హిమాచల్ లో రెండు సార్లు కంపించిన భూమి
posted on Aug 20, 2025 @ 12:32PM
హిమాచల్ ప్రదేశ్ పై ప్రకృతి పగబట్టినట్టుగా ఉంది. ఆ రాష్ట్రంలో వరుసగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడుతున్నారు. భారీ వర్షాలు, వరదలూ, క్లౌడ్ బరస్ట్ లతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైపోతోంది. ఇటీవలి కాలంలో భారీ వర్షాలు, వరదలు, క్లౌడ్ బరస్ట్ ఘటనల కారణంగా దాదాపు 300 మంది మరణించారు.
పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. ఇప్పుడు తాజాగా హిమాచల్ ప్రదేశ్ ను భూకంపం కుదిపేసింది. బుధవారం (ఆగస్టు 20) ఉదయం హిమాచల్ ప్రదేశ్ లో గంట వ్యవధిలో రెండు సార్లు భూమి కంపించింది. మొదటి సారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదు కాగా, రెండోసారి సంభవించిన భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. ఈ వరుస భూకంపాలతో జనం భయాందోళనలకు గురై రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఈ భూకంపాల వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.