దేశానికి క్షమాపణ చెప్పిన షాహిద్ ఆఫ్రిదీ
క్రికెట్ అన్నాక గెలుపు ఓటములు సహజం. కానీ పాకిస్తాన్‌లో అలా ఉండదు. తమ క్రికెట్ జట్టు ఓడిపోతే, అందులోనూ ఇండియా చేతిలో ఓడిపోతే అక్కడి భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న T20 ప్రపంచకప్‌లో భాగంగా, భారత్ చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడంతో మరోసారి అక్కడి అభిమానులు తమ జట్టు మీద విరుచుకుపడ్డారు. పుండు మీద కారం చల్లినట్లు తరువాత జరిగిన మ్యాచ్‌లలో కూడా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. జట్టు పేలవ ప్రదర్శనకు కారణం ఆటగాళ్లే అంటూ ఆ జట్టు కోచ్ వకార్ యూనిస్ చేతులు దులిపేసుకున్నాడు. కానీ ఆఫ్రిదీ మాత్రం మరో అడుగు ముందుకేసి, తాను దేశానికి క్షమాపణ చెబుతున్నానంటూ ఆన్‌లైన్‌లో ఒక వీడియోని ఉంచాడు. 20 ఏళ్లుగా తాను దేశం తరఫున ఆడాననీ, దేశ ప్రజల ఆశలకు ప్రాతినిధ్యం వహించాననీ చెప్పుకొచ్చాడు ఆఫ్రిదీ.
తన గురించి ఎవ్వరేమనుకున్నా పట్టించుకోననీ, ఒక్క దేశ ప్రజలకు మాత్రమే జవాబుదారిగా ఉంటానని పేర్కొన్నాడు. ఆ దేశ ప్రజలకు, తమ పేలవమైన ప్రదర్శనకుగాను క్షమాపణ చెబుతున్నట్లు పేర్కొన్నాడు. ఇప్పటికే పాకిస్తాన్‌లో కంటే, భారతదేశంలోనే తమను ఎక్కువగా అభిమానిస్తారంటూ పేర్కొని విమర్శల పాలైన ఆఫ్రిదీ... ఈ క్షమాపణలతోనైనా పాకిస్తాన్ ప్రజల మనసుని చూరగొంటాడేమో చూడాలి. ఎవరెన్ని చెప్పినా, ఈ పరాజయాల తరువాత, ఆఫ్రిదీని అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగించే అవకాశాలు సన్నగిల్లినట్లే!