కాంగ్రెస్ పార్టీకి సింహస్వప్నంలా మారిన జగన్

  పదిరోజుల్లో తెలంగాణా సంగతి తేల్చేస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పి విమానం ఎక్కినప్పటికీ, ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఇంకా రాయల తెలంగాణాపై చర్చలు సాగుతూనే ఉండటం విశేషం.    ఈ 10రోజుల తాజా డెడ్ లైన్ సంగతి ఎలా ఉన్నపటికీ, గత 10 రోజులుగా ప్రధానంగా, ‘సీమంధ్రాపై జగన్ మోహన్ రెడ్డి ప్రభావం’ గురించే చర్చ సాగింది. అతను జైల్లో ఉన్నపటికీ, ‘అతనిది కూడా తమ డీ.యన్.ఏ.నని’ సాక్షాత్ దిగ్విజయ్ సింగే చెప్పుకొవడం చూస్తే, కాంగ్రెస్ పార్టీ అతని బలాన్ని బాగానే అంచనా వేసిందని చెప్పవచ్చును. రాయలసీమ ప్రాంతంలో బలంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డిని బలహీనపరచడానికే కాంగ్రెస్ రాయల తెలంగాణా ఎత్తు వేసిందని విశ్లేషణలు తేల్చి చెప్పాయి.   ఇక, రాయల తెలంగాణా, 10 రోజుల్లో తెలంగాణా అనే ప్రస్తావనలు రెండు కూడా జగన్ కారణంగానే వచ్చాయని మంత్రి టీజీ. వెంకటేష్ కూడా కనిపెట్టేశారు. అంటే జగన్నిచూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఆయన కూడా తేల్చి చెప్పేశారు. అందువల్ల, ఇప్పుడు ఈ 10 రోజుల్లో తెలంగాణా అనే నిర్ణయం జగన్ మోహన్ రెడ్డిని కట్టడి చేసే విధంగానే ఉండవచ్చునని భావిస్తున్నందునే, ఇంకా రాయల తెలంగాణా సీరియల్ నడుస్తోంది.   ఈ సారి 10రోజులంటే ఖచ్చితంగా 10 రోజులే అని కాంగ్రెస్ గనుక భావిస్తే, కాంగ్రెస్ ఎటువంటి తెలంగాణా ఇవ్వబోతోందో మనకీ తెలుసుకొనే అవకాశం దొరుకుతుంది.

కాంగ్రెస్ ఎత్తుకి కెసిఆర్ చిత్తయ్యాడా!

  కాంగ్రెస్ నేతలకి వలేసిపట్టుకొందామనుకొన్న కేసీఆర్ తానే ఇప్పుడు కాంగ్రెస్ గాలానికి చిక్కుకొని విలవిలలాడుతున్నాడు. తమ ప్రమేయం లేకుండానే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణా గురించి మాట్లాడుతుంటే, దానికి ఏవిధంగా స్పందించాలో అర్ధంకాక రెండురోజులు మౌనంగా ఉండిపోయిన ఆయన, “కాంగ్రెస్ మాటలు వింటుంటే నిజంగానే తెలంగాణా ఇస్తుందేమోననిపిస్తోంది. కానీ దాని గత చరిత్ర చూస్తే, ఇదికూడమరో కొత్తనాటకమనిపిస్తుంది. ఏమయినప్పటికీ, కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే మాకొచ్చిన నష్టం ఏమి లేదు. అప్పుడు తెలంగాణా నిర్మాణం కోసం మేము మరో కొత్త ఉద్యమం మొదలుపెట్టవలసి ఉంటుంది. మా ప్రమేయం లేకుండా కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే, మేము కాంగ్రెస్ లో విలీనం కావలసిన అవసరం కూడా ఉండదు. కాంగ్రెస్ తెలంగాణా ఇస్తుందని నాకయితే నమ్మకం లేదు,” అని అన్నారు.   గత పదేళ్ళ బట్టి కాంగ్రెస్ ఎప్పుడెప్పుడు తెలంగాణా ఇవ్వబోతోందో జోస్యం చెపుతూ వచ్చిన కేసీఆర్, ఇప్పుడు కాంగ్రెస్ తనంతట తానే తెలంగాణా ఇస్తానని చెపుతుంటే నమ్మలేకబోతున్నాడు. ‘కాంగ్రెస్ మాటలు నమ్మాలో లేదో అర్ధం కావట్లేదని’ మొట్ట మొదటిసారిగా ఆయన నిజాయితీగా ఒప్పుకోవడం విశేషం. ఇక, ‘తమ ప్రమేయం లేకుండా కాంగ్రెస్ తెలంగాణా ఇస్తే, తమ పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదని’ చెప్పడంలోనే, ఆయన నష్టపోయానని ఒప్పుకొంటున్నారు.   ఉద్యమాలు జోరుగా నడుస్తున్నపుడు, కాంగ్రెస్ కి ఆయన షరతులు, హెచ్చరికలు జారీచేసే పరిస్థితిలో ఉండేవారు. తెలంగాణాలో, ముఖ్యంగా హైదరాబాదులో ప్రశాంతత ఉండాలంటే కాంగ్రెస్ ఆయనను ప్రసన్నం చేసుకోక తప్పని పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఆయనని, ఆయన పార్టీని పక్కన బెట్టి, తెలంగాణాపై తానే స్వయంగా నిర్ణయం తీసుకొంటుంటే, ఆయన ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.ఇది వరకు తెరాసను విలీనం చేయమని కాంగ్రెస్ వెంటబడితే, ఇప్పుడు కేసీఆరే స్వయంగా విలీనం గురించి మాట్లాడుతుండటం మారిన పరిస్థితికి అద్దం పడుతోంది.   అయితే, పరిస్థితులు ఎల్లపుడు అటు కాంగ్రెస్ పార్టీకో, ఇటు తెరసకో అనుకూలంగా ఉంటాయని అనుకోవడం అవివేకం. ఒకప్పుడు తెరాసది పైచేయి అయితే, ఇప్పుడు కాంగ్రెస్ హస్తం పైనుంది. అందువల్ల రాజకీయాలలో ఎప్పుడు, ఏ కారణం చేతయినా పరిస్థితులు తారుమారవవచ్చును. అంతవరకు కేసీఆర్ ఓపికగా ఎదురుచూడగలడని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చును.

కెసిఆర్ అన్న కుమార్తె ఇంటిపై టీఆర్ఎస్ దాడి!

      తమ్ముడే తమ్ముడే...పేకాట పేకాటే అని చాలా మంది అంటుంటారు. రాజకీయాలలో కూడా అంతే బంధువైన, బయటవరైనా ఒకటే. టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు కెసిఆర్ అన్న కూతురు ఇంటిపై దాడి చేయడం విశేషం. తెలంగాణ మాదిగ దండోరా నాయకుడు చింతా స్వామి ఈ నెల ఏడును కెసిఆర్ కు వ్యతిరేకంగా నిర్వహించబోతున్న కార్యక్రమానికి మద్దతు ఇచ్చి పోస్టర్ విడుదల కార్యక్రమంలో రమ్య పాల్గొని కెసిఆర్ ను విమర్శించారు. దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు ఆమె ఇంటిపై దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి దాడులు చేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీకే నష్టం జరిగే అవకాశం వుంది.

కాంగ్రెస్ కి జలక్ ఇచ్చిన మోపిదేవి

  వాన్పిక్ భూముల వ్యవహారంలో గతేడాది అరెస్టయిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకి ఇంతవరకు బెయిలు కూడా దొరకలేదు. ధర్మాన ప్రసాదరావును, సబితా ఇంద్ర రెడ్డిని వెనకేసుకు వచ్చిన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మోపిదేవిని మాత్రం ఎందుకో మొదటి నుండి పట్టించుకోలేదు. అదే విషయం మీడియా అడిగినప్పుడు వారిద్దరి కేసుల్లో చాలా తేడా ఉందని మాత్రమే జవాబు ఇచ్చారు తప్ప ఆయనకి ఎటువంటి సహాయము చేయలేదు. కనీసం పార్టీలో మిగిలిన నేతలు కూడా ఆయనను ఎన్నడూ పలకరించిన పాపాన పోలేదు.   ఒకనాడు గుంటూరులో ఒక వెలుగు వెలిగిన మోపిదేవి, నేడు తరచూ అనారోగ్యం గురవుతున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ నేతలు గానీ, కిరణ్ కుమార్ రెడ్డి గానీ కనీసం సానుభూతి కూడా చూపకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడేందుకు నిశ్చయించుకొన్నారు. ముందుగా ఆయన సోదరుడు హరనాథ బాబు, మరి కొందరు మాజీ సర్పంచులు, ఆయన అనుచరులు ఈ నెల 5న వైయస్సార్ కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకొన్నారు. ఇక మోపిదేవి, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రస్తుతం చంచల్ గూడా జైల్లో ఉన్నందున, ఆయన కూడా వైకాపా గూటిలో ఉన్నట్లే లెక్క.   రాయపాటి, కన్నా లక్ష్మినారాయణ, కొత్తగా చేరిన రత్తయ్య వంటి హేమా హేమీలున్న గుంటూరు జిల్లాలో మోపిదేవి నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీకి పెద్ద నష్టం కలుగకపోయినా, వైకాపాకు మాత్రం చాల బలం చేకూరుతుంది. అయితే, ఎవరి కారణంగా అయన జైలు పాలయ్యాడో వారిని ద్వేషించేబదులు ఆయన వారి పంచనే చేరడం ఆశ్చర్యం. మోపిదేవి గనుక అరెస్ట్ కాకపోయి ఉంటే, మిగిలిన కాంగ్రెస్ నేతలవలే నేడు ఆయన కూడా జగన్ మోహన్ రెడ్డి ని నిందిస్తూ ఉండేవారేమో!

రాయపాటి రాజీనామా హెచ్చరిక

      కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడానికి మొగ్గుచుపుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సమైఖ్య సెగ పెరుగుతోంది. తెలంగాణ ఇస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటానని లగడపాటి రాజగోపాల్ ప్రకటిస్తే... రాష్ట్ర విభజన జరిగితే పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు. తాను ముమ్మాటికి సమైక్యవాదినేనని అన్నారు. తెలంగాణ, సమైక్యం పైన రెఫరెండం పెడితే తాను సమైక్యవాదానికే ఓటు వేస్తానని ఆయన చెప్పారు.   మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై వారం, పది రోజుల్లో తేల్చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతూ తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.  తెలంగాణపై తేల్చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. విభజన, సమైక్యవాద సభలకు అనుమతించిన దిగ్విజయ్ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.  

పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

      పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) రమాకాంత్ రెడ్డి షెడ్యూల్‌ను విడుదల చేశారు. మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరుగనుంది. 23న తొలి విడత ఎన్నికలు, 27న రెండో విడత ఎన్నికలు, 31న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈనెల 9న జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. జులై 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 13న నామినేషన్లకు చివరి తేది. ఈనెల 14న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది జులై 17. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావలి(ఎన్నికల కోడ్) అమలులోకి వచ్చిందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు.

తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటాం: లగడపాటి

      స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తెలంగాణపై శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. అలా ప్రవేశపెట్టే అసెంబ్లీ తీర్మానాన్ని ఓడించడమే మా లక్ష్యం అని లగడపాటి అన్నారు. సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు ఎటు ఓటేస్తారో తేల్చుకోవాలి అని ఆయన అన్నారు. టీడీపీ లేఖ వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చింది అని ఆరోపించారు. తెలుగుతల్లి మెడపై కత్తిపెట్టారు, అందరూ మేల్కోవాలి అని అన్నారు. తెలంగాణ వస్తే తను రాజకీయాల్లో ఉండను అని స్పష్టం చేశారు. అయితే మెజార్టీ ప్రజల ఆంకాక్షకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరించొద్దు అని ఆయన అశాభావం వక్తం చేశారు. మరి ఈయన ఆశలు ఫలించేనా…

ఎవరి కాళ్ళు పట్టుకోలేదు: కావూరి

        కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కిన తర్వాత కావూరి తొలిసారి తన సొంత నియోజకవర్గమైన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి వచ్చిన సంధర్బంగా ఇండోర్ స్టేడియంలో ఆయనకు జిల్లా నేతలు సన్మానం చేశారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర రాష్ట్రానికి ఎక్కువగా నిదులు తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తాను పదవుల కోసం ఎవరి కాళ్ళు పట్టుకోలేదని అన్నారు. తాను కాంగ్రెసు పార్టీకి నిత్యం కార్యకర్తగానే పని చేశానని, ఏనాడు పదవి కోసం ఎదురు చూడలేదన్నారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేయాలని తాను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేంద్ర మంత్రి పదవి కోసం గట్టిగా ఆశించి,ఒక సందర్భంలో అలిగిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు తనకు పదవీకాంక్ష లేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి తపన

  దిగ్విజయ్ సింగ్ చెప్పినట్లు కేంద్రం త్వరలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నట్లు జరుగుతున్నపరిణామాలు తెలియజేస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి సహజంగానే అందరికంటే ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేయబడటంతో, రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే తపనతో ఆయన క్రిందటి వారంలో మూడు రోజులుపాటు డిల్లీలో మకాం వేసి సోనియా గాంధీని కలిసి తన వాదనను వినిపించేందుకు విశ్వప్రయత్నాలు చేసారు. అందుకోసం ఆయన అత్యంత రహస్యంగా ఒక ప్రత్యేక నివేదిక కూడా తయారు చేయించారు. దానిలో తెలంగాణను రూ.80,000 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ఒక ప్రత్యేక ప్యాకేజీ రూపకల్పన చేసారు. అయితే, తెలంగాణా అంశంపై కోర్ కమిటీ ఇప్పటికే సుదీర్గ చర్చలు చాలా చాల చేసి, ఒక నిర్ణయానికి వచ్చినందున, ఇక ఈ విషయంలో మళ్ళీ మరో ఆలోచనకు ఇష్టపడని సోనియా గాంధీ, ముఖ్యమంత్రిని కలిసేందుకు నిరాకరించారు. అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ అధిష్టానం పెద్దల ద్వారా ఆమెను ఒప్పించి కలవాలని విశ్వప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి దిగ్విజయ్ సింగ్ వచ్చి సోనియా గాంధీ అభిప్రాయం ఆయనకు తెలియజేయడంతో, ఆయన నిరాశగా వెనుతిరిగి వచ్చారు.   ఆ తరువాత టీ-కాంగ్రెస్ నేతల బహిరంగ సభ జరగడం, ఆ మరునాడే దిగ్విజయ్ సింగ్ పదిరోజుల్లో తెలంగాణాపై నిర్ణయం వెలువడుతుందని ప్రకటించడం అంతా శాస్త్ర ప్రకారమే జరిగిపోయింది. ఇక, ఆయన తెలంగాణపై రోడ్ మ్యాప్ తయారుచేసే బాధ్యతకూడా ఆయన ముఖ్యమంత్రికే అప్పజెప్పడం విశేషం.

విశ్వసనీయతకు పేటెంట్ హక్కులు మావే

  దిగ్విజయ్ సింగ్, జగన్ డీ.యన్.ఏ. తమ కాంగ్రెస్ డీ.యన్.ఏ. రెండూ ఒకే రకమయినవని అన్నపుడు కాంగ్రెస్ నేతల నోట మాట రాలేదు. కాంగ్రెస్ నుండి వచ్చిన ఈ సందేశానికి వైకాపా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తుంటే, ఆ పార్టీ నేత షర్మిల తన సోదరుడిని కాంగ్రెస్ తో పోల్చడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.   తన పాదయాత్రలో మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా పెందుర్తి వద్ద గల సబ్బవరం చేరుకొన్నఆమె ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, తన సోదరుడిది మూమ్మాటికీ కాంగ్రెస్ డీఎన్ఏ కాదని అన్నారు. జగన్ డీఎన్ఏ పేరు విశ్వసనీయత అయితే, కాంగ్రెస్ డీఎన్ఏ నయవంచన అని ఆమె ఎద్దేవా చేసారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి 30 ఏళ్లు సేవ చేశారని, రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను నిలబెట్టారని, అయినప్పటికీ ఆ విశ్వాసం లేకుండా ఆయన పేరును సీబీఐ ఎఫ్ఐఆర్ లో చేర్చిందని, ఇంతటి నమ్మక ద్రోహం చేసిన వారి డీఎన్ఏతో, విస్వసనీయతకు మారు పేరుగా నిలిచిన తన సోదరుడు జగన్ డీఎన్ఏ సరిపోల్చుకోవడానికి కాంగ్రెస్ సిగ్గుపడాలని ఆమె విమర్శించారు. అదేవిధంగా సోనియా గాంధీని, కిరణ్ కుమార్ రెడ్డిని, చంద్రబాబుని, చిరంజీవిని కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు.   కాంగ్రెస్ పార్టీపై ఇంత తీవ్రంగా విరుచుకుపడుతున్న ఆమె మరి అదే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తరువాత మద్దతు ఈయలనుకోవడం ద్వంద ప్రమాణాలు కావా? చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా తిడుతూ, తెర వెనుక ఆ పార్టీతో కలిసిపనిచేస్తున్నాడని ఆరోపిస్తున్న షర్మిల, మరి తాము కూడా ఇప్పుడు అదే తప్పు ఎందుకు చేయబోతున్నట్లు? విశ్వసనీయతకు తాము మారుపేరని అభివర్ణించుకొనే వారు, మరి విశ్వాసంలేని కాంగ్రెస్ పార్టీ తోకపట్టుకొని ఎందుకు వ్రేలాడాలనుకొంటున్నారు?   ప్రజల కోసం జగన్ మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళారని పదేపదే నొక్కి చెపినంత మాత్రాన్న ప్రజలు నమ్ముతారనుకోవడం ఆమె భ్రమ. అతనికి ముఖ్యమంత్రి కావాలనే దురాశే అతను కాంగ్రెస్ ను వీడేలా చేసింది తప్ప షర్మిల చెపుతున్నట్లు ప్రజల ఓదార్చడం కోసం మాత్రం కాదని అందరికి తెలుసు.   ఆయన ఓదార్పు పేరిట తన పార్టీని బలపరుచుకొనే ప్రయత్నం చేస్తున్నపుడు, అతను ఏకుమేకవుతాడనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, అతని వేలకోట్ల అక్రమార్జనపై సీబీఐ విచారణకు ఆదేశించడంతో అతను కటకటాల పాలయ్యాడు. అతనికే గనుక ముఖ్యమంత్రి యావ లేకపోయి ఉంటే, నేడు కాంగ్రెస్ పార్టీలోనే ఏ కేంద్ర మంత్రి పదవో పొందేవాడని సాక్షాత్ గులాం నబీ ఆజాద్ చెప్పారు. అతని అధికార దాహం పార్టీకి దూరం చేస్తే, అతని ధన సంపాదన దాహం కటకటాల వెనుకకు నెట్టింది.   ఇదంతా కళ్ళకు కట్టినట్లు కనబడుతున్నపటికీ, దేశంలో క్రింద కోర్టు నుండి పై కోర్టు వరకు అతనిని తప్పు పడుతున్నపటికీ, అతను నిర్దోషని వాదించడం అతని కుటుంబ సభ్యులకే చెల్లు. పైగా విశ్వసనీయతకి తామే పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు మాట్లాడటం మరీ విచిత్రం.

కావూరి ర్యాలీలో అపశ్రుతి: ఓ వ్యక్తి మృతి

    కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు ర్యాలీలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కేంద్రమంత్రిగా భాద్యతలు తీసుకున్న తరువాత కావూరి తొలిసారి తన సొంత జిల్లాకు వస్తుండడంతో, గన్నవరం ఎయిర్‌పోర్టులో కృష్ణా జిల్లా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. ఈ సంధర్బంగా కార్యకర్తలు బాణాసంచా పేలుస్తుండగా నిప్పు రవ్వలు బాణాసంచాతో వెళ్తున్న ఆటోలో పడ్డాయి. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి ఆటోలో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, గాయాలైన మరో వ్యక్తిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బయలు దేరిన కావూరి కాన్వాయ్‌ను హనుమాన్‌జంక్షన్ వద్ద టీడీపీ నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకొని పరిస్థితిని అదుపుచేశారు.

కేసీఆర్ దురాశే కొంప ముంచిందా

  తెలంగాణా ఉద్యమం పేరిట కేసీఆర్ కాంగ్రెస్ పార్టీలో జవహార్ లాల్ నెహ్రు నుండి నేటి రాహుల్ గాంధీ వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా అందరిని దుమ్మెత్తిపోసాడు. కానీ, మొన్న జరిగిన టీ-కాంగ్రెస్ నేతల సభలో కాంగ్రెస్ నేతలందరూ ఏక త్రాటిపైకి రావడం, వారందరూ ముక్తకంఠంతో కాంగ్రెస్ ద్వారానే తెలంగాణా సాధ్యమని ప్రకటించిన మరునాడే దిగ్విజయ్ సింగ్ పది రోజుల్లో తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని ప్రకటించడంతో కేసీఆర్ కంగు తిన్నాడు.   తెలంగాణా ఇస్తే తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానంటూ డిల్లీలో నెల రోజులు తిష్ట వేసిన కేసీఆర్, నాడు కాంగ్రెస్ పార్టీకి అనేక షరతులు విదించాడు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, తనకే పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలని, టికెట్స్ పంపిణీ మొత్తం తన చేతుల మీదుగా తనకు నచ్చిన వారికి ఇచ్చుకొనే స్వేచ్చ ఉండాలని, తను కోరుకొన్న వ్యక్తులకు కొత్త ప్రభుత్వంలో మంత్రిపదవులు ఇచ్చుకొనెందుకు పార్టీ అంగీకరించాలని వగైరా, వగైరా షరతులు చాలానే విధించాడు. అయితే వాటిలో కొన్నిటికి కాంగ్రెస్ సమ్మతించినప్పటికీ, మరి కొన్నిటికి సమ్మతించక పోవడంతో కేసీఆర్ హైదరాబాద్ తిరిగి వచ్చేసి ఉద్యమం తీవ్ర తరం చేసాడు.   ఇప్పుడు, పరిస్థితి పూర్తిగా తారుమారయింది. ఆయనే స్వయంగా వచ్చి కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దపడినా, కాంగ్రెస్ నేతలు ‘మాకొద్దు పొమ్మంటున్నారు.’ కేసీఆర్ ని లోపలికి రానిస్తే అతను పార్టీకి గుదిబండగా మారి తలనొప్పులు సృష్టిస్తాడని చాల మంది టీ-కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేయడంతో, తెరాస ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటరానిదయిపోయింది.   నిన్న మొన్నటి వరకు తమకు సోనియమ్మ కనీసం అపాయింటు మెంటు కూడా ఈయకుండా హీనంగా చూస్తోందని వాపోయిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు తెలంగాణా మేమే ఇస్తామని దృడంగా, ఆత్మవిశ్వాసంతో చెపుతుంటే, తెరాస నేతలు విస్తుపోయి చూస్తున్నారు.   తెరాస పోలిట్ బ్యూరో సభ్యుడు వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం జరుగుతున్నది చూడటం కంటే మేము చేయగలిగింది ఏమి లేదు,” అన్నారు.   “ఒకనాడు మా పార్టీని కాంగ్రెస్ లో కలుపుకోవాలని వాళ్ళు చాలా ఆరాటపడ్డారు. కానీ, ఇప్పుడు మేమే తెలంగాణా ఇస్తామని చెపుతూ, మాతో కలవడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. ఒకవిధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ మాతో డబుల్ గేం ఆడి మోసం చేసినట్లు మేము భావిస్తున్నాము. ఇక, కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేనప్పుడు, మేము కూడా ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్దపడాల్సిందే,” అని కేటీఆర్ అన్నారు.   ఇది ఇలాగుంటే, మీడియాలో వస్తున్న వార్తా విశ్లేషణలు తెరాసను మరింత క్రుంగ దీస్తున్నాయి. ఇంత కాలం కాంగ్రెస్ నేతలకు వలేసి పట్టేసామని భ్రమలో ఉన్న కేసీఆర్, వారు ముగ్గురూ కూడా కాంగ్రెస్ పంపిన బంటులేనని, తానూ కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేస్తానని ప్రగల్భాలు పలుకుతుంటే అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీయే తన మనుషులను తెరాసలోకి జొప్పించి, కేసీఆర్ తన వ్రేలితో తన కన్నుపొడుచుకొనేలా చేసిందని, వారు పార్టీకి రాజీనామాలు చేసివచ్చినా సాంకేతికంగా ఇప్పటికీ కాంగ్రెస్ యంపీలేనని, తెలంగాణా ప్రకటించిన మరుక్షణం వారు తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడం ఖాయమని కొందరు తెరాస నేతలు అభిప్రాయపడుతున్నారు.   ఇంత కాలం తెలంగాణా కోసం ఉద్యమాలు చేసి సంపాదించుకొన్న పేరు ప్రతిష్టలని, ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఊహించని విధంగా ఎత్తుకుపోతుంటే కేసీఆర్ కి ఏమిచేయాలో పాలు పోవడంలేదు. కాంగ్రెస్ గనుక త్వరలో తెలంగాణా ప్రకటన చేసినట్లయితే, ఇక టీ-కాంగ్రెస్ నేతలను తట్టుకోవడం తన వల్ల కాదనే సంగతి కూడా అర్ధం అయింది. ఇక కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం మాట దేవుడెరుగు, ఇక తెరాస నుండి కాంగ్రెస్ లోకి వలసలు మొదలయితే దానిని ఆపడం సాద్యమా? అనే ఆలోచన ఆయనకు భయం కలిగిస్తోంది.

'రాయల తెలంగాణ' వెనుక కాంగ్రెస్ తంత్రం!

      ఆంద్రప్రదేశ్ కాంగ్రేస్ పార్టీకి అత్యంత కీలక రాష్ట్రం అనేది అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమంతో కెసిఆర్, ఇటు వైసీపీ ఆవిర్భావంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి క్లిష్టంగా మారింది. దీంతో తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి 'రాయల తెలంగాణ' ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.   రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి, మరోమాటలో చెప్పాలంటే ఆయన బలాన్ని చీల్చడానికి రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించడంలో మజ్లీస్‌ ప్రయోజనాలు కూడా రాజకీయపరమైనవే. ఇటు కాంగ్రెసు ఆ ప్రతిపాదనను ముందుకు తేవడంలో, మజ్లీస్ దానికి పచ్చజెండా ఊపడంలో కూడా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి తప్ప తెలుగు ప్రజల ప్రయోజనాలు అందులో ఇమిడి లేవనే విషయం తెలుస్తోంది. సీమాంధ్రలో రెడ్డి వర్గం బలహీనపడి సామాజిక సమీకరణలు మారిపోతాయని, ప్రధాన పోటీ కాపు, కమ్మ వర్గాల మధ్యే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కొత్తగా ఏర్పడే సమీకరణల్లో చిరంజీవి, బొత్స సత్యనారాయణ మొదలైన నేతలు బలోపేతమవుతారని, వీరు ఇతర వర్గాలను సమీకరించడంలో విజయం సాధించగలరని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.

తెలంగాణ కు పంచాయతీ బ్రేక్!

      గత కొన్ని రోజులుగా రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తెలంగాణ అంశం చివరి దశకు చేరుకుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అయితే తెలంగాణపై ప్రకటనకు స్థానిక సంస్థల ఎన్నికలు బ్రేక్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. పంచాయతీ షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం కాగా, అది తెలంగాణపై నిర్ణయం వెలువడటానికి అవరోధంగా మారుతుందనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూలు విడుదలై ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించకూడదు. అయితే తెలంగాణపై ప్రకటన చేసేది రాష్ట్ర ప్రభుత్వం కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఈ ప్రకటన చేసే అవకాశముంది. అలాగే స్థానిక ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కోడ్ నియమావళి కూడా ఈ సంఘమే పర్యవేక్షిస్తుంది. ఎక్కడో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటన చేస్తే... రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేయగలుగుతుంది? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసినా కాంగ్రెస్ పట్టించుకుంటుందా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణపై చేయబోయే ప్రకటనకు పంచాయతీ ఎన్నికల కోడ్ వర్తిస్తుందా లేదా అనే దానిపై పూర్తి స్పష్టత రావడం లేదు. జరిగేవి పంచాయతీ ఎన్నికలు కానుక కేంద్ర ప్రభుత్వం లేదా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించే నిర్ణయానికి కోడ్ వర్తించదని ఎన్నికల వ్యవహారాల్లో నిపుణుడు ఒకరు తెలిపారు. రాజకీయ పార్టీగా కాంగ్రెస్ తెలంగాణపై తమ వైఖరిని ప్రకటిస్తే అభ్యంతరం ఉండకపోవచ్చని అంటున్నారు. దీంతో కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ పై నిర్ణయం ఎప్పుడు ప్రకటిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.

రాజకీయ పార్టీల పంచాయితీ హడావుడి

  చిన్న పామునయినా పెద్ద కర్రతో కొట్టాలంటారు పెద్దలు. ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా అదే పనిలో ఉన్నాయి. పార్టీలకతీతంగా గ్రామస్థాయిలో జరగనున్నపంచాయితీ ఎన్నికలను, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం ప్రణాళికలు రచించడం మొదలుపెట్టాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన బంగారు తల్లిని నమ్ముకొని ఒంటరిగా ముందుకు దూసుకుపోతుంటే, తెరాస తెలంగాణావాదాన్ని, వైకాపా వైయస్సార్ సెంటిమెంటులని నమ్ముకొని బరిలోకి దిగుతున్నాయి.   ఇక, ఏ వాదము, సెంటిమెంటు లేని ప్రతిపక్ష పార్టీ తెదేపా మాత్రం తన క్యాడర్లని నమ్ముకొని ఈ ఎన్నికలలో విజయం సాదించాలని భావిస్తోంది. మిగిలిన రెండు పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్, తెదేపాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి బలమయిన క్యాడర్లు ఉన్నందున, అవి ప్రజలలోకి తేలికగా చొచ్చుకొని వెళ్ళగలుగుతున్నాయి.   అయితే, కాంగ్రెస్ పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి ఒంటెత్తు పోకడలవల్ల, వివిధ ప్రాంతాలలో స్థానిక కాంగ్రెస్ నేతల అనుచరుల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. అయినప్పటికీ, తన స్వంత చరిష్మాతోనే పార్టీకి విజయం సాధించిపెట్టి, తన వ్యక్తిగత ఇమేజ్ ను మరింత పెంచుకోవాలని ఆలోచనతో కిరణ్ కుమార్, అందుకు తగినట్లుగానే ప్రణాళికలు సిద్దం చేసుకొంటున్నారు.   ఇక, తెదేపా కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం తన సర్వ శక్తులు ఒడ్డి పోరాడేందుకు సిద్దం అవుతోంది. అందుకోసం చంద్రబాబు త్వరలో హైదరాబాద్, వరంగల్, తిరుపతి, వైజాగ్ మరియు గుంటూరు జిల్లాలో పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి వారికి శిక్షణా తరగతులు నిర్వహించాలని అనుకొంటున్నారు. అదేవిధంగా, పార్టీలోని సీనియర్ నేతలను వారి వారి జిల్లాలలో పర్యటింపజేయడం ద్వారా పార్టీ శ్రేణులను ఉత్సాహపరచవచ్చని భావిస్తున్నారు. పంచాయితీ ఎన్నికల షెడ్యుల్ విడుదల అయిన తరువాత ఆయన తిరిగి తన బస్సు యాత్రని కూడా మొదలుపెట్టీ ఆలోచనలో ఉన్నారు. తద్వారా ఎన్నికల సమయం నాటికి వీలయినన్ని ఎక్కువ గ్రామాలు సందర్శించి, స్థానిక కార్యకర్తలను, ప్రజలను కూడా ప్రభావితం చేయవచ్చునని ఆయన అభిప్రాయం.   వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా ఇప్పటికే చాల ప్రాంతాలలో పార్టీ కార్యకర్తలు మరియు నేతలతో సమావేశాలులు నిర్వహిస్తున్నారు. కానీ, పార్టీ నుండి పెరిగిన వలసలు, అంతర్గత విబేధాలతో సతమతమవుతున్న ఆ పార్టీ తెలంగాణా ప్రాంతంలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక తెరాస నేతలపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో ఆ పార్టీ కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, ఎలాగయినా తెదేపాను గెలిపించుకోవాలని చంద్రబాబు ఆశిస్తున్నారు,

మోపిదేవికి మళ్ళీ అస్వస్థత

      వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ అస్వస్థతకు గురయ్యారు. ఆయన వెన్నునొప్పితో బాధ పడుతుండడంతో జైలు అధికారులు చికిత్స కోసం నిజామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్‌) ఆసుపత్రికి తరలించారు. మోపిదేవి వెన్నునొప్పితో పాటు అధిక రక్త పోటుతో బాధ పడుతున్నారు. మోపిదేవికి గత కొంతకాలంగా అస్వస్థతకు గురవుతూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో జైలు అధికారులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆయనకు ఉస్మానియా ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో వైద్యులు చికిత్స చేశారు. చికిత్స అనంతరం ఆయనను జైలుకు తరలించారు.  

పీఎస్ఎల్‌వీ సి-22 ప్రయోగం సక్సెస్

      విపత్తులకు, విమానాలకు ఎంతో ఉపయోగపడే ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైంది. దీనిని సోమవారం అర్ధరాత్రి ప్రయోగించారు. రాత్రి 11.41 నిమిషాలకు ఇది నింగిలోకి దూసుకెళ్లింది. ఇది తొలి భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహం. దీనిని రోదసీలోకి పంపించడం ద్వారా అభివృద్ధి చెందిన దేశాల సరసన మన దేశం చేరింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌లో అంతరిక్ష పరిశోధకులు అవిశ్రాంతంగా పనిచేసి చోదక వ్యవస్థకు మార్గదర్శిగా ఉపయోగపడే స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఈ తొలి ఉపగ్రహాన్ని (ఐఆర్ఎన్ఎస్ఎస్ -1ఏ) విజయవంతంగా ప్రయోగించారు. పిఎస్ఎల్వీ సి22 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని మోసుకుంటూ నింగిలోకి దూసుకువెళ్లింది. మిషన్ డైరెక్టర్ డాక్టర్ సురేష్‌తోపాటు ఈ ప్రయోగంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ అభినందించారు. 44 మీటర్ల ఎత్తున్న ఈ ఉపగ్రహం పదేళ్లపాటు పని చేస్తుంది. ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ప్రయోగానికి అయిన ఖర్చు రూ.1,600 కోట్లు.

కిడ్నాప్ కి గురైన బాలుడు హర్షిత్ రెడ్డి హత్య

      ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఓబులక్కపల్లె శివారులో మూడేళ్ళ బాలుడు హర్షిత్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. డబ్బు కోసం దుండగులు నిన్న తెల్లవారుజామున హర్షిత్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. రూ.7లక్షలు ఇవ్వాలని లేకపోతె బాలుడ్ని చంపేస్తామని బెదిరించారు. అపహరించిన తరువాత బాలుడు ఏడుస్తుండడంతో గొంతు నులిమి హతమార్చి ఓబులక్కపల్లె గ్రామ శివారులో పాతిపెట్టారు. బాలుడి అపహరణ హత్య ఘటనలో ఇద్దరి నిందితులను పోలీసులు గుర్తించారు. వారిలో గుంటూరు జిల్లా దుర్గి వాసి శ్రీనివాసులు అదుపులోకి విచారిస్తున్నారు. మరో నిందుతుడు మహాబూబ్నగర్ జిల్లాకు చెందిన నాగారం పరారిలో ఉన్నాడు.

తెలంగాణా అంశంపై త్వరలో నిర్ణయం: దిగ్విజయ్

  రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఈ రోజు సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ మరో పదిరోజులలో తెలంగాణా అంశంపై స్పష్టమయిన నిర్ణయం ప్రకటించబోతున్నట్లు ఖరారు చేసారు. అయితే, ఆయన చెప్పిన కొన్ని విషయాలు అటు తెలంగాణా నేతలకి, ఇటు ఆంధ్రా నేతలకీ కూడా మింగుడుపడటం లేదు.   ‘తెలంగాణాపై ఇదే ఆఖరి డెడ్ లైన్ గా భావించవచ్చా?’ అని మీడియా అడిగిన ప్రశ్నకి అటువంటి దేమీ లేదని చెప్పారు. ఇప్పటికే అనేక డెడ్ లైన్లు గతంలో పెట్టడం జరిగిందని, అందువల్ల తానూ మళ్ళీ కొత్తగా మరొక డెడ్ లైన్ పెట్టదలచుకోలేదని అన్నారు. తెఅల్నగన సమస్యను రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలనూ దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్నీ పరిష్కరించవలసి ఉంటుందని, అందుకు శ్రీ కృష్ణా కమిటీ నివేదికతో సహా అన్ని నివేదికలను పరిగణనలోకి తీసుకొంటున్నామని చెప్పారు. అదే విధంగా తెలంగాణపై శాసన సభలో ఒక తీర్మానం ప్రవేశపెడతారని ఆయన చెప్పారు. కానీ కేంద్రం దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసారు.   దిగ్విజయ్ సింగ్ శ్రీ కృష్ణ కమిటీ ప్రస్తావన తేవడం, సీమాంధ్ర సభ్యులు అధిక సంఖ్యలో ఉన్న శాసన సభలో తీర్మానం పెడతామని చెప్పడం, యావత్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాలని చెప్పడం వంటివి గమనిస్తే, అవి తెలంగాణా ఏర్పాటుకి వ్యతిరేఖంగా నిర్ణయం ఉండబోతోందని సంకేతాలు ఇస్తున్నాయి. కానీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం తలెత్తే పరిస్థితులను ఎలా ఎదుర్కొనాలన్న అంశంపైనే రోడ్డు మ్యాప్ గురించి అడుగుతున్నామని ఆయన చెప్పడం చూస్తే, తెలంగాణా ఇవ్వడం ఖాయమని అర్ధమవుతోంది. ఏమయినప్పటికీ, మరో పది రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఏదో ఒక నిర్ణయం ప్రకటించ బోతోందని మాత్రం స్పష్టం అయింది.