భారతీయుల బెంగకి కారణమవుతోన్న బెంగాల్!
posted on Mar 21, 2017 @ 8:49PM
మోదీ తరంగాలు దేశమంతా వీచినా కూడా కొన్ని రాష్ట్రాల్లో అస్సలు వీయలేదు. అలాంటి రాష్ట్రాల్లో బెంగాల్ ఒకటి! సీపీఎంని గద్దె దించి అధికారంలోకి వచ్చిన మమతా దీదీ రెండో సారి మరింత బలం పుంజుకుంది. కాని, బెంగాల్ ఇప్పుడు బెంగగా మారింది బీజేపికి మాత్రం కాదు. దేశ భద్రత గురించి ఏ మాత్రం ఆలోచించే వారు ఎవరికైనా బెంగాల్ పెద్ద బెంగగా మారిపోయింది. అందుక్కారణం బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వస్తోన్న ఉగ్రవాదులే!
బంగ్లాదేశ్ ని ప్రస్తుతం పరిపాలిస్తోన్న ప్రధాని షేక్ హసీనా. ఆమె వచ్చినప్పటి నుంచీ బంగ్లాదేశ్ అతి వాద ముస్లిమ్ లపై ఉక్కుపాదం మోపుతోంది. వందలు కాదు వేల సంఖ్యలో ఉగ్రవాదుల్ని ఊచలు లెక్కబెట్టిస్తోంది. కొందర్నైతే ఏకంగా కోర్టులో నిలబెట్టి ఉరిశిక్షలు కూడా వేయించేస్తోంది! ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో బంగ్లాదేశీ ఉన్మాదులు ఏం చేస్తారు? తప్పించుకునే మార్గం చూస్తారు! ఆ రాజ మార్గం మమతా బెనర్జీ బెంగాల్ ద్వారా వాళ్లకి లభిస్తోంది!
బంగ్లాదేశ్ తో 2వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ సరిహధ్దు వున్న బెంగాల్ ఉగ్రవాదులకి ఎప్పట్నుంచో స్వర్గధామం. గతంలో కమ్యూనిస్టుల పాలన వున్నప్పుడు కూడా పరిస్థితి సంతోషకరంగా వుండేది కాదు. అయితే, మమతా బెనర్జీ వచ్చాక మరింత దిగజారిందని తాజా రిపోర్ట్ చెబుతోంది! ఈ రిపోర్ట్ మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానిదైతే లైట్ తీసుకోవచ్చు. రాజకీయ ఆరోపణగా కొట్టిపారేయవచ్చు. కాని, మన అంతర్గత రాజకీయాలతో సంబంధం లేని బంగ్లాదేశ్ అందించింది! తమ దేశం నుంచి ప్రాణాలు అరి చేత పట్టుకుని పారిపోయిన ఉగ్రవాదులు బెంగాల్ గుండా భారత్ లో చొరబడి జనంలో కలిసిపోతున్నారని దాని సారాంశం!
బంగ్లాదేశ్ అందించిన రిపోర్ట్ లో అస్సొమ్, త్రిపురా రాష్ట్రాల్ని కూడా ఉగ్రవాదుల అడ్డాలుగా పేర్కొన్నారు. అయితే, ఆ రెండు రాష్ట్రాలు బంగ్లాదేశ్ చొరబాటు దారుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాని, అతి పెద్ద రాష్ట్రమైన పశ్చిమబెంగాల్ మాత్రం మౌనంగా ఉగ్రమూకల్ని లోనికి రానిస్తోందని ఆరోపణలు వున్నాయి. బంగ్లాదేశ్ ప్రధాని కూడా బెంగాల్ వైపే వేలెత్తి చూపడం సమస్య తీవ్రతకి అద్దం పడుతుంది!
బెంగాల్ విషయంలో బీజేపి, ఆరెస్సెస్ చేసే ఆరోపణలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవ్వి రాజకీయ ఉద్దేశాలతో చేసేవి. బెంగాల్ ఓటర్లు మమతా బెనర్జీకి మతాలకతీతంగా స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఆమె అయిదేళ్లు ఎదురులేకుండా పాలన చేయవచ్చు. కాని, అదే సమయంలో ఒక పక్క దేశం కూడా బెంగాల్ లో జరుగుతోన్న ఉగ్రవాద కార్యకలాపాల్ని ఎత్తి చూపుతోందంటే తీవ్రంగా ఆలోచించాల్సిన అంశమే! తృణమూల్ నేతల్లోనే కొందరు బంగ్లాదేశీ చొరబాటు దారులతో కలసి పని చేస్తున్నారని ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. కాబట్టి ఇకనైనా మమతా బెనర్జీ ఉగ్రవాదుల కదలికలపై గట్టి నిఘా పెట్టి ఆటకట్టించాలి. లేకపోతే బెంగాల్ తో పాటూ దేశానికి ప్రమాదం ముంచుకు వస్తుంది!