జగన్ మీడియాపై టీటీడీ చైర్మన్ పరువు నష్టం దావా

  టీటీడీపై అసత్య ప్రచారం విషయంలో జగన్ మీడియాపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. తిరుమలపై ఆ చానల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని లీగల్‌ నోటీసులో తెలిపారు. తక్షణమే సదరు మీడియా టీటీడీకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీటీడీకి రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో టీటీడీ చైర్మన్  మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తాను తొమ్మిది నెలల నుంచి పనిచేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. తిరుమల కొండపై అన్న ప్రసాదం సుమారు రోజుకు రెండు లక్షల మంది సేవిస్తున్నారని వివరించారు. అన్న ప్రసాదంలో వడలాంటి కొత్త పదార్థాలను చేర్చామని వెల్లడించారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో కూడా అన్న ప్రసాదం సరఫరా జరుగుతోందని తెలిపారు. తిరుపతిలో స్థానికంగా ఉన్నవాళ్లకి నెలకు ఒకసారి శ్రీవారి దర్శనం గతంలో ఉండేదని.. మళ్లీ ఆ దర్శనాన్ని తాము పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు. టీటీడీలో అన్యమతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్లని వేరే డిపార్ట్‌మెంట్‌కి పంపించామని.. కొంతమందికి వాలంటరీ రిటైర్ట్‌మెంట్ ఇచ్చామని గుర్తుచేశారు బీఆర్ నాయుడు. టీటీడీలో అన్యమతస్థులపై ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. తిరుమల కొండపైన క్యాంటీన్‌లను వైసీపీ నేతలు తీసుకొని మాఫియాలాగా చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీవాణి దర్శనం సమయం మార్చామని.. ఉదయం నుంచి రాత్రి వరకు కాకుండా వెంటనే జరిగేలా చూశామని వెల్లడించారు. వీఐపీ దర్శన టైమింగ్ కూడా మార్చామని తద్వారా సామాన్యులకు దర్శనం సులువు అవుతుందని వివరించారు. అలిపిరి వద్ద భద్రత కొంత ఆలస్యం అవుతుందని.. వాటి కోసం కొత్త ఎక్విప్‌మెంట్ సమకూర్చుకుంటున్నామని చెప్పుకొచ్చారు. టీటీడీ పేరిట నకిలీ వెబ్‌సైట్‌ల‌ను పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా టీటీడీ దేవాలయాలు ఉండాలని.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విన్నవించామని గుర్తుచేశారు బీఆర్ నాయుడు. టీటీడీలో మత మార్పిడిని నివారించడానికి కృషి చేస్తున్నామని.. అందుకు కొత్త దేవాలయాలు నిర్మించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. హిందూ ధర్మ ప్రచారం కోసం ప్రత్యేక పుస్తకాన్ని భక్తులకు ఇస్తున్నామని వెల్లడించారు. సిమ్స్‌లో 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. శ్రీవారి ప్రసాదం నాణ్యత కోసం ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాము ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్న కొంతమంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.  జగన్ మీడియా హిందూ మతం మీద దాడి చేస్తోందని ఫైర్ అయ్యారు బీఆర్ నాయుడు. జగన్ మోహన్ రెడ్డి, భారతి రెడ్డి ఎప్పుడైనా తిరుపతికి వచ్చి శ్రీవారికి తలనీలాలు ఇచ్చారా..? వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిన్నారా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. హిందూ ధర్మం అంటే వారికి పడదని.. అందుకే దాడులు చేస్తున్నారని.. వారు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. తాము తప్పు చేస్తే చెప్పాలి కానీ ఇలా నిందలు వేయడం సరికాదని హితవు పలికారు.  మీరు ఎవరితో అయినా పెట్టుకోండి తనతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. తన మీద దాడి చేయండి.. కానీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అసత్య ప్రచారం చేయొద్దని హితవు పలికారు. వైసీపీ నేత భూమాన కరుణాకర్ రెడ్డి అవినీతి సామ్రాట్, డెకాయిట్ అని ఆరోపించారు. రూ.1600 వందల కోట్లు టెండర్లు ఇచ్చి పది శాతం పర్సెంట్ తీసుకున్నారని బీఆర్ నాయుడు విమర్శించారు.

లేడీ డాన్ అరుణకు 14 రోజుల రిమాండ్.. నెల్లూరు జైలుకు తరలింపు

లేడీ డాన్ అరుణకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను నెల్లూరు కోర్టు నుంచి జైలుకు తరలించారు. తన ప్రియుడు, రౌడీ షీటర్ శ్రీకాంత్ కు పెరోల్ మంజూరు చేయడంలో చక్రం తిప్పిందన్న ఆరోపణలపై అరుణను పోలీసులు బుధవారం (ఆగస్టు 20)అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తనను అరెస్టు చేస్తారని ముందుగానే ఊహించిన అరుణ హైదరాబాద్ కు పరారౌతుండగా ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద అదుపులోనికి తీసుకున్నారు.   ఈ సందర్భంగా అరుణ తన కారులో గంజాయి పెట్టి  తప్పుడు కేసులు పెట్టే ప్రమాదం ఉందంంటూ కారులోంచే సెల్పీలు తీసుకుంటూ  మీడియా, సోషల్ మీడియాకు విడుదల చేశారు. ఆ సందర్భంగా పోలీసులపై పలు విమర్శలు, ఆరోపణలు చేశారు. కట్ చేస్తే ఆమెను పోలీసులు నెల్లూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.  

మేడారం జాతరకు రూ.150 కోట్లు విడుదల

  ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు పాటు ఈ జాతర జరగనుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా అనబడే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు, మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించింది.  మంత్రి సీతక్క మాట్లాడుతూ.. “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం  రూ.150 కోట్ల మంజూరు చేయడం, గిరిజనులపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని పేర్కొన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరను అత్యంత కన్నుల పండుగగా జరుపుకుంటారు. సమ్మక్క సారక్కను దర్శనం చేసుకునేందుకు కోట్లాది సంఖ్యలో భక్తులు మేడారంకి వెళతారు.  

మంత్రి కొండా సురేఖకు కల్వకుంట్ల కవిత బర్త్ డే విషెస్!

అమెరికా పర్యటనలో ఉన్నా కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో సంచలనాలను సృష్టించే విషయంలో చాలా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఆమెకు విషెస్ తెలుపుతూ ఒక బొకే పంపిచారు. ఆ విషయాన్ని కొండా సురేఖ ధృవీకరిస్తూ కవితకు కృతజ్ణతలు తెలుపుతూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు షేర్ చేశారు. ఇప్పుడు ఈ విషయమే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేచింది. కారణమేంటంటే.. కొండా సురేఖ, కేటీఆర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. కొండా సురేఖ చేసిన విమర్శలపై కేటీఆర్ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో కోర్టు కొండా సురేఖను తప్పుపట్టింది కూడా. ఈ విషయంలో కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు పోలీసులను ఆదేశించింది కూడా.  ఇలా ఉండగా  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఆమె సోదరి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్ని అంగీకరించే ప్రశక్తే లేదని కవిత కుండబద్దలు కొట్టారు. అన్నా చెళ్లెళ్ల మధ్య విభేదాలు పీక్స్ కు చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కవితను కల్వకుంట్ల కుటుంబం దూరం పెడుతోందన్న వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కవిత కొండా సురేఖకు బర్త్ డే విషెస్ తెలుపుతూ బొకే పంపించడం రాజకీయంగా ప్రాథాన్యత సంతరించుకుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న చందంగా కవిత కేటీఆర్ వ్యతిరేకుంలందరినీ మిత్రులుగా భావిస్తున్నారా? అందులో భాగంగానే కొండా సురేఖకు బర్త్ డే విషెస్ తెలుపుతూ బొకే పంపారా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్‌‌ అరెస్ట్

  వ్యూహం మూవీ నిర్మాత దాసరి కిరణ్‌‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీల విషయంలో విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దాసరి కిరణ్‌ను విజయవాడకు తరలించారు. కాగా ఈ సినిమాకు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ  దర్శకత్వం వహించారు. వైఎస్ మరణం తరువాత జరిగిన రాజకీయ పరిస్థితుల్ని వ్యూహం మూవీలో ఆర్జీవీ చూపించారు గతంలో రామ్ గోపాల్ వర్మపై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యూహం మూవీ ట్రైలర్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను అవమానించినందుకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు టి.గంగాధర్ ఫిర్యాదు చేశారు.  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాక మన దేశమంతా, శాంతి, భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న ‘వ్యూహం’మూవీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనా, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పైనా, నటులు అజ్మల్ అమీర్‌పైనా,నటి మానసా రాధాకృష్ణన్ పైనా, ఆ సినిమాలో నటించిన మొత్తం నటీ, నటుల పైనా,ఆ సినిమాకు పనిచేసిన 24 క్రఫ్ట్స్ సిబ్బంది మొత్తం పైనా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి తగు చర్యలు తీసుకొనమని పోలీసులను టి.గంగాధర్ కోరారు.   

ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 71 మంది సజీవ దహనం

  ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు, ట్రక్కును ఢీకొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 17 మంది చిన్నారులతో సహా 71 మంది సజీవ దహనమయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులు  అధికారికంగా ధ్రువీకరించారు. ప్రావిన్షియల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ ఈ ఘటనపై స్పందించారు. హెరాత్‌లో బస్సు, ట్రక్కు, మోటార్‌సైకిల్ ఢీకొన్నాయన్నారు. ఈ దుర్ఘటనలో 71 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అత్యంత భయంకరమైన ప్రమాదాల్లో ఇది ఒకటని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  బస్సు పూర్తిగా మంటల్లో కాలిపోవడం, సమీపంలోని ప్రజలు భయాందోళనలకు గురవ్వడం ఈ వీడియోల్లో కనిపిస్తోంది. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఇరాన్ నుంచి తిరిగి వ‌స్తున్న‌ ఆఫ్ఘన్ వలసదారులని ప్రావిన్షియల్ అధికారి మహ్మద్ యూసుఫ్ సయీదీ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపారు. ఇరాన్‌తో కీలక సరిహద్దు ప్రాంతమైన ఇస్లాం ఖాలాలో వీరంతా బస్సు ఎక్కి రాజధాని కాబూల్‌కు బయలుదేరారని ఆయన వివరించారు. స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘోరం జరగడం తీవ్ర విషాదాన్ని నింపింది.

అమరావతి మునిగిపోతుంటే.. జగన్ ఎందుకు పర్యటించరు?

ఆరోపణలు చేసి చేతులు దులిపేసుకోవడమే తప్ప.. ఆ ఆరోపణలకు రుజువులు చూపించాలన్న బాధ్యతను మాత్రం ఇసుమంతైనా పట్టించుకోరు  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ .  ఇక అమరావతి విషయంలో ఆయితే ఆయన వెళ్లగక్కే విద్వేషానికి, చేసే విమర్శలు, ఆరోపణలకు అంతే ఉండదు. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని అనాథ రాష్ట్రంలా మార్చారు. మూడు రాజధానులంటూ కనీసం ఒక్క ఇటుక కూడా పేర్చకుండా.. విశాఖలో రుషికొండకు బోడిగుండు కొట్టి మరీ ప్యాలెస్ నిర్మిచారు. 151 స్థానాలతో అధికారం చేజిక్కించుకున్న వైసీపీ ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి 11 స్థానాలతో కనీసం ప్రతిపక్ష హోదాకి కూడా నోచుకోని విధంగా దిగజారిపోవడానికి అధికారంలో ఉండగా అనుసరించిన ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలే కారణమనడంలో ఎటువంటి సందేహం లేదు.  నాడు అంటే 2014-19 మధ్య కాలంలో అమరావతికి జై కొట్టిన జగన్.. అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమరావతిని నిర్వీర్యం చేయడానికి చేయగలిగినంతా చేశారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులను వేధించారు. వారిపై అక్రమ కేసులు బనాయించారు. ఇక అప్పటి ప్రతిపక్ష నేతపై అవమానక వ్యాఖ్యలు చేయించారు. అక్రమ కేసులో 52 రోజుల పాటు జైలుకు పంపారు.  సరే ఇవన్నీ పంటి బిగువున భరించి ఆగ్రహాన్ని పెదవి బిగింపులో దాచుకుని ఎన్నికల వేళ ప్రజలు తన సత్తా చాటి జగన్ కు ఘోరాతి ఘోరమైన పరాభవాన్ని, పరాజయాన్ని రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు.   తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని నిర్మాణం జోరందుకుంది. అయితే జగన్, ఆయన పార్టీ నేతలూ మాత్రం అమరావతిపై విషం కక్కడం మానలేదు. తాజా వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఫేక్ వీడియోలతో సోంత మీడియా, సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. ఇక్కడే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాబాహుల్యంలో ఓ సందేహం వ్యక్తం అవుతున్నది. నిజంగానే అమరావతి మునిగిపోతుంటే.. అక్కడి ప్రజలకు అండగా నిలబడి పోరాడేందుకు తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటి జగన్ ఎందుకు పర్యటించడం లేదు అన్నదే ఆ సందేహం.  జగన్ అమరావతిలో ముంపునకు గురైన ప్రాంతాలు నిజంగా ఉంటే.. ఆయా ప్రాంతాలలో పర్యటించవచ్చు కదా.. గతంలో బుడమేరు వరద ముంపులో బెజవాడ చిక్కుకున్నప్పుడు పర్యటించారు కదా? ఇప్పుడు ఆయనకు అడ్డుపడుతున్నదేమిటి? అడ్డుకుంటున్నదెవరు?  ఇక్కడే జగన్ తీరు,  అమరావతిపై వైసీపీ చేస్తున్న విమర్శలు నమ్మశక్యంగా లేవని జనం అంటున్నారు. పరిశీలకులు కూడా అమరావతి ముంపు అంటూ వైసీపీయులు చేస్తున్న రాద్ధాంతం అసత్య ప్రచార మేనని విశ్లేషిస్తున్నారు. నిజంగా అమరావతిలో ముందు ప్రాంతాలు ఉన్నట్లైతే.. జగన్ కచ్చితంగా పర్యటించేవారనీ, కానీ ఇప్పుడు పర్యటిస్తే అమరావతిలో వరద ముంపు కాకుండా, నిటారుగా నిలబడిన నిర్మాణాలు కనిపిస్తాయనీ తెలుసుకనుకనే ఫేక్ ప్రచారాలను నమ్ముకుని జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.  

ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష... రూ.6 లక్షల జరిమానా

  ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ముగ్గురు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పు నిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్  ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ   పీ. శ్రీనివాస్  పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.  పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబరు 72/2017 కేసులో ఈ  ముద్దాయిలు తిరుపతి జిల్లా నాగపట్ల ఈస్ట్ బీట్ చామల రేంజి పరిధిలో అరెస్టయ్యారు. వీరు తమిళనాడు తిరువన్నామలై జిల్లా కు చెందిన 1.పి. మురుగన్, 2. ఎస్. సురేష్, 3 ఎం. చిన్నపయ్యన్, కాగా  వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ స్మగ్లరుకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు అతనిని  నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది.   ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులోని అతి విలువైన సహజ సంపద ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమంగా ప్రవేశించే నేరస్తులకు ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు ఎస్పీ  పీ. శ్రీనివాస్  తెలిపారు. నిందితులకు శిక్షలు పడేలా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని ఆయన  అభినందించారు.

ఇక 21 ఏళ్లకే అసెంబ్లీలోకి?

  రేవంత్ రెడ్డి ఇవాళ కొత్త కామెంట్ చేశారు. అదేంటంటే గతంలో రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు వచ్చేలా చేశారు. అదే స్ఫూర్తితో ప్రస్తుతం 21 ఏళ్లకే అసెంబ్లీలో అడుగు పెట్టేలా తాము చట్ట సవరణ చేయాలని భావిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజానికి 18 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలను ఎంపిక చేసుకుంటున్నపుడు.. 21 ఏళ్లకు మాత్రం ఎందుకు ఎమ్మెల్యే కాకూడదని అన్నారు రేవంత్. ఇప్పటికి ఈ వయసు 25 ఏళ్లుగా ఉందని.. మీరంతా సమ్మతిస్తే తామీ నిర్ణయం తీసుకోవడం ఏమంత కష్టం కాదని అన్నారాయన. అయితే అలా జరగాలంటే, రాహుల్ గాంధీ పీఎం కావల్సి ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే జరిగితే మిగిలిన వన్నీ అలవోకగా జరిగిపోతాయని అన్నారు. రాజీవ్ గాంధీ ప్రేరణతో చట్ట సభల్లో యువరక్తం అడుగు పెట్టేలా తామంతా సిద్ధంగా ఉన్నామని.. కాంగ్రెస్ కి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయగలిగితే ఇదంతా సాధ్యమేన్నారు రేవంత్. ఓకే గానీ ఇదంతా చూస్తుంటే పెళ్లి వయసును తలపిస్తోందని అంటున్నారు. పెళ్లిలో 18 ఏళ్ల అమ్మాయి- 21 ఏళ్ల అబ్బాయిని అధికారికంగా అర్హమైన వయసుగా చెబుతుంటారు. ఇప్పుడు పద్దెనిమిదేళ్లకు ఓటు హక్కు, 21 ఏళ్లకు అసెంబ్లీలో అడుగు పెట్టే అర్హత రావడం ఒక రకంగా కొత్త రాజకీయం చూసే అవకాశం లేక పోలేదని అంటున్నారు. ఇక బీజేపీకి మల్లే కాంగ్రెస్ లో కూడా 75 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి విరమణ తీసుకునే విధానం కూడా తెస్తే బావుంటుందని.. అప్పుడు ఆటోమేటిగ్గా.. రాజకీయాల్లో యువ రక్తం ప్రవేశిస్తుందని కామెంట్ చేస్తున్నారు కొందరు.

పెద్దారెడ్డికి హై కోర్టు షాక్.. తాడిపత్రిలోకి నో ఎంట్రీ

మాజీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన తాడిపత్రి ఎంట్రీకి అనుమతి ఇస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్డు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది.  హైకోర్టు అనుమతి ఉన్నా తనను తాడిపత్రిలోకి పోలీసులు అనుమతించలేదంటూ ఆరోపణలు గుప్పిస్తున్న పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు పెద్ద షాక్ అనే చెప్పాలి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించి ఆయనకు భద్రత కల్పించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు అనంతపురం జిల్లా ఎస్పీ. జిల్లా ఎస్పీ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇస్తూ బుధవారం (ఆగస్టు 20) ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

బాబు ద బిజినెస్ మెన్

  రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రతన్ టాటా చనిపోవచ్చేమోగానీ ఆయన ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోవడం తనకు ఇష్టం లేదన్నారాయన. అందుకే ఈ హబ్ స్థాపించినట్టు చెప్పారు. మన కంటి ముందు హైదరాబాద్‌లో ఐటీ ర్యాలీ తీసింది మనం చూసే ఉంటాం. తాను ఈ విషయం అప్పుడే పసిగట్టి.. ఐటీ ని ఎంకరేజ్ చేశాననీ తర్వాత ఇప్పుడు ఐటీలో మన వాళ్లు మేటిగా ఉన్నట్టు చెప్పారాయన.  ఇప్పుడు అమరావతి అనే రాజధాని నిర్మాణం చేసే అదృష్టం నాకొచ్చింది. దీంతో ఈ ప్రాంతాన్ని క్వాంటం వ్యాలీగా మార్చడమే తన ధ్యేయమన్నారు చంద్రబాబు. అదేమంత పెద్ద కష్టం కాదని.. తానందించిన ప్రేరణతో ఇప్పుడు ఎటు చూసినా తెలుగువారే కనిపిస్తున్నారని.. యూఎస్‌లో పెద్ద స్థాయిలో భారతీయులు రాణిస్తుంటే వారిలో 33 శాతం తెలుగు వారే ఉన్నారని అన్నారాయన. ఇదే స్ఫూర్తితో తాను అమరావతిని సైతం తీర్చిదిద్దాలని చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇంటికో ఐటీ ఎంప్లాయి ఉండాలని భావించిన తాను- ప్రస్తుతం ఇంటికో ఎంటర్ ప్రెన్యూర్ ఉండేలా భావిస్తున్నానని.. అందుకే ఈ రతన్ టాటా హబ్ తీసుకొస్తున్నట్టు చెప్పుకొచ్చారాయన.  అంతే కాదు తన స్వీయ అనుభవాలను కూడా ఈ సందర్భంగా రంగరించారు చంద్రబాబు. 1992లో తాను హెరిటేజ్ ఐడియా తీసుకొచ్చానని.. కారణం మనం ఎప్పుడైతే రాజకీయాల్లాంటి ఐడియల్ ప్లేసెస్ లో ఉన్నామో.. మన కుటుంబానికంటూ ఒక ఆర్ధిక ఆధారం ఉండాలని తాను మొదట భావించినట్టు చెప్పుకొచ్చారాయన. దీంతో తానీ వ్యాపారం ప్రారంభించామని.. తర్వాత కాలంలో.. దాన్ని నడిపే బాధ్యతను తన సతీమణి భువనేశ్వరికి ఇచ్చాననీ.. తొలుత ఆమె పెద్ద గొప్పగా ముందుకు రాకున్నా.. ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో వండర్స్ క్రియేట్ చేసినట్టు చెప్పారు. ఇప్పుడు తాము తమ కుటుంబం హ్యాపీగా ఉన్నామని. ఈ ప్రేరణతో తాను ఇంటింటికీ ఒక ఎంటర్ ప్రెన్యూర్ ప్రొగ్రాం తీసుకొస్తున్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు.

ఓల్డ్ సీటిని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే : సీఎం రేవంత్

  ప్రపంచ స్థాయి నగరంలో ప్రభుత్వ ఆఫీసులు సరిగ్గా లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన కార్యాలయంలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. గచ్చిబౌలిలో 8 నెలల్లో అంతర్జాతీయ స్ధాయి నూతన భవన సముదాయాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రక్షాళనను కొందరు వ్యతిరేకించిన ఓల్డ్ సీటిని గోల్డ్ సిటీగా మార్చాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందేనని తెలిపారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్‌లో ఉండటం గర్వకారణమని సీఎం అన్నారు. చంద్రబాబు, వైఎస్ఆర్‌‌లు కూడా హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. ఇక దేశంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి వెనుకు స్వర్గీయ రాజీవ్ గాంధీ పాత్ర కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే హైటెక్స్ సిటీకి పునాది రాయి పడిందని, ఆ తరువాత దాని నిర్మాణాన్ని చంద్రబాబు కొనసాగించారని రేవంత్ గుర్తు చేశారు. అమెరికాలో కూడా సిలికాన్ వ్యాలీని తెలుగు వాళ్లు శాసిస్తున్నారని తెలిపారు. తెలుగు వాళ్లు లేకపోతే అమెరికా ఐటీ కంపెనీలు నడిచే పరిస్థితి లేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌లతో హైదరాబాద్‌కు పోటీగా నిలబెట్టాలని తెలిపారు.  కానీ, మూసీ ప్రక్షాళన.. ఫ్యూచర్ సిటీ కొందరికి నచ్చడం లేదని కామెంట్ చేశారు. ఆనాడు కూడా హైటెక్స్ సిటీని కొందరు అవహేళన చేశారని.. ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు, ఊరు చివర ఎయిర్‌పోర్టా అంటూ కామెంట్లు చేశారని గుర్తు చేశారు.తెలంగాణ రైజింగ్ నినాదంతో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు పాల్గోన్నారు.

13 గంటలు.. ఎనిమిది భేటీలు.. హస్తినలో లోకేష్ స్పీడ్ మామూలుగా లేదుగా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటన దేశవ్యాప్తంగా  అందరి దృష్టినీ ఆకర్షించింది. రాజకీయాలతో  సంబంధ్ లేకుండా లోకేష్ హస్తిన పర్యటనను అన్ని పార్టీల నేతలూ ఆసక్తిగా గమనించాయి. నిజానికి  లోకేష్ తాజా హస్తిన పర్యటన పూర్తిగా ఫలవంతమైంది. లోకేష్ కోరడం ఆలస్యం కేంద్ర మంత్రులంతా ఆయనకు పోటీలు పడి మరీ అప్పాయింట్ మెంట్లు ఇచ్చారు. కేవలం 13 గంటల వ్యవధిలో ఆయన ఎనిమిది మంది కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. అలాగే ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాథాకృష్ణన్ ను కలిసి అభినందించారు. అంతే కాదు ఈ సారి పర్యటనలో ఆయన హస్తినలో టీడీఎల్పీ కార్యాలయాన్ని సందర్శించారు. టీడీఎల్పీ కార్యాలయానికి లోకేష్ వెళ్లడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా లోకేష్ కు తెలుగుదేశం, జనసేన ఎంపీలు ఘన స్వాగతం పలికారు.  సాధారణంగా ఈ స్థాయిలో మంత్రులతో భేటీలు జరపడం, రాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం నిర్విరామంగా కృషి చేయడంలో ఇంత వరకూ చంద్రబాబుకు ఎవరూ సాటిరారన్న పేరు ఉంది. అయితే లోకేష్ తాజా హస్తిన పర్యటన ఆయన చంద్రబాబును బీట్ చేసేశారా అనిపించేలా ఉందని ఒక్క తెలుగుదేశం కూటమి నాయకులే కాదు.. పలు జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా అంటున్నారు. ఆయన స్పీడ్ ఓ రేంజ్ లో ఉందని ప్రశంసిస్తున్నారు.   ఈ భేటీలలో నారా లోకేష్  రోడ్లు, డేటా సిటీ, పోర్టు అభివృద్ధి గ్రాంట్లు సహా అనేక కీలక అంశాలపై సంబంధిత మంత్రులతో చర్చించారు. దాదాపుగా.. దాదాపుగా ఏమిటి.. ఆయన కలిసిన కేంద్ర మంత్రులంతా లోకేష్ వినతులకు సానుకూలంగా స్పందించారు. ఏపీ అభివృద్ధి విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామంటూ ముందుకు వచ్చారు.  ఆంధ్రప్రదేశ్ సమగ్ర సంతులిత అభివృద్ధికి కేంద్రం సహకారం సాధించడమే ధ్యేయంగా సాగిన లోకేష్ హస్తిన యానం పూర్తిగా ఫలవంతమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

శ్రీశైలం వద్ద కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతున్నది. దీంతో  ప్రాజెక్టు శ్రీశైలం జలాశయానికి వరద ఉదృతి కొనసాగుతుంది. దీంతో  ప్రాజెక్టు  గేట్లును ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3లక్సల 45 వేల 730 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ కు ఉరకలెత్తుతోంది.  అధికారులు. శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 3లక్సల 45 వేల 730 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ కు ఉరకలెత్తుతోంది. అయితే ఎగువన జూరాల నుంచి 2 లక్షల 65 వేల 957 క్యూసెక్కుల వరదనీరు, సుంకేసుల నుంచి 1 లక్ష 42 వేల 294 క్యూసెక్కుల  వరదనీరు  శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నది.  దీంతో  శ్రీశైలం జలాశయానికి మొత్తంగా   4 లక్షల 09 వేల 376 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 4 లక్షల 11 వేల 237 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.10 అడుగులగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 199.7354 టీఎంసీలుగా నమోదైంది.  శ్రీశైలం కుడి ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిస్థాయిలో కొనసాగుతుంది.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ మొసలి కన్నీరు!

కొన్ని నాటకాలు రక్తి కడతాయి. కొన్ని నాటకాలు వాస్తవాన్ని బయటపెడతాయి.  ఇప్పుడు వైసీపీ పరిస్థితి విశాఖలో అదే రకంగా ఉంది.  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కేవలం కార్మికులే కాదు,  ఉత్తరాంధ్ర ప్రజలు సైతం ఆవేదనతో ఉన్నారు.  ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన ఈ స్టిల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నది ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్. డిమాండ్ కూడా.  అయితే ఆ సెంటిమెంటును రాజకీయంగా వాడుకోవడానికి వైసిపి తొలి దశ నుంచి ప్రయత్నిస్తోందని తాజా పరిణామాలను బట్టి స్టీల్ కార్మికులు ఆరోపిస్తున్నారు.  ఆంధ్రుల హక్కు నినాదంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పుట్టింది.  ప్రపంచంలోనే నాణ్యమైన స్టీల్ గా విశిష్టత గాంచింది.  కానీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడింది.  ప్రధానిగా వాజ్ పేయి ఉన్న సమయంలో ప్లాంటును ప్రైవేటీకరించాలన్నఅధికారుల ప్రతిపాదనను అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు.  కేంద్రాన్ని ఒప్పించి బిఎఫ్ఆర్ నుంచి కాపాడారు.  ఆ తర్వాత మళ్లీ దశాబ్ద కాలం తర్వాత ప్లాంట్ సంక్షోభంలో పడింది.  ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దీన్ని ప్రైవేటీకరించాలని ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ సమయంలో అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ   దీన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకించలేదు. ఒక దశలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాంట్ లో మిగులు భూమిని విక్రయించి నష్టాల నుంచి బయటపడాలని సూచించారు అయితే కార్మిక నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ కోసం రైతులు ఇచ్చిన భూములను విక్రయించడానికి అంగీకరిం చలేదు.  అయితే స్టీల్ కార్మికులు ఉత్పత్తి ఆగకుండా ఉద్యమాలు కొనసాగించడానికి సహకరిస్తామని ఫ్యాన్ పార్టీ నాయకులు ప్రకటించారు.  అది నిజమేనని భావించి కార్మికులు వైసిపి వెంట నడిచారు.  అయితే ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఫ్యాన్ పార్టీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదు.  దీంతో ప్లాంట్ మరింత నష్టాల్లోకి కష్టాల్లోకి వెళ్ళింది.  కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తేవడంతో 1140 కోట్ల రూపాయల  ఆర్థిక సహాయం అందించింది.  అయితే ప్లాంట్ ను విక్రయించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు విమర్శలు గుప్పించారు.   అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఒక్క పైసా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆర్థిక సహాయం తీసుకురాకపోగా,  కాకపోగా ఆ సమయంలో ఆ పార్టీ పరోక్షంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాలేదు. దీంతో దాదాపు నాలుగేళ్లగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై తర్జనభర్జనులు కొనసాగుతూ ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురాని ఈ ఫ్యాన్ పార్టీ ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని స్టీల్ కార్మికులు ఆరోపిస్తున్నారు.

నల్లజర్లలో రేవ్ పార్టీ!

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో రేవ్ పార్టీ కలకలం రేపింది. పుట్టిన రోజు పార్టీ అంటూ నల్లజర్ల మండలం ఘంటవారి గూడెంలో రేవ్ పార్టీ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు దాడి చేసి ముగ్గురు యువతులు, పాతిక మంది పురుషులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు, ఏడు కార్లు, ఖరీదైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. పాశ్చాత్య మోజులో పడి ఇటువంటి అసాంఘిక, అనైతిక కార్యక్రమాలకు తెగబడితే ఉపేక్షించేది లేదని పోలీసు అధికారలు ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా ఇంత వరకూ హైదరాబాద్ వంటి మెట్రోపాలిటిన్ నగరాలకే పరిమితం అనుకున్నరేవ్ పార్టీ కల్చర్ పచ్చదనంతో కళకళలాడే తూర్పుగోదావరి జిల్లాకూ పాకడం పట్ల ఆందోళన వ్యక్తమౌతోంది. నల్లజర్ల సంఘటన విషయానికి వస్తే బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనీ, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

హిమాచల్ లో రెండు సార్లు కంపించిన భూమి

హిమాచల్ ప్రదేశ్ పై ప్రకృతి పగబట్టినట్టుగా ఉంది. ఆ రాష్ట్రంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. భారీ వర్షాలు, వరదలూ, క్లౌడ్ బరస్ట్ లతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైపోతోంది. ఇటీవలి కాలంలో భారీ వర్షాలు, వరదలు, క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా దాదాపు 300 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. ఇప్పుడు తాజాగా హిమాచల్ ప్రదేశ్ ను భూకంపం కుదిపేసింది. బుధవారం (ఆగస్టు 20) ఉదయం హిమాచల్ ప్రదేశ్ లో గంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. మొదటి సారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదు కాగా, రెండోసారి సంభవించిన భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. ఈ వరుస భూకంపాలతో జనం భయాందోళనలకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.  

భద్రాచలం వద్ద వరద గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నది. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వానలతో గోదవరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద  గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతోభద్రాచలం వద్ద గోదావరి రౌద్రరూపం దాల్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీరు కలిసి గోదవరిలో ప్రవాహ ఉధృతి భారీగా పెరిగింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద స్నానఘట్టాలు నీట మునిగాయి.  పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం నీట మునిగాయి. మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు   26 గేట్లు ఎత్తి  నీటిని దిగువకువిడుదల చేస్తున్నారు.