కోర్ కమిటీ భేటి ప్రారంభ౦, సర్వత్రా ఉత్కంఠ

      కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్‌మోహన్ సింగ్ నివాసంలో ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ ఆంటొనీ, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, ఆజాద్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముందుగానే ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత కోర్ కమిటీ సభ్యులు చేరుకున్నారు. మరోవైపు ప్రధాని నివాసం ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్యకార్యాచరణ సమితి, సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణకు, సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. విభజించాలని ఓయు నేతలు, విభజించవద్దంటూ సీమాంధ్ర విద్యార్థి నేతలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ అంశంపై కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.  

టి.టెన్షన్: రాజీనామాపై కిరణ్ స్పందన

      తన రాజీనామాపై వచ్చిన వార్తలని ముఖ్యమంత్రి కిరణ్ ఖండించారు. రాజీనామా చేస్తారన్న ప్రచారాన్ని ఖండిస్తూ ఢిల్లీలో ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీని కలిసిన తరువాత ఈ ప్రకటన చేయడం విశేషం. కోర్ కమిటీ భేటి కంటే కిరణ్ సోనియా గాంధీని కలవడం ఆసక్తిని కలిగిస్తుంది. సోనియాగాందీతో బేటీ అయిన తర్వాత ఐదు నుంచి పది నిమిసాలలోపే కిరణ్ తిరిగి రావడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ భేటిలో కిరణ్ ను రాజీనామా వార్తలను ఖండించాలని కోరినట్లు సమాచారం. కిరణ్ క్రమశిక్షణ కలిగిన కాంగ్రెసు కార్యకర్తగా తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఇలాంటి ప్రచారాలు ఎందుకు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు.

కిరణ్ రోడ్డు మ్యాపే అధిష్టానం ఫాలో అవుతుందా!

  ఇంత వరకు తెలంగాణా అంశంపై నిర్ణయం చేసే బాధ్యత అధిష్టానం మీదనే ఉందంటూ, ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్న సమయంలో కూడా నిశ్చింతగా కాలక్షేపం చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, రోడ్డు మ్యాప్ తయారు చేయమని దిగ్విజయ్ సింగ్ ఆదేశించినప్పటి నుండి రాష్ట్ర విభజన సమస్య తలకి చుట్టుకొన్నట్లయింది. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉందని చెప్పవచ్చును. వారిద్దరూ సమైక్యవాదులయినప్పటికీ, కీలకమయిన పదవులలో ఉన్నందున, ఇంత కాలం తెలంగాణా అంశం తమ చేతుల్లో ఏమీ లేదని, అధిష్టానం ఎలా చెబితే అలా నడుచుకొంటామని చెబుతూ, పెద్దగా ఇబ్బంది కలగకుండానే రోజులు దొర్లించేసారు.   అయితే, ఈ రోజు రాష్ట్ర విభజనపై ప్రకటనకి ముహూర్తం ఖరారయిపోవడంతో, వారిద్దరూ తమ వైఖరి కూడా ప్రకటించక తప్పట్లేదు. వారు బహుశః ఇప్పటికీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండేందుకే మొగ్గు చూపుతున్నపటికీ, సీమంధ్రా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కారణంగా తమ ప్రాంత నేతల మనోభావాలను అధిష్టానానికి తెలియజేసి తదనుగుణంగా నిర్ణయం వచ్చేలా కృషి చేయక తప్పట్లేదు. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిల్లీలో మఖాం వేసిన సీమంధ్ర నేతలని కలిసిన వెంటనే, అక్కడి నుండి నేరుగా సోనియా గాంధీని కలిసి రావడం జరిగింది. అంటే, ఆయన వారి అభిప్రాయాలను, నిర్ణయాలను అధిష్టానానికి చేరవేసినట్లు భావించవచ్చును. కానీ అక్కడే మఖాం వేసి ఉన్న టీ-కాంగ్రెస్ నేతలని మాత్రం ఆయన కలిసినట్లు ఎటువంటి సమాచారం లేదు.   అందువల్ల ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు ఇద్దరూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జోరుగా లాబీయింగ్ చేస్తునట్లు భావించవచ్చును. ఈవిధంగా సాయంత్రం జరిగే కోర్ కమిటీ సమావేశానికి ముందే, వారిరువురూ పార్టీ అధిష్టానంపై ఇంత తీవ్రమయిన ఒత్తిడి తెస్తే, ఆ సమావేశం అనంతరం ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం కోర్ కమిటీ సమావేశం తరువాత, మళ్ళీ తెలంగాణపై నాన్పుడు ధోరణి అవలంభిస్తే, అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయనే కారకులని టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస నేతలు భావించడం ఖాయం, తత్ఫలితంగా వారిరువురికీ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో తీవ్రవ్యతిరేఖత ఎదురవడం కూడా అంతే ఖాయం. మరి కాంగ్రెస్ అధిష్టానం వారిరువురుకి అటువంటి పరిస్థితి కల్పిస్తుందో లేక తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తుందో ఈ రోజు సాయంత్రం సమావేశం ముగిస్తే గానీ తెలియదు.

తెలంగాణ ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా?

      తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఏర్పాటుకి ఆయన పూర్తి వ్యతిరేకం అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని, శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని సూచిస్తే ఆయన రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 175 మంది శాసనసభ్యుల్లో 170 మంది సభ్యులు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యులతో పాటు తెలుగుదేశం శాసనసభ్యులు కూడా రాజీనామాకు ముందుకు రావచ్చునని అంటున్నారు. తెలంగాణపై ఎలాంటి నిర్ణయం వెలువడకుండా అడ్డుకోవాల్సిన బాధ్యతను సీమాంధ్ర నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పెట్టినట్లు సమాచారం. దీన్ని కిరణ్ కుమార్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. తనను తాను నాయకుడిగా నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశమని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

మాకూ ప్రత్యేక రాష్ట్రం కావాలి

      కేంద్ర తెలంగాణ అంశం పై తేల్చేందుకు సిద్దం అవుతుండటంతో ఇప్పుడు మరిన్నిసమస్యలు అధిష్టానం ముందుకు వస్తున్నాయి.. ఇన్నాళ్ల ప్యాకిజీలతో సరిపెట్టిన ఎన్నో ప్రత్యేక వాదాలు జూలై 12 నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తెర మీదకు వస్తున్నాయి.. జూలై 12న కాంగ్రెస్‌ తెలంగాణ అంశం పై ఏదో ఒకటి తెల్చేస్తుంది అంటుండటంతో.. గుర్ఖా జనముక్తి మోర్చా ప్రత్యేక గూర్ఖాలాంగ్‌ అంశాన్ని లేవనెత్తాయి.. ప్రత్యేక తెలంగాణ ఎర్పాటుకు కేంద్ర అంగీకరించినట్టయితే ప్రత్యేక గూర్ఖాలాండ్‌ను కూడా ఏర్పాటు చేయాల్సిందే అంటున్నారు.. గతంలో కూడా ప్రత్యేక వాదంతో ఎన్నో ఉద్యమాలు చేసిన జిజెయం ఇప్పుడు మరోసారి అస్త్రశస్త్రాలను సిద్దం చేస్తుంది.. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు మరోసారి ఆలోచనలో పడే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు  

మరో స్వతంత్ర పోరాటం

      అవినీతి నాయకులను కట్టడి చేసే జన్‌లోక్‌పాల్‌ బిల్లు కోసం సామాజిక వేత్త అన్నాహజారే మరోసారి ఉద్యమించనున్నారు.. అక్టోబర్‌ నవంబర్‌ మాసాలలో మరోసారి రామ్‌లీల మైదాన్‌ వేదిక జన్‌ లోక్ పాల్ సాధన కోసం దీక్షచేపట్టునున్నారు..   ఇప్పటికే పలుమార్లు హాజారే ఉద్యమాన్ని అనచివేసిన ప్రభుత్వం మరోసారి అదే పిరస్థితిని ఎదుర్కొనబోతుంది. అవినీతి అధికారులతో పాటు ప్రస్థుత ఎలక్షణ్‌ ప్రక్రియను కూడా తప్పు పట్టారు హజారే. ప్రస్థుత నడుస్తు విదానంలో కాకుండా రాష్ట్రపతి, ప్రదాన మంత్రి పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు జరపాలన్నారు.   ప్రస్థుతం జనతంత్ర మోర్చ తరుపున దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్న  హజారే త్వరలోనే మరోసారి భారీ ఉద్యమానికి వ్యూహం రచిస్తున్నారు.. ఇటీవల నేర చరితులు పోలీస్‌ కస్టడీలో ఉన్న నేతలు ఎలక్షన్లలో పోటికి అనర్హులు అంటూ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన స్వాగతించారు..

రాష్ట్రాన్ని విభజిస్తే మెరుపు సమ్మే

      ఢిల్లీ తెలంగాణ వేడి రాచుకుంటుంటే సీమాంద్ర సమైఖ్య సెగలు పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఢిల్లీ పెద్దలతో లాభీయింగ్‌ చేస్తుండగా..మరి కొందరు నాయకులు రాజీనామాలకు సిద్దపడ్డారు..   ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీఎన్జీవో) సంఘం ఎట్టి పరిస్థితు్లోనూ రాష్ట్రన్ని విడదీయవద్దని డిమాండ్ చేసింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడితే సీమాంద్రప్రాంత ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర కోసం ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా, త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రటించింది.. అంతేకాదు తెలంగాణ ఎర్పడే పరిస్థితి వస్తే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. కొత్త రాష్ట్రం ఎర్పడితే రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దవుతాయని, ఫలితంగా సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు అవకాశాలు కోల్పోతారని తెలిపారు. అంతే కాదు త్వరలో సమైఖ్య రాష్ట్ర ఆవశ్యకత ఢిల్లీ నాయకత్వానికి తెలిసేలా హైదరభాద్‌లో భారీ బహింరంగ సభ నిర్వహిస్తామని.. ఈ సభ ఉద్యోగ విద్యార్థి సంఘాలతో పాటు.. రాజకీయ నాయకులు కూడా పాల్గొంటానరని ప్రకటించారు..

గంటాది సమైక్య రాగం, మరి చిరంజీవిది?

  చిరంజీవికి భుజకీర్తుల వంటి వారెవరని అడిగితే, రామచంద్రయ్య, గంటా శ్రీనివాస రావులని ఎవరయినా టక్కున తడుముకోకుండా చెప్పేస్తారు. మరి చిరంజీవి రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు, అయన అనుచరుడు రామచంద్రయ్య మౌనం దాల్చగా, మరో అనుచరుడు గంటా మాత్రం ఎందుకు సమైక్య గానం చేస్తున్నట్లు? అంటే ఆయన చిరంజీవిని కాదని ముందుకు వెళ్తున్నాడా? లేక స్వతహాగా సమైక్యవాదయిన చిరంజీవే ఆయనను వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారా? ఒక వేళ చిరంజీవి ప్రోత్సహిస్తున్నారనుకొంటే మరప్పుడు రామచంద్రయ్య కూడా సమైక్య రాగం ఆలపించాలి కదా? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతికితే డొంక కదులుతుంది.   కొద్ది వారాల క్రితం రామచంద్రయ్య విశాఖలో జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “రానున్నఎన్నికలలో, ఆ తరువాత కూడా బొత్సతో కలిసి చిరంజీవే చక్రం తిప్పుతాడని, చిరంజీవికి ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నిఅర్హతలు ఉన్నాయని” భజన చేసినప్పటి నుండి చిరంజీవికి కిరణ్ కుమార్ కి కొంత చెడిందని, ఆ తరువాత ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని కలిసినప్పుడు కూడా రామచంద్రయ్యను వెనకేసుకు రావడంతో వారి మధ్య మరికొంత అగాధం ఏర్పడిందని సమాచారం. ఇక చిరంజీవి కిరణ్ కుమార్ కి వ్యతిరేఖంగా అధిష్టానానికి లేఖ వ్రాయడం కూడా వారి మధ్య భేదాభిప్రాయాలకు మరో కారణంగా చెప్పబడుతోంది.   ఆ కారణంగానే గంటా శ్రీనివాసరావు సమైక్య రాగం తీసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రోత్సహిస్తూ, చిరంజీవిని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా గంటా శ్రీనివాసరావు కూడా క్రమంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గ్రూపుకి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. అందువల్లే చిరంజీవి కూడా శ్రీనివాసరావుకి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.

దాడి కోసం కొణతాలను వదులుకొంటున్న వైకాపా

  ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్ట కాలంలో అండగా నిలబడి, ఆపార్టీకి పాత కాపుగా పేరుబడ్డ కొణతాల రామకృష్ణ కంటే, నిన్న మొన్న తెదేపా నుంచి పార్టీలోకి దూకిన దాడి వీరభద్రరావు అంటేనే ఆ పార్టీకి మమకారం పుట్టుకొచ్చింది. కొణతాలను పక్కన బెట్టి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు దాడి వీరభద్ర రావుని పార్టీ సమన్వయకర్తగా నియామకం చేస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసే బాధ్యతలను ఆయనకు అప్పగించింది.   తమ చిరకాల రాజకీయ ప్రత్యర్ధయిన దాడితో కలిసి పనిచేయలేమని, అందువల్ల ఆయనను పార్టీలోకి తీసుకోవద్దని కొణతాల వర్గీయులు ఎంత బ్రతిమాలినప్పటికీ, కారణాలేవయినప్పటికీ వైకాపా అధిష్టానం ఆయనకు ఎర్ర తివాచీ పరిచి మరీ పార్టీలోకి స్వాగతించింది. నాటి నుండి పార్టీ కొణతాల వర్గీయులు కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. అదే విధంగా పార్టీ కూడా వారిని బుజ్జగించే ప్రయత్నాలేవీ చేయలేదు.   ఇప్పుడు దాడికి కీలకమయిన బాధ్యతలు అప్పగించడం ద్వారా కొణతాల వర్గీయులను పూర్తిగా పక్కన పెట్టినట్లేనని భావించవచ్చును. గనుక, ఇంత కాలం పార్టీ సానుకూల స్పందన కోసం ఆశగా ఎదురు చూసిన కొణతాల రామకృష్ణ అతని తమ్ముడు లక్ష్మి నారాయణ, మరియు వారి అనుచరులు త్వరలో పార్టీ వీడే అవకాశం ఉంది.   దాడి వీరభద్రరావు స్థానంలోకి కొణతాల రామకృష్ణ ను తెదేపా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ నుండి కూడా వారికి ఆహ్వానం ఉంది. అయితే, ఆయన తెదేపాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో ఆయన ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చును.

తెలంగాణపై దిగ్విజయ్ సంచలన వ్యాఖ్యలు

      తెలంగాణ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాపై రాజ్యంగా సవరణ చేయవలిసి వుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించవలసి ఉంటుందని, అలాగే విపక్షాలతో కూడా మాట్లాడవలసి ఉంటుందని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం రాజకీయ నిర్ణయం కాదని, ప్రజల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల ఆధారంగానే నిర్ణయం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణాపై ఇప్పుడేమి చెప్పలేమని, సందిగ్దత మాత్రం తొలగిస్తామని చెప్పారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. పూర్తి సమాచారం తెలుసుకొని దీనిపై స్పందిస్తామని అంటున్నారు.

రాష్ట్ర విభజనపై స్పష్టత ఇస్తాం: దిగ్విజయ్

  తెలంగాణ అంశంపై రేపు కీలక నిర్ణయం వెలువడనుందని అందరూ భావిస్తున్నతరుణంలో నిన్న హోంమంత్రి షిండే ‘అది ఇప్పటికిప్పుడు తేల్చగలిగే విషయం కాదని’ అన్నారు. ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దిగ్విజయ్ సింగ్ పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ‘ఇక ఈ అంశాన్ని వాయిదా వేయడం ఎంత మాత్రం కుదరదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలా? లేక విభజించాలా? అనే రెండు ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి అమలు చేయక తప్పదని’ అన్నారు. తాము రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే ఒక నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని, అలాగే యుపీయే భాగస్వామ్య పక్షాలతో కూడా ఈవిషయంపై చర్చించి వారి అభిప్రాయం కూడా తీసుకోవలసి ఉంటుందని అన్నారు. ఏమయినప్పటికీ రాష్ట్ర విభజనపై ఇక ఎంత మాత్రం నాన్చకుండా స్పష్టత ఈయబోతున్నామని ఆయన తెలియజేసారు.

తెలంగాణపై సీమాంద్ర నేతల కుట్రలు

      తెలంగాణ ఏర్పాటుపై కదలిక మొదలు కాగానే సీమాంద్ర నేతలు కుట్రలకు తెరలు లేపుతారని టీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నప్పుడు కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలో భాగమే ఉండవల్లి మాటలు అని హరీష్‌రావు పేర్కొన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ఆంధ్రా ప్రాంతంలో పంటలు పండాలంటే గిరిజనులను కాల్చి చంపేయాలని ఉండవల్లి మాట్లాడారని హరీష్‌రావు గుర్తు చేశారు. ఉండవల్లి మాటల్లో హేతుబద్దత లేదని, ఆంధ్రా ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకు ఉండవల్లి నీచంగా మాట్లాడుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు.కేసీఆర్ ఎల్లప్పుడూ అబద్ధాలు మాట్లాడితే మరీ 2004లో తమతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని ఆయన ప్రశ్నించారు. నయవంచనలో ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఎవరూ సాటి రారు అని హరీష్‌రావు పేర్కొన్నారు.

తెలంగాణ వల్ల మెదక్ కు లాభం లేదు

      ప్రత్యేక తెలంగాణ వల్ల మెదక్ జిల్లాకు ఎలాంటి లాభం లేదని మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే, విప్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సింగూరు, మంజీరా రిజర్వాయర్ లకు కర్ణాటక నుండి నీరు రావాలి. అక్కడ డ్యామ్ లు కట్టడం వల్ల ప్రస్తుతం నీరు రావడం లేదు. తెలంగాణ వచ్చాక ఎక్కడ నుండి నీరు తెస్తారు ? రాష్ట్రం సమైక్యంగానే ఉండాలి అని అన్నారు. మరి తెలంగాణ వద్దంటున్న మీరు టీఆర్ఎస్ నుండే మొదటిసారి గెలిచారని అంటే అది కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం పెట్టారని అన్నారు. మెదక్ జిల్లాకు నీరు రావాలంటే తమ జిల్లాను కర్ణాటకలో కలపాలని ఆయన కోరారు. మెదక్ నీటి గురించి అన్ని పార్టీలు నోరువిప్పి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.

మోడీ కోసం తవ్విన గోతిలో పడ్డ కాంగ్రెస్

    ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రత్యర్ధి పార్టీల కోసం త్రవ్విన గోతులో తరచూ తానే పడుతూ నవ్వుల పాలవుతోంది. బీజేపీ నరేంద్ర మోడీని ఇంకా తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించక ముందే అప్రమత్తమయిన కాంగ్రెస్ పార్టీ, దొరికిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగించుకొంటూ ఆయనని జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టనీయకుండా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.   గుజరాత్ లో 2004లో జరిగిన ఒక ఎన్కౌంటర్ లో ఇష్రాద్ జాన్ అనే 19ఏళ్ల యువతితో బాటు మరో ముగ్గురు ముస్లిం యువకులు కూడా మరణించారు. ఇది జరిగి దాదాపు 10సం.ల తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ కేసును తిరగదోడి, దానిపై సీబీఐ విచారణకు ఆదేశించింది. అది భూటకపు ఎన్కౌంటరని బాధితుల కుటుంబాలు ఆరోపిస్తునందునే సీబీఐ విచారణకి ఆదేశించామని కాంగ్రెస్ చెపుతుంటే, ప్రభుత్వ అధీనంలో పనిచేస్తున్నమరో గూడఛార సంస్థ ఇంటలిజన్స్ బ్యూరో మాత్రం ఎన్కౌంటర్ లో మరణించిన వారు నలుగురు మోడీని హత్య చేసేందుకు బయలుదేరిన తీవ్రవాదులే అని, అందులో మరణించిన ఇష్రాద్ జాన్ అనే యువతి మానవబాంబుగా శిక్షణ పొందిందని, ఆ విషయాన్ని అమెరికాలో పట్టుబడ్డ డేవిడ్ హీడ్లీ స్పష్టంగా పేర్కొన్నాడని గట్టిగా వాదిస్తోంది.   కానీ, కేంద్రం ఆదేశంతో రివ్వుమని ఎగురుకొంటూ గుజరాత్ లో వాలిపోయిన సీబీఐ చిలుకలు, చాలా లోతుగా పరిశోధించిన తరువాత అక్కడ జరిగింది ముమ్మాటికి భూటకపు ఎన్కౌంటరేనని, ఈ కుట్రలో గుజరాత్ పోలీసు అధికారులతో బాటు ఇంటలిజన్స్ బ్యూరో అధికారులకి కూడా భాగం ఉందని పేర్కొంటూ, ఇంటలిజన్స్ బ్యూరోకి చెందిన రాజిందర్ కుమార్ అనే సీనియర్ అధికారితో బాటు,అతని క్రింద పనిచేసిన యం.కె.సిన్హా, పీ.మిట్టల్, రాజీవ్ వాన్కడే, అనే మరో ముగ్గురు అధికారుల పేర్లను కూడా తన చార్జ్ షీటులో చేర్చడంతో, కాంగ్రెస్ పని ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.   ఆ రెండు వ్యవస్థలు తన ఆధీనంలోనే పనిచేస్తున్నపుడు వాటిలో దేనిని ఇప్పుడు వెనకేసుకు వచ్చినా కేసు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతే గాక, అది బీజేపీకి తనను తప్పు పట్టేందుకు మరో చక్కటి అవకాశం ఇస్తుంది. అలాగని, ఆ రెండు సంస్థలను దేనిపని దానిని చేసుకోనిస్తే రెండూ తమ తమ వాదనలు రుజువు చేసుకొనేందుకు కోర్టులను ఆశ్రయిస్తే పోయేది కాంగ్రెస్ పరువే. పైగా వాటిలో ఏదో ఒక సంస్థ పరిశోధనలో తప్పు జరిగినట్లు రుజువయినప్పుడు కాంగ్రెస్ దురాలోచనలు బయటపడక మానవు.   ఇంటలిజన్స్ బ్యూరో అధికారులు తమ పని కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉగ్రవాదుల ప్రణాలికల గురించి హెచ్చరికలు జారీ చేయడం వరకే తప్ప వాటిపై ఆయా ప్రభుత్వాలు ఏవిధంగా ప్రతిస్పందించాయి, ఏవిధమయిన చర్యలు తీసుకొన్నాయి వంటి విషయాలతో తమకు ఎటువంటి సంబంధం లేదు గనుక సీబీఐ తమను దోషులుగా చూపాలనుకోవడం చాలా పొరపాటని హోం శాఖకు మోర పెట్టుకొంటోంది.   మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని ఇంటలిజన్స్ బ్యూరోకి వ్యతిరేఖంగా చార్జ్ షీట్ దాఖలు చేయకుండా ఆపుతుందా? లేక మోడీని ఈ కేసులో బిగించేందుకు ఇంటలిజన్స్ బ్యూరో అధికారులను బలి తీసుకొంటుందా? అనేది త్వరలో తేలవచ్చును. అయితే, కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్ధులను రాజకీయంగా దెబ్బ తీయాలనే దురాలోచనతో వేసిన ఈ ఎత్తుకి తానే చిత్తయిపోవడం విడ్డూరం. కాంగ్రెస్ పార్టీ తను తీసిన గోతిలో తనే పడి ఇప్పుడు బయటకి రాలేక విలవిలలాడుతోంది. కానీ ఈ రాజకీయ చదరంగంలో అసలు చనిపోయినవారు నలుగురు అమాయకులేనా? లేక నిజంగానే ఉగ్రవాదులా? జరిగింది నిజమయిన ఎన్కౌంటరా లేక గుజరాత్ పోలీసులే ఈ భూటకపు ఎన్కౌంటర్ కి తెగబడ్డారా? సీబీఐ చెపుతున్న మాటలను విశ్వసించాలా? లేక ఇంటలిజన్స్ బ్యూరో మాటలను విశ్వసించాలా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఎవరూ చెప్పలేరు. రాజకీయ ప్రయోజనాల కోసం సాగుతున్న ఈ చదరంగం ఎప్పుడయినా అటకెక్కవచ్చును.

షిండే మార్క్‌ స్టేట్‌మెంట్‌

      కాంగ్రెస్‌ హైకమాండ్‌ తెలంగాణకు అనుకూలంగా స్టేట్‌మెంట్‌ ఇస్తుందన్న తరువాత హోం మంత్రి షిండే మరో బాంబ్‌ పేల్చారు.. 12న జరిగే కోర్‌ కమిటీ బేటి ఏదో ఒక నిర్ణయం తప్పకుండా వెలువడుతుందని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజల ఆశలై నీళ్లు చల్లారు..   తెలంగాణ అంశంపై చాలా రోజులుగా సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు అధిష్టానం ఎలాంటి నిర్ణయానికి రాలేదన్నారు.. ఇది చాలా సున్నితమైన అంశం అయినందున అంత త్వరగా నిర్ణయం ప్రకటించలేమన్నారు.. షిండే ప్రకటనతో టికాంగ్రెస్‌ నేతలు అయోమయంలో పడ్డారు.. కోర్‌ కమిటీ బేటిలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వస్తుందన్న ఆశతో ఉన్న టీ కాంగ్‌నేతలుకు కోర్‌ కమిటీలో కీలక వ్యక్తి అయిన షిండే ప్రకటన మింగుడు పడటంలేదు.. బయటికి ఇది షిండే వ్యక్తిగత అభిప్రాయమే అంటున్నా లోపల మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు.  

పొలిటికల్‌ ఇఫ్తార్‌లు బంద్‌

      రాష్ట్రంలో రంజాన్‌ సందడి మొదలైంది.. అయితే ఈ సమయాన్ని క్యాష్‌ చేసుకోవటానికి పోలిటికల్‌ పార్టీలు కూడా రెడీ అవుతున్నాయి.. ప్రతి సంవత్సరం రంజాన్‌ మాసంలో ముస్లిం సోదరులకు పొలిటికల్‌ పార్టీల తరుపున ఇఫ్తార్‌ విందులు ఇవ్వటం ఆనవాయితిగా వస్తుంది.. అయితే ఈ సారి ఈ విందులకు దూరంగా ఉండాలి భావిస్తున్నారు ముస్లిం మత పెద్దలు.. చట్టవ్యతిరేఖ కార్యకలాపాల ద్వారా సంపాదించిన సోమ్ముతో రాజకీయనాకులు ఇచ్చే ఇఫ్తార్‌ విందులను బహిష్కరించాలని.. వరంగల్‌కి చెందిన జామాయత్‌ ఉల్మా ఐ హింద్‌ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసే ఆలోచనలో ఉంది. అంతేకాదు కొంత మంది ముస్లిం తప్పని సరి పరిస్థితుల్లో అలాంటి ఇప్తార్‌ విందులకు హాజరు కావాల్సిన పరిస్థితులు వస్తే అక్కడ ఎలాంటి విందు స్వీకరించవద్దంటున్నారు.. ముస్లిం మత పెద్దల నిర్ణయంతో పొలిటికల్‌ పార్టీలన్ని ఆలోచనలో పడ్డాయి.

మెట్రో జాబ్‌ గోల

    రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ శరవేగంగా నడుస్తుంది. అయితే ఇంకా ప్రాజెక్ట్‌ పనులు పూర్తి కాకుండా మెట్రోట్రైన్స్‌లో జాబ్స్‌ కోసం అభ్యుర్దుల ఎదురు చూపులు మొదలయ్యాయి.. 2017 జూలై నుంచి మొదలు కానున్న 72 కిలోమీటర్ల ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే దరఖాస్తూ చేసుకుంటున్నారు అభ్యర్ధులు..   ముఖ్యంగా ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌చ ఇండస్ట్రీయల్‌ టెక్నికల్‌ ఇన్సిస్టిట్యూట్స్‌కి సంభందించిన చాలా మంది ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసకుంటున్నారు.. అయితే ఇదే అదనుగా భావించిన బ్రోకర్‌లు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ జనం నుంచి అందినంత వరకు లాక్కుంటున్నారు.. ప్రాజెక్ట్‌ మొదలు పెట్టే సమయంలోనే 50000 ఉద్యోగాలిస్తామని ప్రకటించిన ఎల్‌ అండ్‌ టి ఇంతవరకు ఓలాంటి జాబ్‌ నోటిఫికేషర్‌ ఇవ్వలేదు.. అయినా  వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. దీంతో హెచ్‌ఎమ్‌ ఆర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌విఎస్‌ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.. ప్రస్థుతం మెట్రో ప్రాజెక్ట్‌ లో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవని బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోవద్దని చెపుతున్నారు..