులలో రూపాయిరూపాయి దాచుకుని ప్రావిడెంట్‌ ఫండులో దాచుకునేవారికి ఇక మీదట ఆ సదుపాయంలో కూడా కోత పడనుంది. ప్రస్తుతం పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) మీద 8.7 శాతం వడ్డీ లభిస్తుండగా దాన్ని ఏకంగా 8.1 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే కాదు. ఐదేళ్ల నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌, కిసాన్ వికాస పత్రాల వంటి పొదుపు పథకాలన్నింటికీ కోత పడింది.   కిసాన్‌ వికాస పత్రాలని గుండెల మీద పెట్టుకున్నవారికి గాభరా కలిగించేలా దాదాపు ఒక శాతం కోత పడింది. ఇప్పటివరకూ 8.7% ఉన్న ఈ పత్రాల మీద వడ్డీ ఇప్పడు 7.8%గా మిగిలింది. మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఆధారపడే నెలవారీ పొదుపు పథకాలు, సుకన్య సమృద్ధి ఖాతా... వంటి పోస్టాఫీసు పొదుపు పథకాల మీద కూడా ప్రభుత్వం కొరడా విదిలించింది. ఆ మధ్య తన బడ్జెట్లో పీఎఫ్‌ మీద పన్నుని విధించబోయి భంగపడిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి విమర్శలకు తావిచ్చేలా ఈ వడ్డీ రేట్లను తగ్గించింది. అయితే ఈసారి తీసుకున్న నిర్ణయం మీద ప్రభుత్వం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు!

పైజమాతో పార్లమెంటుకి

ఒంటి మీద పైజమా, చేతిలో దిండు... ప్రపంచంలో ఎవరైనా ఇలా పార్లమెంటులోకి అడుగుపెట్టగలరా! ఆస్ట్రేలియాలో మాత్రం ఇది సాధ్యమేనని నిరూపించారు. ఎన్నికల సంస్కరణలకి సంబంధించి అక్కడి పార్లెమెంటులో జరుగుతున్న ఓ చర్చ సందర్భంగా ‘నిక్‌ సెనఫోన్‌’ అనే సభ్యుడు, కోతిబొమ్మలు ఉన్న పైజమా ధరించి పార్లమెంటులోకి ప్రవేశించాడు. ఈ ఘోరం చూడలేని పార్లమెంటు సిబ్బంది ఆయనను దుస్తులు మార్చుకోవలసిందిగా కోరారు. దాదాపు 40 గంటల పాటు జరిగిన సదీర్ఘ చర్చలో ఇలాంటి చిత్రాలెన్నో అక్కడి పార్లమెంటులో చోటు చేసుకున్నాయి. ఎన్నికల నిర్వహణలో ఉన్న చిన్నపాటి లోటుపాట్ల వల్ల, చట్టసభలోకి ఎవరు పడితే వారు ప్రవేశించగలుగుతున్నారనీ, దీన్ని నివారించేందుకు ఓటింగ్‌ ప్రక్రియలో తగిన మార్పులు తీసుకురావాలని ఈ బిల్లును ప్రవేశపెట్టారు. చర్చ సందర్భంగా అధికారంలో ఉన్న లిబరల్‌ పార్టీ సభ్యులు, ప్రతిపక్షంలో ఉన్న లేబర్‌ పార్టీ సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. మన దేశ నేతలు సైతం సిగ్గుపడే విధంగా, వీరు నానాతిట్లూ తిట్టుకున్నారు. ఎట్టకేలకు, ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన ఈ బిల్లుని సమర్థంగా నెగ్గించుకోగలిగింది. 40 గంటల పాటు చర్చ జరిగిన తరువాత, ఇక బిల్లుని వ్యతిరేకించే ఓపిక ఎవరికీ లేకపోయింది.

జేఎన్‌యూలో సమావేశమే ఒక జాతివిద్రోహం- అమిత్‌షా

  ఫిబ్రవరి 9న జేఎన్‌యూలో నిర్వహించిన సమావేశంలో దేశవ్యతిరేక నినాదాలు చేశారా? చేస్తే ఎవరు చేశారు? అని దేశమంతా తర్జనభర్జన పడుతూ ఉండవచ్చుగాక. కానీ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా మాత్రం ఈ విషయమై తన అభిప్రాయాన్ని కుండబద్దలుకొట్టినట్లు వెల్లడించారు. అఫ్జల్‌గురుని సంస్మరించుకునేందుకు సమావేశాన్ని నిర్వహించడమే ఓ జాతి విద్రోహ చర్య అని ఆయన మండిపడ్డారు. ఇండియా టుడే నిర్వహిస్తున్న ఓ సమావేశంలో మాట్లాడిన అమిత్‌షా ఫిబ్రవరి 9 దేశ స్వాతంత్ర్య దినోత్సవమో, గణతంత్ర దినోత్సవమో కాదనీ... అఫ్జల్‌గురుని ఉరితీసిన రోజనీ చెప్పుకొచ్చారు. అలాంటి రోజున సమావేశం ఏంటని ప్రశ్నించారు. ఈ దేశ అత్యున్నత వ్యవస్థ (పార్లమెంటు) మీద దాడి చేసినందుకు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు) అఫ్జల్‌గురుకి ఉరిశిక్షను ఖరారు చేసిందని.... అలాంటి వ్యక్తి వర్ధంతిని జరుపుకొనేందుకు ఎవరన్నా సిద్ధపడితే, అది దేశద్రోహమనేనని అన్నారు. ‘భారత్‌ మాతాకీ జై’ నినాదానికి సంబంధించి కూడా అమిత్‌షా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ నినాదం మీద జరుగుతున్న చర్చ అర్థరహితం అనీ, స్వాతంత్ర్యం వచ్చి అన్ని సంవత్సరాలు గడిచినా ఓ జాతీయ నినాదం గురించి వాదులాడుకోవడం దురదృష్టకరమనీ పేర్కొన్నారు.

గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలంటూ ఆత్మహత్య

  ఆవుని జాతీయ జంతువుగా గుర్తించాలనీ, రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ జరిగిన ఓ నిరసన కార్యక్రమం, ఒకరి మృతికి దారితీసింది. గుజరాత్‌కి చెందిన ‘గోరక్ష ఏక్తా సమితి’కి చెందిన సభ్యులు కొందరు నిన్న, రాజ్‌కోట్‌లోని కలెక్టరు కార్యాలయానికి చేరుకున్నారు. ‘గత కొద్ది సంవత్సరాలుగా గోవధ సంఘటనలు పెరిగిపోతున్నాయనీ, గోవధని ఆపాలంటే ఆవుని జాతీయ జంతువుగా గుర్తించాలనీ’ వీరంతా అక్కడ నినదించడం మొదలుపెట్టారు. ఈ విషయమై తాము ఇదివరకే జిల్లాకలెక్టరుకు ఓ వినతిపత్రాన్ని అందచేసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ మండిపడ్డారు. తాము గోభక్తులమనీ... గోవుని జాతీయ జంతువు చేయాలన్న తమ లక్ష్యం కోసం, ప్రాణాలనైనా తీసుకుంటామని హెచ్చరించారు. అన్నట్లుగానే, వీరిలో ఓ ఎనిమిదిమంది తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందుని తాగేశారు. పోలీసు అధికారులు అప్రమత్తమై వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినా ఉపయోగం లేకపోయింది. ఎనిమిదిమందిలో ఒకరు మృతి చెందగా మిగతావారి పరిస్థితి మాత్రం నిలకడగా ఉంది.

ఆ గుర్రం కాలు ఇక పనిచేయదు

  ఒకప్పడు శక్తిమాన్‌ అన్న పేరు వింటే అదేదో టీవీ సీరియల్‌ అనుకునేవారు. కానీ ఇప్పడు అదో గుర్రం పేరు అని కూడా జనాలకి స్ఫురిస్తోంది. ఉత్తరాఖండ్‌కు చెందిన ఈ పోలీసు గుర్రం మీద ఓ బీజేపీ ఎమ్మెల్యే తన జులుం చూపించిన విషయం తెలిసిందే! గొడ్డుని బాదినట్లు అన్న సామెతకు మించి సదరు ఎమ్మెల్యే ఈ మూగజీవిని బాదడంతో, శక్తిమాన్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. శక్తిమాన్‌ కాలుకి తీవ్ర గాయాలు అయ్యాయని గ్రహించిన పశువైద్యలు ఎంతగా ప్రయత్నించినా, గాయాలను మాన్పలేకపోయారు. దాంతో వేగంగా కుళ్లిపోతున్న గుర్రం కాలుని తీసివేయక తప్పని స్థితి వచ్చింది. ఆ స్థానంలో త్వరలోనే ఓ కృత్రిమ కాలుని అమరుస్తామని వైద్యులు పేర్కొన్నారు. శక్తిమాన్ మీద ప్రజాప్రతినిధి జులుంకి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వస్తృతంగా ప్రచారం కావడంతో, సదరు ఎమ్మెల్యేని అరెస్టు చేయాలంటూ పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో గణేష్‌ జోషి అనే ఆ ఎమ్మెల్యేని నిన్న పోలీసులు అరెస్టు చేయక తప్పలేదు. అయితే కేవలం అరెస్టుతోనే ఈ వ్యవహారం ఆగేట్లు కనిపించడం లేదు. గణేష్‌ జోషిని పార్టీ నుంచి బహిష్కరించాలంటూ, సాక్షాత్తూ కేంద్ర మంత్రి మేనకా గాంధి డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటే చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవచ్చుననుకునే వారికి, ఇప్పటి సంఘటన ఓ గుణపాఠంగా మిగిలిపోవచ్చు.

ప్రధాని నోట ఖురాన్‌ మాట

  ఇస్లాంలోని ఒక ఉపమార్గంగా భావించే సూఫీ తత్వాన్ని, విశ్వవ్యాప్తం చేసేందుకు నిన్న దిల్లీలో ఓ అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక పక్క ఉగ్రవాదాన్ని దుయ్యబడుతూనే, ఇస్లాంను శాంతిని కోరే మతంగా అభివర్ణించారు. మోదీ ప్రసంగం ఆరంభంలోనే సభనుంచి భారత్ మాతాకీ జై అన్న నినాదాలు వినిపించడం గమనార్హం. దాదాపు అరగంటపాటు సుదీర్ఘంగా సాగిన ప్రసంగంలో మోదీ సూఫీ తత్వాన్ని కొనియాడారు. సూఫీ తత్వం ఇస్లాంలోని ఉన్నత ఆదర్శాలను తలకెత్తుకుంటూనే... అతివాదాన్నీ, ఉగ్రవాదాన్నీ తిరస్కరిస్తుందని ప్రశంసించారు. అల్లాహ్‌కు ఉన్న 99 పేర్లలో ఒక్కటి కూడా హింసను సూచించదనీ, పైగా మొదటి రెండు పేర్లూ ఆయన కరుణను సూచిస్తాయని అన్నారు.   ఉగ్రవాదానికి ఓ మతమంటూ ఉండదనీ, వారు కేవలం తమ అమానుష చర్యలను కప్పిపుచ్చుకునేందుకు మతాన్ని ఓ ముసుగుగా ధరిస్తారనీ విమర్శించారు. ఉగ్రవాదుల చర్యలకు ముందుగా బలయ్యేది వారు ఉంటున్న దేశం, వారి సొంత ప్రజలే అని హెచ్చరించారు. దేశమంతటా ఇప్పడు అతివాదం గురించి, అసహనం గురించి చర్చలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి పరమత సహనాన్నీ, విశ్వశాంతినీ కాంక్షిస్తూ ప్రసంగం సాగించడం ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మాల్యా మన బ్యాంకులకు చెడ్డపేరు తెచ్చాడు... అరుణ్‌జైట్లీ

  విజయ్‌ మాల్యా వల్ల ప్రపంచ వ్యాప్తంగా మన దేశ బ్యాంకులకీ, ప్రైవేటు రంగానికీ చెడ్డ పేరు వచ్చిందని అర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విరుచుకుపడ్డారు. ఇండియాటుడే నిర్వహిస్తున్న ఓ సమావేశంలో మాట్లాడుతూ అరుణ్‌జైట్లీ, మొండి బకాయిలు అన్నింటినీ ఒక్క తీరున చూడలేమని స్పష్టం చేశారు. ఇనుము, దుస్తులు వంటి రంగాలలో వచ్చిన నష్టాల వల్ల మొండిబకాయిలు ఏర్పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చుననీ, కానీ ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో ఏర్పడిన మొండిబకాయిలు చాలా ప్రమాదకరమన్నారు. సరైన తనఖాలు కానీ, అవసరాలు కానీ లేకుండానే అనైతికంగా తీసుకున్ని రుణాల వల్ల బ్యాంకులకు తీవ్ర నష్టమంటూ హెచ్చరించారు. మొండిబకాయిల కునారిల్లుతున్న బ్యాంకింగ్‌ రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియచేశారు. బ్యాంకులు తిరిగి పుంజుకునేలా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, ఆస్తులను అమ్ముకునేందుకు, యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకునేందుకు... తగిన స్వేచ్ఛను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మరోసారి విజయ్‌మాల్యా గురించి ప్రస్తావిస్తూ, బ్యాంకులు అతని నుంచి ఆఖరిపైసా వరకూ వసూలు చేసి తీరతాయని ఆశించారు అరుణ్‌జైట్లీ. ఆర్థికమంత్రి చెప్పిన మాటలు బాగానే ఉన్నాయి కానీ, మన దేశంలో పెద్దగా ఆస్తులు లేని మాల్యా నుంచి 9,000 కోట్ల రూపాయల అప్పును బ్యాంకులు ఎలా వసూలు చేస్తాయన్నదే పెద్ద సందేహం!

ఫేస్‌బుక్‌లో ఫాలోవర్స్‌ ఉంటే బీజేపీ టికెట్‌ తేలిక

  త్వరలో జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహపడుతూ ఉండవచ్చుగాక. కానీ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన ఓ ప్రకటన విన్న తరువాత వాళ్ల కళ్లు బైర్లు కమ్మాయి. బీజేపీ నేతలలో శాసనసభలో ఉండాలనుకునేవారికి ఫేస్‌బుక్‌లో కనీసం 25,000 మంది ఫాలోవర్లు ఉండాలనీ లేదంటే కనీసం వాళ్ల పేరుతో సృష్టించిన ఫేస్‌బుక్‌ పేజీకి 25,000 లైకులన్నా ఉండాలనీ అమిత్‌ షా పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ రోజులలో, ఫేస్‌బుక్‌ ఖాతా సదరు నేతల విజయావకాశాలను మెరుగుపరుస్తుందని అమిత్‌ షా అభిప్రాయం కావచ్చు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ నేతలంతా ఇప్పడు సోషల్ మీడియాలో తమ ప్రాభవాన్ని పెంచుకునే పనిలో పడ్డారట. వారిలో చాలామందికి అసలు ఫేస్‌బుక్‌ ఖాతానే లేకపోవడంతో, ఇదెక్కడి కొత్త తంటరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు. పోనీ ఫేస్‌బుక్‌ ఖాతా లేకపోయినా ఫర్వాలేదు... ట్విట్టర్లో ఓ పాతికవేలమందిని ఆకర్షించండి చాలు అని సాటి బీజేపీ నేతలు సలహా ఇస్తున్నారట! ఏ రాయి అయితే ఏం!

చిక్కుల్లో స్మృతీ ఇరానీ

  స్మృతీ ఇరానీ విద్యార్హతకు సంబంధించిన వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మానవవనరుల శాఖ కేంద్ర మంత్రిగా ఉన్న సృతీ ఇరానీ, ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లలో... వేర్వేరు సందర్బాలలో వేర్వేరు వివరాలను అందించారన్నది ప్రధాన ఆరోపణ. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తాను బి.ఎ చదివానని చెప్పిన స్మృతీ, 2014లో తన విద్యార్హత బీ.కాం అని పేర్కొన్నారు. ఈ ఆరోపణ మీద అహ్మెర్‌ ఖాన్‌ అనే ఓ ఫ్రీలాన్స్ రచయిత, దిల్లీ న్యాయస్థానంలో ఓ కేసుని కూడా దాఖలు చేశారు. కేసుని విచారిస్తున్నా న్యాయస్థానం, సంబంధిత పత్రాలను అందచేయాలంటూ... ఎన్నికల సంఘానికీ, స్మృతీ చదువుకున్నానని చెబుతున్న దిల్లీ విశ్వవిద్యాలయానికీ సూచించింది. మే 3న జరిగే తదుపరి విచారణలో, న్యాయస్థానం ఓ అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ కేసులో కనుక స్మృతీ ఇరానీ దోషిగా తేలితే, చట్టప్రకారం అరు నెలల వరకూ కారాగార శిక్షను విధించే అవకాశం ఉంది.

భారత్‌మాతాకీ జై అనలేదని... ఎమ్మెల్యే సస్పెన్షన్‌!

  మజ్లిస్‌ నేత అసదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన కొత్త వాదం ఇప్పడు రోజురోజుకీ పెను వివాదంగా మారుతోంది. ఇప్పటి తరానికి ‘భారత్‌ మాతాకీ జై’ అన్న నినాదాన్ని నేర్పించాలంటూ ఆరెస్సెస్‌ ముఖ్యుడు మోహన్‌ భగవత్‌ మాటలకు జవాబుగా, పీక మీద కత్తి పెట్టినా కూడా తాను ఆ నినాదాన్ని చేయబోనని అసదుద్దీన్‌ వ్యాఖ్యానించారు. అసదుద్దీన్‌ వ్యాఖ్యలు పార్లమెంటుని సైతం కుదిపివేశాయి. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీని కూడా ఈ మాటల సెగ తాకింది. మజ్లిస్‌ పార్టీకి చెందిన ‘వారిస్‌ పఠాన్‌’ అనే ఎమ్మెల్యే, మహారాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న ఓ చర్చ సందర్భంగా... తన ప్రాణం పోయినా కూడా ‘భారత్‌ మాతాకీ జై’ నినాదాన్ని చేయబోనని తేల్చిచెప్పారు. దీంతో అధికార బీజేపీ, శివసేన సహా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ఒక్కసారిగా పఠాన్‌ మీద విరుచుకుపడ్డాయి. సదరు ఎమ్మెల్యేను ప్రస్తుత సమావేశాల నుంచి బహిష్కరించాలని ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి. మొత్తానికి తెలిసే కదిపారో, తెలియకుండా చేశారో కానీ... అసదుద్దీన్‌ ఓవైసీ మరో తేనెతుట్టుని కదిపారు. ఈ వివాదానికి జోడింపుగా మరెన్ని వార్తలను వినాల్సి వస్తుందో!

బాబాగా జీవించిన నేతాజీ?

సుభాష్‌ చంద్రబోస్‌ జన్మించి ఈ ఏడాదికి 120 ఏళ్లు కావస్తున్నాయి. కానీ ఆయన మరణం గురించి మాత్రం ఇంకా రోజులో వార్త వినిపిస్తూనే ఉంది. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి, సైనిక పోరాటం ద్వారా మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని ఆశించిన ఈ నేతాజీ ఆగస్టు 18, 1945 నుంచి కనిపించకుండా పోయారు. ఆ రోజు జరిగిన ఓ విమాన ప్రమాదంలో నేతాజీ, జపాన్‌లో మరణించారని అందరూ అంటారు. కానీ ఆయన ఆ విమాన ప్రమాదంలో మరణించలేదనీ, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనీ చెబుతారు. ఇంతకీ బోస్‌ మరణించకపోతే మరి ఎక్కడ జీవించినట్లు అని రకరకాల ఊహలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఊహలో ఒకటి... ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ అనే ప్రాంతంలో సన్యాసిగా నివసించారన్న అనుమానం. స్థానికులు భగవాన్‌జీ లేదా గుమ్‌నామ్ బాబాగా కూడా పిల్చుకునే ఈ అపరిచిత సన్యాసి 1985 వరకూ సజీవంగానే ఉన్నారు. తాను నేతాజీని అని ఆయన ఎప్పుడూ చెప్పుకొనప్పటికీ పోలికల్లోనూ, మాట తీరులోనూ ఈ సన్యాసి అచ్చు నేతాజీలాగానే ఉండేవారట. ఈ విషయం అప్పట్లోనే ప్రభుత్వ దృష్టికి వచ్చినప్పటికీ, అందులోని నిజానిజాలను శోధించేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయలేదు. చేసిన కొద్దిపాటి ప్రయత్నాలూ అయనే నేతాజీ అని రుజువూ చేయలేదు. దాంతో ఈ అపరిచిత సన్యాసి గురించి అంతా మర్చిపోయారు. కానీ ఇప్పుడు బయటపడిన కొన్ని సాక్ష్యలు ఆ బాబానే అజ్ఞాతంలో ఉన్న నేతాజీ అని బలపరుస్తున్నాయి. నిన్న ఫైజాబాద్‌లోని ట్రెజరీ కార్యాలయంలో ఉన్నా ఈ బాబాగారి పెట్టెలను తెరిచి చూసిన వారికి, అందులో నేతాజీకి చెందిన అపురూపమైన ఫొటోలు, ఉత్తరాలు కనిపించాయి. దీంతో విమాన ప్రమాదంలో చనిపోయాడనుకున్న నేతాజీ దాదాపు మరో 40 ఏళ్లు మన మధ్యే జీవించి ఉంటాడన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఆ లెక్కల పేపరుతో లెక్కలేనన్ని కష్టాలు

ఒక ఏడాది పరీక్షలు రాసేవారికి తేలికపాటి ప్రశ్నాపత్రం, మరో ఏడాది పరీక్ష రాసేవారికి తలవాచిపోయే కొచ్చెన్‌ పేపర్‌ ఇస్తే ఎలా ఉంటుంది. ప్రశ్నాపత్రాన్ని చూడగానే ఏడుపు తన్నుకొస్తుంది. CBSE సిలబస్‌ ప్రకారం ఈసారి పన్నెండో తరగతి లెక్కల పరీక్షకు కూర్చున్నవారి పరిస్థితి ఇలాగే అయ్యింది. ఎప్పుడూ వచ్చే ప్రశ్నాపత్రాలకు భిన్నంగా ఈసారి చాలా కష్టంగా ప్రశ్నాపత్రం ఉందట. ఒక్క మార్కుకి కూడా సుదీర్ఘమైన ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు బిక్కమొగం వేశారు. ఎలాగైనా సరే వంద మార్కలు దక్కుతాయనుకుని పరీక్ష హాల్లో కూర్చున్నవారు కాస్తా, పరీక్ష గట్టెక్కుతామా లేదా అన్న డైలమాలో పడిపోయారు. సుదీర్ఘమైన ప్రశ్నలతో, క్లిష్టమైన జవాబులతో నిండిన ఇలాంటి ప్రశ్నాపత్రాన్ని మునుపెన్నడూ చూడలేదనీ ఉపాధ్యాయులే ఆశ్చర్యపోయారు.   ఈసారి పరీక్షలో కష్టమైన ప్రశ్నలే కాకుండా, అసలు తమ సిలబస్‌లో లేనే లేని ప్రశ్నలు ఇచ్చారని, విద్యార్థులు గుడ్లనీరు కుక్కుకున్నారు. పరీక్ష ముగిసిన తరువాత ఏడుస్తూ బయటకు వచ్చిన పిల్లలను చూసిన తల్లిదండ్రులకు కూడా నోట మాటరాలేదు. ఇలాంటి చేష్టలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారనీ, ఈ పేపర్‌ని తీర్చిదిద్దిన వారిని శిక్షించాలనీ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, స్మృతీ ఇరానీకీ లెక్కలేనన్ని విన్నపాలు వెళ్లినట్లు సమాచారం. మరి కొందరైతే ఏకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తున్నారు. CBSE బోర్డు ఈ పరిస్థితికి తక్షణమే స్పందించి ఈసారికి ఉదారంగా పేపరు దిద్దుతుందని అంతా ఆశిస్తున్నారు. అలాగైనా లెక్క సరైతే బాగుండు!

రైతు రుణం తీర్చిన విశాల్‌- అందుకోసం పార్టీలకు దూరం!

  తెలుగువాడైనప్పటికీ తమిళనాట తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్న విశాల్, అక్కడి నడిగర్‌ సంఘంలోనూ తన సత్తాను చాటుకున్నాడు. కానీ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనే కాదు... నిజజీవితంలోనూ విశాల్‌ హీరోనే అంటున్నారు ఆయన అభిమానులు. ఆమధ్య చెన్నైని ముంచెత్తిన వరదల్లో తానున్నానంటూ సాయానికి సిద్ధపడినా, ఈమధ్యనే ఓ గ్రామంలో షూటింగ్‌ జరుగుతుండగా అక్కడి ఇబ్బందిని గమనించి మరుగుదొడ్లను నిర్మించినా... విశాల్‌ తన పెద్ద మనసుని చాటుకుంటూనే ఉన్నాడు. తాజాగా తంజావూర్ జిల్లాలోని ఓ పేద రైతుని ఆదుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు. తంజావూరికి చెందిన బాలన్‌ అనే సందరు రైతు బ్యాంకులకు 1.35 లక్షల రూపాయలు బాకీపడ్డాడు. సమయానికి వాయిదాలను చెల్లించకపోవడంతో, బ్యాంకు తరఫున రికవరీ ఏజెంట్లు, పోలీసులు కలిసి బాలన్ మీద చేయి చేసుకోవడమే కాకుండా, అతని ఏకైక ఆధారమైన ట్రాక్టర్‌ను కూడా లాక్కుపోయేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో చూసిన విశాల్‌ చలించిపోయాడు. ‘నాకు అతను ఎవరో తెలియదు. కానీ బాకీలు చెల్లించలేని రైతు మనసు ఎంత విలవిల్లాడుతుందో నేను ఊహించగలను. అతని రుణాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అంటూ పేర్కొన్నాడు. అంతేకాదు, సదరు రుణం తీర్చేందుకు తాను నాలుగువారాల పాటు పార్టీలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. విశాల్‌ సాయం ఇక్కడితో ఆగేట్లు కనిపించడం లేదు! ఇలా ఇబ్బందుల్లో ఉన్న రైతులకి సంబంధించిన సమాచారాన్ని ఒక చోటకి చేరుస్తాననీ, ఇలాంటి వారి కోసం నిధులను సేకరించేందుకు తన అభిమానులు ఓ ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాను తెరవబోతున్నారనీ చెప్పుకొచ్చాడు విశాల్‌! మన తెలుగు హీరోలూ ఉన్నారే!

జేఎన్‌యూ వివాదం బయటి వ్యక్తుల పనే!

  జేఎన్‌యూలో వివాదాస్పద నినాదాలు చేసిన సంఘటనకి బయటి వ్యక్తులే కారణం అంటూ విశ్వవిద్యాలయం రూపొందించిన నివేదిక పేర్కొంది. ముసుగు వేసుకుని సమావేశంలోకి వచ్చిన కొందరు వ్యక్తులు భారత్‌కు వ్యతిరేకంగా, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారని స్పష్టం చేసింది. ఇందులో విద్యార్థి నాయకుడు కన్నయా కుమార్‌ ప్రమేయం ఏదీ లేదనీ... అయితేగియితే ఉమర్‌ఖాలిద్, అనిర్బన్‌ భట్టాచార్య తప్పు మాత్రం ఉందనీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా సదరు విద్యార్థులందరికీ విశ్వవిద్యాలయం షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది. అయితే ఇందులో వారిని బహిష్కరించే అవకాశం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న జేఎన్‌యూ విద్యార్థులను మరింత రెచ్చగొట్టకుండా ఉండేందుకు, విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆచితూచి స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ జేఎన్‌యూలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన ఈ బయటి వ్యక్తులు ఎవరు? ఎవరి ప్రోత్సాహంతో వారు ఈ సమావేశంలో పాల్గొన్నారన్న విషయాన్ని మాత్రం ఈ నివేదిక కనుగొనేందుకు ప్రయత్నించలేదు!

ఆర్ట్ ఆఫ్‌ లివింగ్‌ వేడుకలో.. దొంగలకు సందు చిక్కింది

దిల్లీలోని యమునా నదీతీరాన ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ నిర్వహించిన సాంస్కృతి ఉత్సవం చాలా విమర్శలనే ఎదుర్కొని ఉండవచ్చుగాక. పర్యావరణ అనుమతులు సరిగా లేవనీ, యమునా నదీతీరాలకు ఇది నష్టం కలిగిస్తుందనీ... ఇలా రకరకాల విమర్శల మధ్య ఎలాగొలా కార్యక్రమాన్ని ముగించారు నిర్వాహకులు. కానీ ఉత్సవాలకు వచ్చినవారిలో చాలామంది ఖాళీ జేబులతో తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందట. ఉత్సవాల హడావుడిలో పదుల కొద్దీ జేబు దొంగలు తమ కళను ప్రదర్శించడమే దీనికి కారణం. ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, హర్యానా, దిల్లీ... ఇలా పలు రాష్ట్రాలకు చెందిన చిల్లరమల్లర దొంగలు, ప్రాంతీయ బేధాలను మరిచి, ఈ ఉత్సవాలలో తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించారట. ఉత్సవానికి వచ్చినవారి వద్దనుంచి ఫోన్లు, నగదు, గుర్తింపు పత్రాలు మొదల్కొని విగ్రహాల వరకూ రకరకాల వస్తువులు పోయాయని, వందకు పైగా ఫిర్యాదులు అందడమే దీనికి సాక్ష్యం. ఆఖరికి రష్యా నుంచి వచ్చిన ఒక కళాకారిణి తాలూకు మేకప్ కిట్‌ కూడా పోవడంతో, ఆమె తన ప్రదర్శనను నిర్వహించలేకపోయారు. ఉత్సవాల నేపథ్యంలో గస్తీ కాస్తున్న పోలీసుల చేతికే 30 మంది దొంగలు చిక్కారంటే... ఇక చిక్కని దొంగలు ఎందరు ఉండి ఉంటారో ఊహించవచ్చు. మొత్తానికి ‘జీవించే కళ’ (ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌) ఉత్సవంలో చోరకళని ప్రదర్శించేవారు కూడా పాల్గొన్నారన్నమాట!

విజయ్‌మాల్యా మీద హైదరాబాదులో అరెస్టు వారెంట్లు

విజయ్‌ మాల్యా ఇలా మన దేశం నుంచి పారిపోయాడో లేదో, అలా ఆయన మీద వారెంట్ల మీద వారెంట్లు జారీ అవుతున్నాయి. తాజాగా హైదరాబాదులోని రాజీవ్‌గాంధి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే GHIAL సంస్థకు రెండు కోట్ల రూపాయలు ఎగవేసిన కేసులో... విజయ్‌ మాల్యాకు ఒకటీ రెండూ కాదు, ఏకంగా నాలుగు నాన్-బెయిలబుల్‌ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. అప్పట్లో కింగ్‌ఫిషర్ విమానాలను నడిపినప్పడు, మాల్యాగారు సదరు సొమ్ముని ఎగవేశారట. ఈ విషయమై మాల్యా కోర్టు తాఖీదులను కూడా లెక్కచేయకపోవడంతో, హైదరాబాదులోని ఎర్రమంజిల్‌ న్యాయస్థానం ఈ వారెంట్లను జారీ చేసింది. అయితే ఇలాంటి వారెంట్లు తమకేమీ కొత్తకాదంటున్నారు ఆయన తరఫు న్యాయవాదులు. ఇంతకుముందు కూడా మాల్యాగారికి ఇలాంటి వారెంట్లెన్నో వచ్చాయనీ, హైకోర్టుకి వెళ్లి వాటిని తాము రద్దు చేయించామనీ చెప్పుకొచ్చారు. ఈసారి కూడా అదే పద్ధతిలో తాము సదరు వారెంట్లను ఎదుర్కొంటామని అన్నారు. మరి ఈసారి న్యాయస్థానానికి ఏమని చెప్పి వారెంట్లను రద్దు చేయిస్తారో!

భారతీయ విద్యార్థులు తెలివైనవారు... ట్రంప్!

ఈ విషయాన్ని ఇదివరకు చాలామందే చెప్పి ఉంటారు. కానీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్ నుంచి కూడా ఇదే మాట రావడం చాలామందికి ఆశ్చర్యం కలిగించే అంశమే. ఎందుకంటే ట్రంప్ నోటి వెంట ఎప్పుడు విదేశీయుల గురించి తిట్లూ, శాపనార్థాలే వినిపిస్తూ ఉంటాయి. అందులోనూ చైనా వంటి దేశాలన్నా, ఆ దేశ పౌరులన్నా ట్రంప్‌ మండిపడుతూ ఉంటారు. కానీ ట్రంప్‌గారికి ఏదో ఓ మూల మన దేశమంటే కాస్త సదభిప్రాయం ఉన్నట్లుంది. అందుకే భారత్‌ చాలా అద్భుతంగా రాణిస్తోందని మొన్నామధ్య ప్రశంసలు కురిపించారు కూడా. కానీ అంతలోనే భారతదేశం H1B వీసాల ద్వారా తమ దేశంలోని ఉద్యోగుల కడుపు కొడుతోందంటూ మండిపడ్డారు. ఇంతకీ అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయుల గురించి, ట్రంప్‌గారి ఉద్దేశం ఏమిటా అని ఓ ముఖాముఖి కార్యక్రమంలో అడిగితే ‘అమెరికా విశ్వవిద్యాలయాలలో చదువుకునే భారతీయ విద్యార్థులు చాలా తెలివైనవారనీ, తమ తరగతులలో వాళ్ల ఎప్పుడూ ముందుంటారనీ’ అని ముందు పొగిడారు. అలాంటి ప్రతిభావంతులు తమ దేశానికి చాలా అవసరమన్నారు ట్రంప్‌. ఏళ్ల తరబడి అమెరికా విశ్వవిద్యాలయాలలో చదువుకున్నవారిని, చదువు పూర్తికాగానే వెళ్లిపొమ్మనడం దేశానికే నష్టమని చెప్పుకొచ్చారు. అలాంటివారు అమెరికాలోనే స్థిరపడాలనుకుంటే తనకేమీ అభ్యంతరం లేదని వివరణ ఇచ్చారు. అంటే అమెరికాలోనే చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తే ట్రంప్‌గారికి ఏమాత్రం అభ్యంతరం లేదన్నమాట.

మెహబూబాకు సహచరుల హెచ్చరిక

కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ చనిపోయి ఇప్పటికే రెండు నెలలు గడుస్తున్నాయి. అయినా ఆయన వారసురాలు మెహబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీనమేషాలు లెక్కబెడుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మరిన్ని సానుకూల సంకేతాలు పంపాలని ఓసారి, రాష్ట్రంలోని బీజేపీ పార్టీతో చర్చలు జరుగుతున్నాయని మరోసారి... పూటకోసారి, రోజుకోమాట చెబుతూ కాలాన్ని వెల్లబుచ్చుతున్నారు. దీంతో మెహబూబాకి సొంత పార్టీ నుంచే హెచ్చరికలు మొదలవుతున్నట్లు సమాచారం. రోజులు గడిచేకొద్దీ ప్రజల్లో అవిశ్వాసం పెరిగిపోతోందనీ, గవర్నరు పాలన ఏర్పడే సూచనలు బలపడుతున్నాయనీ వారు నేరుగానే అసహనం వ్యక్తం చేస్తున్నారట. కేంద్రంలో మిత్రపక్షమైన బీజేపీ ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ప్రభుత్వ ఏర్పాటులో ఇంత ఆలస్యం జరిగినందుకు తప్పకుండా రాష్ట్రపతి పాలనను విధించేసేవారే అన్న విమర్శలూ పదునెక్కుతున్నాయి. దీంతో మెహబూబా తన బెట్టుని వదిలిపెట్టి, ప్రభుత్వ ఏర్పాటు గురించి త్వరలోనే ఒక నిర్ణయానికి రాక తప్పని స్థితి వచ్చేసింది. లేకపోతే తన పార్టీ (పీడీపీ) సహచరులు ఆమెను కాకుండా మరొకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిర్ణయించేసి, వారే ప్రభుత్వాన్ని ఏర్పరిచే ప్రమాదం లేకపోలేదు. అందుకే ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు. మరి ‘ఆలస్యంతో అధికారం దూరం’ అన్నది నేటి మాట!

అరెస్సెస్‌ ప్యాంట్లు, రబ్రీదేవి చలవే... లాలూ

ఇదివరకు ప్రతిపక్షాలు విమర్శించి ఊరుకునేవి. కానీ ఇప్పటి ప్రతిపక్షాలు అలా కాదు. ఎదుటివారు తప్పు చేస్తే విమర్శించడమే కాదు, ఒక వేళ ఆ తప్పుని సరిదిద్దుకుంటే... తమకి భయపడే సదరు మార్పు జరిగిందని గొప్పలు చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. మొన్నటికి మొన్న ప్రావిడెంట్‌ ఫండ్‌ మీద పన్నుని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అది తనకి భయపడే అని రాహుల్‌బాబు చెప్పుకొచ్చారు. ఈ వార్తని ఒకటికి రెండుసార్లు చదివారో ఏమో, లాలూ ప్రసాద్‌ కూడా అదే బాట పట్టారు. ఆరెస్సెస్‌ ఇక నుంచీ నిక్కర్లను కాకుండా, ప్యాంట్లను ధరించాలన్న నిర్ణయం తీసుకోవడం రబ్రీదేవి చేసిన సూచన మేరకే  అనేశారు. భాజపాకు అనుబంధ సంస్థ అయిన ఆరెస్సెస్‌ తన 90 ఏళ్ల నాటి సంప్రదాయాన్ని కాదని, ఈ కొత్త దుస్తులకు స్వీకారం చుట్టిన విషయం తెలిసిందే! రబ్రీ దేవి ఆ మధ్య ఆరెస్సెస్‌ను విమర్శిస్తూ, ‘ఆ సంస్థలోని పెద్దపెద్దవాళ్లే సిగ్గులేకుండా నిక్కర్లు వేసుకుని జనం మధ్యలోకి వస్తుంటారని’ అన్నారు. రబ్రీ వాదనలో చాలా అద్భుతమైన తర్కం ఉందనీ, ఆ తర్కానికి లొంగి ఆరెస్సెస్‌ తన పంథాని మార్చుకోక తప్పలేదని లాలూ చెప్పుకొచ్చారు. ఇంకా లాలూ నోటి నుంచి ఏమేం వినాల్సి వస్తుందో!