మోడీ దత్తపుత్రుడు జగన్.. వైసీపీ బీజేపీ బీటీమ్!

ఉపరాష్ట్రపతి ఎన్నిక  అనివార్యమైంది. ఎన్డీయే కూటమి అభ్యర్థిని ప్రకటించిన తరువాత సుదీర్ఘ చర్చల అనంతరం ఎన్డీయే కూటమి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. దీంతో ఏకగ్రీవానికి అవకాశం లేకుండా పోటీ అనివార్యమైంది.  ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఉప రాష్ట్రపతి ఎన్నిక రాజకీయాన్ని రసకందాయంలో పడేలా చేసింది. ఇండియా కూటమి అభ్యర్థి తెలుగువారవ్వడం, ఇంత వరకూ ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి కావడంతో.. పోవడంతో  ఏ కూటమిలోనూ లేకపోయినా జగన్ నాయకత్వంలోని వైసీపీ ఆయనకు కాకుండా, ఎన్డీయే కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. మిగిలిన వారందని విమర్శలూ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ కు స్వయానా సోదరి అయిన షర్మిల విమర్శలు మాత్రం జగన్ నోట మాట రానీయకుండా చేస్తున్నాయి. తన సోదరుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ ప్రధాని మోడీకి దత్తపుత్రుడంటూ ఆమె మరో సారి జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయ పరిస్థితులు, పరిణామాలతో సంబంధం లేకుండా జగన్ ఎన్డీయే అభ్యర్థికి బేషరతు మద్దతు ఇవ్వడాన్ని సూటిగా ప్రశ్నించిన షర్మిల.. తెలుగుదేశం, జనసేన, జగన్ ఒకే తానులోని ముక్కలని విమర్శించారు. అయితే తెలుగుదేశం, జనసేనలు బీజేపీతో తమ బంధాన్ని బహిరంగంగా చెబుతుంటే.. జగన్ మాత్రం రహస్యంగా బీజేపీ పంచన చేరి ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటున్నారని విమర్శించారు. ఇంత కంటే దారుణం మరోటి ఉండదన్నారు. ఇండియా కూటమి తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిల బెట్టినా, జగన్ నిస్సిగ్గుగా ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని బట్టే వైసీపీ బీజేపీ బీటీం అని అర్ధ మౌతోందని షర్మిల అన్నారు. వైసీపీ రాష్ట్రప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.  చూడాలి షర్మిల విమర్శలకు జగన్ ఏ రకంగా స్పందిస్తారో?

శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్

  శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘేను  ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై  క్రిమినల్ ఇన్వెస్టిషన్ డిపార్ట్‌మెంట్ అరెస్ట్ చేశారు. 2023లో ఆయన విదేశీ పర్యాటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. మొత్తం 10 మంది ప్రమేయం ఉందని సీఐడీ పేర్కొంది. ఆయన వ్యక్తిగత లండన్ పర్యటనకు రూ. కోటీ 70 లక్షల ప్రభుత్వ నిధులు వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.  2023లో ఆయ‌న లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ఆ అంశానికి సంబంధించిన కేసులో విక్ర‌మ‌సింఘేను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. బ్రిటీష్ యూనివ‌ర్సిటీలో విక్ర‌మ‌సింఘే భార్య‌ను స‌త్క‌రించే కార్య‌క్ర‌మం కోసం ఆయ‌న వెళ్లారు. విక్ర‌మ‌సింఘేను కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రుస్తున్న‌ట్లు అధికారి తెలిపారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల కోసం ప్ర‌భుత్వ నిధుల‌ను వాడుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని ఆ అధికారి చెప్పారు. 2022లో గోటబయ రాజపక్స రాజీనామా చేసిన తర్వాత విక్రమసింఘే అధ్యక్ష పదవిని చేపట్టారు. 2024లో ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.  

కేసుల భయంతో వణికిపోతూ చేసే రాజకీయం ఇలాగే ఉంటుంది మరి!

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఒక వేళ మద్దతు ప్రకటించకపోయి ఉంటే అందరూ ఆశ్చర్యపోయి ఉండే వారు. అయితే ఎవరినీ ఆశ్చర్యపరచడం ఇష్టం ఉండని జగన్ తమ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ ద్వారా ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ కే వైసీపీ మద్దతు అని ఒక ప్రకటన చేయించారు. అక్కడితో ఆగకుండా బీజేపీ అగ్రనేతలు స్వయంగా కోరడం వల్లనే పార్టీలో చర్చించి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు. ఔను కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ స్వయంగా జగన్ కు ఫోన్ చేసి మద్దతు కోరారని ప్రచారం చేసుకుంటున్నది వైసీపీ. సరే ఇవన్నీ పక్కన పెట్టి సపోజ్.. ఫర్ సపోజ్ రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి ఉండకపోతే ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా ఇండియా కూటమికి వైసీపీ మద్దతు పలికి ఉండేదా?  అంటే అబ్బే అటువంటి పరిస్థితి లేదన్న సమాధానమే ఆ పార్టీ నాయకత్వం నుంచి వ స్తుం ది.  ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా కూటమి తరఫున సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి రంగంలో ఉన్నారు. ఆయన తెలుగువారు కూడా.  అయినా కూడా వైసీపీ ఎన్డీయే కూటమి అభ్యర్థికే మద్దతు ప్రకటించింది. ఎన్డీయే కూటమిలో వైసీపీకి ప్రత్యర్థి అయిన తెలుగుదేశం భాగస్వామిగా ఉంది. అయినా సరే వైసీపీ హడావుడిగా నిర్ణయం తీసేసుకుని ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించేసింది. తద్వా రా జగన్ తాను అప్పుడూ, ఇప్పడూ, ఎప్పుడూ మోడీ, షా కు విధేయుడేనని చెప్పకనే చెప్పేసింది.  అలా చెప్పకుంటే.. అలా విధేయత ప్రకటించకుండా ఉంటే కేసులతో ఇబ్బంది తప్పదన్న సంగతి జగన్ కు బాగా తెలుసు. ఎప్పుడైనా మాట మాత్రంగానైనా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వ విధానాలపై విమర్శల చురకలేసినా, లేశ మాత్రంగానైనా వ్యతిరేకత ప్రకటించినా.. గత పదేళ్లకు పైగా హాయిగా బెయిలుపై తిరుగుతున్న తనకు జైలే గతి అవుతుందన్న భయం జగన్ కు నిలువెల్లా ఉందంటూ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతే కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తన హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో జగన్ ఇప్పటికే పీకలోతు ఇరుక్కున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. పకడ్బందీగా అడుగులు ముందుకు వేస్తున్నది. సిట్ వేస్తున్న ప్రతి అడుగూ మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగన్ అని తేల్చే దిశగానే సాగుతున్నాయి. మద్యం కుంభకోణం కేసులో జగన్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో టుడు ఆర్ నాట్ టు డు అన్న సందేహానికి వీసమెత్తైనా అవకాశం ఇవ్వకుండా  ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ప్రకటించేసి.. అరెస్టుల నుంచి కాపాడాల్సిందంటూ మోడీ, జగన్ లకు శరణుచొచ్చానన్న సంకేతం ఇచ్చేలా  జగన్ డ్రెస్, ఫేస్ కూడా మార్చేశారంటున్నారు. బీజేపీ పెద్దలకు విధేయంగా ఉండటం కంటే ఉన్నానన్న సంగతిని కమలనాథులకు కనిపించేలా చేయడం తక్షణ కర్తవ్యంగా భావించిన జగన్  అందుకు తగ్గట్టుగానే అందరి కంటే ముందే ఎన్డీయే అభ్య ర్థి రాథాకృష్ణన్ కు మద్దతు ప్రకటించేశారంటున్నారు.  కేసులు, అరెస్టులు, బెయిలు రద్దుల భయంతో జగన్ చేసే రాజకీయం ఇలా కాక మరెలా ఉంటుందంటున్నారు పరిశీలకులు. జగన్ ఈ తరహా రాజకీయమే వైసీపీకి శాపంగా, మరణశాసనంగా మారిందని అంటున్నారు. 

పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ కానుక

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజక వర్గం ఆడపడుచులకు శ్రావణ శుక్రవారం కానుకగా చీర, పసుపు కుంకుమ పంపించారు. శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో జనసేన ఆధ్వర్యంలోవరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. తొలి  పూజల్లో ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ పాల్గొని వ్రతమాచరించారు.  ఈ సందర్భంగా పాదగయ పుణ్యక్షేత్రానికి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 మంది మహిళలకు కానుకగా ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పంపించిన చీరలు, పసుపు, కుంకుమ కిట్లను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే  పంతం నానాజీ , పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త  మరెడ్డి శ్రీనివాస్ , జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.

బీజేపీ అధ్యక్షుడు అరెస్ట్

  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్  చేశారు. సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మొయినాబాద్ వద్ద అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు హైదరాబాద్ నగర పరిధిలో బీజేపీ నాయకులను కార్పొరేటర్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు.దీంతో నాయకులు, కార్పొరేటర్లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.  తుర్కయాంజల్‌లోనూ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని అబ్దుల్లాపూర్‌ మెట్‌ పీఎస్‌కు తరలించారు. మరోవైపు సరూర్‌నగర్‌ కార్పొరేటర్‌ శ్రీవాణి సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆమెతో పాటు పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడానికి తీవ్రంగా బీజేపీ నేతలు ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్న మునిసిపల్ శాఖ నగర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలం చెందుతుందని అన్నారు.  హైదరాబాద్ నగరంలో విచ్చలవిడిగా హై టెన్షన్ వైర్లు జనవాసాల మీద ఉండడం మూలంగా ఇటీవల రామంతపూర్ లాంటి ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్పగా చెప్పుకుంటున్న జిహెచ్ఎంసి, హైడ్రా, ఆయా విభాగాల మధ్య సమన్వయం లేదని దీంతో హైదరాబాదులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు.  వెంటనే దీనిపై ముఖ్యమంత్రి స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.

ఆసియా కప్ లో టీమ్ ఇండియా x పాకిస్థాన్

ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్  దాయాది దేశాల క్రికెట్ జట్ల మధ్య మరో పోరుకు వేదిక కానుంది. త్వరలో జరగనున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల తలపడను న్నాయి. ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలు లేని కారణంగా ఇంత కాలం అంతర్జాతీయ టోర్నీలలో అంటే ఐసీసీ ఈవెంట్లలో తప్ప ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక మ్యాచ్ లు జరగడం లేదు. ఆయితే అసలు ఇక అంతర్జాతీయ టోర్నీలలో కూడా ఇరు దేశాల జట్లూ తలపడే అవకాశం ఉండదన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఔను.. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్యా యుద్ధం తప్పదా అన్న పరిస్థాతి ఏర్పడింది. దాడులు, ప్రతి దాడులూ కూడా జరిగాయి. ఆపరేషన్ సిందూర్ తో భారత్.. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసింది. ఆ తరువాత పాకిస్థాన్ కాళ్లా వేళ్లా పడటంతో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన పోటీని భారత్ బహిష్కరిస్తుందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. రాజకీయపార్టీలు, సామాన్య ప్రజలే కా దు.. క్రికెట్ అభిమానులు సైతం పాకిస్థాన్ తో మ్యాచ్ వద్దంటే వద్దని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో తలపడాల్సిన మ్యాచ్ ను టీమ్ ఇండియా బహిష్కరించడానికే ఎక్కువ అవకాశాలున్నాయన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో భారత క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా చేసిన ప్రకటన భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ విషయంలో క్లారిటీ ఇచ్చింది. పాకిస్థాన్ తో ఎటువంటి క్రీడా సంబంధాలకూ తావులేదని స్పష్టం చేసిన మంత్రిత్వ శాఖ అయితే అంతర్జాతీయ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మల్టీ నేషనల్ ఈవెంట్ల విషయంలో ఈ నేషేధం ఉండదన్న క్లారిటీ ఇచ్చింది. అంటే ఆసియా కప్ లో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు తలపడేందుకు ఎటువంటి ఆటకం లేదని స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 14న ఆసియా కప్ లో భాగంగా టీమ్ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. దీంతో ఈ మ్యాచ్ పట్ల ఇరు దేశాలలోనే కాకుండా.. క్రికెట్ ఆడే దేశాలన్నిటిలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. టోర్నీ ఏదైనా, వేదిక ఏదైనా భారత్, పాక్ మధ్య మ్యాచ్ అంటే అదో హైటెక్ మ్యాచే. యుద్ధం జరుగుతోందా అన్నంత ఉత్కంఠ నెలకొంటుంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ పట్ల ఆసక్తి వ్యక్తమౌతుంది. అసలు ఇరు జట్ల మధ్యా మ్యాచ్ ఉందంటేనే అది టోర్నీకే ఒక అదనపు ఆకర్షణగా మారుతుంది. 

దార్శనికుడు పాలకుడైతే..

ఓ సైబరాబాద్.. ఓ కియా ఫ్యాక్టరీ ఓ బిడ్డకు జన్మనిచ్చే సమయంలో ఆ తల్లి పడే ప్రసవవేదన ఏమిటో మన అందరికీ తెలిసిందే… అలాగే ఒక పరిశ్రమ … ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి భూములు కోల్పోయే రైతులు పడే ఆవేదన అంతకు ఏ మాత్రం తక్కువ కాదు.   తాను జన్మనిచ్చిన బిడ్డ  బుడిబుడి నడకలు వేస్తూ… బోసినవ్వుల మాటలు చెబుతూ ఉంటే ఆ తల్లి ఆనందానికి అవధులు ఉండవు… అలాగే పరిశ్రమలు , ప్రాజెక్టులు పూర్తయి ఫలాలు అందరికీ అందినప్పుడూ ప్రజల ఆనందం, వారి అనుభూతి   మాటల్లో చెప్పలేనిదనడంలో సందేహం లేదు.  దీనికి ఉదాహరణే దార్శనికుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలు….. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలో గిట్టని వాళ్ళు చేసిన విమర్శలు… హేళనలు  అన్నీ ఇన్నీ కావు.. కానీ నేడు అదే హైటెక్ సిటీ ఒక కొత్త నగరాన్నే నిర్మించింది.. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచింది… రాష్ట్రం విడిపోయాక ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా ముఖ్యమంత్రి గా చంద్రబాబు దూరదృష్టి తో ఆవిష్కరించినదే కియా కార్ల తయారీ పరిశ్రమ… కరవు కాటకాలకు నెలవైన అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో కార్ల తయారీ కర్మాగారాన్ని 536 ఎకరాలను కేటాయించారు..  కొండలు .. గుట్టలతో ఉన్న ఆ ప్రాంతాన్ని చదును చేసి  కియా కార్ల కంపెనీకి అప్పగించారు.  కర్మాగారానికి అవసరమైన నీటిని కూడా కేటాయిస్తూ జీవోలు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో హైటెక్ నిర్మాణం చేపట్టినప్పుడు ఎదురైన విమర్శలే ఇక్కడా వినిపించాయి.. అయినా చంద్రబాబు ఇవేవీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు.  కరువు సీమలో నీటిని సాగుభూములకు ఇవ్వకుండా కార్పొరేట్ సంస్థలకు ఇస్తున్నారని విపక్షాలు విమర్శలు చేశాయి. కానీ కర్మాగారం వస్తే ఆ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుందో రైతులకు వివరించి మరీ ఒప్పించారు చంద్రబాబు.  2017లో కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.  2019 నాటికి ఉత్పత్తి ప్రారంభించగానే..   మొదటి ఏడాదిలోనే 50 వేలకు పైగా కార్లను ఉత్పత్తి చేసిన కియా కంపెనీ,  2025 నాటికి 15 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది…ఏటా 3 లక్షల కార్లను మార్కెట్లోకి విడుదల చేయాలన్న లక్ష్యంగా మూడో షిఫ్ట్ జోడించారు. చంద్రబాబు హయాంలో కర్మాగారం పనులు సాఫీగా సాగాయి.  ప్రభుత్వం మారాక కొన్ని బాలరిష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అప్పటి అధికార పార్టీ నాయకుల దందాల రానఫంగా.  కియా అనుబంధ పరిశ్రమను తమిళనాడుకు తరలించే ప్రయత్నాలూ జరిగాయి.   కియా పరిశ్రమ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు కృషి ప్రస్తుతం ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది.  గతంలో భూములు అమ్ముకుందామంటే కొనే దిక్కులేదు.  కాని నేడు పరిస్థితి అందు కు పూర్తి భిన్నంగా ఉయారైంది.  అందుకే దార్శనికుడు పాలకుడితే రాష్ట్ర పురోగతి ఎలా ఉంటుందో కి యా పరిశ్రమ ను చూస్తేనే తెలుస్తుంది.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

గోదావరి నదికి వరద కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 14 అడుగులకు చేరుకోవడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదవరి వరద ఉధృతి కారణంగా రాజమహేం ద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద మెట్లు పూర్తిగా నీటమునిగాయి. ఇక్కడ నీటి మట్టం 55 అడుగులుగా ఉంది. కాగా వరద ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజి 175 గేట్లూ ఎత్తివేసి 13 లక్షల 5 వేల 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ముంపు ముప్పు ఏర్పడింది. అధికారులు లోతట్టు ప్రాంతాలవారిని అప్రమత్తం చేశారు.  లంకగ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.  సాయంత్రానికి వరద ఉధృతి ఒకింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

చర్చలు ఫలించాయి.. సినీ కార్మికుల సమ్మె ముగిసింది

గత 18 రోజులుగా చేస్తున్న సమ్మెను సినీ కార్మికులు విరమించారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో నిర్మాతలు, కార్మికులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదరడంతో  నిర్మాతలు , ఫెడరేషన్ నాయకుల తో కార్మికశాఖ అదనపు కమిషనర్ జరిపిన చర్చలు చర్చలు ఫలించాయి.  దీంతో ఇంత కాలంగా నిలిచిపోయిన షూటింగ్ ను శుక్రవారం (ఆగస్టు 22) నుంచి ప్రారంభమయ్యాయి. సమ్మె ముగిసి షూటింగ్ లు ఆరంభం కావడంతో  కృష్ణానగర్ లో సందడి కనిపించింది.   జూనియర్ అరిటిస్టులు ఇతర విభాగాలకు చెందిన టెక్నీషియన్స్ చేతినిండా పని దొరకుతుందన్న సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 18రోజులుగా షూటింగ్ లు నిలిచిపోవడంతో.. ఇక ఎక్కడా బ్రేక్ లేకుండా షూటింగ్ ను సాగించేలా నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు.   

జగన్ మిథున్ రెడ్డిని ఎప్పుడు పరామర్శిస్తారంటే..?

మద్యం స్కాం నిందితులను పరామర్శించే విషయంలో జగన్ ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం నిందితులను మినహాయిస్తే.. జగన్  ఇతర కేసుల్లో అరెస్టైన తమ పార్టీ నేతలు, కార్యకర్తలను జైలుకెళ్లి పరామర్శించారు. ఆ పరామర్శ యాత్ర సందర్భంగా తెలుగుదేశం కూటమి సర్కార్ పై విమర్శలు గుప్పించి మరీ వచ్చారు. జగన్ జైలుకెళ్లి పరామర్శించిన వారిలో రౌడీ షీటర్లు ఉన్నారు. గంజాయిబ్యాచ్ వాళ్లూ ఉన్నారు. కానీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన వారిలో తనకు అత్యంత సన్నిహితులు, పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన వారూ ఉన్నా ఎందుకో మరి వారిని పరామర్శించే విషయంలో మాత్రం ఆయన ఇసుమంతైనా ఆసక్తి చూపడంలేదు. ఈ కేసులో అరెస్టైన వారిలో జగన్ మాజీ పీఏ, మాజీ ఓఎస్డీ ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్, అలాగే ఈ కుంభకోణంలో కీలక పాత్ర ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేశిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి వంటి వారు ఉన్నారు. వీరంతా జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారే. అయినా సరే ఇప్పటి వరకూ వారిని జగన్ పరామర్శించలేదు.  కానీ ఎట్టకేలకు ఇక తప్పదన్నట్లుగా ఈ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డి పరామర్శకు మాత్రం రెడీ అయినట్లు ప్రకటించారు. ఈ నెల 25న రాజమహేంద్రవరం వచ్చి, జైలుకు వెళ్లి మిథున్ రెడ్డిని జగన్ పరామర్శిస్తారని పార్టీ కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన కూడా పరామర్శ తేదీకి పది రోజుల ముందే వెలువడింది. ఇక పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా జగన్ మిథున్ రెడ్డిని ఈ నెల 25న పరామర్శించనున్నారని మూడు నాలుగు రోజుల ముందు ధృవీకరించారు.  అంతలో ఏమైందో ఏమో కానీ ఆ పరామర్శయాత్రను జగన్ వాయిదా వేసుకున్నారు. ఆగస్టు 25న కాదు మరో తేదీన వస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. జగన్ పరామర్శ వినాయకచవిత తరువాత ఎప్పుడో ఉంటుందని అదే బొత్స ప్రకటించారు.  జగన్ రాజమండ్రి జైలు యాత్ర మళ్లీ వాయిదాపడిందన్న వార్తలపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు.   ఇదే మద్యం కుంభకోణం కేసులో నేడు కాకపోతే రేపు.. రేపు కాకపోతే మరో రోజు ఇదే రాజమహేంద్రవరం జైలుకు తాను కూడా రావాల్సి ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇంతోటి దానికి పరామర్శ యాత్ర ఎందుకు? అనే జగన్ మిథున్ రెడ్డి పరామర్శను వాయిదా వేసుకున్నట్లుందంటూ కామెంట్లు పెడుతున్నారు. తన హయాంలో తెలుగుదేశం అధినేత, అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన జైలుకు ఇప్పుడు తన సన్నిహితుడు, తన వల్లే జైలు పాలైన మిథున్ రెడ్డిని పరామర్శించాల్సిన పరిస్థితి రావడం జగన్ కు మింగుడుపడటం లేదనీ, అందుకే తన పర్యటన వాయిదే వేసుకున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఫాల్కన్ స్కామ్.. తవ్వే కొద్ది పగులుతున్న అక్రమాల పుట్ట!

ఫాల్కన్ స్కామ్ లో తవ్వినకొద్ది కొత్త కొత్త విషయాలు వెలుగులోకి  వస్తున్నాయి. క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ పేరిట కంపెనీ పెట్టి ఇన్‌వాయస్ డిస్కౌంటింగ్‌ ద్వారా భారీ లాభాలు వస్తాయని చిన్న, మధ్య తరగతి మదుపరులను నమ్మించి రూ.792 కోట్ల మోసానికి పాల్పడిన ఫాల్కన్ స్కామ్ కేసులోలో    చార్టర్డ్ అక్కౌంటెంట్   శరత్ చంద్ర టోస్ని వాలి కీలక పాత్ర పోషించినట్లు వెలుగులోకి వచ్చింది. శరత్ చంద్రను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.  లేని డబ్బుల్ని అకౌంట్లో ఉన్నట్లుగా చూపి తప్పుడు లెక్కలతో  చార్టెడ్ అక్కౌంటెంట్ శరత్ చంద్ర బురిడీ కొట్టించారని నిర్ధారించుకున్న ఈడీ ఆయనను అరెస్టు చేసింది. అయితే ఈ ఫాల్కన్ కంపెనీ చైర్మన్ అమర్ధీప్ మాత్రం దుబాయ్ కు పరారయ్యాడు. అయితే అమర్ దీప్ కు సహకారం, సహాయం అందించిన శరత్ చంద్ర ఈ స్కామ్ లో కేంద్ర బిందువు అని ఈడీ తేల్చి అరెస్టు చేసింది. హవాలా రూపంలో స్కాం సొమ్ములను విదేశాలకు తరలించడంలో శరత్ చంద్రదేకీకల పాత్ర ధాని అని ఈడీ దర్యాప్తులో తేలింది. పూర్తిస్థాయిలో సహాయం చేసిన చార్టెడ్ అకౌంటెంట్ శరత్చంద్ర ఈ స్కామ్ కు కేంద్ర బిందువుగా ఉన్నారని ఈడీ తేల్చింది.. హవాల రూపంలో డబ్బులు మొత్తాన్ని విదేశాలకు తరలించడంలో శరత్ చంద్ర కీలక సూత్రధారిగా ఉన్నారని ఈడి దర్యాప్తులో తేలింది. దీంతో  చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర టోష్నీవాల్‌ను అరెస్ట్ చేసి. ప్రవెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో హాజరు పరచగా కోర్టు ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.  క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కీమ్ పేరుతో పెట్టుబడి దారులను  .ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి, మోసం చేసి ఏకంగా 792 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది.  ఈ స్కామ్‌కి ప్రధాన సూత్రధారి అయిన కంపెనీ యజమాని అమర్‌దీప్ కుమార్ కోసం శరత్ చంద్ర టోష్నీవాల్ పలు నకిలీ లావాదేవీలను నిర్వహించడంతో పాటు.. మనీలాండరింగ్‌లో కీలక పాత్ర పోషించినట్టు ఈడీ విచారణలో తేలింది. శరత్ చంద్ర తన బంధువుల పేర్లపై కంపెనీల్లో వాటాలు కూడా కొనుగోలు చేసినట్టు  చెబుతున్నారు.  ఈ కేసులో రూ. 18.14 కోట్ల ఆస్తులను ఈడి అటాచ్ చేసింది.. ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ సోదరుడు సందీప్ కుమార్‌ను కూడా ఈడీ అరెస్టు చేసింది.  చార్టెడ్ ఫ్లైట్లో దుబాయ్ కి పారిపోయిన అమర్దీప్ ను స్వదేశానికి రప్పించడం కోసం ఈడీ ప్రయత్నాలు ప్రారంభించింది. 

80 ఏళ్ల వృద్ధుడికి హనీ ట్రాప్.. 8 లక్షలు హాంఫట్

ఆయన వయస్సు ఎనిమిది పదులు. అలాంటి వృద్ధుడిని మాయమాటలు, శృంగార చేష్టలతో ట్రాప్ చేసి దారుణంగా మోసం చేశారు. 80 ఏళ్ల వృద్ధుడితో మహిళ గొంతుతో మాట్లాడి మరీ  హనీట్రాప్ లో చిక్కుకునేలా చేశారు. ఎనిమిది లక్షలు కొట్టేశారు. తరువాత తాను హనీట్రాప్ కు గురయ్యానని తెలుసుకున్న వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను మోసం చేసిన ముఠాపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. అమీర్ పేటకు చెందిన వృద్ధుడికి మాయా రాజ్పుత్ అనే మహిళ నుంచి వీడియో కాల్ వచ్చింది. ఆ వాట్సాప్ వీడియో కాల్ ,మెసేజ్ లకు స్పందించిన వృద్ధుడు ఆమెతో తో మాట్లాడడం మొదలుపెట్టాడు.   అలా ఓ నాలుగు రోజుల పాటు వృద్ధుడితో మాట్లాడుతూ. పరిచయం పెంచు కున్నారు. వృద్ధుడు పూర్తిగా హనీ ట్రాప్ మాయాజాలంలో చిక్కుకునేట్లు చేశారు.అనంతరం వృద్ధుడు తమ మాయలో పడ్డాడని నిర్ధారించుకున్న  స్కామర్స్ ఏవేవో కారణాలు చెప్పి డబ్బులు గుంజడం మొదలుపెట్టారు. తమ వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని ఖర్చుల కోసం డబ్బులు కావాలని, అలాగే వైద్య ఖర్చుల కోసం తాకట్టుపెట్టిన బంగారాన్ని విడిపించుకుంటామనీ, ఇలా రకరకాల కారణాలతో ఆ వృద్ధుడి నుంచి దఫదఫాలుగా ఎనిమిది లక్షలు నొక్కేశారు.   అయితే వృద్ధుడు ఖాతా నుంచి డబ్బులు మాయం అవుతుండడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దీంతో వృద్ధుడిని నిలదీసి అడగడంతో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది.  సైబర్ మోసగాళ్లు వలలో పడ్డాడని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

లొంగిపోయిన మావోయిస్టు కాకరాల సునీత ఎవరో తెలుసా?

కాకరాల సత్యనారాయణ.. ఈ పేరు ఎక్కడో బాగా విన్నట్లే అనిపిస్తుంది కదా! ఈయన  ఓ మంచి రచయిత. అంతే కాదు 300 పైగా సినిమాల్లో  నటించారు. విప్లవ రచయితగా పేరుగాంచిన కాకరాల సత్యనారాయణ కుమార్తె ఒక పెద్ద మావోయిస్టు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య సునీత.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి వైఎస్ ప్రభుత్వం మావోయిస్టులతో   జరిపిన శాంతి చర్చల్లో సుధాకర్ కీలకపాత్ర పోషించారు. సుధాకర్ ను సునీత ప్రేమించి పెళ్లి చేసుకుంది.  కాకరాల సునీత భర్త సుధాకర్ ఇటీవలే పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించారు. ఇక కాకరాల సునీత అయితే నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే మమేకమై ఉన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆమె పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు.  ఈ క్రమంలోనే సునీత రాచకొండ పోలీసులను బంధువుల ద్వారా కాంటాక్ట్ చేశారు. ఇప్పటివరకూ ఐదు భారీ ఎన్కౌంటర్లో పాలుపంచుకున్న సునీత పైన 20 లక్షల పైన రివార్డు ఉంది.  40 సంవత్సరాల్లో సునీత అంచలంచ లుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ వరకు వెళ్లారు. అంతే కాదు మావోయిస్టు సిద్ధాంతాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లడంలో సునీత కీలకపాత్ర పోషించారు. మరోవైపు మావోయిస్టుల పత్రిక జంగ్, క్రాంతి లకు ఎడిటర్ గా పని చేశారు.. మావోయిస్టు భావజాలాన్ని యువతలోకి జోపించే ప్రయత్నం చేశారు. మావోయిస్టు భావజాలానికి  యువత యువత ఆకర్షితులయ్యేలా సునీత కీలక పాత్ర పోషించారు. నల్లమల ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఛత్తీస్ గఢ్, తెలంగాణలలో సునీత పనిచేశారు.. ఇటీవల జరిగిన నేషనల్ పార్క్ ఎన్కౌంటర్ లో కూడా ఆమె పాల్గొన్నారు. మావోయిస్టుల ఎరివేతలో భాగంగా ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడవిలో అన్నలు ఉండే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సునీత జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయిం చుకుని, గురువారం (ఆగస్టు 21)  రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు.

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జన సంద్రంగా మారింది. తిరుమల వేంకటేశ్వరుడి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.   శుక్రవారం (ఆగస్టు 22) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.  ఇక గురువారం (ఆగస్టు 21) శ్రీవారిని మొత్తం 65 వేల 112 మంది దర్శించుకున్నారు. వారిలో  27 వేల 321 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల49 లక్షల రూపాయలు వచ్చింది. 

టీడీపీ ఎమ్మెల్యేల అతి.. బాబు ఆగ్రహం!

తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరుగా చెబుతుంటారు. అధినేత చంద్రబాబు కనుసైగలతో పార్టీ నడుస్తుంటుంది. అందరిదీ ఒకే లైన్. కానీ ఇప్పుడు మాత్రం ఎవరి లైన్ వారిదే అన్నట్లుగా కొందరు తెలుగదేశం మ్మెల్యేలు వ్యవహరిస్తుండడం టీడీపీ హైకమాండ్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నా సమస్యలు వస్తాయనడానికి ఇదే ఎగ్జాంపుల్ కావొచ్చు. గత ఎన్నికల్లో తెలుగుదేశం 144 సీట్లలో పోటీ చేస్తే 135 స్థానాలలో గెలిచింది. అంత పెద్ద స్ట్రైక్ రేట్ తెలుగుదేశం పార్టీకి వచ్చింది.  అయితే ఇంతమందిని మెయింటేన్ చేయడం వీలు కావట్లేదా? లేదంటే భారీ మెజార్టీ ఉందన్న ధీమా అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కనిపిస్తోందా? ఓవైపు కూటమి ఇమేజ్ ను పెంచడం కోసం  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పని చేస్తున్నారు. ఇంకోవైపు డ్యామేజ్ చేయడంలో టీడీపీ ఎమ్మెల్యేలు దూసుకువెళ్తున్నారన్న చర్చ జరుగుతోంది. దారి తప్పుతున్న వారందరికీ సెట్ రైట్ చేసే ప్రోగ్రామింగ్ ను సీఎం చంద్రబాబు రెడీ చేయాల్సిన టైం వచ్చేసిందా? అంటే అవునన్న సమాధానమే వస్తోంది.   శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి. పార్టీలో ఈయన సీనియర్ లీడర్. మొన్నటిదాకా పెద్దగా వివాదాల జోలికి వెళ్లని బుడ్డా లేటెస్ట్ గా వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న తన అనుమతి లేకుండా తన సెగ్మెంట్ లో కార్యక్రమాలు నిర్వహించారంటూ పార్టీ ఎంపీ శబరి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి విషయంలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొందరు అనుచరులు ఏరాసు ఇంటిపై దాడి కూడా చేశారు. ఆ పంచాయితీ చంద్రబాబు దగ్గరకు చేరింది. అది చల్లారక ముందే లేటెస్ట్ గా శ్రీశైలం నల్లమల ఫారెస్ట్ లో అటవీ శాఖ సిబ్బందిపై బుడ్డా చేయి చేసుకోవడం పెను వివాదంగా మారింది.  ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టం ముందు అందరూ సమానమే అని వార్నింగ్ ఇచ్చారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అన్నట్లుగానే కేసు ఫైల్ అయింది.  ఇక అనంతపురం అర్బన్   ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. గొడవేంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడారన్నది అభియోగం. 3 నిమిషాల 8 సెకన్లు ఉన్న ఆడియో రికార్డింగ్ చుట్టూ ఏపీలో పెను దుమారమే చెలరేగింది. వార్ 2 సినిమా బెనిఫిట్‌ షోలకు అనంతపురంలో పర్మిషన్లు లేవని, ఆపించేస్తున్ననట్లు ఎమ్మెల్యే చెప్పడం, పర్మిషన్లు ఉన్నాయని ఎన్టీఆర్ అభిమాన సంఘం నేత ధనుంజయనాయుడు అంటున్నట్టు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యంతరకర కామెంట్స్ చేసినట్లు ఆ ఆడియోలో వినిపించింది. అంతే ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం ముందు నిరసనలు చేపట్టి, ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చించేశారు. ఇది అనంతపురానికే పరిమితం కాలేదు. విజయవాడ, తిరుపతి, నెల్లూరుకూ పాకింది.  దీనిపై రియాక్ట్ అయిన దగ్గుపాటి, ఆ ఆడియోలో వాయిస్ తనది కాదని, ఏఐ అని అన్నారు. రాజకీయ కుట్రలో భాగంగా ఫేక్ ఆడియో సృష్టించారని వాదించారు. తాను నందమూరి, నారా కుటుంబాల అభిమానినని, ఎన్టీఆర్ అభిమానుల భావోద్వేగాలను గాయపరిచినట్లయితే క్షమాపణలు చెబుతున్నానని వీడియో రిలీజ్ చేశారు. అయినా సరే అభిమానుల ఆగ్రహం తగ్గలేదు. నిజానికి అనంతపురం అర్బన్ లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో దగ్గుపాటి ప్రసాద్ కు చాలా కాలంగా అంతర్గత విబేధాలు ఉన్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం, సవాళ్లు విసురుకోవడం గతంలోనూ జరిగాయి. దమ్ముంటే రాజీనామా చేసి రా... ఎవరు గెలుస్తారో చూద్దాం అని ప్రభాకర్ చౌదరి ఇప్పటికే సవాల్ చేశారు. ఇన్ని గొడవల మధ్యలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై ఆడియో ఇష్యూ ప్రసాద్ మెడకు చుట్టుకుంది. ఈ మ్యాటర్ అటు పార్టీ పరంగా, సామాజికపరంగా సున్నితమైంది కావడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు కూడా. లేనిపోని వివాదాలు ఎందుకు క్రియేట్‌ చేసుకుంటున్నారని చివాట్లు పెట్టారంట. ఇక ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపల్‌ కు అర్ధరాత్రి వీడియో కాల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియో కాల్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పొలిటికల్ గా చర్చనీయాంశంగా మారింది. అయితే కూన రవికుమార్ ఈ ఆరోపణలను ఖండించారు. తాను అర్ధరాత్రి కాల్ చేయలేదని, ఆ కాల్‌లో ప్రిన్సిపాల్‌తో పాటు మరికొందరు ఉన్నారని, తనపై అసత్య ప్రచారం జరుగుతోందని వాదించారు. పరువు నష్టం దావా వేస్తానన్నారు. ఈ ఎపిసోడ్ కూడా రకరకాల మలుపులు తిరుగుతోంది.  గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. ఓ మహిళతో వీడియో కాల్‌లో మాట్లాడిన సీన్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవి మార్ఫింగ్ వీడియోలు అని క్లారిటీ ఇచ్చుకున్నా.. ఈ ఘటనపై విమర్శలు రావడంతో టీడీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.  అటు నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ విషయంలో కీ రోల్ పోషించారన్న మ్యాటర్ లో నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ నేత, మరో ఎమ్మెల్యే ఇరుక్కున్నారు. తన తప్పేమీ లేదని ఒకరు వివరణ ఇచ్చుకుంటే మరో ఎమ్మెల్యే చుట్టూ హాట్ టాపిక్ నడుస్తోంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఒక్కరూ మాట్లాడడం లేదు. సో ఈ ఘటనలు ఏపీలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఎమ్మెల్యేల వ్యక్తిగత వివాదాలు కాస్తా పార్టీకి మైనస్ గా మారే పరిస్థితులు తీసుకొచ్చాయి. ఈ విషయంపై పార్టీ హైకమాండ్ కూడా సీరియస్ అయ్యింది. గురువారం (ఆగస్టు 21) కేబినెట్ భేటీకి కొద్ది ముందు పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించి మరీ వారి పట్ల ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే హోంమంత్రి అనితను పెరోల్ ఆర్డర్లపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని కూడా సున్నితంగా  మందలించారు. మరో వైపు పార్టీ ఇన్ చార్జ్ ల తీరు కూడా కొండకచో వివాదంగా మారుతోంది. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు అతి చేస్తున్నారన్న విషయంలో పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉంది. తీరు  మార్చుకోకుంటే చర్యలు తప్పవన్న హెచ్చరికలూ చేసింది. 

తెలుగు రాష్ట్రాలు.. ఒక ఉపరాష్ట్రపతి ఎన్నిక కథ

నిజానికి వెంకయ్య తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి మరో ఉపరాష్ట్రపతి పదవికి ఛాన్సున్నది బి. సుదర్శన్ రెడ్డి విషయంలోనే. అయితే ఇండియా కూటమి అభ్యర్ధి అయిన సుదర్శన్ రెడ్డి గెలిచే అవకాశమెంత? అన్నది అటుంచితే.. ఎన్డీఏ అభ్యర్ధి రాధాకృష్ణన్ తమిళ వ్యక్తి కాగా.. త్వరలో తమిళనాడు ఎన్నిక జరుగుతుండటంతో.. కాంగ్రెస్ సైతం ఒక తమిళ వ్యక్తినే ఎంపిక చేయాలనుకుంది. తిరుచ్చి శివ అనే డీఎంకే నేత పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. సరిగ్గా అదే సమయంలో ఒక ఇస్రో సైంటిస్టు పేరు కూడా ప్రముఖంగానే వినిపించింది. కానీ చివరి నిమిషంలో రాజకీయాలకు సంబంధం లేని బి. సుదర్శన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.  సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి చంద్రబాబుకు పరిచయముంది. అందుకే జస్టిస్  తాను రాజకీయ పార్టీలకు కొత్తగానీ, రాజకీయాలకు కాదన్నారు. అలాంటి పరిచయం ప్రస్తుతం ఉన్న ఒకానొక సిట్యువేషన్ లో సుదర్శనరెడ్డికి ఉపయోగ పడుతుందా? అని చూస్తే అదేమంత తేలిగ్గా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన రాధాకృష్ణన్ కు తమ బేషరతు మద్దతు ప్రకటించేశాయి. ఇక సాటి రెడ్డి కులస్తుడైన సుదర్శన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి ఎలాంటి అభిమానముందో తెలీదు.  ఒక వేళ అభిమానమున్నా జగన్ మరో ఆలోచన లేకుండా బీజేపీ ప్రతిపాదించిన రాధాకృష్ణన్ కే మద్దతు పలుకుతారన్న విశ్లేషకుల అభిప్రాయాలను అనుగుణంగానే వైసీపీ సభ్యులు ఎన్డీయే అభ్యర్థికే మద్దతు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించేసింది.  ఎందుకంటే.. ఇప్పటికే జగన్ పీకలోతు కేసుల గొడవల్లో ఉన్నారు. అందుకే తనకున్న లోక్ సభ, రాజ్య సభ సభ్యులు 11 మంది కాగా.. ఈ మొత్తం అటు వైపునకు మళ్లించేశారు. అలా మళ్లించకుంటే జైలుకు వెళ్లక తప్పదన్న భయం ఆయనది.  దీంతో ఎంత రెడ్డాభిమానం ఉన్నా గానీ జగన్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి  మద్దతుగా నిలవడం లేదు సరికదా..   వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు.. కట్ చేస్తే బీఆర్ఎస్ సీనేంటో చూస్తే.. బీజేపీ|బీఆర్ఎస్ రెండూ ఒకటే అన్న మాటకు ఆస్కారమిచ్చేలా కేటీఆర్ ఒక కామెంట్ చేశారు. అదేంటో చూస్తే ఎవరైతే 2 లక్షల టన్నుల ఎరువులను తెలంగాణకు ఇస్తారో వారికే తమ మద్ధతు అన్నారు. నిజానికి ఎరువులను ఇచ్చే అధికారం ఉన్నది కేంద్రంలోని బీజేపీకి. దీన్నిబట్టీ చూస్తే వారి మద్ధతు బీజేపీకే అని చెప్పాల్సి ఉంటుంది.  మొన్నటికి మొన్న సీఎం రమేష్ మాటలను అనుసరించి చెబితే ఇప్పటికే తమపై కేసుల్లేకుండా చేయడంలో భాగంగా.. బీజేపీలో కలిసి పోవడానికైనా సిద్ధమైన బీఆర్ఎస్ ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత వాసి అయిన సుదర్శన్ రెడ్డికి ఓటు వేసే అవకాశమెంతో ఈ ఎరువుల మెలికను బట్టిఇట్టే తెలిసిపోతోంది.  కాబట్టి.. తెలుగు సెంటిమెంటు కన్నా.. ఇక్కడ ఎవరి అవసరాలు, వారి వారి కేసుల వ్యవహారాలపైనే ఎక్కువగా ఈ ఎన్నిక ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఇదండీ మన తెలుగు వారి ఉప రాష్ట్రపతి ఎన్నిక కథ, కమామిషు!

జగన్, కేటీఆర్ కటీఫేనా?

తెలుగుదేశం పార్టీపై గుడ్డి వ్యతిరేకత, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై ఉన్న అక్కసు  బిఆర్ఎస్, వైసీపీ లను దగ్గర చేసాయి, జగన్, కేసీఆర్ లను ఒకే తాటి మీదకు తెచ్చాయి. బాబు కి రిటర్న్ గిఫ్ట్ అంటూ మొదలైన జగన్ కేసీఆర్  రాజకీయ బంధం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం, 2024 ఎన్నికలలో వైసీపీ పతనంతో బట్టబయలైంది ఆ ఓటముల తరువాత వైసీపీ అధినేత ప్యాలెస్ రాజకీయాలకు, బీఆర్ఎస్  ఫామ్ హౌస్ రాజకీయాలకు పరిమితం అయ్యారు. అక్కడ నుంచీ ఇరుపార్టీల బంధం తెగిపోకుండా కొనసాగించే బాద్యతను బీఆర్ఎస్ అధినేత కుమారుడు, ఆయన రాజకీయవారసుడు, అలాగే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు భుజాన వేసుకున్నారు. సొంత చెల్లెలితో విభేదాల విషయంలోనూ జగన్, కేటీఆర్ మధ్య సారూప్యాలు ఉన్నాయి.  ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ను షర్మిల, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ను కల్వకుంట్ల కవిత తీవ్రంగా విభేదిస్తున్నారు.  ఏ రకంగా చూసినా జగన్, కేటీఆర్   బాట ఒకటే అన్నట్లుగా ఇంత కాలం సాగింది.  ఇక ఇప్పుడు ఓట్ చోరీ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీపై ఆరంభించిన రాజకీయ యుద్ధం అనుంగు మిత్రులు జగన్, కేటీఆర్ దారులు వేరు చేసింది. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంటే చేపట్టిన ఆందోళనకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మద్దతు ప్రకటించారు. రాహుల్ చేస్తున్న విమర్శలను సమర్ధిస్తూ.. తాను మరికొన్ని విమర్శలకు ఎన్నికల సంఘంపై సంధించారు. పనిలో పనిగా కేంద్ర ప్రభుత్వంపైనా, ప్రధాని మోడీపైనా కూడా విమర్శలు గుప్పించారు.  ప్రజాస్వామ్యంలో ఈసీ కీలక పాత్ర పోషిస్తుందని, అటువంటి భారత ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన చేయాల్సిన తరుణం ఆసన్నమైందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు.  భారత ఎన్నికల సంఘం బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో ఘోర వైఫల్యం చెందిందని దుయ్యపెట్టారు. రాహుల్ ఓట్ల చోరీ ఆరోపణలను మీడియా సమావేశం పెట్టి మరీ ఖండించిన ఈసీ అధికారుల మాటలు విన్న తరవాత సందేహాలు మరింతగా ఎక్కువయ్యాయనీ కేటీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిత్యం నిప్పులు కక్కే కేటీఆర్ ఒక్క సారిగా రాహుల్ గాంధీకి వంత పాడుతూ.. బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మాత్రం రాహుల్ ఓటు చోరీ ఆరోపణలను సమర్ధించలేదు, సరి కదా తమ పార్టీకి పులివెందులలో జరిగిన అన్యాయంపై రాహుల్ పన్నెత్తు మాట మాట్లాడకపోవడాన్ని తప్పుపట్టారు. అంతే కాకుండా   టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. దీంతో జగన్, కేటీర్ మధ్య ఇంత కాలం ఉన్న స్నేహబంధం తెగిపోయిందా? ఇరువురూ కటీఫ్ చెప్పేసుకున్నట్లేనా అంటూ పోలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ ఆరంభమైంది.  

ఢిల్లీ సీఎంకు జడ్ కేటగరి భద్రత

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై బుధవారం (ఆగస్టు 20) జరిగిన దాడిని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ఖండించాయి. నిందితుడికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సీఎంపై ఆమె  అధికారిక నివాసంలోనే జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించింది. రేఖాగుప్తాకు జడ్ కేటగరి భద్రత లక్పించాలని నిర్ణయించింది. ఇలా నిర్ణయించడమే తరువాయి, అలా ఉత్తర్వులు జారీ చేసింది.   దీంతో గురువారం ఉదయానికే  సీఆర్పీఎఫ్ బలగాలు సీఎం నివాసానికి చేరుకున్నాయి. ఢిల్లీ  పోలీసుల నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి భద్రత బాధ్యతలను స్వీకరించాయి.  సీఎం వ్యక్తిగత భద్రతతో పాటు సీఎం నివాసానికి, క్యాంపు కార్యాలయానికి 24 గంటలూ భద్రత కల్పించేందుకు అధికారులు అదనపు బలగాలను మోహరించారు. జెడ్ కేటగిరీ భద్రతలో 20 మందికి పైగా సిబ్బంది, స్పెషల్ గార్డులు, డ్రైవర్లు, ఎస్కార్ట్ వాహనాలను ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు సమకూర్చారు.