మళ్ళీ అధికారుల బదిలీ మేళా

    ప్రభుత్వ పాలన ప్రధానంగా ఐఏయస్, ఐపీయస్ మరియు ఇతర ప్రభుత్వాధికారుల ద్వారానే సాగుతున్నపటికీ, రాజకీయనాయకుల చేతిలో వారు ఆట బొమ్మలుగా మిగిలిపోతున్నారు. నేతల అవినీతి మేతకు, ఆగడాలకు అడ్డుపడితే ఇక ఆ అధికారికి శంకరగిరి మాన్యాలే గతి. ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడమనేది వారి రికార్డులోనే ఉండదు. తరచూ బదిలీలతో వారి వ్యక్తిగత, కుటుంబ జీవితాలు దెబ్బతింటున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహయత వారిది. ప్రభుత్వం నిన్న హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలో భారీ ఎత్తున బదిలీలు చేసి, తన ప్రతాపం మరో మారు చాటుకోంది.   రంగారెడ్డి జిల్లాలో యదేచ్చగా సాగుతున్న భూ కబ్జాలను అడ్డుకొంటున్నందుకు కలెక్టర్ వాణీ ప్రసాద్, జాయింట్ కలక్టర్లు ఆర్.ముత్యాల రాజు, యం.జగన్నాధం వేరే చోటికి బదిలీ చేయబడ్డారు. అదే కారణాలతో హైదరాబాద్ కలెక్టర్ గా చేస్తున్న యస్ఏయం రజ్వీని కూడా విద్యుత్ పంపిణీ సంస్థకి యండీగా నియమిస్తూ బదిలీ చేయగా, ఆయన స్థానంలోకి ఏపీ మినరల్ డెవెలప్మెంట్ బోర్డులో చేస్తున్న యం.కే.మీనా వచ్చారు.   ఇక, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో చేస్తున్న పేరున్న పూనం మాలకొండయ్యకి గట్టిగా ఆరు నెలలు కూడా కాక మరో బదిలీ వేటు భరించక తప్పలేదు. ఐయేయస్ అధికారులలో ఆణిముత్యం వంటిదాని పేరున్నఆమె చేసిన పాపం అల్లా నియమ నిబందనలు ఖచ్చితంగా అమలుజేయడమే. నేతల ఆగ్రహానికి గురయిన ఆమెకు వేరొకచోటికి బదిలీ అయితే, ఆమె స్థానంలోకి కొత్తగా వైవీ.అనురాధ అనే కొత్త అధికారిణి వచ్చారు.   అధికారులు తమ సేవలకి ప్రతిఫలంగా ఈవిధమయిన బదిలీ వేటులు ఎదుర్కోవడం తప్పనిసరి అయిపోయింది. కానీ, తమ బంధువులు ఎవరో రాజకీయ పార్టీలు మారితే దానికి కూడా వీరినే శిక్షించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కార్మిక శాఖా కమీషనరు గా చేస్తున్న బీ. రామాంజనేయులుకి అప్రధాన్యమయిన ‘రెయిన్ షాడో ఏరియా డెవెలప్మెంట్’(అసలు ఇటువంటి శాఖా కూడా ఒకటుందని ఎంత మందికి తెలుసు?) బదిలీ చేయబడ్డారు. కారణం శాసన సభ్యుడయిన ఆయన అల్లుడు రాజేష్ అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవలే వైకాపాలోకి మారాడు! ఇప్పుడు ఆయన స్థానంలోకి డా.ఏ.అశోక్ అనే మరో అధికారి వచ్చారు.   ఖమ్మం జిల్లా కలెక్టర్ గా చేస్తున్న సిద్దార్థ్ జైన్ కూడా రాజకీయ నేతల ఆగ్రహానికి గురయి బదిలీకబడ్డవారే. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో వాణీ మోహన్ అనే మరో అధికారిణి స్థానంలోకి పంపబడ్డారు.   అధికారి పేరు  ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం   దాసరి శ్రీనివాసులు ముఖ్యకార్యదర్శి- గనుల శాఖా వ్యవసాయ మరియు సహకార సంస్థకు బీ.శ్రీధర్ నెల్లూరు కలక్టర్ రంగారెడ్డి కలెక్టర్ జీ. కిషన్ బీసీ సంక్షేమం వరంగల్ కలెక్టర్ సందీప్ కుమార్ సుల్తానియా రిజిస్ట్రార్ సహకార సంస్థలు   వీ.దుర్గాదాస్ ఏపీ ఆయిల్ ఫీల్డ్ వైస్ చైర్మన్ యండీ   ఆర్.ముత్యాల రాజు   జాయింట్ కలెక్టర్ తూ.గో.జిల్లా సి.హెచ్. ప్రభాకర్   జాయింట్ కలెక్టర్ రంగారెడ్డి ఏ.మురళి   ఎడిషనల్ సిఈఓయస్.ఈ.ఆర్.పీ. యమ్వీ రెడ్డి   జాయింట్ కలెక్టర్ రంగా రెడ్డి కే.చంపాలాల్   జాయింట్ కలెక్టర్-2, రంగారెడ్డి టీ.ఆర్.కే రావ్   యండీ ఎపీయండీసీ                             బదిలీ అయిన ఐపీయస్ అధికారులు డా.యస్.ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ జనరల్   ఆ.ప్ర.సంక్షేమ శాఖ రెసిడేన్షియల్ ఎడ్యుకేషన్ విభాగం   అతుల్ సింగ్ ఇన్స్పెక్టర్ జనరల్ డైరెక్టర్- స్టేట్ క్రిమేస్ రికార్డ్ బ్యూరో మహేష్ మురళీధర్ భగవత్   ఐజీ. సెక్యురిటీ కుమారి స్వాతి లక్రా   ఐజీ.ఎపీయస్పీ బెటాలియన్ కే.ఆర్.యం. కిషోర్ కుమార్   అదనపు డైరెక్టర్, ఏపీ పోలీస్ అకాడమీ హరీష్ కుమార్ గుప్త   ఐజీ. లా అండ్ ఆర్డర్ వీవీ శ్రీనివాస రావు   ఐజీ. సిఐడీ సోషల్ జస్టిస్

స్వార్ధ రాజకీయాలు ..సామర్ధ్యం లేని పాలకులు

....సాయి లక్ష్మీ మద్దాల       తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే నని,ఇది 56 సం॥ ల పోరాటమని ఏవేవో చాల వింత ప్రసంగాలు చేశారు మన టి కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సాధన సభ ద్వారా వారు, వారి అధిష్టానం ప్రజలకు ఏమి తెలియ జేయాలనుకున్నారో అది ప్రజలకు తెలియటమేమో కాని టి. ఆర్. ఎస్ నేతలకు బాగానే అర్ధమయింది. ఈరోజున అధిష్టానం తెలంగాణ అంశాన్ని ఒకకోలిక్కి తెస్తోంది దేనికోసం?తెలంగాణ ప్రజల మనోభావాలకు విలువనిచ్చా?లేక తన పొలిటికల్ మైలేజ్ కోసమా?కేవలం తన స్వార్ధ ప్రయోజనాలే అని తేట తెల్ల మైంది. అయితే ఇక్కడ సోనియా గాంధి ప్రజలకు ఏమని భరోసా ఇస్తుంది?కాంగ్రెస్ పార్టి ఆధ్వర్యం లో రాష్ట్రం విడిపోయిన,కలిసున్నా ప్రజల సంక్షేమ అభివ్రిద్ది ఎలా సాధ్యం అనేది నేడు దేశ ప్రజలను వేధిస్తున్న సమస్య. ఎందుకంటే నేడు దేశాన్ని పాలిస్తున్నది రాజకీయ నాయకులు కాదు కేవలం అవినీతి మాత్రమే!విపరీతమైన కుంభ కోణాలలో,భయంకరమైన అవినీతిలో కూరుకొని పోయి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజులలో సమగ్రమైన పరిపాలనని ఎలా అందిస్తుంది. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని దేశ ప్రజలకు అపారమైన విశ్వాసం. కాని వారి పనికిమాలిన సంక్షేమ పధకాలొ లేక దిక్కుమాలిన కుల సమీకరణాలో వారిని గెలిపిస్తాయనేది వారి ప్రగాఢ నమ్మకం.   నేటి ఆధునిక నాగరిక సమాజానికి కావలసింది సమానత్వం మరియు అభివృద్ధి. కాని అలాంటి మెరుగైన పరిపాలనను అందించే సత్త ఈ పాలకులకు ఉందా?ఇది కేవలం తెలంగాణ సమస్య అని తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ వారి రాజకీయ భవిష్యత్తును సరిచేసుకుంటున్నారు. మరి ఇలాంటి రాజకీయ ఎత్తుగడలు ఉన్న నాయకులు రేపు ఇరు ప్రాంతాలకు సమన్యాయం ఎలా చేస్తారు. ఇక్కడ కేవలం తాగు నీరు మాత్రమే సమస్యా?మరి శాంతి భద్రతల పరంగా ఎలాంటి నివారణ చర్యలు చేపడతారు. మెరుగైన విద్య,నాణ్యమైన వైద్యం,అందరికి ఉద్యోగం అంటూ భారి డైలాగులే చెప్తున్నారు కాని ఈ సమస్యలన్నీ కలిసున్న కారణంగానే వచ్చినవా?అన్నిటికి మించి తెలంగాణ వస్తే కె. సి. ఆర్ పరిస్థితి మరో సిబుసోరెన్ లా అవుతుందని కూడా మరో వాదన ఉంది మరి ఈ నేపధ్యం లో ఆయన తన ఉనికిని కూల్పోవటానికి సిద్ధంగా ఉన్నాడా?  రాష్ట్రం ఉన్న విడిపోయిన ఇక్కడ ఇరు ప్రాంత ప్రజలకు కావలసింది అభివృద్ధి. కాని అది ఏ నాయకుల వల్ల కాదు అని ప్రజలకు అర్ధమై పోయింది. కాని నేడు ప్రజలు కోరుకుంటున్నది ఉన్న ఈ అభివృద్ధి అయిన కనుమరుగవకుండా ఉంటె చాలునని. రాజకీయనేతలందరూ వారి వారి వ్యాపారాలకు ఏది అనువుగా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. చివరకు నేటి పరిస్థితి ఎలా ఉందంటే రాయల తెలంగాణ అని రాయలసీమను రెండు ముక్కలు చేస్తున్నా చంద్రబాబు నాయిడు కూడా ఏమి మాట్లాడలేకున్నాడు. తెలంగాణ సాధన సభలో దామోదర రాజనరసింహ మాట్లాడుతూ 44సం॥ లుగా సీమాంద్ర నేతలే ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. మరి దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు?60సం॥ ల కాలం లో ప్రజాస్వామ్యం ముసుగులో కుటుంబ పరిపాలనే భారత దేశ ప్రజలు చూస్తున్నారు. మరి తెలంగాణ కోసం ఇంత ధైర్యంగా సభ నిర్వహించామని చెప్పుకునే ఈ కాంగ్రెస్ నేతలు గాంధి కుటుంబ పాలనను వ్యతిరేకించ గలరా?కేవలం ప్రజల సంక్షేమం,దేశ అభివృద్ధిని మాత్రమే వీరుకనుక కాంక్షిస్తే,పి.వినరసింహారావు పరిపాలనకు,నేటి సోనియా గాంధీ ఆధ్వర్యంలోని మన్మోహన్ పరిపాలనకు గల వ్యత్యాసాన్ని,దేశ ఆర్ధిక ప్రగతిని విశ్లేషించ గలరా?ఏ మాత్రం పరిపాలన సామర్ధ్యం లేకుండా అమ్మ .... అమ్మ.... అంటూ సోనియా భజన చేసే వీళ్ళా రేపు రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రజలకు మేలుచేసేది!

కొత్త బాంబు పేల్చిన దిగ్విజయ్‌

      కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ ఈ రోజు హైదరాబాద్ కి వచ్చిన ఆయన కాంగ్రెస్ నేతలను షాక్ కి గురి చేశారు. పది రోజుల్లో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరుగుతుందని, అప్పుడు తీసుకొనే నిర్ణయానికి పార్టీకి చెందిన అన్ని ప్రాంతాల నాయకులు కట్టుబడి ఉండాలని అన్నారు.   రాజకీయాల్లో వున్నవారందరూ వ్యాపారాలు చేయకూడదని, ఒకవేళ వ్యాపారాలు ఉంటే మానుకోవాలని అన్నారు. వైఎస్ నాకు సన్నిహితుడు. ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉండేవి. అయితే వైఎస్ కు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉందని చెప్పారు.   త్వరలో కోర్ కమిటీ ముందుకు సీఎం, బొత్స, ఆజాద్ తో కలిసి తాను హాజరు అవుతానని, సభ్యులకు తమ అభిప్రాయాలు వివరిస్తామని తెలిపారు. మొత్తంగా చూస్తే దిగ్విజయ్‌ చెప్పిన మాటల్లో ఒక్కదాంట్లోను విషయం లేదని ఇట్టే అర్థమయిపోతుంది.  

జగన్ పార్టీలో విబేధాలు, ఎన్నికలపై ప్రభావం!

      పంచాయితీ ఎన్నికల్లో సత్తాచాటలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కార్యకర్తల్లో ఉత్సాహన్ని నింపుతుంటే, ఇదే సమయంలో ఆయా జిల్లాలో అసంతృప్తుల బెడద ఎక్కువవుతుండడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలు, నియోజకవర్గాల,ఇంచార్జ్ ల నియామకం పార్టీలో సీనియర్ నేతలకు అసంతృప్తిని కలగిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంకొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో జగన్ పార్టీలోని లుకలుకలు వరుసగా బయటపడుతున్నాయి.    తెలంగాణలో పార్టీ మరీ బలహీనంగా ఉండడంతో విజయమ్మ గత 25 నుండి తెలంగాణాలో పర్యటిస్తున్నారు. ఆమె తెలంగాణాలో పర్యటన చేస్తుండగానే ఆ పార్టీకి షాక్ తగిలింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సోయం బాబురావు, బోడ జనార్ధన్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెసు పార్టీలో చేరారు. గుంటూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు అయిన మాకినేని పెదరత్తయ్య చేరిన కొన్నాళ్లకే పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత పార్టీకి దూరమై ఇప్పుడు కాంగ్రెసు పార్టీలే చేరేందుకు సిద్ధమయ్యారు.   ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత జలగం వెంకట్రావు కూడా అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆయన కాంగ్రెసు పార్టీలో చేరుతారని సమాచారం. ఖమ్మం లోకసభ టిక్కెట్ పైన జగన్ నుండి హామీ లేకపోవడం వల్లనే ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కీలక నేతలు రెండు రోజుల క్రితం తాము పార్టీ వీడుతామని చెప్పిన విషయం తెలిసిందే. ఇదే జిల్లాకు చెందిన రాష్ట్ర నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నేతలను సమన్వయం చేయడంలో విఫలమవుతున్నారని అంటున్నారు.  జగన్ పార్టీలో చేరుతున్న నేతలకు అధిష్టానమే అంతా ఖర్చు భరిస్తుందన్న అభిప్రాయంతో పార్టీలో చేరుతున్న వారు ఉన్నారట. అయితే వాళ్ళకు అన్ని ఖర్చులు భరించడం వీలుకాదని పార్టీ చెప్పడంతో బయటకు వెళ్ళేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో నేతలు ఒకే సామాజిక వర్గం నుండి పార్టీలోకి వస్తున్నారట. ఇది కూడా ఇబ్బందిగా మారిందని అంటున్నారు.

తెలంగాణ సభకు పిలవలేదు,రాలేదు

      తెలంగాణ రాష్ట్ర సాధనకై నిజాం కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు నిర్వహించిన సభకు తనను ఆహ్వానించలేదని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. తనకు ఆహ్వానం రాకపోవడంతో సభకు హాజరుకాలేదని దానం నాగేందర్ తెలిపారు. ఈరోజు హైదరాబద్ కు వచ్చిన పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కు ఆహ్వానం పలికేందుకు దానం నాగేందర్ శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణపై అదిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న తమకు అభ్యతరంలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మూడో సారి కూడా అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. దిగ్విజయ్ సింగ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో దానం నాగేందర్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. దిగ్విజయ్ విమానాశ్రయం నుండి నేరుగా రాష్ట్ర కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ చేరుకున్నారు.

తెలంగాణను అడ్డుకోవడానికి కెవిపి ఇంట్లో భేటి

      ఆంద్రప్రదేశ్ కి దిగ్విజయ్ సింగ్ కి రావడంతో సమైక్యాంధ్ర వివాదం మళ్ళీ వేడెక్కింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మొగ్గు చూపుతోందన్న వార్తలు రావడంతో, తెలంగాణ ను ఇప్పుడు అడ్డుకోగలిగితే రాష్ట్రాన్ని విభజించడం ఇంకెవరి తరం కాదన్న దృఢమైన అభిప్రాయంతో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుతో ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు భేటీ అయ్యారు.   ఈ రోజు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసి.. రాష్ట్ర విభజన సమర్ధనీయం కాదని వినతి పత్రం ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఈ వినతి పత్రం ఎలా ఉండాలన్న విషయమై వారు వివరంగా చర్చించుకున్నారు. జల వివాదాలు, ప్రాంతాల వారీగా అభివృద్ధి, నిధుల మంజూరు లాంటి అంశాలనూ వారు తమ నివేదికలో పొందుపరచారని సమాచారం.

దిగ్విజయ్ కు సమైక్య సెగ

        రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీగా నియమితులైన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ సింగ్ కి సమైక్యాంధ్ర సెగ తగిలింది. విశాఖలో జరిగిన క్షత్రియుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన దిగ్విజయ్ ని కేంద్రమంత్రి పురందేశ్వరి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాసరావు, బాలరాజు, ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి, సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి తదితరులు కలిశారు.   ఆంధ్రప్రదేశ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించవద్దు. కలిసి ఉంటేనే అభివృద్ది సాధ్యం అని మంత్రి సాకె శైలజానాథ్ నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకోకుండా కేవలం ఒత్తిడి తెచ్చేవాళ్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదని స్పష్టం చేశారు. అయితే ఏ విధమయిన సంకేతాలు ఉన్నా తాను చెబుతానని దిగ్విజయ్ తెలిపారు.

కాంగ్రెస్ టి.సభలో జానారెడ్డిపై చెప్పు

      రాష్ట్ర మంత్రి జానారెడ్డిపై తెలంగాణ వాది చెప్పు నిరసన తెలిపాడు. నిజాం కళాశాల మైదానంలో జరిగిన తెలంగాణ సాధన సభలో మంత్రి జానారెడ్డి ప్రసంగిస్తుండగా ‘తెలంగాణ ద్రోహి ఖబర్దార్’ అని నినాదం చేస్తూ తెలంగాణ యువకుడు మంత్రిపైకి చెప్పు విసిరాడు. ఈ లోపు అప్రమత్తమైన పోలీసులు యువకున్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.   ఆ తరువాత సభలో జానారెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ ప్రత్యేక జ్వాల ఇప్పటికీ ఆరలేదని, 1969 నుంచి రగులుతూనే ఉందని, ఆనాటి నుంచి ఉద్యమం రకరకాల రూపంలో వస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను కాంగ్రెస్ పార్టీ గుర్తించిందని, డిసెంబర్ 9న తెలంగాణ అవసరాన్ని సోనియా గుర్తించారు కనుకనే ప్రకటన చేశారని అన్నారు. 2001లోనే సీడబ్ల్యూసీలో తెలంగాణపై తీర్మానం చేశామని, తెలంగాణపై సంప్రదింపులు జరపాలని 2009 డిసెంబర్‌లో శాసన సభలో తీర్మానం ప్రవేశపెట్టింది, డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కాంగ్రెస్ ద్వారా తెలంగాణ ఏర్పడుతుందని ఈ సభతో తెలంగాణ ప్రజలకు నమ్మకం కుదిరిందని అభిప్రాయపడ్డారు.

డీయంకే తో దోస్తీ కత్తి మీద సామువంటిదే

  తమిళ తంబిలతో వ్యవహారం కత్తి మీద సాము వంటిదని, వారికి కోపమొచ్చినా సంతోషం కలిగినా పట్టలేమని కాంగ్రెస్ పార్టీ నిశ్చితాభిప్రాయం సరైనదేనని, డీయంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి చాలా సార్లు నిరూపించారు.   తనకు మద్దతు ఇస్తున్న పార్టీ అధ్యక్షుడు కరుణానిధి ముద్దుల కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు అని కూడా చూడకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం కనిమోలిని 2జి స్కాం లో అరెస్ట్ చేయడమే కాక, పది నెలలు తీహార్ జైల్లో పెట్టి ఆమె చేత క్రోవ్వొత్తులు కూడా చేయించుకొన్నప్పుడు, ఆ కన్న తండ్రి హృదయం ఎంతగా రగిలిపోయుంటుందో కాంగ్రెస్ కి కూడా బాగా తెలుసు. అయితే రాష్ట్రంలో, పగబట్టిన పాములాంటి జయలలిత చేతిలో చిక్కి విలవిలలాడుతున్నందున, విధిలేని పరిస్థితుల్లో యుపీయేకు తన మద్దతు కొనసాగించవలసి వచ్చింది. తరువాత 2జీ స్పెషలిస్టులు కనిమోలి, రాజా ఇద్దరూ జైలు నుండి బెయిలుపై విడుదల కాగానే, శ్రీ లంక తమిళుల సమస్యను సాకుగా చూపించి, యుపీయేకు తన మద్దతు ఉపసంహరించి, మూడు చెరువుల నీళ్ళు తాగించాడా పెద్దాయన. అయితే, తండ్రిగా ఆయనపడిన ఆవేదనను అర్ధం చేసుకొన్న సోనియమ్మ మాత్రం డీయంకేతో దోస్తీ కొనసాగించాలని విశ్వప్రయత్నం చేసింది. అయితే ఆయన పేరుకి కరుణానిధి అయినప్పటికీ, ఆయన కాంగ్రెస్ పై ఇసుమంత కరుణ చూపలేదు.   అంత మాత్రాన్న కాంగ్రెస్ కూడా నిరాశాపడిపోలేదు. ఆయన మనసులో చోటు సంపాదించడానికి తగిన అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. మొన్న జరిగిన రాజ్యసభ అభ్యర్ధుల ఎన్నికలలో కనిమోలికి ఐదు సీట్లు తక్కువబడటంతో, అదే అవకాశంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆమెకు తన ఐదు ఓట్లు వేసి, ఆమెకు రాజ్యసభ సీటు మళ్ళీ దక్కేలా చేసింది. దానితో కటినాత్ముడనుకొన్న కరుణానిధి మనసు వెన్నపూసలా కరిగిపోయింది. అందుకు నిదర్శనంగా, ఆయన తన కుమార్తెను స్వయంగా డిల్లీ వెళ్లి సోనియమ్మకు కృతజ్ఞతలు చెప్పి, పనిలోపనిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసి స్నేహగీతాలు పాడుకోవడానికి తమకు అభ్యంతరం లేదని సోనియమ్మ చెవిలో ఊది రమ్మని పంపారు. డిల్లీ వెళ్లి సోనియమ్మను కలిసి వచ్చిన కనిమోలి, తానూ కేవలం ‘థాంక్స్’ చెప్పడానికే ఇంత దూరం ఎగురుకొంటూ వచ్చానని మీడియాకు నమ్మబలుకుతున్నారు.   అయితే, కాంగ్రెస్ పార్టీ మొన్న బీహార్ లో నితీష్ కుమార్ కి కూడా ఇలాగే సహాయపడితే ఆయన జస్ట్ ఒక రెండు రూపాయలు పెట్టి ఒక ఫోన్ కాల్ చేసి థాంక్స్ చెప్పాడే తప్ప ఇలా ఇంత దూరం ఎగురుకు రాలేదు కదా? మరి కనిమోలి ఎందుకు అంత శ్రమపడింది? అంటూ మీడియావాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కారు

టి.కాంగ్రెస్ సభా వేదికపై 120 నేతలు

      ఆదివారం జరగనున్న తెలంగాణ కాంగ్రెస్ సభలో వేదికపై రికార్డు స్థాయిలో నేతలు కూర్చోబోతున్నారు. తెలంగాణలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా అందరూ ఈ సభకు వస్తున్నారు. బహిరంగసభ వేదిక మీద కేవలం సోనియా, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్ ల ఫోటోలే ఉంచుతున్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల నుండి ప్రజలు హాజరయ్యేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే సంగారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి తాను ఈ సభకు హాజరుకానని, తనకు ఆహ్వానం రాలేదని అన్నారు. సభా వేదిక మీద 120 మందికి పైగా నేతలు ఆసీనులయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి తమ సత్తా చాటాలని వారు ఉవ్విళ్లూరుతున్నారు.

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ

      తెలంగాణాలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ఉస్మానియా విద్యార్థి జేఏసీ ప్రకటించింది.సెప్టెంబర్ 17న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ జేఏసీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. అదే వేదికపై పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఓయూ జేఏసీ నిర్ణయించింది. మహబూబ్‌నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లోని 10 గ్రామ పంచాయతీలకు ఓయూ జేఏసీ పోటీ చేయనుంది. ఈ పది స్థానాలకు ఓయూ జేఏసీ అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున జేఏసీలు ఏర్పడ్డాయి. ఇక్కడ చురుకుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన బాల్క సుమన్ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అయ్యారు. తాజాగా రాజారాం యాదవ్ టీడీపీలో  చేరి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మరో నేత పిడమర్తి రవి ఖమ్మం జిల్లా మధిర నుండి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

ఏ ఎండాకా గొడుగు పట్టాలి మరి

  మంత్రి పదవి ఇవ్వనంత వరకు కాంగ్రెస్ అధిష్టానాన్ని దుమ్మెత్తిపోసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక దద్దమ్మ ప్రభుత్వంగా వర్ణించి, కొల్లేరు సమస్య పట్టుకొని కాంగ్రెస్ కొంప కొల్లేరు చేస్తానని బెదిరించి, సమైక్యాంధ్ర కోసం అవసరమయితే ఒక కొత్త పార్టీ పెట్టయినా కాంగ్రెస్ భరతం పడతానని ప్రగల్భాలు పోయిన ఏలూరు యంపీ కావూరి సాంబశివరావు, ఇప్పుడు తను కోరుకొన్నట్లుగానే కేంద్రంలో మంత్రి పదవి దక్కగానే, స్వరం మార్చి కొత్త పల్లవి అందుకొన్నారు.   నిన్న డిల్లీ నుండి హైదరాబాదుకి తిరిగి వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక తెలంగాణ విషయంలో రాజీ పడక తప్పదని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. పైగా జీవితమంటేనే అనేక రాజీలు పడటం అని, అందులో ఇదీ ఒకటని మెట్ట వేదాంతం కూడా జోడించారు. అయితే రాష్ట్ర విభజన విషయంలో తన అభిప్రాయంలో తేడా లేదని, తన అభిప్రాయలు అధిష్టానానికి స్పష్టంగా తెలియజేసానని, కానీ, కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటానని చెప్పారు."   ఒకవైపు కేంద్ర నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెపుతూనే మరో వైపు మంత్రి పదవుల కోసం కక్కుర్తిపడి తానూ మాట మార్చే వ్యక్తిని కాదని చెప్పడం విశేషం. తెలంగాణ విషయంలో రాజీ ధోరణి అంటే దాని అర్ధం తెలంగాణకు అనుకూలమని కాదని వివరించారు. కేంద్ర మంత్రిగా ఉన్న తను ఇప్పుడు సమైక్య సమావేశాలు, సభలకు హాజరుకాకపోవచ్చునని కూడా చెప్పారు. తానెన్నడూ కొత్త పార్టీ పెడతానని అనలేదని, అదంతా మీడియా ఊహాగానాలేనని” ఆయన అన్నారు.   కావూరి తన రాజకీయ అనుభవం అంతా రంగరించి తికమక సమాధానాలు చెప్పి అటు తెలంగాణా, ఇటు సమైక్యాంధ్ర నేతలని ఇద్దరినీ మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారు అని స్పష్టం అవుతోంది. ఆయన మాటల ప్రకారం చూస్తే, ఆయన తెలంగాణా ఏర్పాటుని స్పష్టంగా వ్యతిరేఖిస్తున్నారని అర్ధం అవుతోంది. కానీ, కేంద్ర మంత్రి పదవి దక్కినందువల్ల, అధిష్టానానికి విభజనపై తన అభ్యంతరాలు చెప్పి, అంతిమ నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానానికే వదిలేసినట్లు అర్ధం అవుతోంది.

ఉప్పల్ వైఎస్ఆర్ ఆత్మహత్య

      ఉప్పల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజారెడ్డి మనవడు, కాంగ్రెస్ నేత యంజాల శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య ఉప్పల్ లో సంచలనం రేపుతోంది. రామాంతపూర్ కార్పోరేటర్ జగదీశ్వర్ రెడ్డి మీద హత్యాయత్నం కేసులో అరెస్టయిన ఆయన ఇటీవలె బెయిలు మీద విడుదలయ్యారు. తనను హత్యాయత్నం కేసులో అక్రమంగా ఇరికించి అవమానించారన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు చెబుతున్నారు. తన సూసైడ్ నోట్ లో ఉప్పల్ ఏసీపీ హత్యాయత్నం కేసు నుండి తప్పించడానికి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని పేర్కొనడం కలకలం రేపుతోంది. రాష్ట్ర మాజీ హోంమంత్రికి ఆయన అనుచరుడిగా ఉన్నారు. వైఎస్ హయాంలో ఉప్పల్ వైఎస్ఆర్ గా శ్రీధర్ రెడ్డి అందరికీ సుపరిచితుడు.

కర్మ యోగి దార్శనికుడు పీవీ నరసింహ రావు జయంతి !

గోపి చిల్లకూరు.డల్లాస్ టెక్సాస్       భారత దేశం ఆర్దిక పునర్నిర్మాణంలో బాగంగా దేశానికీ తనదైన శైలిలో సేవచేసిన అపర చాణక్యుడు, లోపలి మనిషి, కర్మ యోగి పీవీ నరసింహరావు ను అయన జయంతి సందర్బముగా అందరు తలచుకోవలసిందే !.   1991 లో రాజీవ్ గాంధీ శ్రీ పెరంబుదూర్ లో దుర్మరణం అయిన కూడా ,ఆ సానుభూతి పవనాల్లో కూడా కాంగ్రెస్ కి తగిన సీట్లు రాలేని పరిస్తితుల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్వంత పార్టీ లోని ప్రముఖులు అయన పై అసమ్మతి లేపి ప్రతి దినము ఆయనను ఇరుకున పెడుతున్నా కాని ,ఇండియా ఆర్దిక పరిస్థితి ఘోరంగా ఉండి చివరకు భారత దేశం బంగారు ను ప్రపంచ విపణి లో కుదువ బెట్టాల్సి వచ్చిన కష్ట సమయములో తన చాణక్య నీతిని ప్రదర్శించి మెజారిటీ లేని ప్రభుత్వానికి ప్రధాన మంత్రిగా ఉంటూ ,ప్రభుత్వాన్ని కాపాడుకోడానికి కొన్ని తప్పులు విధి లేక చేయాల్సి వచ్చిన కూడా దేశంను సరళీకృత ఆర్దిక సంస్కరణల ద్వార అప్పుల వూబి నుంచి బయట పడవేయడం లో అయన సామర్ద్యం అమోఘ మయినది !.   1) పంజాబ్ లోని తీవ్ర వాదాన్ని ఉక్కు పాదముతో అణచివేశారు,ఖలిస్తానుఉద్యమాన్ని తోక్కేసారు.terrorism దాడిలో ఒక కాలు పోగొట్టు కున్న జాతీయ వాది బిట్టా (Maninderjeet Singh Bitta )ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా నిలబెట్టి పంజాబ్ ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు ! .ఇప్పుడు ఆ బిట్టా ను సోనియా కాంగ్రెస్ తొక్కేసింది .http://en.wikipedia.org/wiki/Maninderjeet_Singh_Bitta)   2)   మన్మోహన్ సింగ్ ను ఆర్దిక మంత్రిగా అవకాశం ఇచ్చి,తను వెనుక నుండి నడిపిన  సరళీకృత ఆర్దిక సంస్కరణ లు   దేశాన్ని గాడి లో పెట్టగలిగారు ! . ఇప్పుడు ఇదే మన్మోహనుడు అత్యంత విపలమయిన ప్రధానిగా పేరు తెచ్చుకొన్నారు .   3) ప్రతి పక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్ పేయీ గారిని తన గురువు గా ప్రకటించి అయన ద్వార తానూ ఎంతో ఉత్తేజం పొందానని పార్ల మెంటు సమక్షములో ఒప్పుకొని వాజ్ పాయి గారికి బెస్ట్ పార్ల మెంటు అవార్డు ఇచ్చినది మనకందరికీ తెలిసిందే !         4) కాంగ్రెస్ లోని అర్జున్ సింగ్ ,ఎన్ డీ తివారి,ముపనార్  లాంటి నాయకులను తట్టుకొని వాళ్ళను దమ్మిలు చేయగలిగారు !      5) ఆయన విపరీతమైన ఆందోళనకు గురి అయినప్పుడు పాత తెలుగు సినిమాలు చూస్తూ ,ముక్యముగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హాస్యపు మూవీ లు చూసి రిలాక్స్ అయ్యే వారని ఆయనే స్వయముగా ప్రకటించారు.        6) గోవధ పై నిషేధం ఇవ్వాలని BJP  పోరాడుతున్నప్పుడు  కాంగ్రెస్ ప్రముఖులు ఒట్టిపోయిన  ,వయసు అయిపోయిన పశువులను పశువుల వధ శాలకు పంపాల్సిందే అని అంటే అప్పుడు  ఆ ఉద్యమం లో పోరాడుతున్న BJP సన్యాసిని సాద్విరితంబర గారు పీవీ నరసింహరావు గారు కూడా ముసలి వారు అయ్యారు కాబట్టి ఆయనను కూడా వధశాలకు పంపాల్సిందే అని అంటే అ కర్మ యోగి నిజమే కదా అని ఎంతో నవ్వుకొన్నారట .        7)  ఎన్ టీ రామరావుగారు తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని పోటి పెట్టకుండా పీవీ నరసింహ రావును పార్లమెంట్లో అత్యదిక మెజారిటీ తో గెలిపించి పంపితే, మళ్ళీఅదే పీవీ గారు తన ప్రభుత్వం పడి పోయే సమయం లో తెలుగు దేశం ఎంపీ లను చీల్చి ప్రభుత్వాన్ని కాపాడుకొన్నారు .          8) హర్షద్ మొహతా కోటి రూపాయలు సూట్ కేసు విషయంలో, జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీలను కొనడంలో ఎన్నో విమర్శలకు గురి అయినప్పటికీ అన్ని కూడా రాజ్యాన్ని కాపాడుకోడానికే చేసాడు కాని అయన స్వంతానికి ఏమి వాడు కోలేదు .          9) పీవీ  స్వయానా AICC ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసిన సీతారం కేసరి సోనియా గాంధి కోటరితో పీవీ నరసింహ రావు గారికి ఎంతో వ్యతిరేకముగా పని చేసి చివరికి పీవీకి ఎన్నికలలో టికెట్ కూడా రాకుండా చేసారు. ఆ తరువాత అవమాన పరిస్థితుల్లో కేసరి అదే సోనియా గాంధి కోటరి దెబ్బకు హీనంగా AICC నుంచి గెంటి వేయబడ్డాడు !          10) శ్రీ రామ తీర్తుల వారి రచనలు ద్వార ఉత్తేజం పొందిన పీవీ ,స్వతంత్ర సమరయోదుడుగా ఉస్మానియా యూనివేర్సిటి లో అప్పట్లో నిచేదించిన వందేమాతరం  ఆలకించి యూనివెర్సిటీ నుంచి సస్పెండ్ అయినారు . ఎన్నో భాషలతో మమేకం అయ్యారు . పీవీ అయన చరిత్రను "లోపలి మనిషి " (the Insider )అని పుస్తకము వ్రాసారు.విశ్వనాధ సత్యనారాయణ గారి  వేయి పడగలు అనే పుస్తకాన్ని sahasraphan అని హిందీ లోకి అనువదించారు .              11)అబ్దుల్ కలాం గారు పీవీ గురించి మాట్లాడుతూ "గొప్ప రాజనీతిజ్ఞుడు అయన రాజకీయ వ్యవస్థ కంటే   కూడా దేశం అన్నిటికన్నా గొప్పది అని నమ్మి ఆచరించిన వారు అంటారు.     12) పీ వీ ఆర్దిక సంస్కరణలను ప్రతి పక్షములో వున్న BJP వ్యతిరేకించినా కాని ఆ తరువాత వాజ్ పేయీ గారి ప్రభుత్వం వాటిని అలాగే కొనసాగించడం విశేషం !     13) ఎన్నోసార్లు లోక్ సభలో మెజారిటీ నిరూపించు కోవాల్చి వచ్చినపుడు ఒక్కొక్క సారి ఒక్కొక్క పార్టీ ని చీల్చడం ద్వార కాపాడుకొన్నారు . చాలా సందర్భాల్లో BJP కూడా ఎన్నో సార్లు పార్లమెంట్లో వోటు ను బహిష్కరించి పీవీ ప్రభుత్వాన్ని indirect గా  కాపాడిందని అంటారు.          14) కాంగ్రెస్ ప్రభుత్వాలలో దేశాన్ని పాలించిన  లాల్ బహదూర్ శాస్రి గారి తరువాత గొప్ప ప్రధానిగా ,Father of Indian Economic Reforms గా పేరు తెచ్చుకొన్నారు .          15) ఎన్నో ప్రభుత్వాలలో ముఖ్య పదవుల్లో పనిచేసినా గాని అయన చివరి రోజుల్లో కోర్టు కేసులలో విముక్తి పొందినా గాని వాదించిన లాయర్లకు డబ్బులు ఇవ్వలేక అయన స్వంత ఇంటిని అమ్మి వారి బకాయిలు తీర్చారని ఆయన ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన IAS PVRK ప్రసాద్ గారు ప్రకటించారు .          16) అయన ఢిల్లీ లో మరణించినపుడు కాంగ్రెస్ పార్టీ కి ,AICC లో ఎన్నో సేవలు చేసినప్పటికి, సోనియా గాంధీ కోటరి ఆయన పార్ధీవ దేహాన్ని ఢిల్లీ AICC ఆఫీసులోకి  అనుమతించకుండా అవమానించింది. హైదరబాద్ పంపేసింది .              తెలుగు తేజం  స్వర్గీయ ఎన్ టీ రామారావు గారి విగ్రహం కాంగ్రెస్ హయాం లో ఏర్పాటు అయినట్లు  మరొక తెలుగు దార్శనికుడు ,కర్మయోగి పీ వీ నరసింహ రావు గారి విగ్రహం బీ జే పీ హయం లో ఏర్పాటు అవుతుందేమో అని ఆశిస్తున్నా !   

శాసన సభలో తెలంగాణపై బిల్లు కోసం సీమాంధ్ర సభ్యుల ఆలోచన

  నేడో రేపో తెలంగాణా అంటూ రాష్ట్ర రాజధానిలో మొదలయిన హడావుడిని చూసి మళ్ళీ సమైక్య నేతలు నిద్రలేచి, దానిని నిలువరించేందుకు సమావేశాలు మొదలుపెట్టేసారు. ముందుగా రేపు రాష్ట్ర పర్యటనకి వస్తున్న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కి రాష్ట్రాన్ని విడదీయవద్దంటూ వినతిపత్రం ఈయడంతో తమ కార్యక్రమాలు మొదలు పెట్టి, తెలంగాణాను అడ్డుకొనేందుకు క్రమంగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని వారు నిశ్చయించుకొన్నారు. రాయల తెలంగాణాను వ్యతిరేఖిస్తూ కర్నూలు లేదా అనంతపురం జిల్లాలలో ఒక బహిరంగ సభను నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. అయితే దీని ప్రధానోదేశ్యం రాయల తెలంగాణాను వ్యతిరేఖించడమే కాక, అసలు రాష్ట్ర విభజనను వ్యతిరేఖించడమే.   ఇక, ఇటునుంచి వీలుకాకపోతే అటు నుంచి నరుక్కు రావాలని సీమాంధ్ర నేతలు ఆలోచిస్తున్నారు. ఇంత వరకు తెరాస నేతలు శాసన సభలో తెలంగాణపై బిల్లు పెట్టమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తుండటం, దానిని ప్రభుత్వం తిరస్కరిస్తుండటం జరుగుతోంది. అయితే ఈసారి తామే తెలంగాణా బిల్లు పెట్టేందుకు ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని సీమంద్రా నేతలు భావిస్తున్నారు. తద్వారా సభలో దాదాపు సగంపైగా ఉన్న సీమంధ్ర సభ్యులు బిల్లుకి వ్యతిరేఖంగా ఓటేసి, తెలంగాణావాదానికి చట్ట సభలో కానీ, రాష్ట్రంలో గానీ పూర్తి మద్దతు లేదని తెలియజెప్పాలనుకొంటున్నారు. అయితే, ఇది వారు ఊహిస్తున్నంత తేలిక కాదు. సభలో సీమంద్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు 175 మంది సభ్యులున్నపటికీ, ఒకసారి బిల్లు ప్రవేశపెడితే, అప్పుడు తెరాస కూడా ఇదే అదునుగా చేసుకొని కాంగ్రెస్, వైకాపా, తెదేపా అధినేతలకు ‘తెలంగాణకు అనుకూలమో, వ్యతిరేఖమో తేల్చుకోమంటూ మరో మారు అగ్నిపరీక్ష పెట్టక మానదు. అటువంటి పరిస్థితులను చేజేతులా ఏ పార్టీ ఆహ్వానించుకోదు గనుక, దీనిని తెరాస తప్ప అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేఖించవచ్చును.

కాంగ్రెస్ పార్టీకి మిత్ర లాభం

  మూడు నెలల క్రితం వరుసపెట్టి వెలుగు చూసిన కుంభ కోణాలతో, మంత్రులపై అవినీతి ఆరోపణలతో, సుప్రీంకోర్టు మొట్టికాయలతో పీకలలోతు కష్టాలలోకి కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి రోజులు వచ్చినట్లే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దాదాపు రెండు దశాబ్దాల తరువాత మళ్ళీ మొన్న కర్ణాటకలో అధికారంలోకి రాగలిగింది. ఇక, మోడీ కారణంగా బీజేపీకి రాం రాం చెప్పేసిన నితీష్ కుమార్ కి శాసనసభలో బల నిరూపణ సమయంలో మద్దతు ప్రకటించి, జేడీ(యు) తో స్నేహ సంబంధాలు చిగురింపజేసుకోగలిగింది. అదే సమయంలో మోడీ కారణంగానే, అద్వానీ పార్టీపై అలిగి రాజీనామా చేయడంతో, ఆ పార్టీలో అంతర్గత కలహాలు ఒక్కసారిగా బయటపడటంతో కాంగ్రెస్ పార్టీలో ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా పెరిగిపోయింది. మున్ముందు మోడీ కారణంగానే ఆ పార్టీకి తన చేతిలో ఓటమి తప్పదని కాంగ్రెస్ బలంగా నమ్ముతోందిపుడు.   ఇక, నిన్న తమిళనాడులో ఆరు రాజ్యసభ సీట్లకి జరిగిన ఎన్నికలలో, కాంగ్రెస్ తెలివిగా వ్యవహరించి, కొద్ది నెలల క్రితం తనకు కటీఫ్ చెప్పి వెళ్ళిపోయిన కరుణానిధి కుమార్తె కనిమోలికి తమ 5 వోట్లు వేసి ఆమెకు మళ్ళీ రాజ్యసభ యోగం కల్పించడం ద్వారా పెద్దాయనను మంచి చేసుకొనగలిగింది. తద్వారా, మళ్ళీ తమ రెండు పార్టీల మద్య సంబంధాలు సరిచేసుకొని రానున్న ఎన్నికల పొత్తులకి ఇప్పటి నుండే రంగం సిద్దం చేసుకొంది.   తరువాత, తెలంగాణా అంశంపై ఆ పార్టీ ప్రస్తుతం ఏదో పెద్ద ఉపాయమే ఆలోచిస్తున్నట్లు అర్ధం అవుతోంది. తద్వారా ఆంద్రప్రదేశ్ లో కూడా విజయపతాకం ఎగురవేయాలని ఉవ్విళ్ళూరుతోంది.

సుబ్బిరామిరెడ్డి వెనక్కి తగ్గినట్లేనా?

  రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి, కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తన మీద లేనిపోని అభాండాలు వేసినందుకు రూ.5కోట్లకి పరువు నష్టం దావావేస్తానంటూ శివ తాండవం చేశారు. ఆ ప్రోగ్రాం తరువాత ఆయనకి లీగల్ నోటీసులు కూడా పంపడం జరిగింది. అయితే, ఆయన ఊహించినట్లు వెంకటేశ్వర రావు భయపడి క్షమాపణలు చెప్పకపోగా, సుబ్బిరామి రెడ్డి కోర్టుకి వెళ్ళదలిస్తే తనకేమి అభ్యంతరం లేదని, దాని వల్ల ఆయన గురించి మరిన్నినిజాలు బయటకి వస్తాయంటూ చెప్పడంతో రెడ్డి గారు గతుక్కుమన్నారు. కానీ, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, సాటి కాంగ్రెస్ సభ్యుడు గనుక వెంకటేశ్వర రావుకి మరో పదిరోజులు గడువు ఇస్తున్నాంటూ తనకి క్షమాపణలు చెప్పడానికి గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. అయితే, ఆ గ్రేస్ పీరియడ్ కూడా ఇటీవలే ముగిసినప్పటికీ, రెడ్డిగారు పరువు నష్టం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. అసలే ఇది ఎన్నికల సీజను. పరువు నష్టమని కోర్టుకి వెళితే ఉన్న పరువు కూడా పోతుందని మరి వెనక్కి తగ్గారో ఏమో?

విజయమ్మకు షాకిచ్చిన తెలంగాణవాదులు

      తెలంగాణాలో పర్యటిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మకు తెలంగాణావాదులు షాకిచ్చారు. ఈ నెల 25 నుంచి విజయమ్మ తెలంగాణాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె పర్యటనలో బాగంగా శుక్రవారం తెలంగాణ జిల్లాలకు వెళ్ళడానికి బయలుదేరారు. ఈ సమయంలో ఉప్పల్ బస్సు డిపో వద్ద తెలంగాణావాదులు ఆమె కాన్వాయి ని అడ్డుకొని తెలంగాణ నినాదాలు చేశారు. విజయమ్మ వ్యక్తిగత గత సిబ్బంది వాళ్ళను తప్పించేందుకు ప్రయత్నించగా, అక్కడ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో విజయమ్మ భద్రతా సిబ్బందికి స్వల్పంగా గాయాలు అయ్యాయి.