నువ్వు గెలుస్తానంటే, నే వద్దంటానా- బెంగాల్ కాంగ్రెస్!
ఎన్నికల నగారా ఇలా మోగిందో లేదో, బెంగాల్లో అలా ఎన్నికల చిత్రాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఏప్రిల్ 4 నుంచి మే 5 వరకూ ఆరేడు దఫాలుగా సాగనున్న ఈ ఎన్నికల పోరు ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, వామపక్షకూటములకు మధ్యే సాగనుంది. ఈ పోరులో తలదూరిస్తే మొదటికే మోసం వస్తుందనుకున్నాయో ఏమో కాంగ్రెస్, భాజపా రెండూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. వామపక్ష కూటమి పోటీ చేసే స్థానాలలో, తాము అభ్యర్థులను నిలపబోమని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఎలాంటి పొత్తూ, ఉమ్మడి మ్యానిఫెస్టో లేకుండానే కాంగ్రెస్ ఇలా పరోక్ష సాయానికి పాల్పడటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.
మరోవైపు భాజపా కూడా ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ విజయాలను దెబ్బతీయకుండా ఉండేందుకు, తన దూకుడుని తగ్గించుకోనున్నట్లు సమాచారం. మోదీ రెండోసారి కూడా ప్రధాని కావాలంటే తృణమూల్, అన్నాడీఎంకేల సాయం అవసరం కాబట్టి.... తమిళనాడు, పశ్చిమబెంగాల్లోని అసెంబ్లీ ఎన్నికలను భాజపా కాస్త చూసీచూడనట్లు పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. తమ బలం అంతంత మాత్రంగానే ఉన్న ఈ రాష్ట్రాలలో హడావుడి చేయబోతే, పెద్దగా లాభం రాకపోగా ఓట్లు చీలిపోయి ప్రతిపక్షాలు సంబరపడే పరిస్థితులు వస్తాయని భాజపా ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం.