తెలంగాణాకు ఎవరు అడ్డుపడుతున్నారు

  తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడుతున్నది కాంగ్రెస్ నేతలా? సీమంధ్ర వలసవాదులా? లేక వేరవరయినా అడ్డుపడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ప్రజలను మోసం చేస్తోందా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికితే, ముందుగా తప్పు పట్టవలసింది వారెవరినీ కాదు, తెలంగాణా సాధనే తన జీవిత ధ్యేయమని ప్రకటించుకొంటున్న కేసీఆర్నే తప్పుపట్టవలసి ఉంటుంది.   తెరాసను విలీనం చేసుకొని తనకు తెలంగాణాలో ఎదురులేకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ఆలోచన. తెరాస విలీనమే తెలంగాణా ఏర్పాటుకి ప్రధాన షరతుగా కాంగ్రెస్ భావిస్తూ ఎత్తులు వేస్తుంటే, నిన్న మొన్నటివరకు ‘తెలంగాణా కోసం కాంగ్రెస్ లో విలీనానికి కూడా సిద్దమే, కానీ కాంగ్రెస్ పార్టీయే వెనుకంజ వేస్తోందని’ వాదిస్తూవచ్చిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణా అంశం చివరిదశకు చేరుకొన్న తరువాత, తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేసినట్లయితే, తమ రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తింటాయనే భయంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ఒప్పుకోకపోవడం గమనిస్తే, ఆయనకి తెలంగాణా సాధన కంటే తమ పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని అర్ధం అవుతోంది.   తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత, అది తమను మోసం చేయవచ్చుననే భయాలు కూడా ఆయనకు ఉండి ఉండవచ్చును. కానీ అదే జరిగితే, ఆయన తన పార్టీ సభ్యులందరినీ తీసుకొని కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి మళ్ళీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవడం పెద్ద పనేమీ కాదు. ఈ సంగతి కేసీఆర్ కి తెలియకపోదు. అయినప్పటికీ, ఆయన విలీనానికి మొగ్గు చూపకుండా స్వయంగా తెలంగాణాను అడ్డుకొంటూనే, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని, సీమంధ్ర వలసవాదులు తెలంగాణా ఏర్పాటుకు అడ్డుపడుతున్నారని ఆరోపించడం ఆయన నిజ వైఖరికి అద్దం పడుతోంది.   కాంగ్రెస్ తెరాసను తనలో విలీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే, కేసీఆర్ తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పేందుకు ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని, ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినా తమ పార్టీ తెలంగాణా పునర్నిర్మాణ ప్రక్రియలో చురుకుగా పాల్గొంటుందని చెప్పడం గమనిస్తే, ఆయనకు తెలంగాణా రావడం కంటే ఉద్యమం కొనసాగించడం, తన పార్టీ మనుగడని రక్షించుకోవడమే ముఖ్యమని భావిస్తునట్లు అర్ధమవుతోంది.   సమైక్యాంధ్ర కోరుతున్నలగడపాటి, రాయపాటి, శైలజానాద్, టీజీ. వెంకటేష్ వంటి నేతలు రాష్ట్ర విభజన జరగకుండా, తెలంగాణా ఏర్పడకుండా అడ్డుపడుతున్నారంటే అర్ధం చేసుకోవచ్చును. కానీ, తెలంగాణా సాధనే తన ఏకైక లక్ష్యం అని చెప్పుకొంటున్న కేసీఆరే స్వయంగా ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు జరగకుండా ఎందుకు అడ్డుపడుతున్నట్లు? తెలంగాణా సాధన కొరకే ఆవిర్భవించిన తెరాసను, అది నెరవేరబోతున్నపుడు దానిని కాంగ్రెస్ పార్టీలో కలపడానికి ఎందుకు వెనకాడుతున్నట్లు?   తన మాటకారితనంతో కేసీఆర్ తెలంగాణా ప్రజలను ఎంతకాలం మభ్యపెట్టగలనని భావిస్తున్నారు? ప్రజలు ఆయన ఆలోచనలను, ఉద్దేశ్యాలను గమనించలేరని భావించడం వలననే ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారా? అది సాధ్యమేనా?

తెలంగాణ పై కాంగ్రెస్ క‌స‌ర‌త్తు

  తెలంగాణ అంశంపై ఏదో ఒక‌టి తేల్చేయాల‌ని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్టానం ఆ దిశ‌గా ప్రయ‌త్నాల‌ను మొద‌లు పెట్టింది. యుపిఏ పక్షాలతో సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. ముందుగా ప్రధాన భాగస్వామ్య పక్షాల్లో ఒకటైన ఎన్‌సిపి అధ్యక్షుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఇప్పటికే కాంగ్రెస్ అభిప్రాయానికే గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ కోర్ కమిటీలో తెలంగాణపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేక‌పోయిన‌ పార్టీ అధినాయకత్వం ఈ ఆంశంపై మిత్రపక్షాలతో మంతనాలు ప్రారంభించింది.   ముందుగా యుపిఏ భాగస్వామ్య పక్షాల్లో అత్యంత ముఖ్యుడు, సీనియర్ నాయకుడైన శరద్ పవార్‌కు పార్టీ నిర్ణయం గురించి కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు తెలియజేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప‌వార్‌ పలు సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇవ్వటంతోపాటు ఈ సమస్యను వీలున్నంత త్వరగా పరిష్కరించాలని కాంగ్రెస్ అధినాయకత్వానికి సూచించారు. లోక్‌సభ ఎన్నికలు 2014 మేలో జరగనున్నందున అప్పటిలోగా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సలహా ఇచ్చినట్లు ఎన్‌సిపి వర్గాలు వెల్లడించాయి.   కాంగ్రెస్ అధినాయకత్వం వారం, పది రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుపై కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయనున్నది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ పై ఏదో ఒక‌టి తేల్చేలోగా యుపిఏ మిత్రపక్షాలతో ఈ అంశం గురించి చర్చించి వారి మద్దతు తీసుకోవాలని అధినాయకత్వం ఆలోచిస్తోంది.   ఇదిలా ఉంటే బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ఆదివారం విలేఖరులతో మాట్లాతుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు పలికారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తాము ఎప్పటి నుండో చెబుతున్నామని ఆమె అన్నారు. కాగా యుపిఏ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డి అధ్యక్షుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ మొదటి నుండి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు మద్దతు ఇవ్వటం తెలిసిందే. తెలంగాణ ఏర్పాటుకు తన మద్దతు గురించి ఆయన త్వరలోనే కాంగ్రెస్ అధినాయకత్వానికి తెలియజేస్తారని ఆర్‌ఎల్‌డి వర్గాలు తెలిపాయి. యుపిఏలో ఎన్‌సిపి, ఆర్‌ఎల్‌డిలు తప్ప మిగతా పార్టీలు అన్నీ చిన్నా, చితకా పార్టీలు కావటంతో వాటి నుండి పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చునని కాంగ్రెస్ అధినాయకులు భావిస్తున్నారు. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ఆర్ ఎస్ ఎస్. విహెచ్‌పిల‌ను నిషేదించాలి

  యుపిఎ స‌ర్కారుకు మాయావ‌తి మ‌రో త‌ల‌నొప్పి తెచ్చిపెట్టింది.. ఇప్పటికే ఉన్న స‌మ‌స్యల‌తో మిగంలేక క‌క్కలేక ఇబ్బంది ప‌డుతున్న యుపిఏను మాయావ‌తి.. ఆర్ ఎస్ ఎస్‌, విహెచ్‌పిల‌ను బ్యాన్ చేయాల్సిందిగా వ‌త్తిడిచేస్తుంది.. అంతేకాదు యుపిఏ అలా నిషేదించ‌ని ప‌క్షంలో యుపిఎ స‌ర్కారుకు త‌న‌ప మ‌ద్దతును కూడ ఉప‌సంహ‌రించుకుంటానంటుంది.   గ‌తంలో ఎన్‌డిఏతో పొత్తు పెట్టుకొని ఆర్ ఎస్ ఎస్ అండ‌దండ‌ల‌తోనే సియం అయిన మాయ ఇప్పుడు ఇలా మాట్లాడ‌టం పై బిజెపి కూడా తీవ్రంగానే స్పందించింది..గ‌తంలో కేవ‌లం ఆర్ ఎస్ ఎస్ అండ‌దండ‌ల వ‌ల్లే నువ్ ఉత్త‌ర ప్రదేశ్ ముఖ్యమంత్రివి కాగ‌లిగావ‌న్న సంగ‌తి గుర్తుంచుకోవాలి హిత‌వు ప‌లికింది.   ఈ విష‌యాల‌పై విహెచ్‌పి భ‌జ‌రంగ‌ద‌ల్ కూడా తీవ్రంగానే స్పందించాయి.. కేవ‌లం మైనారిటీ ఓట్ల కోస‌మే మాయ ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తుంద‌ని విమ‌ర్శించింది.. అయితే ఈ విష‌యం యుపిఏ ప్రభుత్వం మాత్రం ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు..

ఆఖ‌రి సందేశం రాహుల్‌కే

  163 సంవ‌త్సరాలుగా భార‌తీయుల‌కు సేవ‌లందించిన ఓ వ్యవ‌స్థ నిన్నటితో క‌నుమ‌రుగ‌య్యింది.. ఇన్ని సంవత్సరాలుగా మంచి చెడు అన్నిర‌కాలు విష‌యాల‌ను అతి శీఘ్రంగా అందించిన టెలిగ్రామ్‌ వ్యవ‌స్థ ఇక క‌నిపించదు.. త‌న వాణి వినిపించ‌దు.. అయితే ఈ నేప‌ధ్యంలో టెలిగ్రామ్ స‌ర్వీస్ ద్వారా పంపే ఆఖ‌రి సందేశం త‌మ‌దే కావాలంటూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు పోటి ప‌డ్డారు.. దాదాపు అన్ని న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది.   ప్రతీ పోస్ట్ ఆపీస్‌లోనూ ఉద‌యం నుంచే భారీగా క్యూలైన్‌లో జ‌నం క‌నిపించారు. అయితే ఆఖ‌రి మెసేజ్ అందుకుంది కూడా ఓసెల‌బ్రిటీనే.. అర్ధరాత్రికి స‌రిగా 15 నిమిషాల ముందు ఏఐసిసి వైస్ ప్రెసిండెంట్ రాహుల్‌గాంది ఆఖ‌రి టెలిగ్రామ్‌ను అందుకున్నార‌ట‌. అయితే ఈ సందేశం పంపిన వ్యక్తితో అందులోని వివ‌రాల‌ను మాత్రం వెల్లడించలేదు.   అయితే రాత్రి ఆఖ‌రున 11.45 నిమిషాల‌కు టెలిగ్రామ్ కౌంట‌ర్ క్లోజ్ చేసే ముందు ఈ మెసేజ్ పంపింన‌ట్టుగా డిల్లీలోని పోస్టల్ వ‌ర్గాలు చెపుతున్నాయి. అంతే కాదు ఇన్ని ఒక్క రోజులోనే ప్రజ‌లు వేలాదిగా సందేశాల‌ను త‌మ బందు మిత్రుల‌కు పంపించారు..

రిలయన్స్ పై నారాయణ పోరాటం

  కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ చేస్తున్న దోపిడిపై సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఎదుట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ గ్యాస్ దోపిడిపై తమ పోరాటం ఆగదని ఆయన స్ఫష్టం చేశారు. ఆ గ్యాస్ విషయంలో రిలయన్స్ సంస్థ, యూపీఏ సర్కార్లు తోడుదొంగల్లా వ్యవహారిస్తున్నాయని, నిన్నటివరకు గ్యాస్ ఉత్పత్తిలేదని చెప్పిన రిలయన్స్ సంస్థ చమురు కంపెనీ ధరలు ఒకేసారి పెంచడంతో మాటమార్చిందని ఆయన ఆరోపించారు.   చమురుసంస్థల అక్రమాలపై త్వరలో జాతీయస్థాయిలో ఉద్యమం చేస్తామని ఆయన హెచ్చరించారు. యూపీఏ అసమర్థ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అనిశ్చితి ఇంకా అలానే కొనసాగుతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీలోని వారందరిని ఓకేతాటిపైకి తీసుకురాలేని కాంగ్రెస్పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తుందని నారాయణ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

అన్నిటికీ చెడిన మజ్లిస్ పార్టీ

  కాంగ్రెస్ పార్టీతో దాదాపు ఒక దశాబ్దంపాటు అంటకాగిన మజ్లిస్ పార్టీ, అది మర్రిచెట్టు నీడ క్రింద సేద తీరడమేనని గ్రహించింది. మర్రి నీడన మరే మొక్కలు మొలిచి ఎదగలేనట్లే కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉనంతకాలం తమకి ఎదిగే అవకాశం ఉండదని మజ్లిస్ అధినేతలయిన ఓవైసీ సోదరులకి ఒకనాడు హటాత్తుగా జ్ఞానోదయం అయింది. దానితో కిరణ్ సర్కారుతో గిల్లి కజ్జాలు పెట్టుకొని కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకొని బయటపడ్డారు. అయితే, తమ పార్టీని రాష్ట్రమంతటా త్వరగా వ్యాపింపజేసుకోవాలనే ఆలోచనతో తమ మతస్థులను ఆకట్టుకొనేందుకు కొంచెం సులువయిన మార్గం ఎంచుకొందామని విద్వేష ప్రసంగాలు చేసి వివిధ కేసులో ఇర్రుకొన్నాక గానీ తాము తప్పు ద్రోవలో పయనిస్తున్నామని వారు గ్రహించలేకపోయారు.   అంతకు ముందు వారితో వైకాపా కూడా స్నేహానికి సిద్దపడినప్పటికీ, ఓవైసీ సోదరుల ధోరణి చూసి ఆ పార్టీ కూడా దూరమయిపోయింది. అదే విధంగా కిరణ్ సర్కార్ పోలీసులకు ఓవైసీ సోదరులపై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడడానికి అనుమతినీయడంతో వారు పూర్తిగా చల్లబడిపోయారు. కాంగ్రెస్ తో సంబంధ బాంధవ్యాలు గట్టిగా ఉన్న కాలంలో ఓవైసీ సోదరులు తమ ఓవైసీ ఆసుపత్రికి ఆనుకొని ఉన్న 2.57 ఎకరాల ప్రభుత్వభూమిని కబ్జా చేయడమే గాక మరో 10 ఎకరాల భూమిని తమకు కేటాయించాలని విజ్ఞప్తి చేసుకొన్నారు. నాడు ఈ భూకబ్జాపై కిమ్మనని ప్రభుత్వం ఓవైసీ సోదరుల విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదు.   ఇప్పుడు కిరణ్ సర్కారుతో తిరిగి చేతులు కలపాలని ఉవ్విళ్ళూరుతున్న ఓవైసీ సోదరులకి కిరణ్ మరో జలక్ ఇస్తున్నారు. నాడు ఓవైసీ సోదరులు కబ్జాచేసిన 2.57 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాదీనం చేసుకొనేందుకు బండ్లగూడ మండల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మరో రెండుమూడు రోజుల్లో ఈ భూమిని స్వాదీనం చేసుకొని వారు ప్రభుత్వానికి అప్పగించనున్నారు. అదేవిధంగా ఒకప్పుడు ప్రభుత్వం ఓవైసీ సోదరులకిచ్చిన ఎన్‌వోసీ కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.     అటు కాంగ్రెస్ పార్టీతో స్నేహం చెడగొట్టుకొన్నపటికీ, రాష్ట్రంలో వారు కొత్తగా సాధించింది ఏమిలేదు. కనీసం వైకాపాతో స్నేహ సంబంధాలు కూడా ఏర్పాటుచేసుకోలేకపోయారు. తమ విద్వేష ప్రసంగాలతో మెజారిటీ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం వలన, ఇప్పుడు వారితో చేతులు కలిపేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావడంలేదు. అయితే ఎన్నికలు దగ్గిర పడేసమయానికి ఈ పరిస్థితులలో కొంత మార్పు వచ్చి ఓవైసీ సోదరులకి, వారి మజ్లిస్ పార్టీకి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చును. గానీ, ప్రస్తుతం మాత్రం వారికి ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

బొత్స విశ్వాస ఘాతకుడు: షర్మిల

  రాష్ట్రంలో మద్యం మాఫియా డాన్ గా ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుగాంచారని, ఆయనకు పి.సి.సి. బాద్యతలు అప్పగించడం సిగ్గుచేటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత షర్మిల మండిపడ్డారు. ఆదివారం విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో జరిగిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడారు.   షర్మిల మాట్లాడుతూ... మద్యం కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నా కూడా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదు. చీపురుపల్లిలో ఉన్న వ్యాపారాలన్నీ బొత్స కుటుంబానివే. ప్రతి మద్యం దుకాణాన్ని ఒక మినీ బార్ గా మార్చే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మద్యాన్ని పూర్తిగా నియంత్రించి కేవలం నియోజక వర్గానికి ఒక మద్యం దుకాణం మాత్రమే ఉండేలా చూస్తారని భరోసా ఇచ్చారు షర్మిల.   కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల కష్టం పట్టించుకోకుండా, సంక్షేమ పథకాలను వృధా చేస్తున్నారని అన్నారు. తన తండ్రి పెట్టిన రాజకీయ భిక్షను మరచిపోయి, మా కుటుంబాన్నే విమర్శించడం నైతికం కాదని, బొత్స ఒక విశ్వాస ఘాతకుడు అని షర్మిల విమర్చించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి వై.ఎస్. జగన్ ను జైల్లో పెట్టించాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధిచెప్పి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని షర్మిల ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణా ఇస్తే గోర్ఖల్యాండ్ కూడా ఇవ్వాల్సిందే

  ఇక వీలయినంత త్వరగా తెలంగాణ సమస్యని తేల్చేయాలని కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి భయపడినట్లుగానే, గోర్ఖల్యాండ్ ఉద్యమనేతలు నిన్న సమావేశమయి, ఒకవేళ కేంద్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుచేసినట్లయితే, దానితో బాటు తమకు కూడా గోర్ఖల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేయాలని నిర్ణయించుకొన్నారు. దాదాపు 5గంటల పాటు సాగిన సమావేశానంతరం గోర్ఖల్యాండ్ జనముక్తి మోర్చా అధ్యక్షుడు బిమల్ గురంగ్ మీడియాతో మాట్లాడుతూ, “ఒక వేళ కేంద్రం తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయదానికి సిద్దపడితే, అదే సమయంలో మాకు గోర్ఖల్యాండ్ రాష్ట్రం కూడా ఏర్పాటు చేయాలనీ కోరుతూ త్వరలో మేము కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, హోంమంత్రి సుషీల్ కుమార్ షిండేకి లేఖలు వ్రాస్తాము. అయినప్పటికీ, వారు మా విన్నపాలను పట్టించుకోకపోతే కేంద్రం తెలంగాణా ప్రకటన చేసిన వెంటనే మళ్ళీ మేము మా గోర్ఖల్యాండ్ రాష్ట్రం కోసం ఉద్యమాలు మొదలుపెడతాము,” అని చెప్పారు.   గోర్ఖల్యాండ్ రాష్ట్ర డిమాండ్ కూడా ఎప్పటి నుండో ఉన్నపటికీ దానిని పరిమిత అధికారాలు కలిగిన గోర్ఖల్యాండ్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రం సర్దుబాటు చేయగలిగింది. అయితే అది కేవలం తాత్కాలిక పరిష్కారమేనని అటు కాంగ్రెస్ ఇటు గోర్ఖల్యాండ్ జనముక్తి మోర్చ నేతలకి కూడా తెలుసు. ఇప్పుడు కేంద్రం తెలంగాణా అంశం పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నపటికీ, గోర్ఖల్యాండ్, విదర్భ వంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్స్ మళ్ళీ తలెత్తుతాయని భయపడుతూనే ఉంది. అది భయపడుతున్నట్లుగానే గోర్ఖల్యాండ్ ఉద్యమనేతలు కేంద్రానికి అల్టిమేటం జారీ చేసారు.   ఇది తెలంగాణా అంశానికి బ్రేకులు వేసే అవకాశం లేకపోలేదు. అయితే, ఇటువంటి పరిణామాలను ముందు నుండే ఊహిస్తున్న కాంగ్రెస్ దైర్యంగా తెలంగాణపై నిర్ణయం తీసుకొంటుందా లేక ఈ సమస్యలన్నిటినీ తప్పించుకొనేందుకు రెండవ యసార్సీ వేసేసి చేతులు దులుపుకొంటుందా? అనే విషయం త్వరలోనే తేలిపోవచ్చును. బహుశః కాంగ్రెస్ తనకు కొంత వెసులుబాటు కల్పించే రెండవ యసార్సీకే మొగ్గు చూపవచ్చును.

ఐక్య రాజ్యసమితి వేదిక పై అదరగొట్టిన 'మలాలా'

      ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువజన నాయకులు ఐక్య రాజ్యసమితిలో సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా ఐక్య రాజ్యసమితి వేదిక మీది నుంచి మలాలా స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసింది.   'మలాలా డే' నాకు మాత్రమే పరిమితమైన రోజు కాదు. ఇది హక్కుల కోసం గొంతెత్తే ప్రతి ఒక్కరిది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదుల దుశ్చర్యల బాధితుల్లో నేనూ ఉన్నా. గొంతెత్తి మాట్లాడలేని వారి తరఫున నేను మాట్లాడుతున్నా. గత ఏడాది అక్టోబర్ 9న తాలిబన్లు నన్ను కాల్చారు. బుల్లెట్లు మా నోళ్లు మూస్తాయని వారు భావించారు. కానీ అధైర్యం నశించి, పోరాటం పుట్టుకొచ్చింది' అని వ్యాఖ్యానించింది. మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతం, మదర్ థెరిస్సా సేవాగుణం తనకు స్ఫూర్తినందించాయని చెప్పింది. మార్టిన లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, మొహమ్మద్ అలీ జిన్నావంటి వారి నుంచి తాను ఆయుధాన్ని స్వీకరించినట్లు తెలిపింది. పుస్తకాలు, కలాలు తీసుకోవాలని, అవి అత్యంత శక్తివంతమైన ఆయుధాలని ఆమె అన్నది. ఒక చిన్నారి, ఓ టీచర్, ఓ పుస్తకం, ఓ కలం ప్రపంచాన్ని మార్చేస్తాయని అన్నారు. విద్యనే అన్నింటినీ పరిష్కారమని అభిప్రాయపడింది. తన లక్ష్యాలను, ఆకాంక్షలను అడ్డుకుంటామని ఉగ్రవాదులు భావించారని, తన జీవితంలో ఏమీ మారలేదని, బలహీనత, భయం, నిరాశ తొలగిపోయాయని చెప్పింది. శక్తి, ధైర్యం, పరిమళం సమకూరాయని చెప్పింది.

సబితా, ధర్మానను జైలుకు పంపాల్సిందే: సిబిఐ

      మీడియాతో మాట్లాడిన విషయాలపై దాఖలు చేసిన మెమోపై మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలను సిబిఐ వ్యతిరేకించింది. వారిద్దరు మంత్రులుగా పనిచేశారని, రాజకీ యంగాను, అధికార వర్గాల్లోనూ పలుకుబడి కలవారని ఈ నేపథ్యంలో వారు మాట్లాడిన మాటలు సాక్షుల్ని ప్రభావితం చేస్తాయన్న తన ఆందోళనను పునరుద్ఘాటించింది. ఈ వ్యవహారంలో నింధుతులుగా వీరిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాలని, నేరం రుజువైతే శిక్ష అనుభవించక తప్పదని పేర్కొంది. సీబీఐ దాఖలు చేసిన మెమోను కొట్టేయాలని కోర్టును మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితాకోరారు. ప్రజాప్రతినిధులుగా తాము ఎందుకు రాజీనామా చేశామో చెప్పాల్సిన బాధ్యత త మపై ఉందని అందుకే మీడియాతో మాట్లాడామని చెప్పారు. దానిపై సీబీఐ అర్థం లేని వాదనలను లేవనెత్తిందని ఆక్షేపిం చారు. దీనిపై వాదనలను కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి ఈ వ్యవహారంలో సబిత, ధర్మానలకు జైలు జీవితం తప్పేలా కనబడటం లేదు.

పార్టీ నేతలను కట్టడి చేసిన చంద్రబాబు

  తెలంగాణా అంశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇరుకునపడిన కాంగ్రెస్ పార్టీని తెరాస, టీ-జేయేసీ నేతలు ఎండగడుతుంటే, ఉస్మానియా విద్యార్ధులు ఏకంగా గాంధీ భవన్ ముట్టడికి పూనుకొని, ఈ రోజు తెలంగాణాలో విద్యాసంస్థల బంద్ కి పిలుపు కూడా ఇచ్చారు. అయితే, తెరాస, తెదేపా అధ్యక్షులు కేసీఆర్, చంద్రబాబు ఇద్దరూ కూడా ఇంతవరకు నోరు విప్పలేదు. కేసీఆర్ తన పార్టీ నేతలు కాంగ్రెస్ పై దాడి చేస్తుంటే చూసి చూడనట్లు ఊరుకొంటే, చంద్రబాబు మాత్రం తన పార్టీ నేతలని ఈ విషయంపై ఎవరూ కూడా మీడియాకెక్కి అనవసరమయిన రాద్ధాంతం చేసి పార్టీకి కొత్త తల నొప్పులు తేవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అందుకే తెదేపా తరపున కేవలం రేవంత్ రెడ్డి, పెద్దిరెడ్డి తప్ప ఇతర నేతలెవరూ కూడా ఈ వ్యవహారంపై ఇంత వరకు స్పందించలేదు. ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీకి వదిలిపెట్టి, పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టమని చంద్రబాబు తన నేతలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రేపు వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా తెలంగాణా సమస్య తేల్చలేకపోయినట్లయితే, అప్పుడు తగిన రీతిలో స్పందించడం మేలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇక, వైకాపా కూడా ఈవిషయంలో తెలుగుదేశం పార్టీనే సింపుల్ గా ఫాలో అయిపోతూ పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది.

20శాతం మంది నేరచరితులే

      నేరచరితులకు ఎలక్షన్స్‌లో పోటి చేసే అర్హత నేపథ్యంలో కోర్టు ఇచ్చిన సంచనల తీర్పుతో ఇప్పుడు అందరి దృష్టి చట్టసభల్లోని నేరచరితలపై పడింది.. రాజకీయనాయకులుగా చలామణి అవుతున్న చాలామంది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక కేసులో ఇరుక్కున్న వారే దీంతో అసలు అలా క్రిమినల్‌ రికార్డ్‌ ఉన్న వారిపై ఓ లెక్కతేల్చింది ఓ ప్రైవేట్‌ సంస్థ. ప్రస్థుతం చట్ట సభల్లో ఉన్నవారిలో రాష్ట్రం నుంచి 20శాతం మంది అంటే దాదాపు 54మంది ఎమ్‌ఎల్‌ ఎలు, 14 మంది ఎంపిలకు క్రిమినల్‌ రికార్డ్‌ ఉందట.. అంతేకాదు దాదాపు 90 మంది ఎమ్‌ఎల్‌సి లపై కేసులు ఉన్నాయి.. అయితే ఈ లిస్ట్‌లో అందరికంటే ఎక్కువగా ఎమ్‌ ఐ ఎమ్‌ పార్టీకి సంభందించిన 71 శాతం మంది ఎమ్‌ఎల్‌ఎ లు కేసుల్లో ఉన్నారు.. కోర్టు తీర్పును ఎటువంటి లోసుగులు చూపించకుండా అమలు చేయగలిగితే 2014 ఎన్నికలల్లో దాదాపు సగం మందికి కొత్త నేతలే చట్ట సభల్లో అడుగుపెట్టే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు..

తెలంగాణ పై వర్కింగ్ కమిటీ తేల్చలేదు

      ప్రత్యేక తెలంగాణ అంశం పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా నిర్ణయాన్ని హై కామండ్ కే వదిలిపెట్టవచ్చునని వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితుడు సంజీవరెడ్డి అబిప్రాయపడ్డారు. తెలంగాణాపై వర్కింగ్ కమిటీ ఏ నిర్ణయం తీసుకోలేకపోవచ్చునని తెలిపారు. తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే సీమాంద్రలో వ్యతిరేకత వస్తుందని, లేకపోతె తెలంగాణ లో వ్యతిరేకత వస్తుందని, ఏ నిర్ణయం తీసుకున్నా రెండో ప్రాంతంలో సమస్య అని,రాజకీయంగా వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అందరూ మాట్లాడుతున్నారని,ఎవరూ రాజకీయ సన్యాసం కోరుకోరు కదా అని ఆయన అన్నారు. తాను సమైక్యవాదినేనని... తెలంగాణ చాలా క్లిష్టమైన సమస్యగా ఉన్నందున ఎక్కడో ఒక చోట రాజీ కుదిరేలా ప్రయత్నించాలని ఆయన అన్నారు. విభజన వల్ల ఇతరరాష్ట్రాలలో సమస్యలు వస్తాయని చెప్పారు.

తెలుగువాళ్ళతో కాంగ్రెస్ ఆడుకుంటుంది

      తెలంగాణాపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వాయిదా వేయడంపై సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. తెలుగు వాళ్ళ చెవిలో కాంగ్రెస్ పువ్వు పెట్టడానికి ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. ఇరుప్రాంతలవారి భావోద్రేకాలతో కేంద్రం ఆడుకుంటూ వేడుక చేసుకుంటోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ది నీచపు ఎత్తుగడ అని, ఎన్నికలలో లబ్ది పొందాలన్నదే దాని ఆలోచన తప్ప, ప్రజల సంక్షేమం పట్టదని అన్నారు. ఈ నెల పదిహేడు తర్వాత తెలంగాణ కోసం ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు. 2014లోపు తెలంగాణ సమస్య పరిష్కరించకుంటే కాంగ్రెస్పార్టీకి సమాధి కడతామని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విషయంలో టిఆర్ఎస్ అదినేత చంద్రశేఖరరావుకు కూడా చిత్తశుద్ది లేదని ఆయన విమర్శించారు.

కోర్ కమిటీ తేల్చలేనిది వర్కింగ్ తేల్చగలదా

  తెలంగాణా అంశం కాంగ్రెస్ కోర్ కమిటీ నుండి వర్కింగ్ కమిటీలో పడిందిప్పుడు. ఇంత వరకు చర్చించింది వేరెవరో పార్టీ వాళ్ళన్నట్లు ‘ఇక తేల్చాల్సింది కాంగ్రెస్ పార్టీయే’నని నిన్న దిగ్విజయ్ సింగ్ గారు చేతులు దులుపుకొన్నారు. నిన్న జరిగిన కోర్ కమిటీ సమావేశంలో ఎవరూ అనామకులు, రాజకీయ పరిజ్ఞానం లేని వారు పాల్గొనలేదు. 125సం.ల చరిత్రగల కాంగ్రెస్ పార్టీని, సువిశాల భారత దేశాన్ని నడిపిస్తున్న అతిరధ మహారధులందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అటువంటి వారు ఒక సంక్లిష్టమయిన అంశంపై నిర్ణయం తీసుకోవడానికి వెనుకంజ వేసినప్పుడు, రేపు అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో కూడిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాకుండా ఉంటాయా? సదరు ప్రతినిధులు ఇచ్చే సరికొత్త ఆలోచనలు, వెలిబుచ్చే సరికొత్త ధర్మ సందేహాలతో మళ్ళీ సమస్య మొదటికి రాకుండా ఉంటుందా?   దీనికి టీ-కాంగ్రెస్ నేత యంపీ పొన్నం ప్రభాకర్ చెప్పిన సమాధానం చాలా వింతగా ఉంది. “ఏదయినా ఒక ముఖ్య అంశంపై నిర్ణయం తీసుకోవలసివచ్చినపుడు దానిని వర్కింగ్ కమిటీకి నివేదించి వారితో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ సంప్రదాయం. కాంగ్రెస్ ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకొంటుందని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ. అయితే అంత మాత్రాన్న అధిష్టానం ప్రతిపాదించిన అంశాన్ని వర్కింగ్ కమిటీ సభ్యులు వ్యతిరేఖించే అవకాశం లేదు. ఎందుకంటే అందరికీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. వారు ఈ అంశంపై కేవలం చర్చిస్తారు తప్ప అంతిమ నిర్ణయం తీసుకోరు. అందువల్ల తెలంగాణా అంశంపై అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయం అవుతుంది.”   ఆయన చెప్పిన ప్రకారం చూస్తే వర్కింగ్ కమిటీకి నిర్ణయం తీసుకొనే హక్కు లేదని, కేవలం సమస్యపై చర్చించడానికి మాత్రమే అవకాశం ఉందని అర్ధం అవుతోంది.మరి అటువంటప్పుడు మళ్ళీ అటువంటి నిర్ణయం తీసుకోలేని కమిటీకి ఈ అంశాన్ని నివేదించడం ఎందుకు? గత మూడేళ్ళుగా అనేక నివేదికలను, రాజకీయ పార్టీలను సంప్రదించి అన్ని విషయాలపై అనేక మార్లు లోతుగా చర్చించిన తరువాత ఇప్పుడు మళ్ళీ ఈ వర్కింగ్ కమిటీలో నిరుపయోగమయిన చర్చ ఎందుకు? ఒక వేళ కాంగ్రెస్ పార్టీకి అంత నియమనిష్టలు ఉండి ఉంటే మరి ఈ పని ముందే చేసి ఉంటే దానివల్ల దేశవ్యాప్తంగా ఉన్న తన ప్రతినిధుల అమూల్యమయిన సలాహాలు ముందుగానే దొరికేవి కదా? ముందు చేయవలసిన ఈ పనిని ఆఖరున చేయాలనుకోవడం కేవలం మరికొంత కాలం ఈ సమస్యను సాగదీసేందుకే తప్ప వేరొక ఆలోచన కాదు.   ఇక ఈ విషయంలో పొన్నం ప్రభాకర్ మరో నిఖార్సయిన నిజం కూడా చెప్పారు. “చర్చల పేరిట కాలయాపన జరగడం, ఒక కమిటీ నుండి మరొక కమిటీకి అంశం బదలాయించుకొంటూ పోవడం వలన ప్రజలలో మా పార్టీపై అనుమానాలు రేకెత్తుతున్న మాట వాస్తవం. అయితే, తెలంగాణా ఇచ్చేది, తెచ్చేది మేమే అని ఘంటాపధంగా చెపుతున్నపుడు, మా పార్టీ అధిష్టానం చేత తెలంగాణా ఇప్పించినా, ఇప్పించలేకపోయినా కూడా అందుకు మేమే బాధ్యత వహించక తప్పదు. మా అధిష్టానం త్వరలోనే తెలంగాణా ఇస్తుందని మాకు నమ్మకం ఉంది,” అని ఆయన అన్నారు.   కాంగ్రెస్ అధిష్టానం, తెరాసను విలీనం కోసమో లేక సీమంధ్ర నేతల ఒత్తిళ్ళు తట్టుకోలేకనో చర్చలపేరిట సమయం పొందేందుకు ప్రయత్నిస్తూ కాలక్షేపం చేస్తూపోతే అది అంతిమంగా ఆ పార్టీకే నష్టం కల్గించక మానదు. అదే విషయాన్నీ పొన్నం మరో విధంగా తెలియజేస్తున్నారు.

వాళ్లు కుక్కపిల్లలన్న మోడీ

      మరో రాజకీయ దుమారానికి తెరతీశారు మోడీ.. 2002లొ జరిగిన గుజరాత్‌ అల్లర్ల సమయంలో ఆయన వ్యవహరించిన తీరు తీసుకున్నచర్యలను ఆయన సమర్థించుకున్నాడు.. ఆ సమయంలో తను చేసింది నూటి నూరుశాతం సరైనదే అన్నారు. తాను పక్కా హిందూ జాతీయ వాదినని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు..   అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కాని అప్పటి అల్లర్లలో మరణించిన వారిని ఉద్దేశిస్తూ కుక్కపిల్ల కారు చక్రం కింద పడితే బాధపడతాం కదా అన్న మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇతర పార్టీలు మోడీని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు..   భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చిన మోడీ గుజరాత్‌ అల్లర్ల సమయంలో జరిగిన విషయాలను వివరించారు. ఆ సమయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే సుప్రిం కోర్టు కూడా తనను నిర్దోషిగా తెల్చిందన్నారు..   ఈ విషయంలో ఎప్పుడైన పశ్చాతాప పడ్డారా అన్న ప్రశ్నకు కుక్కపిల్ల కారు కింద పడితే ఎవరికైన బాధ ఉంటుందని బదులిచ్చారు.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీతో పాటు సమాజ్‌వాది, సిపిఐ, సిపియం పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.. భవిష్యత్‌ ప్రదానిగా అభివర్ణిస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటున్నారు..

బూతును ఆపే శక్తి లేదు

    అంతర్జాలంలో పేరుకుపోతున్న అశ్లీలం పై చేతులెత్తేసిన ప్రభుత్వం.. గత కొంత కాలంగా దేశంలో అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలకు ఇంటర్నెట్‌లో ఉన్న అశ్లీల సాహిత్యాలు, వీడియో ముఖ్యకారణంగా భావిస్తున్నారు విశ్లేషకలు.. అందుకే దానిపై చర్యలు తీసుకోవాల్సిందే ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు..   ఈ విషయంపై సుప్రిం కోర్టులో పిల్‌ వేసిన కమ్లేష్‌ వాస్వాని అనే వ్యక్తి పిటీషన్‌ను స్వీకరించిన కోర్టు.. ఆ వెబ్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది.. కాని కోర్టు ఉత్తర్వుల పై స్పందించిన ప్రభుత్వం సమీపకాలంలో అలాంటి వెబ్‌సైట్స్‌ పై ఎలాంటి చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పేసింది.. ఈ విషయంలో మరిన్ని మినిస్ట్రీస్‌తో సంప్రదించి వారి సాయం తీసుకోవాలని.. కాబట్టి వెనువెంటనే ఆ వెబ్‌సైట్స్‌ని నిషేదించలేమని కోర్టుకు తెలిపింది. దీని పై తీవ్రంగా స్పందించిన న్యాయస్థానం ఆయాశాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి నాలుగు వారాలలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించింది..

నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ మార్క్ సమావేశం

  కాంగ్రెస్ పని ఎప్పుడు కూడా కొండను త్రవ్వి ఎలకను పట్టినట్లుగానే ఉంటుందని ఈ రోజు మరోమారు ఋజువు చేసింది. ఈ రోజు సమావేశమయిన కాంగ్రెస్ కోర్ కమిటీ రాష్ట్ర విభజనపై ఏదో ఒక ఖచ్చితమయిన ప్రకటన చేస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నవారందరికీ, ముఖ్యంగా తెలంగాణా ప్రజలని, తెలంగాణా నేతలని తీవ్ర నిరాశకు గురిచేస్తూ ఎటువంటి ప్రకటన చేయకుండా, “తెలంగాణా అంశంపై కోర్ కమిటీలో లోతుగా చర్చ జరిగిందని, ఇక ఈ విషయంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకొంటామని” పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ అని క్లుప్తంగా శలవిచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరో వారం పది రోజులో సమావేశం అయ్యే అవకాశం ఉంది. గనుక ఈ సస్పెన్స్ స్టోరీ మళ్ళీ మరికొన్ని రోజులు పొడిగించబడింది. ఈ రోజు జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పార్టీ తప్పని సరిగా ఏదో ఒక నిర్ణయం తీసుకొంటుందని అందరూ భావించినప్పటికీ, కాంగ్రెస్ పద్దతుల గురించి ఔపోసన పట్టిన తెదేపా, తెరాసలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు. వారి నమ్మకాలను వమ్ము చేయకుండా కాంగ్రెస్ ఈ సమావేశంలో ‘మరో మారు సమావేశం అవ్వాలని’ మాత్రమే ఒక ఖచ్చితమయిన నిర్ణయానికి రాగలిగింది.

ముగిసిన కోర్ కమిటీ భేటి..ఉత్కంఠకు తెర

      తెలంగాణ అంశం పై చర్చించేందుకు భేటి అయిన కాంగ్రెస్ వ్యహ బృందం సమావేశం ముగిసింది. సుమారు రెండు గంటలపాటు ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ ఆంటొనీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందుగానే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు చేరుకున్నారు.   కోర్ కమిటీ భేటిలో ప్రధానంగా తెలంగాణ అంశం, వచ్చే ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. కార్యాచరణ ప్రణాళిక పై కోర్ కమిటీ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ గెలుపు, ఓటములు బాలబాలపై పార్టీ నేతలు సమీక్షించారు.