పిఎ సంగ్మా మృతి- సోనియాను ఎదిరించిన కాంగ్రెస్ నేత!

  మాజీ లోక్‌సభ స్పీకర్‌ పిఎ సంగ్మా, ఇవాళ దిల్లీలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న సంగ్మా 68 ఏళ్ల వయసులో తుదిశ్వాసను విడిచారు. మేఘాలయకు చెందిన సంగ్మా ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా ఎనిమిది దఫాలుగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన తుర అనే నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఎదిగిన అత్యంత ప్రతిభావంతమైన నాయకులలో ఒకరిగా సంగ్మాను ఎంచుతారు. సంగ్మా మొదటి నుంచీ కూడా కాంగ్రెస్‌కు వీరవిధేయునిగా ఉండేవారు. ఆ పార్టీ తరఫున కొద్దికాలం మేఘాలయ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. కానీ విదేశీ వనిత అయిన సోనియా గాంధి నాయకత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం మొదలుపెట్టారు.   దీంతో సంగ్మాను, శరద్ పవార్‌, తారిఖ్‌ అన్వర్‌లతో పాటుగా కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన ఈ ముగ్గురు నేతలూ ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ’ పేరుతో ఒక కొత్త పార్టీని స్థాపించి విజయవంతంగా నడిపించారు. అయితే శరద్‌ పవార్‌ తిరిగి సోనియాకు దగ్గరవడాన్ని సంగ్మా తరచూ వ్యతిరేకించేవారు. 2012లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొనగా, ఆయనకు పోటీగా సంగ్మా బరిలోకి దిగారు. పోటీకి దిగాలన్న సంగ్మా నిర్ణయాన్ని పవార్‌ వ్యతిరేకించడంతో తను స్థాపించిన పార్టీకే రాజినామా చేసేందుకు వెనుకాడలేదు సంగ్మా! 2013లో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ పేరుతో మరో పార్టీని స్థాపించిన సంగ్మా ఆ పార్టీ బలాన్ని పుంజుకునే సమయంలోనే కన్నుమూశారు.

మోదీ చెప్పిన పిట్టకథ!

మొన్నటికి మొన్న మోదీ ఎవరి మాటా వినడంలేదనీ, తన మనసుకి ఏది తోస్తే అలా ప్రవర్తించేస్తున్నారంటూ రాహుల్ గాంధి విరుచుకుపడిన విషయం తెలిసిందే! పాకిస్తాన్‌కు వెళ్లాలన్నా, కీలక ఒప్పందాలు చేసుకోవాలన్నా ప్రధానమంత్రి తన క్యాబినెట్‌ సహచరులను సైతం సంప్రదించడంలేదని రాహుల్‌గారు తీవ్రంగా విమర్శించారు. తాము ఎంతో కష్టపడి పాకిస్తాన్‌ను పంజరంలో బంధిస్తే మోదీ దాన్ని విడిపించేశారంటూ ఆక్షేపించారు. రాహుల్‌ ఆరోపణలన్నింటికీ మోదీ నిన్న తనదైన శైలిలో జవాబిచ్చారు.   అసలు విమర్శించే అవకాశం తాను ఇవ్వడం వల్లనే కదా, రాహుల్‌ అన్నేసి మాటలు అనగలిగేది అన్న అర్థం వచ్చేలా ఓ పిట్టి కథను చెప్పారు.... స్టాలిన్‌ మరణించిన తరువాత ఆ దేశ పాలనా బాధ్యతను చేపట్టిన నికితా కృశ్చేవ్‌ ఏ మూలకి వెళ్లినా స్టాలిన్‌ను విమర్శిస్తూనే ఉండేవారట! అలాంటి ఓ సందర్భంలో ఒక యువకుడు లేచి నిలబడి, ఇన్నాళ్లూ మీరు స్టాలిన్‌తో కలిసే పనిచేశారు కదా! అప్పుడు ఎందుకు ఈ విమర్శలు చేయలేదు? అని అడిగాడట. దానికి కృశ్చేవ్‌ బదులిస్తూ ‘స్టాలిన్ బతికుండగానే నేను విమర్శించాలనుకున్నాను. కానీ సాధ్యపడలేదు. నీకు మాత్రం నేను బతికుండగానే విమర్శించే అవకాశం ఉంది’ అని బదులిచ్చాడట కృశ్చేవ్‌. ప్రతిపక్షాలు తనని నిర్భయంగా ప్రశ్నించగలుగుతున్నాయనీ, కానీ కొందరిని మాత్రం ప్రశ్నించే ధైర్యం ఎవ్వరూ చేయలేరనీ కాంగ్రెస్‌ అధినాయకత్వానికి చురకలు అంటించారు.

మా దేశంలో తాలిబాన్లు హాయిగా ఉన్నారు- పాకిస్తాన్‌

  తమ దేశంలో తాలిబాన్‌ ముఖ్యనేతలంతా హాయిగా తలదాచుకుంటున్నారని, పాకిస్తాన్‌ విదేశీవ్యవహారాల సలహాదారు సర్తాజ్‌ అజీజ్ బయటపడిపోయారు. ఈ విషయం ఇప్పటివరకూ బహిరంగ రహస్యమే అయినప్పటికీ, స్వయంగా ఆ దేశ అధికారే దీన్ని వెల్లడించడంతో ప్రపంచం నివ్వెరపోయింది. దశాబ్దాల తరబడి ఆఫ్గనిస్తాన్‌లో మారణహోమాన్ని సృష్టించి, లక్షలాది ప్రజల జీవితాలను బలితీసుకున్న తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్‌లో మనుగడ సాగిస్తోందన్న విషయాన్ని సర్తాజ్‌ అజీజ్‌ నిర్మొహమాటంగా అంగీకరించారు.   పైగా తమ దేశంలో వారికి కావల్సిన సదుపాయాలన్నీ అమర్చడం వల్లే వారు తమ చెప్పుచేతల్లో ఉంటున్నారనీ, తద్వారా తాము ప్రపంచశాంతికి దోహదపడుతున్నామనీ సర్తాజ్ పేర్కొన్నారు. ఒకప్పుడు ఆఫ్గనిస్తాన్‌లో పాగావేసి ప్రపంచాన్ని వణికించిన తాలిబాన్‌, నిదానంగా మళ్లీ పడగ విప్పుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న ఆఫ్గనిస్తాన్లోని భారతీయ దైత్య కార్యలయం మీద తాలిబాన్‌ విధ్వంసానికి తెగబడింది. దీనిబట్టి ప్రపంచశాంతికి పాకిస్తాన్‌ ఏ మేరకు దోహదపడుతోందో అర్థమవుతూనే ఉంది. నిజానికి పాకిస్తాన్‌ తాలిబాన్లని అదుపు చేయడం లేదనీ, తన రాజకీయ అవసరాలకు అనుగుణంగా తిరిగి వారిని బలపరుస్తోందనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో నిజం ఎంతో తెలుసుకునేందుకు పెద్దగా పరిశోధన అవసరం లేదుకదా!

టీవీ ఛానళ్ల మీద కేజ్రీవాల్‌ కేసు

  దిల్లీలోని జేఎన్‌యూ వివాదాన్ని కేజ్రీవాల్‌ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదంలో ఆది నుంచీ విద్యార్థుల పక్షాన ఉన్న కేజ్రీవాల్‌, వారికి అనుకూలంగా మాట్లాడే ఏ సందర్భాన్నీ వదులుకోలేదు. పైగా ఈ వివాదంలో నిందితులైన కన్నయాకుమార్‌, ఉమర్‌ ఖాలిద్‌లు దోషులు కారు అని తేల్చి చెప్పేందుకు ఒక విచారణకు సైతం ఆదేశించింది. పనిలో పనిగా, ఈ వివాదానికి సంబంధించి ప్రచారంలో ఉన్న వీడియోలలో నిజానిజాలు కూడా తేల్చమని ఆదేశించింది. ఈ విచారణలో జేఎన్‌యూకి సంబంధించిన కొన్ని వీడియోలు కల్పితాలని తేలడంతో, కేజ్రీవాల్‌కు మంచి ఆయుధం దొరికినట్లైంది. ఈ వీడియోలలో తమకు కావల్సినట్లు మార్పులు చేసిన, లేక అలా మార్పు చేసిన వీడియోలను ప్రసారం చేసిన వార్తా ఛానళ్ల మీద తగన చర్యలు తీసుకోవాలని కేజ్రీవాల్‌ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా జీన్యూస్‌, టైమ్స్‌ నౌ వంటి వార్తా ఛానళ్ల మీద కేజ్రీవాల్‌ ప్రభుత్వం చర్యల తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజీవ్‌ హంతకుల విడుదలకు రంగం సిద్ధం!

  భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధిని హత్య చేసిన అభియోగంలో, జైలుశిక్షను అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను విడుదల చేసేందుకు, తమిళనాడు ప్రభుత్వం మరోసారి పావులు కదుపుతోంది. నిందితులంతా 20 సంవత్సరాలకు పైగా జైలు శిక్షను అనుభవిస్తున్నారనీ, వీరిని విడుదల చేసేందుకు అనుమతించమంటూ కేంద్ర ప్రభుత్వానికి ఈ మేరకు ఓ ఉత్తరం కూడా రాసింది. 2014లో తమిళనాడు ఇలాంటి ప్రయత్నమే చేయగా, సుప్రీం కోర్టు అడ్డుకోవడంతో అమ్మ పథకం బెడిసికొట్టింది. కాగా అతివాద తమిళుర మనసు గెల్చుకునేందుకు మరోసారి జయ ప్రభుత్వం సిద్ధపడినట్లు కనిపిస్తోంది.   తమిళనాడు విడుదల చేయాలనుకున్న ఏడుగురిలో నలుగురు శ్రీలంక తమిళురు కావడం గమనార్హం. వీరంతా 1991లో రాజీవ్‌ గాంధి హత్య జరిగిన కొద్ద రోజులకే అరెస్టు చేయబడి, అప్పటి నుంచి కూడా వివిధ జైళ్లలో గడుపుతున్నారు. నిందితులలో నళిని అనే మహిళా ఖైదీ, ఆమె భర్త మురుగన్‌ కూడా ఉన్నారు. వీరువురికీ మొదట ఉరిశిక్షను ఖరారు చేసినప్పటికీ 1999లో ఆ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్పుచేశారు. సాక్షాత్తూ మన దేశ మాజీ ప్రధాని హత్య కేసులో వీరు దోషులైనప్పటికీ, తమిళనాడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వీరిపట్ల సానుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది. త్వరలో ఎన్నికలు రానున్న సందర్భంలో తమిళుర మనసు గెల్చుకునేందుకు జయలలిత ఈ చర్యను చేపట్టి ఉండవచ్చని విమర్శకులు భావిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ కనుక అంగీకరిస్తే, ఆ పేరు జయలలితకు వస్తుంది. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం తిరస్కరిస్తే, చెడ్డపేరు కాస్తా కేంద్రానికే అంటుకుంటుంది. 

విజయ్‌ మాల్యా అరెస్టుకు రంగం సిద్ధం!

  సామాన్యుడు కడుపు చేత పట్టుకుని రుణం కోసం బ్యాంకుల ముందు నిల్చుంటే, సవాలక్ష ప్రశ్నలు వినిపిస్తాయి. లక్ష రూపాయల రుణం చేతికి వచ్చేసరికి చుక్కలు కనిపిస్తాయి. కానీ అదేంటోగానీ బడాబాబులకి ప్రభుత్వం బ్యాంకులు సైతం చాలా తేలికగా వందల కోట్ల రుణాలను అందచేస్తాయి. అప్పు వద్దనేదాకా వదలకుండా ఇస్తూనే ఉంటాయి. ఆపై ‘అప్పు చెల్లించడం నాకిష్టం లేదు’ అని నిర్మొహమాటంగా చెబితే, తలవంచుకుని సదరు అప్పుని, తిరిగిరాని రుణంగా నమోదు చేసుకుంటాయి. కానీ పరిస్థితులు నిదానంగా మారుతున్నాయి.   సాక్షాత్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నరు రఘురామ్‌ రాజన్ ఇలాంటి అప్పుల మీద ప్రత్యేక దృష్టి కనబరచడంతో, బ్యాంకులు మొండి బకాయిల మీద శ్రద్ధ పెట్టక తప్పడం లేదు. దీనికి తోడు నిన్న సీబీఐ డైరక్టరు అనిల్‌ సిన్హా సైతం ప్రభుత్వ బ్యాంకులకి తలంటు పోయడంతో బ్యాంకులలో చలనం వచ్చినట్లుంది. 17 భారతీయ ప్రభుత్వ బ్యాంకులకు 7,800 కోట్ల రూపాయలకు టోకరా పెట్టి, పెట్టేబేడా సర్దుకుని లండన్ వెళ్లిపోదామనుకుంటున్న విజయ్ మాల్యా మీద చర్య తీసుకునేందుకు బ్యాంకులు సిద్ధపడుతున్నాయి. విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును రద్దుచేసి, ఆయనను అరెస్టు చేయవలసిందిగా సదరు బ్యాంకులు బెంగళూరులోని ఓ ధర్మాసనం ముందు ఫిర్యాదు చేశాయి. ఆయన పదవీ విరమణ అవుతున్న సందర్భంగా లభిస్తున్న మొత్తం, తమకే అందచేయాలని సదరు బ్యాంకులు కోరుతున్నాయి.

మోదీగారు టీ కోసం వెళ్లకుండా ఉండాల్సింది- రాహుల్‌!

  ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధి ఎట్టకేళకు లోక్‌సభలో నోరువిప్పారు. నిన్న పార్లమెంటులో 40 నిమిషాల పాటు మాట్లాడిన రాహుల్‌గాంధి, నేరుగా మోదీని విమర్శించేందుకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. నల్లధనాన్ని వెలికితీస్తామన్న ప్రభుత్వం చివరికి నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చుకునేందుకు అవకాశం ఇచ్చిందనీ.... అది ఫెయిర్‌ అండ్‌ లవ్లీ పథకం అనీ ఎద్దేవా చేశారు. నాగా ఒప్పందం విషయంలో కానీ, పాకిస్తాన్‌ పర్యటన విషయంలో కానీ మోదీగారు ఎవ్వరినీ సంప్రదించలేదనీ, ఆయనకి ఏది తోస్తే అదే చేస్తారనీ విమర్శించారు.   తాము ఎన్నో ఏళ్లుగా కష్టపడి పాకిస్తాన్‌ను ప్రపంచం ముందర దోషిగా నిలబెడితే... మోదీ, నవాజ్‌ షరీఫ్‌తో టీ తాగేందుకు లాహోర్‌ వెళ్లి తమ కష్టాన్నంతా బూడిదపాలు చేశారని విమర్శించారు. అయితే పాకిస్తాన్‌ను దోషిగా నిలిపేందుకు తాము ఏం కష్టపడ్డారో, మోదీ పాకిస్తాన్‌కు వెళ్లడం వల్ల అది ఎలా వృథా అయ్యిందో రాహుల్‌ చెప్పలేదు! నిజానికి మోదీ ఆకస్మిక పర్యటనకు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంశలు లభించాయి. నాగా ఒప్పందం విషయంలో కూడా మోదీ తనను సంప్రదించినట్లు రాజనాథ్‌ సింగ్ పేర్కొన్నారు. మరి రాహుల్‌ ఏ ఉద్దేశంతో ఈ విమర్శలు చేశారో!

మతఘర్షణలకు దారితీసిన ఫేస్‌బుక్‌ పోస్టు!

  మహమ్మద్‌ ప్రవక్త మీద ఒక ఆకతాయి కుర్రవాడు ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు పశ్చిమబెంగాల్లో పెను వివాదాన్నే సృష్టించాయి. పశ్చిమబెంగాల్లోని బిర్భూమ్‌ జిల్లాకు చెందిన ఇల్లంబజారులోని ఒక వ్యక్తి, ప్రవక్తను కించపరిచే విధంగా ఫేస్‌బుక్‌లో పోస్టుని ఉంచాడు. దీంతో ఇల్లంబజారులోని ముస్లింలు నిన్న తీవ్ర ఆందోళనలకు దిగారు. ఆందోళనకారులు ఇల్లంబజారు పోలీస్‌స్టేషను మీద సైతం దాడి చేయడంతో, పోలీసులు భాష్పవాయువుని ప్రయోగించాల్సి వచ్చింది. ఈ సంఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్టేషను పరిధిలో ఉన్న వాహనాలన్నీ ధ్వంసమయ్యాయి. పరిస్థితి చేయిదాటిపోవడంతో సాయంత్రానికి కేంద్ర బలగాలకు చెందిన ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ రంగంలో దిగాల్సి వచ్చింది. ఇంతకీ, ఈ సంఘటనకు మూలకారకుడైన ఆకతాయి మాత్రం పరారీలో ఉన్నాడు

ఎవరినీ వదిలిపెట్టేది లేదు- అరుణ్‌జైట్లీ

  వివాదాస్పద ఎయిర్‌సెల్‌-మాక్సిస్ కుంభకోణానికి సంబంధించి మరోసారి పార్లమెంటు అట్టుడికింది. ఈ కుంభకోణంలో ఆనాటి ఆర్థిక మంత్రి చిదంబరం కుమారుడైన కార్తి చిదంబరానికి పాత్ర ఉందనీ, దీని మీద క్షుణ్నంగా దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఎయిర్‌సెల్, మాక్సిస్... ఈ రెండు సంస్థలూ కూడా తమిళ మూలాలు కలిగిన వ్యక్తులు నెలకొల్పినవే. ఈ రెండు సంస్థలూ కలిసి 2G టెలికాం కుంభకోణానికి పాల్పడ్డాయన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో కార్తి చిదంబరం చాలా చురుగ్గా వ్యవహరించారన్నది ప్రతిపక్షాల వాదన. దీని మీద లోక్‌సభలో అరుణజైట్లీ స్పందిస్తూ, ఎయిర్‌సెల్‌-మాగ్సిస్‌ వ్యవహారానికి సంబంధించి తాము సంబంధిత పత్రాలన్నింటినీ వెలికి తీయిస్తున్నామనీ, ఇందులో నిందితులుగా తేలేవారు ఎంత పెద్దవారైనా వదలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. వచ్చే ఏడు తమిళనాట జరగనున్న ఎన్నికలలో, ఈ కుంభకోణం అన్నాడీఎంకేకు గొప్ప వరంగా మారనుంది. ఇదివరకు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పి.చిదంబరం ఉన్న సమయంలోనే, ఆయన అంగీకారంతోనే ఈ కుంభకోణం సాగిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అప్పట్లో మిత్రపక్షంగా ఉన్న డీఎంకేకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రుల ప్రమేయం కూడా ఉన్నట్లు అన్నాడీఎంకే ఆరోపిస్తోంది.

ఫ్లిప్‌కార్టుకు లక్షలకు లక్షలు టోకరా!

  ఆనలైన్ అమ్మకాల సంస్థ ఫ్లిప్‌కార్టుకు అడపాదడపా ఎదురయ్యే సమస్యే ఇది. మన హైదరాబాదు నుంచి కూడా ఇలా కొందరు సంస్థను మోసం చేసి ఆ తరువాత పట్టుబడ్డారు. కానీ పంజాబ్‌కి చెందిన ఆరుగురు కుర్రాళ్లు మాత్రం ఈ మోసాన్ని మరీ పెద్ద ఎత్తున చేద్దామని ప్రయత్నించి కటకటాల వెనక్కి చేరారు. వివరాల్లోకి వెళ్తే... పంజాబులోని మన్సా జిల్లాకు చెందిన కొందరు కుర్రవాళ్లు ఫ్లిప్‌కార్టు నుంచి ఖరీదైన ఫోన్లని ఆర్డరు చేసేవారు. తీరా అవి చేతికి వచ్చిన తరువాత, మాకు మీరు పంపిన ఫోన్‌ నచ్చలేదంటూ తిరిగి పంపేవారు. అసలు కిటుకు ఇక్కడే ఉంది.   తమకు అందిన అసలైన ఫోన్‌ని హాయిగా అమ్మేసుకుని, డబ్బాలో ఏదో చెత్త పెట్టి పంపేవారు. ఫ్లిప్‌కార్టుకి అనుమానం రాకుండా తరచూ వేర్వేరు ఈమెయిల్స్ ద్వారా, వేర్వేరు ఫోన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ముగించేవారు. ఒకే ప్రాంతం నుంచి తమకు తిరిగి వచ్చే ఫోన్లలో మోసం జరుగుతూ ఉండటంతో ఫ్లిప్‌కార్టు అధికారులకు అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగానే అసలు నిజం బయటకు వచ్చింది. నిందితులు ఇలా ఒకటి కాదు రెండు కాదు కనీసం 25 లక్షలదాకా ఫ్లిప్‌కార్టుని మోసం చేసినట్లు తేలింది. ఇంకా లోతుకి తవ్వితే, ఈ కుంభకోణం కోటి రూపాయల మార్కుని చేరుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

అణ్వాయుధాల విషయంలో తగ్గేది లేదు- పాకిస్తాన్‌

విచ్చలవిడిగా అణ్వాయుధాలను సేకరించుకునే విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని పాకిస్తాన్‌ కుండబద్దలు కొట్టేసింది. ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌ అణ్వాయుధాలకు సంబంధించిన తన విధానాన్ని సమీక్షించుకోవాలని అమెరికా సూచించిన మర్నాడే, ఈ మాటలు వినిపించడం గమనార్హం. తాము కావాలని అణ్వాయుధాలను సమకూర్చుకోవడం లేదనీ, తన పొరుగుదేశమైన భారతదేశానికి దీటుగానే ఆయుధాలను పెంచుకోవలసి వస్తోందన్నది సర్తాజ్‌ ఉవాచ. భారత్‌, పాకిస్తాన్‌ల ఆయుధసంపత్తి మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉన్నా అది తమ రక్షణ మీదే ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు సర్తాజ్‌. పనిలోపనిగా అమెరికా, భారత్‌లకు ఒక ఉచిత సలహాను కూడా అందించారు. ఒకవేళ భారతదేశం తన ఆయుధసంపత్తిని నియంత్రించుకుంటే, అమెరికా కూడా రక్షణ శాఖలో భారతదేశానికి సహాయం చేయకుండా ఉంటే... అప్పుడు తమ అణ్వాయుధ విధానం గురించి ఆలోచిస్తామని చెప్పారు.   ఇక ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య శాంతి చర్చల గురించి కూడా సర్తాజ్‌ తనదైన శైలిలో స్పందించారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద జరిగిన దాడి విషయంలో పాకిస్తాన్‌ అద్భుతంగా స్పందించిందనీ... కాబట్టి, ఇరుదేశాల మధ్య చర్చలు త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో అణ్వాయుధాలు లెక్కకు మిక్కలిగా పోగవుతున్నాయనీ, చైనా సాయంతోనే పాక్‌ ఈ ఆయుధాలను సమకూర్చుకుంటోందనీ, అవి కనుక తీవ్రవాదుల చేతిలో పడితే ఆసియా వినాశనం తప్పదని ప్రపంచదేశాలు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నాయి. సర్తాజ్‌ ఈ భయాల గురించి మాత్రం స్పందించలేదు.  

జీహాద్‌ కోసం ఆస్తి అంకితం.... ఒసామా వీలునామా

ఒసామా చివరి వీలునామాగా భావిస్తున్న ఒక పత్రాన్ని నిన్న అమెరికా ప్రభుత్వం పత్రికలకు అందుబాటులో ఉంచింది. ఇందులో తాను సూడాన్‌లో దాచుకున్న ఆస్తిలో అధిక భాగాన్ని మతయుద్ధం (జిహాద్‌) కోసం ఉపయోగించాల్సిందిగా ఒసామా పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో దాదాపు 15 కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఆస్తిలో తన కుటుంబానికి చాలా స్వల్ప మొత్తాన్ని కేటాయించారు ఒసామా! 2011లో, పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఒసామాను అమెరికా సైనికులు కాల్చి చంపిన విషయం తెలిసిందే! అల్‌ఖైదా పేరుతో పాశ్చాత్య దేశాలను గడగడలాండిచిన ఒసామాను పట్టుకునేందుకు, అమెరికాకే పది సంవత్సరాలు పట్టింది. ఈ సందర్భంగా ఒసామా నివాసంలో లభించిన పత్రాలను, ఇప్పుడిప్పుడే అమెరికా ప్రపంచానికి పరిచయం చేస్తోంది. ఈ వీలునామాతో పాటు కనిపించిన మరో ఉత్తరంలో... ఒసామా తన మరణానంతరం తన కుటుంబాన్ని పరిరక్షించాల్సిందిగా తన సవతి తండ్రిని వేడుకున్నారు. వారి మంచిచెడ్డలు, పెళ్లిళ్లు, కష్టసుఖాలను గమనించుకోమంటూ ఆయనను ప్రార్థించారు. చివరగా ఆయనకు ఇష్టం లేని పనిని కనుక చేసి ఉంటే క్షమించమని కూడా ప్రార్థించారు!

కాపీ కొడతారని... అర్ధనగ్నంగా పరీక్షలు రాయించారు

  బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆర్మీ ఈ మధ్య ఒక పరీక్షను నిర్వహించింది. అయితే బీహారీ యువకులు కాపీ కొట్టేందుకు దేనికైనా వెనకాడరని భయపడిన ఆర్మీ, ఓ చిత్రమైన పద్ధతిలో పరీక్షలను నిర్వహించింది. పరీక్షలో కాపీ కొట్టేందుకు ఎలాంటి చీటీలూ దాచుకునే అవకాశం లేకుండా, కేవలం లోదుస్తులతో పరీక్ష రాయమని పురమాయించింది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు... వందలాది మంది సిగ్గుతో చచ్చిపోతూ ఆర్మీ పరీక్షలను రాయవలసి వచ్చింది. సదరు పరీక్ష నిర్వహణ తాలూకు ఫొటోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఆర్మీ విమర్శల పాలైంది. ఈ విషయమై పాట్నా హైకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం కూడా దాఖలు కావడంతో, రక్షణ శాఖకు సైతం తలవంపులుగా మారింది. దాంతో రక్షణ మంత్రి మనోమర్‌ పరికర్‌ స్వయంగా రంగంలోకి దిగి, ఘటనకు సంబంధించి పూర్తి నివేదికకు ఆదేశించారు. పరీక్షని నిర్వహించిన ఆర్మీ అధికారులు మాత్రం, అభ్యర్థులు కాపీ కొట్టకుండా ఉండేందుకే ఇలాంటి వినూత్న పద్ధతిలో పరీక్షను నిర్వహించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. పద్ధతి వినూత్నంగానే ఉన్నా, అది ఎవరికీ నచ్చినట్లు లేదు!

చిక్కుల్లో చిదంబరం!

  ప్రముఖ కాంగ్రెస్‌ నేత, మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం గ్రహస్థితి ఏమీ బాగున్నట్లు లేదు. ఇటు చూస్తే ఆయన పుత్రరత్నం 'కార్తి చిదంబరం' ఎడాపెడా దేశవిదేశాలలో వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలు ప్రచురించిన ఓ ఆంగ్ల పత్రికను పట్టుకుని నిన్న పార్లమెంటులో ఏఐడీఎంకే సభ్యులు, కాంగ్రెస్‌ మీద విరుచుకుపడ్డారు. మరోవైపు చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తమిళ వ్యాపారస్తునికి చెందిన ఎయిర్‌సెల్‌కు అనుకూలంగా ఒప్పందాలను ఖరారు చేయించారన్న విమర్శ కూడా పార్లమెంటుని కుదిపేసింది.   అటు కొడుకునీ సమర్థించలేక, ఇటు తను చేసిన పనికి సంజాయిషీ చెప్పుకోలేక చిదంబరం తంటాలు పడుతున్నారు. రెండువైపులా ఇలా మద్దెల దరువులో ఇరుక్కుంటే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు గుమ్మం కూడా తొక్కవలసి వచ్చేట్లుంది. గుజరాత్‌లో ఎన్‌కౌంటర్‌ అయిన ఇస్రత్ జహాన్ తీవ్రవాది కాదంటూ తను హోంశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కోర్టులకు సమర్పించిన ప్రకటన నిజం కాదని తేలడంతో, సుప్రీం కోర్టు కూడా చిదంబరం మీద గుర్రుగా ఉంది.

ప్రావిడెంట్‌ ఫండ్‌ గురించి నిమిషానికో మాట!

  ‘రిటైర్మెంట్‌ సమయంలో భవిష్య నిధి ద్వారా లభించే డబ్బులో 40 శాతం మీద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది,’ అంటూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొనగానే మధ్యతరగతి ప్రజలంతా సంతోషించారు. కానీ భవిష్య నిధిలోని 60 శాతం మీద ఆదాయపు పన్నుని విధిస్తామన్న విషయాన్ని ఆర్థికమంత్రి ఇలా తెలివిగా చెప్పారన్న నిజం తట్టగానే, ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయమై దేశమంతా ఒక్కసారిగా గగ్గోలెత్తిపోవడంతో ‘కాదు కాదు... 60 శాతం భవిష్య నిధి మీద వచ్చే వడ్డీ మీదే పన్నుని విధించనున్నాము’ అంటూ అధికారులు వివరణను ఇచ్చారు. మరోవైపు... మరేదన్నా పొదుపు పథకం కోసం ఈ డబ్బుని వినియోగించకపోతేనే, ఆదాయపు పన్నుని విధిస్తాం అని మరో వివరణ వినిపించింది.   అది కూడా ఏప్రిల్‌ 1, 2016 తరువాత భవిష్య నిధిలో జమ అయ్యే డబ్బు మీద వడ్డీ మీద మాత్రమే ఆదాయపు పన్ను ఉంటుందని మరో మాట అన్నారు. అసలు ఆదాయపు పన్ను అంటేనే అదో పద్మవ్యూహం. దానికి తోడు ఆర్థికశాఖకే ఈ విషయం మీద స్పష్టత లేకపోతే, సామాన్య జీవుల పరిస్థితి ఏంకాను! ఈ సందేహాలన్నింటినీ తీర్చేందుకు ఇప్పడు ప్రభుత్వమే ఆర్థిక బిల్లుకి ఓ సవరణ చేపట్టనున్నట్లు ఓ సమాచారం! సామాన్య ప్రజలు ఇప్పటికే ఆదాయపు పన్ను అంటే భయపడిపోతున్నారు. ఆ విషయం ప్రభుత్వాలన్నీ ఒప్పుకుంటూనే వస్తున్నాయి. అందుకనే ఆదాయపు పన్నుని నివేదించడం ఇక మీదట మరింత సరళతరం చేయనున్నట్లు ఆర్థికమంత్రి తన ప్రసంగం మొదట్లోనే చెప్పారు. కానీ జరిగింది చూస్తే....

బడ్జెట్‌- బాదుడు లేదన్న మాటే కానీ...

  ఆదాయపన్ను పరిమితులలో ఎలాంటి మార్పులూ లేవు! పైగా ఇంటి నిర్మాణం మీద తీసుకునే రుణాలకీ, అద్దె చెల్లింపులకీ కాస్తో కూస్తో మినహాయింపులు. కొత్తగా ప్రత్యక్ష పన్నులు ఏవీ లేవు. పైగా వస్తువుల ఖర్చును తగ్గించే విధంగా కార్పొరేట్‌ పన్నుని తగ్గించారు. చూడ్డానికి అంతా బాగానే ఉంది. కానీ ఎలాంటి ప్రత్యక్ష పన్నూ విధించకుండానే సెస్సు పేరుతో వీరబాదుడు బాదేశారు ఆర్థికమంత్రి. వ్యవసాయం, మౌలిక సదుపాయాల కోసం పెట్టుబడులు, స్వచ్ఛమైన పర్యావరణం, స్వచ్ఛభారత్‌.... ఇలా రకరకాల పేర్లతో అయిదు సెస్సులను విధించారు ఆర్థికమంత్రి. వీటి ద్వారా ఒక్క ఏడాదిలోనే 50,000 కోట్ల రూపాయలకు పైగా పిండుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.   ఒకపక్క వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నట్లు కనిపిస్తూనే ‘కృషి కల్యాణ్‌ సెస్‌’ పేరుతో సంబంధిత నిధులను మధ్యతరగతి భారతం నుంచి వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పన్నుల పరిధిలోకి వచ్చే అన్ని సేవల మీదా ఈ సెస్‌ను 0.5 శాతం మేర విధించనున్నారు. రెస్టారెంటులు, విమానప్రయాణాలు, మొబైల్‌ సేవలు.... ఇలా మధ్య, ఎగువ మధ్య తరగతి ప్రజల జీవితంలో భాగమైన సేవలు ఇక మీదట మరింత భారం కానున్నాయి. ఇక పర్యావరణ సెస్‌ కూడా పరోక్షంగా సాధారణ ప్రజల జేబుకి చిల్లు పెట్టే అవకాశం కనిపిస్తున్నాయి. స్వచ్ఛమైన పర్యావరణ పేరుతో బొగ్గు ఉత్పత్తి మీద టన్నుకు 200 రూపాయల వరకూ సెస్సుని మోగించారు.   దీంతో విద్యుత్‌ ఉత్పత్తి మరింత ప్రియం కానుంది. ఈ భారం ఎవరిమీద పడుతుందో చెప్పనవసరం లేదు కదా. ఇక మౌలిక రంగానికి అవసరమయ్యే పెట్టుబడుల కోసం అంటూ కార్ల మీద ఇన్‌ఫ్రా సెస్‌ను విధించారు. దీని వలన కార్ల ధరలు 0.25% నుంచి 4% వరకూ అమాంతం పెరిగిపోనున్నాయి. ఇంట్లో వివాహంలాంటి శుభకార్యాలను తలపెట్టినప్పుడు నగలు, బ్రాండెడ్‌ దుస్తులను ఖరీదు చేయక తప్పని పరిస్థితి. ఇప్పడు ఈ రెండింటి మీద కూడా కస్టమ్స్‌ సుంకాన్ని పెంచారు. ఇంత చూసిన తరువాత బడ్జెట్లో బాదుడు లేదని ఎలా అనుకోగలం!

ప్రభుత్వమే హింసకు పాల్పడింది- జాట్ నేత

  హర్యానాకు వారం రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన జాట్‌ వర్గ ఉద్యమం గుర్తుండే ఉంటుంది. తమ వర్గానికి రిజర్వేషన్లు కావాలంటూ జాట్‌లు చేసిన ఈ ఉద్యమం ప్రజాజీవనాన్ని స్తంభింపచేయడమే కాకుండా, చాలాచోట్ల హింసాత్మకంగా మారింది. ప్రయాణాలు నిలిచిపోయాయి, నిత్యావసర వస్తువులు దొరక్కుండా పోయాయి, పిల్లలు ఆకలితో అలమటించారు. ఆందోళనకారులుకూ పోలీసులకు మధ్య జరిగిన గొడవలలో దాదాపు 30 మంది మృతి చెందారు. ఇక ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికైతే లెక్కే లేకుండా పోయింది. ఆఖరికి ఆందోళన ముసుగులో అత్యాచారాలు సైతం జరిగిన వార్తలు వినిపించాయి. ఇంత జరిగిన తరువాత జాట్ ఉద్యమ నేత యశపాల్ నేత చల్లగా ‘మాకు హింసకీ సంబంధమే లేదు’ అని చెబుతున్నారు. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు ఆ పార్టీ నేతలే కుట్ర పన్నారనీ... వారే హింసకు, విధ్వంసానికీ పాల్పడ్డారనీ యశ్‌పాల్ ఉవాచ. జాట్‌లు నిజంగా ఆందోళన చేసిన చోట ఉద్యమం చాలా ప్రశాంతంగా జరిగిందని భరోసా ఇస్తున్నారు ఆయన. ప్రభుత్వమే శాంతియుతంగా ఆందోళన చేస్తున్నవారి మీద తుపాకులు ఎక్కుపెట్టిందని ఆరోపిస్తున్నారు. అందుకని కేసులంటూ పెడితే జాట్‌లకు వ్యతిరేకంగా మాట్లాడిన బీజేపీ నేతల మీదే పెట్టాలని అంటున్నారు.

కేజ్రీవాల్‌ కారు మీద దాడి!

  పంజాబ్‌లో పర్యటిస్తున్న దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కారు మీద కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. లుధియానాలో జరుగుతున్న ఒక సమావేశంలో కేజ్రీవాల్‌ ప్రసంగిస్తుండగానే, సమావేశ భవంతి వెలుపల భారీగా ఆందోళనకారులు పోగయ్యారు. ప్రమాదాన్ని గ్రహించిన స్థానిక పోలీసులు, ఆయనను వెనుక దారి నుంచి పంపేందుకు ప్రయత్నించిలా లాభం లేకపోయింది. ఈ దాడికి పాల్పడినవారు అకాలీదళ్‌కు చెందిన నేతలుగా భావిస్తున్నారు. అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా బలపరిచేందుకు కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారు. 2017లో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమయానికి, ఆమ్ ఆద్మీ పార్టీని అక్కడ స్థిరపరచాలని కేజ్రీవాల్ ఉవ్విళ్లూరుతున్నారు. అందుకోసమే ప్రస్తుతం పంజాబులో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేజ్రీవాల్‌ పర్యటన వల్ల అసహనానికి గురైన స్థానిక నేతలే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆదాయపన్నులో మార్పులు లేనట్లే!

  దేశవ్యాప్తంగా బడ్జెట్ను ఆసక్తిగా గమనిస్తున్న మధ్యతరగతి ప్రజల నెత్తిన బండ పడింది. ఆదాయపు పన్ను మినహాయింపు కోసం ఇప్పటి వరకూ ఉన్న 2,50,000 పరిమితిని 3,00,000 వరకూ పెంచుతారని ఆశిస్తున్నవారికి అడియాశే మిగిలింది. ఆదాయపు పన్ను పరిమితులలో ఎలాంటి మార్పులూ ఉండవని తేల్చిపారేశారు మంత్రివర్యులు.   - 87A కింద 'ఇంటి అద్దె భత్యానికి' (house rent allowance) ఇచ్చే మినహాయింపుని 24,000 నుంచి 60,000 వరకూ పెంచడం ఒక్కటే మధ్యతరగతికి కాస్త ఊరటనిచ్చే అంశం.   - ఇంటి రుణాలకు ఇచ్చే పన్ను మినహాయింపుని మరో 50,000 పెంచారు. ఇది ఇటు రియల్‌ ఎస్టేట్‌ రంగానికీ, అటు సొంత ఇంటి కోసం కలలు కనేవారికీ కొంత సంతోషానికి గురిచేసే అంశం.   - కార్పొరేట్ పన్నుని మాత్రం ఊహించినట్లుగానే ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు.   - నూతనంగా ప్రారంభించే కంపెనీలకు ఐదేళ్లపాటు టాక్స్ హాలీడేని ప్రకటించారు ఆర్థిక మంత్రి.   - ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి ఎలాంటి సవరణలూ చేపట్టబోమని స్పష్టం చేశారు అరుణ్‌ జైట్లీ!   మొత్తానికి మధ్య తరగతి మనుషులను ఊరించి ఊరించి ఉసూరుమనిపించినట్లైంది ఈ బడ్జెట్!