బడ్జెట్లో... బ్యాంకులకు చేయూత!

  మొండి బకాయిలతో మోడువారిపోతున్న బ్యాంకులను ఆదుకునేందుకు ఆర్థికమంత్రి ఏదో ఒకటి చేస్తారన్న ఆశలు మొదటి నుంచీ ఉన్నవే. ఆశించినంత కాకపోయినా అరుణ్‌ జైట్లీ తన బడ్జెట్లో వీటికి కొంత ప్రాముఖ్యతను కల్పించారు.   - రిజర్వ్ బ్యాంకు చట్టానికి తగు సవరణ చేయడం ద్వారా ద్రవ్య నీతిని తరచూ సమీక్షించేందుకు ఒక సంఘాన్ని నియమించనున్నారు.   - ప్రభుత్వ రంగం బ్యాంకులలో పేరుకుపోతున్నమొండి బకాయిలను గుర్తించి, వాటికి హామీగా ఉన్న ఆస్తులను కొన్ని ప్రత్యేక సంస్థలను అమ్ముకునే సదుపాయం ప్రభుత్వం చాలా రోజుల క్రితమే కల్పించింది. ఇలా మొండి బకాయిలకు సంబంధించిన ఆస్తులను బ్యాంకుల నుంచి ఖరీదు చేసి, వాటిని లాభసాటిగా మార్చుకునే సంస్థలను ‘Asset Reconstruction Companies’ అంటారు. మున్ముందు ఇలాంటి సంస్థలను మరింతగా ప్రోత్సహించనున్నట్లు అరుణ్‌ జైట్లీ తెలియచేశారు.   - ప్రభుత్వ రంగ బ్యాంకుల పెట్టుబడిలో సాయం చేసేందుకు 25,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.   - ప్రభుత్వం ఆధీనంలో ఉన్న బీమా సంస్థలు ఇకమీదట స్టాక్‌ ఎక్స్చేంజిలలో తమ షేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు.

దిల్లీలో నీటి కటకట- ఇళ్లు వదిలి వెళ్తున్న పౌరులు!

  దేశ రాజధాని దిల్లీ నీటికి అల్లల్లాడిపోతోంది. దిల్లీలోని పాలం, ద్వారక వంటి ప్రాంతాలలోని ప్రజలకు రోజుల తరబడి నీరు లభించడం లేదు. ఈ బాధని తట్టుకోలేక కొందరు గృహస్తులు ఏకంగా ఇంటిని వదిలి హోటళ్లలో సమయాన్ని గడిపేందుకు సిద్ధమవుతున్నారట! దిల్లీకి మంచినీటిని అందించే మునక్‌ కాలువని హర్యానాలోని జాట్ వర్గపు ఆందోళనకారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దానిని ఇలా పునరుద్ధరించారో లేదు, తిరిగి అందులోకి నీరు పారిశ్రామిక వ్యర్థాల వల్ల కలుషితమైపోయిందన్న వార్తలు వచ్చాయి. దాంతో మరోసారి మునక్‌ నుంచి వచ్చే నీటి సరఫరాను నిలిపివేశారు. దిల్లీకి అవసరమయ్యే నీటిలో దాదాపు 60 శాతం నీరు ఈ మునక్‌ కాలువ నుంచి లభిస్తుంది.   మిగతా నీరు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎగువగంగ కాలువ నుంచి లభిస్తుంది. దిల్లీకి రోజువారీ అవసరమయ్యే వందలకొద్దీ గ్యాలన్ల నీటిలో కేవలం 15 శాతం మాత్రమే దిల్లీలో దొరుకుతుంది. మరోపక్క పెరిగిపోతున్న జనాభా కారణంగా, తరిగిపోతున్న భూగర్భ జలాల కారణంగా... అక్కడి పౌరులంతా కూడా ప్రభుత్వం అందించే నీటి మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. నీటి విషయంలో దిల్లీకి తనకంటూ స్వయం ప్రతిపత్తి లేకపోవడంతో, రాబోయే రోజులలో నీటి పరిస్థితి మరీ దారుణంగా ఉండే ప్రమాదం కనిపిస్తోంది.

రాహుల్‌, కేజ్రీవాల్, ఏచూరిల మీద దేశద్రోహం కేసు!

జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి, అక్కడి విద్యార్థులకు మద్దతు పలికిన రాజకీయ నాయకుల మీద తెలంగాణలో దశద్రోహం కేసు నమోదైంది. జేఎన్‌యూకి సంబంధించిన కన్నయా కుమార్‌ దేశద్రోహం కేసు కింద విచారణను ఎదుర్కొంటుండగా, ఆయనకి మద్దతు పలకడం కూడా దేశద్రోహం కిందకే వస్తుందన్నది ఫిర్యాదుదారుని వాదన. హైదరాబాదుకి చెందిన జనార్ధన్‌ గౌడ్ అనే న్యాయవాది, సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్లో ఈ కేసుని ధాఖలు చేశారు. ఈ సందర్భంగా రూపొందించిన ఎఫ్‌.ఐ.ఆర్‌లో రాహు్‌ల్‌గాంధితో పాటు జేఎన్‌యూకి వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు ఆనంద్‌శర్మ, అజయ్‌మాకెన్లని కూడా చేర్చారు. రంగారెడ్డి జిల్లా కోర్టుకు చేరనున్న ఈ కేసులో న్యాయస్థానం ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి!

అంతరిక్షం నుంచి భారతదేశం భలే ఉంటుంది- సునీతా విలియమ్స్‌

  అదివరకెప్పుడో భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన రాకేష్ శర్మను ఇందిరాగాంధి ఒక ప్రశ్న అడిగారు.... అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది అని. దానికి రాకేష్‌ ‘సారే జహా సే అచ్ఛా’ అంటూ బదులిచ్చారు. భారతీయ మూలాలు కలిగిన వ్యోమగామి సునీతా విలియమ్స్ కూడా ఇప్పుడు అదే మాట అంటున్నారు. ఒక వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో సునీతా ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. వాటిలో కొన్ని...   - గురుత్వాకర్షణ శక్తి లేని అంతరిక్షంలో సమయాన్ని గడపడం కొంత కష్టమే కానీ అసాధ్యం కాదు. మనం అక్కడ ఉండే సమయం చాలా తక్కువ కాబట్టి శరీరం ఏమీ అతలాకుతలం అయిపోదు.   - రోదసీలో ఉన్నప్పుడు తప్పకుండా ఇంటి భోజనాన్ని మిస్‌ అవుతాను. కానీ తప్పదు కదా! అక్కడ మాకు ఎలాంటి ఆహారం అందుబాటులో ఉంటే దాంతో సరిపెట్టుకోక తప్పదు!   - ఇంటిని వదిలి ఆకాశంలోకి అంతెత్తున ఎగిరిపోవడమంటే కాస్త బాధగానే ఉంటుంది. పైగా రోదసీ ప్రయాణం అనేది అనేక సవాళ్లతో కూడుకున్నది. కాబట్టి.... వాటన్నింటినీ తట్టకునేంత మానసిక దృఢత్వం ఒక వ్యోమగామికి ఉండాలి.   - స్పేష్ మిషన్లలో అనేక రకాల మనుషులు, దేశదేశాల పౌరులు ఎదురుపడుతూ ఉంటారు. వ్యక్తిగతంగా ఒకరికొకరు ఎంత భిన్నంగా ఉన్నా ఒక జట్టుగా పనిచేస్తుంటాం.   - వ్యోమగాములే కాకుండా సామాన్య యాత్రికులు కూడా అంతరిక్షంలోకి ప్రయాణాలు చేసే అవకాశాలు వస్తున్నాయి. ఇది సంతోషించదగ్గ పరిణామమే!   - భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకి అంతరిక్షయానాలు ఆర్ధికంగా భారమయ్యే మాట వాస్తవమే! కానీ ఇది భవిష్యత్తు కోసం, విజ్ఞానం కోసం మనం పెడుతున్న పెట్టుబడిలాంటిది.   - అంతరిక్షం నుంచి చూసినప్పుడు భారతదేశం, సిగలో హిమాలయాలతో ఒక అద్భుతమైన నగలాగా కనిపిస్తుంది. హిమాలయాలను చూసినప్పుడు భూమి కేవలం ఒక గ్రహం కాదనీ, ఒక సజీవమైన పదార్థం అనీ అనిపిస్తుంది.

తిరుపతిలో మళ్లీ వేయి కాళ్ల మండపం!

  తిరుపతిలోని వేయి కాళ్ల మండపాన్ని పునర్నింమించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం టెండర్లను ఆహ్వానించింది. తిరుమల మాడవీధులను వెడల్పు చేసేందుకుగాను, శ్రీవారి ఆలయం వెలుపల ఉండే అతిపురాతనమైన ఈ వేయి కాళ్ల మండపాన్ని ఒకప్పుడు కూల్చివేసిన సంగతి తెలిసిందే. వేయి కాళ్ల మండపాన్ని కూల్చివేసినందుకు రాజకీయ, ఆధ్మాత్మిక వర్గాల నుంచి తితిదే అనేక విమర్శలను ఎదుర్కొంది.   అయితే ఆ కట్టడాన్ని తిరిగి నిర్మిస్తామని తితిదే చెబుతూ వచ్చింది. తన హామీకి అనుగుణంగా ఇప్పుడు దేవస్థానం, వేయి కాళ్లని పునర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది. శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఉన్న నారాయణ ఉద్యానవనంలో ఈ వేయికాళ్ల మండపాన్ని నిర్మించనున్నారు. ఇందుకోసం 18 కోట్ల రూపాయలు ఖర్చవుతుందనీ, పాత స్తంభాలలో వీలైనన్ని స్తంభాలను వీటిలో వాడనున్నామనీ, మండపం మధ్యలో కనీసం 3,000 కూర్చునేందుకు వీలుగా విశాలంగా దీన్ని నిర్మించనున్నామనీ... తితిదే అధికారులు చెబుతున్నారు. ఈ నిర్మాణం కనుక పూర్తయితే నారాయణ ఉద్యానవనం తిరుమలలోని మరో గొప్ప పర్యాటక స్థలంగా మారిపోతుందనడంలో సందేహం లేదు!

కర్ణాటక ముఖ్యమంత్రి మెడకి, గడియారం గొడవ

  కర్ణాటకలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష జనతాదళ్‌ పార్టీలు, ఖరీదైన వాచీల గురించి గొడవ పడుతున్న విషయం తెలిసిందే! పేదల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి సిద్దరామయ్య 70 లక్షలు ఖరీదు చేసే వాచీని ధరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించగా, అలాంటిది ఏమీ లేదంటూ ఇప్పటిదాకా సిద్దరామయ్య కొట్టపారేశారు. పైగా మీరే కోట్లకి కోట్లు ఖరీదు చేసే వాచీలను పెట్టుకుని తిరుగుతున్నారంటూ జనతాదళ్‌ నేత కుమారస్వామిని తిట్టిపోశారు. ఈ వివాదం ముదరడంతో ఎట్టకేలకు సిద్దరామయ్య నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు.   ఆ వాచీని దుబాయిలో కార్డియాలజిస్టుగా పేరుగాంచిన గిరీష్‌ చంద్ర వర్మ అనే మిత్రుడు తనకు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ వాచీ ఖరీదైన మాట నిజమేననీ, త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను ఆదాయపన్ను శాఖకు సమర్పిస్తాననీ చెప్పుకొచ్చారు. ఇక మీదట తాన ఆ వాచీ ధరించబోననీ, వెంటనే దాన్ని ప్రభుత్వానికి బహుమతిగా అందచేస్తాననీ అన్నారు. అయితే ఈ ప్రకటనతో ప్రతిపక్షాల మాటం నిజం కావడమే కాకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని మోసపుచ్చినందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వాచీ సిద్దరామయ్య చేతికి కాకుండా మెడకి చుట్టుకున్నట్లే కనిపిస్తోంది.

అబ్దుల్‌ కలాం స్ఫూర్తితో రాజకీయ పార్టీ!

  భారతదేశ అణుసామర్థ్యాన్నీ, అంతరిక్ష ప్రతిభనీ విశ్వవ్యాప్తం చేసిన అబ్దుల్‌ కలామ్‌ను ఎవరు మర్చిపోగలరు. కేవలం ఒక శాస్త్రవేత్తగానే కాకుండా, భావిపౌరులకు ఆదర్శంగా నిలిచిన అబ్దుల్‌ కలామ్ ఆదర్శాల స్ఫూర్తితో ఒక రాజకీయ పార్టీ వచ్చే అవకాశం ఉందంటున్నాయి తమిళనాట వర్గాలు. అందుకోసం అబ్దుల్ కలాంకు సలహాదారుగా పనిచేసిన, ఆయనతో కలిసి పుస్తకాలను సైతం వెలువరించిన పొన్‌రాజ్‌ మీద ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. అందుకోసం నిన్న తమిళనాట వందలాది విద్యార్థులు పొన్‌రాజ్‌ ఇంటిని చేరుకున్నారు. ప్రస్తుత రాజకీయాలతో తాము విసిగిపోయామనీ, సమాజంలో ఎటు చూసినా అవినీతే కనిపిస్తోందనీ సదరు విద్యార్థులు పేర్కొన్నారు. అబ్దుల్‌ కలామ్‌ చూపిన ఆదర్శంతో ఒక రాజకీయ పార్టీని స్థాపించమంటూ వారంతా పొన్‌రాజ్‌ను వేడుకొన్నారు. ఈ విషయం గురించి తన కుటుంబంతో చర్చించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు పొన్‌రాజ్‌ ప్రకటించారు. అదే కనుక నిజమైతే రాజకీయాలలో ఒక కొత్త ఒరవడిని ఆశించవచ్చునేమో!

హనుమంతప్ప కూతురు... సైన్యంలో!

  సియాచిన్‌లో ప్రకృతితో పోరాడి, అలసిసొలసి మరణించిన లాన్స్‌ నాయక్‌ హనుమంతప్పను ఎవరు మర్చిపోగలరు. హిమపాతంలో కూరుకుపోయినా కూడా ఆరురోజుల పాటు ప్రాణాలను నిలుపుకున్నారు హనుమంతప్ప. చనిపోయేనాటికి హనుమంతప్పకు ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను ఎలాగైనా గొప్ప సైనికురాలిగా తీర్చిదిద్దుతానంటున్నారు హనుమంతప్ప భార్య మహాదేవి. ఇవాళ మహారాష్ట్రలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో పాల్గొంటూ తనకు ఆడపిల్ల పుట్టిందని ఏనాడూ బాధపడలేదనీ, తన భర్తలాగా, కూతురిని కూడా ధైర్యంకల సైనికురాలిగా తీర్చదిద్దడమే తన లక్ష్యమనీ పేర్కొన్నారు. జేఎన్‌యూలో జరుగుతున్న వివాదం గురించి కూడా మహాదేవి స్పందించారు. భారతదశం మనకు నిలువనీడను ఇచ్చిందనీ, ఆ అవకాశాన్ని దుర్వినియోగం చసుకోవద్దంటూ హితవు పలికారు. దేశం కోసం ప్రాణాలను అర్పించేందుకు సిద్ధంగా ఉండాలే కానీ, జాతి వ్యతిరేకులుగా మారవద్దంటూ ఆమె యువతకు విజ్ఞప్తి చేశారు.

రైల్వే మంత్రి- దుప్పట్లను ఎన్నాళ్లకి ఉతుకుతామంటే...

  రైల్వేలలో ప్రయాణించేటప్పుడు ఏసీ కోచ్‌లలో ప్రయాణం సాగించడం ఓ దర్జా! కానీ ఇవాళ రైల్వే శాఖ సహాయ మంత్రి గారు చెప్పిన ఓ మాట వింటే ఆ దర్జా కాస్తా బిత్తరపోక తప్పదు. రాజ్యసభలో ఇవాళ అడిగిన ఒక ప్రశ్నకు బదులు ఇస్తూ రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్‌ సిన్హా, ప్రయాణికులు కప్పుకునే దుప్పట్లను రెండు నెలలకి ఓసారి ఉతుకుతామని సెలవిచ్చారు. దిండుగలీబులు, సీటు మీద పరుచుకునే దుప్పట్లు రోజూ ఉతికినప్పటికీ... కప్పుకునేందుకు వాడే మందపాటి దుప్పట్లను మాత్రం రెండు నెలలకి ఓసారి ఉతుకుతామన్నది మంత్రిగారి మాట.   ప్రస్తుతానికి ఈ దుప్పట్లన్నింటినీ తరచూ ఉతికేందుకు తగినన్ని లాండ్రీలు లేవనీ, త్వరలోనే లాండ్రీల సంఖ్యను పెంచి దుప్పట్లను రోజూ ఉతికేందుకు ప్రయత్నిస్తామనీ చెప్పారు. మంత్రిగారి సమాధానానికి రాజ్యసభ అధ్యక్షుడు హమీద్‌ అన్సారీ కూడా బిత్తరపోయారు. ‘దీనికంటే ప్రయాణికులు ఎవరికి వారే తమ దుప్పట్లను తెచ్చుకోవడం’ మంచిదంటూ అన్సారీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బహుశా ఇకమీదట ఏసీలో ప్రయాణం చేయాలంటే ముక్కుమూసుకుని పడుకోవాలేమో!

మహిషాసురుడి ఉత్సవంలో... బీజేపీ ఎంపీ!

  జేఎన్‌యూ క్యాంపస్‌లో దసరాకి బదులుగా మహిషాసురుడికి ఉత్సవాలని నిర్వహించడం గురించి పార్లమెంటులో స్మృతీ ఇరానీ విమర్శించిన విషయం తెలిసిందే! ఇందుకు సాక్ష్యంగా ఆమె ఆ ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను కూడా చదివి వినిపించారు. బీజేపీ పార్టీ యావత్తూ ఈ విషయంలో స్మృతీకి మద్దతు పలికారు. అయితే అలాంటి ఒక సందర్భంలో ఇప్పటి బీజేపీ ఎంపీ ఒకరు ఆ ఉత్సవంలో స్వయంగా పాలుపంచుకున్నారన్న విషయం వివాదాస్పదంగా మారుతోంది.   దిల్లీకి చెందిన ఉదిత్‌ రాజ్ అనే పార్లెమంటు సభ్యుడు 2013లో జరిగిన మహిషాసురుని మహోత్సవానికి అతిథిగా నిలిచారట. అయితే ఉదిత్‌ రాజ్‌ ఈ విషయాన్ని కొట్టి పారేస్తున్నారు. తాను ఏటా వందలాది ఉత్సవాలలో పాల్గొంటూ ఉంటాననీ, 2013లో తాను బీజేపీలోనే లేననీ చెప్పుకొచ్చారు. పైగా మనుషులన్నాక వేర్వేరు సమయాలలో వేర్వేరు అభిప్రాయాలు కలిగి ఉంటారనీ, తాను ఇప్పుడు మారిపోయాననీ చెప్పుకొచ్చారు. ఉదిత్‌ ఎన్ని సంజాయిషీలు ఇచ్చుకున్నా, కాంగ్రెస్‌కు ఇప్పుడు ఓ బలమైన ఆయుధం దొరికినట్లే కనిపిస్తోంది.  

మళ్లీ జైలుకి సంజయ్‌దత్‌?

అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్న కేసులో సంజయ్‌దత్‌ను నిన్న ఎరవాడ జైలు నుంచి విడుదల చేసిన విషయం తెలిసిందే! సంజయ్‌దత్‌ కారాగారంలో ఉన్నప్పుడు ‘సత్ప్రవర్తన’తో మెలగడంతో ఆయనను ఎనిమిది నెలల ముందుగానే విడుదల చేసింది ప్రభుత్వం. అయితే ఈ విషయమై తీవ్ర నిరసనలు చెలరేగుతున్నాయి. సంజయ్‌దత్‌కు మొదటి నుంచీ కూడా ఇతర ఖైదీలకు లభించని వెసులుబాట్లను అందచేశారనీ, జైల్లో ఆయనను అపురూపంగా చూసుకున్నారనీ ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా సంజూబాబు ఇష్టం వచ్చినట్లు పెరోల్‌ మీద వచ్చి వెళ్లేవాడని కూడా అంటారు. ఇప్పుడు ఆయనను త్వరగా విడుదల చేయడం గురించి కూడా వివాదం రాజుకుంటోంది. ప్రదీప్‌ భలేకర్‌ అనే సామాజిక కార్యకర్త దీని గురించి ముంబై హైకోర్టులో ఒక కేసుని దాఖలు చేశాడు. సంజయ్‌దత్‌ విషయంలో ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించిందనీ, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన తన శిక్షను పూర్తిచేసుకునేలా తిరిగి జైలుకి పంపించమనీ ఈ ఫిర్యాదులోని సారాంశం! ఈ కేసులో కోర్టు కనుక ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తే, మిగిలిపోయిన ఎనిమిది నెలల కాలాన్నీ జైళ్లో గడిపేందుకు సంజయ్ తిరిగి ఎరవాడకి బయల్దేరక తప్పదేమో!

జయలలిత బొమ్మ చింపిన విజయ్‌కాంత్‌- కోర్టులో సరెండర్‌!

తమిళనాట లొంగుపాట్లు పర్వం సాగుతున్నట్లు ఉంది. బూతు పాటకి సంబంధించి పోలీసుల ముందు తమిళ నటుడు శింబు మొన్నీమధ్యనే అక్కడి పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే! ఈలోగా మరో సీనియర్‌ తమిళ నటుడు, డిఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌ కూడా నిన్న ఓ కోర్టు ముందు లొంగిపోవలసి వచ్చింది. గత ఏడాది డిసెంబరులో చెలరేగిన ఓ గొడవకి సంబంధించి విజయ్‌కాంత్‌ న్యాయమూర్తి ముందు నిల్చోవలసి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే... విజయ్‌కాంత్‌ తన పార్టీ శ్రేణులతో కలిసి డిసెంబరు 28న తంజావూరులో ఏదో ఆందోళన చేస్తున్నారు. ఇంతలో వారికి జయలలిత బొమ్మ ఉన్న ఓ హోర్డింగు కనిపించింది. అంతే తమ ఆవేశాన్నంతా ఆ హోర్డింగ్ మీద చూపించారు. దాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. మరి ఇంత జరుగుతుంటే అమ్మ అభిమానులు ఊరుకుంటారా. సాక్షాత్తూ తంజావూరు ఎమ్మెల్యే రెంగసామి రంగంలోకి దిగి విజయ్‌కాంత్‌ మీద కేసు పెట్టారు. ఆ కేసు విషయమై విజయ్‌కాంత్‌ ఇప్పుడు లొంగిపోయారు. జయలలితా! మజాకా!

వారి మాటల్లో నిజం ఉంది- మోదీ!

  పార్లమెంటు ఉభయసభల్లోనూ తన సహచరులు చేసిన ఉద్వేగపూరిత ప్రసంగాలక మోదీ పులకరించిపోయినట్లున్నారు. ఇంతకు ముందే స్మృతి ఇరానీ ప్రసంగాన్ని జోడిస్తూ ఆయన సత్యమేవ జయతే అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే! తాజాగా అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, భూపేంద్ర యాదవ్‌, అనురాగ్‌ ఠాకూర్‌ ప్రసంగాలను ఉట్టంకిస్తూ ‘వారి మాటలన్నీ విచక్షణతో కూడుకున్నవనీ, అవన్నీ అక్షర సత్యాలనీ’ ప్రశంసించారు మోదీ! మోదీ పేర్కొన్న సహచరులంతా గురువారం పార్లమెంటులో తన వాక్పటిమను చూపినవారే. వారి మాటల్లోని మెరుపు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది కూడా! ఉదాహరణకు భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ జేఎన్‌యూ విద్యార్థుల ప్రసంగాలు ‘భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, ఇండియా నుంచి స్వేచ్ఛను పొందాలన్న భావ ప్రకటన’ అంటూ విమర్శించారు. మరి ఇలాంటి మెరుపులకు మోదీ మురిసిపోకుండా ఎలా ఉంటారు!

మోదీ పెట్టిన పేరు... వారికి నచ్చట్లేదు!

శారీరిక వైకల్యం ఉన్నవారిని వికలాంగులు అని పిలవడం అవమానమన్నది మన ప్రధానమంత్రి మోదీ అభిప్రాయం. అందుకే ఆయన ఆలోచించి ఆలోచించి వారికి ‘దివ్యాంగ్‌’ అన్న పేరుని సూచించారు. వికలాంగులను ఇక నుంచి దివ్యాంగులని పిలవాలంటూ పలు సందర్భాలలో చెప్పారు కూడా. ఆయన సూచన మేరకు మోదీ సహచరులు కూడా దివ్యాంగ్‌ అన్న పేరుని అధికారికంగా వాడటం మొదలుపెట్టారు. నిన్న ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో కూడా వికలాంగులకు అందించే సదుపాయాల గురించి చర్చిస్తూ వారిని దివ్యాంగులుగానే పేర్కొన్నారు. రైల్వే బడ్జట్‌తో ఈ మాట దేశం మొత్తానికీ పరిచయం అయిపోయింది. అయితే తమని ఇలా పిలవడాన్ని వికలాంగులు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దివ్యాంగ్ అంటే అధ్బుతమైన శరీరభాగం అన్న అర్థం వస్తోందనీ, లేని శరీర భాగాన్ని అద్భుతం అనుకోవడం తమని అవమానించినట్లే అనీ విమర్శలు వినిపిస్తున్నాయి. ‘దివ్యంగ్‌ అని పిలుచుకోవడానికి అదేమీ దేవుడిచ్చిన వరం కాదని’ అని తమిళనాడుకి చెందిన ఝాన్సీ రాణి అనే సామాజిక కార్యకర్త మండిపడుతున్నారు.

కార్డు చెల్లింపులు ఇప్పుడు కారుచౌక

  ఇప్పటివరకూ డెబిట్‌/క్రెడిట్‌/ఆన్‌లైన్‌/మొబైల్‌ల ద్వారా చెల్లింపులు జరిపితే సర్‌ఛార్జీ, సర్వీస్‌ ఛార్జీ అంటూ జేబులకి చిల్లుపడిపోయేది. అందుకే ప్రజలు ఎక్కువగా నగదు ద్వారానే చెల్లింపులు జరపడానికి మొగ్గు చూపుతున్నారు. నగదులో చెల్లింపులు చేయడం కష్టమే కాదు భద్రత కూడా తక్కువే. పైగా ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి రావు. అందుకే డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇకపై వాటి మీద సర్‌ఛార్జీ, సేవారుసుమూ రద్దు చేయాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం త్వరలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి డిజిటల్‌ చెల్లింపుల ద్వారా లావాదేవీలు సులువుగా మారడమే కాకుండా, పన్నుఎగవేతలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది.   అంతేకాదు! మున్ముందు ఒక స్థాయిని మించిన చెల్లింపులని కేవలం డిజిటల్‌ ద్వారానే అనుమతించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆన్‌లైన్లలో చెల్లింపులు జరిపేవారికి అందులో మోసం జరుగుతుందేమో లేకపోతే డబ్బు ఎక్కడన్నా ఇరుక్కుపోతుందేమో అన్న భయాలు ఉండేవి. చాలామంది ఖాతాదారులు ఈ భయంతోనే ఆన్‌లైన్ చెల్లింపులకు వెనుకాడుతూ ఉంటారు. ఇకపై అలాంటి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు కూడా ప్రభుత్వం తగిన వ్యవస్థకు రూపకల్పన చేయనున్నట్ల సమాచారం.

చనిపోయిన పోలీసుకి బదిలీ

  అమిత్‌ కుమార్‌ సింగ్‌! దిల్లీ పోలీసు శాఖలో అసిస్టెంట్‌ పోలీస్ కమీషనర్‌. 30 ఏళ్ల అమిత్ మూడునెలల క్రితం ఏదో బాధలో తనని తాను కాల్చుకుని చనిపోయాడు. అతను చనిపోయిన కొద్దిసేపటికి అమిత్ భార్య కూడా తమ అపార్టుమెంటు మీద నుంచి కిందకి దూకి చనిపోయింది. ఈ భార్యాభర్తల ఆత్మహత్య దిల్లీలోనే పెనుసంచలనం సృష్టించింది. అయితే ప్రభుత్వ హోంశాఖ చేసిన పనికి అమిత్ మరోసారి వార్తల్లో నిలిచాడు. అతడిని లక్షద్వీప్‌కు బదిలీ చేస్తూ ఈ వారం బదిలీ ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. పైగా ఒకవేళ సమయానికి డ్యూటీలో చేరకపోతే, క్రమశిక్షణ చర్యలను తీసుకోవలసి వస్తుందంటూ హెచ్చరికలను కూడా జోడించింది. ఇదేం పనంటూ హోంశాఖ అధికారులను సంప్రదించగా తమ ఉద్యోగుల చావు పుట్టుకల గురించి చూసుకునే విభాగం వేరు, బదిలీల గురించి చూసే విభాగం వేరు అంటూ జారుకున్నారు అధికారులు.

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి.. ఆఖరికి దక్కింది ఇవి..

  రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్ ప్రవేశ పెట్టారు. అయితే ఈసారి కూడా కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు నిరాశే మిగిల్చినట్టు కనిపిస్తోంది. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన ప్రజలకు కేంద్రం మొండిచేయి చూపించింది. రైళ్లలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాల గురించి పెద్ద ఎత్తునే ప్రణాళికలు సిద్దం చేసినా.. కొత్తం రైళ్ల గురించి కాని.. కొత్త రైల్వే లైన్ల గురించి.. పాత ప్రాజెక్టులకు నిధుల మంజూరు వంటికేంద్రం మచ్చుకైనా ప్రస్తావించలేదు.   అంతేకాదు ఈసారి టెక్నాలజీకి పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. విభజన నేపథ్యంలో కేంద్రం ఇచ్చిన హామీని కూడా మరిచిపోయింది. ఈ బడ్జెట్ లోనూ విశాఖ రైల్వే జోన్ ను కేంద్రం పట్టించుకోలేదు. యాదాద్రి వరకూ ఎంఎంటీఎస్ పొడిగింపునకూ.. కాజీపేటలో రైల్వే కోచ్ల విషయంలోనూ కేంద్రం మొండిచేయి చూపించినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఏపీ తెలంగాణలకు దక్కింది ఇవే..   * విజయవాడ - ఖరగ్‌పూర్ మధ్య సరకు రవాణా మార్గం * నాగపూర్-విజయవాడ ట్రేడ్ కారిడార్ - * ఆధ్యాత్మిక స్టేషన్ల అభివృద్ధి, సుందరీకరణకు కొత్త పథకం. ఈ పథకంలో మొదటి దశలోనే తిరుపతికి చోటు. * తెలంగాణ ప్రభుత్వం సహకారంతో హైదరాబాద్ సబర్బన్ నెట్ వర్క్ విస్తృతికి చర్యలు వంటివి బడ్జెట్‌లో కనిపించాయి. * రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు రైల్వే లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. * కోటిపల్లి - నర్సాపురం లైనుకు రూ.200 కోట్ల నిధులు. * పిఠాపురం - కాకినాడ లైనుకు రూ.50 కోట్లు కేటాయింపు. * కాజీపేట - విజయవాడ మూడో లైనుకు రూ.114 కోట్లు. * పెద్దపల్లి - నిజామాబాద్ లైన్‌కు రూ.70 కోట్లు. * మాచర్ల - నల్గొండ లైన్‌కు రూ.20 కోట్లు. * మునిరాబాద్ - మహబూబ్ నగర్ లైన్‌కు రూ.180 కోట్లు. * కాజీపేట - వరంగల్ మధ్య ఆర్వోబి నిర్మాణానికి రూ.5 కోట్లు. * సికింద్రాబాద్ - మహబూబ్ నగర్ మధ్య డబ్లింగ్ పనులకు రూ.80 కోట్లు. * పెద్దపల్లి - జగిత్యాల మధ్య సబ్ వే నిర్మాణానికి రూ.5 కోట్లు * రాఘవాపురం - మందమర్రి లైన్‌కు రూ.15 కోట్లు

చప్ప చప్పగా సాగిన బడ్జట్‌!

  2015-16కి సంబంధించిన రైల్వే బడ్జట్‌ నుంచి పెద్దగా ఏమీ ఆశించవద్దంటూ సురేష్‌ ప్రభు ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ బడ్జట్‌ అంచనాలను మించి నిరాశపరిచిందంటూ అన్ని ప్రతిపక్షాలూ విరుచుకుపడుతున్నాయి. అటు నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు కానీ ఇటు అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న తెలంగాణకు కానీ బడ్జెట్ పెద్దగా ఏవీ వరాలను అందించలేదు. విజయవాడ- నాగ్‌పూర్‌ ట్రేడ్‌కారిడార్, తెలంగాణ సర్కారుతో కలిసి ఎంఎంటీఎస్ అభివృద్ది వంటి మెరుపులు మినహా బడ్జెట్‌ అంతా చప్పగా సాగిపోయింది.   ప్రయాణికులకు ఎఫ్‌.ఎం రేడియోలో సంగీతాన్ని వినిపిస్తాం, యువతకు వై-ఫై సౌకర్యాన్ని కల్పిస్తాం అంటూ రైల్వే మంత్రి చేసిన ప్రకటనలు చెప్పుకోదగిన పరిణామాలేం కాదు. ఇక సమయపాలను మెరుగుపరుస్తాం, పరిశుభ్రతను నెలకొల్పుతాం అంటూ మంత్రిగారు చెప్పినప్పటికీ అదేమీ అంత తేలికైన వ్యవహారం కాదని ప్రయాణికులకు అనుభవమే! పిల్లలకు వేడి పాలు అందిస్తాం, కావల్సిన భోజనాన్ని తినిపిస్తాం అంటూ మంత్రిగారు నోరూరించినా మన రైల్వే క్యాటరింగ్ వ్యవస్థని చూసినవారు అవెంత నాణ్యతగా ఉంటాయో ఊహించగలరు. వెరసి ఇప్పటికిప్పుడు ప్రయాణికులకు నిజంగా ఉపయోగపడే కార్యక్రమం ఏదీ బడ్జెట్‌లో లేకపోయింది. దాంతో తెలుగుదేశం వంటి మిత్రపక్షాలు సైతం బడ్జెట్‌ని చూసి పెదవి విరుస్తున్నాయి. ఈ బడ్జెట్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టకుని రూపకల్పన చేసింది అనుకుని ఎవరికి వారు ఓదార్చుకోవడమే మిగిలింది!

ఇక నుంచి గూడ్స్‌ రైళ్లకు కూడా టైం టేబుల్‌!

  2015-16కి సంబంధించిన రైల్వే బడ్జట్‌ను సురేష్‌ప్రభు ప్రస్తుతం పార్లమెంటు ముందు ఉంచుతున్నారు. అంతా ఊహించిన విధంగానే కొత్త ప్రాజక్టులను కోకొల్లలుగా చేపట్టే బదులు రైల్వేలను పునర్‌వ్యవస్థీకరించేందుకే తాను అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సురేష్‌ ప్రభు తెలియచేశారు.   - వచ్చే సంవత్సరం నాటికి 2,800 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్‌లను పూర్తిచేయనున్నట్లు మంత్రి తెలిపారు.   - 2,000 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్‌లను విద్యుతీకరించనున్నట్లు పేర్కొన్నారు.   - 2020నాటికి కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లు అన్నింటినీ కూడా తొలగించనున్నట్లు బడ్జెట్ సమాచారం.   - 2020నాటికే గూడ్స్ రైళ్లకు కూడా టైంటేబుళ్లను రూపొందిస్తామని మంత్రి తెలియచేశారు.