పెద్దారెడ్డికి హై కోర్టు షాక్.. తాడిపత్రిలోకి నో ఎంట్రీ
posted on Aug 20, 2025 @ 3:30PM
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ఆయన తాడిపత్రి ఎంట్రీకి అనుమతి ఇస్తూ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్డు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. హైకోర్టు అనుమతి ఉన్నా తనను తాడిపత్రిలోకి పోలీసులు అనుమతించలేదంటూ ఆరోపణలు గుప్పిస్తున్న పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు పెద్ద షాక్ అనే చెప్పాలి.
పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించి ఆయనకు భద్రత కల్పించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు అనంతపురం జిల్లా ఎస్పీ. జిల్లా ఎస్పీ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇస్తూ బుధవారం (ఆగస్టు 20) ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.