క‌ళ్యాణ ల‌క్ష్మీ కాసుల కోసం..క‌ట్టుకున్న భార్యకి రెండు పెళ్ళిళ్ళు

  ఆడపిల్ల పుడితే భారంగా భావించే త‌ల్లిదండ్రుల‌కు బాస‌ట‌గా నిలిచేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన క‌ళ్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కం ద‌ళారుల చేతిలో ప‌డి త‌న విలువ‌ను కోల్పోతోంది. కళ్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కం కింద ప్ర‌భుత్వం ఇచ్చే డ‌బ్బుకు క‌క్కుర్తి ప‌డి క‌ట్టుకున్న భార్య‌కు మ‌రొక‌రితో వివాహాం చేశాడు ఒక ప్ర‌బుద్ధుడు. ఇటు అధికారుల ప‌రిశీల‌నా , ప‌ర్య‌వేక్ష‌ణ రెండూ లోపించ‌డంతో కేటుగాళ్లు ప్ర‌భుత్వ సొమ్మును అడ్డంగా దోచేస్తున్నారు.   న‌ల్గొండ జిల్లా దేవ‌ర‌కొండ మండ‌లంలోని పాల్తితండాకు చెందిన వీరాసింగ్-ధ‌న‌కు 16 సంవ‌త్స‌రాల క్రితం వివాహం జరిగి న‌లుగురు పిల్లలున్నారు. క‌ళ్యాణ ల‌క్ష్మీ ప‌థ‌కాన్ని అడ్డం పెట్టుకుని డ‌బ్బు సంపాదించాల‌ని దంప‌తులిద్ద‌రూ ప్లాన్ గీశారు. దీనికి త‌న బావ అయిన చందులాల్ సాయం తీసుకున్నారు. ప్లాన్ ప్ర‌కారం వీరాసింగ్ త‌న భార్య ధ‌న‌ను నాంప‌ల్లి మండ‌లం కేశ‌వ‌నాయ‌క్ తండాకు చెందిన ర‌మావ‌త్ సురేష్ కు మే 25, 2015లో వివాహం చేసిన‌ట్టు న‌కిలీ ధ్రువ‌ప‌త్రాలు  సృష్టించి రూ.51వేలను గ్రామీణ వికాస్ బ్యాంక్, పెద్దవూరలో ధన ఖాతా నుంచి డ్రా చేశారు. తిరిగి 20రోజుల వ్యవధిలోనే ధనకు పుల్లిచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని బాసోనిబాయితండాకు చెందిన బాణావత్ స్వామితో 14జూన్, 2015లో మరోమారు వివాహం జరిగినట్లు నకిలీ దరఖాస్తు సృష్టంచి పెద్దవూర అంధ్రా బ్యాంకు నుంచి మరో రూ.51వేలు డ్రా చేశారు.   దీనిపై అనుమాన‌మొచ్చిన అధికారులు విచార‌ణ చేప‌ట్ట‌గా ఒకే మ‌హిళ‌కు రెండు పెళ్లిళ్లు చేసి రూ.1.02 ల‌క్ష‌లు డ్రా చేసిన‌ట్టు తేలింది. దీంతో వీరాసింగ్-ధ‌న‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు త‌ర‌లించారు. కీల‌క సూత్ర‌ధారి అయిన చందులాల్ ప‌రారీలో ఉన్నాడు. పేదింటి ఆడ‌పిల్ల‌ల్ని ఆదుకోవాల‌నే స‌దుద్దేశంతో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఈ ప‌థ‌కం అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా అస‌లైన ల‌బ్థిదారుల‌కు కాకుండా మోస‌గాళ్ల‌కి వ‌రంగా మారుతోంది.

కేసీఆర్‌నే బురిడీ కొట్టించారు

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..సమకాలీన రాజకీయాల్లో వ్యూహాలు పన్నడంలో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. అలాంటి మేధావినే కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. దిక్కులేని పేదలకు ఆపదలో ఆపన్న హాస్తం అందిస్తుంది ముఖ్యమంత్రి సహాయనిధి. రోజూ ఎంతో మంది పేదలు తమను ఆదుకోవాల్సిందిగా సీఎం కార్యాలయానికి దరఖాస్తు పెట్టుకుంటారు, లేదా స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకుంటారు. వాటిని పరిశీలించి సీఎం, తన సహాయక నిధి నుంచి నిధులు విడుదల చేస్తారు.   అయితే  తప్పుడు దరఖాస్తులు, నకిలీ ధ్రువపత్రాలతో తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి చెందిన నిధుల్ని పక్కదారి పట్టించారు అక్రమార్కులు. ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన సీఐడీ దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తులో నిగ్గుతేలే నిజాలు బయటకు వచ్చాయి. నకిలీ బిల్లుల ద్వారా 73,68,572 లక్షల నగదును మధ్యవర్తులు స్వాహా చేసినట్టు గుర్తించారు.రాష్ట్రంలోని 50 ఆస్పత్రుల్లో 112 మంది చికిత్స పొందుతున్నట్టు దళారులు నకిలీ బిల్లులు సృష్టించినట్టు సీఐడీ అధికారులు బట్టబయలు చేశారు. దీంతో ఖంగు తినడం సీఎం కార్యాలయం వంతైంది.

జగన్ కాంగ్రెస్‌లోకీ రీఎంట్రీ ఇస్తారా?

  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ ఇస్తారంటూ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనికి హస్తమందించడానికి ఢిల్లీ రేంజ్‌లో స్కెచ్ రెడీ అయిందట. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో జగన్ పోలీటికల్ ఎంట్రీ కాంగ్రెస్ పార్టీతోనే జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు జగన్. అయితే వైఎస్ ఆకస్మిక మరణం తదనంతర పరిణామాలతో తనను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలంటూ కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరారు జగన్. కానీ ఆయన అభ్యర్థనను సోనియా తిరస్కరించారు. అథిష్టానం వద్దంటున్నా వినకుండా ఓదార్పు యాత్ర చేపట్టి ఆగ్రహానికి గురయ్యారు జగన్. తనకు జరిగిన అవమానాలకి కలత చెందిన జగన్ కాంగ్రెస్ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. తనతో కలిసి వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉపఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిపించుకున్నారు జగన్.   తర్వాత అక్రమాస్తుల కేసులో జైలుకి సైతం వెళ్లారు జగన్. దీనికంతటికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని జగన్ బలంగా నమ్మారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు భూస్థాపితం చేశారు. తెలుగు దేశంకు ప్రత్యామ్నాయంగా జగన్ వైసీపీ విజయవంతంగా ముందుకు వెళుతుండటం..కాంగ్రెస్ పార్టీలో ఛరిష్మా కలిగిన నాయకులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ తన దృష్టిని జగన్‌పై పెట్టింది. ఎలాగైనా జగన్‌ను కాంగ్రెస్‌లోకి తిరిగి చేర్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. దీనిలో భాగంగా రండి..అందరం కలిసి కాంగ్రెస్ ను బలోపేతం చేసుకుందాం అనడం లేదు. జగన్ కు శాపనార్థాలు పెడుతూనే పార్టీలోకి పిలుస్తున్నారు.. టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకి వైసీపీ దుకాణం బంద్ అవ్వడం ఖాయం అంటూ రఘువీరా, జేడీ శీలం వంటి వారు జోస్యం చెబుతున్నారు. ఈ విధంగా మైండ్ గేమ్‌తో జగన్‌ను మానసికంగా దెబ్బతీసి తన దారిలోకి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ ట్రై చేస్తోంది. మరి కాంగ్రెస్ ఎత్తులకు జగన్ లొంగుతారో లేక ఏపీలోని మిగిలిన హస్తం నేతల్ని ఫ్యాన్ కిందకి తీసుకువస్తారో వేచి చూడాలి.

కుష్బూను టార్గెట్ చేసిన హిజ్రాలు..

  సినీనటి, కాంగ్రెస్ నేత కుష్బూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తన ప్రవర్తనతో కోరి చిక్కుల్లో చిక్కుకోవడం ఆమెకు అలవాటే. ఈ సారి హిజ్రాలను టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చారు. కాంగ్రెస్ జాతీయ మీడియా ప్రతినిధి అయిన కుష్బూ ఒక ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో హిజ్రాలు పోటీ చేయాలని ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? లేదా? అన్న విషయంపై వారు పునరాలోచించుకోవాలని సూచించారు.   దీనిపై హిజ్రాలు మండిపడ్డారు. చెన్నైలోని కాంగ్రెస్ కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు.  ఉత్తర భారతదేశానికి చెందిన కుష్బూ తమిళ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడారని, ఇప్పుడు మరోసారి తమ విషయంలోనూ అలాగే నోటీ దురుసును చూపారన్నారు. కుష్బూ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు తమకు ఉందని హిజ్రాలు స్పష్టం చేశారు.

మాజీ ప్రధానిని ఎండలో నిలబెట్టిన గవర్నర్

  హెచ్.డి దేవేగౌడ భారత మాజీ ప్రధాని, సమకాలీన రాజకీయాల్లో ఈయన కూడా ఒక కురువ‌‌ృద్ధుడు. గతంలో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని మండుటెండలో నిలబెట్టారు కర్ణాటక గవర్నర్. అవినీతిపరుల అంతం చూసి దేశ వ్యాప్తంగా కర్ణాటకకు పేరు తీసుకువచ్చిన లోకాయుక్త సంస్థను నిర్వీర్యం చేస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్తగా ఏర్పాటు చేసిన అవినీతి నియంత్రణ దళాన్ని వ్యతిరేకిస్తూ జెడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ ఆందోళనకు దిగారు. బెంగళూరులోని ఆనందరావు జంక్షన్ నుంచి స్వతంత్ర పార్క్ వరకు పాదయాత్ర నిర్వహించిన ఆయన గవర్నర్ వాజూభాయివాలాకు వినతిపత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అయితే దీనికి ముందస్తు అనుమతి లేదంటూ రాజ్‌భవన్ భద్రతా సిబ్బంది దేవేగౌడను గేటు వద్దే నిలిపివేశారు.   గవర్నర్ అనుమతి కోసం ఆయన సుమారు 45 నిమిషాల పాటు ఎండలోనే ఎదురు చూశారు. దీంతో ఆగ్రహించిన దేవేగౌడ ఇది కర్ణాటక. గుజరాత్ నుంచి వచ్చిన వ్యక్తి కన్నడిగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దురదృష్టకరం అంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తూ తన ఎమ్మెల్యేలతో పాటు గేటు బయట రోడ్డు మీద బైఠాయించారు. అప్పటికి గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. దీంతో నిరాశతో గౌడ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఏది ఎమైనా ఒక మాజీ ప్రధానిని వయసును చూసైనా గవర్నర్ తగిన గౌరవం ఇచ్చుంటే బాగుండేది. లేదంటే దీని వెనుక సీఎం సిద్ధరామయ్య ఒత్తిడి ఏదైనా ఉందా అని రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.

ఉండాలి కానీ మరీ ఇంత ఉండకూడదు

  గెలిచినా..ఓడినా ఎప్పుడూ ఓకేలా ఉండాలని గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. ఆనందమొచ్చినప్పుడు ఒకలాగా..బాధ కలిగినప్పుడు ఒకలాగా మనిషి మారిపోతాడు అనడానికి నిలువెత్తు నిదర్శనం వెస్టిండీస్ క్రికెటర్ శామ్యూల్స్. టీ20 ప్రపంచకప్‌లో గెలవడం అంటే అంత మామూలు విషయం కాదు. ఎన్నో జట్లతో పోరాడి, ఫైనల్లో అమీతుమి తేల్చుకుని విశ్వవిజేతగా ఆవిర్భవించింది విండీస్. విజయోత్సాహాన్ని ఒక్కోక్క స్టైల్లో ప్రజంట్ చేస్తారు. విధ్వంసకర ఆటగాడు గేల్ గంగ్నమ్ డ్యాన్స్ చేస్తూ సహాచరులతో చేయిస్తూ ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. అయితే వీరందరికి భిన్నంగా ప్రవర్తించాడు శామ్యూల్స్ ఫైనల్లో సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న శామ్యూల్స్ విజయగర్వంతో ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. అక్కడ అతను ప్రవర్తించిన తీరు మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది. జర్నలిస్ట్‌లు ప్రశ్నలు వేయడానికి ముందే టేబుల్ మీద కాళ్లు పెట్టి హీరో రేంజ్‌లో ఫోజు కొట్టాడు. సంతోషంలో ఇలా చేశాడా? లేక గర్వంతో తనకంటే తోపు ఎవడూ లేడని అలా చేశాడా? అన్నది అర్థం కాక జర్నలిస్టులు స్టన్నయ్యారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటంతో నెటిజన్లు తమదైన స్టైల్లో శామ్యూల్స్‌పై సెటైర్లు పేలుస్తున్నారు.

స్కూల్ అడ్మిషన్ ఫాంలోకి "భారత్ మాతాకీ జై"

  ప్రజంట్ దేశ రాజకీయాల్ని ఒక ఊపు ఊపుతున్న ''భారత్ మాతాకీ జై" అన్న నినాదం రాజకీయ పార్టీల కార్యాలయాలను దాటి పాఠశాలలకి పాకింది. స్కూల్ అడ్మిషన్ ఫాంలో ''భారత్ మాతాకీ జై" అన్న కాలానికి రైట్ మార్క్ కొడితేనే అడ్మిషన్ అంటూ ఒక స్కూల్ కొత్త వివాదానికి తెరలేపింది. దేశాన్ని బానిస సంకెళ్ల నుంచి రక్షించిన జాతిపిత పుట్టిన గుజరాత్ గడ్డపై ఈ ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. గుజరాత్‌లోని అమ్రేలిలో శ్రీ పటేల్ విద్యార్థి ఆశ్రమంలో కొత్తగా అడ్మిషన్ పొందేవారు భారత్ మాతాకీ జై అని దరఖాస్తులో నింపాలని లేదంటే అడ్మిషన్ ఇవ్వబోమని ఆ విద్యాసంస్థ స్పష్టం చేసింది. శ్రీ పటేల్ విద్యార్థి ఆశ్రమం కింద ఒక ప్రాథమిక పాఠశాల,రెండు హైస్కూళ్లు, ఒక కాలేజీలు నడుస్తున్నాయి. సదరు విద్యాసంస్థ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి వివాదాల్లోకి విద్యను లాగడం మంచిది కాదని ఒక వర్గం, చిన్నతనం నుంచే విద్యార్థుల్లో దేశభక్తి భావాలను పెంపోందించాలనుకోవడం మంచి నిర్ణయమని ఒక వర్గం అంటున్నాయి.

ముంబైకి రైల్వేశాఖ గిఫ్ట్..ఏసీతో లోకల్ ట్రైన్

  ఆధునికత దిశగా అడుగులు వేస్తున్న భారతీయ రైల్వేలు ప్రజలకు మరో గిఫ్ట్ ఇచ్చింది. ఇప్పటి వరకు లోకల్ ట్రైన్ అంటే ఫుట్‌పాత్‌లపై వేలాడే జనాలు చెమటలు తుడుచుకుంటూ ఇరుకు ఇరుకుగా ప్రయాణం సాగించేవారు. కానీ ఇక నుంచి ఇలాంటి వాతావరణం మారిపోబోతోంది. భారతీయ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఏసీ సౌకర్యంతో లోకల్ ట్రైన్ ప్రవేశపెట్టనుంది. ప్రజలు వేసవి తీవ్రతను తట్టుకోలేకపోతున్న నేపథ్యంతో పాటు లోకల్ రైళ్లలో ప్రయాణించి ఆలసి సొలసి ఆఫీసులకు వెళ్తుండటంతో రైల్వే శాఖ దీనికి చెక్ పెట్టాలనుకుంది. దీనిలో భాగంగా దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఏసీ లోకల్ ట్రైన్‌ను నడపాలని సంకల్పించింది. 55 కోట్ల విలువైన ఈ రైలు చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో తయారైంది. ప్రస్తుతం దీనిని చెన్నై నుంచి ముంబైకి తరలిస్తున్నారు. మిగిలిన సాంకేతికపరమైన పనులను ముంబైలోనే పూర్తి చేసుకుని నెల రోజుల వ్యవధిలో దీనిని పట్టాలెక్కించనున్నారు. ఈ రైలులో జనరల్. ఫస్ట్‌క్లాస్ అంటూ విడివిడిగా లేవని, అంతా ఒకేలా ఉంటుందని అయితే మహిళల కోచ్‌లు గుర్తించడానికి మార్కింగ్స్ ఉంటాయని అధికారులు చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని మిగిలిన మెట్రో నగరాల్లో ఈ సదుపాయాన్ని అమలు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది.

బ్రాహ్మణి భరోసాతో మరో వ్యాపారంలోకి చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరొ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే అనేక వ్యాపారాల్లో ఉన్న సీఎం కుటుంబానికి అసలు బ్రాండ్ మాత్రం హేరిటేజ్ ఒక్కటే. చంద్రబాబు అంటే హేరిటేజ్..హేరిటేజ్ అంటే చంద్రబాబు అన్నంతగా ఇది జనాల్లోకి వెళ్లింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి హేరిటేజ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే లోకేశ్ సతీమణి, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మాణి వచ్చాకే హేరిటేజ్ భారీ లాభాలు ఆర్జించిందని కార్పోరేట్ టాక్. ఈ నేపధ్యంలో ఆమె మీద నమ్మకంతో హేరిటేజ్ గ్రూప్ మరో రంగంలోకి అడుగు పెట్టింది. ఏ విషయాన్నైనా ముందు చూపుతో ఊహిస్తారని పేరున్న చంద్రబాబు తనకిష్టమైన విద్యుత్ రంగంలో ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. దానిలో భాగంగా భవిష్యత్‌లో పవన విద్యుత్‌కు ఉన్న అపార అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వజ్రకరూర్ మండలంలోని హోతూర్ గ్రామంలో పవన్ విద్యుత్ ప్లాంట్ నెలకొల్పారు. ఈ కంపెనీ 2.1 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటైంది. ఇక్కడి నుంచి ఉత్పత్తైన విద్యుత్‌ను ఇతరులకు విక్రయించడంతో పాటు చిత్తూరు జిల్లాలో ఉన్న తమ డైరీ ప్లాంట్లకు వాడుకోనున్నట్లుగా హేరిటేజ్ గ్రూప్ తెలిపింది. మొత్తం మీద చంద్రబాబు తన కోడలు మీద ఉన్న అపారమైన నమ్మకంతో అడుగు ముందుకు వేశారన్నమాట.

ఇక‌ పురషుల్ని కూడా గర్భగుడిలోకి రానివ్వరట

  శనిసింగనాపూర్‌ ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. అలాంటి తలనొప్పుల నుంచి తప్పించుకోవడానికి మహారాష్ట్రలోని మ‌రొక సుప్రసిద్థ పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వరాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించకుండా పురుషులపై ఆలయ ధర్మకర్తల మండలి నిషేధం విధించింది. శనిసింగనాపూర్ ఆలయంలో లాగే త్రయంబకేశ్వర ఆలయంలోకి మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అయితే తమకు అన్నింట్లో పురుషులతో పాటు సమానహక్కు ఉందని, ఆలయాల్లో కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని మహారాష్ట్రకు చెందిన భూమాత బ్రిగేడ్ మహిళా కార్యకర్తలు బొంబే హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆలయ ప్రవేశానికి సంబంధించి పురుషులతో పాటు మహిళలకూ సమానహక్కు ఉందంటూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును అనుసరించి భూమాత బ్రిగేడ్ కార్యకర్తలు రెండు రోజుల క్రితం శనిసింగనాపూర్ ఆలయంలోకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేశారు. వీరి ప్రయత్నాన్ని స్థానికులు, పోలీసులు, దేవాలయ అధికారులు అడ్డుకున్నారు. సంప్రదాయాల్ని, ఆలయ కట్టుబాటుని అంగీకరించాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేప‌థ్యంలో అలాంటి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్న త్రయంబకేశ్వరాలయ ధర్మకర్తల మండలి ఇవాళ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో హైకోర్టు తీర్పును, శనిసింగనాపూర్ ఘటనను చర్చించారు. శనిసింగనాపూర్ తరహా ఘటనలను ఇక్కడ చోటు చేసుకోకుండా చూడటంతో పాటు కోర్టు తీర్పును గౌరవించాలని నిర్ణయించారు. దీంతో పాటు లింగ సమానత్వానికి ప్రాధాన్యత నిచ్చే దిశగా మహిళలతో పాటు పురుషులని ఆలయంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది.

మసూద్‌ అజార్‌ తీవ్రవాది కాదు... చైనా

  నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న సామెత చైనా దౌత్యవేత్తలకు సరిగ్గా వర్తిస్తుందేమో. మసూద్‌ అజార్ అనే కరోడా తీవ్రవాదిని నిషేధించాలంటూ భారత్‌ ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రతిపాదనని అడ్డుకోవడమే కాకుండా, అజార్ నిషేధం ఎదుర్కొనేంతటి తీవ్రవాది కాదంటూ చైనా తన పనిని వెనకేసుకు వచ్చింది. పైగా ఇలాంటి ప్రతిపాదనలు చేసేటప్పుడు సరైన కారణాలు చూపాలంటూ భారత్‌ను దెప్పిపొడిచింది. అజార్‌ తన దేశంలో హాయిగా విహరించేందుకు, తన ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించేందుకు పాకిస్తాన్‌ కావల్సినంత స్వేచ్ఛని అందిస్తోంది.   ఒకవేళ ఐక్యరాజ్యసమితిలో ఈ ప్రతిపాదన కనుక అమలై ఉంటే అజార్ కదలికల మీదా, అతని ఆస్తుల మీదా పాకిస్తాన్ నిషేధాన్ని అమలుచేయాల్సి వచ్చేది. అందుకే పాకిస్తాన్ కోరిక మేరకు చైనా ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. చైనా ఇలా పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాదని కాపాడటం ఇది మొదటిసారేమీ కాదు. లష్కర్‌ ఏ తయ్యబా అనే సంస్థ ద్వారా ముంబైలో మారణహోమాన్ని సృష్టించిన రెహ్మాన్ లఖ్వీని కూడా ఇలాగే వెనకేసుకు వచ్చింది. చైనా తీరు మీద భారతీయ నేతలే కాదు, అధికారులు కూడా మండిపడుతున్నారు. అంతకు మించి ఏం చేస్తారో చూడాలి.

ఫ్లై ఓవరు కాంట్రాక్టరు మీద హత్యాయత్నం కేసు

  కోల్‌కతాలో, నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవరు కూలిపోయిన సంఘటనలో మృతుల సంఖ్య 24గా నిర్థారణ అయ్యింది! ఈ ప్రమాదంలో మరో 90 మందికి పైగా గాయపడగా, వారిలో 16 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదాన్ని చాలా తీవ్రవంగా పరిగణించిన కోల్‌కతా పోలీసులు, నిర్మాణ సంస్థ అధికారుల మీద హత్యాయత్నం, కుట్ర తదితర తీవ్రమైన ఆరోపణల కింద కేసుని నమోదుచేసినట్లు తెలుస్తోంది. హైదరాబాదుకి చెందిన IVRCL అనే సంస్థ ఈ నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తమ బాధ్యత నుంచి తప్పించుకునేందుకు, సంస్థ అధికారులు ఈ ప్రమాదానికి దైవసంకల్పమే కారణమని చెప్పి మరిన్ని విమర్శలకు గురయ్యారు.   మరోవైపు ప్రమాదానికి కారణం మీరంటే మీరంటూ అధికార ప్రతిపక్షాల ప్రజల దృష్టిలో చులకన అయిపోయాయి. స్థానిక తృణమూల్‌ పార్లమెంటు సభ్యుడు ‘ఫ్లై ఓవరు డిజైనుని మార్చి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించడంతో, ప్రభుత్వం నిర్లక్ష్యమే ఘటనకు కారణం అయ్యిందని ప్రతిపక్షాలు మరోసారి మండిపడేందుకు అవకాశం చిక్కింది. ఈ ప్రమాదానికి కారణాలు వెతికేందుకు సీబీఐ ఎంక్వైరీ నియమించాలని బీజేపీ కూడా పట్టుబడుతోంది. మరోవైపు కోల్‌కతా హైకోర్టులో కూడా ఈ దుర్ఘటన మీద విచారణ జరిపించాలంటూ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

అనుపమ్ ఖేర్‌ భార్యకు, కన్నయా సంజాయిషీ

  జేఎన్‌యూ వివాదాస్పద విద్యార్థి నేతలను అనుపమ్‌ఖేర్‌ దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే! అనుపమ్ ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారనీ, అందుకే ఆయనకు పద్మ అవార్డు కూడా వచ్చిందని కొందరు విమర్శిస్తున్నారు కూడా. అనుపమ్ భార్య కిరొణ్‌ ఖేర్ భాజపా తరఫున పార్లమెంటు సభ్యురాలు కావడం వల్లే ఆయన భాజపాను వెనకేసుకు వస్తున్నారు అనేవారూ లేకపోలేదు. అయితే కిరొణ్‌ ఖేర్‌ ఇప్పటివరకూ జేఎన్‌యూ వివాదం మీద మౌనంగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే కన్నయా కుమార్‌, 1984లో జరిగిని సిక్కుల ఊచకోతని తక్కువచేసి మాట్లాడారో కిరొణ్‌ మండిపడ్డారు. ఆ మధ్య కన్నయా మాట్లాడుతూ 1984లో జరిగిన సిక్కుల ఊచకోతకి అల్లరిమూకలే కారణమనీ, కానీ 2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకి ప్రభుత్వం కారణమనీ చెప్పుకొచ్చారు.   దీని మీద స్పందిస్తూ సిక్కు వర్గానికే చెందిన కిరొణ్‌ ఖేర్‌, కన్నయా మీద ట్విట్టర్లో మండిపడ్డారు. కన్నయా మాటలు చాలా అమర్యాదకరంగా ఉన్నాయనీ, 1984 ఊచకోతలకి సంబంధించి చాలామంది కాంగ్రెస్‌ నేతలు బోనులో నిలబడ్డారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి నీ మనసు చచ్చిపోయిందా అంటూ విమర్శించారు. కిరొణ్‌తో పాటు చాలామందే ఇలాంటి విమర్శలు చేయడంతో కన్నయా కాస్త దిగివచ్చారు. ‘తను పార్టీలకు అనుగుణంగా అభిప్రాయాలు వెల్లడించననీ, ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తుతానని’ సంజాయిషీ ఇచ్చుకున్నారు. పనిలో పనిగా ‘1984లో బీజేపీ నేతల మీద కూడా కేసులు నమోదయ్యాయి’ అని కొసరు విసిరారు. కన్నయా తీరు చూస్తుంటే కాంగ్రెస్‌ను సమర్థిస్తున్నట్లుగా ఉందని విమర్శకులు పేర్కొంటున్నారు.

ఐక్యరాజ్యసమితి తీరుతో భారత్‌ బేజారు

  ఉగ్రవాదాన్ని నిర్వచించేందుకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను నిలువరించేందుకు ఐరాస ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని మోదీ విమర్శించిన కొద్ది రోజులకే, ఐరాస మరోసారి తన వైఫల్యాన్ని చాటుకుంది. పఠాన్‌కోట్‌ దాడులతో సహా భారతదేశంలోని పలు ఉగ్రవాద కలాపాలకు పాల్పడుతున్న మౌలానా మసూద్ అజార్‌ను వెనకేసుకు వచ్చి భారత్‌ ఆగ్రహానికి గురైంది. అజార్ జైష్‌ ఏ మహమ్మద్‌ అనే అతివాద సంస్థ పేరుతో పాకిస్తాన్‌ నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! అజార్‌ మీద అంతర్జాతీయంగా నిషేధం విధించాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని ఐరాస తొక్కిపెట్టింది.   ఐరాసలో శాశ్వత సభ్యదేశమైన చైనా అభ్యంతరం మేరకే ఈ అడ్డంకి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మీద విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఐరాస పనితీరు నిష్పక్షపాతంగా లేదని, తీవ్రవాదం మీద పోరు సాగించేందుకు పట్టుదలతో ఉన్నట్లు కనిపించడం లేదని ఘాటుగా విమర్శించారు. మసూద్ అజార్‌లాంటి తీవ్రవాది నుంచి సభ్యదేశాలను కాపాడవలసిన బాధ్యత ఐరాసకు ఉందని గుర్తుచేశారు. ఈ వివాదంలో ఐరాస ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

మణిపూర్‌ కాంగ్రెస్‌లో ముదురుతున్న సంక్షభం

  మొదట అరుణాచల్‌ ప్రదేశ్‌ ‘చేయి’జారిపోయింది. ఆ తంతు అలా ముగిసిందో లేదో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంలో ముసలం మొదలైంది. తాజాగా కాంగ్రెస్‌ ఆధీనంలో ఉన్న మరో రాష్ట్రంలో కూడా సమస్య మొదలైంది. మణిపూర్‌ ప్రభుత్వంలో సాగుతున్న సంక్షోభం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. అక్కడ 60 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 సభ్యుల భారీ మెజారటీ ఉంది. అయితే ఇందులో ఏకంగా 25 మంది కాంగ్రెస్‌ సభ్యులు ఇప్పుడు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి తప్ప క్యాబినెట్‌లో ఉన్న మంత్రులందరినీ కూడా తప్పించి కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించమన్నది అసమ్మతివాదుల కోరిక.   అయితే తమలో ఒక్క మంత్రిని తొలగించినా మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని ప్రస్తుతం ఉన్న 11 మంది మంత్రులూ తేల్చిపారేశారు. దీంతో ఇటు నుయ్యి, అటు గొయ్యిగా మారిపోయింది అక్కడి ముఖ్యమంత్రి ఒక్రాం సింగ్ పరిస్థితి. మంత్రులందరినీ మూకుమ్మడిగా తొలగిస్తే, ప్రజల్లో విశ్వాసం కోల్పోతామన్నది ప్రస్తుత మంత్రుల వాదన. తిరుగుబాటు నేతలు మాత్రం, రెండున్నర ఏళ్ల తరువాత మంత్రివర్గాన్ని మారుస్తామన్న హామీని, ముఖ్యమంత్రి నెరవేచ్చాలని పట్టుబడుతున్నారు. ముచ్చటగా ఈ మూడో రాష్ట్రానికి చెందిన వివాదం ఎక్కడికి చేరుతుందో చూడాలి!

పఠాన్‌కోట్ తీవ్రవాదికి చైనా మద్దతు

  పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం మీద దాడికి వ్యూహం పన్నిన తీవ్రవాదులకు చైనా మద్దతు పలుకుతోందా.... అంటే అవుననే జవాబు వినిపిస్తోంది. పఠాన్‌కోట్‌ దాడులకు పాల్పడిన జైష్‌-ఏ-మహమ్మద్‌ నాయకుడు మౌలానా మసూద్‌ అజార్‌ మీద నిషేధాన్ని విధించాలని కోరుతూ మన దేశం ఐక్యరాజ్యసమితిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించింది. ఈ విషయం మీద సమితిలో ఉన్న 15 మంది సభ్య దేశాలలో 14 దేశాలు సానుకూలంగా స్పందించగా, ఒక్క చైనా మాత్రం ప్రతిపాదనను తిరస్కరించింది. దీంతో మౌలానా అజార్‌ పాకిస్తాన్‌లో ఎప్పటిలాగే స్వేచ్ఛగా తిరిగే అవకాశం చిక్కింది.   ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్య దేశాలలో ఒకటైన చైనా ఈ ప్రతిపాదనకు నిరాకరించకపోవడంతో, మెజారటీతో సంబంధం లేకుండా ప్రతిపాదన వీగిపోయింది. తన పరమమిత్ర దేశమైన పాకిస్తాన్‌ సూచన మేరకే, చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యతో భారత్‌, చైనాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడ్డాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆది నుంచి కూడా చైనా, భారత్‌ ఉద్దేశాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ... ఏకంగా మన దేశానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తీవ్రవాదిని రక్షించేందుకు పూనుకోవడం విమర్శకులకు సైతం విస్మయం కలిగిస్తోంది. ఈ విషయం మీద పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా మండిపడుతున్నారు.

ఫ్లై ఓవర్‌ ప్రమాదం మీద రాజకీయాలు మొదలు

  కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్‌ కూలి పాతికమంది చనిపోయారన్న వార్తలు ఇంకా చల్లారక ముందే, వివిధ పార్టీలు ఈ ప్రమాదాన్ని రాజకీయం చేసేందుకు సిద్ధపడిపోయాయి. త్వరలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేతలు, ప్రమాద ఘటనను కూడా వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్మాణానికి అనుమతి మీ ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారంటూ తృణమూల్ విరుచుకుపడుతుంటే, కూలింది మాత్రం మీ హయాంలోనే అంటూ వామపక్షాలు మండిపడుతున్నాయి. ‘బ్రిడ్జిలోని ఏ భాగం కూలిందో గమనించాలి. మా హయాంలో నిర్మించిందా, మీ హయాంలో నిర్మించిందా!’ అంటూ మరో ప్రశ్నను లేవనెత్తారు సీపీఐ అధ్యక్షుడు బిమన్‌ బోస్‌.   ఈ మొత్తం ఘటనకు  రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ఫిర్హద్‌ హకీంను బాధ్యునిగా నిలిపేందుకు సీపీఐ ప్రయత్నిస్తోంది. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితునిగా పేరొందిన హకీం, లంచం తీసుకుని నాసిరకం నిర్మాణానికి అనుమతినిచ్చారని ఆరోపిస్తున్నారు సీపీఐ నేతలు. తక్షణమే ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కూడా తృణమూల్ ఈ ప్రమాదానికి బాధ్యత వహించాలని అంటున్నారు. ‘ఎవరో ఒకరి మీద నేరాన్ని తోసేస్తే సరిపోదు’ అంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ నేత అధిర్‌ చౌదరి హెచ్చరిస్తున్నారు. ఇక బీజేపీ కూడా ఈ విషయంలో ఓ రాయి వేసేందుకు సిద్ధపడిపోయింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి బాబుల్ సుప్రియో మాట్లాడుతూ ఫ్లై ఓవర్ నిర్మాణం యావత్తూ అశాస్త్రీయ పద్ధతిలో జరిగిందని చెప్పుకొచ్చారు. గత ప్రమాదాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్వలేదంటూ విమర్శించారు. ఇంతకీ ఈ ప్రమాదానికి కారణం ఎవ్వరో మాత్రం స్పష్టంగా తేలాల్సి ఉంది. అప్పటిదాకా ఇలాంటి విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి.

ఫ్లై ఓవర్‌ కూలిపోవడం... దైవ సంకల్పం

    కోల్‌కతాలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌ కూలిపోయి 20 మందికి పైగా మృతి చెందారనీ, 100మందికి పైగా గాయపడ్డారనీ వార్తలు వస్తున్నాయి. ఫ్లైఓవర్‌ నిర్మాణంలో లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు అనుమానిస్తున్నారు. అసలు ప్రమాదం జరిగే ముందురోజు రాత్రి నుంచే అది తెగ ఊగిసలాడుతోందని స్థానికుల ఆరోపిస్తున్నారు. కానీ ఈ నిర్మాణాన్ని చేప్పటిన IVRCL వాదన మాత్రం వేరేలా ఉంది. హైదరాబాదుకి చెందిన ఈ నిర్మాణ సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ‘కంపెనీ చరిత్రలో ఇలాంటి ప్రమాదం ఎన్నడూ జరగలేదని, బహుశా దైవ సంకల్పం (act of god) ప్రకారమే ఇది జరిగి ఉంటుందని’ పేర్కొన్నారు. సాధారణంగా ఊహించని ప్రకృతి విపత్తుల వల్ల నష్టం ఏర్పడితే దానిని act of god అంటారు.   కానీ ప్రస్తుత ప్రమాదంలో మాత్రం సంస్థ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడో 2009లో చేపట్టిన ఈ ప్రాజక్టులో ఇంకా 60 శాతం కూడా పూర్తిచేయలేదనీ, నిర్మాణంలో అడుగడుగునా లోపాలు ఏర్పడ్డాయనీ విమర్శలు వినిపిస్తున్నాయి. మమతా దీదీ కూడా సంస్థ మాటలను వినేందుకు సిద్ధంగా లేరు. ఈ ఘటలను బాధ్యులైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ ఆమె మండిపడుతున్నారు. ఇప్పటికే సంస్థ మీద పోలీసులు ఎఫ్‌.ఐ.ఆర్‌ను నమోదు చేశారు. సంస్థకు చెందిన కొందరు అధికారులు ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లు అనుమానం. బహుశా వారికి ఈ తప్పిదానికి కారణం దైవ సంకల్పం కాదని తెలిసి ఉంటుంది.

ఉగ్రవాదం మారుతున్నారు... మనం మారడం లేదు... మోదీ

  అణుభద్రత సదస్సులో పాల్గొనేందుకు అమెరికాకి చేరుకునే మోదీ, తీవ్రవాదాన్ని గట్టిగా ఖండించేందుకే సిద్ధపడినట్లున్నారు. నిన్నటికి నిన్న ఉగ్రవాదాన్ని నిర్వచించడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైందని విమర్శించిన మోదీ మరోసారి తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు. సదస్సుకు ముందుగా అతిథుల గౌరవార్థం అమెరికా అధ్యక్షులు ఏర్పాటు చేసిన విందులో మోదీ పలు వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదులు 21వ శతాబ్దానికి అనుగుణంగా ఆధునికంగా మారుతున్నారనీ, కానీ ప్రభుత్వాలు మాత్రం కాలం చెల్లిన పద్ధతులను అనుసరిస్తున్నాయనీ ఆయన వాపోయారు. పైగా తీవ్రవాదుల చర్యలు మరింత హింసాత్మకంగా మారుతున్నాయనీ, వారు పౌరులలో కలిసిపోతూనే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారని చెప్పుకొచ్చారు. పరోక్షంగా పాకిస్తాన్‌ వంటి దేశాలను ప్రస్తావిస్తూ కొన్ని దేశాలు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రమాదకరంగా మారుతున్నాయని విమర్శించారు. తీవ్రవాదం అనేది ఎవరో ఒకరికి మాత్రమే సంబంధించిన సమస్యగా చూడటం మానివేయాలని మోదీ హితవు పలికారు. అణుభద్రత గురించి సదస్సుని నిర్వహించడం ద్వారా అమెరికా అధ్యక్షడు ఒబామా ఒక కీలక సమస్య మీద ప్రపంచ దృష్టిని నిలిపారని కొనియాడారు. సదస్సు ముందే ఇంత కఠినమైన విమర్శలు చేస్తున్న మోదీ, ఇక సదస్సు సందర్భంగా మరెన్ని ప్రకటనలు చేస్తారో చూడాలి.