మోత్కుపల్లి హత్యకు రెక్కీ జరిగిందా

  తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తమ పార్టీ నేత మోత్కుపల్లి నరసింహులుని హత్య చేసేందుకు మావోయిస్టులు ఇటీవల రెక్కీ నిర్వహించారని అందువల్ల ఆయనకు అదనపు భద్రత కల్పించమంటూ ముఖ్యమంత్రికి లేఖ వ్రాయడంతో పార్టీలోమరియు తెలంగాణావాదులలో కలకలం రేగింది. తెదేపాలో ఉంటూ తెలంగాణా వాదం బలంగా వినిపిస్తూనే మరో వైపు పార్టీపై వస్తున్న విమర్శలను కూడా బలంగా తిప్పికొడుతూ పార్టీని ఒక కాపు కాస్తున్నఅతనికి రాజకీయ శత్రువులు ఉండటం సహజమే. ఆయన తెలంగాణా వాదం వల్ల, ఇటు సీమంధ్ర నేతలకు కూడా ఆయన శత్రువయి ఉండవచ్చును. అయితే అది ఆయనను హత్య చేసేంత తీవ్రమయిన శత్రుత్వం అవడానికి ఆస్కారం లేదు. మరి మోత్కుపల్లిని హత్యచేసేందుకు ఎవరు రెక్కి నిర్వహించారు? సీమంధ్ర నేతలా లేక తెలంగాణా నేతలా? లేక ఆయనకి ఇంకెవరయినా వేరే శత్రువులున్నారా? దళితుడనయిన తనను రాజకీయంగా ఎదుర్కొనలేకనే కేసీఆరే తనను హత్య చేయించేందుకు కుట్ర పన్ని ఉంటాడని మోత్కుపల్లి ఆరోపించడంతో దీనికి రాజకీయ రంగు కూడా పులుముకోనుంది. పంచాయితీ, స్థానిక ఎన్నికలలోగెలిచేందుకే తెదేపా తమ పై ఈవిధమయిన నిరాధారమయిన ఆఅరొపణలు చేస్తున్నారని  తెరాస నేతలు ప్రత్యారోపణలు మొదలు పెట్టవచ్చును. ఏమయినప్పటికీ, ఇది తీవ్రమయిన విషయమే. ప్రభుత్వానికి లేఖ వ్రాసి సరిపెట్టుకోకుండా ఆయన తనకు తానుగా లేదా పార్టీ తరపున భద్రత ఏర్పాటు చేసుకోవడం మంచిది.

ఎవరు డబుల్ గేమ్ ఆడుతున్నారు

  రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సగం మంది ప్రత్యేక తెలంగాణా కోసం, మరి కొంత మంది సమైక్యాంధ్ర అంటూ మాట్లాడుతుంటే, కేంద్ర మంత్రి పదవులు పుచ్చుకొన్న మరి కొంతమంది తాము అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నమంటూనే, రాష్ట్ర విభజన పట్ల తమ అభిప్రాయంలో ఎటువంటి మార్పు లేదని చెపుతున్నారు. వారు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెపుతుంటే, వారి అనుచరులు మాత్రం సమైక్యాంధ్ర అంటూ సభలు సమావేశాలు నిర్వహించడం కూడా బహిరంగ రహస్యమే. అంటే కాంగ్రెస్ పార్టీలోనే నాలుగు రకాల వాదనలు చేస్తున్నవారున్నారన్నమాట.   అయితే, నెల్లూరు కాంగ్రెస్ శాసన సభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యంగా వైకాపానేతలు ఈ విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. విజయమ్మ ఆదేశాల మేరకే ఆ పార్టీ శాసన సభ్యులు రాజీనామా డ్రామా ఆడుతున్నారని ఆయన ఆరోపించారు.   ఒకవైపు ఆయన ప్రతిపక్షాలను నిందిస్తూనే, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరగదని, తెలంగాణా మ్యాపులు వల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదని ఆయన స్పష్టం చేసారు. అయితే, మరి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ రోడ్డు మ్యాపులు తయారు చేయమని ముఖ్యమంత్రిని, పీసీసీ అధ్యక్షున్ని, ఉప ముఖ్యమంత్రిని ఎందుకు కోరినట్లు? అది ప్రజలను మభ్యపెట్టడానికేనని ఆనం వారి అభిప్రాయమా? అదే నిజమయితే మరి డబుల్ గేమ్ ఆడుతున్నధి కాంగ్రెస్ పార్టీనా లేక ప్రతిపక్షాలా? ఆయనే వివరిస్తే బాగుంటుంది కదా?

తెలంగాణ పై దిగ్విజయ్ కొత్త మెళిక

      రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలంగాణ పై మాట మార్చినట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక తెలంగాణపై నివేదిక ఇచ్చిన తర్వాతే నిర్ణయం జరుగుతుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. విభజన, సమైక్యాంధ్రల పైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను అడిగామని, వారు నివేదిక ఇచ్చాకనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందన్నారు. నివేదిక ఇవ్వడానికి ఓ గడువు అంటూ ఏమీ లేదని చెప్పారు నేతలు ఎప్పుడైనా వచ్చి  తమ నివేదికను తమకు ఇవ్వవచ్చునని ఆయన చెప్పారు. అయితే వారు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్ణయం ఉంటుందన్నారు. నేతలు ఇచ్చే నివేదికకు గడువు లేదని చెప్పడం ద్వారా దిగ్విజయ్ తెలంగాణపై కొత్త మెలిక పెట్టినట్లుగా అనుమానిస్తున్నారు. కోర్‌కమిటీ సమావేశంలో తెలంగాణపై తుది నిర్ణయం ఉంటుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

సిటి లైఫ్ హోటల్ భవనం కూలి 6మృతి

      హైదరాబాద్, సికింద్రాబాద్ లలో కొన్ని ప్రాంతాలలో శిదిలైన పాత కట్టడాలలో ప్రజలు నివస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవం వల్ల తరచూ ప్రమాదాలు జరుతున్నాయి. ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ లోని సిటి లైఫ్ హోటల్ కుప్పకూలడం వల్ల ఆరుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు జి.హెచ్.ఎమ్.సి. కమిషనర్ కృష్ణబాబు చెప్పారు.  కుప్పకూలిన భవనంలో రెండంతస్తులు ఉన్నాయి. కాలం చెల్లిన భవనం కావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆరు ప్రొక్లయిన్లతో శిథిలాల తొలగింపు ముమ్మరంగా కొనసాగుతోంది. నగరంలో 272 పురాతన భవనాలు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.వీటిలో పదిహేను భవనాలను కూల్చామని ఆయన చెప్పారు.

బుద్ధగయ పేలుళ్ళ పై నేతల స్పందన

      మహాబోధి ఆలయంలో పేలుళ్ల పట్ల పలువురు నేతలు స్పందించారు. శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే తీవ్రంగా దిగ్భ్రాంతి చెందినట్లు ఆయన మీడియా సమన్వయకర్త తెలిపారు. గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ ఈ దాడులను ఖండించారు. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులకు ఈచర్య తీవ్ర ఆవేదన మిగిల్చిందన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలను బెదిరించేందుకు జరిగిన 'గేమ్‌ప్లాన్'గా పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభివర్ణించారు.   ఆటవిక, అమానవీయ చర్యగా పంజాబ్ సీఎం బాదల్ దుయ్యబట్టారు. అంతర్గత, బహిర్గత భద్రతా లోపాలపై కేంద్రం వద్ద సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఏమీ లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. శాంతికి చిహ్నమైన బుద్ధగయలో ఉగ్ర వాదులు పేలుళ్లకు పాల్పడటాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ఒక ప్రకటనలో ఖండించారు. బీహార్ భవిష్యత్తును ఈ పేలుళ్లే చెబుతున్నాయని ఎల్‌జేపీ అధ్యక్షుడు రామ్‌విలాస్ పాశ్వాన్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీజేపీ సహా విపక్షాలన్నీ రాజకీయాలకు కులమతాల రంగు పూస్తున్నాయని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు నగరాలకు ముప్పు పొంచి ఉందని ఐబీ వర్గాలు హెచ్చరించాయి.

ఈ ప్రభుత్వాలకు జ్ఞానోదయం కలిగేదెప్పుడో

  బీహార్ రాష్ట్రం భోధగయలో గల ప్రపంచ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన మహాబోధి ఆలయ పరిసరాలలో ఆదివారం తెల్లవారు జామున 5.30-6.00గంటల మధ్య తొమ్మిది వరుస బాంబు ప్రేలుళ్ళు జరిగాయి. కానీ అవి అంత శక్తివంతమయినవి కాకపోవడంతో ఆలయానికి గానీ, బుద్ధుడు తపస్సు చేసి జ్ఞానోదయం పొందిన భోదీ వృక్షానికి గానీ ఎటువంటి హానీ జరుగలేదు. ఈ ఘటనలో ఇద్దరు బొద్ద సాధువులు మాత్రం తీవ్ర గాయాల పాలయ్యారు. దీనికి ఇండియన్ ముజాహుద్దీన్ తీవ్రవాద సంస్థే కారణం అయిఉండవచ్చునని హోంశాఖ భావిస్తోంది.   విచారకరమయిన విషయం ఏమిటంటే, ఇద్దరు తీవ్రవాదులు బౌద్ధ గయలో ప్రవేశించారని వారం రోజుల క్రితమే ఇంటలిజన్స్ విభాగం బీహార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పోలీసులు వారి ఆచూకి కనిపెట్టేందుకు ప్రయత్నించారు కానీ సఫలం కాకపోవడంతో వారు ఆలయ అధికారులకు హెచ్చరికలు జారీ చేసి చేతులు దులుపుకొన్నారు. ఇది జరిగిన వారం రోజులకే ఇంటలిజన్స్ హెచ్చరికలను నిజం చేస్తూ ఆలయంలో ప్రేలుళ్ళు జరిగాయి.   దీనిని బట్టి ప్రభుత్వాలు, మన పోలీసు వ్యవస్థలు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్ధం అవుతోంది. ఇటువంటి సంఘటనలలో మనుషులు ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ప్రభుత్వాలు, రక్షణ వ్యవస్థలు ఉదాసీనంగా వ్యవహరించడం, ఘటన జరిగిన తరువాత కూడా అంతే ఉదాసీనంగా వ్యవహరించడం చాలా అమానుషం. ప్రజాసేవే తమ జీవిత పరమావధి అన్నట్లు మాట్లాడే రాజకీయ నేతలు, పార్టీలు, ప్రభుత్వాలు ఎన్నికలలో ప్రజల ఓట్లు నొల్లుకొనేందుకు అనేక పధకాలు, వరాలు ప్రకటిస్తుంటాయి. కానీ, ఇటువంటి ఘటనలు జరుగకుండా నివారించి వారి ప్రాణాలు కాపాడాలని మాత్రం ఎన్నడూ ఆలోచించకపోవడం చాల అమానుషం.   ఇటువంటి ఉగ్రవాద దాడులు దేశంలో ఎన్నిసార్లు జరుగుతున్నా, ఎంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూడా చలించని జడత్వ స్థితికి చేరుకొన్నాయి మన వ్యవస్థలు. కనీసం వాటి నుండి పాఠాలు నేర్చుకోనప్పుడు, ఇటువంటి ఘటనలను నివారించాలనే ధృడ సంకల్పం అవి కలిగి ఉండాలని ఆశించడం కూడా అడియాసే అవుతుంది.   మన దేశంలో ఉగ్రవాదులు జొరబడి విచ్చలవిడిగా విద్వంసానికి పాల్పడుతుంటే దానిని సమర్ధంగా అడ్డుకోవలసిన ప్రభుత్వాలు, వారిని, వారి ఉగ్రవాద చర్యలను కూడా రాజకీయ కోణంలోంచే చూడటం వల్లనే ఇటువంటివి పునరావృతమవుతున్నాయి. దేశంలో ఉగ్రవాదులు జొరబడటం అంటే మనింట్లో దొంగలు జొరబడినట్లేనని ఈ ప్రభుత్వాలు గ్రహించనంత కాలం ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయి.

విజయమ్మకు మమత ఫోన్

      వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జాతీయ స్థాయి నేతల కన్ను పడింది. తమతో కలవాలంటూ అభ్యర్థనలు వస్తున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మతో ఫోన్లో మాట్లాడారు. 2014 జాతీయ ఎన్నికలు ముందుగా వచ్చేలా ఉన్నాయని చెప్పారట. అంతేకాదు.. తమతో పాటు కలిసి నడిస్తే మీకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మద్దతు కోరినట్టు సమాచారం. దీని గురించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బహిరంగంగా ప్రకటించారు. “జాతీయ స్థాయి నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరుతున్నారు. ఎన్నికలు ఎపుడు జరిగినా వాటిని పార్టీ సమర్థంగా ఎదుర్కొంటుంది. మేము కీలక పాత్ర పోషించాలని మమత ఆశిస్తున్నారు” అని చెప్పారు. జగన్ తో మాట్లాడిన అనంతరం ఈ విషయంపై పార్టీ ఒక అండర్ స్టాండింగ్ కు వస్తుందని ఆ తర్వాత మమతకు విజయమ్మ తమ మద్దతు ప్రకటించే విషయమై మాట్లాడతారని ఆ నేతలు తెలిపారు.

డిల్లీలో బొత్స బాబు హడావుడి

  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోడ్డు మ్యాపులు పట్టుకొని డిల్లీలో హడావుడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన పనబాక, పురందేశ్వరి, శీలం, కావూరి, పల్లం, కోట్ల తదితర కేంద్ర మంత్రులందరూ కూడా సమైక్యవాదులే అయినప్పటికీ, రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి వారందరూ ఎప్పుడో కట్టుబడిపోయారు గనుక ఇక వారితో సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయాల వద్దా? అని చర్చించే పనిలేదు. అందువల్ల, బొత్స బాబు వారినందరినీ కలుస్తూ వారి సలహా సంప్రదింపులు తీసుకొని తన రోడ్డు మ్యాపుకు ఫైనల్ టచ్ అప్స్ ఇస్తున్నట్లు భావించవచ్చును.     సంక్లిష్టమయిన రాష్ట్ర విభజన ప్రక్రియలో రోడ్డు మ్యాప్ గీసిచ్చే భాగ్యం ఆయనకి దక్కడం గొప్ప విషయమే అయినప్పటికీ, వోక్స్ వ్యాగన్ కార్ల కంపెనీని వైజాగ్ కి రప్పించే ప్రయత్నంలో ఎవరినీ సంప్రదించకుండా తమ్ముడ్ని వెంటేసుకొని విమానం ఎక్కి జర్మనీ వెళ్లి ముక్కు మొహం తెలియని వాడిచేతిలో రూ.11కోట్ల పెట్టి వచ్చి, ఆనక ‘సొమ్ములు పోనాయి నానేటి సేసేది?’అని అడిగినట్లు, తన మ్యాపులో గీతలు వంకరపోయి దానివల్ల సీమాంధ్ర ప్రాంతానికి ఏదయినా నష్టం జరిగితే ఆనక జనాలకి జవాబు చెప్పుకోవడం అంత వీజీ కాదని అర్ధమయినందువల్లనేమో, ఎందుకయినా మంచిదని ఆయన డిల్లీలో కనబడిన ప్రతీ తెలుగు మంత్రిని కలిసి తన మ్యాపుని చూపించి వారిచేత ఒకే చేయించుకొంటున్నారు. అందువల్ల రేపు రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎటువంటి సమస్య తలెత్తినా ఎవరూ తనను తప్పు పట్టకుండా ఉండాలని కొంచెం ముందు చూపుతో ఆయన వ్యవహరిస్తున్నట్లుంది. అది కూడా ఒకందుకు మంచిదేనని చెప్పవచ్చును. ఆయనొక్కడూ ఏదో తనకు తోచిన గీతలు గీసుకొని వెళ్లి అధిష్టానం చేతిలో పెట్టి చక్కారావడం కంటే అన్ని ప్రాంతాల నేతలను కలిసి రాష్ట్ర విభజన సమయంలో వారివారి ప్రాంతాలలో తలెత్తే సమస్యలను ముందుగానే గుర్తించగలిగితే విభజన జరిపే ముందుగానే వాటికి సరయిన పరిష్కార మార్గాలు కనుకొనే అవకాశం ఉంటుంది. మరి బొత్స బాబు ప్రస్తుతం అదే పని మీద ఉండి ఉంటే ఆయనని మెచ్చుకోక తప్పదు.

కేసీఆర్ ఇంట్లో ఈ లొల్లేంది

  ఇప్పటికీ అనేక సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసీఆర్ కి ఇప్పుడు స్వయాన్నతన అన్న కూతురే తనపై మానవహక్కుల కమీషన్ లో పిర్యాదు చేయడం ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రీయ లోకదళ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలయిన వేగులపాటి రమ్య కొద్ది వారాల క్రితం తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఆధ్వర్యంలో, కేసీఆర్ ఇంటి ముందు 'వెయ్యి డప్పులు-లక్ష చెప్పులు' అనే ఒక నిరసన కార్యక్రమం చెప్పట్టాలనుకొన్నారు. దానికోసం ఒక పోస్టర్‌ కూడా సిద్దం చేసి దానిని విడుదలకు జరిపిన ఒక సభలో, ఆమె తన పెదనాన్న కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించారు. దానికి ఆగ్రహించిన తెరాస మహిళా నేతలు కరీంనగర్ లో రమ్యకు చెందిన ఒక ఫంక్షన్ హాలుపై దాడి చేసి అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు.   రమ్య మొన్ననే ఈ విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి పిర్యాదు కూడా చేశారు. ఈ రోజు ఆమె మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించి, తనకు తన కుటుంబానికి కెసిఆర్ మరియు తెరాస కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని, అందువల్ల తమకు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఆమె పిర్యాదుని స్వీకరించిన మానవ హక్కుల సంఘం ఈ అంశంపై వచ్చే నెల 8వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని కరీంనగర్ పోలీసు సుపరెండేంట్ కు ఆదేశాలు జారీ చేసింది.   ఇది టీకప్పులో తుపానులా త్వరలోనే సమసిపోవచ్చును, కానీ ఈ సంఘటన కేసీఆర్ కుటుంబకలహాలను బయట పెట్టింది.

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: బాబు

      తెలంగాణపై మహానాడులో తీర్మానం చేశామని, తెలంగాణకు టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణ అమరులైనవారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ తెలంగాణ విషయంలో మరింత స్పష్టత ఇస్తున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. తాము అధికారంలోకి రాగానే రూ10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. కేటీఆర్ వసూళ్లపై టీఆర్ఎస్ ఎందుకు నోరు విప్పదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అరాచకాలను ఎండగడతామని బాబు తెలిపారు. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కలుస్తాయని వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని బాబు వెల్లడించారు. టీడీపీ హాయంలో హైదరాబాద్ ఆదాయం పెరిగిందని తెలిపారు.

మోడీ కోసం తవ్విన గోతిలో కాంగ్రెస్

  గుజరాత్ లో 2004లో జరిగిన ఒక ఎంకౌంటర్ లో ముంబై కి చెందిన ఇష్రాద్ అనే 19 ఏళ్ల యువతి కూడా మృతి చెందింది. అది భూటకపు ఎన్కౌంటర్ అని ఆరోపణలు వెల్లువెత్తడంతో, కేంద్రం సీబీఐని దర్యాప్తుకి ఆదేశించింది. సీబీఐ కూడా చాలా చురుకుగా దర్యాప్తు చేసి, ఇది ఖచ్చితంగా భూటకపు ఎన్కౌంటరేనని తేల్చి చెప్పడమే కాకుండా దీనితో సంబంధం ఉందని భావించిన అనేక మంది గుజరాత్ పోలీసు అధికారులను కూడా అదుపులోకి తీసుకొంది. దాదాపు 1200 పేజీల చార్జ్ షీట్ కూడా తయారు చేసింది.   అయితే, ఇష్రాద్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని హత మార్చేందుకు మానవబాంబుగా శిక్షణ తీసుకొన్నయువతి అని ఇంటలిజన్స్ బ్యురో 2009 లోనే నాటి హోంమంత్రి చిదంబరానికి ఒక లేఖ వ్రాసింది. అదే విధంగా అమెరికాలో పట్టుబడ్డ డేవిడ్ హెడ్లీ కూడా ఇష్రాద్ పేరుని ప్రస్తావించాడు. అయితే ఇంటలిజన్స్ బ్యూరో (ఐ.బీ.) హోంమంత్రికి వ్రాసిన లేఖ గురించి, హెడ్లీ చెప్పిన అంశాల గురించి కేంద్రానికి పూర్తి సమాచారం ఉన్నపటికీ, సీబీఐ ను విచారణకు ఆదేశించడం, సీబీఐ అది భూటకపు ఎన్కౌంటర్ అని తేల్చి చెప్పడం జరిగిపోయింది.   కానీ, సీబీఐ అధికారులు తమను కూడా వేదిస్తున్నారంటూ ఇంటలిజన్స్ బ్యూరో (ఐ.బీ.) డైరక్టర్ హోంశాఖకు వ్రాసిన లేఖ బయటపడటంతో, ఒక్కసారిగా ఈ తెర వెనుక భాగోతం కూడా బయటపడింది.   మోడీని ప్రధాని అభ్యర్ధిగా ముందుకు తీసుకు వచ్చి రాహుల్ గాంధీకి సవాలు విసురుతున్న తమను కట్టడి చేయడానికే, కేంద్రం, సీబీఐ రెండూ కలిసి ఈ నాటకమంతా ఆడాయని గ్రహించిన బీజేపీ కాంగ్రెస్ కు, సీబీఐకి ఈ విషయంలో అనేక ప్రశ్నలు సందించింది. కానీ వాటికీ జవాబు ఇవ్వకుండా, త్వరలోనే మోడీ అసలు రూపం బయటపడుతుందని కాంగ్రెస్ బీజేపీని ఇంత కాలంగా ఎద్దేవా చేస్తూ వచ్చింది. కానీ, ఇప్పుడు అకస్మాతుగా ఐ.బీ. వ్రాసిన లేఖ బయటపడటంతో కాంగ్రెస్ పని కుడితిలో పడిన ఎలుకలా తయారయింది.   సుప్రీంకోర్టు ఇటీవలే సీబీఐని ‘అనేక యజమానుల చేత ఆడించ బడుతున్న పంజరంలో చిలుక’గా అభివర్ణించిన కొద్ది రోజులకే, సీబీఐ మళ్ళీ అత్యుత్సాహానికి పోయి మరో మారు కోర్టు తనకిచ్చిన పేరుని సార్ధకం చేసుకొంది.   ఐబీ అధికారులు చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇస్తూ సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తాము హైకోర్టు ఆదేశాల మేరకే వారిని విచారణ చేస్తున్నామని, ఇష్రాత్ కేసులో ఐబి ప్రమేయం కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పడం విశేషం. అంటే, ఐబీని కూడా ఈ కేసులో దోషిగా భావిస్తున్నదా? అనే సంగతి ఇంకా సీబీఐ స్పష్టం చేయవలసి ఉంది.   ఈవిధంగా రెండు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇంత తీవ్రమయిన కేసులో ఇంత తీవ్రమయిన ఆరోపణలు ఒకరిపై మరొకరు గుప్పించుకోవడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. మోడీ కోసం తవ్వుతున్న గోతిలోనే తాను కూడా నిలబడి ఉన్నట్లు కాంగ్రెస్ కాస్త ఆలస్యంగా గుర్తించింది. ఇప్పుడు ఆ గోతి లోంచి ఎవరు బయటపడుతారో కాలమే చెపుతుంది.

ఒకటి లేదంటే మూడు రాష్ట్రాలు

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. లేకుంటే తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రాష్ట్రాలుగా విభజించాలి. అంతేకాని రాయలసీమను రెండుగా విభజిస్తే ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. రెండు వైపుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమం వస్తుంది అని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ లు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ వివరించారు. తెలంగాణ మీద త్వరలో ఓ నిర్ణయం వస్తుందన్న ప్రచారం, రాయల తెలంగాణ ఏర్పాటు అన్న ఊహాగానాల నేపథ్యంలో వారు తమ వాదనను వినిపించారు. ఇక హైదరాబాద్ విషయం తేల్చిన తరువాతనే తెలంగాణ ఏర్పాటు గురించి మాట్లాడాలని, లేకుంటే రాష్ట్రం రావణకాష్టంలా మారుతుందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్ఫష్టం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసి రాష్ట్రాన్ని విభజిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ అన్నారు.  

కోర్ కమిటీలో తెలంగాణ పై నిర్ణయం?

      రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పార్టీ అదినేత్రి సోనియాగాంధీతో బేటీ ముగిసింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై రూపొందించిన నివేదికను ఈ సంధర్బంగా ఆయన సోనియాగాంధీ కి అందజేశారని సమాచారం. ఈ నివేదిక ఆధారంగా కోర్ కమిటీ సమావేశంలో తెలంగాణాపై కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయానికి వచ్చే అవకాశంమున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతున్న దిగ్విజయ్ కేంద్ర హోం మంత్రి షిండేతో కూడా సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. కోర్ కమిటీ తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ముందుగా రాష్ట్ర నేతల నుంచి కూడా రోడ్ మ్యాప్ లు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ కోరారు. సోనియాతో భేటీకి ముందు దిగ్విజయ్ సింగ్ రాహుల్ గాంధీతో భేటీ కావడం ఆసక్తికరంగా ఉంది.

సానుభూతే ఆయుధంగా బరిలోకి దిగుతున్న వైకాపా

  జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక ముందు అతను, ప్రమాదంలో మరణించిన తండ్రి రాజశేఖర్ రెడ్డి నామస్మరణ చేస్తూ ప్రజల సానుభూతి పొందే ప్రయత్నం చేసారు. కొత్తగా పెట్టిన తన రాజకీయ పార్టీని పటిష్టపరుచుకొనేందుకు అతను దాదాపు ఏడాదిపాటు ఓదార్పుయాత్ర సాగించిన తరువాత అక్రమాస్తుల కేసులో అరెస్టయ్యి జైలుకి వెళ్ళవలసి వచ్చింది. నాటి నుండి పార్టీ భాద్యతలను తమ భుజస్కంధాల మీద వేసుకొన్న అతని తల్లి విజయమ్మ, సోదరి షర్మిలకు అతని అరెస్టుతో మరో కొత్త అస్త్రం దొరికింది. అదే సానుభూతి అస్త్రం. (రాజశేఖర్ రెడ్డి) సెంటిమెంట్ తో బాటు, నాటినుండి జగన్ మోహన్ రెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టారంటూ ప్రజలకి చెప్పుకొంటూ వారి సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబుని అసమర్ధులు, అవినీతిపరులు అని దుయ్యబట్టడం, వైయస్సార్- సెంటిమెంట్ మరియు జగన్-సానుభూతి అనే పాయింట్ల మీదనే వారిరువురూ గత ఏడాది కాలంగా మాట్లాడుతున్నారు తప్ప వేరే కొత్తగా మాట్లడేందుకు ఏమీ లేదు.   మళ్ళీ ఇప్పుడు పంచాయితీ ఎన్నికలు దగ్గర పడుతున్నందున, విజయమ్మ మరో మారు ఈ ‘సెంటిమెంట్-సానుభూతి’ అస్త్రాలను ప్రజల మీదకి ప్రయోగిస్తున్నారు. ఈ సారి విజయమ్మ ముఖ్యమంత్రి మీద తాజాగా మరో కొత్త ఆరోపణ కూడా చేసారు. ఆయన డిల్లీ వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని పంచాయితీ మరియు స్థానిక ఎన్నికలు పూర్తయ్యేవరకూ జైలు నుండి విడుదల చేయవద్దని, ఈ లోగా తానూ పార్టీని బలపరుచుకొని ఎన్నికలలో గెలవగలనని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు ఆమె ఆరోపించారు. ఈ విషయంలో తనకు డిల్లీ నుండి ఖచ్చితమయిన సమాచారం ఉందని ఆమె చెప్పడం మరో విశేషం. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరిని అడిగారో, దానిని ఎవరు విని ఆమెకు చేరవేసారో మాత్రం తెలియదు.   రెండు నెలల క్రితం సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి పెట్టుకొన్న బెయిలు పిటిషను తిరస్కరిస్తూ, సీబీఐకి నాలుగు నెలల గడువు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. నాలుగు నెలలలోగా సీబీఐ గనుక తన దర్యాప్తు పూర్తి చేయలేకపోతే, అప్పుడు ఆయన క్రింద కోర్టులో మళ్ళీ బెయిలు పిటిషను దరఖాస్తూ చేసుకోవచ్చునని ఆనాడే సుప్రీంకోర్టు స్పష్టమయిన తీర్పు చెప్పింది. అంటే జగన్ కు ఎట్టి పరిస్థితుల్లో ఆగస్ట్ నెలాఖరు వరకు బెయిలు కోరేందుకు అవకాశం లేదన్న మాట.   మరి ఈ విషయాన్నీదాచిపెట్టి, విజయమ్మ ముఖ్యమంత్రి తన కొడుకుని ఎన్నికలు ముగిసే వరకు జైలులో నిర్బంధించి ఉంచమని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు చెప్పడం చూస్తే, చివరికి తన కొడుకు జైలులో నిర్బందించబడటాన్ని కూడా ఎన్నికల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతుంది.   సైన్యాధ్యక్షుడు లేకుండా యుద్ద రంగంలో అడుగుపెట్టబోతున్నసైన్యంలా ఉన్న తమ పార్టీని, ఎన్నికల కురుక్షేత్రంలోగెలిపించు కోవడానికి ఆమె సానుభూతినే ఆయుధంగా వాడుకోక తప్పడం లేదు. పాదయాత్రలతో విలువయిన తన సమయం వృధా చేసుకొంటున్న షర్మిల, తన పార్టీని బలోపేతం చేసుకొనేందుకు ప్రయత్నిచి ఉంటే పార్టీకి ఇటువంటి దుస్థితి వచ్చేది కాదేమో.

కిరణ్ సర్కారుని గట్టున పడేసిన ఆహార భద్రత

  ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన స్వంత ఇమేజ్ పెంచుకొనేందుకు గత కొంత కాలంగా అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. వేల కోట్ల వ్యయం అయ్యే ఈ పధకాలను రాష్ట్ర ఖజానాకి మోయలేని భారంగా మారినప్పటికీ, తన రాజకీయ ప్రయోజనాలకోసం, ముఖ్యమంత్రి ఇంకా కొత్త కొత్త పధకాలు ప్రకటిస్తూనే ఉన్నారు. అయితే వీటికి అవసరమయిన నిధులు ఎక్కడి నుండి రాలుతాయని ప్రశ్నించుకొంటే, అవి వివిధ రకాల పన్నుల రూపేణా మళ్ళీ ప్రజల జేబులోంచే రాబట్టక తప్పదని అర్ధం అవుతుంది.   ముఖ్యమంత్రి మొన్న సంక్రాంతి పండుగ సందర్భంగా ‘మన బియ్యం’ అనే పధకం మొదలుపెట్టారు. ఇందులో కిలో బియ్యం రూపాయి చొప్పున దాదాపు రాష్ట్రంలో 2.26 కోట్ల తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకి ఇస్తున్నారు. ఈ బియ్యం సబ్సీడీ కొరకు రాష్ట్ర ఖజానాపై దాదాపు ఏడాదికి రూ. 9,600 కోట్ల భారం పడుతోంది. దానిని సమకూర్చుకోవడానికే తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ ఉగాది పండుగ సందర్భంగా ‘అమ్మ హస్తం’ అనే మరో కొత్త పధకం ప్రారంబించింది. ఇందులో 9 రకాల సరుకులు కేవలం రూ. 185లకే ఇస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై పడే భారం ఏడాదికి రూ. 660 కోట్ల పైమాటే. మళ్ళీ మొన్న వేల కోట్ల వ్యయం అయ్యే ‘బంగారుతల్లి’ పధకాన్ని కూడా ముఖ్యమంత్రి మొదలుపెట్టారు.   రాష్ట్ర ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా, కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ముఖ్యమంత్రి ప్రకటిస్తున్న ఈ పధకాల భారం అంతిమంగా ప్రజలే మోయవలసి ఉంటుందనేది చేదు నిజం. అయితే, కేంద్రం మొన్న ఆహార భద్రత బిల్లుని ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఊరట లభించింది.   మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్రం ఆమోదించిన ఈ బిల్లువల్ల, ప్రస్తుతం ఈ సంక్షేమ పధకాలపై రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న ఆర్ధిక భారం సగానికి సగం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రజలకి ఆహార భద్రత కల్పించడం మాటెలా ఉన్నపటికీ, ఈ బిల్లుతో ఒడ్డుననపడిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ త్వరలో మరికొన్నికొత్త పధకాలను ప్రకటించుతారేమో.

కేసీఆర్ ను చికాకు పెడుతున్న కూతురు రమ్య

      తెలంగాణ రాష్ట్ర సమితి అదినేత కె.చంద్రశేఖరరావు ను ఆయన అన్న కుమార్తె రమ్య చికాకు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఈ నెల ఏడును కెసిఆర్ కు వ్యతిరేకంగా నిర్వహించబోతున్న కార్యక్రమానికి మద్దతు ఇచ్చి పోస్టర్ విడుదల కార్యక్రమంలో రమ్య పాల్గొని కెసిఆర్ ను విమర్శించారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేశారు. ఇప్పుడు ఈ విషయం కెసిఆర్ కు తలనొప్పిగా మారింది. కెసిఆర్ నుంచి తమకు ప్రాణహాని వుందని, టీఆర్‌ఎస్ తో విభేదించినందుకే తమపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆమె తెలిపింది. టీఆర్‌ఎస్ మాజీ నేత చింతాస్వామితో కలిసి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వద్దకు వెళ్లిన రామ్య తమకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం విశేషం. త్వరలో డీజీపీ దినేష్‌రెడ్డిని కలిసి రక్షణ కల్పించాల్సిందిగా కోరతామన్నారు.

మోపిదేవిని బలిపశువు చేశారు: విజయమ్మ

      జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. జగన్ ని జైలు కు పంపేందుకు మోపిదేవి వెంకటరమణను బలిపశువును చేశారని విమర్శించారు. మోపిదేవి కుటు౦బం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన సందర్భంగా కార్యకర్తలనుద్ధేశించి ప్రసంగిస్తూ... మోపిదేవి వారం రోజుల్లో బయటకు తీసుకువస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చి మరిచిపోయారని అన్నారు. 26 జివోల కేసుల్లో ఒక్కొక్కరికీ ఒక్క న్యాయమా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తన కష్టంతో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొని వస్తే..దాని ప్రతిఫలంగా ఆయన పేరును అప్రతిష్ట చేసేందుకు ఎఫ్‌ఐఆర్‌లో పెట్టారని అవేద్ధాన్ వ్యక్తం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు చేస్తున్న కుట్రలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.  ప్రతి పంచాయతీలో పార్టీ విజయం సాధించాలని, పార్టీ జెండా రెపరెపలాడాలని ఆమె తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ మాయం

      రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు జోస్యం చెప్పారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎర్రబెల్లి హాజరయ్యారు. సకల జనుల సమ్మె కొనసాగి ఉంటే కేంద్రం దిగి వచ్చేదన్నారు. అనుకూల ప్రకటన వచ్చే సమయానికి కేసీఆర్ ఢిల్లీలో రూ.500 కోట్ల ప్యాకేజీ తీసుకున్నారు. అటు సమ్మెను, ఇటు ఉద్యమాన్ని నీరుగార్చాడని ఆరోపించారు. కేసీఆర్ ఏ మీటింగ్‌లోనూ సోనియాను విమర్శించలేదని , దానికి కారణమేంటో అందరికీ తెలుసన్నారు. కడియం శ్రీహరిని పార్టీలోకి తీసుకువచ్చి మంత్రి పదవి వచ్చేలా అధిష్ఠానంపై ఒత్తిడి చేసింది నేనేనన్నారు. అలాంటి శ్రీహరి విశ్వాసం లేకుండా నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.