నేను ఏ పౌరసత్వాన్నీ కోరలేదు... రాహుల్‌గాంధి

తాను బ్రిటిష్‌ పౌరుడినంటూ రాహుల్‌గాంధి ఇచ్చిన ఓ వాంగ్మూలం ఆయనను చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే! భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడి పౌరులు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయగలరు కాబట్టి, రాహుల్‌ గాంధిని పార్లమెంటు నుంచి బహిష్కరించాలంటూ బీజేపీ పట్టుపడుతోంది. గత ఏడాది బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయాన్ని లేవనెత్తినప్పటి నుంచీ ఈ వివాదం మరింతగా రాజుకుంటూనే ఉంది. తాజాగా పార్లమెంటు నైతిక ప్రవర్తన సంఘం కూడా రాహుల్‌ను సంజాయిషీ కోరడంతో, కాంగ్రెస్‌ శిబిరం అయోమయంలో పడిపోయింది. కానీ రాహుల్ మాత్రం ఈ విషయమై చాలా నిబ్బరంగా ఉన్నారట. తాను పౌరసత్వం కోసం ఎక్కడా ఏ దరఖాస్తూ చేసుకోలేదంటూ, ఆయన నైతిక ప్రవర్తన సంఘానికి బదులిచ్చారట. మరి అలాంటప్పుడు తాను బ్రిటన్‌ పౌరుడినంటూ, అక్కడి కంపెనీకి చెందిన పత్రాలలో ఆయన సంతకం ఎలా చేశారన్నది ఇప్పుడు బీజేపీ నేతలు సంధిస్తున్న ప్రశ్న! రాహుల్‌ దానికి ఎలాంటి జవాబిస్తారో!

బెల్జియంలో ఉగ్రవాదులు... అణువిధ్వంసానికి ప్రయత్నించారు

  బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన ఉగ్రదాడి యూరోప్‌ ఖండాన్ని వణికించింది. అక్కడి విమానాశ్రయంలోనూ, మెట్రో స్టేషన్లలోనూ జరిగిన ఈ ఆత్మాహుతి దాడులలో 30 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. ఈ దాడి తరువాత బయటపడుతున్న నిజాలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. తీవ్రవాదులు నిజానికి బెల్జియంలో ఒక అణువిధ్వంసానికి ప్రయత్నించారా! అంటే అవుననే జవాబిస్తున్నాయి అక్కడి నిఘాసంస్థలు. ఉగ్రవాదులు ముందుగా బెల్జియంలోని అణువిద్యుత్‌ కేంద్రాలని లక్ష్యంగా చేసుకున్నారనీ, కొద్ది రోజుల క్రితం వారి సహచరుడిని బెల్జియం పోలీసులు అరెస్టు చేయడంతో, లక్ష్యాలను మార్చుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ వారి పన్నాగం కనుక నెరవేరి ఉంటే, జరిగే ప్రమాదాన్ని ఊహించడానికే కష్టంగా ఉంది.   బెల్జియం నిఘావర్గాలు కనుక అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే, ప్రస్తుత దాడులు కూడా జరిగేవి కావని అంటున్నారు. ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినప్పటికీ, మరింతమంది ఉగ్రవాదులు దేశంలో సంచరిస్తున్నారని తెలిసినప్పటికీ... బెల్జియం రక్షణవర్గాలు చూసీ చూడనట్లు వ్యవహరించాయంటున్నారు. యూరోపు దేశాల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఈ దాడులకు కారణంగా తెలుస్తోంది. ఈ దేశాలు, తమ మధ్య నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే మాట అటుంచితే... ఇతర దేశాలు అందించే సమాచారాన్ని కూడా చులకనగా చూస్తాయట. అందుకే ప్యారిస్‌లో గత ఏడాది దాడులకు పాల్పడినవారే, ఇప్పుడు బెల్జియంలోనూ దాడులు చేసే అవకాశం చిక్కింది.

కరుణానిధిని కలిసిన అళగిరి.... రెండేళ్ల తరువాత... ఎందుకో

తమిళనాట రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఒకపక్క పీపుల్స్‌ వెల్ఫేర్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతుండగా, మరోపక్క సరైన అభ్యర్ధులను బరిలో నిలిపేందుకు జయలలిత తంటాలు పడుతున్నారు. చాలామంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి టిక్కెట్లు దక్కకపోవచ్చుననే భయాలు వినిపిస్తున్నాయి. ఇక డీఎంకే కూడా తన కష్టం తాను పడుతోంది. ఒకప్పుడు తమిళనాట ఓ వెలుగువెలిగిన ఆ పార్టీ, కరుణానిధి కురువృద్ధునిగా మారిపోవడంతో కుదేలైపోయింది. ఆపత్కాలంలో ఉన్న తండ్రికి వెన్నంటి నిలుద్దామనుకున్నాడో ఏమో, కరుణ కుమారుడు అళగిరి రంగంలోకి దిగాడు. పార్టీకి తరచూ చెడ్డపేరు తెస్తున్నాడంటూ 2014లో అళగిరిని పార్టీనుంచి బహిష్కరించారు. అప్పటి నుంచీ ఆయన తండ్రిని కూడా కలవడం మానేశాడు. తనకు సవతి తమ్ముడైన స్టాలిన్‌కు కరుణానిధి అధిక ప్రాధాన్యతని ఇవ్వడమే అళగిరి దుగ్ధకు కారణంగా ఉండేది. ఆ సందర్భంగా జరిగిన ఓ గొడవలోనే, ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. కానీ అకస్మాత్తుగా అళగిరి తిరిగి తండ్రి చెంతకు చేరుకోవడంతో, వీరిద్దరి కలయిక గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. మంచో చెడో... అళగిరికి మధురైలో చాలా పలుకుబడే ఉంది. దక్షిణ తమిళనాడు మీద అతనికి మంచి పట్టుంది. కాబట్టి ఈ ఎన్నికలలో అళగిరిని తిరిగి డీఎంకేలోకి తీసుకుని, పార్టీని బలపర్చుకునే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు ముంచుకువస్తే, పొత్తులే కాదు, బంధాలు కూడా మారిపోతాయన్నమాట.

నాకు మోదీ మీద ద్వేషం లేదు- కన్నయా కుమార్‌

నేడు హైదరాబాదులో కన్నయా కుమార్‌ జరిపిన పర్యటన ఆద్యంతం ఉద్రిక్తంగా సాగింది. దిల్లీ నుంచి శంషాబాదు విమానాశ్రయంలో దిగడంతోనే, తాను రోహిత్‌ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చానని స్పష్టం చేశారు కన్నయ. విమానాశ్రయంలో కన్నయాకు సీపీఐ నేతలు ఘనస్వాగతం పలకడం గమనార్హం. తదుపరి విద్యార్థి నేతలతో మాట్లాడుతూ వీసీ అప్పారావు వల్లే హెచ్సీయూలో సమస్యలు వచ్చాయని కన్నయ్య ఆరోపించారు. వర్సిటీ క్యాంపస్లను యుద్ధరంగాలుగా మార్చారని ఆయన విమర్శించారు. తన ఆదర్శం అఫ్జల్‌గురు కాదు, రోహిత్‌ వేములేనని మరోసారి స్పష్టం చేశారు. తనకి మోదీ అంటే ద్వేషం లేదనీ, అయితే విశ్వవిద్యాలయాలలో కొనసాగుతున్న అణచివేత మీదే తన పోరాటం అనీ పేర్కొన్నారు. సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో కన్నయా ఉపన్యసిస్తుండగా కొందరు ఆయన మీదకు చెప్పు విసిరే ప్రయత్నం చేశారు. కానీ కన్నయా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. తాను గాంధేయవాదిననీ, ఇలాంటి వాటికి భయపడి హైదరాబాదుకి రావడం మానేయననీ చెప్పుకొచ్చారు. ఇక కన్నయా పశ్చిమబెంగాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాన్ని కొట్టివేశారు. విద్యార్థుల హక్కులు, తన చదువు... ఈ రెండే తన లక్ష్యాలని పేర్కొన్నారు. దీంతో కన్నయా మీద కోటి ఆశలు పెట్టుకున్న కమ్యూనిస్టులని నిరాశ పరిచినట్లైంది.

‘భారత్‌ మాతాకీ జై’ చట్టం తేవాలి- రాందేవ్‌ బాబా

భారత్ మాతాకీ జై నినాదం గురించి మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ రేపిన తేనెతుట్టు ఇప్పట్లో సద్దుమణిగేట్లు లేదు. తాజాగా యోగా గురువు రాందేవ్‌బాబా కూడా ఈ విషయమై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ‘భారత్‌ మాతాకీ జై’ అనేలా ఒక చట్టాన్ని తీసుకురావాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఈ నినాదం చేయాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదని అసదుద్దీన్‌ వ్యాఖ్యనించిన నేపథ్యంలో రాందేవ్‌ ఈ మాటలు అని ఉండవచ్చు. ఇంతేకాదు! దేశమంతటా గోవధ నిషేధం అమలు జరిగేలా కూడా ఒక చట్టాన్ని ఏర్పాటు చేయమంటూ ఆయన మోదీని కోరారు. గోవధని కనుక నిషేధిస్తే, మతకలహాలు తగ్గిపోతాయని ఆయన పేర్కొన్నారు. నిజానికి 18వ శతాబ్దం వరకూ కూడా మన దేశంలో గోవధ నేరంగా ఉండేదనీ, ఔరంగజేబు కూడా దీన్ని సమర్థించాడనీ ఆయన చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్ నేత శశిథరూర్... కన్నయాకుమార్‌ను భగత్‌సింగ్‌తో పోల్చడం గురించి కూడా రాందేవ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాంటి పోలిక భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరులకు అవమానం అన్నారు. మొత్తానికి రాందేవ్‌గారు చాలా విషయాలే చెప్పుకొచ్చారు.

కంచి స్వామిని ప్రభుత్వం అకారణంగా వేధించింది- అమిత్‌ షా

తమిళనాట ఎన్నికలు ముంచుకురావడంతో అక్కడి ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలన్నీ తెగ ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కంచి స్వామివారి జన్మదినానికి హాజరైనా అమిత్‌ షా కూడా ఓ వివాదాస్పద వ్యాఖ్యను చేశారు. శంకరరామన్‌ హత్య కేసులో కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతిని అన్యాయంగా ఇరికించారనీ ఆయన ప్రకటించారు. జయేంద్ర సరస్వతి 80వ జన్మదినోత్సవం సందర్భంగా చైన్నైలో జరిగిన ఓ సమావేశానికి అమిత్‌ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయేంద్ర సరస్వతిని అమిత్‌ కొనియాడారు. గుజరాత్‌లో మత విద్వేషాలని చల్లార్చేందుకు, జయేంద్ర చాలా కృషి చేశారని ప్రశంసించారు. ఆ పర్యటనలో అనాటి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కూడా జయేంద్రతో కలిసి నడిచారని గుర్తుచేసుకున్నారు. జయేంద్రను ఒక కేసులో అన్యాయంగా ఇరికించారని తెలియగానే, తాను గుజరాత్‌లో ధర్నా కూడా చేశానని చెప్పుకొచ్చారు. జయేంద్రను అరెస్టు చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్న విషయం తెలిసిందే! ఈ విషయాన్ని ఇప్పుడు అమిత్‌ షా వెల్లడించడంలో ఆంతర్యం ఏమటో! విజయ్‌కాంత్‌ నెలకొల్పిన డీఎండీకే పార్టీ కూడా ఇప్పుడు బీజేపీతో కలవకపోవడంతో, ఈసారి తమిళనాట బీజేపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అమిత్‌ వ్యాఖ్యలు ఓటర్లను ఎంతో కొంత ప్రభావితం చేయకపోవు. దీనికి తగినట్లుగానే జయేంద్ర సరస్వతి కూడా ‘మోడీ చాలా మంచి వ్యక్తి’ అంటూ కొనియాడారు.

కన్నయా, రాహుల్‌ కలిసిపోయారా!

జేఎన్‌యూలో వివాదాస్పద సమావేశాన్ని నిర్వహించి జాతిద్రోహం కేసులో ఇరుక్కున్న కన్నయాకుమార్‌ ప్రస్తుతం బెయిలు మీద తిరుగుతున్నారు. ఈ వివాదం తరువాత కన్నాయ చాలామందికి అభిమాన నాయకుడిగా మారిపోయారు. రాహుల్‌ సైతం ఈ విషయంలో కన్నయాకు అనుకూలంగా ఉన్నట్లు తేలిపోయింది. కన్నయాను ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందంటూ, రాహుల్ తరచూ మండిపడుతున్నారు. అంతేకాదు! ఈ వివాదం తారస్థాయిలో ఉన్నప్పుడు, రాహుల్ జేఎన్‌యూని సందర్శించి అక్కడి విద్యార్థులకు తన మద్దతుని సైతం అందించారు. ఇదిలా ఉండగా కన్నయా కూడా వెళ్లి వెళ్లి రాహుల్‌గాంధిని కలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశం స్నేహపూర్వకంగానే జరిగిందని చెబుతున్నప్పటికీ, అందులోని వివరాలను మాత్రం ఎవ్వరూ వెల్లడించడం లేదు. కన్నయా ఇప్పటికే రాజకీయాలలోకి రానున్నారని సీతారాం ఏచూరి ప్రకటించేశారు. తమ పార్టీ తరఫున కన్నయా పశ్చిమబెంగాల్లోని ఎన్నికలలో ప్రచారం చేయనున్నారని కూడా చెప్పారు. అక్కడ కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే! అంటే రాజకీయంగా ఇప్పటికే కన్నయా, రాహుల్‌ ఒకే పక్షాన ఉన్నారన్నమాట. మరోవైపు ఇటు రాహుల్‌, అటు కన్నయా కూడా బీజేపీని అదను దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నారు. మరి మున్ముందు వీరిద్దరూ కలిసి బీజేపీ వ్యతిరేకంగా పోరాడనున్నారా? ఏమో రాజకీయాలలో ఏదైనా జరగవచ్చు!

విజయ్‌కాంత్‌ ఇక పొత్తుకు సిద్ధం

ఇన్నాళ్లూ ఒంటరిగా పోటీ చేస్తానని బీరాలు పలికిన విజయ్‌కాంత్‌, ఇప్పుడు మిగతా పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డారు. విజయ్‌కాంత్‌ నాయకత్వంలోని డీఎండీకె పార్టీ, పీపుల్స్‌ వెల్‌ఫేర్‌ ఫ్రంట్‌ (PWF)లో భాగస్వామిగా మారనుంది. తాజా పొత్తుల ప్రకారం తమిళనాట అసెంబ్లీలోని 235 స్థానాలకుగాను, డీఎండీకె 124 స్థానాలకు పోటీ చేస్తుందట. మిగతా స్థానాలలో PWFలో భాగమైన వామపక్షాలు, ఎండీఎంకే, వీసీకే పార్టీలు పోటీచేస్తాయి. విజయ్‌కాంత్ మొదట బీజేపీతోనూ, తరువాత కాలంలో డీఎంకేతోనూ కలిసి పోటీ చేయనున్నారని ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదనీ, తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ విజయ్‌కాంత్‌ స్పష్టం చేసేశారు. మరి ఇప్పుడేమో ఇలా! విజయ్‌కాంత్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కలిసి వస్తుందో విశ్లేషకులకు సైతం అర్థం కావడం లేదు. ఎందుకంటే, తమిళ అతివాద పార్టీలుగా పేరుతెచ్చుకున్న ఎండీఎంకే, వీసీకేలకు అసెంబ్లీలో అసలు ప్రాధాన్యతే లేదు. మరి అలాంటి చిన్నాచితకా పార్టీలను కూడగట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఏకంగా చేస్తారా? లేకపోతే ఓటర్లను అయోమయానికి గురి చేసి తాము కూడా చతికిలపడతారా? అన్నది త్వరలోనే తేలిపోతుంది.

భగత్‌సింగ్‌ చుట్టూ రాజకీయాలు మొదలు

  భగత్‌సింగ్‌ను కన్నయాకుమార్‌తో పోలుస్తూ కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలు ఓ తేనెతుట్టుని కదిపినట్లున్నాయి. శశిథరూర్‌ వ్యాఖ్యలు కలిగించిన వేడిని చల్లార్చేందుకు, కాంగ్రెస్ నేతలు వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఆ పార్టీ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ ‘భగత్‌సింగ్‌ ఒక్కడేననీ, ఆయనను వేరెవ్వరితోనూ పోల్చడం సరికాదని’ పేర్కొన్నారు. పంజాబ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వారి హీరో అయిన భగత్‌సింగ్‌ను వివాదంలోకి లాగడం ఆ పార్టీకి తప్పకుండా నష్టం కలిగించవచ్చు. ఇక కమ్యూనిస్టులు కూడా ఈ వ్యాఖ్యలతో కంగుతిన్నారు. ఆది నుంచీ కూడా వారు భగత్‌సింగ్‌ను, తమ వర్గానికి చెందిన నేతగా భావించారు. ఇప్పుడు కన్నయాతో పోల్చడంతో ఆయన స్థాయి తగ్గించినట్లైపోయింది. ఇక బీజేపీ మాత్రం ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే కన్నయతో భగత్‌సింగ్‌ను పోల్చడం గురించి బీజేపీ ఇప్పటికే మండిపడుతోంది. మార్చి 23 భగత్‌సింగ్‌ను ఉరితీసిన రోజు కావడంతో, ఆ రోజు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించనుంది. ఈ సందర్భంగా, భగత్‌సింగ్‌ త్యాగాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేస్తామని ఆ పార్టీ చెబుతోంది. మరి ఈ వివాదం చిలికి చిలికి ఎక్కడికి దారితీస్తుందో, ఎన్ని ఎన్నికలలో ప్రభావం చూపిస్తుందో చూడాలి!

జగన్ ప్లాన్ ఈసారైనా వర్కవుట్ అవుద్దా..?

వైసీపీ పార్టీ నుండి ఎనిమంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వారిపై అనర్హత వేటు పడేలా చేయాలని చూసిన జగన్ ఎత్తులను అధికార పార్టీ ఎలాగొలా తిప్పికొట్టింది. అయితే ఇప్పుడు జగన్ వారిపై మరో అస్త్రాన్ని వాడబోతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు వైసీపీ విప్ జారీ చేసింది. ఈ క్రమంలో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు కూడా విప్ అందజేయాలని వైసీపీ నిర్ణయించింది. అంతేకాదు ఈసారి మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. వారిపై ఎలాగైనా అనర్హత వేటు పడేలా చేయాలని చూస్తున్నారు జగన్. దీనిలో భాగంగానే ఒకవేళ విప్ తీసుకోకుండా ఆ ఎమ్మెల్యేలు తప్పించుకోవాలని చూస్తే వారి క్వార్టర్స్‌‌కు వెళ్లి మరీ విప్ అందజేయాలని చూస్తున్నారంట. అందుకు స్యాక్ష్యాలు కూడా ఉండేలా చూస్తున్నారు.   వాస్తవానికి విప్ జారీ చేసిన తర్వాత ఆయా పార్టీలకు చెందిన సభ్యులు తప్పనిసరిగా సభకు రావాల్సి ఉంటుంది. పార్టీ ఆదేశం ప్రకారం ఓటు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా సభకు హాజరుకాకపోతే వారిపై అనర్హత వేటు పడుతుంది. మరి జగన్ వేసిన ప్లాన్ ఈసారైనా వర్కవుట్ అవుతుందా.. లేక దానికి కూడా అధికార పార్టీ ఏదో ఒక ఎత్తుగడ వేస్తుందా చూడాలి..

కన్నయ్య భగత్ సింగా.. మరి రాహుల్, సోనియా..? మరో వివాదంలో శశిథరూర్

  కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఇప్పటికే తన భార్య ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు జెఎన్యూ విద్యార్ధి సంఘ నేత.. దేశ ద్రోహి ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నయ్య కుమార్ ను భగత్ సింగ్ తో పోల్చి మరో వివాదంలో ఇరుక్కున్నారు. జేఎన్‌యూ క్యాంపస్‌లో అడ్మినిస్ట్రేషన్ భవనం ఎదుట నిర్వహించిన సమావేశంలో శశిథరూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, బాల్ గంగాధర్ తిలక్, అనీబీసెంట్ లాంటి ప్రముఖులు బ్రిటిష్ కాలంలో దేశ ద్రోహం చట్ట బాధితులే అని.. వ్యాఖ్యానిస్తుండగా.. ఇంతలో ఓ విద్యార్ధి లేచి భగత్‌సింగ్ కూడా అని గుర్తు చేశాడు. దీనికి శశిథరూర్ స్పందించి.. కన్హయ్యకుమార్ ఈ కాలపు భగత్‌సింగ్ అని పేర్కొన్నారు. కన్హయ్యకుమార్ మోదీ ప్రభుత్వానికి, దేశంలోని పేదరికానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు.   ఇప్పుడు శశిథరూర్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.  స్వాతంత్య్ర సమరయోధుడితో కన్నయ్య కుమార్ పోల్చడం ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కన్హయ్యకుమార్ భగత్‌సింగ్ అయితే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఎవరని ప్రశ్నించారు.   ఇక రాజకీయ నేతలకు కూడా మాటలు అనడం ఆ తరువాత అనలేదని చెప్పడం పరిపాటైపోయింది. ఇప్పుడు శశిథరూర్ కూడా నేను కన్హయ్యను భగత్‌సింగ్‌తో పోల్చలేదని చెబుతున్నారు. ఎంతైనా నిప్పులేనిదే పొగ రాదు కదా..

వికటించిన విజయ్ కాంత్ ప్లాన్.. ఒంటరి వాడయ్యాడా...?

  ఒంటరినై పోయాను అన్నట్టు ఉంది ప్రస్తుతం డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ పని. నిన్న మొన్నటి వరకూ హడావుడిగా ఉన్న ఈయన ప్రస్తుతం ఒంటరి వాడై పోయినట్టు కనిపిస్తోంది. అసలుసంగతేంటంటే.. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీలన్నీ పోరుకు సిద్దమవుతున్నాయి. పార్టీల్లోకి వచ్చే వాళ్లు వస్తున్నారు.. పోయే వాళ్లు పోతున్నారు. అయితే సాధారణంగా ఎన్నికలప్పుడు ఒకోసారి ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతాయి. కానీ ఈసారి తమిళనాడులో అలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. ఎందుకంటే.. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. ఇక బీజేపీ ఇతర పార్టీలు కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నాయి. దీంతో సినీ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కూడా ఒంటరిగానే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు.   అసలు డీఎంకే, బీజేపీలు పార్టీలు డీఎండీకే తో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో దిగాలని చూసింది. కానీ విజయ్ కాంత్ మాత్రం దానికి ససేమిరా ఒప్పుకోనంటూ ఒంటరిగానే పోటీకి దిగుతున్నట్టు చెబుతున్నారు. ఇక్కడే విజయ్ కాంత్ తప్పులో కాలేసినట్టు కనిపిస్తోంది. ఆయన ఒంటరి పోరాటం వికటించింది. ఎందుకంటే అప్పటి వరకు విజయకాంత్‌ చెంతవున్న అనేక మంది కీలక నేతలు.. ఆయన ఎప్పుడైతే ఒంటరి పోరాటం అన్నారో ఆయనకు చెప్పాపెట్టకుండా జారుకున్నారు. పెద్ద పార్టీల సంగతే దేవుడికి ఎరుగు.. చిన్న పార్టీలు కూడా కనీసం ఆయనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడంలేదు. చివరకు తన చుట్టూ ఉన్న నాయకగణం సైతం చల్లగా జారుకుంది. కనీసం కూడా టిక్కెట్‌ ఇవ్వమని కోరేవారే లేకుండా పోయారట. దీంతో ప్రస్తుతం విజయ్ కాంత్ ఏం చేయాలో తెలియని అయోమయంలో పడినట్టు తెలుస్తోంది.

అది ప్రజల నినాదం.. బీజేపీ నినాదం కాదు..

  మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ నా గొంతు మీద కత్తి పెట్టినా సరే నేను భారత్ మాతాకీ జై అనను అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపాయి. అసద్దుద్దీన్ కు కౌంటర్ గా చాలా మంది చాలా విమర్శలే చేశారు. రచయిత జావేద్ అక్తర్, ఆయన సతీమణి షబానా ఆజ్మీ, అనుపమ్ ఖేర్ ఇంకా చాలామంది చాలా రకాలుగా స్పందించి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈవ్యాఖ్యలపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా స్పందించి దీనిని రచ్చ చేయవద్దు అని హితవు పలికారు. అసలు ఈవివాదాన్ని ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారో నాకు అస్సలు అర్ధం కావట్లేదు.. 'భారత్ మాతాకీ జై' అంటే దేశానికి సెల్యూట్‌ చేయడమే.. ఆ నినాదాం బీజేపీ సొంతం కాదని, అది ప్రజల నినాదమన్నారు. భారత్ మాతాకీ జై నినాదంపై రచ్చ చేయడం మంచిది కాదని, ఎవరైనా స్లోగన్‌ ఇవ్వవచ్చునన్నారు. పాకిస్తాన్‌ మీద టీంఇండియా గెలిచిన తర్వాత స్టేడియంలో ఉన్నవాళ్లందరూ భారత్ మాతా కీ జై అని అన్నారని, అలా అనమని వాళ్లకు ఎవరూ చెప్పలేదన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో కూడా ఆ నినాదం చేశారని, ఎవరైనా భారత్ మాతా కీ జై అనవచ్చునని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.

కొందరికి మమ్మల్ని చూస్తే జ్వరం వస్తుంది- మోదీ

అనుకున్నట్లుగా అంబేద్కర్‌ స్మారకోపన్యాసంలో మోదీ తాము దళితవ్యతిరేకులం కాము అని చెప్పేందుకు ప్రయత్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని దళిత వ్యతిరేకిగా రుజువు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. అలాంటి ప్రచారంలో ఎలాంటి నిజమూ లేదనీ, తాము దళితులకు, గిరిజనులకు.... రిజర్వేషన్లను కల్పిస్తూనే వచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రంలోనే కాదు, తాము అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ల మీద మచ్చ పడలేదని చెప్పుకొచ్చారు. అంబేద్కర్‌ను కొందరు ఏదో ఒక వర్గానికి చెందినవాడిగానే గుర్తిస్తారనీ, నిజానికి ఆయన విశ్వమానవుడని కీర్తించారు. మహిళలకు సమానహక్కులు కల్పించడంలో నెహ్రూ, అంబేద్కర్‌కు మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఆయన ఆనాటి క్యాబినెట్‌ నుంచి వైదొలిగారని చరిత్రను గుర్తుచేశారు. అణిచివేయబడిన వర్గాల కోసం పోరాడిన మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఎంతటి స్ఫూర్తిని రగిలిస్తారో, అంబేద్కర్ జీవితం కూడా అంతే స్ఫూర్తిదాయకంగా ఉంటుందని కొనియాడారు. తమని చూస్తేనే కొందరికి జ్వరం వస్తుందనీ, జ్వరం వచ్చినవారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారనీ... పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు.

‘భారత్‌ మాతాకీ జై’ అనుకూలంగా బీజేపీ తీర్మానం

దిల్లీలో జరిగిన రెండురోజుల బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రస్తుతం నడుస్తున్న అనేక వివాదాల గురించి చర్చ జరిగినట్లు సమాచారం. జేఎన్‌యూ ఘటన గురించి మోదీ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ‘రాజకీయపరమైన విమర్శలను సహించగలం కానీ, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదని’ ఈ సమావేశంలో హితవు పలికారట. రోహిత్‌ వేముల, జేఎన్‌యూ ఘటనల వల్ల దళితులు బీజేపీకీ వ్యతిరేకులుగా మారుతున్న విషయాన్ని కూడా సమావేశం గ్రహించినట్లుంది. అందుకే ముంబైలో అంబేద్కర్‌ స్మారకస్థూపాన్ని నిర్మించాలని ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక భారత్‌ మాతాకీ జై నినాదం గురించి నడుస్తున్న తాజా వివాదం గురించి కూడా ఈ కార్యవర్గం చర్చించింది. ఆ నినాదానికి అనుకూలంగా ఏకంగా ఓ తీర్మానాన్నే ఆమోదించింది. ‘రాజ్యాంగం మన దేశాన్ని భారత్‌ అన్న పేరుతో కూడా గుర్తిస్తుందనీ, సదరు నినాదం మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక తారకమంత్రంగా నిలిచిందనీ..... కాబట్టి భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో భారత్‌ మాతాకీ జై అన్న నినాదాన్ని వ్యతిరేకించడం అంటే, రాజ్యాంగాన్ని అవమానించినట్లే’ అని సదరు తీర్మానం పేర్కొంది.

కొడుక్కి 18 ఏళ్లు వచ్చేవరకే తండ్రి బాధ్యత

పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యతకి సంబంధించి గుజరాత్‌ హైకోర్టు, ఓ సంచలన తీర్పునిచ్చింది. మగపిల్లలకి మైనారటీ తీరిపోయి, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడే వయసు వచ్చేదాకానే వాళ్లని పోషించి తీరాల్సిన బాధ్యత తండ్రికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆడపిల్లల సంగతి వేరని, వారికి పెళ్లి చేసేవరకూ కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుందని పేర్కొంది. దినేష్‌ ఓజా అనే ఒక వైద్యుడికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. దినేష్‌ ఓజా పదేళ్ల క్రితం విడాకులు తీసుకున్నాడు. అతని భార్యకు దినేష్‌ నెలనెలా కొంత భరణం చెల్లించాలని అప్పటి తీర్పు స్పష్టం చేసింది. అతని భార్యతో పాటు ఉంటున్న పిల్లవాడికి కూడా 18 ఏళ్లు వచ్చేవరకు కూడా ఆర్థిక సాయం చేయాలని పేర్కొంది. 2013లో ఆ పిల్లవాడికి 18 ఏళ్లు నిండటంతో ఓజా తన చెల్లింపులను నిలిపివేశాడు. ఈ విషయమై అతని భార్య గుజరాత్‌ హైకోర్టులో కేసుని దాఖలు చేయగా, కోర్టు దినేష్‌కు అనుకూలంగా తీర్పునందించింది. పిల్లలు శారీరికంగానో, మానసికంగానో వైకల్యంతో ఉంటే తప్ప... 18 ఏళ్లు దాటాక కూడా, వారి భారాన్ని తండ్రి మీద మోపలేమని స్పష్టం చేసింది

జైలు నుంచి వచ్చినవారు ఒలింపిక్‌ విజేతలు కాదు- అనుపమ్

బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ మరోసారి జేఎన్‌యూ విద్యార్థి నాయకులు మీద విరుచుకుపడ్డారు. ‘బుద్ధా ఇన్‌ ట్రాఫిక్‌ జాం’ అనే తన సినిమాను ప్రదర్శించేందుకు జేఎన్‌యూకి వెళ్లిన అనుపమ్‌, అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవడంలోనూ, రాజకీయాలు చేయడంలో తప్పులేదు కానీ.... దేశానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయవద్దంటూ హితవు పలికారు. అనుపమ్‌ తన ఉపన్యాసంలో తరచూ కన్నయా కుమార్‌ గురించి ప్రస్తావిస్తూనే వచ్చారు. నా తల్లిదండ్రులు పేదలు అని తరచూ చెప్పుకునే వ్యక్తి, ఏళ్లకి ఏళ్లు చదువుకున్న తరువాత కూడా వారికి సాయం చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. బెయిలు మీద విడుదల అయిన విద్యార్థులకి ఘనస్వాగతం పలకడాన్ని కూడా అనుపమ్‌ తప్పు పట్టారు. ఘన స్వాగతం పలికేందుకు వారేమీ ఒలింపిక్ పతకాన్ని సాధించలేదనీ, దేశం గురించి చెడుగా మాట్లాడే వ్యక్తిని ఓ నాయకుడిగా ఎలా గుర్తిస్తారనీ ప్రశ్నించారు. జేఎన్‌యూ వివాదం గురించి పలు అభిప్రాయాలు వెల్లడించిన అనుపమ్ ‘భారత్ మాతాకీ జై’ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు.

బీహార్‌లోని పేద శాసనసభ్యులకు బహుమతులు!

బీహార్‌లోని ఉపాధ్యాయులకు కొద్ది నెలలుగా జీతాలు లేవు. కానీ ఆ రాష్ట్ర విద్యాశాఖ మాత్రం శాసనసభ్యులందరికీ మైక్రో ఓవెన్లు పంచిపెట్టింది. ఇందుకోసం అయిన ఖర్చు అక్షరాలా 30 లక్షలు! తమ రాష్ట్రంలోని శాసనసభ్యులు మధ్యాహ్న భోజన పథకం అమలు గురించి తనిఖీ చేసేందుకు, పాపం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారనీ... అలా మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు తమ ఆహారాన్ని వెచ్చ చేసుకునేందుకు మైక్రో ఓవెన్లు ఇచ్చామని పేర్కొంది విద్యాశాఖ. అయితే ఇలాంటి బహుమతులు అక్కడి శాసనసభ్యులకు కొత్తేమీ కాదు. తమ శాఖలకు సంబంధించిన ప్రశ్నలకు లేవనెత్తుతున్నారంటూ వివిధ ప్రభుత్వ శాఖలు అక్కడి శాసనసభ్యులకు బహుమతులు అందించడం ఓ ఆనవాయితీగా మారిపోయింది. ‘ప్రజల సమస్యలను చర్చించడం శాసనసభ్యుల ధర్మం కదా, అందుకోసం బహుమతులు ఏంటి?’ అన్న విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఈ బహుమతులు వ్యవహారంలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్, తన సహచరులను వెనకేసుకు వస్తున్నారు. ‘బీహార్ చాలా పేద రాష్ట్రమనీ, ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యేవారు కూడా పేదవారనీ, అలాంటివారికి బహుమతులు ఇస్తే తప్పేముందనీ...’ ఎదురు ప్రశ్నిస్తున్నారు. కానీ వాస్తవాలు వేరేలా ఉన్నాయి. ఒక్కసారి ఎన్నికల సంఘానికి అందించను అఫిడవిట్లను తెరిచి చూస్తే, ఆ రాష్ట్ర శాసనసభ్యులలో ఎక్కువశాతం ధనవంతులే అని తేలిపోతుంది. కానీ నేతలు ఆస్తులను ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయరు కదా! కాబట్టి వారు ఎప్పటికీ పేదవారి కిందే లెక్క!

లాటరీలో గెల్చినవారే ఇండో-పాక్ మ్యాచ్‌ను చూడగలరు!

  టి-20 ప్రపంచ కప్ సందర్భంగా 65,000 పైగా సామర్థ్యం కలిగిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ స్టేడియం నేడు కిటికిటలాడనుంది. కానీ ఎంత ఖర్చైనా సరే ఈ మ్యాచ్‌ను చూసి తీరాలనుకున్నవారికి మాత్రం నిరాశ మిగిలింది. కారణం! దేశంలోనే మొట్టమొదటిసారిగా లాటరీ ద్వారా టికెట్లను అమ్మారు. అదికూడా ‘బుక్‌ మై షో’ అనే వెబ్‌సైట్లో రిజిస్టర్‌ చేసుకున్నవారికి మాత్రమే ఈ అవకాశం లభించింది. టిక్కెట్లను నేరుగా కౌంటరు వద్ద అమ్మకపోవడం, అది కూడా ఆన్‌లైన్ లాటరీ ద్వారా అందించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. టికెట్ల కోసం లైన్లలో నిల్చుంటే సమయం వృథా అవుతుంది కాబట్టి, ఈసారి ఆన్‌లైన్లోనే టికెట్లను అందిస్తున్నామని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. కానీ ఆన్‌లైన్‌ సదుపాయం కానీ, అందులో అనుభవం కానీ లేనివారికి ఈ నిబంధన అన్యాయం చేసిందంటూ అభిమానులు వాపోతున్నారు. మరోవైపు టిక్కెట్ల కోసం బుక్‌ మై షో నిర్వహించిన లాటరీలో టికెట్లను గెలుపొందినవారు, మ్యాచ్‌ను చూసేందుకు ఈపాటికే బయల్దేరిపోయారు. మ్యాచ్‌ను చూసేందుకు కోల్‌కతాకు వచ్చే జనంతో నగరం మొత్తం కిటకిటలాడిపోతోంది. ఇక ఈ మ్యాచ్‌ కోసం దేశవిదేశాల నుంచి వచ్చి అభిమానులతో అక్కడి హోటళ్లన్నీ కళకళలాడుతున్నాయి. ఇక మ్యాచ్‌ ప్రారంభం కావడమే ఆలస్యం!